breaking news
Guest Column
-
ఆరోగ్యకరమైన నేలే మనిషి ఆరోగ్యానికి మూలం
నీరు, గాలి, వాతావరణ నాణ్యత క్షీణించడానికి నిస్సారమైన మట్టి దారితీస్తుంది. నేల ఆరోగ్యం క్షీణించడం వల్ల మొక్కలు, జంతు వులు, మానవుల ఆరోగ్యం దెబ్బతింటుంది. నేల స్వయంగా ఒక జీవ వ్యవస్థ. అలాగే ఇతర జీవరాశులకు ఆధారభూతమైనది కూడా. నేల, మొక్కలు, జంతువులు, మానవులు, పర్యావరణ వ్యవస్థ, భూగ్రహం ఆరోగ్యం ఒకదానితో ఒకటి ముడివడి విడదీయలేని ‘ఏకైక ఆరోగ్యం’ (వన్ హెల్త్)గా ఉంటాయి.‘ఆరోగ్యమైన నేల– ఆరోగ్యమైన మొక్క– ఆరోగ్యమైన జంతువు– ఆరోగ్యమైన మనిషి’ అనే భావనే వన్ హెల్త్. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం మనుషులు, జంతువులు, మొక్కలు, పర్యా వరణం పరస్పరం అనుసంధానమై ఉంటాయి. ఈ నాలుగు ఆరో గ్యంగా ఉంటేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. ఈ ‘ఏకైక ఆరోగ్యం’ భావనను, భారతదేశంలో జరిగిన జీ–20 సమావేశాలలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఒక టీ స్పూన్ ఆరోగ్యకరమైన నేలలో కోట్ల నుండి వందల కోట్ల వరకు సూక్ష్మజీవులు ఉంటాయి.వీటిలో బ్యాక్టీరియా, శిలీంధ్రాలు (ఫంగి), యాక్టినోమైసెట్స్, ప్రోటో జోవా, నులిపురుగులు (నీమటోడ్లు), వానపాములు వంటి జీవులు ప్రధానమైనవి. ఈ సూక్ష్మజీవులు, నేల జీవులు కలిసి సేంద్రియ పదార్థాలను కుళ్లించి మొక్కలకు అవసరమైన పోషకాలను అందుబాటులోకి తెస్తాయి. నేలలో ఉండే ఖనిజాలు (జింక్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, సల్ఫర్ వంటివి) మొక్కల వేర్ల ద్వారా గ్రహించబడి ధాన్యాలు, కూర గాయలు, పండ్లు ఇతర ఆహార పంటలలో నిల్వ అవుతాయి. ఈ పంటలను మనం ఆహారంగా తీసుకోవడం ద్వారా ఆ ఖనిజాలు, పోషకాలు మన శరీరానికి అందుతాయి. ‘నేలలో పోష కాలు సమృద్ధిగా ఉంటేనే ఆహారం పోషకవంతంగా ఉంటుంది; ఆహారం పోషకవంతంగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు.’నేల ఆరోగ్యాన్ని కాపాడే పద్ధతులుసేంద్రియ పదార్థాల వినియోగం నేల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. పశువుల ఎరువు, కంపోస్ట్, వర్మీకంపోస్ట్, గ్రీన్ మెన్యూర్, బయోచార్ వంటి సేంద్రియ పదార్థాలు నేలలో సేంద్రియ కార్బన్‌ను పెంచి, నేల సారాన్ని మెరుగుపరుస్తాయి. ఇవి నేలలో ఉపయోగకరమైన సూక్ష్మజీవుల వృద్ధిని ప్రోత్సహించి, మొక్కలకు అవసరమైన పోషకాలను క్రమంగా అందుబాటులోకి తీసుకు వస్తాయి. పంటల మార్పిడి మరో పద్ధతి. ఒకే భూమిలో ఒకే పంటను వరుసగా సాగు చేయకుండా, వివిధ రకాల పంటలను క్రమపద్ధతిలో సాగు చేయాలి. పప్పు ధాన్యాలైన శనగ, పెసర, మినుము, కంది, అలసంద వంటివాటి వేర్లపై ఉండే రైజోబియం అనే ఉపయోగకరమైన సూక్ష్మజీవులు గాలిలోని నత్రజనిని గ్రహించి, మొక్కలు ఉపయోగించుకునే రూపంలో నేలలో స్థిరీకరిస్తాయి. మరీ ముఖ్యంగా పంట అవశే షాలను కాల్చకూడదు. కాల్చడం వల్ల నేలలోని సేంద్రియ కార్బన్, ఉపయోగకరమైన సూక్ష్మజీవులు పోష కాలు నష్టపోతాయి. పంట అవశేషాలను మల్చింగ్ చేయడం ద్వారా నేలలో తేమ ఎక్కువ కాలం నిల్వ ఉండి, కలుపు మొక్కల పెరుగు దల తగ్గుతుంది. అవసరానికి మించి తరచుగా దుక్కి దున్నడం వల్ల నేల సహజ నిర్మాణం దెబ్బతింటుంది. నేలలో నిల్వ ఉన్న సేంద్రియ కార్బన్ వేగంగా విచ్ఛిన్నమైపోతుంది. అతి దుక్కిని నివారించాలి.‘ఏకైక ఆరోగ్యం’ భావన విజయవంతం కావడంలో రైతు పాత్ర కీలకం. రైతు అనుసరించే వ్యవసాయ పద్ధతులే నేల, మొక్కలు, పశువులు, పర్యావరణం, చివరకు మానవ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. నేల ఆరోగ్యాన్ని కాపాడటం అనేది రైతు పొలం దిగుబడికే కాదు, సమాజ ఆరోగ్యానికి, ఆహార భద్రతకు భవిష్యత్ తరాలకు చేసే గొప్ప పెట్టుబడి.– డా. కె. తేజస్వరరావు, డా, ఎం.ఎం.వి. శ్రీనివాసరావు, డా. బి. సహదేవ రెడ్డి, సీనియర్ వ్యవసాయ శాస్త్రవేత్తలు -
పాండురాజుకు ఆ శాపం ఎందుకు వచ్చింది?
పాండురాజుకు మృగవధ వలన శాపం తగిలింది. ‘ఎవరికీ అపకారం చేయక, ప్రకృతి సహజమైన సుఖాన్ని పొందుతున్న సమయంలో, విచక్షణా రహితంగా మమ్ములను బాణహతికి గురిచేసావు. కాబట్టి నీవు కూడా నీ చివరి క్షణాలలో మావంటి బాధనే అనుభవించి మరణిస్తావు!’ అని శపించింది ఆ మృగమిథునం.మృగమిథునం పాండురాజుకు ఇచ్చిన ఈ శాపంతో మహాభారత కథ రెండవ అతిపెద్ద మలుపు తిరిగింది. శంతనుడి రెండవ భార్య అయిన సత్యవతికి పుట్టిన ఇద్దరు కొడుకులు– చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు– పుత్రహీనులుగా మరణించగా, వారి భార్యలైన అంబిక, అంబాలికలకు, దేవరన్యాయం పద్ధతిన వ్యాసమహర్షి వలన ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు సంతానంగా కలగడం అన్నది మహాభారత కథలోఅంతకు ముందు చోటుచేసుకున్న మొదటి ముఖ్యమైన మలుపు.అయితే ఆ ముగ్గరిలో రాజు కాగలిగి, రాజ్యాధికారం చేపట్టగలిగిన లక్షణాలున్న పాండురాజుకు, మృగమిథున శాపం తగిలి, తన భార్యలైన కుంతి, మాద్రిల ద్వారా తన సంతానాన్ని నేరుగా కురువంశానికి అందించలేకపోవడం అన్న విచిత్ర స్థితి దాపురించి, తన అంశతో సంతానాన్ని ఇవ్వగలగడం అన్నది విధివశాన లేకుండాపోయింది.క. ఎట్టి విశిష్ట కులంబునబుట్టియు, సదసద్వివేకములు గల్గియు, మున్గట్టిన కర్మఫలంబులునెట్టన భోగింపకుండ నేర్తురె మనుజుల్?‘పూర్వం చేసిన దుష్కర్మల ఫలం వెంటాడుతుంది. ఎంతటి విద్యావంతుడైనప్పటికీ, వివేకవంతుడైనప్పటికీ, అతడిని కొన్ని క్షణాలు విచక్షణను పోగొట్టుకునేలా చేసి, పాపకార్యం మళ్ళీ చేసేలా అది చేస్తుంది. అలా సంక్రమించిన పాపకార్య ఫలం ఒక జన్మలో కాకుంటే, ఆ తరువాత మరొక జన్మలో భోగింపక– అనగా అనుభవించకుండా తప్పించుకోవడం ఎంతటి వానికైనా సాధ్యంకాదు’ అని పై సందర్భానికి అనుగుణంగా నన్నయ భట్టారకుడు ఆంధ్ర మహాభారతం, ఆదిపర్వంలో సర్వకాలీనమైన ఆధ్యాత్మిక సత్యాన్ని సూక్తీకరించి చెప్పాడు.– భట్టు వెంకటరావు -
ఆరోగ్యకరమైన నేలే మనిషి ఆరోగ్యానికి మూలం
నీరు, గాలి, వాతావరణ నాణ్యత క్షీణించడానికి నిస్సారమైన మట్టి దారితీస్తుంది. నేల ఆరోగ్యం క్షీణించడం వల్ల మొక్కలు, జంతు వులు, మానవుల ఆరోగ్యం దెబ్బతింటుంది. నేల స్వయంగా ఒక జీవ వ్యవస్థ. అలాగే ఇతర జీవరాశులకు ఆధారభూతమైనది కూడా. నేల, మొక్కలు, జంతువులు, మానవులు, పర్యావరణ వ్యవస్థ, భూగ్రహం ఆరోగ్యం ఒకదానితో ఒకటి ముడివడి విడదీయలేని ‘ఏకైక ఆరోగ్యం’ (వన్ హెల్త్)గా ఉంటాయి.‘ఆరోగ్యమైన నేల– ఆరోగ్యమైన మొక్క– ఆరోగ్యమైనజంతువు– ఆరోగ్యమైన మనిషి’ అనే భావనే వన్ హెల్త్. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం మనుషులు, జంతువులు, మొక్కలు, పర్యా వరణం పరస్పరం అనుసంధానమై ఉంటాయి. ఈ నాలుగు ఆరో గ్యంగా ఉంటేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. ఈ ‘ఏకైక ఆరోగ్యం’ భావనను, భారతదేశంలో జరిగిన జీ–20 సమావేశాలలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఒక టీ స్పూన్ ఆరోగ్యకరమైన నేలలో కోట్ల నుండి వందల కోట్ల వరకు సూక్ష్మజీవులు ఉంటాయి. వీటిలో బ్యాక్టీరియా, శిలీంధ్రాలు (ఫంగి), యాక్టినోమైసెట్స్, ప్రోటో జోవా, నులిపురుగులు (నీమటోడ్లు), వానపాములు వంటి జీవులు ప్రధానమైనవి. ఈ సూక్ష్మజీవులు, నేల జీవులు కలిసి సేంద్రియ పదార్థాలను కుళ్లించి మొక్కలకు అవసరమైన పోషకాలను అందుబాటులోకి తెస్తాయి. నేలలో ఉండే ఖనిజాలు (జింక్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, సల్ఫర్ వంటివి) మొక్కల వేర్ల ద్వారా గ్రహించబడి ధాన్యాలు, కూర గాయలు, పండ్లు ఇతర ఆహార పంటలలో నిల్వ అవుతాయి. ఈ పంటలను మనం ఆహారంగా తీసుకోవడం ద్వారా ఆ ఖనిజాలు, పోషకాలు మన శరీరానికి అందుతాయి. ‘నేలలో పోష కాలు సమృద్ధిగా ఉంటేనే ఆహారం పోషకవంతంగా ఉంటుంది; ఆహారం పోషకవంతంగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు.’నేల ఆరోగ్యాన్ని కాపాడే పద్ధతులుసేంద్రియ పదార్థాల వినియోగం నేల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. పశువుల ఎరువు, కంపోస్ట్, వర్మీకంపోస్ట్, గ్రీన్ మెన్యూర్, బయోచార్ వంటి సేంద్రియ పదార్థాలు నేలలో సేంద్రియ కార్బన్‌ను పెంచి, నేల సారాన్ని మెరుగుపరుస్తాయి. ఇవి నేలలో ఉపయోగకరమైన సూక్ష్మజీవుల వృద్ధిని ప్రోత్సహించి, మొక్కలకు అవసరమైన పోషకాలను క్రమంగా అందుబాటులోకి తీసుకు వస్తాయి. పంటల మార్పిడి మరో పద్ధతి. ఒకే భూమిలో ఒకేపంటను వరుసగా సాగు చేయకుండా, వివిధ రకాల పంటలను క్రమపద్ధతిలో సాగు చేయాలి. పప్పు ధాన్యాలైన శనగ, పెసర, మినుము, కంది, అలసంద వంటివాటి వేర్లపై ఉండే రైజోబియం అనే ఉపయోగకరమైన సూక్ష్మజీవులు గాలిలోని నత్రజనిని గ్రహించి, మొక్కలు ఉపయోగించుకునే రూపంలో నేలలో స్థిరీకరిస్తాయి.మరీ ముఖ్యంగా పంట అవశే షాలను కాల్చకూడదు. కాల్చడం వల్ల నేలలోని సేంద్రియ కార్బన్, ఉపయోగకరమైన సూక్ష్మజీవులు పోష కాలు నష్టపోతాయి. పంట అవశేషాలను మల్చింగ్ చేయడం ద్వారా నేలలో తేమ ఎక్కువ కాలం నిల్వ ఉండి, కలుపు మొక్కల పెరుగు దల తగ్గుతుంది. అవసరానికి మించి తరచుగా దుక్కి దున్నడం వల్ల నేల సహజ నిర్మాణం దెబ్బతింటుంది. నేలలో నిల్వ ఉన్న సేంద్రియ కార్బన్ వేగంగా విచ్ఛిన్నమైపోతుంది. అతి దుక్కిని నివారించాలి. ‘ఏకైక ఆరోగ్యం’ భావన విజయవంతం కావడంలో రైతు పాత్ర కీలకం. రైతు అనుసరించే వ్యవసాయ పద్ధతులే నేల, మొక్కలు, పశువులు, పర్యావరణం, చివరకు మానవ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. నేల ఆరోగ్యాన్ని కాపాడటం అనేది రైతు పొలం దిగుబడికే కాదు, సమాజ ఆరోగ్యానికి, ఆహార భద్రతకు భవిష్యత్ తరాలకు చేసే గొప్ప పెట్టుబడి.– డా‘‘ కె. తేజస్వరరావు, డా‘‘ ఎం.ఎం.వి. శ్రీనివాసరావు, డా‘‘ బి. సహదేవ రెడ్డి ‘ సీనియర్ వ్యవసాయ శాస్త్రవేత్తలు -
డ్రాగన్–ఎలిఫెంట్ నృత్యం... వినోద క్రీడేనా?
డ్రాగన్ గాలిలోకి ఎగిరే భీకర జంతువే కాని వాస్తవంగా లేని మిథ్యామృగం. భూగోళంపై అతిపెద్ద బలమైన జంతువైన ఏనుగు మృదుస్వభావి. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాను డ్రాగన్‌గా, మన భారతీయ ప్రజాస్యామ్య దేశాన్ని ఏనుగుగా పోల్చడం సహజంగా మీడియా చేస్తుంటుంది. ‘టాంగో’ అనేది స్పానిష్ నృత్య సంబంధిత పదం. సెప్టెంబర్ 12, 13 తేదీల్లో, అధ్యక్ష స్థానంలో ఉన్న భారత్ ఆతిథ్యంలో న్యూఢిల్లీలో జరిగే రెండ్రోజుల బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ హాజరుకానుండటం ప్రాధాన్యతసంతరించుకుంది. చివరిదాకా ఆయన పర్యటనపై స్పష్టతనివ్వని చైనా ఎట్టకేలకు 67 మంది సభ్యుల ప్రాతినిధ్య బృందంతో రావడం ఇరుదేశాల సంబంధాల్లో సానుకూలతను సూచిస్తోంది.దగ్గరకు చేర్చిన అమెరికాకమ్యూనిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ నిర్దేశించిన సూచనలపై ఇటీవల చైనా 15వ పంచవర్ష ప్రణాళిక (2026–2030)కు శ్రీకారం చుట్టింది. ప్రపంచంలోని 150 దేశాలు, ప్రాంతాలతో వాణిజ్య భాగస్వామ్యం కలిగిన చైనా, ప్రపంచ ద్వితీయ భారీ ఆర్థిక వ్యవస్థగా అమెరికాకు సవాలు విసురుతోంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, భారత్ దిగుమతులపై ఆగస్ట్ 2025 నుంచి అదనంగా 25 శాతం ట్యారిఫ్ విధింపు ప్రభావం, భారత్ – చైనాల మధ్య వాణిజ్య సయోధ్యకు దారి తీసింది. 2025 ఆగస్ట్‌లో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యిఇండియా రాక సందర్భంలో అయిదు సంవత్సరాల క్రితం ఆగి పోయిన బోర్టర్ ట్రేడ్ ఇటీవలే మళ్ళీ ప్రారంభమైంది. భారత్, చైనా ఆర్థిక వాణిజ్య బాంధవ్యం రెండు దేశాల 280 కోట్ల జనావళి దృష్ట్యా పటిష్ట మవుతున్నాయి. భారత్–చైనా మధ్య సుదీర్ఘ కాలం నుంచి అత్యంత క్లిష్టమైన భౌగోళిక సరిహద్దు వివాదా లున్నప్పటికీ, వాటిని పక్కకు పెట్టి, వరస్పర ప్రయోజనాల దృష్ట్యా, ఆర్థిక వ్యవస్థను సుస్థిరం చేసుకొనే సత్కృషి ప్రారంభమైంది. 2017లో భారత్ అధికార యుతంగా షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ)లో చేరింది. 2024 నాటికి, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన అర్థిక సర్వేలోనూ, నీతి ఆయోగ్ నివేదికలోనూ చైనా పెట్టుబడులను దేశంలోకి ఆహ్వానించాలనే సానుకూల ప్రతిపాదన లున్నాయి. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ, మన విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్‌తో 2025 అగస్టు 18న జరిపిన న్యూఢిల్లీ సమావేశం కొత్త వాకిళ్ళు తెరిచింది. దానికి తోడు రెండు దేశాల మధ్య 2021 నాటి 125.6 బిలియన్ యూఎస్ డాలర్ల వాణిజ్యం, 2024 నాటికి 138.5కు పెరిగింది.షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీఓ) బిష్కెక్ శిఖరాగ్ర సమావేశం; యూఎస్, ఇజ్రాయిల్‌లు అంతర్జాతీయ చట్టం, యూఎన్ ఛార్టర్ ప్రాథమిక సూత్ర నియమావళిని ఉల్లంఘించే దుర్నీతిని దుయ్యపట్టడం భారత్, చైనాల సయోధ్యను మరింత బలపరిచాయి. ట్రంప్ శిక్షగా విధించే సుంకాలు, అస్థిర వైఖరి కారణంగా భారత్ యిప్పటికే చైనాతో చేతులు కలుపుతోంది.సంబంధాల్లో ముల్లుకానీ పాకిస్తాన్ పట్ల చైనా అనుకూల వైఖరి భారత్‌కు ఇబ్బంది కలిగించే అంశంగా మారుతోంది. ఉగ్ర, వేర్పాటు, తీవ్రవాదాలుసృష్టిస్తున్న యుద్ధ ప్రజ్వలనంలో భాగస్వామ్యమైన పాకిస్తాన్‌ను చైనా వెనకేసుకు రావటం, పైగా పాకిస్తాన్ ఛైర్‌గా రానున్న ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశానికి వేదిక కావటం, భారత్‌కు మింగుడుపడని సమస్య అవుతోంది. దానికి తోడు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా స్టేట్ కౌన్సిల్‌కు చెందిన సెంట్రల్ కమిటీ, ‘యూనియన్ టెర్రిటరీ ఆఫ్ లదాఖ్’లో వున్న నిర్దిష్ట జిల్లాలను హియాన్, హికాంగ్ పేర్లతో రెండు కొత్త కౌంటీలుగా ప్రకటించడానికి అనుమతించింది. అదీగాక టిబెట్‌లో పుట్టిన బ్రహ్మపుత్ర నదిని అక్కడ యార్లుంగ్ సాంగ్పో అంటారు. అరుణాచలప్రదేశ్‌లోని మనదేశ సరిహద్దుల సమీపంలో మిడాన్ ప్రాంతంలో కొండవాగు కనుమలలో చైనా నిర్మించనున్న సూపర్ జలవిద్యుత్ కేంద్రం వల్ల ప్రవాహం దిగువలో ఉన్న ఇండియా, బంగ్లాదేశ్‌లకు బ్రహ్మపుత్ర నదీ జలాల వినియోగానికి అవరోధమని భారత్ హెచ్చరిస్తున్నా చైనా పట్టించు కోవడం లేదు. 70 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధించే లక్ష్యంగా ఈ ‘ప్రాజెక్ట్ ఆఫ్ ద సెంచరీ’ని చైనా ప్రభుత్వం ప్రస్తుత 2026 నుంచి ప్రారంభించనున్న 15వ పంచవర్ష ప్రణాళికలో చేర్చింది. గతేడాది జూలైలో ఈ భారీ విద్యుత్ పునరుత్పాదన కేంద్రాన్ని ప్రాధాన్యతా పరంగా కమ్యూ నిస్ట్ చైనా రెండవ అగ్రశ్రేణి నేత, ప్రధాని లిక్వియంగ్ టిబెట్‌లోని నియింగ్చి వద్ద ప్రారంభించారు. 1.2 ట్రిలియన్ యువాన్లతో (సుమారు రూ. 14 లక్షల కోట్లు) అయిదు పవర్ స్టేషన్ల నిర్మాణం జరగనుంది. జంగ్ము వద్ద చైనా ఇప్పటికే భారీ జలాశయం నిర్మించింది. ఇండియా–చైనాల మధ్య ట్రాన్స్ బోర్టర్ నదీ జలాలపై నిపుణుల స్థాయి సమావేశం జరగవలసి ఉంది.పర్యావరణ విధ్వంసం కారణంగా హిమాలయాల మహోన్నత శిఖరాల నుంచి ప్రకృతి ప్రళయాలు అనుభవిస్తూనే ఉన్నాం. జల విద్యుత్ ఉత్పాదన కోసం నిర్మిస్తున్న జలాశయాలు ప్రవాహ అవరో ధాలకు కారణం అవుతున్నాయి. ప్రకృతి కన్నెర్ర చేస్తున్నా, నేపాల్ చైనా సరిహద్దులలో ఈ మానవ విధ్వంసం ఆగేటట్టు లేదు. ప్రపంచ అగ్రరాజ్యాలలో ప్రప్రథమ స్థానాన్ని పొందాలనే కమ్యూనిస్ట్ చైనా డ్రాగన్ విజృంభిస్తోంది. ప్రస్తుతం ట్రంప్, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తలక్రిందులు చేస్తున్న ఈ తరుణంలో ‘డ్రాగన్ – ఎలిఫెంట్టాంగో’... వినోదం అవుతుందా? రణక్రీడ కానుందా?-వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్-జయసూర్య -
ట్రాన్స్‌జెండర్స్ సమాజంలో భాగమే!
ఇటీవలి కాలంలో గృహప్రవేశాలు, తదితర శుభ కార్యాల సమయంలో కొందరు ట్రాన్స్‌జెండర్ వ్యక్తులు వచ్చి డబ్బు డిమాండ్ చేస్తున్నట్లు సామాజిక మాధ్య మాల్లో ఫిర్యాదులు వస్తున్నాయి. దౌర్జన్యంగా డబ్బు వసూలు చేయడాన్ని ఎవరూ సమర్థించరు. అయితే, శతాబ్దాలుగా సమాజం వారిని ఎంతలా అట్టడుగుకు నెట్టేసిందో, వ్యవస్థాపరంగా వారు ఎంతటి దోపిడీకి గురయ్యారో కూడా మనం అర్థం చేసుకోవాలి.ఒక మనిషి ట్రాన్స్‌జెండర్ అని బయటపెట్టిన మరుక్షణం నుంచే అన్ని అవకాశాలు మూసేసి సమాజం వారిని చీదరించుకోవడం పెద్ద విషాదం. ఆశ్రయం కోల్పోయిన వారి కోసం భారత ప్రభుత్వ ‘స్మైల్’ పథకం కింద ‘గరిమా గృహ్’ ఆశ్రమాలు అరకొరగా పని చేస్తున్నాయి. విద్య, ఉద్యోగం, ఆరోగ్య సంరక్షణ, నివాసం వంటి విషయాల్లో వారిపై ఎలాంటి వివక్ష చూపకూడదని ‘ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల హక్కుల పరిరక్షణ చట్టం–2019’ స్పష్టంగా చెబుతోంది. ఎవరైనా వారిని ఇంటి నుంచి గెంటేసినా, బహిరంగ ప్రదే శాల్లోకి రాకుండా అడ్డుకున్నా... చట్టం ప్రకారం రెండేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.ట్రాన్స్‌జెండర్స్ జీవితాల్లో అత్యంత దయనీయమైన అంశం వైద్య సదుపాయాల కొరత. హార్మోన్ థెరపీ, లింగ మార్పిడి శస్త్రచికిత్సల కోసం వారు లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన సదుపాయాలు లేక, ప్రైవేట్ ఆసు పత్రుల్లో ఖర్చులు భరించలేక, ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. దేశంలోనే తొలి సారిగా 2008లో ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసిన ఘనత తమిళనాడుది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో లింగ మార్పిడి శస్త్రచికిత్సలను ఉచితంగా, సురక్షితంగా అందిస్తూ వారి ఆర్థిక భారాన్ని తగ్గిస్తోంది. రాష్ట్రంలోని ప్రభుత్వ విశ్వ విద్యా లయాల్లో చదివే ట్రాన్స్‌జెండర్ విద్యార్థులకు ఫీజు మాఫీ చేసింది. ప్రభుత్వ ప్రోత్సాహంతోనే ‘పృత్తికా యాషిని’ దేశంలోనే తొలి ట్రాన్స్‌జెండర్ పోలీస్ ఇన్స్పెక్టర్ కాగలిగారు.మరోవైపు, దేశంలోనే తొలిసారిగా ఒక సమగ్రమైన రాష్ట్ర ట్రాన్స్‌జెండర్ పాలసీని తీసు కువచ్చిన కేరళ ‘సమన్వయ’ పథకంతో నిరంతర విద్య, ‘సాకల్యం’ ద్వారా వృత్తి నైపుణ్య శిక్షణ, ఉచిత లింగ మార్పిడి శస్త్రచికిత్సలకు ఆర్థిక సాయం వంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోంది. కర్ణాటక... ప్రభుత్వ ఉద్యోగాల్లో అన్ని సామాజిక వర్గాల్లోనూ ట్రాన్స్‌జెండర్స్‌కు 1 శాతం రిజర్వేషన్ కల్పించిన తొలి రాష్ట్రంగా నిలిచింది. తెలంగాణలో కొందరిని ట్రాఫిక్ సిబ్బందిగా నియమించడం, జూట్ బ్యాగుల తయారీలో శిక్షణ ఇవ్వడం వంటి సాను కూల అడుగులు పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్... పెన్షన్ పథకం కూడా అమలు చేస్తోంది. అయితే ఇతర దక్షిణ భారత రాష్ట్రాలతో పోలిస్తే మరింత ప్రగతి సాధించాల్సి ఉంది.పిలుపులోనే గౌరవం ఉంటుంది కాబట్టి, తమిళనాడులో ట్రాన్స్‌జెండర్‌ను ‘తిరునర్’ అనీ, ట్రాన్స్ స్త్రీని ‘తిరునంగై’ అనీ, ట్రాన్స్ పురుషులను ‘తిరునంబి’ అనీ అంటున్నారు. తెలుగులోనూ అలాంటి గౌరవ సంబోధనలను వాడుకలోకి తేవాల్సిన అవసరం ఉంది.– శ్రీనివాస్ మాధవ్, సమాచార హక్కు పరిశోధకుడు -
వాక్పతి: వ్యాసుని మహాభారత రచనలో గణపతి మహిమ!
‘తొండము నేకదంతము’... ప్రార్థనా పద్యంలో ‘విద్యల కెల్ల నొజ్జయై’ అని వాక్కుల కధిపతిగా, విద్యా బుద్ధుల ప్రదాతగా వినాయకుని కీర్తించటం ఉంది. వ్యాస మహర్షి మహాభారతాన్ని చెపుతుండగా గణపతి రాశాడని చెబుతారు.అంటే గణపతి వ్యాసుని ఎదురుగా కూర్చుని రాస్తూవుంటే... వ్యాసుడు ఆశువుగా చెబుతున్నాడని పైకి తోచే అర్థం. కాని, వ్యాసుడు ఏకాక్షర గణపతిని ఉపాసించి సర్వ విద్యల సారం గ్రహించి, సమస్త ఛందస్సులలోని భాషా చాతుర్యమంతా అవగతం చేసుకుని మహాభారతాన్ని రచించాడని ఇందులోని అంతరార్థం అని గణేశ పురాణం చెబుతుంది. వ్యాసుడు మహా భారతం, మహా భాగవతాలనే కాక అష్టాదశ పురాణాలను, అష్టాదశ ఉప పురాణాలను కూడా రచించాడు. ఆ ఉప పురాణాలలో ఒకటి గణేశ పురాణం.రచన ధారళంగా సాగాలన్నా, భాషాదోషాలు లేకుండా, ఎక్కడా కుంటుపడకుండా భాష ప్రవహించాలన్నా, మంచి ఆలోచనలు రావాలన్నా గణపతి పూజ అవశ్యం అని పెద్దల మాట. అలనాటి వ్యాసుని నుంచి నేటి పండిత శ్రేష్ఠుల వరకు అందరికీ గణపతి ఆరాధ్య దైవం, వాక్పతి. విద్యాదాత.దేవతలు కూడా విధిగా పూజించవలసిన దైవం గణపతి. దేవతలు క్షీర సాగర మథనాన్ని గణపతి పూజ చేయకుండా ప్రారంభించటం వల్లనే మధ్యలో విఘ్నం కలిగిందనీ, అప్పుడు స్వయంగా మహా విష్ణువే దేవతలచేత గణపతి పూజ చేయించటం వల్ల ఆ కార్యం నిర్విఘ్నంగా జరిగిందనీ గణేశ పురాణం తెలియజేస్తోంది.– డా. చెంగల్వ రామలక్ష్మిఇవి కూడా చదవండి: హిమధీర -
భూమిపై మరో సూర్యుడిని సృష్టిస్తున్న చైనా!
