పూరి యాత్రలో బ్యాగులు పోగొట్టుకున్న నగరి కుటుంబం
మాజీ మంత్రి ఆర్‌కే రోజా సాయంతో తిరుగు ప్రయాణం
చిత్తూరు జిల్లా: నగరి పట్టణానికి చెందిన ఓ కుటుంబం పూరియాత్రలో భాగంగా జగన్నాథ దేవాలయం దర్శనానికి వెళ్లిన సమయంలో తమ బ్యాగులు పొగొట్టుకున్నారు. ఫోన్లు, డబ్బు లు అన్నీ బ్యాగులోనే ఉండడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది. తీవ్ర ఆవేదనకు గురై కన్నీటిపర్యంతమయ్యారు. అయితే ఆ సమయంలో అక్కడికి వచ్చిన తెలుగు తెలిసిన ఓ మీడియా మిత్రుడు వారిని గుర్తించి మాట్లాడారు., తమ దుర్దశను వివరించారు. నగరి ప్రాంతానికి చెందిన వారని తెలియడంతో తమ ప్రతినిధుల ద్వారా ఈ విషయాన్ని మాజీ మంత్రి ఆర్‌కే రోజా దృష్టికి తీసుకెళ్లారు.
విషయాన్ని తెలుసుకున్న ఆమె వెంటనే స్పందించి, పూరిలో చిక్కుకున్న ఆరుగురు సభ్యులున్న ఆ కుటుంబాన్ని సురక్షితంగా నగరికి చేరుకునేందుకు అవసరమైన ప్రయాణ ఖర్చులను సమకూర్చారు. అంతేకాకుండా, వారు తిరిగి స్వగ్రామానికి చేరుకునే వరకు భోజన ఖర్చులకు కూడా అదనపు డబ్బు లు అందించి ఆదుకున్నారు.
అనుకోని ఇబ్బంది లో చిక్కుకున్న తమకు అండగా నిలిచిన రోజాకు ఆ కుటుంబ సభ్యులు హృదయపూర్వక కతజ్ఞతలు తెలిపారు. ‘అమ్మలా ఆదుకుంది.. మేము పూర్తిగా నిస్సహాయులమయ్యాం. ఆమె సాయం లేకపోతే ఏమయ్యేదో తెలియదు’ అంటూ భావోద్వేగ్యాన్ని వ్యక్తం చేశారు. కష్టకాలంలో నగరికి చెందిన వారికి ఆమె చేసిన సాయం పట్ల ప్రజలు అభినందనలు తెలిపారు.


