కట్టలు తెగిన నిర్లక్ష్యం
బల్లికురవ: సాగర్ కాలువల ఆధునికీకరణపై చంద్రబాబు ప్రభుత్వం దృష్టి సారించకపోవడంతో రైతులతోపాటు కెనాల్ పరివాహక ప్రాంత ప్రజలకు సంకటంగా మారింది. బల్లికురవ మండల పరిధిలో అద్దంకి బ్రాంచ్ కెనాల్(ఏబీసీ) కోతకు గురైనా ఎన్‌ఎస్పీ అధికారులు స్పందించకపోవడంపై రైతులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. గుంటుపల్లి మేజర్ నుంచి వల్లాపల్లి లాకుల వరకు ఉన్న పెద్ద కాలువకు రెండేళ్లుగా మరమ్మతులు చేపట్టలేదు. ఈ కాలువ కట్టలు బలహీనంగా ఉండటం.. అదే సమయంలో రోజూ 1300 క్యూసెక్కులకు తగ్గకుండా నీరు ప్రవాహిస్తుండటంతో, కెనాల్ బండ్ కోతకు గురవుతోంది. కాలువలో నీరు కట్టల మీదుగా ప్రవహిస్తుండటంతో మట్టి కొట్టుకుపోయి ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ఆందోళన చెందిన ఆయకట్టు రైతులు ఎన్‌ఎస్పీ అధికారులకు సమస్యను వివరించారు. కానీ మూడు నెలలుగా అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదు. ప్రస్తుతం కట్టలు పూర్తిగా కోసుకుపోయి, తెగే స్థితికి చేరుకున్నాయి. ఒకటీ లేదా రెండు రోజుల్లో కాలువ కట్టలు తెగి నీరంతా గ్రామాలు, పొలాల్లోకి చేరుతుందని ప్రజలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికై నా అఽధికారులు స్పందించి కట్టలకు మరమ్మతులు చేయడంతోపాటు నీటి ప్రవాహాన్ని కొంత మేర తగ్గించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
గుంటుపల్లి–వల్లాపల్లి మధ్య కోతకు గురైన ఏబీసీ కెనాల్
మూడు నెలలుగా పట్టించుకోని ఎన్‌ఎస్‌పీ అధికారులు
నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో కట్ట తెగే ప్రమాదం