చైనా అభివృద్ధి చేసిన ‘ఈస్ట్’ (ఎక్స్పరిమెంటల్ అడ్వాన్స్డ్ సూపర్ కండక్టింగ్ టోకమాక్) రియాక్టర్ ప్రపంచ శక్తి (ఎనర్జీ) రంగాన్ని సరికొత్త మలుపు తిప్పే దిశగా పురోగమిస్తోంది. సూర్యుడిలో నిరంతరం శక్తిని ఉత్పత్తి చేసే న్యూక్లియర్ ఫ్యూజన్ (అణు సంలీనం) ప్రక్రియను భూమిపై సురక్షితంగా పునఃసృష్టించడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశం.రెండు తేలికపాటి పరమాణు కేంద్రకాలు అత్యధిక ఉష్ణోగ్రత, పీడనాల వద్ద ఒకదానికొకటి వేగంగా ఢీకొని, కలిసిపోయి ఒకే బరువైన పరమాణు కేంద్రకంగా మారడాన్ని అణు సంలీనం అంటారు. భూమిపై సూర్యుడిలోని గురు త్వాకర్షణ శక్తిని సృష్టించడం సాధ్యం కాదు. అందుకే టోకమాక్ అనే శక్తిమంతమైన అయస్కాంత క్షేత్రాలు కలిగిన డోనట్ ఆకారపు పరికరాన్ని ఉపయోగిస్తారు. ఇందులో హైడ్రోజన్ ఐసోటోప్‌లైన డ్యూటీరియం, ట్రిటియంలను వందల మిలియన్ల డిగ్రీల సెల్సియస్ వద్ద వేడి చేసి ప్లాస్మా రూపంలో బంధించి ఈ సంలీన ప్రక్రియను జరుపుతారు.చైనా సైంటిస్టులు 12 కోట్ల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద ప్లాస్మాను 101 సెకన్ల పాటు, అలాగే మరికొన్ని ప్రయోగాల్లో 1,000 సెకన్ల కంటే ఎక్కువ సమయం స్థిరంగా నిర్వహించి ప్రపంచ రికార్డులు నమోదు చేశారు. ఈ ప్రాజెక్ట్ చైనాలోని అనూయ్ ప్రావిన్స్‌లో ఉన్న ‘హెఫీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ సైన్సెస్’ ఆధ్వర్యంలో నడుస్తోంది.ప్రస్తుతం వాడుతున్న అణు విచ్ఛిత్తి వల్ల ప్రమాదకరమైన రేడియో యాక్టివ్ వ్యర్థాలు వస్తాయి. ఈ ఫ్యూజన్ సాంకేతికత వల్ల జీరో కార్బన్ ఉద్గారాలు, సురక్షితమైన శక్తి లభిస్తుంది. సముద్రపు నీటిలో లభించే డ్యూటీరియం, ట్రిటియం వంటి హైడ్రోజన్ ఐసోటోప్‌లను ఇంధనంగా వాడుతారు. నిజమైన సూర్యుడి కేంద్రకంలో ఉష్ణోగ్రత సుమారు 1.5 కోట్ల డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. చైనా సృష్టించిన ఈ పరికరం ఏకంగా 16 కోట్ల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను తాకి రికార్డు సృష్టించింది.ప్లాస్మాను ఎక్కువసేపు స్థిరంగా ఉంచడం, ఉత్పత్తి అయ్యే శక్తిని సమర్థ వంతంగా విద్యుత్‌గా మార్చడం వంటి సాంకేతిక సవాళ్లు ఇంకా పరిష్కరించాల్సి ఉంది. చైనా మాత్రమే కాకుండా అమెరికా, యూరప్, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలు కూడా అణు సంలీన సాంకేతికతపై పరిశోధనలు చేస్తున్నాయి. చైనా ప్రయోగాలు కేవలం ఈస్ట్తోనే ఆగడం లేదు. తదుపరి తరం ప్రాజెక్ట్ ‘బెస్ట్’ (బర్నింగ్ ప్లాస్మా ఎక్స్పెరిమెంటల్ సూపర్ కండక్టింగ్ టోకమాక్)ను నిర్మిస్తున్నారు. 2030 నాటికి వాణిజ్యపరంగా విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన సాంకేతికతను సిద్ధం చేయాలనేది దీని లక్ష్యం.– తరిగొప్పుల వీఎల్లెన్ మూర్తి, సీనియర్ జర్నలిస్ట్ -
ఉపాధ్యాయుడికి ఏఐ ప్రత్యామ్నాయం కాదు!
తరతరాలుగా గురువును పూజనీయ స్థానంలో ఉంచి... తల్లి, తండ్రి తర్వాత స్థానం గురువుకు ఇచ్చిన సంస్కృతి మనది! అట్టి ఉపాధ్యాయ వృత్తి ప్రమాదంలో పడ్డ నేపథ్యంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకొంటున్నాం. విద్య అనేది ప్రాథమికంగా ఒక మానవ ప్రయత్నం. అది సంబంధాల మీద ఆధారపడి ఉంటుంది.నమ్మకం మీద, అనుబంధం మీద ఆధారపడి ఉంటుంది. అది మనం ఆటోమేట్ చేయగల లావాదేవీల వ్యాపారం కాదు. బోధనోపకరణాలు, సమయం, నమ్మకాన్ని సరైన పద్ధతిలో, ప్రయోజనాత్మకంగా, గౌరవప్రదంగా, ఉపాధ్యాయులకు మద్దతు ఇచ్చే సరైన అకడమిక్ వాతావరణంలో, వారి అభివృద్ధికి సరైన అవకాశాలతో వినియోగించడంతోనే నాణ్యమైన విద్యకు పునాది ఏర్పడుతుంది.అభివృద్ధి చెందుతున్న బోధనా వృత్తిపై జరుగుతున్న చర్చలు... విద్య అనేది ఉపాధ్యాయ–విద్యార్థి కీలక సంబంధంలోనే దృఢంగా పాతుకుపోయి ఉందని స్పష్టం చేశాయి. ఉపాధ్యాయుల నియా మకం, వారిని వృత్తి నిబద్ధులుగా రూపుదిద్దడంలో ప్రపంచవ్యాప్త సవాళ్లు ఉన్నాయి. దీనికి ప్రధాన కారణాలు సరిపోని జీతాలు, అహేతుకమైన అధిక పనిభారం.ఎడ్ టెక్ ప్రయోగం ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక మార్పులు వేగంగా వస్తున్న తరుణంలో బోధనలో కృత్రిమ మేధ (ఏఐ) ఉపయోగం గురించి చర్చ జరుగుతోంది. నాణ్యమైన విద్యకు ఉపాధ్యాయులే కేంద్రబిందువు అని అందరూ అంగీకరిస్తున్నప్పటికీ, తమ తరగతి గదు లలో కృత్రిమ మేధను ఎలా, ఏ మేరకు అనుసంధానించాలనే విష యంలో భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. అవకాశాలను అంది పుచ్చుకోవడానికి ప్రభుత్వాలు ఆలోచిస్తుండగా; ఉపాధ్యాయులు, విద్యావేత్తలు మరింత జాగ్రత్తతో నియంత్రణలు ఉండాలని వాదిస్తున్నారు.సాంకేతిక మార్పు ఉపాధ్యాయులకు అవకాశాలను కల్పించ గలిగినప్పటికీ, ఇప్పటికే ఒత్తిడిలో ఉన్న వృత్తిపై ఇది మరింత భారాన్ని పెంచే ప్రమాదం ఉంది. బోధనలో ఏఐ అనుసంధానం జరగడానికి ఉపాధ్యాయుల నుండి అదనపు కృషి, బోధన, అభ్యసన ప్రక్రియలలో నిరంతర సర్దుబాట్లు అవసరం. అందువల్ల, ఈ మార్పులన్నింటి మధ్య, విద్యా నిపుణుల శ్రేయస్సు– పనిభారాన్ని కూడా సరిగ్గా పరిగణనలోకి తీసుకునేలా చూడాల్సిన అవసరం ఉంది. ఒక విషయం మాత్రం పూర్తిగా స్పష్టం: కృత్రిమ మేధ ఉపాధ్యాయుడికి ప్రత్యామ్నాయం కాదు.పుస్తకాల స్థానంలో కంప్యూటర్లను తీసుకొచ్చి దాదాపు 15 ఏళ్ల పాటు డిజిటల్ ఎడ్యుకేషన్‌ను ప్రోత్సహించి అమలు చేసిన స్వీడన్ దేశం డిజిటల్ ఫస్ట్ విధానం వల్ల విద్యార్థుల్లో చదవడం, రాయడం వంటి ప్రాథమిక నైపుణ్యాలు క్షీణిస్తున్నాయనే విషయాన్ని గుర్తించింది. ఎడ్ టెక్ అనేది విఫల ప్రయోగం అనీ, అందువల్ల విద్యార్థులకు మరిన్ని భౌతిక పాఠ్యపుస్తకాలు అవసరమనీ చెప్పిన స్వీడన్ అనుభవాలు గమనించాలి.దశాబ్దాల పోరాటాల ఫలితంగా ఉపాధ్యాయ లోకానికి దక్కిన అతిపెద్ద విజయాల్లో ఉద్యోగ భద్రత మొదటిది. కానీ ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు, ప్రవేశపెడుతున్న కొత్త విద్యా విధానాల నేపథ్యంలో కాంట్రాక్టు, పార్ట్ టైమ్, ఔట్ సోర్సింగ్లాంటి పద్ధతుల్లో ఉపాధ్యాయుల నియామకాలు జరిగి ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకమైంది. ఇటువంటి అధ్యాపకులకు కనీస టైమ్ స్కేల్ వర్తింపజేయాలి. శాశ్వత ఉద్యోగభద్రత వలన వృత్తిపట్ల అంకితభావం తగ్గుతుందనే శుష్క వాదనలను చేయడం సముచితం కాదు.– కె. వేణుగోపాల్, విద్యారంగ విశ్లేషకులుఇవి కూడా చదవండి: మా పిల్లలనూ కాపాడండి! -
మన దేహం విలువ కోట్లకంటే ఎక్కువ.. ఈ కథతో అర్థమవుతుంది!
మన శరీరంలోని కాలేయం, గుండె, ఊపిరి తిత్తులు, కళ్ళు, పళ్ళు వంటివేవైనా... కొంత చెడి పోయినా బాగు చేయించుకోవటానికి లక్షల రూపాయలు ఖర్చవుతాయి. అన్నీ బాగుండి, ఆరోగ్యంగా, దృఢంగా ఉన్నవారు శరీర విలువను గ్రహించక, జీవిత విలువను తెలుసుకోలేక, ఎలా జీవించాలో అలా జీవించక వెళ్ళిపోతున్నారు. మహారాజ్ జగత్ సింగ్జీ ఒక కథ చెబుతారు:ఒక వృద్ధుడు అడవిలో కట్టెలను కొట్టి, ఆ కట్టెలను కాల్చి, వచ్చిన బొగ్గును అమ్మి జీవించేవాడు. ఒకసారి అడవిలో దారితప్పిన రాజును రక్షించి, రాజనగరుకు క్షేమంగా చేర్చాడు. ఆ రాజు సంతోషించి అతనికి చందన వృక్షాలు గల అందమైన తోటను కానుకగా ఇచ్చాడు. ఆ వృక్షాల ప్రత్యేక విలువ ఆ వృద్ధునికి తెలీదు. ఆ చెట్లను కొట్టాడు, కట్టెలను కాల్చాడు, వచ్చిన బొగ్గులను అమ్మాడు, వచ్చిన కొంత డబ్బుతో ఏ పూటకు ఆ పూట గడిపాడు, దరిద్రునిగనే నిలచిపోయాడు.కొద్ది రోజుల తర్వాత రాజు వచ్చి, అతని దారిద్య్రాన్ని చూసి, విషయాన్నంతా అడిగి తెలుసుకున్నాడు. ఒక చిన్న కట్టె ఏమైనా మిగిలి ఉందా? అని ప్రశ్నించాడు. ఏదో ఒక మూలన పడివున్న బారెడు కట్టెను తెచ్చాడు వృద్ధుడు. సరే, దీన్ని ఇలాగే బజారుకు తీసుకెళ్ళి, అమ్మి పైకాన్ని తీసుకురా అన్నాడు రాజు. అది మామూలు కట్టె కాదని, చందన వృక్షపు ముక్క అని తెలిసిన వ్యక్తి వందల రూపాయలను ఇచ్చి దాన్ని కొన్నాడు.ఆ వృద్ధుడు ఆశ్చర్యంతో రాజుగారికి ఆ డబ్బును చూపించాడు. ‘ఇప్పుడు నీకు తెలిసిందా, నేను నీకు కానుకగా ఇచ్చిన తోట ఎన్ని కోట్ల విలువైనదో? నీవు అజ్ఞానంతో అమూల్యమైన సంపదను కోల్పోయావు’ అన్నాడు రాజు. (పుట 58, ఆత్మజ్ఞానము– సర్దార్ బహదుర్ జగత్ సింగ్జీ; రాధాస్వామి సత్సంగ్ బియాస్).భగవంతుడు లేక ప్రకృతి మనకు ప్రసాదించిన ఈ మానవ దేహం రాజు గారు ఇచ్చిన చందన వృక్ష తోటకంటె ఎన్నో వందల రెట్లు విలువైనదే. ‘శరీరమాధ్యం ఖలు ధర్మ సాధనం’ అని శాస్త్రాలు ఘోషిస్తాయి. ఈ శరీర మూలంగానే జ్ఞానాన్ని ఆర్జించాలి. ఆ తర్వాత ‘పరోపకారార్థ మిదం శరీరం’ అని గుర్తెరిగి జీవించాలి.– రాచమడుగు శ్రీనివాసులు -
భూమి దున్నేవారు లెక్కలోకి రారా?
రంగారెడ్డి జిల్లాలో ఒక రైతు పదేళ్లుగా ఐదెకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తు న్నాడు. విత్తనం కొనేది అతడే. ఎరువులు వేసేది అతడే. పంట ఎండిపోతే నష్టం భరించేదీ అతడే. కానీ ప్రభుత్వ రికార్డులో ఆ భూమి సాగు చేసే రైతు అతడు కాదు. అందుకే బ్యాంకు రుణం రాదు, పంటల బీమా రాదు, పెట్టుబడి సాయం రాదు, కరవు వచ్చినప్పుడు పరిహారమూ రాదు. దశాబ్దాలుగా మన కౌలు రైతుల కథ ఇదే. ఇప్పుడు అడగాల్సిన ప్రశ్న ఒక్కటే– దేశం మొత్తాన్ని డిజిటల్‌గా మారుస్తున్న కొత్త వ్యవస్థ ఈ కథను మారుస్తుందా?అగ్రిస్టాక్ అంటే ఏమిటి?కేంద్ర ప్రభుత్వం రూ. 2,817 కోట్లతో అగ్రిస్టాక్ అనే డిజిటల్ వ్యవస్థను నిర్మిస్తోంది. దేశంలోని 14 కోట్ల వ్యవసాయ కమతాలకూ, ప్రతి రైతుకూ ఆధార్‌తో ముడిపడిన ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇస్తారు. భూమి వివరాలు, ఏ పంట వేశారు, ఎంత దిగుబడివచ్చింది– అన్నీ ఉపగ్రహ చిత్రాలతో కలిపి ఒకచోట పెడతారు. దీని ఆధారంగా రాయితీలు, బీమా, రుణాలు, సలహాలు అన్నీ వేగంగా అందుతాయని చెబుతున్నారు. పంటల బీమా క్లెయిము రావడానికి ఇప్పుడు ఏళ్లు పడుతోంది. ఉపగ్రహ చిత్రాలతో పంట నష్టాన్నివెంటనే గుర్తిస్తే రైతుకు నిజంగానే మేలు జరుగుతుంది. కానీ ఒక్క ప్రశ్న. మన వ్యవసాయ సమస్య నిజంగా సమాచారం లేక పోవడమేనా? దేశంలో ఇప్పటికే 22 కోట్ల భూసార కార్డులు ఇచ్చారు. కేంద్ర భూగర్భ జల మండలి 25 వేల బావులను ఏటా కొలుస్తోంది. వ్యవసాయ ఖర్చులను 1970ల నుంచీ ప్రతి ఏటా లెక్కిస్తున్నారు. రైతు ఆత్మహత్యల సంఖ్యను 1995 నుంచీ నమోదు చేస్తున్నారు. వాతావరణ శాఖకు 730 కేంద్రాలున్నాయి. మరి ఫలితం? నేలలో సేంద్రియ కర్బనం తగ్గుతూనే ఉంది. భూగర్భ జలం అడుగంటుతూనే ఉంది. రైతుల అప్పులు పెరుగు తూనే ఉన్నాయి. సమాచారం లేకపోవడమే అసలు అడ్డంకి అయితే ఈ సమస్యలు ఎప్పుడో తీరిపోయేవి.ఎరువుల విషయమే చూడండి: నత్రజని తగ్గించమని భూసార కార్డు చెబుతుంది. కానీ యూరియా బస్తా ధర 85% రాయితీతోఅందుతుంది. నేల ఏం చెప్పినా, మార్కెట్లో అన్నింటికంటే చౌక అదే. అందుకే రైతు దాన్నే వాడతాడు. కంప్యూటర్ ఎంత తెలివైనదైనా ఈ లెక్క మార్చదు.అసలు లోపం ఎక్కడుంది?దేశంలో దాదాపు 40 శాతం వ్యవసాయ కుటుంబాలు తమవి కాని భూముల్ని సాగు చేస్తున్నాయి. వ్యవసాయ పనుల్లో 60 నుంచి 80 శాతం చేసేది మహిళలు; కానీ భూమి ఉన్నది కేవలం 13.9 శాతం మందికే. అటవీ హక్కుల పత్రాలు రాని ఆదివాసీలు, భూమిలేని కూలీలు, వలస వెళ్లి కౌలుకు చేసేవాళ్లు– వీళ్లెవరూ భూ రికార్డులో కనిపించరు.తెలంగాణ రైతు భరోసా అనుభవం మన కళ్ల ముందే ఉంది. అది భూ రికార్డులతో ముడిపెట్టిన పథకం. అందుకే లక్షలాది కౌలు రైతులు దాని పరిధిలోకి రాలేదు. ఇప్పుడు అదే లోపాన్ని దేశమంతటికీ, డిజిటల్ రూపంలో, శాశ్వతంగా అమర్చుతున్నాం. కాగితపు రికార్డును అప్పుడప్పుడూ సరిదిద్దుకోవచ్చు. కంప్యూటర్లో ఒకసారి నమోదైన తప్పును కదిలించడం చాలా కష్టం. తెలంగాణలో భూభారతి, ఆంధ్రాలో వెబ్ ల్యాండ్. దాని మీద అగ్రిస్టాక్. దాని మీద కృషి విస్తార్ అనే సలహాల వ్యవస్థ. కింది అంతస్తులో ఉన్న పగుళ్లు పైకి ఎక్కుతూ పెద్దవవుతాయి. రైతు అనుమతితోనే సమాచారం పంచుకుంటామని చెబు తున్నారు. కానీ పీఎం–కిసాన్ డబ్బు, పంటల బీమా, కిసాన్ క్రెడిట్ కార్డు– ఇవన్నీ ఆ నమోదుతోనే ముడిపడితే, రైతుకు వద్దనే స్వేచ్ఛ ఎక్కడ? విత్తనం కొనడానికి డబ్బు కావాల్సిన రైతు ‘అంగీకరిస్తున్నా’ అని నొక్కడం సమ్మతి కాదు, తప్పనిసరి.ఆ సమాచారం చిన్నదేమీ కాదు. ఏ పంట వేశాడు, ఏ ఎరువు కొన్నాడు, ఎంత అప్పు ఉంది, ఎప్పుడు కట్టాడు– ఇదంతా ఎరువుల కంపెనీలకూ, రుణ సంస్థలకూ బంగారం లాంటిది. ఉపగ్రహ చిత్రంలో పంట ఎండినట్టు కనిపించిన మరుక్షణం రుణం వసూలుకు ఒత్తిడి మొదలవ్వొచ్చు.ఇది ఊహాజనిత భయం కాదు. ప్రపంచంలో ఇలాగే జరిగింది. వాతావరణ సమాచారం ఇచ్చే ఒక చిన్న కంపెనీని మాన్ శాంటో వేల కోట్లు పెట్టి కొనుక్కుంది. ఆ తర్వాత అది రైతుల పొలాల సమాచా రాన్నంతా సేకరించే పెద్ద వేదికగా మారింది. ప్రజా ప్రయోజనం పేరుతో మొదలైన వ్యవస్థలు చివరికి వ్యాపార వేదికలుగా మారడం చాలాసార్లు చూశాం.కృత్రిమ మేధతో సలహాలు ఇస్తామంటున్నారు. మన దగ్గర ఒక వ్యవసాయ అధికారికి వెయ్యి మంది రైతులు. ఇది సాంకేతిక లోపం కాదు, పెట్టుబడి లోపం. యాప్ ఉంది కదా అని సిబ్బందిని నియమించడం మానేస్తే, రైతుకు మిగిలేది పొలానికి రాని సలహా. పైగా ఆ సలహా ఇచ్చే వేదికలు ఎరువులు, పురుగుమందులు అమ్మే కంపెనీలతో కలిసి పనిచేస్తే– రసాయనాలు తక్కువ వాడమని అది ఎందుకు చెబుతుంది?మరేం చేయాలి?అగ్రిస్టాక్‌ను ఆపమని ఎవరూ అనడం లేదు. రైతు ప్రయోజ నాల చుట్టూ దాన్ని నిర్మించాలి. మొదటిది– భూమి యజమానిని కాక సాగు చేసేవారిని రైతుగా గుర్తించాలి. గ్రామసభ ధ్రువీకరణతో కౌలుదారుల పేర్లు నమోదు చేయాలి. ఒడిశా, కేరళ ఇలాంటి ప్రయత్నాలు చేశాయి. రెండోది– మహిళల పేర్లు తప్పనిసరిగా నమోదు కావాలి. కుటుంబంలో సాగుచేసే అందరికీ గుర్తింపు ఇవ్వాలి. మూడోది– సమాచారంపై బేరసారాలు ఒక్కో రైతు ఒంట రిగా చేయలేడు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు, సహకార సంఘా లకు ఆ అధికారం ఇవ్వాలి. నాలుగోది– సలహాలు ఇచ్చే కంప్యూటర్ కార్యక్రమాలు బహిరంగంగా ఉండాలి. అవి ఎలా పనిచేస్తున్నాయో వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, ప్రజలు పరిశీలించగలగాలి. సలహాలు ఇచ్చే కంపెనీలు బాధ్యత వహించాలి. ఐదోది– ఎవరైనా అన్యాయంగా జాబితా నుంచి తప్పిపోతే, వారం రోజుల్లో సరిదిద్దే వ్యవస్థ ఉండాలి. కంప్యూటర్ క్షణంలో పేరు తీసేస్తే, దాన్ని తిరిగి చేర్చడానికి ఏళ్లు పడితే ఆ సీజన్ పంట పోతుంది.ఇవేమీ కొత్త ఆలోచనలు కావు. సేంద్రియ ధ్రువీకరణ కోసం మన దేశంలో ఇప్పటికే రైతులే పరస్పరం తనిఖీ చేసుకునే పద్ధతి నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో లక్షల మంది రైతులు ప్రకృతి వ్యవసా యానికి మారింది యాప్‌ల వల్ల కాదు, గ్రామంలోని ఒక రైతు మరో రైతుకు నేర్పడం వల్ల. సాంకేతికత ఈ మానవ వ్యవస్థలకు తోడుగా రావాలే తప్ప, వాటి స్థానంలో కూర్చోకూడదు. మన వ్యవసాయ సంక్షోభం సమాచార సమస్య కాదు, పాలన సమస్య. భూమి పత్రం ఏం చెబుతుందో కాదు, పొలంలో ఎవరు చమట చిందిస్తున్నారో చూసే వ్యవస్థ కావాలి.-వ్యాసకర్త వ్యవసాయ శాస్త్రవేత్త,‘సుస్థిర వ్యవసాయ కేంద్రం’ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్-డా‘‘ జి.వి.రామాంజనేయులు -
కృష్ణుడి గురించి ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి!
అసంఖ్యాకమైన భగవదావతారాలలో అతి విశిష్టమైనదీ, పరిపూర్ణమైనదీ కృష్ణావతారం. భావో ద్రేకాలు అధికమైన భక్తులకు శ్రీకృష్ణుడు మహానందాంగనా డింభకుడిగా, ముద్దుగారే యశోద ముంగిటి ముత్యంగా, అందమైన అల్లరి చేష్టల నవనీత చోరుడిగానే ముందు మనసుకు వచ్చి మురిపిస్తాడు కానీ ఆయన జగద్గురువు. యోగేశ్వరుడు. దేవదేవుడు. భూభారం తగ్గించటమే లక్ష్యంగా ఆయన ఎత్తిన కృష్ణావతారంలో ఆజన్మాంతం దుష్టశిక్షణా, సాధురక్షణా, ధర్మ సంస్థాపనా, జగదోద్ధరణా జరిగాయి. అన్ని అద్భుత ఘనకార్యాలు మరే అవతారంలోనూ కనబడవు. ఆ ‘భాగవత’మంతా పఠిస్తేనే చాలు, ‘బాగవుతాం’ అన్నారు పెద్దలు.పుట్టిన మూడో నెలలో పూతనను మట్టుపెట్టడంతో ఆరంభించి, పసితనంలోనే ఆయన వల్ల మట్టిలో కలిసిన మహాబలులూ, మాయావులూ అయిన రాక్షసులకు లెక్క లేదు. ఏడేళ్ల వయస్సులో ఏకంగా కొండనే ఎత్తి, ఏడు రోజులు చిటికెన వేలుమీద స్థిరంగా నిలిపి ఉంచి, ప్రజారక్షణ చేసి, ఇంద్రుడికే సవాలు విసిరిన లీలాబాలుడికి ఎవరు సాటి? ఎందరు దుష్టులను దునుమాడినా, ఆయన ఎవరినీ ద్వేషించలేదు. ఆయన చేత వధించబడిన దుష్టులు ఆఖరికి సద్గతులే పొందారు.కృష్ణావతారం నొక్కి వక్కాణించే సూత్రం ‘గోవిందుడు అందరివాడు’ అని. కామోత్కంఠతో గానీ, స్నేహంతో గానీ, చనువుతో గానీ, భక్తితో గానీ బాంధవ్యంతో గానీ, ప్రేమతో గానీ, చివరకు ఆయనపట్ల అమితమైన అకారణ ద్వేషంతో గానీ, ఆయన మీద మనసు లగ్నం చేయగలిగిన వాళ్ళందరికీ ఆయన శ్రేయస్సును ప్రసాదిస్తాడనేందుకు గోపికలూ, కుచేలుడూ, గోపాలకులూ, నారదాదులూ, యాదవులూ, పాండవ పరివారమూ, కంస–శిశుపాల–సాల్వ–కేశి–పౌండ్రక–దంత వక్త్ర– నరకాసురాదుల వృత్తాంతాలు తనువు పులకరింపజేసే తార్కాణాలు.కార్య విజయాలనూ, జీవన సాఫల్యాన్నీ కాంక్షించే వారికి, సకల శాస్త్రవేత్తా, ధర్మమూర్తీ అయిన భీష్మాచార్యుడు నిర్ద్వంద్వంగా నిర్దేశించిన, ‘యతః ధర్మః తతః కృష్ణః, యతః కృష్ణః తతః జయః!’ (ఎక్కడ ధర్మం ఉంటే, అక్కడ కృష్ణుడుంటాడు. ఎక్కడ కృష్ణుడుంటే, అక్కడ విజయం ఉంటుంది) అన్న సూచన అందరికీ నిత్యస్మరణీయం, అనుసరణీయం.– ఎం. మారుతి శాస్త్రి -
మా పిల్లలనూ కాపాడండి!
అమెరికా రాష్ట్రాలు సంయుక్తంగా దాఖలు చేసిన దావాలో టెక్ దిగ్గజం ‘మెటా’ రాజీకి వచ్చి, 18 బిలియన్ డాలర్ల చెల్లింపుతో పాటు, ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో బాలలకు రోజుకు కేవలం రెండు గంటల వినియోగ పరి మితి, రాత్రిపూట ఆటోమేటిక్ లాకౌట్, క్రోనలాజికల్ ఫీడ్, కఠిన వయో నిర్ధా రణ వ్యవస్థను అమలు చేయడానికి అంగీకరించింది.స్నాప్‌చాట్, టిక్‌టాక్, యూట్యూబ్ కూడా ఇదే బాటలో నడవనున్నాయి. ఐరోపా సమాఖ్య సైతం తమ పిల్లల భద్రత కోసం ఇదే తరహా రక్షణ చర్యలు అమలు చేయాలని డిమాండ్ చేస్తోంది. భారత దేశం కూడా మేలుకోవాలి. ‘లోకల్ సర్కిల్స్’ సర్వే ప్రకారం, ఆన్ లైన్ లో తమ పిల్లలు అనుచితమైన కంటెంట్‌కు గురైనట్లు సగం మంది భారతీయ తల్లిదండ్రులు గుర్తించారు.మన దేశంలో 2023 డేటా ప్రొటెక్షన్ చట్టం ‘తల్లిదండ్రుల సమ్మతి’పై ఆధారపడి ఉంది. ఆస్ట్రే లియా 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించగా, ఇండోనేషియా, బ్రెజిల్, టర్కీ, యూకే కఠిన నిబంధనలు తెచ్చాయి. దీనితో పాటు... అశ్లీలత, హింస, షార్ట్–వీడియోల వ్యసనం, గేమింగ్–బెట్టింగ్ యాప్స్ లాంటి పెద్ద ముప్పులను కూడా అడ్డుకోవాలి. టెక్సాస్, బ్రిటన్, ఫ్రాన్స్ తరహాలో బయోమెట్రిక్ లేదా ఐడీ ద్వారా వయసు నిర్ధారణను కఠినంగా అమలు చేయాలి.పిల్లల మెదడులో డోపమైన్‌ను పెంచి బానిసలను చేస్తున్న షార్ట్–వీడియోల నిరంతర ఆటో ప్లే, స్క్రోలింగ్‌లను ఆపేయాలి. గేమింగ్ ముసుగులో ఉండే ‘లూట్ బాక్స్’లను జూదంగా పరిగణించి నియంత్రించాలి. చైనాలో మైనర్లకు ‘మైనర్ మోడ్’ తీసుకువచ్చారు. ఆర్థిక సర్వే 2025–26 సూచించినట్లుగా, స్కూళ్లలో బేసిక్ ఫోన్లను మాత్రమే అనుమతించాలి. ఈయూ తరహాలో ‘మా పిల్లలను కూడా రక్షించండి (ప్రొటెక్ట్ అవర్ కిడ్స్ టూ)’ అని భారతదేశం కూడా గట్టిగా అడగాలి.అలాగే ఇటీవలి సంఘటనల్లో టీనేజీ పిల్లల బాధితులైన ‘ఒంటరి మహిళ బలహీన లక్ష్యం’ అనే మూస ధోరణిని తిప్పి కొట్టాలి. హ్యాండ్‌బ్యాగ్‌లో ‘పెప్పర్ స్ప్రే’ వంటి చట్టబద్ధ మైన సాధనం ఉంచు కోవాలి. దీనితో పాటు ‘హోమ్ ఎస్.ఓ.ఎస్. సైరన్’ వ్యవస్థను ప్రోత్సహించాలి. ప్యానిక్ బటన్ నొక్కగానే మోగే పెద్ద సైరన్ చుట్టు పక్కల వారిని అప్రమత్తం చేసి, ఇరుగుపొరుగు వారి మధ్య నమ్మకాన్ని పెంచుతుంది.లాటిన్ అమెరికాలో వీధి మొత్తానికి ‘అలార్మా వెసినాల్’ సైరన్ ఏర్పాటు చేసి, ప్రతి ఇంటికీ ఒక రిమోట్ ఇస్తారు. బటన్ నొక్కితే చుట్టుపక్కల వారు వచ్చి సాయం చేస్తారు. దక్షిణాఫ్రికాలో నేరాలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రజలు ప్యానిక్ బటన్లు, ప్రత్యేకమైన విజిల్స్ వాడుతారు. అలాగే, యాప్‌లోని ‘షౌట్’ బటన్ ద్వారా లొకేషన్‌తో కూడిన సందేశం పోలీసులకు చేరవేసే ‘112 ఇండియా’ యాప్‌పై అవగాహన పెంచాలి.– శ్రీనివాస మాధవ్, ఆర్టీఐ పరిశోధకులు -
అన్నదాన మహిమ!
