
నిద్ర అనే మాటే ఒక మత్తు, మహత్తు. అలసిన శరీరానికి హాయి... నిద్ర. గడిచిన దినానికి తీపి వీడ్కోలు... నిద్ర. నిద్ర పోవడం అనే దశ నుంచే శిశువు జీవితం ఆరంభమవుతుంది. రోజులో పదహారు గంటలు నిద్రపోతూనే దినదిన ప్రవర్ధమానమవుతాడు. ఏ పాటా రాని తల్లి కూడా పసివాడిని నిద్రపుచ్చడానికి ‘ఉళుళుళు హాయి’ అని లాలి రాగం తీస్తుంది. ఆ లెక్కన ప్రతి తల్లీ ఒక గాయనే అనుకోవాలి. నిద్ర అనేది మనిషికి ప్రకృతి ప్రసాదించిన చవకైన విలాసం.
నిద్ర అనేది నిజమైన సమవర్తి కూడా! ఏ మనిషైనా తన దగ్గర అన్ని కిరీటాలనూ పక్కన పెట్టాల్సిందే. కేవలం శ్వాసించే మాంసపు బంతులుగా ఆడాల్సిందే. ‘‘ఈ నీడల నాటకరంగం మీద జీవితపు మెరకపల్లాల్లోంచి వచ్చిన వాళ్లందరూ ఒకే హోదాతో నిలబడతారు. ఇక్కడ విభేదాలు లేవు. ఈ కౌగిలి అందరికీ ఒకేరకపు శాంతినిస్తుంది. ఇక్కడ యాచన లేదు. లేదనటం లేదు. అవమానం లేదు.
ఈ వాకిలి దగ్గరకు వచ్చినవాడెవ్వడూ ఉత్త చేతులతో తిరిగి వెళ్లడు’’ అంటాడు కథక కవి ఆలూరి బైరాగి. నిద్ర అనేది దివ్యలోకాలకు తలుపులు తెరిచే సాధనం. ఏ మనిషికా మనిషి సమాంతర ప్రత్యేక లోకాలను ఆవిష్కరించుకోగలిగే తరుణోపాయం. కలల రెక్కల మీద ప్రతి జీవీ అక్కడ ఎల్లలు లేకుండా తిరుగుతాడు. తెల్లారేసరికి ఏమీ ఎరగనట్టే మామూలుగా ఉండిపోతాడు.
మనిషికి ఉన్నవి రెండే స్థితులు: పగలు పని, రాత్రి నిద్ర. అవి తారుమారవ్వడం ఆధునిక పరిణామం. ఆకలి రుచెరగదు, నిద్ర సుఖమెరగదంటారు. నిద్రలోంచి లేవడమంటే దాదాపు చచ్చి మళ్లీ బతికినట్టే! అందుకే కొందరు నిద్ర లేవగానే కృతజ్ఞతగా దేవుడికి దండం పెట్టుకుంటారు. కానీ అదంతా కాయకష్టం చేసిన రోజుల్లో! ఇప్పుడు మనిషి స్థానాన్ని యంత్రం ఆక్రమించాక, నడుం వంచడం అనేదే పెద్ద పనైపోయింది.
లక్షల ఏళ్ల మనిషి నాగరికతా ప్రస్థానంలో 10,000 ఏళ్ల నుంచే మనుషులు నగరాల్లో జీవించడం మొదలుపెట్టారు. పంతొమ్మిదో శతాబ్దం చివరలోనే కరెంట్ మనిషి జీవితంలోకి వచ్చింది. 1970ల తర్వాతే కంప్యూటర్లు ఇళ్లల్లోకి ప్రవేశించాయి. వీటన్నింటికీ మనిషి మెదడు సర్దుకుపోతూ వచ్చింది.
ఈ క్రమంలో చరిత్ర పూర్వ మనుషులు ఎలా నిద్దరోయారు అనేది ఒక ఆసక్తి. చెట్టు కొమ్మలనే పాన్పులుగా చేసుకుని అదే చెట్ల మీద పడుకోవడమూ ఉండేది. ఎటో జారిపోతున్న భావన కలిగి ఉన్నట్టుండి మనం ఇప్పుడు నిద్రలోంచి మేల్కొనడం అనేది మన పూర్వీకుల చెట్ల నిద్ర తాలూకు అవశేషం మన రక్తంలోకి ఇంకిపోవడం వల్ల జరుగుతున్నదని నిద్రా నిపుణులు చెబుతుంటారు.
అలా జారిపోతున్న సంవేదన ఆ ఆదిమ మానవులకు ఒక రక్షాకవచంలా పనిచేసి, క్రూర మృగాల పట్ల అప్రమత్తతతో ఉంచింది. అయితే, రెండు లక్షల ఏళ్ల క్రితమే మనుషులకు ‘మంచం’ లాంటిది ఏర్పాటు చేసుకోవడం తెలుసు అంటారు ‘హౌ టు స్లీప్ లైక్ ఎ కేవ్‌మ్యాన్: ఏన్షియెంట్ విజ్‌డమ్ ఫర్ ఎ బెటర్ నైట్స్ రెస్ట్’ రచయిత డాక్టర్ మెరిజిన్ వాన్ డెలార్.
పట్టు పాన్పు, మబ్బు దుప్పట్లు లేకపోయినా, మట్టిని బల్లపరుపుగా చేసుకొని, దాన్ని మరిన్ని పొరలుగా ఉబ్బుగా దిద్దుకుని, దాన్ని కొమ్మలు, గడ్డి, ఆకులతో మెత్తబరుచుకొని పడుకునేవాళ్లు. పురుగూ పుట్రను తరిమికొట్టే మొక్కలను అక్కడ ఉంచేవాళ్లు. పక్కనే క్యాంప్ ఫైర్ ఉండనే ఉంటుంది. అదే మంటతో ఆ మంచాన్ని నియమిత సమయాల్లో కాల్చుతుండేవాళ్లు.
దానివల్ల కూడా పురుగూ పుట్రా ఆ దరికి చేరకుండా ఉండేవి. అవే మంచాలను బహుముఖంగా పని ప్రదేశాలుగానూ, పని ముట్లను సాఫుచేసుకోవడానికీ వాడుకునేవాళ్లు. అందుకే చరిత్ర పూర్వ మనుషులనగానే అనాగరికమైన ఊహ రావడాన్ని వ్యతిరేకిస్తారు వాన్ డె లార్.
నిద్ర, తిండి విషయంలో వాళ్లు అత్యంత వివేకంతో వ్యవహరించారన్నది నెదర్లాండ్స్‌కు చెందిన ఈ ‘స్లీప్ సైంటిస్ట్’ వాదన. వ్యాయామం ఉండటం, తిండిలో చక్కెర లేకపోవడం అనే రెండు కారణాల వల్ల వాళ్లకు ఇట్టే నిద్రపట్టేది. ఆ రెండూ రివర్సు కావడం వల్ల ఇప్పుడు నిద్ర కరవవుతోంది. వీటినే సూచనలుగా స్వీకరిస్తే మనం కోల్పోతున్న నిద్రను మళ్లీ పొందొచ్చేమో!