నిష్ట దీక్ష.. ఖుదా రక్ష
కంభం/కనిగిరిరూరల్ :
ఇస్లాం.. మానవాళిని సన్మార్గంలో నడిపేందుకు ఉద్భవించిన ధర్మం. పవిత్ర రంజాన్ మాసం ఆ ధర్మాన్ని నడిపించేందుకు బాటలు వేస్తోంది. ఇస్లాంను అనుసరించేవారు నియమ నిష్టలతో ఉపవాస దీక్షలు ఉండటం రంజాన్ ప్రత్యేకత. ఆధ్యాత్మికత, సేవాభావం, దయాగుణం పెంపొందించడమే ఉపవాస దీక్ష అంతరార్థం. హిజ్రీ క్యాలెండర్ ప్రకారం ఇస్లామిక్ 12 నెలల్లో తొమ్మిదో నెల పేరు రంజాన్. ఏడాదిలో 11 నెలలు సొంతానికి గడిపినా రంజాన్ నెలలో మాత్రం దైవచింతనలో నిమగ్నమవ్వాలనేది మహ్మద్ ప్రవక్త ఉవాచ. పవిత్ర ఖురాన్ ఉద్భవించిన రంజాన్ మాసంలో నిష్టగా ఉపవాస దీక్ష ఆచరిస్తే తెలిసీ తెలియక చేసిన పాపాలు దహించుకుపోతాయని ముస్లింల ప్రగాఢ విశ్వాసం. బుధవారం నెలవంక దర్శనమివ్వడంతో గురువారం నుంచి ఉపవాస దీక్ష ఆచరించేందుకు ముస్లింలు సిద్ధమయ్యారు. రంజాన్ నెల ప్రారంభ సూచికగా కొన్ని ప్రాంతాల్లో సైరన్ మోగించారు. బుధవారం రాత్రి 9 గంటలకు మసీదుల్లో తరావీహ్ నమాజ్ చేశారు. ముస్లింలు ఒకరినొకరు శ్రీచాంద్ ముబారక్‌శ్రీ అంటూ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.
ఉపవాసం.. ఆరోగ్య వికాసం
రంజాన్ మాసంలో ఉపవాసం ఉండేవారు రోజూ సూర్యోదయానికి ముందు నుంచి సూర్యాస్తమయం వరకు అన్నపానీయాలు తీసుకోకుండా, లాలాజలం సైతం మింగకుండా కఠోర దీక్ష ఆచరించాల్సి ఉంటుంది. తద్వారా దైవభీతి పెరుతుగుంది. సహనం అలవడుతుంది. చెడు వ్యసనాలకు దూరమై, చేసిన పాపాల నుంచి విముక్తి కలుగుతుందనేది ముస్లింల నమ్మకం. అంతే కాదు జీర్ణకోశ వ్యవస్థ ప్రక్షాళన జరిగి వ్యాధులు దరిచేరవనేది ఉపవాసం వెనకున్న బహిరంగ రహస్యం. శ్ఙ్రీనిష్టతో దీక్ష ఆచరిస్తే పేదల ఆకలిదప్పుల బాధలు తెలిసి వస్తాయి. రంజాన్ ఉపవాసాలు ధర్మనిష్టతో పాటిస్తే పాపాలు క్షమించబడుతాయి. ఉపవాసంలో ఉండి దువా చేస్తే కోరికలు ఫలిస్తాయిశ్రీశ్రీ అనేది ప్రవక్త బోధనల సారాంశం.
తరావీహ్ నమాజ్ ప్రత్యేకత
ఇస్లాం మత గ్రంథం ఖురాన్ రంజాన్ నెలలోనే ఉద్భవించింది. ఇస్లాం లక్ష్యం, పాటించాల్సిన విధానాలు, అల్లాహ్ సందేశాన్ని పొందుపరిచిన ఖురాన్‌ను రంజాన్ మాసంలో రోజుకు ఐదుసార్లు పఠించాలని మత పెద్దలు పేర్కొంటున్నారు. ఈ మాసంలో తరావీహ్ నమాజ్‌కు ఎంతో ప్రత్యేకత ఉంది. దివ్య ఖురాన్ పఠించడానికి, వినడానికి తరవీహ్ నమాజ్ దోహదపడుతుంది.
షబ్ ఏ ఖద్ర్
రంజాన్ మాసంలో షబ్ ఏ ఖద్ర్ రోజున దివ్య ఖురాన్ అవతరించింది. రంజాన్ నెల చివరి పది రోజుల్లో 21, 23, 25, 27, 29వ బేసి రాత్రుల్లో ఏదో ఒక రాత్రి షబ్ ఏ ఖద్ర్ ఆచరించాల్సి ఉంటుంది.
ఫిత్ర్, జకాత్‌తో దానగుణం
పేదలకు అండగా నిలవాలని చెప్పడమే ఫిత్ర్, జకాత్ ఉద్దేశం. సంపద కలిగిన ముస్లింలు పేదలకు రంజాన్ నెలలో దానధర్మాలు చేయాలని సూచిస్తోంది ఖురాన్. ఆరోగ్యరక్షణ పేరిట కొంత నగదును దానం చేయడాన్ని ఫిత్ర్‌గా, అలాగే తాము సంపాదించిన దానిలో కొంత భాగాన్ని దానం చేయడాన్ని జకాత్ అని పిలుస్తారు. తద్వారా నిరుపేద ముస్లింలు కూడా పండగ నిర్వహించుకోగలరనేది ఖురాన్ బోధనలు స్పష్టం చేస్తున్నాయి. రంజాన్ నెలలో చివరి రోజున ఈద్ ఉల్ ఫిత్ర్ పండగ నిర్వహిస్తారు. మసీదులు, ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, పేదలకు దానధర్మాలు చేయడంతో రంజాన్ మాసం ముగుస్తుంది.
నోరూరించే హలీం సిద్ధం
రంజాన్ అంటే అందరికీ ఠక్కున గుర్తొచ్చేది హలీం. పోషక విలువలతో కూడిన ఆహారమైన హలీంను రోజూ ఇఫ్తార్ అనంతరం తినేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో హలీం విక్రయాల కోసం వ్యాపారులు ఏర్పాట్లు చేశారు.
రంజాన్ నెల మొత్తం మసీదులు ఉపవాస దీక్షదారులతో కిటకిటలాడుతుంటాయి. గురువారం నుంచి రంజాన్ మాసం ఆరంభమవుతున్న నేపథ్యంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని సుమారు 290 మసీదులు ప్రార్థనలకు ముస్తాబయ్యాయి. ఉమ్మడి ప్రకాశంలో అత్యధికంగా ముస్లింలు ఒంగోలు, కనిగిరి, కందుకూరు, పొదిలి, మార్కాపురం, కంభం, గిద్దలూరు, పర్చూరు తదితర ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లోని మసీదులకు ఇప్పటికే రంగులు వేసి, విద్యుత్ దీపాలతో అలంకరించారు. శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫ్లెక్సీలు సైతం ఏర్పాటు చేశారు. ఉపవాసం ఆచరించే వారి కోసం పలు మసీదుల్లో 30 రోజులపాటు సహర్‌కు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
కంభం పట్టణంలోని పురాతన షాహీ మసీద్
వరాల వసంతం రంజాన్ మాసం
నెల వంక దర్శనం.. నేటి నుంచి ఉపవాస దీక్షలు ఆరంభం
మసీదుల్లో సహరీకి ప్రత్యేక ఏర్పాట్లు