‘అన్నదానాత్పరం నాస్తి దానమన్యదిలాతలే.’ ఈ భూలోకంలో అన్నదానం కంటె గొప్ప దానం మరొకటి లేదు. నిత్యం అన్నదానం చేసే ఓ వ్యక్తి తన మరణానికి ముందు తన కుమారుణ్ణి పిలిచి, తాను చేసినట్లే అన్నదానం చేయాలని కోరాడు. తన దగ్గర అంతగా డబ్బులేని ఆ కుమా రుడు తన సమస్యను నారాయణునికి నివేదించడానికి బదరీకి బయలుదేరాడు.దారిలో ఒక పెద్ద మామిడి చెట్టు నిండా పండ్లు ఉన్నాయి. వాటిని ఎవరూ ముట్టుకున్న జాడ కనిపించలేదు. ఒక పాము ఎవరు ఎంత కొట్టినా తనకు చావు రావడంలేదని చెప్పింది. ఒక పొలం యజమాని తన పండిన పంట తనకు దక్కడం లేదని వాపోయాడు. తమ సమస్యలను బదరీ నారాయణునికి నివేదించమని కోరారు. దారిలో ఆకలితో ఒక బోయవాని ఇంటికి వెళితే బోయవాడు తన కోసం ఉంచుకున్న దుంపలను ఆ బాటసారికి ఇచ్చాడు. అతడి భార్యాపిల్లలు తమ దుంపలను ఇవ్వడానికి నిరాకరించారు. తెల్లవారే టప్పటికి ఓ పులి బోయవాణ్ణి, అతడి కుటుంబాన్ని చంపిన దృశ్యం చూశాడు.బదరీ వెళ్లి నారాయణునితో ముందుగా ఇతరుల సమస్యలే నివేదించాడు. అందుకా నారాయణుడు పూర్వ జన్మలో ఒక వేదపండితుడు ఎవరికీ వేద పాఠం చెప్పకుండా చనిపోయి ఈ జన్మలో ప్రయోజనం లేని పండ్ల చెట్టయి పుట్టాడనీ, ఇప్పుడు ఎవరికైనా వేదం చెబితే అతడి సమస్య తీరుతుందనీ చెప్పాడు. పాము పూర్వజన్మలో పెద్ద ఆస్తిగల పిసినారి అనీ, ఇప్పుడు తన మణి మాణిక్యాలకు కాపలా కాస్తూ పడివున్నదనీ, వాటిని ఎవరికైనా దానం చేస్తే సమస్య తీరుతుందనీ చెప్పాడు. పొలం యజమాని తన ముగ్గురు కూతుళ్ళకు కన్యాశుల్కం తీసుకున్నాడనీ, ఇప్పుడు నాలుగో కుమార్తెకు కన్యా శుల్కం తీసుకోకుండా పెళ్లి చేస్తే అతడి పంట చేతికి వస్తుందనీ చెప్పాడు. ఇక బోయవాని ఉదంతం తెలుసుకోవాలంటే ఇప్పుడే కాశీరాజుకు జన్మించిన కుమారుని వద్దకు వెళ్ళమన్నాడు.బాటసారి ఆ పసిబాలుని దగ్గరకు వెళ్లగా ‘నీకు ఆకలి వేసినప్పుడు దుంపలను ఆహారంగా ఇచ్చిన బోయవాడిని నేనే! తమవంతు ఆహారాన్ని పెట్టని నా భార్య, బిడ్డలు ఈ జన్మలో పందిపిల్లలుగా పుట్టారు’ అని చెప్పాడు. దీంతో అన్నదాన మహిమ అర్థమైన బాటసారి నారాయణుడు చెప్పిన పరిష్కార మార్గాలు రైతు, పాము, మామిడి చెట్టుకు చెప్పాడు. దీంతో, రైతు తన కుమార్తెను బాటసారికిచ్చి పెండ్లి చేశాడు. పాము తన సంపదనంతా అతడికే ఇచ్చింది. మామిడి చెట్టు రూపంలోని పండితుడు వేద పాఠం చెప్పాడు. అందరి సమస్యలను పరిష్కరించిన బాటసారి ధనం, విద్య, భార్యతో తల్లిని చేరి అన్నదానం ప్రారంభించి ధన్యుడయ్యాడు.- శ్రీ గణపతి సచ్చిదానందస్వామి -
ఆదాయపు పన్ను – అముఖ మదింపు
Faceless Assessment ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేసిన వారి రిటర్న్‌ల మదింపు ప్రక్రియ ఇప్పుడు కొనసాగుతున్నది. ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ చట్టబద్ధమైన తరవాత, ప్రభుత్వం ఎన్నో విధి విధానాలను మార్చేసింది. వాటిలో ఆదాయపు పన్ను అముఖ మదింపు (ఫేస్‌లెస్ అసెస్మెంట్) ఒకటి. ఇంతకు మునుపు ఆదాయపు పన్ను మదింపులు, పన్ను చెల్లింపుదారులు ఉండే ప్రదేశంలో నియమితులైన క్షేత్ర స్థాయి మదింపు అధికారుల పరిధిలో ఉండేది. ఆదాయపు పన్ను రిటర్న్‌లను పరిశీలించి, తేడాలుంటే వ్యక్తిగతంగా క్షేత్ర స్థాయి అధికారుల ముందు హాజరు కావాలని నోటీసులు ఇచ్చేవారు. సరిగ్గా ఇక్కడే అవినీతి జరిగే ఆస్కారముండేది.పన్ను మదింపులో విప్లవాత్మకమైన మార్పును చేస్తూ కేంద్ర ప్రభుత్వం పన్ను చెల్లింపుదారులకు, దేశ ఆర్థిక ప్రగతికి దోహదం చేసే సంస్కరణకు 2019లో శ్రీకారం చుట్టింది. ఈ ప్రక్రియలో పన్ను చెల్లింపుదారులకు ఏ అధికారి పన్ను మదింపు చేస్తున్నారో తెలి యదు. ఆ అధికారి కూడా కనిపించడు. ఇది కేవలం అముఖమదింపు మాత్రమే కాదు, ఈ ప్రక్రియలో భౌగోళిక పరిధి కూడా ఉండదు. ఇది ఒక విధంగా ‘జీరో ఎఫ్.ఐ.ఆర్.’ ప్రక్రియ లాంటిదే. ఆదాయపు పన్ను శాఖలో ‘నేషనల్ ఫేస్‌లెస్ అసెస్మెంట్ సెంటర్’ అనేది ఏర్పాటయ్యింది. ఈ కేంద్రం, కృత్రిమ మేధ సహాయంతో, పన్ను మదింపు అధికారుల బృందానికి పన్ను చెల్లింపుదారుల రిటర్న్‌లను పంపిస్తుంది. వారు ఆ రిటర్న్‌లను పరిశీలించి అభ్యంతరాలుంటే, తమ అభ్యంతరాలతో సహా నోటీసులను ఆదాయపు పన్ను వెబ్ సైట్లో అప్లోడ్ చేస్తారు. పన్ను చెల్లింపుదారులు ఆ నోటీసులకు సమాధానం, తమ వాదనకు రుజువుగా పత్రాలు, సాక్ష్యాలు మళ్లీ అదే వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. కోరితే, పన్ను చెల్లింపుదారులకు ఆన్లైన్లోనే వ్యక్తిగతంగా తమ వాదనలు విని పించే అవకాశాన్ని కూడా కల్పిస్తారు. మరింత సమయం కావాలన్నా, వాయిదా కావాలన్నా, ఇదే ప్రక్రియలో కోరవచ్చు. అంతే కాని, పన్ను చెల్లింపుదారులు మాటిమాటికి ఆదాయపు పన్ను కార్యాలయాలకు వెళ్లటం, రావడం అనే ప్రశ్నే ఉండదు. ఆ తరువాత పన్ను మదింపు అధికారుల బృందం– పత్రాలు, రుజువులు, వాదనలు పరిశీలించి తమ ఆదేశాలను ఎన్.ఎ. ఎఫ్.ఎ.సి. ద్వారా మళ్లీ అదే వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. జరిమానా ఏమైనా విధిస్తే, లేక పన్ను అసలే చెల్లించకపోతే లేదా మరింత పన్ను చెల్లించాలని ఆదేశిస్తే, వాటిని వసూలు చేయడానికి ఆ పన్ను చెల్లింపుదారుల దస్త్రాన్ని అప్పుడు భౌగోళిక పరిధిలో ఉన్న క్షేత్ర స్థాయి మదింపు అధికారులకు పంపిస్తారు. ఒకసారి మదింపు జరిగి ఆదేశాలు జారీ అయిన తరువాత వాటిని మార్చే అధికారం క్షేత్రస్థాయి అధికారులకు ఉండదు కనుక క్షేత్రస్థాయి అధికారులు అవినీతికి పాల్పడే అవకాశ ముండదు. క్షేత్రస్థాయి మదింపు అధికారులు, రికవరీ సర్టిఫికేట్ నియమాలను అనుసరించి, పన్ను వసూలు చర్యలు చేపడతారు. అదేవిధంగా, ఆ ఆదేశాలపై కమిషనర్ స్థాయిలో అప్పీల్ చేయాలన్నా ఇదే పద్ధతిలో ఆన్లైన్లో అప్పీల్ చేయాల్సి ఉంటుంది. పన్ను చెల్లింపుదారులకు సహాయంగా, ఆదాయపు పన్ను వెబ్సైట్లో ఈ అముఖ మదింపు విధానంలో పాల్గొనడానికి,ఆకళింపు చేసుకోవడానికి అన్ని సాంకేతిక వివరాలు విపులంగా పొందుపరచారు. ఈ ప్రక్రియ పారదర్శకమైనది. పన్ను చెల్లింపు దారులకు సౌకర్యవంతమే కాకుండా పన్ను మదింపు వేగవంతం అయింది. ఇది అవినీతిని రూపుమాపే దిశలో చాలా ప్రభావవంతమైన ఆధునీకరించిన సంస్కరణ. సాంకేతికతను ఉపయోగించి సాధించిన విశిష్టత. డిజిటల్ గవర్నెర్స్ లక్ష్య సాధనలో ఇదొక మైలు రాయి అని చెప్పడంలో సందేహంలేదు. – హరీష్ కుమార్ కొలిచెల అసిస్టెంట్ జనరల్ మేనేజర్ – లా (రిటైర్డ్), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా -
సేవల స్థానంలో వ్యాపారమా?
భారత తంతి తపాలకి ఘనమైన చరిత్ర ఉన్నది. పోస్ట్‌కార్డు, ఇన్లాండ్ కవరు, పోస్టల్ కవరు, రిజిస్టర్డ్ పోస్ట్ వంటి పలు సేవలు అందిస్తూ ఉన్నది. అతి తక్కువ చార్జీలకు పార్శిళ్ళు, దేశంలోని ప్రధాన పట్టణాలకి 24 గంటల్లో కవర్లు అందించే ‘స్పీడ్ పోస్ట్’ వ్యవస్థ కూడా అందుబాటులోకి తేవడంతో పోస్టాఫీసు లన్నీ రద్దీతో క్యూకట్టేవి. ఎంతోకాలంగా రిజిస్టర్డ్ పోస్ట్ ‘సేవ’లు అందిస్తున్న డిపార్ట్మెంట్ గత సంవత్సరం ఏకంగా దాన్ని రద్దు చేసేసింది. కేవలం 20 గ్రాముల కవరుకు ఐదు రూపాయలు, రిజిస్టర్డ్ చార్జీలు కలిపి 23 రూపాయ లుగా దేశం మొత్తం ఒకే విధానం ఉండేది. అదనంగా ఉన్న ప్రతి 20 గ్రాము లకు మరో 5 రూపాయలు వసూలు చేసే విధానం ఉండేది.అలాగే రచయితలు, ప్రచురణ కర్తలు ప్రచురించే సాహిత్య పుస్తకాలు ‘రిజిస్టర్డ్ ప్రింటెడ్ బుక్’, ‘రిజిస్టర్డ్ బుక్ పోస్ట్’ ద్వారా అతి తక్కువ ధరలో బట్వాడా చేసే సౌలభ్యం ఉండేది. కానీ గత ఏడాది రిజిస్టర్డ్ బుక్, రిజిస్టర్డ్ ప్రింటెడ్ బుక్, రిజిస్టర్డ్ లెటర్ అనేవి రద్దు చేసేసి రెండే రెండు విధానాలుగా... స్పీడ్ పోస్ట్, రిజిస్టర్డ్ పార్శిళ్ళను మాత్రమే ఉంచారు. కేవలం సుమారు రూ. 23 ఉండే రిజిస్టర్డ్ ప్రింటెడ్ బుక్, రిజిస్టర్డ్ బుక్‌పోస్ట్ తీసివేసి దాని స్థానంలో రిజిస్టర్డ్ పార్శిళ్లుగా 500 గ్రాముల లోపు రూ. 42; 1 కిలోకి రూ. 62గా పెంచారు.ఆ తరువాత పుస్తకాల కోసం ‘జ్ఞాన్ పోస్ట్’ పేరుతో ఒక విధానాన్ని తీసు కొచ్చారు. 300 గ్రాముల నుంచి 20 కిలోల వరకు జీఎస్టీతో కలిపి రూ. 24గా నిర్ణయించారు. ఇది ఉపయోగించాలంటే వ్యాపారంకాని ఉచితంగా పంపే పుస్తకాలై ఉండాలి. 300 గ్రాములలోపు బరువుండే పుస్తకాలకు అనుమతి లేదు. ఇప్పుడు ఆగస్ట్ 1 నుంచి రిజిస్టర్డ్ పార్శిళ్ల ధరను కూడా పెంచారు. 500 గ్రాములలోపు ధర గతంలో రూ. 42గా ఉండేదాని స్థానంలో లోకల్ రూ. 34, సొంత రాష్ట్రంలో రూ. 77, మెట్రో రూ. 82, ఇతర రాష్ట్రాలకు రూ. 84గా పెంచారు. జ్ఞాన్ పోస్ట్ ధర రూ. 20 నుంచి రూ. 30కి పెంచారు.ఒకప్పుడు ‘విద్యాసేవగా’ పరిగణించిన రిజిస్టర్డ్ ప్రింటెడ్ బుక్ సేవలకు ఇప్పుడు తిలోదకాలు ఇవ్వడం దేనికి సంకేతం? కేవలం రూ. 30 లేదా రూ.40 గల ఒక పుస్తకాన్ని పాఠకుడికి చేర్చాలంటే దాని ధర కంటే పోస్టల్ చార్జీలు అధి కంగా చెల్లించాల్సి రావడం చూస్తే... జ్ఞాన సంపదను ప్రజలకు చేర్చకుండా అడ్డుకట్ట వేయడం అనిపించడం లేదా? అందుకే ‘జ్ఞాన్ పోస్ట్’ ద్వారా అయినా పాఠకులకు తక్కువ ధరకు పంపే వెసులుబాటు కల్పించి, ఇప్పుడున్న 300 గ్రాముల విధానాన్ని, టారీఫ్‌ను సవరించితే రచయితలకు, ప్రచురణకర్తలకు మేలు జరుగుతుంది.– చలపాక ప్రకాష్, ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శిఇవి కూడా చదవండి: రేపటి పౌరులను ఇలాగేనా తీర్చిదిద్దేది? -
రేపటి పౌరులను ఇలాగేనా తీర్చిదిద్దేది?
నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో ప్రిన్సిపల్ రూపారెడ్డిని సొంత పాఠశాల విద్యార్థులే 27 సార్లు కత్తితో పొడిచి చంపిన దారుణం, అదే జిల్లా దేవరకొండలో ఉపాధ్యాయరాలిపై జరిగిన దాడి కేవలం వివిక్త సంఘటనలు కావు. 2012 ఫిబ్రవరి 9న చెన్నైలోని సెయింట్ మేరీస్ ఆంగ్లో–ఇండియన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో 9వతరగతి చదువుతున్న 15 ఏళ్ల విద్యార్థి క్లాస్ రూమ్‌లోనే సైన్స్ టీచర్ ఉమా మహేశ్వరిని పుస్తకంలో దాచి తెచ్చిన కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపిన ఉదంతం విద్యావ్యవస్థకే మచ్చగా మిగిలింది.అలాగే 2017 సెప్టెంబర్ 8న గురుగ్రామ్‌లోని ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్లో పరీక్షలు, పేరెంట్–టీచర్ మీటింగ్ వాయిదా పడాలనే వికృత ఉద్దేశంతో 11వ తరగతి విద్యార్థి ఏడేళ్ల 2వ తరగతి బాలుడు ప్రద్యుమన్ ఠాకూర్‌ను వాష్‌రూమ్‌లో గొంతుకోసి హత మార్చడం యావత్ దేశాన్ని స్తంభింపజేసింది. దీనికితోడు కోటా, హైదరాబాద్ వంటి నగరాల్లో మార్కులు తగ్గాయని ఏటా పదుల సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న విషాదాలు నేటి విద్యాసంక్షోభ తీవ్రతను స్పష్టం చేస్తున్నాయి.నేటి విద్యావ్యవస్థ జ్ఞానాన్ని, సంస్కారాన్ని అందించే కేంద్రంగా కాకుండా, కేవలం ర్యాంకులు, మార్కులను ఉత్పత్తి చేసే కర్మాగారంగా మారిపోయింది. కార్పొరేట్ భవనాలు, డిజిటల్ బోర్డులు, కోట్ల రూపాయల వ్యాపార ప్రచారాలకు ఇచ్చే ప్రాధాన్యత విద్యార్థుల మానసిక ఎదుగుదల, భావోద్వేగ స్థిరత్వం, నైతిక విలువలపై ఎవరూ పెట్టడం లేదు.జపాన్ ఉదాహరణజపాన్ వంటి దేశాల్లో ప్రాథమిక పాఠశాలల్లో మొదటి మూడేళ్లు ఎలాంటి మార్కుల పరీక్షలు లేకుండా కేవలం పరిశుభ్రత, సమాజం పట్ల బాధ్యత, పెద్దలను గౌరవించడం వంటి జీవన సూత్రాలను మాత్రమే నేర్పిస్తారు. కానీ మన దగ్గర ఐదేళ్ల ప్రాయం నుంచే ర్యాంకుల పోటీని నూరిపోస్తున్నాం. గెలవడం ఎలాగో నేర్పుతున్న చదువులు... ఓటమిని ఎలా తట్టుకోవాలో, కోపాన్ని ఎలా అదుపు చేసుకోవాలో, తోటి మనుషులను ఎలా ప్రేమించాలో నేర్పడంలో ఘోరంగా విఫలమవుతున్నాయి.ఈ విష సంస్కృతి మారాలంటే ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ఆలోచనా ధోరణిలో సమూల మార్పు రావాలి. ఉపాధ్యాయులు కేవలం సిలబస్ పూర్తి చేసే ఉద్యోగులుగా కాకుండా విద్యార్థుల మానసిక స్థితిని అర్థం చేసుకునే గురువులుగా నిలవాలి. గతంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి పిల్లల నడవడికను తీర్చిదిద్దేవారు. నేడు చిన్న పొర పాట్లకు కూడా పాఠశాలలపై దాడులకు దిగే తల్లిదండ్రుల ధోరణి పిల్లల్లో క్రమశిక్షణా రాహిత్యాన్ని పెంచుతోంది. పిల్లల డిజిటల్ స్క్రీన్ సమయం, సైబర్ స్నేహాలు, అలవాట్లను నిరంతరం గమనించడం ప్రతి తల్లిదండ్రుల ప్రాథమిక కర్తవ్యం.ప్రతి విద్యాసంస్థలో అర్హత కలిగిన మానసిక నిపుణులు, కౌన్సెలర్లను తప్పనిసరిగా నియమించి విద్యార్థుల్లో ఆకస్మిక ప్రవర్తనా మార్పులు, ఒంటరితనం, వ్యసనాలను ప్రారంభ దశలోనే గుర్తించాలి. వారానికి కనీసం రెండు పీరియడ్లను నైతిక విద్య, ప్రాథమిక జీవన నైపుణ్యాలు, భావో ద్వేగ సమతుల్యత నేర్పేందుకు కేటాయించాలి. వ్యాపార విద్య స్థానంలో విలువలతో కూడిన విద్యావిధానం వచ్చినప్పుడే ఇలాంటి నేర ప్రవృత్తులకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది.– డా. మేడా జగన్మోహనరావు, విద్యారంగ నిపుణులుఇవి కూడా చదవండి: ఏఐ యుగంలో గొప్ప ఆయుధం... విచక్షణ -
నిరసన ఒక మేలుకొలుపు
భారతదేశ సామాజిక, రాజకీయ గమనంలో యువత ఎల్లప్పుడూ అత్యంత ప్రభావవంత మైన శక్తిగా ఉంది. ఇటీ వల ‘జెన్ జీ’ ఆధ్వర్యంలో వెల్లువెత్తిన నిరసనలు, ఉద్యమాలు కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి ఒక తీవ్రమైన హెచ్చరిక లాంటివి. ప్రజాస్వామ్య వ్యవస్థలో పౌరుల నుంచి, ముఖ్యంగా యువ తరం నుంచి వచ్చే అసంతృప్తిని కేవలం తాత్కా లిక భావోద్వేగంగానో లేదా రాజకీయ ప్రత్యర్థుల ప్రేరేపిత చర్యగానో కొట్టిపారేయడం సరైన పని కాదు. అయినప్పటికీ, ఈ పరిణామాలను నిష్పా క్షికంగా విశ్లేషించుకునేందుకు ఎన్డీఏకు ఇది ఒక మంచి అవకాశంగా భావించవచ్చు. ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా కలిగిన దేశం భారత్. అయితే, యువత తమ భవిష్యత్తుపై ఆశావహ దృక్పథంతో, విశ్వాసంతో ఉన్నప్పుడు మాత్రమే ఈ జనాభా నిజమైన జాతీయ సంపదగా మారుతుంది. చదువు పూర్త యిన తర్వాత ఉద్యోగం దొరక్కపోవడం, కెరీర్ ఎదుగుదలలో స్తబ్ధత, ఆర్థిక అభద్రత వంటి సమస్యలతో యువత తీవ్ర అసంతృప్తిలో ఉంటే, ఆ జనాభా శక్తి నిరాశగా మారి సమాజంలో ఘర్షణలకు దారితీసే ప్రమాదం ఉంది. ‘ఈ నిరస నలను ఎవరు నడిపిస్తున్నారు?’ అని అన్వేషించడం కంటే, ‘యువత ఎందుకు ఇంత తీవ్ర అసంతృప్తితో ఉంది?’ అనే మూలకారణాన్ని వెత కడం అత్యంత ముఖ్యమైన విషయం.దేశంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం ఏ ప్రభుత్వానికైనా ఆచరణా త్మకంగా సాధ్యం కాదు. మిగిలిన మెజారిటీ యువత ప్రైవేటు రంగాలు, వ్యవసాయం, సేవా రంగం, వ్యాపారాలు లేదా స్వయం ఉపాధిపైనే ఆధారపడాల్సి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాల అసలైన బాధ్యత కేవలం కొన్ని ఉద్యోగ నోటిఫికే షన్లు ఇవ్వడానికే పరిమితం కాకూడదు. యువత తమ స్వశక్తితో ఉపాధిని సృష్టించుకునే ‘జాబ్ క్రియేటర్స్’గా ఎదిగే వ్యవస్థను సిద్ధం చేయాలి.ఇదీ చదవండి: యూపీలో సీనియర్ ఐఏఎస్ అధికారిణి రాజీనామా కలకలంఆచరణాత్మక చర్యలు పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు మార్కెట్ అవసరాలు, ఆధునిక ఉపాధి రంగా లపై స్పష్టమైన మార్గదర్శకత్వం అందించాలి. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ప్రాక్టికల్ నాలెడ్జ్, ఆధునిక సాంకేతిక శిక్షణ ఇవ్వాలి. కొత్తగా వ్యాపారాలు, స్టార్టప్‌లు ప్రారంభించే యువతకు ఎలాంటి పూచీకత్తు లేకుండా సులభంగా రుణాలు, సబ్సిడీలు అందేలా చూడాలి. భారత దేశ భవిష్యత్ పురోగతి మన విద్యా వ్యవస్థ నాణ్యతపైనే ఆధారపడి ఉంటుంది. ఉపాధ్యా యుల నియామకాలు, నాణ్యమైన శిక్షణ, పరిశో ధనలు, విద్యార్థులలో ఆచరణాత్మక అభ్యసన ఫలితాలు పెంపొందించడంపై పూర్తి దృష్టి పెట్టాలి. కేంద్రం ప్రవేశపెట్టిన జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) మంచి దిశానిర్దేశం చేసింది. చదువు పూర్తయ్యే సమయానికి విద్యార్థి ఉద్యోగా ర్థిగా కాకుండా, సమాజానికి విలువను చేకూర్చే సమర్థుడిగా మారేలా విద్యా వ్యవస్థ ఉండాలి.ఇదీ చదవండి: Nepal Flash Floods 1600 మందిని కాపాడిన ఒకే ఒక్కడు!నిరసనలు ఎదురైనప్పుడు పాలకులస్పందన సహనంతో, సమతుల్యతతో ఉండాలి. యువత కోపంతో ఉన్నప్పుడు వారి అసంతృప్తికి గల కారణాలను వినడం, ఆ శక్తిని సానుకూల దిశగా మళ్లించడం పరిపక్వ నాయకత్వ లక్షణం. ఏ ప్రజా ఉద్యమంలోనైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అసాంఘిక శక్తులు ప్రవేశించే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. విధ్వంసాలకు పాల్పడేవారిని, చట్టాన్ని ఉల్లంఘించే వ్యక్తులను పోలీసులు, దర్యాప్తు సంస్థలు పక్కా ఆధారాలతో గుర్తించి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలి. కానీ ఆ నెపంతో శాంతియుతంగా తమ ఆందోళ నలను, సమస్యలను ప్రభుత్వ దృష్టికి తెస్తున్న యువతపై విచక్షణారహితంగా చర్యలు తీసు కోవడం ప్రమాదకరం. న్యాయమైన అసమ్మతికి, నేరపూరిత కార్యకలాపాలకు మధ్య ఉన్న సన్నని గీతను పాలకులు, యంత్రాంగం గుర్తించాలి.2047 నాటికి భారతదేశాన్ని సంపూర్ణ అభి వృద్ధి చెందిన దేశంగా (వికసిత్ భారత్) తీర్చి దిద్దాలనే లక్ష్యానికి నేటి యువతే మూలస్తంభం. యువత విద్యావంతులైనప్పటికీ ఉద్యో గాలు లేక నిరాశతో ఉంటే, నైపుణ్యాలు ఉన్నా అవకాశాలు దక్కకపోతే ఈ మహత్తర లక్ష్యం కలగానే మిగిలి పోతుంది. అదే యువత నైపుణ్యాలు, ఆత్మ విశ్వాసం, పారిశ్రామిక దృక్పథంతో ముందుకు సాగితే దేశం అపూర్వమైన ప్రగతిని సాధిస్తుంది. ప్రభుత్వం యువతతో నిరంతర సంభాషణ ప్రారంభించి, వారి సమస్యలను వింటూ, విద్య, ఉపాధి వ్యవస్థలను సంస్కరించాలి. జెన్ జీ ఉద్య మాన్ని కేవలం రాజకీయ ముప్పుగా కాకుండా, వ్యవస్థను సరిదిద్దుకునే ఒక మేలుకొలుపుగా, సువర్ణావకాశంగా స్వీకరించి నప్పుడే బలమైన, సంపన్నమైన నవభారత నిర్మాణం సాధ్యమవుతుంది. -పి. వేణుగోపాల్ రెడ్డి ఏకలవ్య ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ -
ఏకాకివి కాదు – సమూహానివి!
