గత ప్రభుత్వంలో మరణాలే లేవని అధికారికంగా ప్రకటించిన వైద్యశాఖ
2024లో ఇద్దరు, 2025లో ఐదుగురు డెంగీతో మృతి
డెంగీ మరణాల్లో దేశంలో నాలుగోస్థానం మనదే
సాక్షి కథనంపై వైద్యశాఖ వివరణ
సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ పాలనలో రాష్ట్రంలో ఒక్క డెంగీ మరణం కూడా లేదు. చంద్రబాబు పాలనలోనే రాష్ట్రంలో అమాయకులు డెంగీకి బలయ్యారని వైద్య, ఆరోగ్యశాఖ అంగీకరించింది. గత ప్రభుత్వంలో 2021 నుంచి 2023 మధ్య రాష్ట్రంలో ఒక్క డెంగీ మరణం కూడా లేదని గురువారం అధికారికంగా ప్రకటించింది. 2024లో ఇద్దరు, 2025లో ఐదుగురు చొప్పున రెండేళ్లలో ఏడుగురు డెంగీతో మరణించారని తెలిపింది. ‘డెంగీ మరణాల్లో ఏపీకి 4వ స్థానం’ శీర్షికతో సాక్షిలో గురువారం కథనం ప్రచురితమైంది. 2024, 2025ల్లో దేశంలో డెంగీ వ్యాప్తి, నమోదైన మరణాలపై ఇటీవల పార్లమెంట్‌లో కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటన చేసింది. అందులో పేర్కొన్న మేరకే రాష్ట్రం నాలుగోస్థానంలో ఉందని సాక్షి పేర్కొంది.
దీనికి గురువారం రాష్ట్ర వైద్యశాఖ ఇచ్చిన వివరణలో 2021 నుంచి దేశంలో డెంగీ వ్యాప్తి, మరణాల నివేదికను వెల్లడించింది. దీనిని గమనిస్తే 2021, 2022, 2023 సంవత్సరాల్లో ఒక్క డెంగీ మరణం కూడా నమోదు కాలేదు. ఇదే సందర్భంలో దేశవ్యాప్తంగా 2021లో 346 మంది, 2022లో 303 మంది, 2023లో 485 మంది డెంగీతో మరణించారు.
రాష్ట్రంలో డెంగీ బాధితులకు మెరుగైన వైద్యసాయం అందించడం ద్వారా ప్రజల ప్రాణాలు పోకుండా వైఎస్ జగన్ ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంది. మరోవైపు దేశంలో 2024లో 297, గతేడాది 95 మరణాలు నమోదయ్యాయి. కాగా.. 2025లో దేశం మొత్తం మరణాలు భారీగా తగ్గాయి. కానీ దేశంలో నమోదైన మరణాల్లో 5 శాతానికి పైగా మన రాష్ట్రంలోనే ఉన్నాయి. దీన్నిబట్టి పరిశీలిస్తే ప్రజారోగ్య పరిరక్షణలో బాబు ప్రభుత్వం ఏ మేరకు విఫలమైందో తెలుస్తోంది.