ఏ ఇద్దరు మనుషులైనా తమ డీఎన్ఏలో 99.6 శాతాన్ని పంచు కుంటారు. మరో మనిషిపై సానుభూతిని నిరాకరించడం అంటే, తార్కికంగా చూస్తే, మనలోని 0.4 శాతం తేడాను ద్వేషించడమే.మనం ప్రత్యేకతను ఆరాధించే యుగంలో జీవిస్తున్నాం. ఇతరులకంటే మనం ఎలాభిన్నంగా ఉన్నామో చాటిచెప్పాలని ఆధునిక సంస్కృతి మనకు చెబుతోంది. అయితే, వ్యక్తిగత సామీప్యత అనే పరిమితిని పక్కనపెట్టి, మానవాళి మొత్తానికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని పరిశీలిస్తే పూర్తిగా భిన్నమైన చిత్రం ఆవిష్కృతమవుతుంది.మనం ఒకరినొకరం వేర్వేరు శిబిరాలుగా విభజించుకోవడానికి, పరస్పరం తగాదాలు పడటానికి కారణ మవుతున్న తేడాలు చాలావరకు మన వ్యక్తిగత అనుభవాల వల్ల ఏర్పడే భ్రమలే. ఆ వ్యక్తిగత సామీప్యతను శాస్త్రీయ, గణిత విశ్లేషణల ద్వారా పక్కకు తొల గిస్తే, ఈ భూమిపై ఉన్న 830 కోట్ల మంది అంతులేని వైవిధ్య సమూహంగా కనిపించరు. విశ్వవ్యాప్త మానవ స్వభావాన్ని ప్రతిబింబించే ఒకే ఒకసాంద్రమైన శిఖరానికి మనమంతా అత్యంత సమీపంగా ముడిపడి ఉన్నామని స్పష్టమవుతుంది.ప్రపంచవ్యాప్తంగా మనుషుల ఎత్తు, చర్మపు రంగులు, స్వభావాల్లో కనిపించే వైవిధ్యాన్ని చూసి, మనుషుల మధ్య లోతైన భేదాలు ఉన్నాయని భావించడం సహజం. కానీ జన్యుశాస్త్రం దీనికి మరింత భిన్నమైన కథను చెబుతోంది. ఆధునిక జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రకారం, భూమిపై ఉన్న ఏ ఇద్దరు మనుషుల జన్యు నిర్మాణమైనా సుమారు 99.6% నుంచి 99.9% వరకు ఒకేలా ఉంటుంది. మనలో కనిపించే ప్రతి శారీరక వైవిధ్యానికీ కారణం ఈ అత్యంత స్వల్పమైన తేడానే. మన మానసిక స్థితి, ప్రేరణలను నియంత్రించే న్యూరో ట్రాన్స్మిటర్లు, ఒత్తిడికి శరీరం స్పందించే విధానం, సామాజిక అనుబంధాలను నియంత్రించే హార్మోన్లకు సంబంధించిన జీవరసాయన రూపకల్పన మొత్తం మానవజాతిలో దాదాపు ఒకే విధంగా ఉంటుంది.సార్వత్రిక గ్రామం– సంస్థాగత సమన్వయంపిల్లల వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దేది కుటుంబంతో పాటు ఒక సామూహిక శక్తి– సామాజిక గ్రామం. శైశవం నుంచి యుక్తవయస్సు వరకు ప్రతి బిడ్డపై ప్రభావం చూపే అంశాల సమగ్ర వ్యవస్థను పరిశీలిస్తే, కుటుంబ, సామాజిక వలయం, పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, ఇంటర్నెట్, టెలి విజన్ సినిమాలు, ప్రపంచ వ్యాప్త మీడియా వంటి వ్యవస్థలు కనిపి స్తాయి. ఇవి సాంస్కృతిక సరి హద్దులు, కాలమాన ప్రాంతాలను దాటి ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తాయి.ఒక పిల్లవాడు లాస్ ఏంజెలిస్‌లో పెరిగినా, ముంబైలో పెరిగినా, సహకారం, పరస్పర సహకారం, నిజాయితీ, పట్టుదల, దూకుడును నియంత్రించుకోవడం వంటి ప్రాథమిక ప్రవర్తనలకు ఒకే విధమైన ప్రోత్సాహం, నిరుత్సాహం కలిగించే సంస్థాగత వ్యవస్థల గుండా ప్రయా ణిస్తుంది. పైకి కనిపించే సాంస్కృతిక భేదాలు నిజమే. కానీ వాటి అంత ర్లీన ప్రవర్తనా శిక్షణ మాత్రం ఒకే దిశగా పయనిస్తుంది.830 కోట్ల మంది వ్యక్తులు సమష్టిగా చూస్తే, ప్రాథమికంగా ఒకే విధమైన లక్షణాలను కలిగి ఉన్నారని గణాంకపరంగా ఎలా నిరూపించగలం? ఇందుకోసం ఒక ప్రపంచవ్యాప్త ఆలోచనా ప్రయోగాన్ని ఊహించు కుందాం. వేలాది మంది పాల్గొనేవారిని, తమకు బాగా పరిచయమున్న 100 మంది వ్యక్తుల పేర్లను చెప్పమని అడుగుదాం. ఆ తర్వాత ప్రతి వ్యక్తి స్వభావాన్ని 1 నుంచి 10 వరకు ఒక ప్రమాణంపై అంచనా వేయమని కోరుదాం. అలా కోట్లాది సంబంధాలతో అనుసంధానమైన ఒక భారీ మానవజాలం ఏర్పడుతుంది.ఇప్పుడు ఈ సమాచారాన్ని కంప్యూటర్‌కు అందిద్దాం. ఒక్కొక్కరి వ్యక్తిగత రేటింగ్లను విడిగా పరిగణనలోకి తీసుకోవడానికి బదులుగా, ఒక వ్యక్తికి అతని లేదా ఆమె మొత్తం సామాజిక వలయంలో లభించిన ప్రతి రేటింగ్‌ను కంప్యూటర్ సమీకరిస్తుంది. ఫలితంగా, వ్యక్తిగత పక్షపాతా లను సగటు చేసి తొలగించిన, ప్రతి వ్యక్తి సామాజిక స్థితికి సంబంధించిన మరింత వాస్తవికమైన అంచనా లభిస్తుంది. వేలాది మంది వ్యక్తులకు ఇలా పక్షపాతాలను సరిచేసి లెక్కించిన సగటు విలువలను గ్రాఫ్‌పై ఉంచితే, ఆ సమాచారం యాదృచ్ఛికంగా చెల్లాచెదురుగా కనిపించదు. అది ఒక స్పష్ట మైన గాసియన్ పంపిణీగా, అంటే గంట ఆకారంలో ఉండే ఒక వక్రరేఖగా రూపుదాల్చుతుంది. దాని అత్యంత సాంద్రమైన శిఖరం 6 లేదా 7కు సమీపంలో ఉంటుంది.ఇదీ చదవండి: Nepal Flash Floods 1600 మందిని కాపాడిన ఒకే ఒక్కడు!అత్యధిక మంది మనుషులు పూర్తిగా మంచివాళ్లూ కాదు, పూర్తిగా రాక్షసులూ కాదు. మనం సహజంగానే సగటు మనుషులం– బతకడానికి, ప్రేమించడానికి, ఇతరులతో అనుబంధం ఏర్పరచుకోవడానికి, సమూ హంలో మన స్థానాన్ని నిలబెట్టుకోవడానికి మన వంతు ప్రయత్నంచేస్తుంటాం. నిజమైన అత్యంత మంచి లేదా అత్యంత చెడు వ్యక్తులు మాత్రం ఈ వక్రరేఖకు ఇరువైపులా ఉండే పలుచని చివరి భాగాల్లో మాత్రమే కనిపిస్తారు. వారు గణాంకపరంగా అరుదైన మినహాయింపులు. సాధారణ నియమం మాత్రం కాదు.అవుట్‌లయర్ అనే భ్రమదైనందిన జీవితంలో మన మెదళ్లు సాధారణానికి భిన్నంగా ఉండే వ్యక్తులను గుర్తించేందుకు సహజంగానే ప్రయత్నిస్తుంటాయి. ఒక వ్యక్తితో జరిగిన ఒక్క చెడు అనుభవంతోనే అతడిని లేదా ఆమెను శాశ్వతంగా ప్రతినాయకుడిగా ముద్ర వేస్తాం. అలాగే, ఒకే ఒక్క వీరోచిత చర్యతో ఎవరినైనా అందుకోలేని స్థాయిలో ఉన్నత పీఠంపై కూర్చోబెడతాం. కానీ గణిత విశ్లేషణ ఈ భావనను వ్యక్తిగత సామీప్యత వల్ల కలిగే భ్రమగా బయటపెడుతుంది. మానవులందరి అభిప్రాయాలను కంప్యూటర్ సగటు చేసినప్పుడు, మనం భయపడే రాక్షసులూ, మనం ఆరాధించే మహనీ యులూ ఇద్దరూ గంట ఆకారపు వక్రరేఖలోని మధ్య భాగం వైపే లాగ బడతారు. గణాంక పరంగా చూస్తే, మనమంతా ఆ ఒకే సాంద్రమైన శిఖరం కిందనే ఉన్నాం. మనందరిలోనూ లోపాలున్నాయి; అదే సమయంలో మనం అందంగా అసంపూర్ణమైన మనుషులం.ఇదీ చదవండి: యూపీలో సీనియర్ ఐఏఎస్ అధికారిణి రాజీనామా కలకలంఇంతకు డేటా చెబుతున్నదేమిటి?ఈ తర్కం మూడు స్వతంత్ర దిశల నుంచి ఒకే నిర్ధారణకు చేరుకుంటుంది: జన్యుశాస్త్రం, సంస్థాగత సామాజిక శాస్త్రం, గణిత గణాంకాలు. ఏ ఇద్దరు మనుషులైనా తమ డీఎన్ఏలో 99.6 శాతాన్ని పంచుకుంటారు. మరో మనిషిపై సానుభూతిని నిరాకరించడం అంటే, తార్కికంగా చూస్తే, మనలోని 0.4 శాతం తేడాను ద్వేషించడమే. మరో సంస్కృతిని పరాయిదిగా చూడటం అంటే, డేటాను తప్పుగా అర్థం చేసుకోవడమే. జీవశాస్త్రపరంగా మనమంతా ఒకే తాళంలో ఉన్నాం. పరస్పరం ముడి పడిన సంస్థాగత వ్యవస్థల ద్వారా మనం రూపుదిద్దుకుంటున్నాం. మనల్ని మనం ప్రతిబింబించే కోట్లాది సూక్ష్మ ప్రతిరూపాల మనం మధ్య జీవిస్తున్నాం.అందువల్ల తార్కికంగా మనం చేరుకోవాల్సిన ఏకైక నిర్ధారణ: వారందరినీ ప్రేమించండి! మేడాపరమేశ్వర రెడ్డి వ్యాసకర్త రిటైర్డ్ ఇండియన్ అమెరికన్ శాస్త్రవేత్త; రెడ్డి సెంటర్ ఫర్ క్రిటికల్ అండ్ ఇంటిగ్రేటెడ్ థింకింగ్ డైరెక్టర్ -
మాతృభాషా? మార్కులా?
నేటి ఆధునిక విద్యా విధానంలో విద్యార్థి వికాసానికి ప్రధాన కూడలి ఇంటర్ విద్య. దీని ద్వారానే సాంకేతిక, వైద్య, బ్యాంకింగ్ రంగాలకు చెందిన నిష్ణాతులైన విద్యావంతులు తయారై ఆ యా రంగాలను సుసంపన్నం చేయగలరు. ఇంటర్ విద్య ఎంత కీలకమో అందులో ద్వితీయ భాష కూడా అంతే ప్రధానం. ఇంటర్ వ్యవస్థ ఏర్పడ్డప్పుడే మాతృభాషల వికాసమే లక్ష్యంగా విద్యార్థులు తమ తమ మాతృభాషలు ఎంపిక చేసుకొని చదువుకునే వెసులుబాటు కల్పిస్తూ తెలుగు, హిందీ, ఉర్దూ, అరబిక్, ఫ్రెంచ్, సంస్కృతం, ఆంగ్లం భాషలకు అవకాశం కల్పించారు. ‘మాతృభాష సంస్కృతి సాహిత్య వికాసాల వేదిక ద్వితీయ భాష’ అనే సూత్రంతో దీన్ని ఏర్పాటు చేశారు.ప్రస్తుతం ఇంటర్ విద్యార్థి మాతృభాషతో ప్రమేయం లేకుండా ‘తక్కువ నిడివి–స్వల్ప బోధన–అధిక మార్కులు’ అనే ఆధునిక సూత్రంతో కార్పొరేట్ కళాశాలలు నిర్బంధ సంస్కృత విద్యను అంటగడు తున్నాయి. ప్రభుత్వ కళాశాలల్లోనూ ద్వితీయ భాష మాతృభాష సూత్రం తుంగలో తొక్కి అడ్మిషన్లు పెంచు కోవడం వల్ల ద్వితీయ భాషగా తెలుగు చదివేవారి సంఖ్య రోజురోజుకు తగ్గిపోతుంది. ఎంతో పవిత్రమైన సంస్కృత భాషకు మనం ఎంత గౌరవం ఇస్తున్నాం? ప్రాథమిక తరగతుల్లో నేర్చుకోని సంస్కృతాన్ని రెండు సంవత్సరాల్లో ఎలా నేర్పగలం? అదేవిధంగా హిందీ చదివిన విద్యార్థులకు కనీసం చదవడం, రాయడం, మాట్లాడటం వస్తుందా? కేవలం మూల్యాంకనంలో అధిక పేపర్లు ఉండి అధిక మొత్తంలో పారితోషికం రావాలనే ఆశతో విద్యార్థుల భావి జీవితాలను భాషాపరంగా నాశనం చేయడం గౌరవప్రదమైన గురువులుగా మనకు తగునా?ఇంటర్ విద్యాభ్యాసం చేస్తున్న లక్షలాది మంది విద్యార్థుల్లో 80% విద్యార్థులు తెలుగు మాతృభాష కలవారే ఉన్నారు. అవసరార్థం ఆంగ్ల భాషలో విద్యాభ్యాసం చేస్తున్నా దాన్ని అర్థం చేసుకునేది మాత్రం వారి అమ్మ భాషలోనే. ద్వితీయ భాష తెలుగు పాఠ్యపుస్తకాలు మానవతా విలువలు, శతక సాహిత్యం, స్థానిక సంస్కృతి, సాంప్ర దాయాలు, రచయితలు, రచనలను పరిచయం చేస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచేలా ఉన్నాయి. ‘మన ప్రోత్సహం విద్యార్థి ఉన్నతికి ఉపకరించాలి తప్ప వినాశనానికి దోహదపడకూడదు’ అని గౌరవ ఉపన్యాసకులు తెలుసుకోవాలి. మూల్యాంకన కేంద్రాల్లో ఉన్నత స్థాయి అధికారులను నియమించి సూక్ష్మ పరిశీలన చేస్తే మూల్యాంకన విలువలు పెరుగుతాయి. అప్పుడే విద్యా లక్ష్యాలు నెరవేరతాయి. లేకపోతే భవిష్యత్తులో ఇంటర్ విద్యలో తెలుగు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది.– డా. అమ్మిన శ్రీనివాసరాజు. సీనియర్ తెలుగు ఉపన్యాసకులు(నేడు వ్యావహారిక భాషోద్యమ నాయకుడు గిడుగు రామమూర్తి పంతులు జయంతి)ఇవి కూడా చదవండి: నేడు నేపాల్... రేపు ఇండియా? -
ప్రేమ, సేవ, సత్యం.. ఆధ్యాత్మిక వికాసానికి ఇవే మెట్లు!
ఆధ్యాత్మిక వికాసం పట్ల ఆకర్షితులైన ఆలోచనపరుల ఆసక్తులు ఉన్నతంగా ఉంటుంటాయి. సకల సృష్టిపట్ల వారు ప్రేమతో వ్యవహరిస్తారు. సద్భక్త్యాసక్తితో తన చుట్టూ ఉన్న సాటివారిని, దూరస్తులైన సామాన్యు లనూ ఒకేలా ప్రేమిస్తారు.సామాజిక సేవ సంబంధిత పరిచర్యలకు తమ విలువైన సమయం కేటాయించడం, సత్క్రియలను చేతలలో చూపడం, మేలైన సాహిత్యం చదవడం, గాత్ర సంగీతం వినడం, సేంద్రియ తోటల పెంపకం, కొత్త భాషలు నేర్చుకోవడం, చిన్న పిల్లలకు తగు శ్రద్ధతో ఓపిక సహనం కలిగి అర్థవంతమైన రీతిలో పాఠాలు బోధించడం, బాధితులను ఓదార్చి వారిలో ధైర్యం నూరిపోయడం, పరిసరాల పరిశుభ్రతకు పూనుకొని పర్యావరణాన్ని కాపాడుకొనే ప్రయత్నాలు చేయడం, బృందపని సారథ్య సామార్థ్యం పట్ల అవగాహన పెంచడం వంటి అలవాట్లు, పనులు వీరిలో కనిపిస్తాయి.సత్యాన్ని ప్రేమించే అన్వేషకులు ఆత్మ సంబంధ జీవముతో వర్ధిల్లుతుంటారు. సత్య సంబంధ ఆత్మజ్ఞానం ఆత్మకు ఆహారం. ఇట్టి ఆహారం వలన జీవింపజేసేది, మనిషి ఉనికిని కాపాడుతుండేది ఆత్మే కాబట్టి ఆత్మ అభ్యున్నతి పట్ల శ్రద్ధ అవసరం. తెలిసిన కొద్దిపాటి సత్యంతోనే ఎదగడం ప్రారంభిస్తే, అనగా అట్టి సత్యానికి లోబడి జీవిస్తేనే మరింతగా సత్యములోనికి అడుగులు పడే అవకాశం మెండుగా ఉంటుంది. ఇలా ఆధ్యాత్మిక వికాసం వైపుగా ఒక్కో మెట్టు ఎక్కగలిగితే ఆధ్యాత్మిక భావ దారిద్య్రం నుండి విడిపించబడతాము.– జేతమ్ఇవి చదవండి: ధైర్యం వదిలేస్తే ఏం జరుగుతుంది? -
నేడు నేపాల్... రేపు ఇండియా?
హిమాలయాలు కోట్లాది ప్రజలకు జీవనాధారమైన నదులకు పుట్టినిల్లు. భారత ఉపఖండ వాతావరణం, వ్యవసాయం, జీవ వైవిధ్యం, ఆధ్యాత్మికతతో వాటికి విడదీయరాని సంబంధం ఉంది. కానీ నేడు మనిషి హిమాలయాలను ప్రకృతి వరంగా కాకుండా పర్యాటక కేంద్రంగా, రహదారి కారిడార్‌గా, విద్యుత్ ప్రాజెక్టుల ప్రాంతంగా, నిర్మాణాలకు అనువైన భూమిగా చూడటం మొదలు పెట్టాడు. మరోవైపు వాతావరణ మార్పుల ప్రభావం కూడా పెరుగు తోంది. ఫలితంగా నేపాల్–టిబెట్ సరిహద్దు హిమాలయప్రాంతంలో ఆగస్టు 26 లాంటి ఘోరవిపత్తులు సంభవిస్తున్నాయి. అభివృద్ధి కావాలి. కానీ హిమాలయాల మూల్యంతో కాదు. దేశ భద్రతకు రహదారులు అవసరం. స్థానిక ప్రజల ఆర్థికాభివృద్ధికి పర్యాటకం అవసరం. కానీ హిమాలయాలను మైదాన ప్రాంతాల మాదిరిగా చూస్తూ అభివృద్ధి చేయడం ప్రమాదకరం. కొండను తొలిచి రోడ్డు వేస్తాం. తవ్విన మట్టి, రాళ్లను పక్కనే వేస్తాం. నదీ తీరంలో హోటల్ కడతాం. పార్కింగ్ కోసం నదినే పూడ్చివేస్తాం. వాగులపై నిర్మాణాలు చేపడతాం. సహజ డ్రైనేజీలను మూసేస్తాం. ఆ తర్వాత భారీ వర్షం వస్తే మాత్రం దాన్ని ‘అనూహ్య ప్రకృతి విపత్తు’గా పేర్కొంటాం. ప్రకృతి అనూహ్యంగా ప్రవర్తించిందా? లేక ప్రకృతి హెచ్చరికలను మనమే పట్టించుకోలేదా?హిమాలయంలో రహదారి నిర్మాణం అంటే కేవలం కొండను తవ్వడం కాదు. కొండ స్థిరత్వం, నీటి సహజ ప్రవాహం, వర్షపు నీటి డ్రైనేజీ, దిగువ ప్రాంతాల భద్రత అన్నింటిపైనా ప్రభావంఉంటుంది. అందుకే ‘ఎన్ని కిలోమీటర్ల రోడ్డు నిర్మించాం?’ అన్నదే కాకుండా ‘ఎంత భూభాగం అస్థిరమైంది?’ అని కూడా ప్రశ్నించాలి. రోడ్డు ‘ఆల్ వెదర్’ కావచ్చు... హిమాలయం మాత్రం ‘ఆల్ వెదర్’ కాదు అనే విషయం గుర్తుంచుకోవాలి.కేదార్నాథ్ నుంచి జోషిమఠ్ వరకు...2013 కేదార్నాథ్ విషాదం హిమాలయాల సున్నితత్వాన్ని దేశా నికి స్పష్టంగా చూపించింది. నదీ లోయలు, వరద మైదానాలు, కొండచరియలు విరిగిపడే ప్రాంతాల్లో నిర్మాణాలపై హెచ్చరికలు వచ్చాయి. 2023లో జోషిమఠ్ భూమి కుంగుబాటు మరోసారి హెచ్చరించింది.హిమాలయాల్లో మరో పెద్ద సమస్య నదీ తీరాలు, వరద మైదానాల్లో పెరుగుతున్న నిర్మాణాలు. సహజ నదీ ప్రవాహప్రాంతం క్రమంగా కుంచించుకు పోతోంది. సాధారణ రోజుల్లో నది ప్రశాంతంగా ఉంటుంది. కానీ అసాధారణ వర్షం వచ్చినప్పుడు దాని పాత ప్రవాహ మార్గాలు తిరిగి జీవం పొందుతాయి. నది తన దారిని తిరిగి వెతుక్కుంటుంది. అందుకే నదీ గర్భం, వరద మైదా నాల్లో నిర్మాణాలకు కఠినమైన జోనింగ్ నిబంధనలు అవసరం.హిమాలయాలను రక్షించాలంటే అభివృద్ధిని పూర్తిగా ఆపాల్సిన అవసరం లేదు. అభివృద్ధి విధానాన్ని మార్చాలి. ప్రతి ప్రధాన తీర్థ, పర్యాటక ప్రాంతానికి శాస్త్రీయ క్యారీయింగ్ కెపాసిటీని నిర్ణయించాలి. నదుల వెంట, సహజ డ్రైనేజీలలో నిర్మాణాలను కఠినంగా నియంత్రించాలి. భారీ రోడ్డు, టన్నెల్, విద్యుత్ ప్రాజెక్టులకు పర్యా వరణ ముప్పు మదింపును తప్పనిసరి చేయాలి. కొండ తవ్వకాల వ్యర్థం నదుల్లోకి చేరకుండా పటిష్ట పర్యవేక్షణ ఉండాలి. స్థానిక ప్రజల అనుభవం, సంప్రదాయ జ్ఞానాన్ని విపత్తు నిర్వహణలో భాగం చేయాలి.హిమాలయాలను జయించలేం, గౌరవించాలి. ఎంత పెద్ద రోడ్డు వేసినా, ఎన్ని టన్నెళ్లు తవ్వినా, ఎన్ని హోటళ్లు కట్టినా, ఒక విరిగిన భారీ కొండచరియ ముందు మనిషి ఎంత చిన్నవాడోప్రకృతి నిరూపిస్తూనే ఉంటుంది. హిమాలయాలను మన అవసరా లకు తగ్గట్టు మార్చడం కాదు. మన అవసరాలను హిమాలయాల పరిమితులకు తగ్గట్టు మార్చుకోవాలి. అదే నిజమైన అభివృద్ధి.– శ్రీకాంత్ బందు ‘ సీనియర్ జర్నలిస్ట్ -
ఘర్షణ లేదు... పురోగతీ లేదు!
భారత్ ప్రస్తుతం దౌత్య వ్యవహారాల్లో తలమునకలై ఉంది. కిర్గిజ్స్తాన్లోని బిష్కెక్లో ఆగస్టు 31 నుంచి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీఓ) శిఖ రాగ్ర సమావేశాలు మొదలవుతున్నాయి. తర్వాత, ఢిల్లీలో సెప్టెంబర్ 12 నుంచి ‘బ్రిక్స్’ శిఖరాగ్ర సమావేశాలు జరగ నున్నాయి.మన జాతీయ భద్రతా సలహాదారు అజీత్ డోభాల్ ఆగస్టు 25న చైనా ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్, విదేశాంగ మంత్రి వాంగ్ యితో బీజింగ్‌లో చర్చలు జరిపారు. భారత్–చైనా సరిహద్దు వివాదంపై రెండు దేశాల ప్రత్యేక ప్రతి నిధుల 25వ దఫా సమావేశాలు చైనాలో జరిగాయి. రెండు దేశాలు మొదటి రోజున విడివిడిగా ప్రకటనలు చేశాయి. దాంతో ఏకాభి ప్రాయం కుదరనట్లుగా కనిపించింది. కానీ, ఆగస్టు 26న, ఎనిమిది అంశాలతో ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. ఏకీభావం ఎందులో?ద్వైపాక్షిక సహకారాన్ని విస్తరింపజేసుకోవడం, స్థిరత్వాన్ని కొనసాగించడం, శాంతి, ప్రశాంతతలకు భంగం వాటిల్లకుండా చూసుకొనే దిశగా ముందడుగు వేయాలని స్థూలంగా ఒక అభిప్రా యానికి వచ్చారు. సరిహద్దుల పునర్విభజనపై ‘వీలైనంత త్వరగా, గణనీయమైన ఫలితాలు’ సాధించేలా చర్చలు జరపాలనే సంకల్పం గురించి ప్రత్యేకించి పేర్కొన్నారు. సరిహద్దుకు రెండు వైపుల ప్రవహి స్తున్న నదుల గురించి సెప్టెంబర్‌లో మాట్లాడుకోవాలని నిర్ణయాని కొచ్చారు. సరిహద్దు గుండా సాగే వర్తకానికి వెసులుబాటు కల్పించు కోవాలనీ, సరిహద్దులో అదనంగా సమావేశ ప్రాంతాలు, హాట్ లైన్స్ ఏర్పాటు చేసుకోవాలనీ నిర్ణయించారు.భారత్–చైనా మధ్యనున్న 3,488 కిలోమీటర్ల నిడివి గల వాస్తవాధీన రేఖలో పునర్విభజనకు ఏయే రంగాలను ఎంచుకున్నదీ రెండు పక్షాలు వెల్లడించలేదు. భారత్–చైనా ప్రత్యేక ప్రతినిధుల తదుపరి దఫా సమావేశం మన దేశంలో 2027లో జరుగనుంది. గల్వాన్ ఘర్షణ (2020) తర్వాత, స్నేహ సంబంధాలను పటిష్ట పరచుకునేందుకు ఆమధ్య కాలంలో సాగిన ప్రయత్నాలకు కొనసాగింపుగా ఈ చర్చలు జరిగాయని భావించవచ్చు. కూటముల భిన్న లక్ష్యాలుభారత్ విషయానికొస్తే, ‘ఎస్సీఓ’, ‘బ్రిక్స్’ నెరవేర్చగల ప్రయోజనాలు భిన్నమైనవి. షాంఘై సహకార సంస్థలో భారత్– చైనాలతోపాటు రష్యా, పాకిస్తాన్, కజికిస్తాన్, కిర్గిజ్స్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇరాన్, బెలారస్ ఉన్నాయి. ఇది మొదట్లో ప్రాంతీయ భద్రత, కౌంటర్–టెర్రరిజంపైనే దృష్టి పెట్టింది. తర్వాత, ఆయా దేశాల మధ్య కనెక్టివిటీ, వాణిజ్య సంబంధాలకు విస్తరించి నప్పటికీ, ఈ సంస్థకు ఇప్పటికీ భద్రతే మూల బిందువు.బిష్కెక్ సమావేశంలో మనం సీమాంతర తీవ్రవాదం గురించి లేవనెత్తే అవకాశం ఉంది. సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించేదిగా ఉన్న చైనా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్లపై వెనక్కి తగ్గాలని కోరవచ్చు. మధ్య ఆసియా, రష్యా, చైనాలతో కలసి పనిచేయగల మార్గాలను అన్వేషించవచ్చు. ‘బ్రిక్స్’కు విస్తృత భౌగోళిక రాజకీయ ప్రాధాన్యం ఉంది. ప్రస్తుత అధ్యక్ష హోదాలో ‘బ్రిక్స్’ కూటమి నాయకుల 18వ శిఖరాగ్ర సమావేశాలకు మనమే ఆతిథేయిగా ఉన్నాం. ‘స్థితిస్థాపకత, నవీ కరణ, సహకారం, సుస్థిరత’లను ప్రధాన భావనగా చేసుకుని ఈ సమావేశాలు సెప్టెంబర్ 12–13 తేదీలలో జరుగనున్నాయి. రెండు వారాల వ్యవధి మాత్రమే ఉన్నప్పటికీ ఢిల్లీ సదస్సుకు జిన్‌పింగ్ హాజరవుతారని బీజింగ్ ఇంకా అధికారికంగా ప్రకటించ లేదు. కానీ, భారత్ ‘విజయవంతంగా’ ‘బ్రిక్స్’ సమావేశాలు నిర్వహించేందుకు అండగా ఉంటామని చైనా చెబుతోంది. బ్రెజిల్ శిఖరాగ్ర సదస్సుకు జిన్‌పింగ్ హాజరవబోవడం లేదని బీజింగ్ 2025 మొదట్లోనే ప్రక టించేసింది. ఇది నిష్క్రియాపరత్వం కాదు. ఆచితూచి వ్యవహరించే ధోరణి. హాజరయ్యే అంశాన్ని నాన్చడం వల్ల సరిహద్దు పునర్విభజన, వాణిజ్యం అంశాలపై బేరసారాలాడేందుకు బీజింగ్‌కు అవకాశం చిక్కుతుంది.పాతుకుపోయిన అపనమ్మకంబీజింగ్ రెండు నాల్కల ధోరణి ఢిల్లీని కలవరపరుస్తోంది. అది ఒక పక్క, ద్వైపాక్షిక సంబంధాలను ‘వ్యూహాత్మక, దీర్ఘకాలికదృక్పథం’తో చూస్తున్నామని చెబుతోంది. మరోపక్క, అరుణాచల్ ప్రదేశ్‌కు సంబంధించి కొత్త మ్యాప్‌లు విడుదల చేస్తోంది. వాస్తవాధీన రేఖపై అస్పష్టతను కొనసాగిస్తోంది. ఉగ్ర జాబితాలో చేర్చే విషయంలో ఐక్యరాజ్య సమితిలో మనకు అడ్డంపడుతోంది.ఢిల్లీ కూడా రెండు మార్గాల వైఖరిని కనబరుస్తోందని బీజింగ్ భావిస్తోంది. ‘క్వాడ్’ (ఆస్ట్రేలియా, ఇండియా, జపాన్, అమెరికా)తో సంబంధాలు బలపరచుకోవాలని చూస్తోంది. భారత్‌లో చైనాసంస్థల పెట్టుబడుల విషయంలో సవాలక్ష నిబంధనలనుముందుకు తెస్తోంది. భారత్ ఇలా సంశయించడానికి ఆర్థికఅంశాలు కారణమవుతున్నాయి. మన్మోహన్ సింగ్ ప్రధాని అయినపుడు 2003–04లో భారత్–చైనా వాణిజ్య లోటు కేవలం 1.1 బిలియన్ డాలర్లు. మొత్తం వాణిజ్యం 14 బిలియన్ డాలర్లకన్నా తక్కువే. చైనా 2008 నాటికి భారత్‌కు పెద్ద వాణిజ్య భాగస్వామిగా అవతరించింది. రెండు దేశాల మధ్య వాణిజ్యం సుమారుగా 38 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అది 2023–24 నాటికి 118.4 బిలియన్ డాలర్లను మించిపోయింది. 2024–25 నాటికి 127.7 బిలియన్ డాలర్లకు చేరుకుంది. చైనాతో వాణిజ్యం మాదిరిగానే దాని నుంచి దిగుమతులు కూడా మనకు ఎక్కువ అవుతున్నాయి. ఈ వాణిజ్య లోటు 2003–04లో 1 బిలియన్ డాలర్లుగా ఉండేది. అది 2023–24 నాటికి 85.07 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఒక్క ఏడాదిలోనే 17% పెరుగుదలను కనబరుస్తూ 2024–25లో 99.2 బిలియన్ డాలర్లకు చేరుకుంది. భారతదేశపు మొత్తం వాణిజ్య అసమతుల్యతలో చైనా వాటాయే ఇపుడు 35%. చైనా నుంచి మరో పెద్ద అలను తట్టుకోగల స్థితిలో భారత్ లేదు. చైనా వస్తువులపై అమెరికా సుంకాలు 245% ఉన్నాయి. దాంతో చైనా వస్తువులు మన దేశంలోకి మరింతగా వచ్చిపడే ప్రమాదం ఉంది. పైగా, అమెరికాతో వాణిజ్యాన్ని పెంపొందించుకుని, దాన్ని 2030 నాటికి 500 బిలియన్ డాలర్లకు చేర్చేందుకు ఢిల్లీ–వాషింగ్టన్ మధ్య చర్చలు సాగుతున్నాయి. భారత్ ఆత్మరక్షణ ధోరణిలో ఉంది. కనుక, ఎంతో యుక్తిని ప్రదర్శించవలసి ఉంటుంది. షాంఘై సంస్థలో సరిహద్దు, భద్రతా సమస్యలను లేవనెత్తాలి. ప్రపంచ బడుగు దేశాల వేదికగా ‘బ్రిక్స్’ను సజీవంగా ఉంచాలి. అదే సమయంలో, ఆర్థిక సంబంధాలు తెగి పోకుండా చూసుకోవాలి. ట్రంప్ 2026లో సృష్టించిన సంక్షోభం భారత్–చైనాలను ఎడమొహం పెడమొహం కాకుండా చేస్తోంది. అందుకనే, భారత్–చైనా ముంగిట ‘చారిత్రక అవకాశం’ ఉందని డోభాల్ వ్యాఖ్యానించారు. ఇతర విషయాల్లో ప్రగతిని సాధించే ముందు ‘సరిహద్దు సమస్యను సరైన విధంగా పరిష్కరించుకునేందుకు’ భారత్ సిద్ధంగా ఉందని చెప్పారు. చైనా విదేశాంగ మంత్రి యాంగ్ యి కూడా గత ఏడాదిగా రెండు పక్షాలు ‘క్షేత్ర స్థాయిలో ఫలితాలు చూపేందుకు కృషి చేశాయి. మంచి ప్రగతిని కనబరి చాయి’ అని వ్యాఖ్యానించారు. ప్రగతిని కనబరిచాయి అన్నారేగానీ, పురోగతి అనే పదాన్ని ఉపయోగించలేదు. సంపూర్ణ నమ్మకం లేక పోవడం వల్లనే పదాలను ఆచితూచి ప్రయోగిస్తున్నారు. రెండు దేశాలు ఘర్షణను కోరుకోవడం లేదు. గొప్పగా బేర సారాలు సాగించాలనే కోరిక ఇరువైపులా లేదు. పోటీని కొనసా గిస్తూ రావడమే ప్రస్తుతానికి చేయగలిగిన పని. రక్షణను చూసుకుంటూనే మిగిలిన పనులను చక్కబెట్టుకోవడం. ఇదీ భారత్–చైనా మధ్య సంబంధాల ప్రస్తుత స్థితి. రెండూ పరస్పర మిత్రదేశాలు కాదు. శత్రువులూ కాదు. ఒకరిని చూసి ఒకరు శాశ్వతంగా జంకే శక్తిమంతమైన దేశాలు. తదుపరి సంక్షోభం సంభవించకుండా నివారించడానికి చర్చలు జరుపుతూ ఉంటాయి. -వ్యాసకర్త రక్షణ వ్యవహారాల నిపుణుడు;‘సొసైటీ ఫర్ పాలసీ స్టడీస్ డైరెక్టర్’-సి. ఉదయ్ భాస్కర్ -
యువతను చేరుకోవడమే వ్యూహమా?
విశాఖపట్నం సమీపంలోని గుడిలోవలో ఆగస్టు 19 నుంచి 21 వరకు జరిగిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) మూడు రోజుల అఖిల భారత సమన్వయ సమావేశాన్ని సాధారణ వార్షిక సంస్థాగత సమావేశంగా మాత్రమే చూడటం సరిపోదు. ఈ సమా వేశంలో యువత, వ్యవస్థలోని లోపాలు, జంతర్ మంతర్ నిరస నలు, కుటుంబ వ్యవస్థ, పర్యావరణం, నైపుణ్యాభివృద్ధి, కృత్రిమ మేధస్సు వంటి అంశాలు చర్చకు రావడం ఆర్ఎస్ఎస్ భవిష్యత్ సామాజిక వ్యూహంలో మార్పులకు సంకేతంగా కనిపిస్తోంది.విద్యా వ్యవస్థలో లోపాలు, ప్రవేశ పరీక్షల అవకతవకలు, పేపర్ లీకులు, యువత భవిష్యత్తుపై ఆందోళన వంటి అంశాలతో ప్రారంభమైన జెన్–జీ ఉద్యమం దేశవ్యాప్తంగా పెద్దచర్చకు దారితీసింది. 49 రోజుల ఆందోళన అనంతరం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం, ప్రభుత్వం కొన్ని హామీలు ఇవ్వడంతో ఉద్యమం ముగిసింది. ఈ నేపథ్యంలో భవిష్యత్ ఎన్నికల రాజకీయాల్లో యువత శక్తిని ఏ రాజకీయ సంస్థ కూడా నిర్లక్ష్యం చేయలేదు.జంతర్ మంతర్ నిరసనలపై విలేఖరులు ప్రశ్నించినప్పుడు, ఆర్ఎస్ఎస్ దానిని కేవలం అవినీతి సమస్యగా చూడలేదు; వ్యవస్థ లోని లోపాలు, యువతలో భవిష్యత్తుపై ఏర్పడుతున్న ఆందోళన; ప్రభుత్వాలు, సమాజం కలిసి వ్యవస్థను సరిచేయాల్సిన అవసరం ఉందని సంఘ్ నాయకత్వం పేర్కొంది. విద్య, ఉద్యోగం, పోటీ పరీక్షలు, పరిపాలనా పారదర్శకత, అవినీతి, ధరలు, సామాజిక అవకాశాలు వంటి అనుభవాలు క్రమంగా యువతలో ప్రభు త్వంపై నమ్మకాన్ని నిర్మిస్తాయి లేదా దెబ్బతీస్తాయి. జంతర్ మంతర్ ఉద్యమం ఈ అసంతృప్తికి ఒక డిజిటల్ ముఖాన్ని చూపించింది.సోషల్ మీడియానే యుద్ధభూమిజంతర్ మంతర్ ఉద్యమం... నేటి రాజకీయ శక్తి కేవలం సభలు, ర్యాలీలు, పోస్టర్లు, సంప్రదాయ మీడియా ద్వారా నిర్ణయించబడదు, సామాజిక మాధ్యమాల్లో కథనాన్ని ఎవరు నిర్మిస్తారన్నది కూడా అంతే ముఖ్యం అనే విషయాన్ని స్పష్టం చేసింది. జనరేషన్ జెడ్ రాజకీయ చైతన్యం చాలా వరకు డిజిటల్ ప్రపంచంలో పెరుగుతోంది. వ్యంగ్యం, మీమ్స్, చిన్న వీడియోలు, ప్రత్యక్ష ప్రసా రాలు, వ్యక్తిగత కథనాలు– ఇవి యువతను సంప్రదాయ రాజకీయ ప్రసంగాల కంటే వేగంగా ప్రభావితం చేస్తున్నాయి. అందుకే ఆర్ఎస్ఎస్ యువతతో ‘నిరంతర సంబంధం’ గురించి మాట్లా డటం, సాంకేతికతపై ప్రత్యేకంగా చర్చించడం యాదృచ్ఛికం కాదు.ఆర్ఎస్ఎస్ రాజకీయ పార్టీ కాదు. ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీ చేయదు. అయినప్పటికీ బీజేపీతో దాని సైద్ధాంతిక, సంస్థాగత సంబంధాల కారణంగా సంఘ్ సమాజంలో చేపట్టే కార్యాచరణకు ఎన్నికల రాజకీయాలపై పరోక్ష ప్రభావం ఉండటం సహజం. అందుకే విశాఖ సమావేశాన్ని బీజేపీ భవిష్యత్ ఎన్నికల వ్యూహానికి కూడా ఒక సూచికగా చూడవచ్చు.ఇకపై సంఘ్ ముందున్న అసలు పరీక్ష యువతకు హిందు త్వాన్ని వివరించడం కాదు; యువత ఎదుర్కొంటున్న వాస్తవ సమస్యలకు హిందుత్వ–సనాతన ధర్మ భావజాలం ఏ సమాధానం ఇస్తుందో చూపించడం. ఉపాధి, విద్య, అవినీతి, సాంకేతిక మార్పు, పర్యావరణం, సామాజిక సామరస్యం, కుటుంబ విలువలు ఈ అంశాలపై ఆచరణాత్మక పరిష్కారాలను చూపగలిగితే సంఘ్ తన సామాజిక ప్రభావాన్ని మరింత విస్తరించగలదు. అలా చేయలేక పోతే, కేవలం సిద్ధాంతపరమైన ప్రచారం కొత్తతరాన్ని ఆకర్షించక పోవచ్చు. విశాఖ సమన్వయ సమావేశం అందుకే ఒక సాధారణ వార్షిక సమావేశం కాదు. ఇది ఆర్ఎస్ఎస్ తన శతాబ్ది అనంతర దశలో ‘సమాజాన్ని ఎలా చేరుకోవాలి?’ అనే ప్రశ్నకు వెతుకుతున్న సమాధానానికి ఒక ముఖ్యమైన అధ్యాయం.– సీహెచ్.వి.ప్రభాకర్ రావు, సీనియర్ జర్నలిస్ట్ -
జాగృత శక్తి! ఆరు చక్రాల రహస్యమేంటి?
రాజయోగలో యమ, నియమ, ఆసనాదులను గూర్చి చెబుతారు. అందులోనే కుండలిని గూర్చి ఉంటుంది. ప్రతి మనిషిలో ఆరు చక్రాలుంటాయనీ, ఆ చక్రాల్లో అట్టడుగున ఉన్న మూలాధార చక్రంలో కుండలిని ఉంటుందనీ, యోగాభ్యాసం ద్వారా దాన్ని క్రమంగా పైనున్న చక్రాలకు తీసుకపోవాలనీ చెబుతారు. యోగాన్ని అత్యంత శ్రద్ధతో అభ్యసించిన విశ్వమాత కృష్ణాబాయి ఇలా చెబుతారు:కుండలిని మూలాధార చక్రములో నిద్రాణమై ఉంటుంది. అప్పుడా వ్యక్తి దృక్పథం కేవలం భౌతికంగా ఉంటుంది. ఒక మహాత్ముని సంపర్కం వల్ల ఆ కుండలిని జాగృతమై దాని పై కేంద్రానికి చేరుతుంది. ఆ వ్యక్తికి అప్పుడు ధార్మిక జీవనం గడపాలనే ఆకాంక్ష కలుగుతుంది. కుండలిని పై కేంద్రానికి చేరుతుంది. అతడు అంత కంతకూ సత్సంగం, దేవాలయ సందర్శనను కోరుతాడు. కుండలిని ‘అనాహత’ అను నాల్గవ కేంద్రాన్ని చేరుతుంది. అప్పుడా వ్యక్తి గురువును తన ఆత్మీయునిగా భావిస్తాడు. అతని దృష్టిని ఆ భావన విస్తరింప చేస్తుంది.ఆ శక్తి (కుండలిని) విశుద్ధమనే అయిదవ చక్రాన్ని చేరినపుడు గురువు అవ్యక్త స్థితిని తెలుసుకుంటాడు. గురువుని గూర్చి, లేక ఆ భగవంతుని స్థితిని గూర్చి అధికంగా మాట్లాడుతాడు. తర్వాత కుండలిని పై చక్రమైన ఆజ్ఞాచక్రాన్ని చేరుతుంది. అప్పుడు ఆ సాధకునకు భగవద్దర్శనమై అతని మనస్సు క్రమంగా అవ్యక్తస్థితి వైపు ఆకర్షితమవుతుంది. అక్కడే అతనికి కొన్ని సిద్ధులు అబ్బుతాయి. అతడు వాటికి లోబడితే పతనమవుతాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.బయటి నుండి గురువు సాధకుణ్ణి ఈ కేంద్రం వరకు మాత్రమే ప్రేరేపించగలడు. దీని తరువాత హృదయంలో ఉన్న గురువునుండి మార్గదర్శనం వస్తుంది (పుటలు 81, 82 – విశ్వమాత కృష్ణాబాయి – ఆనందా శ్రమం, కేరళం). ఆమె అంతవరకే చెప్పి తన గురువైన రామదాసు కృపవల్ల తనకు ఆజ్ఞా చక్రం నుండి కుండలిని అధికమైన వేగంతో మెరుపును మించిన కాంతితోను పైకి పోయిందనీ, తనకు అనిర్వచనీయమైన ఆనందం కలిగిందనీ అంతకుమించి ఇక ఏమీ చెప్పజాలననీ అంటారు.– రాచమడుగు శ్రీనివాసులు -
మోయకూడని బరువు..
ఒక వ్యక్తి, ఒక ముని వద్దకు వచ్చాడు. ‘అయ్యా! ఈ భారాన్ని, భయాన్ని నేను భరించ లేకపోతున్నాను. నాకు విముక్తి ప్రసాదించండి’ అని ఆవేదన చెందాడు. ముని అతనితో ‘సరే, నీకు దారి చెబుతాను. దానికి ముందు, ఈ దారిలో ఉన్న రెండు పెద్ద రాళ్లను నీ రెండు చేతుల్లో పట్టుకుని, ఈ తోట చుట్టూ ఐదు సార్లు ప్రదక్షిణ చేసి రా’ అన్నాడు.అతను రెండు చేతుల్లో రాళ్లను ఎత్తుకుని నడవటం ప్రారంభించాడు. మొదటి చుట్టులోనే చేతులు వణికి పోయాయి. రెండో చుట్టులో నరాలు ఉబ్బిపోయాయి. మూడో చుట్టులో నొప్పితో అరిచాడు. నాలుగో చుట్టులో ‘గురుదేవా, నా వల్ల కావడం లేదు. చేతులు పడిపోతున్నాయి, నా ప్రాణం పోతోంది’ అన్నాడు. ముని ప్రశాంతంగా, ‘అయితే, ఆ రాళ్లను కింద పడేయ్’ అన్నాడు. అతను వెంటనే ఆ రెండు రాళ్లను కింద పడేశాడు. మరుక్షణమే, అతని చేతుల్లో భారం తగ్గి, శరీరమూ మనస్సూ తేలికపడినట్లు అనిపించింది. హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు.‘రాళ్లను పట్టుకుని నొప్పితో అరిచిందీ నువ్వే, వాటిని కింద పడేసి ప్రశాంతతను పొందిందీ నువ్వే. రాళ్లు నిన్ను బలవంతం చేసి నీ చేతులకు అతుక్కున్నాయా? నువ్వే వాటిని పట్టుకున్నావు కదా. అలాగే నీ గత జ్ఞాపకాలు, భవిష్యత్తు భయాలు కూడా. గడిచిపోయిన కాలం ఎప్పుడో ముగిసిపోయింది, రాబోయే కాలం ఇంకా రాలేదు. రాళ్లను కింద పడేయడానికి నీకు ఎవరి అనుమతి అవసరం లేదు కదా? అలాగే నిన్ను గాయపరిచే జ్ఞాపకాలను, అనవసరమైన భారాన్ని మనస్సు నుంచి వదిలేయడం నీ చేతుల్లోనే ఉంది’ అని వివరించాడు ముని.– యామిజాల జగదీశ్ -
దిమాగీ నక్సల్ అంటే మాకు మెదడు ఉన్నట్టే కదా!
ప్రశ్న: ముందుగా, ఇటీవలి కాలంలోని అత్యంత విజయవంత మైన, దేశానికి కొత్త ఆశను కల్పించిన ఉద్యమంలో నాయకత్వ పాత్ర పోషించినందుకు అభినందనలు. గత రెండు దశాబ్దాలుగా సమాజాన్ని ఆవరించిన భయోత్పాత వాతావరణాన్ని ఈ ఉద్యమం కొంతవరకు తొలగించగలిగింది. అందుకు మరిన్ని అభినందనలు. ఇప్పుడు ప్రశ్నల్లోకి వెళ్దాం. జంతర్ మంతర్ నుంచి దేశవ్యాప్త పర్యటన ఎందుకు?ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం దేశవ్యాప్తంగా జరుగుతున్న విద్యార్థి ఉద్యమాలకు సంఘీభావం ప్రకటించడం. జార్ఖండ్‌లో విద్యార్థులు జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ పరీక్షలను రద్దు చేయాలని ఉద్యమిస్తున్నారు. అందుకే రాంచీ వెళ్లాం. కోల్‌కతాలో ఐఎస్ఐ విద్యార్థులు తమ విద్యాసంస్థ స్వయంప్రతిపత్తిని దెబ్బతీసే బిల్లుకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. అందుకే అక్కడికి వెళ్లాం. తర్వాత జైపూర్ వెళ్లాం. రాజస్థాన్ పేపర్ లీక్‌లకు కేంద్రంగా మారింది. ప్రైవేట్ కోచింగ్ మాఫియా అక్కడ పెద్ద సమస్య. విద్యా వ్యవస్థ ఒత్తిడి వల్ల విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు అక్కడ కనిపిస్తున్నాయి. హైదరాబాదులో ఏబీవీపీ హింసకు వ్యతి రేకంగా కొంతమంది విద్యార్థులు పోరాడుతున్నారు. సీజేఐని కాన్వొకేషన్‌కు ఆహ్వానించడాన్ని వ్యతిరేకిస్తే తమను బార్లో నమోదు చేయబోమని బెదిరించే పరిస్థితి ఉంది. దేశవ్యాప్తంగా విద్యార్థి ఉద్యమాలు జరుగుతున్నాయి. మేము వారితో కలిసి పోరాడుతున్నాం.జంతర్ మంతర్ ఉద్యమం ఎలాంటి పాఠాలు నేర్పింది?ఆ ఉద్యమం విజయం సాధించడానికి ప్రధాన కారణం మేము సంఘటితంగా ఉండటం. అందుకే ఎక్కడ విద్యార్థులు పోరాడు తున్నా వారు కూడా సంఘటితం కావాలి. అధికార ధోరణులను, నిరంకుశ శక్తులను నిజంగా ఎదుర్కోవాలంటే కలిసి రావాలి, తమను తాము చైతన్యపరుచుకోవాలి.మీ తక్షణ లక్ష్యం ఏమిటి?ప్రత్యేకంగా ఏమీ లేదు. వీలైనంత ఎక్కువమంది విద్యార్థులను సంఘటితం చేయడం, రాజకీయాల్లోకి తీసుకుని రావడం, నిజమైన శక్తి ఐక్యతలోనే ఉందని అర్థమయ్యేలా చేయడం– ఇవే మా లక్ష్యాలు. నాణ్యమైన విద్య కోసం, విద్యార్థుల మెరుగైన భవిష్యత్తు కోసం పోరాడాలి.జంతర్ మంతర్‌లో మూడు భిన్నమైన స్రవంతులు ఒకే వేదిక పైకి వచ్చాయి. ఇక భవిష్యత్తు?మేమంతా కలిసి కొత్త సంస్థ ఏర్పాటు చేయబోవడం లేదు. నేను ఏఐఎస్‌ఏలో భాగం. అదే నా సంస్థ. అభిజీత్ దీప్కే సీజేపీలో భాగం. అదే ఆయన సంస్థ. సోనమ్ వాంగ్‌చుక్ స్వతంత్ర వ్యక్తి. ఆయన సొంత అభిప్రాయాలు ఆయనకు ఉన్నాయి. అయితే ఉమ్మడి సమస్యలు ఉంటే విద్యార్థుల కోసం, దేశంలోని యువత కోసం మేము ఒక ఐక్య వేదిక ద్వారా కలిసి పోరాడవచ్చు.మీరు మెయిన్ స్ట్రీమ్ రాజకీయాల్లోకి వస్తారా?మెయిన్‌స్ట్రీమ్ రాజకీయాలపై నా అవగాహన భిన్నంగా ఉంటుంది. నేను వామపక్ష భావజాలం నుంచి వచ్చాను. ప్రధాన స్రవంతి రాజకీయాలను ఆదర్శ రాజకీయాలుగా మేము చూడం. కాబట్టి నేను ఆ రాజకీయాల్లో చేరను. నేను రాజకీయాల్లోనే ఉన్నాను – నాకు సాధ్యమైనంత లోతుగా. నా భావజాలాన్ని కొనసాగిస్తాను. ప్రధాన స్రవంతి రాజకీయ పార్టీలు తమ రాజకీయాలను కొనసాగించవచ్చు.మోదీ అంటించిన ‘దిమాగీ నక్సల్’ లేబుల్‌పై మీ స్పందన?అది ఏమాత్రం ప్రభావం లేని పదం. ప్రజలను చెడ్డవారిగా చిత్రీకరించడానికి, వారిని నిరుత్సాహపరచడానికి, వారి మనో ధైర్యాన్ని దెబ్బతీయడానికి కొత్త కొత్త పదాలను సృష్టిస్తున్నారు. ‘దిమాగీ నక్సల్’ అనేది ఒక జోక్ మాత్రమే. అందరూ నరేంద్ర మోదీని ఉద్దేశించి రకరకాల వ్యంగ్య నినాదాలు ఇస్తున్నారు. ఆయన కూడా ‘నేనూ ఏదైనా కొత్త పదం కనిపెట్టాలి’ అనుకుని ‘దిమాగీ నక్సల్’ అనే పదాన్ని తీసుకొచ్చినట్టుంది. కానీ ఇందులో మరో విషయం ఉంది. ‘దిమాగీ నక్సల్’ అంటే మనందరికీ మెదడు ఉంది. మనకు ఆలోచించే శక్తి ఉంది. మనం ఏమి ఆలోచిస్తున్నామో చెప్పడానికి టెలీప్రాంప్టర్ అవసరం లేదు. సామాన్య ప్రజలకు అర్థం కాని భాషలో మాట్లాడే ఇన్స్టాగ్రామ్ ప్రపంచం కూడా మనకు అవసరం లేదు. ప్రజలతో స్నేహంగా ఉండాల్సింది పోయి, వారి నుంచి పూర్తిగా దూరమయ్యే భాష మనకు అవసరం లేదు. కాబట్టి ‘దిమాగీ నక్సల్స్’ అని పిలిస్తే పిలవనివ్వండి!– డానీ, సమాజ విశ్లేషకులు -
ఇది లా విద్యార్థుల హక్కుల ధిక్కరణే!
రాజ్యాంగం ప్రకారం న్యాయవ్యవస్థ అత్యంత స్వతంత్రంగా పని చేయాలి. పౌరహక్కులకు, స్వేచ్ఛకు భంగం కలిగినప్పుడు న్యాయ వ్యవస్థ రక్షణ కవచంగా ఉండాలి. అందుకోసమే రాజ్యాంగ నిర్మాతలు న్యాయవ్యవస్థకు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించారు. దేశంలోని న్యాయవ్యవస్థకు గౌరవం, ప్రజలలో నమ్మకం కలగడానికి న్యాయవాదుల పాత్ర, కృషి, నిబద్ధత విస్మరించరానివి.అలాంటి న్యాయవాదులను తయారుచేసే నల్సర్ విశ్వవిద్యా లయం విద్యార్థులు తమ ఉపకులపతి, రిజిస్ట్రార్లకు ఒక లేఖ రాశారు. తమ స్నాతకోత్సవానికి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌ను ముఖ్యఅతిథిగా ఆహ్వానించే అంశాన్ని పునః పరిశీలించాలని అందులో కోరారు. స్నాతకోత్సవ తేదీ ఇంకా ఖరారు కాలేదు, ముఖ్య అతిథి ఎంపిక కూడా తుది దశకు రాలేదని తమకు తెలుసునని చెబుతూనే అధికారిక నిర్ణయం తీసుకునే ముందు తమ అభిప్రాయాన్ని వినాలని కోరారు. విద్యార్థులు స్నాతకోత్సవాన్ని బహిష్కరిస్తామని చెప్పలేదు, న్యాయవ్యవస్థను తిరస్కరించలేదు, న్యాయమూర్తి తీర్పులన్నింటినీ ప్రశ్నించలేదు. విద్యార్థుల అభ్యంతరం, ఆవేదన... ఒక నిర్దిష్ట సందర్భంలో న్యాయవ్యవస్థ ప్రవర్తించిన తీరుపై మాత్రమే. కానీ విద్యార్థులు ప్రశ్నించారనే కారణంతో వారి గొంతును నొక్కివేయడం ప్రజాస్వామ్య పద్ధతి కాదు.న్యాయ విద్య అంటే సెక్షన్లు బట్టీ పట్టడం, కోర్టులో వాదించడం మాత్రమే కాదు. న్యాయ విద్య అంటే అధికారాన్ని ప్రశ్నించడం, బలహీనుడి పక్షాన నిలబడటం, అన్యాయాలకు గురైనవారి వెంట, పౌర హక్కులకు దూరమైనవారి వెంట నిలబడి రాజ్యాంగాన్ని కాపాడటం కూడా. ప్రజాస్వామ్యానికి ప్రశ్నలు ప్రమాదకరం కాదు, ప్రశ్నలకు సమాధానాలు లేకపోవడం ప్రమాదం. న్యాయవ్యవస్థను బలహీనపరిచేది విమర్శ కాదు, న్యాయవ్యవస్థపై విమర్శ వినే ఓపిక లేకపోవడమే ప్రమాదకరం.ఆ అధికారం ఎక్కడిది?బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు లా విద్యార్థులపై ఎటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకునే అధికార పరిధి లేదు. విద్యార్థుల ప్రవర్తన కోర్టు ధిక్కరణ చర్య కానీ లేదా దేశ చట్టాల ఉల్లంఘన కానీ కానే కాదు. కొందరు విద్యార్థులు ఒక ప్రముఖుడు తమ స్నాతకోత్స వంలో భాగం పంచుకోవడాన్ని వ్యతిరేకిస్తూ చేసిన శాంతియుత ప్రాతినిధ్యం ఆధారంగా పట్టభద్రులవుతున్న వారిని బార్ కౌన్సిల్స్‌లో నమోదు చేసుకోవద్దని నిషేధం విధించడం కరెక్టు కాదు. తమ సొంత కాన్వొకేషన్ కొరకు ముఖ్య అతిథి ఎంపికపై విద్యార్థులు అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం తప్పెలా అవుతుంది?బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు... బార్ స్వతంత్రతను, సమగ్రతను పరిరక్షించడం ప్రాథమిక బాధ్యత. బార్ కౌన్సిల్ చైర్మన్ చేసిన ఈ చర్య అప్రజాస్వామికం. నిషేధాన్ని వెనక్కి తీసుకుని, చైర్మన్ ఇప్పటికే క్షమాపణ చెప్పినప్పటికీ ఆయనపై అధికారిక విచారణ చేపట్టాలి. తక్షణమే ఆయనను తొలగించాలి. నల్సర్ విద్యార్థులు సహజ న్యాయం గురించి చదివారు. అలాగే రాజ్యాంగానికి అతీతమైన అధికారం ఏదీ లేదని నల్సార్లోనే వారికి బోధించారు. ఈ జ్ఞానంతోనే విద్యార్థులు తమ సొంత సంస్థకు హేతుబద్ధమైన లేఖ రాసి బెదిరింపులకు గురికావడం బాధాకరం. ప్రజాస్వామ్యానికి అవసరమైనది అంధభక్తి కాదు, సంస్థలను గౌరవిస్తూనే వాటిని ప్రశ్నించే సంస్కృతి కావాలి. ప్రజాస్వామ్యంలో గౌరవమంటే జవాబుదారితనం నుంచి మినహాయింపు కాదనేది అర్థం చేసుకోవాలి.– దిగుపాటి రాజగోపాల్ ‘ ఏఐఎల్యూ ఏపీ గౌరవ అధ్యక్షులు -
దోమా! ఇది నీకు తగునా!!
‘సాయంత్రానికి ఇంటిలోకి చేరతావు, ఏదో ఒక మూలనుంటావు. నేను ప్రేమించే వెలుతురుని ద్వేషిస్తావు, నేను ద్వేషించే చీకటిని ప్రేమిస్తావు. రాత్రంతా నాకోసం మేల్కొని ఉంటావు, టైము దొరికితే కాటేస్తావు. మనది మనది ఒకటే రక్తం అంటావు, నా రక్తాన్నే తాగుతావు. కొన్ని రోజులే బతుకుతావు, కానీ నన్ను రోజూ చంపుతావు. రోగక్రిమి లేకపోతే మిత్రుడు, ఉంటే శత్రువు.’సంవత్సరానికి పదిలక్షల పైచిలుకు మరణాలతో, మానవ మరణాలకు కారణమయ్యే జీవుల్లో దోమ మొదటిస్థానం ఆక్రమిస్తుంది. 1897 ఆగస్టు 20న సర్ రోనాల్డ్ రాస్ మలేరియా క్రిముల్ని దోమలో చూసి, మలే రియా వ్యాధి వ్యాప్తికి కారణం దోమ అని నిర్ధారించారు. అందుకే ప్రతి సంవత్సరం ఆగస్టు 20న ‘ప్రపంచ దోమ రోజు’ జరుపుతున్నారు. ఈ సందర్భంగా దోమల గురించిన కొన్ని వాస్తవాలు:దోమలు 112 జాతులతో 3,541 తెగలతో భూగోళమంతా వ్యాపించి ఉన్నాయి. వాటిలో 50 జాతులు, 404 తెగలు భారతదేశంలో ఉన్నాయి. 4 జాతులకు చెందిన దోమలు మాత్రమే మన దేశంలో మనుషులకు వ్యాధులను కలిగిస్తాయి. అనాఫిలస్ జాతి మలేరియా వ్యాధిని; క్యూలెక్స్ జాతి ఫైలేరియా, మెదడువాపు వ్యాధులను; ఏడిస్ జాతి డెంగీ, చికున్ గన్యా, జికా వ్యాధులను; మాన్సోనియా జాతి బోదకాలు వ్యాధిని వ్యాప్తిచేస్తాయి.దోమ జీవితంలోని 4 దశల్లో, 3 దశలు (గుడ్డు, లార్వా, ప్యూపా) నీటిలోనూ, ఒక దశ (పెద్ద దోమ) భూమిమీద నివసిస్తాయి. సాధారణంగా మగదోమలు వారం రోజులు, ఆడదోమలు నెల రోజులు మాత్రమే జీవిస్తాయి. జీవించడానికి ఆడ, మగ దోమలు మొక్కల రసాలు తాగుతాయి, గుడ్లుపెట్టడానికి మాత్రమే ఆడదోమలు రక్తం తాగుతాయి. దోమకాటు దగ్గర ఏర్పడే ఎర్రని బొబ్బ దోమకాటు వల్ల కాకుండా, మనిషి వ్యాధినిరోధక వ్యవస్థ స్పందన వలన ఏర్పడుతుంది.దోమలు భూమికి 25 మీటర్లకంటే తక్కువ ఎత్తులో ఎగరడానికి ఇష్టపడతాయి. అవి మనుషులు, జంతువులు విడిచే వాయువులను 75 మీటర్ల దూరంనుండి కూడా గుర్తించ గలవు. గర్భిణీ స్త్రీలను, ‘ఓ’ రక్తగ్రూపు వాళ్లను, శరీరం వేడిగా ఉండేవాళ్ళను దోమలు సులభంగా గుర్తించగలవు. కదిలేవాటిని, తెలుపు, నలుపు రంగులను, ఉష్ణోగ్రతలను, గాలిలోని తేమను పసిగట్టగలవు.దోమ రెక్కల ద్వారా చేసే శబ్దాలు వాటి తెగకు చెందిన, ఇతర దోమలు గుర్తించడానికి చేసేవే. పెద్ద దోమలను తినేవాటిలో తూనీగలు, దోమ పిల్లలను తినేవాటిలో చేపలు ముందుంటాయి. దోమ కిలోమీటరు దూరం మాత్రమే వ్యాధిని వ్యాప్తిచేయగలదు. అయితే వ్యాధికారకం కలిగిన మనుషులు మాత్రం వేలకిలో మీటర్ల మేరకు వ్యాధిని వ్యాప్తిచేయగలరు. అందుకే దోమలు పుట్టకుండా, కుట్టకుండా చూసుకోండి – దోమకాటు వ్యాధులనుండి రక్షణ పొందండి.– తలతోటి రత్న జోసఫ్, రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్, ఏపీ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ -
ఒక ఫోటో... కాలానికి అద్దం
‘ఒక చిత్రం వెయ్యి మాటలకు సమానం’ అంటారు. కానీ ఒక మంచి ఫొటో వెయ్యి మాటలకే పరిమితం కాదు; అది ఒక జ్ఞాపకాన్నీ, ఒక భావోద్వేగాన్నీ, ఒక సంఘటననూ, ఒక్కోసారి ఒక కాలాన్నే తనలో శాశ్వతంగా భద్రపరుస్తుంది. తరాలు మారిపోతాయి. కానీ ఒక ఫొటో ఆ ఒక్క క్షణాన్ని ఆపి ఉంచుతుంది. నవ్వులు, కన్నీళ్లు, విజయాలు, విషాదాలు, పోరాటాలు, సంబరాలు అందులో నిశ్శబ్దంగా జీవిస్తూనే ఉంటాయి.1839లో ఫ్రెంచ్ ఆవిష్కర్త లూయిస్–జాక్–మాండే డాగ్యేర్ అభివృద్ధి చేసిన డాగ్యేరియో టైప్ ప్రక్రియ ప్రపంచానికి పరిచయం కావడంతో ఫొటో గ్రఫీ ఒక కొత్తయుగంలోకి ప్రవేశించింది. 1839 ఆగస్టు 19న ఫ్రాన్స్‌లో ఈ ప్రక్రియను అధికారికంగా ప్రకటించడంతో ఆ రోజుకు ఫొటోగ్రఫీ చరిత్రలో ప్రత్యేక స్థానం లభించింది. అందుకే ప్రతి సంవ త్సరం ఆగస్టు 19న ‘ప్రపంచ ఫొటోగ్రఫీ’ దినోత్సవాన్ని జరుపుకొంటున్నాం.తెలంగాణ విషయానికి వస్తే ఫొటో జర్నలిజానికి ప్రత్యేకమైన ప్రాధాన్యతఉంది. హైదరాబాద్ నగర జీవితం నుంచి తెలంగాణ పల్లెల వరకు, బతుకమ్మ నుంచి బోనాల వరకు, మేడారం జాతర నుంచి వివిధ సాంస్కృతిక ఉత్సవాల వరకు, ఎన్నికల నుంచి ప్రజా సమస్యల వరకు, ప్రకృతి వైపరీత్యాల నుంచి సామాజిక పరిణామాల వరకు తెలంగాణ జీవితంలోని అనేక కోణాలను ఫొటో జర్నలిస్టులు తమ కెమెరాల్లో భద్రపరిచారు. తెలంగాణ సామాజిక, రాజకీయ చరిత్రలో జరిగిన వివిధ ఉద్యమాల సందర్భంలో కూడా ఫొటో జర్నలిజం ఒక ముఖ్యమైన దృశ్య రికార్డుగా నిలిచింది. 1969 ఉద్యమం నుంచి తరువాతి దశల వరకు జరిగిన ర్యాలీలు, విద్యార్థుల ఆందోళనలు, ప్రజా సమావేశాలు, నిరసనలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రజల భాగస్వామ్యం వంటి అనేక దృశ్యాలను ఫొటోగ్రాఫర్లు తమ కెమెరాల్లో భద్రపరిచారు. ఇదీ చదవండి: ఏ రకమైన దోమ కుడితే ఎలాంటి వ్యాధి వస్తుందో తెలుసా?ఫొటో జర్నలిస్టు పని బయటకు కనిపించేంత సులభమైనది కాదు. మంచి ఫ్రేమ్ కోసం కొన్నిసార్లు గంటల తరబడి ఎదురుచూడాలి. ఎండ, వర్షం, రద్దీ, ప్రమాదకర పరిస్థితులు... ఏవీ పట్టించుకోకుండా సరైన క్షణాన్ని కెమెరాలో బంధించాల్సి ఉంటుంది. సరైన క్షణాన్ని గుర్తించే చూపు, సంఘటనను అర్థం చేసు కునే అవగాహన... ఇవే మంచి ఫొటోగ్రాఫర్‌కు అసలైన సంపద. ఒక ఫొటో తీసిన క్షణంలో అది కేవలం ఒక చిత్రం. కానీ సంవత్సరాలు గడిచిన తరువాత అదే ఫొటో ఒక జ్ఞాపకం. మరింత కాలం గడిచిన తరువాత అదే ఫొటో ఒక చరిత్ర. కాలం మారుతుంది. తరాలు మారుతాయి. సాంకేతికత మారుతుంది. కానీ ఒక మంచి ఫొటో మాత్రం కాలాన్ని దాటి జీవిస్తూనే ఉంటుంది.– నాగులపల్లి వెంకటేశ్వరరావు సెక్రెటరీ, మీడియా అకాడమీ ఆఫ్ తెలంగాణఇదీ చదవండి: త్విషా శర్మ : నన్ను ప్రశాంతంగా చావనివ్వండి : ఆ 90నిమిషాల్లో ఏం జరిగింది? -
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం.. ఎటు పోతోంది?
ఒకప్పుడు పాలకులు మతం గురించి పదే,పదేమాట్లాడే వారు కారు.మూఢ విశ్వాసాలను ప్రోత్సహించేవారు కారు. బాణామతి,చేతబడి వంటి వాటిని అరికట్టడానికి ప్రభుత్వపరంగా చర్యలు తీసుకునేవారు. మతం,దైవ భక్తి అన్నవి వ్యక్తిగత విషయాలుగానే భావించేవారు.కాని కాలం మారింది. శాస్త్రీయ దృక్ఫధం స్థానంలో మతాల ప్రస్తావన అధికంగా వస్తోంది. ప్రజలు భక్తిని, మతాన్ని ఆచరించడాన్ని ఎవరూ తప్పుపట్టరు. అలాగే ఆయా ఉత్సవాలలో, మతపరమైన కార్యక్రమాలలో ప్రజలకు ప్రభుత్వం అవసరమైన సదుపాయాలు కల్పించడాన్ని ఎవరూ ఆక్షేపించరు. కాని ఇప్పుడేం జరుగుతోంది. వాటిని కూడా రాజకీయాలకు వాడుకోవడానికి నేతలు పోటీ పడుతున్నారు.తాజాగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు చేసిన కొన్ని వ్యాఖ్యలు చూస్తే రాజకీయం ఇలా తయారవుతోందేమిటా అన్న ఆవేదన కలుగుతుంది. రేవంత్ రెడ్డి ఒక సభలో మాట్లాడుతూ బిఆర్ఎస్పై చేతబడుల విమర్శ చేశారు. 'పదేళ్లు అధికారంలో ఉన్నవారు, పాతికేళ్లు తెలంగాణలో రాజకీయం చేసినవారు తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ,ప్రజలకు వ్యతిరేకంగా పొరుగు రాష్ట్రాలకు వెళ్లి చేతబడులు ,అఘోరా పూజలు చేయించడం అత్యంత దుర్మార్గం "అని రేవంత్ వ్యాఖ్యానించారు. బుద్ది సరిగా లేకపోతే ఆ క్షుద్ర పూజలు తిరగబడతాయి అని ,అదే కనుక జరిగితే ఫామ్ హౌస్ నుంచి బయటకు రాకుండా అష్టదిగ్భందనం చేస్తాయి అని ఆయన హెచ్చరించారు. 'ఎల్ నిలో ప్రభావంతో రాష్ట్రం ఎండిపోవాలని,కరువు వచ్చి జనాలు అల్లాడిపోవాలని ప్రభుత్వం బదనాం కావాలని అఘోరా పూజలు చేశారు "అని ఆయన ఆరోపించారు. అయితే దేవుడు ,అదృష్టం తమ వైపే ఉన్నాయని, తమ సంకల్పం మంచిది కాబట్టి ఈ సమయంలోను వర్షాలు కురిశాయని రేవంత్ చెప్పారు. తమకు దేవుడి దయ, ప్రజల ఆశిస్సులు ఎప్పుడూ ఉంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ వివాదం ఎందుకు వచ్చింది? కొద్దికాలం క్రితం బిఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి టి.హరీష్ రావు కర్నాటకలో కొన్ని గుడులను సందర్శించారు. అది ఆయన వ్యక్తిగత స్వేచ్చ. నమ్మకం. కాని కాంగ్రెస్ అధికార ప్రతినిది సామా రామ్మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ హరీష్ రావు క్షుధ్రపూజలు చేయించడానికి గుడులకు వెళ్లారని ఆరోపించారు. దీనిపై హరీష్ రావు మండిపడ్డారు. తాను అలాంటివి చేయలేదని, ఇలా మాట్లాడిన కాంగ్రెస్ నేతలకు లీగల్ నోటీసులు పంపుతున్నట్లు ప్రకటించారు. అయినా కాంగ్రెస్ వెనక్కి తగ్గలేదు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఈ వివాదంలోకి వచ్చి, తన వద్ద ఆధారాలు ఉన్నాయని హరీష్‌పై మళ్లీ ఆరోపణలు చేశారు. తదుపరి ఏకంగా ముఖ్యమంత్రి రేవంతే ఈ అభియోగం మోపారు. ఇలాంటివి చెబుతున్నారంటే వీటిని వీరు నమ్ముతున్నారనే కదా! వ్యక్తిగతంగా ఎలాంటి విశ్వాసం అయినా పెట్టుకోవచ్చు. కాని ప్రజలలో మాట్లాడడానికి ముందు వీటి ప్రభావం గురించి ఆలోచించుకోవాలి. ఒకప్పుడు తెలంగాణలోని కొన్ని జిల్లాలలో బాణామతి అనే అంధ విశ్వాసం ఉండేది. బాణామతి, చేతబడులు చేస్తున్నారన్న అనుమానంతో కొందరిపై దాడి జరిగేది. కొంతమంది ఈ క్రమంలో హత్యలకు కూడా గురైన సందర్భాలు ఉండేవి.క్షుధ్రపూజలు చేస్తున్నారన్న సందేహంతో నోటిలోని పళ్లు కూడా పీకేసిన కేసులు కూడా నమోదయ్యేవి.హైదరాబాద్ నగరం విస్తృతం అవడం,శాస్త్ర విజ్ఞానం పెంపొందడంతో ఇవి ఇటీవలికాలంలో బాగా తగ్గాయి.ఈ తరుణంలో సి.ఎమ్.స్థానంలో ఉన్నవారు ఈ క్షుద్రపూజల గురించి మాట్లాడడం వల్ల రాజకీయంగా ఆయనకు ఎంత లబ్ది చేకూరుతుందో కాని,ప్రజలలో మాత్రం మూఢ విశ్వాసాలు మరింత పెరగడానికి దోహద పడతాయి. భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ దేశంలో శాస్త్రీయ దృక్ఫధం పెరగాలని వాంచించారు. ఇందుకోసం ఐఐటి వంటి ప్రఖ్యాత విద్యా సంస్థలను నెలకొల్పారు. అలా అని ఆయనకు మతపరమైన విశ్వాసాలు లేవని కాదు. తను మరణించిన తర్వాత చితాభస్మాన్ని పవిత్రమైన నదులులో కలపాలని కోరుకున్నారు. తదుపరి రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు కంప్యూటర్ వినియోగాన్ని ప్రోత్సహించారు.పివి నరసింహారావు ప్రదానిగా ఉన్నప్పుడు చంద్రస్వామి అన్న తాంత్రికుడు చక్రం తిప్పేవారని ప్రచారం జరిగేది. అయినా ఆయన మత విశ్వాసాలు ఎలా ఉన్నా, బాబ్రి మసీదు కూల్చివేసిన ఘటనపై తీవ్రంగా ఆవేదన చెందారు. నాలుగు రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేశారు. మాజీ ముఖ్యమంత్రి చెన్నారెడ్డితో సహా ఆయా ముఖ్యమంత్రులకు కొందరు జ్యోతిష్కులపైన, పండితులపైన నమ్మకాలు ఉండేవి. అయినా వారు ఆ నమ్మకాలను ప్రజలపై రుద్దాలని భావించలేదు. బహిరంగ సభలలో వాటి గురించి పెద్దగా ప్రస్తావన తెచ్చేవారు కారు. భారతీయ జనతా పార్టీ దేశంలో విస్తృతం అయ్యే కొద్ది ఈ మతపరమైన విశ్వాసాలు పెరుగుతూ వచ్చిన మాట నిజమే.కాని అదే పార్టీకి చెందిన కొందరు నేతలు మూడ విశ్వాసాలకు వ్యతిరేకంగా కూడా మాట్లాడేవారు.కరువు పరిస్థితులు ఇప్పుడే కాదు.గతంలో కూడా వచ్చేవి.అప్పుడు కూడా కొందరు ముఖ్యమంత్రులు వరుణ యాగాలు చేయించారు.కొద్ది రోజుల క్రితం రేవంత్ కూడా సాగర్ వద్ద వరుణ యాగం నిర్వహించారు. గత ముఖ్యమంత్రి కెసిఆర్ ఆయా సందర్భాలలో యాగాలు, యజ్ఞాలు చేసిన సంగతి తెలిసిందే. తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్.టి.రామారావు రాజకీయాలలోకి వచ్చాక ,మాజీ రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ వంటివారు స్వామిజీ అని సంభోధించేవారు.అయినా ఎన్.టి.ఆర్.తను నటించిన పలు సినిమాలలో ఈ మూఢ విశ్వాసాలకు , మతం పేరుతో మోసాలు చేసేవారికి వ్యతిరేకంగా పలు సన్నివేశాలు పెట్టేవారు.ప్రభుత్వంలో ఉన్నప్పుడు మతపరమైన అంశాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు.అలా అని ఆయనకు దైవం పై నమ్మకం లేదని కాదు.ప్రస్తుత ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకప్పుడు పెద్దగా మతపరమైన రాజకీయాలు చేసేవారుకారు. బిజెపికి వ్యతిరేకంగా ఉన్న రోజుల్లో ఆ పార్టీ మసీదులు కూల్చే పార్టీ అని విమర్శించేవారు.రాజకీయంగా తనకు లాభం జరుగుతుందనుకున్నప్పుడు అదే పార్టీతో పొత్తు పెట్టుకునేవారు. ఒకరకంగా చెప్పాలంటే అవకాశవాద రాజకీయాలు చేయడంలో ఆయనకు సాటి లేరనుకోవవచ్చు. 2019లో ఓటమి ఎదురైన తర్వాత అప్పటి వైసిపి ప్రభుత్వాన్ని ,ముఖ్యమంత్రిగా ఉన్న జగన్‌ను ఓడించాలంటే మతపరమైన విమర్శలు చేయాలని తలపెట్టేవారు. కొత్త పూజారికి పంగనామాలు ఎక్కువ అన్న సామెత ఉంది. దానికి అనుగుణంగా ఉన్నవి, లేనివి ఆరోపణలు చేసి రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి ఎక్కడా సంకోచించలేదన్న అభిప్రాయం ఉంది.2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దోరణి మరింతగా పెరిగింది. తిరుమల స్వామివారి ప్రసాదంపై వివాదం సృష్టించి దానిని జగన్ కు ఆపాదించడం వరకు వెళ్లారు.జగన్ ఆలయాలకు వెళ్లడాన్ని కూడా ఆక్షేపించేవరకు వెళ్లి మీ దేవుడు,మా దేవుడు అంటూ వ్యాఖ్యలు చేసే దశకు చేరుకున్నారు.బహిరంగ సభలలో ఇలాంటి ప్రసంగాలు చేయడం అలవాటుగా చేసుకున్నారు. అమరావతి దేవత రాజధాని అంటూ కొత్త నినాదం చేబూని ప్రజలను ఆకర్షించే పనిలో ఉంటున్నారు.రాజధానిలో జరిగే అక్రమాలు, అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే చంద్రబాబు ఇలా మతాన్ని,దేవుడిని అవసరం ఉన్నా,లేకపోయినా ప్రస్తావిస్తున్నారని ఆయన ప్రత్యర్ధులు విమర్శిస్తుంటారు. ఇక ఈ మధ్య మరో అడుగు ముందుకేసి శ్రీవెంకటేశ్వర స్వామి వద్దకు వర్చువల్ గా వెళ్లానని అంటున్నారు. అమరావతి రాజధాని నిర్మాణం సజావుగా సాగాలని ప్రార్ధించానని ఆయన చెబుతున్నారు.ఎల్లో మీడియా గతంలో జగన్ ఆత్మలతో మాట్లాడానని చెబుతున్నారంటూ ఒక తప్పుడు కధనాన్ని సృష్టించి ప్రచారం చేసింది. ఇప్పుడు చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలను మాత్రం పెద్దగా కనిపించకుండా జాగ్రత్తపడడం గమనించదగ్గ అంశం.చివరిగా ఒక మాట చెప్పాలి. ప్రముఖ ఆధాత్మిక వేత్త,ఎపి ప్రభుత్వంలో సలహాదారుగా ఉన్న చాగంటి కోటేశ్వరరావు ఒక వ్యాఖ్య చేశారు.రాజు ధర్మాన్ని పాటించకపోతే వర్షాలు కురవవని ఆయన తన ధార్మిక ప్రసంగంలో చెప్పారు. వర్షాలు పడకపోవడానికి ఎల్ నిలో కారణమని నమ్మమంటారా?లేక చాగంటి అభిభాషించినట్లుగా రాజు ధర్మంగా లేకపోవడం వల్లనే అని అనుకోమంటారా?అంటే ముఖ్యమంత్రులు ఏమి చెబుతారు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
తల్లి ప్రేమకు, విశ్వాసానికి ప్రతీకగా సెయింట్ హెలెనా
రోమన్ కతోలికుల ఉనికికే ప్రాణం పోసిన మహామహిళ సెయింట్ హెలెనా. రోమ్ మొదటి క్రిస్టియన్ చక్రవర్తి ‘కాన్స్టాంటైన్ ద గ్రేట్’ను కన్న వీరమాత. అది రోమా సామ్రాజ్యం మహా వైభవోపేతంగా ఉన్న కాలం! సాధారణ కుటుంబంలో హెలెనా జన్మించింది. చిన్ననాటి నుంచే భయ భక్తుల్లో పెరగబట్టి ఆమెకు పెద్దల పట్ల వినయం, సమాజం పట్ల దయ, దేవునిపై విశ్వాసం అనే సద్గుణాలు అలవడ్డాయి. ‘రోమన్ కేథలిక్కులు’ అనే పేరులో రోమన్ పదం చేరడానికి కారకులు ఈ తల్లీకొడుకులు. ఇదెలా జరిగింది?ఒకానొకపుడు క్రైస్తవుల్ని నానాహింసల పాలు చేసిందీ, క్రీస్తుకు వ్యతిరేకంగా ఉన్నదీ ఈ రోమన్ పాలకులే. కానీ పేదరికం అనుభవించినా గొప్ప విశ్వాసకురాలైన తల్లి ఉద్బోధనల వల్ల, కాన్స్టాంటైన్ చక్రవర్తి క్రైస్తవ మతానికి అనుకూలంగా మారాడు. ఈ నేపథ్యంలో రోమన్ దేశంలో చిన్నగా కదలిక ప్రారంభమైంది. ‘యేసు ప్రభువు నడిచిన పవిత్ర స్థలాలను దర్శించాలి; ఆయన ప్రేమను ప్రపంచానికి గుర్తు చేయాలి’ అని హెలెనా యెరూషలేముకు పవిత్ర యాత్ర చేసింది. అక్కడ యేసు ప్రభువు శిలువ వేయబడిన స్థలాన్ని వెతికింది. సంప్రదాయం ప్రకారం, ఆమె అక్కడ శిలువకు సంబంధించిన పవిత్ర అవశేషాలను కనుగొన్నట్లు చెబుతారు.ఆమె ఆ పవిత్ర స్థలాలను గౌరవంగా సంరక్షించి, అక్కడ ప్రార్థనా మందిరాల నిర్మాణానికి సహాయం చేసింది. ముఖ్యంగా యెరూషలేములోని ‘చర్చ్ ఒఫ్ ద హోలీ సెపుల్చెర్’ నిర్మాణానికి ఆమె సహకారం అందించింది. దేవుని ప్రేమను పంచిన హెలెనా క్రీ.శ. 330లో మరణించినా, ఆమె పేరు మాత్రం శతాబ్దాల తరువాత కూడా విశ్వాసం, త్యాగం, తల్లి ప్రేమకు ప్రతీకగా నిలిచిపోయాయి.– డా. దేవదాసు బెర్నార్డ్ రాజు -
నమ్మిన దైవమే గట్టెక్కించే దారి చూపుతుంది..
హిరణ్యకశిపుడు ఒక రోజు ఆలోచనలో పడ్డాడు. ‘అమరుల తల్లి కంటె మా అమ్మ పెద్దది. త్రిలోక రాజ్య భోగములు నాకు దక్కాలి గాని ఆ భోగాలకు అమరులెట్లా అర్హులౌతారు? ఉగ్రతపంతో కానివి లేవు కాబట్టి తపోనిష్ఠతో బ్రహ్మను మెప్పించి, ముల్లోకాధిపత్యాన్ని నేను దక్కించుకుంటాను!’ అని నిశ్చయించుకున్నాడు.తపస్సు చేయడం మొదలు పెట్టాడు. అతడి ఉగ్రతపస్సుకు దేవేంద్రుడు భయపడ్డాడు. దేవగురువైన బృహస్పతిని చెంతకు పిలిపించుకుని, ‘తండ్రి ఒక్కడే. తల్లులు మాత్రం మాకు వేరు. జగత్సామ్రాజ్య పూజ్యనీయత తనకు దక్కాలని దైతేయుడైన హిరణ్యకశిపుడు, బ్రహ్మదేవుడి నుండి వరం పొందాలని ఉగ్రతపస్సు చేస్తున్నాడు. ఆ తపస్సుకు జగములు తల్లడిల్లే పరిస్థితి వస్తున్నది కాబట్టి వేరే మార్గం కనపడక అడిగినది వరంగా ఇచ్చేస్తాడు బ్రహ్మదేవుడు. అది తప్పిపోయే మార్గం చెప్పండి, గురుదేవా!’ అని ప్రాధేయపడ్డాడు.సురేంద్రుడి భయాన్ని అర్థం చేసుకున్న బృహస్పతి ‘భయపడవలసింది లేదు. విష్ణుద్వేషం, నిరంతర దోషం, శ్రుతిధర్మ విరోధం, సుజన నిరోధం లక్షణాలుగా కలిగిన అసురులను శ్రీహరి క్షమించడు. కనుక నారాయణ మంత్రాన్ని నిత్యం పారాయణం చెయ్యి!’ అని చెప్పి ఆ మంత్ర మహత్యాన్ని గురించి ఇలా వివరించాడని ఎఱ<న శ్రీనృసింహపురాణంలో చెప్పాడు.క. తను నెబ్భంగి దలంతురుజను లాభంగిన తలంచు సరసీరుహలోచనుడును వారల గావునననిశంబు కృతార్థమతులు హరిపద భక్తుల్.‘తనను ఎంత గాఢమైన భక్తితత్పరతతో పూజిస్తారోఅంతే గాఢమైన తలపుతో వారిని శ్రీహరి రక్షిస్తాడు. అందువలననే శ్రీహరిని భక్తితో కొలిచేవారికి కలగని సుఖములు లేవు!’ అని కర్తవ్యాన్ని బోధించి సురేంద్రుడి కలతను, కష్టాన్ని తీర్చాడు బృహస్పతి. తాను ఎదుర్కొనలేని ఆపదలో చిక్కుకున్న వేళ, వ్యర్థంగా కలత చెందడం మాని నమ్మిన దైవాన్ని శరణు వేడితే, ఆ ఆపద నుంచి గట్టెక్కే మార్గం కనపడుతుందని పై సన్నివేశం విదితం చేస్తుంది.– భట్టు వెంకటరావు -
అంచనాలు అందుకోని ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై చంద్రబాబు ప్రభుత్వం 2026 జూలైలో విడు దల చేసిన శ్వేతపత్రం కొత్త చర్చకు తెరతీసింది. 2024–25లో రాష్ట్ర స్వంత ఆదాయాలు రూ. 96,270 కోట్లు కాగా, జీతాలు, పెన్షన్లకు రూ. 92,869 కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వం పేర్కొంది. దీంతో రాష్ట్ర సొంత ఆదాయానికి దాదాపు సమానమైన మొత్తం జీతాలు, పెన్షన్లకే వెళ్తున్నాయన్న అభిప్రాయం ఏర్పడింది. అయితే ‘రాష్ట్ర ఆదాయం మొత్తం ఉద్యోగుల జీతాలకే పోతోంది’ అనే వాదనను నేరుగా అంగీకరించడం సరైంది కాదు. రాష్ట్ర సొంత ఆదాయం, మొత్తం రెవెన్యూ ఆదాయం, కేంద్ర పన్నుల వాటా, గ్రాంట్లు, అప్పులు... ఇవన్నీ వేర్వేరు. ఏ ఆదాయాన్ని ప్రాతిపదికగా తీసుకుంటున్నాం అన్నదే శాతాన్ని నిర్ణయిస్తుంది.2024–25లో రాష్ట్రానికి వాస్తవంగా వచ్చిన రెవెన్యూ రిసిప్షన్ రూ. 1,67,676 కోట్లు. ఇందులో రాష్ట్ర పన్ను ఆదాయం రూ. 89,435 కోట్లు, పన్నేతర ఆదాయం రూ. 5,972 కోట్లు కాగా, కేంద్ర పన్నుల వాటా రూ. 52,080 కోట్లు, కేంద్ర గ్రాంట్లు రూ. 20,188 కోట్లు. బడ్జెట్లో అంచనా వేసిన రూ. 2,01,174 కోట్లతో పోలిస్తే వాస్తవ రెవెన్యూ ఆదాయం రూ. 33,498 కోట్లు తక్కువగా వచ్చింది. రాష్ట్ర సొంత పన్ను ఆదాయంలోనే రూ. 20,354 కోట్ల లోటు నమోదైంది. ఇదే రాష్ట్ర ఆర్థిక సమస్యకు కీలక సంకేతం. సమస్య కేవలం జీతాల భారం కాదు; ఆదాయాన్ని అంచనాల మేరకు సమకూర్చుకోలేకపోవడం.2024–25లో రెవెన్యూ ఖర్చు రూ. 2,27,961 కోట్లు కాగా, రెవెన్యూ రాబడి రూ. 1,67,676 కోట్లు మాత్రమే. ఫలితంగా రెవెన్యూ లోటు రూ. 60,285 కోట్లకు చేరింది. మరోవైపు భవిష్యత్తు మౌలిక వసతులకు కీలకమైన క్యాపిటల్ ఔట్లే కేవలం రూ. 16,141 కోట్లే. బడ్జెట్ అంచనా రూ. 32,713 కోట్లతో పోలిస్తే ఇది దాదాపు సగం.2026–27 నాటికి ఆదాయ రాబడి రూ. 2,34,140 కోట్లుగా అంచనా వేయగా, రాష్ట్ర సొంత వనరులు రూ. 1,37,320 కోట్లు. అదే సమయంలోవడ్డీ చెల్లింపులు రూ. 37,281 కోట్లు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఆర్థికసంక్షోభాన్ని కేవలం ప్రభుత్వ ఉద్యోగుల జీతాల సమస్యగా చూడటం సరికాదు. ఉద్యోగుల జీతాలు ప్రభుత్వ వ్యయమే అయినప్పటికీ... వైద్యం, విద్య, పోలీసు, రెవెన్యూ వంటి కీలక ప్రజాసేవలు వాటితోనే నడుస్తాయి. రాష్ట్ర ఆదాయాన్ని ఎలా పెంచుతున్నారు? భవిష్యత్తు అభివృద్ధికి ఎంత పెట్టుబడి పెడుతున్నారు? అన్నవి ఈ సందర్భంలో తలెత్తుతున్న అసలు ప్రశ్నలు.– సీహెచ్.వి. ప్రభాకర్ రావు ‘ సీనియర్ జర్నలిస్ట్ -
పేదలెక్కువైన సంపన్న రాష్ట్రం
పుష్కర తెలంగాణ రాష్ట్రం జీఎస్డీపీ, తలసరి ఆదాయం లాంటి ఆర్థికాభివృద్ధి సూచికలలో దూసుకుపోతోంది. దేశంలో పారిశ్రామికంగా బలమైన మహారాష్ట్ర, గుజరాత్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు లాంటి రాష్ట్రాలను వెనక్కి నెట్టి 5,407 డాలర్ల తలసరి జి.ఎన్.ఐ.తో తెలంగాణ ఎగువ మధ్య స్థాయి ఆదాయ రాష్ట్రంగా (యు.ఎం.ఐ.ఎస్.) ఢిల్లీ, కర్ణాటక తరువాత మూడవ రాష్ట్రంగా ఆవిర్భవించిందని ప్రపంచ బ్యాంక్ తన ‘కంట్రీ ఇన్కమ్ క్లాసిఫికేషన్ – 2026’ నివేదికలో వెల్లడించింది. ఇది రాష్ట్రానికి దక్కిన గౌరవంగానే చూడాలి. కానీ దీన్ని రాష్ట్ర అభివృద్ధికి గీటురాయిగా చెప్పలేం. రాష్ట్రంలో ఆదాయం సమకూరే మార్గాలు, ఆదాయ పంపిణీ తీరు రాష్ట్ర వాస్తవిక అభివృద్ధికి అద్దం పట్టడం లేదు.తెలంగాణలో జిల్లాల మధ్య తీవ్ర అంతరాలు ఉన్నట్లుగా ‘తెలంగాణ సోషియో ఎకనామిక్ ఔట్లుక్ సర్వే – 2026’ గుర్తించింది. రాష్ట్ర ఆదాయంలో 51 శాతం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, సంగారెడ్డి లాంటి జిల్లాల నుండి వస్తుంటే... మిగతా 49 శాతం ఆదాయం 29 జిల్లాల నుండి వస్తోంది. రాష్ట్ర ఆదాయ పంపిణీ తీరులో కూడా తీవ్ర అసమానతలు కనిపిస్తున్నాయి.ఐటీ, ఫార్మా రంగాలు; రియల్ ఎస్టేట్, గ్లోబల్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ నుండి రాష్ట్రానికి ఆదాయం సమకూరటం వలన రాష్ట్ర సంపద కొద్ది మంది వ్యక్తుల చేతిలో కేంద్రీకృతం అయ్యింది. తలసరి జి.ఎన్.ఐ. ఎక్కువగా కనపడుతున్నా అభివృద్ధి ఫలాలు, పెరిగిన ఆదాయం కింది వర్గాలకు చేరడంలేదు. కాబట్టి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలి. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, గ్రామీణ వృత్తుల బలోపేతం ద్వారా గ్రామీణ ప్రజల ఆదాయాలను పెంచాలి. అంతే కాక ప్రభుత్వ సంక్షేమ పథకాలను విస్తృతంగా అమలు పరచడం, గ్రామీణ అవస్థాపన నిర్మాణాన్ని చేపట్టడం వంటి చర్యలు చేపట్టాలి. అలాగే విద్య, వైద్య రంగాలపై ప్రభుత్వ పెట్టుబడులు పెరిగినప్పుడే కింది వర్గాల ఆదాయాలు, కొనుగోలు శక్తి కూడా పెరిగి ఆర్థిక అంతరాలు తగ్గుతాయి.రాష్ట్రంలో 1.14 కోట్ల కుటుంబాలు ఉంటే 89 లక్షలకు పైగా కుటుంబాలు పేదరికంలో ఉన్నాయని ప్రభుత్వ సామాజిక, ఆర్థిక సర్వేలు తేటతెల్లం చేస్తు న్నాయి. తెలంగాణ పేదలు ఉన్న సంపన్న రాష్ట్రంగా తెలంగాణ కనిపిస్తుంటే రాష్ట్ర ఏర్పాటుకు చేసిన త్యాగాలకూ, ఉద్యమాలకూ అర్థం ఉంటుందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. సంపద పెరగడమే కాదు, ఆ సంపద కింది వర్గా లకు చేరడమే నిజమైన అభివృద్ధికి గీటురాయి.– డా. తిరునహరి శేషు, అర్థశాస్త్ర ఉపన్యాసకులు, కేయూ -
సమావేశాలు సరే, సమస్యల మాటేంటి?
భారతదేశ భవిష్యత్తును నిర్దేశించేది, నిర్ణయాలకు కేంద్ర బిందువుగా ఉండేది, 143 కోట్ల భారతీయుల తలరాతలను మార్చేది పార్లమెంట్. తమ తమ ప్రాంతాలలో చోటు చేసుకున్న సమస్యలను ఎంపీలు ప్రస్తావించేందుకు పార్లమెంటు ఓ కీలకమైన వేదిక. ఇప్పుడు కేవలం ఆరోపణలు, విమర్శలకే ఎక్కువ సమయం సరిపోతోంది.దేశంలో పెద్ద గుంతలతో నిండిన రహదారులను దాటడం, మునిగి పోయిన నగరాల్లో నడవడం, అంతులేని ఉద్యోగ దరఖాస్తు లతో చెమటలు పట్టడం, దొంగతనాల వల్ల కోట్లు నష్టపోయే విద్యుత్ రంగానికి ధర చెల్లించడం దేశంలో సాధారణ దృశ్యాలు అయ్యాయి. ప్రతి వారం ప్రజల తెరలపై ఒక వంతెన వంగిపోవడం, ఒక కారును రహదారి మింగేయడం వంటి దృశ్యాలు ప్రత్యక్షం అవుతున్నాయి. ఈ పార్లమెంటు వర్షాకాల సమావేశాలలో ప్రజా ప్రతినిధులు లేవనెత్తిన ప్రశ్నలు, ప్రభుత్వ సమాధానాలు చూస్తే దేశంలో పరిస్థితి కళ్లముందు ప్రత్యక్షమవుతుంది.‘ఎన్ని రహదారులు కూలిపోయాయి?’ అనే ప్రశ్నకు ప్రభుత్వం ఇచ్చిన సమాధానం 49 అని. ఇది 2014 నుండి 2025 వరకు ఉన్న డేటా. ప్రతి వర్షాకాలం కల్లోలం సృష్టిస్తుంది. కానీ కేంద్ర ప్రభుత్వం పట్టణ వరదల బాధ్యతను రాష్ట్రాలు, స్థానిక సంస్థలపై మోపుతుంది. ఇది రాజ్యాంగపరంగా సరైనదే. అయితే, అతి పెద్ద పట్టణా భివృద్ధి కార్యక్రమం ఢిల్లీ నుండి నిర్వహించబడుతోంది. ‘స్మార్ట్ సిటీస్ మిషన్’ కింద 8,064 ప్రాజెక్టులలో 7,790 పూర్తయ్యాయి. ఖర్చు రూ. 1,56,257 కోట్లు. ఖర్చు అంటే కేవలం డబ్బు కదలిక మాత్రమే, పరిష్కారం కాదు.ఈ వారం ఎంపీలు నీటి కాలుష్యం, అంచనాలు, ప్రమాణాలు, పరిష్కారాలపై కూడా గొంతెత్తారు. 2023–24 నుండి 2.52 కోట్ల ప్రయోగశాల నమూనాల సేకరణ జరిగిందనీ, 2.87 కోట్ల ఫీల్డ్ పరీక్షలు జరిగాయనీ, ట్యాంకర్ మాఫియా నీటి కొరత నిజమనీ ప్రభుత్వం అంగీకరించింది.ఇక ప్రాథమిక విద్య విషయానికి వస్తే, భవిష్యత్తు ఆశల వెన్నె ముక విరిగిపోయింది. ప్రభుత్వం 10.05 లక్షల పాఠశాలలను నడుపుతోంది. వీటిలో 11.89 కోట్ల పిల్లలు చదువుతున్నారు. ప్రైవేట్ రంగం 3.42 లక్షల పాఠశాలలను నడుపుతోంది. వీటిలో 8.89 కోట్ల పిల్లలు చదువుతున్నారు. విధానాలు, కంప్యూటరైజేషన్ గురించి చర్చల మధ్య ఈ వివరాలు వెల్లడయ్యాయి. 73,481 పాఠశాలలకు విద్యుత్ లేదు. 1,00,843 పాఠశాలల్లో ఒక్క గురువు మాత్రమే ఉన్నారు. అందుకే యువత వ్యవస్థలోని సమస్యలతో పోరాడు తున్నారు. మొన్న జంతర్ మంతర్‌లో, ఇప్పుడు జార్ఖండ్, పంజాబ్, రాజస్థాన్, కర్ణాటకల్లో కనిపిస్తున్న ఆగ్రహం చదువు, ఉపాధి రంగా లపై అసంతృప్తిని ఎలుగెత్తి చాటుతున్నది.ఇంతలోపే ఆగస్ట్ 15 వచ్చేసింది. ఎర్రకోట నుంచి ప్రధాని ప్రసంగించడం మామూలే. కానీ రోజురోజుకూ రూపాయి మరింత బలహీనమవుతోంది. ముడి చమురు ఉత్పత్తి తగ్గిపోతోంది. ఆర్థిక లోటు పెరుగుతోంది. దివాళా చట్టం కింద 2020 నుండి డిసెంబర్ 2025 వరకు 25,900 కేసులు దాఖలయ్యాయి. పాలనలో బాధ్యత, సమర్థత లోపించడం వల్లనే ఈ సమస్యలు కొనసాగుతున్నాయి. – కృష్ణ తేజ, కాంగ్రెస్ సీనియర్ అధికార ప్రతినిధి -
పూజ వేరు.. విన్నపం వేరు..
కతోలికులు మరియ మాత ముందు కూర్చొని, మూడు దేవరహస్యాలతో 15 ఘట్టాలతో కూడుకొన్న జపదండ చెబుతారు. క్రీస్తు ప్రభు గురించి, తండ్రి దేవునికి సంబంధించి, ఆత్మ దేవునికి సంబంధించిన రహస్యాలే అవి. ఆ యా ఘట్టాలన్నీ కొత్త నిబంధనా సంఘటనలే. దేవునికీ తమకూ మధ్యవర్తిగా ఆమెను నిలబెట్టి, ఆ ప్రభునికి ‘మా బాధలూ గాథలూ చేరవేయవమ్మా మా మరియమ్మా’ అని వేడుకొంటారు. పూజ వేరు, విన్నపం వేరు.బైబిల్లో ఆమెకు ఎదురైన చిన్న సంఘటనల్లోని మాటల్నే జపంగా మార్చుకొని పదే పదే ఉచ్ఛరించడం వల్ల ఆమె కేవేవో పూజలు జరుగుతున్నాయనుకోకూడదు. ఈ విషయమై ఇటీవల విశ్వ కాపరి, పోప్ లియో ప్రత్యేకమైన సందేశం ఇచ్చిన సంగతి మరువగూడదు. శిలువపై మరణించబోతున్న యేసు ప్రభువు, తన తల్లి బాధ్యత ప్రియ శిష్యుడైన యోహానుకు అప్పగించాడు. మరియ మాత ఓ చిన్న ఇంట్లో నివసించేది. ఆమె ప్రతిరోజూ దేవుణ్ణి ప్రార్థించేది. అందరినీ ప్రేమతో చూసుకునేది. తన చుట్టూ ఉన్నవారిని ఆశీర్వదించేది. పేదలకు సహాయం చేసేది. యేసు చెప్పిన మాటలను ప్రజలకు గుర్తు చేసేది.ఓ రోజు దేవదూత ఆమెకు ప్రత్యక్షమై, ‘మరియమ్మా! దేవుడు నిన్ను తన దగ్గరకు పిలుస్తున్నాడు’ అని చెప్పాడు. కొంతకాలానికి ఆమె భూలోక జీవితాన్ని ముగించింది. యేసు శిష్యులు ఆమెను ఎంతో గౌరవంగా సమాధి చేశారు. కొన్ని రోజుల తర్వాత వారు సమాధి దగ్గరకు వెళ్లి చూడగా, అక్కడ మరియ మాత శరీరం కనిపించలేదు. దేవుడు ఆమెను శరీరంతో సహా పరలోకానికి తీసుకువెళ్లాడని వారు విశ్వసించారు. ఆమెకు తిన్నగా మోక్షాన్ని ఆరోపించారు. ఇది ‘మోక్షారోపణ’. ప్రతి సంవత్సరం ఆగస్టు 15న మరియ మాత మోక్షారోపణ పండుగ జరుపుకొంటారు. అమె ఎంతో ధన్యురాలని పిలుస్తారు. (లూకా 1:48)– డా. దేవదాసు బెర్నార్డ్ రాజు (ఆగస్టు 15న మరియా మోక్షారోపణ పండుగ) -
దీక్ష.. గురువు పెట్టిన పరీక్ష!
అస్మృతిః క్లేశజాతస్య దీక్షాయాః ఆది లక్షణమ్’ ఒక పని చేసేటప్పడు దీక్ష ముఖ్యం. ఎలాంటి బాధలు గుర్తుకురాకుండా ఉండటమే దీక్షకు ప్రధాన లక్షణం. ఏ పనినైనా చేసి లక్ష్యాన్ని సాధించాలని అనుకొన్నప్పుడు అందులో ఉండే కష్టనష్టాలు గుర్తుకు రాకూడదు. గుర్తొస్తే పట్టుదల పలచబడి లక్ష్యం సాధించలేరు. ఏకాగ్రత ఉన్నప్పుడే లక్ష్య సాధన సాధ్యమవుతుంది.కారు నడిపే సమయంలో డ్రైవరు మనసు పరిపరివిధాల పోకుండా ముందు రోడ్డువైపే ఏకాగ్రతతో ఉంటుంది. లేకపోతే ప్రమాదాలేర్పడతాయి. అందుకే డ్రైవరు కారు వేగం పరిమి తిని, సమయాన్ని, ట్రాఫిక్ రూల్సును, సిగ్నల్స్‌ను జాగ్రత్తగా గమనిస్తూ ముందుచూపు సడల కుండా దీక్షతో నడుపుతాడు. అప్పుడే వాహనం క్షేమంగా గమ్యం చేరుతుంది.ఒక శిల్పాచార్యుడికి ఇద్దరు శిష్యులుండేవారు. మొదటివాడు కష్టపడి చాలాసేపు శిల్పాలు చెక్కుతూనే ఉండే వాడు. రెండోవాడికెప్పుడూ ఆటల ధ్యాసే. గురువుగారు వచ్చేసరికి పని చేస్తూండటం, తర్వాత వదిలివేయటం అలవాటు. ఒకరోజు ఇద్దర్నీ పిలిచి ఫలానా కొండల్లో ఫలానా రాయి ఉంది, వెతికి తీసుకురండని పంపాడు. ఇద్దరు అలాగే వెళ్ళి శిలను గుర్తించి తెచ్చారు. మొదటివాడు పండ్లు, పూలు, మూలికలు కూడా తెచ్చాడు.‘ఇవన్నీ ఎందుకురా?’ అని గురువడిగితే ‘స్వామీ! నా తల్లికి పండ్లు, చెల్లికి పూలు, మా అమ్మమ్మ చికిత్సకు మూలికలు తెచ్చా’నన్నాడు మొదటి శిష్యుడు. రెండవవాడిని ‘ఏరా! మీ తలిదండ్రులకు సుస్తీగా ఉందికదా! మరి నీవెందుకు మూలికలు తేలేదు’ అని గురువడిగాడు. ‘స్వామీ! నేను శిలను మాత్రమే వెతికాను. ఇతర ఆలోచనలేవీ నాకు లేవు’ అన్నాడు. పనిలో ఏకాగ్రత ఉండాలి. ఏకాగ్రత ఉంటే కార్యసిద్ధి కల్గుతుంది.- శ్రీ గణపతి సచ్చిదానందస్వామి -
అసలు సన్యాసం అంటే 'నేను–నాది’ని వదలడమే!
'జటిలో ముణ్డీలుంచిత కేశఃకాషాయాంబర బహుకృత వేషఃపశ్యన్నపి చ న పశ్యతి మూఢఃఉదర నిమిత్తం బహుకృత వేషః'ఇది శంకర భగవత్పాదుల వారి ‘భజగోవిందం’లోని ఒక శ్లోకం. జడలు కట్టిన వెంట్రుకలతో ఒకడు, జుట్టులేక ముండనము చేయించుకున్నవాడు ఒకడు, వ్రేలా డుతూ ఉండే వెంట్రుకలు కలవాడు ఒకడు, కాషాయ రంగు బట్టలను ధరించినవాడు ఒకడు– నిజానికి వీళ్ళంతా ఉదర పోషణకు మాత్రమే వివిధ వేషములను వేస్తారు (భజగోవిందం; వ్యాఖ్య స్వామి చిన్మయానంద).శంకరాచార్యుల కాలం నాటికే సన్యాసులు అలా ఉండేవారంటే ఆశ్చర్యం కల్గుతుంది. ఒకప్పుడు ఆధ్యాత్మిక సాధనలో ఉన్నవారు సాధన కొరకు జీవించాలి కాబట్టి ఏదో కొంత భిక్షాన్నాన్ని, దాన్ని పవిత్రమైన ‘మధుకరి’గా భావించి యాచించేవారు. కానీ ఈనాడు ఆధ్యాత్మిక సాధన ఏదీ లేకపోయినా, కేవలం కాషాయ వస్త్రాలను ధరించి, సన్యాసులుగా అవతారమెత్తి యాచిస్తున్నారు చాలామంది.కేరళలోని ఆనందాశ్రమానికి చెందిన విశ్వమాత కృష్ణాబాయి ఏ యువకుడైనా తనకు సన్యాస దీక్షను ఇమ్మని అడిగితే, మందలిస్తూ ఇలా చెప్పేది: ‘సన్యాసం తీసుకోవటం ఏమాత్రం మంచిది కాదు. నీవెందరో సన్నాసులను చూస్తున్నావు. వారు పొందినదేమిటి? గృహాన్ని, బంధువులను వదలటం, కాషాయ వస్త్రాలను ధరించటమే సన్యాసం కాదు. నేను, నాది అన్న భావాన్ని వదలటం. ఇంట్లో ఉన్నప్పుడు కూడా దీనిని నీవు చేయవచ్చు. నీ వైపునుండి అవసరమైన ఒకే ఒక విషయం నీ శాశ్వత స్వరూపాన్ని సాక్షాత్కరించుకొనవలెననే తీవ్రమైన ఆకాంక్ష.ఈ ఆకాంక్షతో రామనామాన్ని స్వీకరించి, నీ ఇరుగు పొరుగు వారినీ, నీ ప్రదేశంలో నున్నవారినీ రాముని రూపాలుగా సేవించు. పవిత్రమూ, సర్వశక్తిమంతమైన రామ నామాన్ని నిరంతరం నీ నాలుక మీద నాట్యం చేయ నివ్వు’ (పుటలు– 41–42; విశ్వమాత కృష్ణాబాయి– స్వామి సచ్చిదానంద – ఆనందాశ్రమము).– రాచమడుగు శ్రీనివాసులు -
ఉన్నత విద్యలో అసలు సవాలు
జూలై 27న విడుదలైన టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ (టీహెచ్ఈ) వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్–2027 భాగస్వామ్య లేదా ప్రాతి నిధ్య నివేదిక భారత ఉన్నత విద్యకు ఒకేసారి ఆశాజనకమైన చిత్రాన్నీ, ఆందోళన కలిగించే వాస్తవాన్నీ చూపించింది. ప్రపంచంలోని 118 దేశాల నుంచి రికార్డు స్థాయిలో 2,297 విశ్వవిద్యాల యాలు ఈ ర్యాంకింగ్ ప్రక్రియలో పాల్గొనగా, 143 విశ్వవిద్యాల యాలతో భారత్ ప్రపంచంలో రెండో అత్యధిక ప్రాతినిధ్యం కలిగిన దేశంగా నిలిచింది.ఎక్కువ విశ్వవిద్యాలయాలు ర్యాంకింగ్‌లో పాల్గొ నడం ఒక విషయం అయితే, ప్రపంచ స్థాయి అగ్రశ్రేణి స్థానాలను సాధించడం మరో విషయం. అందుకే ఈ సందర్భంలో ‘రాశి కంటే వాసి ముఖ్యం’ అనే సామెత సరిగ్గా సరిపోతుంది. ప్రాతినిధ్యం పెరగడం మాత్రమే కాదు, ప్రపంచ నాణ్యతా ప్రమాణాలను అందు కోవడమే నిజమైన విజయానికి కొలమానం.గత ఐదేళ్లుగా భారతీయ విశ్వవిద్యాలయాలు టీహెచ్ఈ ర్యాంకింగ్స్‌లో చురుకుగా పాల్గొంటున్నాయి. అయితే ఈ సంఖ్య పెరుగుతున్నా, నాణ్యతలో ఆశించిన పురోగతి కనిపించడం లేదు. ఇప్పటికీ ప్రపంచ టాప్–100లో మనం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఒక్క భారతీయ విశ్వవిద్యాలయంగానీ, ఉన్నత విద్యా సంస్థగానీ స్థానం సంపాదించలేక పోవడం ఆలోచించాల్సిన విషయం. ఎక్కువ శాతం 300–500 బ్యాండ్లలో లేదా అంతకంటే దిగువనే నిలుస్తున్నాయి.ఎక్కడ వెనుకబడ్డాం?భారతీయ విశ్వవిద్యాలయాలు ముఖ్యంగా మూడు అంశాల్లో గణనీయంగా వెనుకబడి ఉన్నాయి. మొదటిది అంతర్జాతీయీ కరణ– విదేశీ విద్యార్థులు, విదేశీ అధ్యాపకుల సంఖ్య అత్యల్పంగా ఉండడం వల్ల ప్రపంచ అనుసంధానం పరిమితమవుతోంది. రెండవది ఫ్యాకల్టీ–విద్యార్థుల నిష్పత్తి. ప్రపంచ అగ్రశ్రేణి విశ్వవిద్యా లయాల్లో ఒక్కో అధ్యాపకుడికి తక్కువ మంది విద్యార్థులు ఉండగా, మన దేశంలో పరిస్థితి అందుకు విరుద్ధం. మూడవది పరిశోధన ప్రభావం– పరిశోధనా పత్రాల సంఖ్య పెరుగుతున్నా, వాటికి అంత ర్జాతీయ సైటేషన్లు రావడం, పేటెంట్లు, పరిశ్రమలతో భాగస్వా మ్యాలు, సాంకేతిక పరిజ్ఞాన బదిలీ వంటి అంశాల్లో ఇంకా గణనీయ మైన లోటు ఉంది. దీనికి తోడు దేశం మొత్తం పరిశోధన–అభివృద్ధి (ఆర్ అండ్ డీ)పై జీడీపీలో కేవలం 0.6–0.7 శాతం మాత్రమే వ్యయం చేస్తుండగా, అందులో ఉన్నత విద్యా సంస్థల వాటా 8–9 శాతం మాత్రమే. ఈ పరిస్థితుల్లో ప్రపంచ స్థాయి పరిశోధనా విశ్వవిద్యాలయాలను తీర్చిదిద్దడం అంత సులభం కాదు.తూర్పు ఆసియా దేశాల అనుభవం భారత్‌కు విలువైన పాఠాన్ని చెబుతోంది. చైనా తక్కువ సంఖ్యలో విశ్వవిద్యాలయాల తోనే త్సింగ్వా, పెకింగ్ యూనివర్సిటీ వంటి వాటిని ప్రపంచ అగ్రశ్రేణి స్థానాలకు చేర్చింది. సింగపూర్ వంటి చిన్న దేశం కేవలం రెండు ప్రముఖ విశ్వవిద్యాలయాలతోనే ప్రపంచ టాప్–20లో స్థిరమైన స్థానాన్ని నిలబెట్టుకుంటోంది. ఈ దేశాలు ప్రాతినిధ్య సంఖ్యల కంటే నాణ్యత, పరిశోధన, అంతర్జాతీయ భాగస్వా మ్యాలు, ప్రతిభావంతులైన అధ్యాపకులు, దీర్ఘకాలిక ప్రభుత్వ పెట్టు బడులకు ప్రాధాన్యం ఇచ్చాయి. అందువల్లే ప్రపంచ ర్యాంకింగ్స్‌లో స్థిరమైన విజయాలను అందుకుంటున్నాయి.భారత్ కూడా ఇదే దిశగా మరింత దృఢమైన అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. మన జాతీయ విద్యా విధానం–2020 లక్ష్యాలు సాకారం కావాలంటే, విశ్వవిద్యాలయాల్లో పరిశోధనకు అధిక నిధులు కేటాయించడం, అంతర్జాతీయ అధ్యాపకులను, విదేశీ విద్యార్థులను ఆకర్షించడం, పరిశ్రమ–విశ్వవిద్యాలయ భాగస్వా మ్యాలను బలోపేతం చేయడం, ప్రపంచ స్థాయి పరిశోధనలకు ప్రోత్సాహం ఇవ్వడం అత్యవసరం.– ఏటూరి శేఖర్ శర్మ, రిటైర్డ్ జిల్లా విద్యాధికారి -
దైవకార్యాన్ని అర్థం చేసుకోవాలి
దాసియైన మంధర మాటలు విని, కైకేయి దశరథుడిని కోరిన రెండు వరములతో, శ్రీరాముడికి జరగవలసిన పట్టాభిషేక కార్యక్రమం అకస్మాత్తుగా ఆగిపోయింది. అదేకాక, శ్రీరాముడు పదు నాలుగేళ్ళు వనవాసం చేయవలసిన విషమ పరిస్థితి ఏర్పడింది. శ్రీరాముడికి బహిప్రాణంలా ఉండే లక్ష్మణుడు ఈ హఠాత్పరిణామానికి తట్టుకోలేక దుఃఖంలో మునిగిపోయాడు.‘చేతిలోకి వచ్చి స్వంతమయింది కదా అని భావించిన సంపద అంతలోనే పోవడం, అడవుల పాలవడం– ఇవి దైవనిర్ణయా లుగా జరుగుతాయే తప్ప మనుషుల వశంలో ఉండి జరిగేవి కావు తమ్ముడా!’ అని లక్ష్మణుడిని సమాధానపరిచాడు శ్రీరాముడు. తండ్రి మీద కూడా కోపంతో ఉన్న లక్ష్మణుడితో ఇంకా ఇలా చెప్పాడని ‘గోపీనాథ రామాయణము’ తెలిపింది.మనుషుల జీవితాలలో లాభాలాభములను, సుఖదుఃఖములను, భయక్రోధములను, భవాభవంబులను ఏది కలుగజేస్తుందో అది దైవం అనబడుతుంది. విశ్వామిత్రాది తపోధనులు– జితేంద్రియులు అయ్యుండి కూడా– దైవంచే పీడితులగుచూ శక్తిమంతాలైన వారి నియమాలను విడిచిపెట్టినవారై కామక్రోధాసక్తులగుట తెలిసినదే కదా! ఈ లోకంలో కావలసినదిగా భావించబడే కార్యాన్ని కాకుండాచేసి, ఊహించని కార్యాన్ని, సంకల్పించని పరిణామాన్ని జరిగేటట్లుగా చేయడమే దైవకార్యంగా భావించి మనిషి సమాధానపడాలి. అటువంటి వివేకం కలిగిన బుద్ధితో, క్రోధాది ఇంద్రియ భావములను అదుపులో పెట్టుకుని ఆలోచించినపుడు అకస్మాత్తుగా తప్పిపోయిననా పట్టాభిషేక కార్యం గురించిన శోకం నాలో జనించదు.తే. నాకు జూడ బ్రజాపాలనము కంటెనవ్విపినవాస మధికోదయంబు గానననఘ లక్ష్మీవిపర్యయమందు నీవుమది విషాదంబు విడువుము మమత దక్కి. పట్టాభిషేకం చేయించుకుని ప్రజాపాలనం గురించిన పనులలో పడడం కంటె, అడవికి వెళ్ళి అక్కడ జీవితాన్ని గడపడంలోనే నాకు ఎక్కువ ఆనందం లభిస్తుంది. కాబట్టి రాజ్యా ధికారం అనే లక్ష్మీదేవి వదిలి వెళ్ళిపోయిందనే శోకాన్ని విడిచిపెట్టు. ప్రశాంతంగా ఉండు – అని చెప్పి శ్రీరాముడు లక్ష్మణుడిని శాంతపరిచాడు.– భట్టు వెంకటరావు -
అబద్ధం డేగలా... నిజం నత్తలా!
ఒకప్పుడు ఒక వార్త ప్రజల ముందుకు రావాలంటే సమాచారం సేకరించడం, దాన్ని పరిశీలించడం, ధ్రువీకరించడం వంటి ప్రక్రియలు ఉండేవి. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్ ఒక ప్రచురణ వేదికగా మారింది. దీంతో సమాచారం వేగంగా చేరుతోంది. అదే సమయంలో ధ్రువీకరించని సమా చారం కూడా అంతే వేగంగా వ్యాపిస్తోంది. ఏది ఎక్కువ మందికి చేరాలనేదాన్ని ఇప్పుడు ఎడిటర్ కాదు; ఎక్కువ స్పందన వచ్చే కంటెంట్‌ను ముందుకు నెట్టే అల్గోరిథమ్లే నిర్ణయిస్తున్నాయి.ఇటీవల జరిగిన ఒక సంఘటన దీనికి మంచి ఉదాహరణ. 2026 మార్చి 16న, మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే భారత సైన్యంపై అభ్యంతర కరమైన వ్యాఖ్యలు చేసినట్లు చూపే ఒక వీడియో సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించింది. నిజానికి అది మార్చి 14న పీటీఐ రికార్డ్ చేసిన అసలైన ప్రసంగం– ‘భవిష్యత్ భద్రతా సవాళ్లపై సైన్యం సంసి ద్ధత’ గురించి మాట్లాడిన వీడియో. దాని దృశ్యాలను అలాగే ఉంచి, ఏఐ సాయంతో పూర్తిగా వేరే ఆడియో జోడించారు. పీఐబీ ఫ్యాక్ట్–చెక్ యూనిట్, విదేశాంగ మంత్రిత్వ శాఖ ఫ్యాక్ట్–చెక్ విభాగం రెండూ దీన్ని డీప్ ఫేక్‌గా ధ్రువీకరించి, పాకిస్తాన్ ఆధారిత ప్రచార ఖాతాల నుంచి ఇది వ్యాపించిందని అధికారులు గుర్తించేలోపే, వీడియో లక్షల మందికి చేరి పోయింది. మరింత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే, ఇప్పుడు నిజమైన వీడియో వచ్చినా ‘ఇది ఏఐతో సృష్టించిందేమో’ అనే అనుమానం కలుగుతోంది. గణాంకాలు కూడా అదే చెబుతున్నాయి.రాయిటర్స్ ఇనిస్టిట్యూట్ వారి 2025 నివేదిక ప్రకారం 48 దేశాల్లో వార్తలపై ప్రజల నమ్మకం సగటున 40 శాతమే. అంటే ప్రతి ఇద్దరిలో ఒకరు వార్తలను నమ్మడం లేదు. ఇది పదేళ్ల క్రితం కంటే చాలా తగ్గింది. ఎడెల్మన్ వారి సర్వేలో 69 శాతం మంది– ఇది ఉద్దేశపూర్వకంగా చేసే దుష్ప్రచారం అని నమ్ముతున్నారు. యునెస్కో కూడా ఇదే విషయం చెబుతోంది– ధ్రువీకరణ లేని సమాచారం భయంకరంగా వ్యాపిస్తోందని!భారత్‌లో ఇంకా పెద్ద సమస్య. మన దగ్గర అత్యధిక ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారు. వాట్సాప్‌లో ఫార్వర్డ్ చేసేవి, షార్ట్ వీడియోలు– ఇవే చాలామందికి వార్తలు. ఎప్పటివో పాత దృశ్యాలు, సంఘటనలు ఇప్పటి వార్తలుగా ప్రచారం జరగడం సాధారణ విషయం అయ్యింది. ఇందువల్ల ఎంతో నష్టం వాటిల్లుతోంది. ఏదైనా వీడియో లేదా పోస్ట్ చూడగానే ఫార్వర్డ్ బటన్ నొక్కే ముందు, ‘ఇది ఎవరు పోస్ట్ చేశారు, మూలం ఏంటి’ అని ఒక్కసారి ప్రశ్నించుకోవాలి. అధికారిక ఫ్యాక్ట్–చెక్ వేదికలు, విశ్వసనీయ ధ్రువీకరణ సేవలను ఉపయోగించడం అలవాటు చేసు కోవచ్చు. సమాచారం విషయంలో ఏమాత్రం అస్పష్టత ఉండకూడదు. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు కూడా సంచలనం కంటే నమ్మదగిన సమాచారాన్ని ప్రోత్సహించాలి. నిజం నత్తలా నడిచినా... దాని బరువు తెలిసిన వాళ్లు దాని వెనుకే ఉంటారు!– వంగవోలు రవి, ఉపాధ్యాయుడు -
జీవ ఇంధనాలే భారత భవిష్యత్ శక్తి
పెరుగుతున్న పెట్రోల్ ధరలు, నగరాల్లో క్షీణిస్తున్న గాలి నాణ్యత, పశ్చిమాసియాలో చమురు సరఫరాపై నెలకొంటున్న అనిశ్చితి– ఈ మూడు అంశాలు నేడు ప్రతి భారతీయుడి జీవితాన్ని నేరుగా ప్రభావితం చేస్తున్నాయి. ఈ సమస్యలకు పరిష్కారమే జీవ ఇంధనాల వాడకం.ప్రపంచం ఇప్పుడు జీవ ఇంధనాలను కేవలం ప్రత్యామ్నాయ ఇంధనంగా కాకుండా, పర్యావరణ రక్షణ, ఇంధన భద్రత, రైతు ఆదాయం, గ్రామీణ ఉపాధి వంటి వాటిని కలిపే భవిష్యత్ అభివృద్ధి మార్గంగా చూస్తోంది.భారత్ ప్రస్తుతం తన ముడి చమురు అవసరాల్లో 85 శాతానికి పైగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఈ పరిస్థితిలో ప్రత్యా మ్నాయ ఇంధనాల విస్తరణ దేశ ఇంధన స్వావ లంబనకు కీలకం. జీవ ఇంధనాల ప్రత్యేకత ఏమిటంటే, అవి మన దేశంలోనే లభించే వ్యవసాయ, సేంద్రియ వనరుల నుంచి ఉత్పత్తి చేయగలగడం. చెరకు మొలాసిస్, మొక్కజొన్న, పాడై పోయిన ధాన్యాలు, వరి గడ్డి, పంట అవ శేషాలు ఇప్పుడు ఇంధన ముడి సరుకుగా మారు తున్నాయి. అంటే, వ్యర్థాన్ని సంపదగా మార్చే సర్క్యులర్ ఎకానమీకి జీవ ఇంధనాలు బలమైన పునాది వేస్తున్నాయి.జీవ ఇంధనాల్లో బయో–ఇథనాల్, బయో– డీజిల్, బయో–గ్యాస్, బయో– సీఎన్జీ, సస్టెయినబుల్ ఏవియేషన్ ఫ్యూయెల్ వంటి పలు రూపాలు ఉన్నాయి. ముఖ్యంగా రెండో తరం ఇథనాల్ సాంకేతికత వ్యవసాయ వ్యర్థాలను ఉపయోగించడం వల్ల ఆహార భద్రతకు భంగం కలగకుండా ఇంధన ఉత్పత్తి సాధ్యమవుతోంది. 2014లో పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమం సుమారు 1.5 శాతం మాత్రమే ఉండగా, 2024–25 నాటికి అది 19.05 శాతానికి చేరింది. 2025–26 ఆర్థిక సంవ త్సరంలో సగటు మిశ్రమం 20 శాతానికి చేరువ కావడం ఈ కార్యక్రమం విజయాన్ని సూచిస్తోంది.భారత్‌కు కొత్త అవకాశాలుఇటీవల కేంద్ర మంత్రివర్గం 23,731 కోట్ల వ్యయంతో ‘గోబర్ధన్ – నేషనల్ సర్క్యులర్ బయోఎనర్జీ పథకాన్ని’ ఆమోదించడం జీవ ఇంధన రంగంలో కీలక మలుపు. పశువుల పేడ, పంట అవశేషాలు, వంటింటి వ్యర్థాలు, మార్కెట్ వ్యర్థాలను కంప్రెస్డ్ బయోగ్యాస్, బయో–స్లర్రీగా మార్చి గ్రామీణ ప్రాంతాలను శుభ్రమైన ఇంధన ఉత్పత్తి కేంద్రాలుగా తీర్చిద్దడం ఈ పథకం లక్ష్యం. ప్రభుత్వ అంచనాల ప్రకారం, ఈ రంగం ద్వారా రూ. 40,000 కోట్లకు పైగా విదేశీ మారకద్రవ్య ఆదా, 1.5 లక్షలకు పైగా ఉపాధి అవకాశాలు, 10 మిలియన్ మెట్రిక్ టన్నుల శిలాజ ఇంధన వినియోగానికి ప్రత్యామ్నాయం సాధ్యమవుతాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ప్రధానమంత్రి జీవన్ యోజన’ ద్వారా 2జీ ఇథనాల్ ప్రాజెక్టులకు ప్రోత్సాహం అందుతోంది. ‘సతత్’ పథకం ద్వారా కంప్రెస్డ్ బయో గ్యాస్ ఉత్పత్తిని విస్తరిస్తున్నారు.2023లో జి–20 వేదికపై ప్రారంభమైన గ్లోబల్ జీవ ఇంధనాల కూటమి... జీవ ఇంధ నాల ఉత్పత్తి, సాంకేతిక మార్పిడి, వాణిజ్య సహకారానికి ప్రపంచ వేదికగా మారుతోంది. సస్టెయినబుల్ ఏవియేషన్ ఫ్యూయెల్, భవిష్యత్ బయో ఎనర్జీ రంగాల్లో భారత్‌కు ఇది కొత్త అవకాశాలను తెరుస్తోంది. అయితే జీవ ఇంధనాల విస్తరణలో కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి.భూమి వినియోగం, నీటి అవసరాలు, ముడి సరుకు సరఫరా, సాంకేతిక వ్యయాలు వంటి అంశాలను సమతుల్యం చేయాల్సి ఉంటుంది. మొత్తానికి చమురు బావుల నుంచి మాత్రమే కాదు, మన పొలాల నుంచి కూడా దేశ భవిష్యత్ శక్తి ఉత్పత్తి కావచ్చని జీవ ఇంధనాలు మనకు గుర్తుచేస్తున్నాయి.– ఆర్ధ శ్రీనివాస్ పటేల్, మీడియా–కమ్యూనికేషన్స్ అధికారి (రేపు ప్రపంచ జీవ ఇంధన దినోత్సవం) -
మోసపోయినా మంచితనం వదలొద్దు!
జీవితంలో మనల్ని బాధించినవాళ్లు రెండు విషయాల్లో ఒకదాన్ని తప్పకుండా తీసుకెళ్తారు. ఒకటి మన ప్రశాంతతను, రెండోది మన మంచితనాన్ని. ప్రశాంతత కొంతకాలానికి తిరిగి వస్తుంది. కానీ మంచితనం పోతే మనల్ని మనమే కోల్పోతాం. ఎందుకంటే, బాధ మనిషిని రెండు రకాలుగా మారుస్తుంది.తాను అనుభవించిన గాయాలను ఇతరులకూ పంచడం మొదలుపెట్టడం అనేది ఒక రకమైతే... తాను అనుభవించిన బాధ ఇంకెవరికీ కలగకూడదనే భావనతో జీవించడం రెండో రకం. ఈ రెండో రకమైన మనుషులే నిజంగా అరుదు. వాళ్లు కూడా మోసపోతారు. వాళ్లూ కూడా విరిగిపోతారు. వాళ్లూ కన్నీళ్లు పెడతారు. కానీ తమలోని మంచి మనిషిని మాత్రం కోల్పోరు. ఎందుకంటే, చెడ్డవాడిగా మారడానికి ఒక్క గాయం చాలు, మంచి మనిషిగా మిగిలి పోవడానికి మాత్రం గొప్ప హృదయం కావాలి.విజయవంతులైన మనుషులు చాలామంది కనిపిస్తారు. తెలివైన వాళ్లు కూడా కనిపిస్తారు. కానీ, బాధను అనుభవించిన తర్వాత కూడా ఎవరికీ బాధ కలిగించకుండా జీవించే మనుషులు మాత్రం అరుదుగా కనిపిస్తారు. వాళ్ల జీవితంలో ఎంత చెడు ఎదురైనా, వాళ్లలోని మంచిని కోల్పోకపోవడమే వాళ్ళ వ్యక్తిత్వంలోని గొప్పదనం. అందుకే, బాధ హృదయాన్ని తాకినా, హృదయంలో ద్వేషానికి స్థానం ఇవ్వకుండా జీవించగలగడమే నిజమైన విజయం.ముందుగా క్షమాపణ చెప్పేవాడు ధైర్యవంతుడు. ముందుగా క్షమించేవాడు బలవంతుడు. ముందుగా మర్చిపోయే వాడు ప్రశాంతంగా జీవించగలడు. తనను బాధించిన తర్వాత కూడా మంచి తనాన్ని ఎంచుకునే మనిషి ఈ ప్రపంచంలో అత్యంత అరుదైన వ్యక్తి.– కొత్త కృష్ణవేణి -
అనుబంధ వ్యవసాయమే జీవధార
ఈ రోజుల్లో రైతు వ్యవసాయం చేయడం ఒక్కటే సరిపోవడం లేదు. ఎరువులు, విత్తనాలు, కూలీల ఖర్చులు పెరుగుతుండగాపంటల ధరలు మాత్రం ఎప్పుడూ ఆశించిన స్థాయిలో ఉండటం లేదు. కొన్ని సంవత్సరాల్లో వర్షాభావం, మరికొన్ని సంవత్సరాల్లో అధిక వర్షాలు, తెగుళ్లు రైతును నష్టాలకు గురిచేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రైతు కుటుంబానికి స్థిరమైన ఆదాయం రావాలంటే వ్యవసాయంతో పాటు అదనపు ఆదాయ మార్గాలను కూడా అభివృద్ధి చేసుకోవాలి. ఇదే భావనతో శాస్త్రవేత్తలు, ప్రభుత్వం, వ్యవ సాయ విశ్వవిద్యాలయాలు ‘ద్వితీయ వ్యవసాయం’ (సెకండరీ అగ్రికల్చర్) అనే భావనను ప్రోత్సహిస్తున్నాయి.పంటను పండించడం ప్రాథమిక వ్యవసాయం. ఆ పంటను ప్రాసెసింగ్ చేయడం, విలువను పెంచడం, ప్యాకింగ్ చేయడం, వ్యవసాయ వ్యర్థాలను ఉపయోగించి కొత్త ఉత్పత్తులను తయారు చేయడం, పశుపోషణ, కోళ్ల పెంపకం, చేపల పెంపకం, తేనెటీగల పెంపకం వంటి వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలను ద్వితీయ వ్యవసాయం అంటారు. ‘పంటను మాత్రమే అమ్మకుండా, పంటతో పాటు మరిన్ని ఉత్పత్తులను తయారు చేసి ఆదాయం పెంచుకోవ డమే ద్వితీయ వ్యవసాయం’.విలువ జోడించండి–ఎక్కువ ధరను పొందండిచాలా మంది రైతులు పంట కోసిన వెంటనే మార్కెట్‌కు తీసు కెళ్లి అమ్మేస్తారు; అప్పుడు ధర తక్కువగా ఉంటుంది. అదే పంటను ప్రాసెసింగ్ చేసి అమ్మితే మంచి లాభం వస్తుంది. వరిని బియ్యంగా మార్చడం, బియ్యంతో అటుకులు, మరమరాలు తయారు చేయడం, వేరుశనగతో నూనె, పీనట్ బటర్ తయారు చేయడం, మిరపతో మిరప పొడి తయారు చేయడం, పసుపును పాలిష్ చేసి పసుపు పొడిగా విక్రయించడం, మామిడితో జ్యూస్, జామ్, పల్ప్ తయారు చేయడం ఈ కోవలోకే వస్తాయి. దీనివల్ల రైతు సాధారణంగాపొందే ధర కంటే 20–100 శాతం వరకు అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. చిరుధాన్యాలకు విలువ జోడించడం ద్వితీయ వ్యవసాయంలో అత్యంత లాభదాయకమైన, స్థిరమైన మార్గం. ముడి ధాన్యాన్ని మాత్రమే విక్రయించే బదులు, పిండి, రవ్వ, రెడీ–టు–కుక్, రెడీ–టు–ఈట్, బేకరీ, ఆరోగ్య ఆహార ఉత్పత్తులుగా మార్చి బ్రాండ్ పేరుతో విక్రయిస్తే గణనీయమైన ఆదాయాన్ని పొందవచ్చు. భారతదేశంలో ప్రతి సంవత్సరం పండ్లు, కూరగాయలు, ధాన్యాలలో గణనీయమైన నష్టం కోత అనంతరం సంభవిస్తుంది. సరైన నిల్వ, గ్రేడింగ్, ప్యాకింగ్ లేకపోవడం దీనికి ప్రధాన కారణం. ఒక గ్రామంలోనే చిన్న రైస్ మిల్లు, ఆయిల్ మిల్లు, పప్పు మిల్లు లేదా మసాలా పొడి తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తే రైతులకు దగ్గరలోనే మార్కెట్ లభిస్తుంది. అదనంగా గ్రామ యువతకు కూడా ఉపాధి లభిస్తుంది.అనుబంధ ఆదాయ మార్గాలురైతు ఇంట్లో రెండు ఆవులు లేదా గేదెలు ఉన్నా ప్రతి రోజు నగదు ఆదాయం వస్తుంది. పాలను నేరుగా అమ్మడం కంటే పెరుగు, నెయ్యి, పనీర్, వెన్న, చీజ్ తయారు చేసి అమ్మితే మరింత లాభం వస్తుంది. పాడి పరిశ్రమ రైతు కుటుంబానికి సంవత్సరం పొడవునా ఆదాయాన్ని అందించే అత్యుత్తమ అనుబంధ వృత్తి. అలాగే తేనెటీగల పెంపకానికి ఎక్కువ భూమి అవసరం లేదు. దీని ద్వారా తేనె, బీస్వాక్స్, రాయల్ జెల్లీ లభిస్తాయి. వరి గడ్డి, మొక్కజొన్న కాండాలు వంటి వ్యవసాయ అవశేషా లను ఉపయోగించి పుట్టగొడుగులను పెంచవచ్చు. చిన్న గదిలోనే సాగు చేయవచ్చు. వ్యవసాయ కుంటలు, చెరువులు, ఫార్మ్పాండ్లలో చేపల పెంపకం చేపట్టవచ్చు. వరిసాగుతో పాటు చేపల పెంపకం చేపడితే ఒకే భూమి నుండి రెండు రకాల ఆదాయంపొందవచ్చు. వ్యవసాయం, పశుపోషణ ఒకదానికొకటి పరస్పర అనుబంధమైనవి. పంట అవశేషాలు పశుగ్రాసంగా ఉపయోగపడ తాయి. వర్మీ కంపోస్ట్, బయోగ్యాస్, సేంద్రియ ఎరువులు తయారు చేయడానికి పశువుల పేడ ఉపయోగపడుతుంది. చాలా మంది రైతులు వరి గడ్డి, మొక్కజొన్న కాండాలు, చెరకు ఆకులు వంటి అవ శేషాలను కాల్చివేస్తారు. అలా చేయకుండా వాటిని ఉపయోగించి వర్మీకంపోస్ట్, బయోగ్యాస్, బయోచార్‌కు వినియోగించ వచ్చు.స్వపరాగ సంపర్క పంటల్లో వరి, శనగ, పెసర, మినుము, ఉలవలు, వేరుశనగ నాణ్యమైన విత్తన ఉత్పత్తి అనేది ద్వితీయ వ్యవసాయం కింద అత్యంత లాభదాయకమైన కార్యకలాపాలలో ఒకటి. తక్కువ విస్తీర్ణంలో సాగుచేయగలిగే మల్లె, గులాబీ, బంతి వంటి పూల సాగుతో పాటు తులసి, కలబంద, అశ్వగంధ, లెమన్ గ్రాస్ వంటి ఔషధ, సుగంధ మొక్కల సాగు ద్వారా మంచి ఆదాయం పొందవచ్చు. ఇటీవలి కాలంలో నగర ప్రజలు గ్రామీణ జీవనశైలిని అనుభ వించడానికి ఆసక్తి చూపుతున్నారు. రైతులు తమ పొలాల్లో ప్రకృతి సందర్శన, సేంద్రీయ వ్యవసాయ ప్రదర్శనలు, గ్రామీణ ఆహారం, పంటల సందర్శన వంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా కూడా అదనపు ఆదాయం పొందవచ్చు.పోషకాహార లోపం తొలగించేలా...పంటల సాగు నిలిచిపోతే రైతులు, గ్రామీణ కుటుంబాల ఆదాయం దెబ్బ తింటుంది. దీనిని నివారించేందుకు ప్రతి ఇంటా నాటుకోళ్లను పెంచాలి. సొంత వినియోగానికే కాకుండా... గుడ్లు, మాంసానికి సంవత్సరమంతా ఆదాయం ఉంటుంది. గిరిరాజ, వనరాజ, గ్రామప్రియ, స్వర్ణధార, శ్రీనిధి వంటి మేలురకం కోడి పిల్లలను పెంచవచ్చు.గ్రామీణ ప్రాంతాల్లో ఐదు సంవత్సరాల్లోపు పిల్లల మరణాలకు 69 శాతం కారణం పోషకాహార లోపమే.సంప్రదాయ భారతీయ ఆహారంలో ప్రొటీన్ల లోపం ఉంటుంది. వంద గ్రాముల కోడిగుడ్లలో లభించే 6.9 గ్రాముల నాణ్యమైన ప్రొటీన్ తక్కువ ధరకే లభిస్తుంది. కోడి మాంసంలో కూడా 22 శాతం ప్రొటీన్ ఉండి, కొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయి. ఉత్పత్తి అవుతున్న కోడిగుడ్లు, కోడి మాంసంలో 75–80 శాతాన్ని పట్టణాల్లో ఉండే 25 శాతం జనాభా తింటుంటే... గ్రామీణ ప్రజలు ఇప్పటికీ పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఈ అంతరాన్ని తొలగించడానికి పెరటి కోళ్ళ పెంపకం ఎంతో దోహదపడుతుంది.ప్రభుత్వ పథకాలైన ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార పరిశ్రమల అభివృద్ధి పథకం, జాతీయ తేనెటీగలు మరియు తేనె మిషన్, డెయిరీ అభివృద్ధి పథకాలు, నాబార్డ్ గ్రామీణ వ్యవసాయ ఆధారిత పరిశ్రమల పథకాలు, వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి ద్వారా శిక్షణ, రుణాలు, సబ్సిడీలు పొందవచ్చు. నేటి పరిస్థితుల్లో ‘పంట పండించడం మాత్రమే కాదు... పంటకు విలువ జోడించడం కూడా రైతు విజయానికి కీలకం. ‘వ్యవసాయంలో వైవిధ్యం – రైతు కుటుంబానికి స్థిరమైన ఆదాయం’ అనే లక్ష్యంతో ద్వితీయ వ్యవసాయాన్ని ప్రతి గ్రామంలో విస్తృతంగా ప్రోత్సహించాలి.– డా‘‘ కె. తేజస్వర రావు, డా‘‘ బి. సహదేవ రెడ్డి-ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ సీనియర్ శాస్త్రవేత్తలు -
భారతీయతకు ప్రతీక
మగ్గం చప్పుడు వినిపిస్తే అది కేవలం నూలుపోగులు అల్లే శబ్దం కాదు... ఒక కుటుంబం జీవన గీతం. ఒక గ్రామం ఆర్థిక స్పందన. ఒక నాగరికత ఊపిరి. సింధు లోయ నాగరికత తవ్వకాల్లో లభించిన ఆధారాలు భారతీయులు వేల ఏళ్ల కిందటే నూలు నేయడంలో నైపుణ్యం సంపాదించినట్లు చెబుతున్నాయి. కాలం మారినా చేనేత తన రూపాన్ని మాత్రమే మార్చుకుంది; తన ఆత్మను కాదు. ప్రతి అల్లికలో ఒక ప్రాంతపు సంస్కృతి, ప్రతి నమూనాలో ఒక సంప్రదాయం, ప్రతి వస్త్రంలో ఒక సమాజపు సృజనాత్మకత ప్రతిఫలిస్తూనే ఉంది. భారత చేనేత వైభవం దాని వైవిధ్యంలోనే కనిపిస్తుంది. ఉత్తరాన బెనారసీ, పష్మినా; దక్షి ణాన కాంచీపురం; తెలుగునాట గద్వాల్, పోచంపల్లి, మంగళగిరి, ఉప్పాడ; తూర్పున బలుచారి, అస్సాం పట్టులు; పశ్చిమాన పటోలా... ప్రాంతం మారితే అల్లిక మారుతుంది, రంగు మారుతుంది, నమూనా మారుతుంది. కానీ ప్రతి వస్త్రంలోనూ భారతీయ సంస్కృతి సౌందర్యమే ప్రతిబింబిస్తుంది. అందుకేప్రపంచ వస్త్ర సంపదలో భారత చేనేతకు ప్రత్యేక గౌరవం దక్కింది.దేశంలో వ్యవసాయం తర్వాత అత్యధిక గ్రామీణ ఉపాధిని కల్పిస్తున్న రంగాల్లో ఇది ఇప్పటికీ ఒకటి. ఈ రంగంలో మహిళల పాత్రను ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిందే. నూలు వడకడం నుంచి రంగులు వేయడం, అల్లిక, డిజైన్, విక్రయాల వరకు ప్రతి దశలో మహిళలే కీలక పాత్ర పోషిస్తున్నారు. వారికి చేనేతకేవలం ఉపాధి కాదు; ఆర్థిక స్వావలంబనకు, కుటుంబ నిర్ణయాల్లో భాగస్వా మ్యానికి, ఆత్మవిశ్వాసానికి బలమైన ఆధారం. అందుకే గ్రామీణ మహిళా సాధికారతకు చేనేత ఒక మౌన విప్లవంగా నిలిచింది.ఇదీ చదవండి: ఢిల్లీ అమ్మాయి, జాంబియా సుప్రీంకోర్టు తొలి మహిళా జడ్జ్‌గా ఘనతనేడు ప్రపంచవ్యాప్తంగా పర్యావరణహిత ఉత్పత్తులపై ఆసక్తి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని జాతీయ సంస్థలు సంప్రదాయం, సాంకేతికత, మార్కెట్ మధ్య వారధిగా నిలిచి నేతకార్మికులకు సాయం చేస్తున్నాయి. అయితే పవర్‌లూమ్‌ల పోటీ, చౌక దిగుమతులు, ముడి సరుకుల ధరల పెరుగుదల, మధ్యవర్తుల ఆధిపత్యం, మార్కెటింగ్ లోపాలు, డిజిటల్ వాణి జ్యంలో పరిమిత ప్రవేశం చేనేత రంగాన్ని ఇబ్బందులకు గురిచేయడం గమ నార్హం. శ్రమకు తగిన ప్రతిఫలం దక్కని పరిస్థితుల్లో యువత ఈ వృత్తి వైపు ఆకర్షితులు కావడం లేదు. ప్రభుత్వం ఈ సమస్యలను పరిష్కరించి నేతను కాపాడాలి. దాన్ని కాపాడటం అంటే ఒక వృత్తిని రక్షించడం మాత్రమే కాదు; భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్నీ, లక్షలాది కుటుంబాల జీవనాధారాన్నీ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థనూ పరిరక్షించడం కూడా!– వాడవల్లి శ్రీధర్ ‘ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ -
దొంగలున్నారు జాగ్రత్త!
దొంగలు ధనాన్ని దోచుకు వెళ్తారు. ధనమంటే నగదు మాత్రమే కాదు. ధన కనక వస్తు వాహనాల రూపంలో ఉండే విలువైన వస్తువులన్నింటికీ దొంగల వల్ల ప్రమాదమే. కొందరు ధనం లాగేస్తారు. కొందరు వాహనాలను చాకచక్యంగా దొంగిలిస్తారు. కొందరు కొత్త తరం దొంగలు బ్యాంకు ఖాతాల్లో ధనాన్ని చప్పుడు లేకుండా లాగి వేయగల బుద్ధిశాలులు! అయితే జీవితంలో విలువైనవి వస్తు రూపంలో ఉండనివి కూడా చాలా ఉన్నాయి. శీలమూ, సౌందర్యమూ, మేధస్సూ, ధర్మబుద్ధీ, సిగ్గూ, లజ్జా, వినయమూ, సహనమూ, ఆ మాటకొస్తే ప్రాణమూ– ఇవన్నీ రూకలలో వెలగట్టలేని నిధులే. వీటిని తస్కరించటంలో విశేషమైన కౌశల్యం కల దొంగలున్నారు (అంటాడు, మహాభారతంలో విదురుడు).జరా రూపం హరతి హి, ధైర్యం ఆశా. ముసలితనం అనే దొంగ, సౌందర్యం అనే ధనాన్ని, ఎంత జాగ్రత్తగా కాపాడుకొన్నా, తరలించుకు పోగలడు. అలాగే దురాశ అనే దొంగ, మనిషి ధీరత్వాన్నీ, ‘పెద్దమనిషి’తనాన్నీ నొక్కేయగలదు. ఆశలో చిక్కుకొన్నవాడు లేకితనానికీ, చవకబారుతనానికీ దిగజారి, నగుబాటు పాలవటం లోకంలో మామూలే కదా! మృత్యుః ప్రాణాన్ హరతి, ధర్మచర్యాం అసూయా. మృత్యువు, తనకు అనుకూలమైన సమయం వచ్చేదాకా వేచి ఉండి, అందరూ చూస్తుండగానే, ప్రాణాలను హరించుకుపోతుంది. ధర్మాత్ముడి ధర్మ బద్ధత అనే సంపదను, అసూయ అపహరించేస్తుంది. దుర్యోధనుడిని చూడండి.క్రోధః శ్రియం, శీలం అనార్యసేవా. క్రోధం అనే దొంగ మనసులో చొరబడితే, మనిషి వివేకం కోల్పోయి, పంతాలనీ పోట్లాటలనీ, కక్షలనీ కోర్టులనీ, తన సంపదను ఆ దొంగవాడికి సమర్పించుకొంటాడు. అలాగే దుష్టసాంగత్యం అనే చోరుడు, శీలాన్ని దోపిడీ చేసి, నిప్పులాంటి మనిషిని నికృష్టుడిగా మిగులుస్తాడు. కామం అన్న పిశాచి దొంగ, మనిషిలో సిగ్గునూ, లజ్జనూ కాజేసి, ఖాళీ చేస్తాడు. అందరికంటె ప్రమాదకరమైన పెద్ద దొంగ ‘అభిమానం’– అంటే అహంకారం. అది సర్వాన్నీ దోచుకు వెళ్ళగల దోపిడీ దొంగ. సర్వం ఏవ అభిమానః (హరతి), సందేహం లేదు. – ఎం. మారుతి శాస్త్రి -
కోర్టు ధిక్కారంపై చట్టం ఏమంటోంది?
‘హైడ్రా’ కమిషనర్‌పై అరవైకి పైగా కోర్టు ధిక్కార వ్యాజ్యాలున్నాయనీ, ఆయన్ని ఈ బాధ్యత నుంచి తప్పించాలనీ ఇటీవల తెలంగాణ ఉన్నత న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ‘అధికార వికేంద్రీకరణ’ ముఖ్యం. శాసన, కార్యనిర్వాహక, న్యాయ అనే మూడు వ్యవస్థలు స్వతంత్రంగా వ్యవహరిస్తాయి. శాసన సభలు చట్టాలు చేస్తాయి, ‘కార్యనిర్వాహకవర్గం’ ఆ చట్టాలను అమలు చేస్తుంది. న్యాయ వ్యవస్థ చట్టాల అమలు జరగకపోతే జరిగేలా ఆదేశా లిస్తుంది.స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా న్యాయ స్థానాలు వ్యవహరించేందుకు రాజ్యాంగం ద్వారా తగు ఏర్పాటు జరిగింది. హైకోర్టు, సుప్రీం కోర్టు లకు కంటెంప్ట్ అధికారం కూడా రాజ్యాంగంలోని 215, 129 అధికరణాల ద్వారా దఖలుపడింది. దేశంలోని అన్ని న్యాయ స్థానాలు, అధికారులు సుప్రీం కోర్టుకు సహాయ సహకారాలు అందించాలని 144వ అధికరణం నిర్దేశించింది.కోర్టులు చట్టాలననుసరించి న్యాయ నిర్ణయం చేయాలి. కానీ, సంపూర్ణ న్యాయం చేయడానికి, చట్టాలను దాటి కూడా న్యాయ నిర్ణయం చేసే అధికారం ఆర్టికల్ 142 ద్వారా, సుప్రీంకోర్టుకు (విశేషాధికారాలను) కల్పించింది రాజ్యాంగం. న్యాయస్థానాల తీర్పులను గౌరవించి వాటిని అమలుపరచాలన్నది ప్రాథమిక సూత్రం. ఒక వేళ, న్యాయం జరగలేదని అనిపిస్తే, సుప్రీంకోర్టు వరకు అప్పీల్ చేసుకొనే అవకాశం ఉంది.చట్టం ఏం చెబుతోంది?న్యాయస్థానాల తీర్పులను గౌరవించకపోతే, న్యాయవ్యవస్థ ఉనికే ప్రశ్నార్థకమౌతుంది. అందుకే న్యాయస్థానాల తీర్పులను గౌరవించ డానికి, అమలుపరచడానికి కోర్టులకు ‘కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ చట్టం– 1971’ ద్వారా ‘కంటెంప్ట్’ అధికారం కలుగచేసింది పార్లమెంటు. ఈ చట్టంలోని సెక్షన్ 12 ప్రకారం, న్యాయస్థానాల ఆదే శాలు ఉల్లంఘించినవారికి, ఆరు నెలల వరకు జైలు శిక్ష, రెండు వేల రూపాయల వరకు జరిమానా లేక ఈ రెండూ కూడా విధించవచ్చు. కక్షిదారులేకాక, మరెవరైనా న్యాయస్థానాల ఆదేశాల అమలులో అడ్డంకులు కలిగిస్తే, వారు కూడా శిక్షార్హులే. ‘కంటెంప్ట్’ అధికారం కేవలం హైకోర్టు, సుప్రీంకోర్టులకు మాత్రమే కలుగచేసింది ఈ చట్టం. కేవలం శిక్ష నుంచి తప్పించుకోవడానికి కాక నిజాయితీగా ‘క్షమార్పణ’ వేడితే శిక్ష వేయకుండా, లేదా తక్కువ కాలానికి శిక్ష విధించవచ్చని ఈ చట్టం స్పష్టం చేసింది. కిందిస్థాయి న్యాయ స్థానాల ఆదేశాలను పాటించనివారిపై ‘కంటెంప్ట్’ను విచారించి శిక్షించే అధికారాన్ని హైకోర్టులకే ఇచ్చింది ఈ చట్టం.కోర్టులు చాలా అరుదుగా ఈ అధికారాన్ని వినియోగించాలని సుప్రీంకోర్టు చెప్పింది. కోర్టు తీర్పులను నిజాయితీగా విమర్శించ డాన్ని ఈ చట్టం ‘కంటెంప్ట్’గా పరిగణించదు. కోర్టు తీర్పులను గుణాత్మకంగా విమర్శించవచ్చు. కానీ, తీర్పునిచ్చిన న్యాయ మూర్తిని వ్యక్తిగతంగా విమర్శిస్తే కోర్టు ధిక్కరణకు పాల్పడిన వారవుతారు. ఇంతవరకు, కోర్టు ధిక్కరణ నేరానికి ఎక్కువ కాలానికి శిక్ష అనుభవించింది జస్టిస్ కర్ణణ్. సుప్రీంకోర్టు ఆదేశాలను ఖాతర్ చేయకపోవడమే కాకుండా, ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తులకే సమన్లు పంపి, వారికి జైలు శిక్ష విధించారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆయనకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది సుప్రీంకోర్టు. మొత్తం మీద ప్రభుత్వ అధికారులే ఎక్కువగా కోర్టు ధిక్కరణ కేసులను ఎదుర్కోవడం గమనార్హం.– హరీష్ కుమార్ కొలిచాల, న్యాయవాది, అసిస్టెంట్ జనరల్ మానేజర్ (విశ్రాంత), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా -
జ్ఞానం పంచితేనే పెరిగే సంపద
ఓం సహనావవతు సహనౌభునక్తు సహవీర్యం కరవావహైతేజస్వినావధీతమస్తు మావిద్విషావహై ఓం శాంతి శాంతి శాంతిఃతైత్తిరీయోపనిషత్తులోని శాంతి మంత్రం ఇది. పూర్వం విద్యాభ్యాసానికి ముందు ప్రతి దినం గురు శిష్యులు ముక్తకంఠంతో ఈ శ్లోకాన్ని పఠించేవారు. ‘మనం కలిసి మెలిసి ఉందాము. కలిసి మెలిసి ఫలితాలను అనుభవిద్దాము. కలిసి పనులను చేస్తూ తేజో పూర్ణుల మవుదాము. మనలో మనకు వైషమ్యాలు ఉండకుండు గాక. శాంతితో విలసిల్లుదాము’ అని చేసే ఉత్తమ ప్రార్థన ఇది.ఈ ప్రార్థన గురుశిష్యు లిరువురి మనస్సులో నిక్షిప్తమై ఉండేది. ఇరువురు కలిసి విజ్ఞాన కృషి సలపాలి. కలిసి విజ్ఞాన ఫలం పొందాలి. గురు శిష్యుల మధ్య విబేధాలు లేకుండా శాంతియుతంగా విజ్ఞానార్జన చేయాలి అనే సమభావన; గురువును శిష్యుడు, శిష్యుని గురువు పరస్పరం గౌరవించుకునే ఉన్నత భావన ప్రాచీన విద్యావిధానంలో కనిపిస్తుంది. అప్పుడు విద్య అంటే గురు శిష్యు లిద్దరు కలిసి చేసే నిత్య సత్య శోధనా యత్నం.విద్య నిరంతర ప్రవాహం. పరంపరా గతంగా విస్తరించేది. గురువు నుండి శిష్యుడు నేర్చుకున్న విద్య, సంస్కారం తర్వాత మళ్ళీ తన శిష్యులకు అందజేస్తాడు. ఆ శిష్యుల నుండి తరవాతి వారికి అలా అందుతూనే ఉంటుంది. ఇది నిరంతర జ్ఞానగంగా ప్రవాహం. ఇచ్చే కొద్దీ పెరిగే సంపద జ్ఞాన సంపద. ఆనాడు గురు శిష్య సంబంధాలు ఎంత ఆదర్శంగా ఉండేవో, జ్ఞానార్జన ఎలా సాగేదో ఈ శ్లోకం చెబుతోంది.– డా. చెంగల్వ రామలక్ష్మి -
కెమిస్ట్రీని మలుపు తిప్పిన ఆక్సీజనుడు
మనం పీల్చే గాలిలో ఏముంది? ఈ ప్రశ్న ఇప్పుడు చిన్నదిగా అనిపించవచ్చు. కానీ కొన్ని వందల ఏళ్ల క్రితం వరకు దీనికి సమాధానం ఎవరికీ తెలియదు. పురాతన గ్రీకులు చెప్పినట్టు గాలి అనేది ఒక మార్పు లేని ప్రాథమిక మూలకం అని ప్రపంచం నమ్మింది. ఈ నమ్మకాన్ని బద్దలుకొట్టి, మనం ప్రాణాలతో ఉండటానికి కారణమయ్యే ‘ఆక్సిజన్’ గుట్టు విప్పినవాడు జోసెఫ్ ప్రీస్ట్లీ. ఆయన కేవలం ఒక శాస్త్రవేత్త మాత్రమే కాదు; ఒక ఉపాధ్యాయుడు, మత బోధకుడు, విప్లవ భావాలున్న సాహసి.బ్రిటన్‌లో జన్మించిన ఆయన జీవితం ఎంతో ఆసక్తికరంగా సాగింది. లీడ్స్ నగరంలో నివసిస్తున్నప్పుడు, ఆయన ఇంటి పక్కనే ఒక బీర్ తయారీ కేంద్రం ఉండేది. అక్కడ పులియబెట్టే ప్రక్రియలో వచ్చే ‘ఫిక్స్డ్ ఎయిర్’ (కార్బన్ డయాక్సైడ్)పై ఆసక్తి కలిగింది. నేటి సాఫ్ట్ డ్రింక్ పరిశ్రమకు పునాది వేసింది ఆ ఆసక్తే. నీటిలో కార్బన్ డయాక్సైడ్ను కలిపి కృత్రిమంగా ‘సోడా వాటర్’ను తయారు చేసే విధానాన్ని ఆయన కనిపెట్టారు.1774 ఆగస్టు 1న ఆయన చేసిన ప్రయోగం అతి ముఖ్యమైనది. ఒక భూతద్దం సహాయంతో సూర్యరశ్మిని మెర్క్యూరిక్ ఆక్సైడ్ పొడి మీద కేంద్రీకరించినప్పుడు దాని నుంచి ఒక రకమైన వాయువు వెలువడటం గమనించారు. అది సాధారణ గాలి కంటే ఐదారు రెట్లు స్వచ్ఛంగా ఉండటమే కాకుండా, అందులో మంటలు మరింత ప్రకాశవంతంగా కనిపించాయి. ఆ వాయువును పీల్చినప్పుడు ఊపిరితిత్తులు ఎంతో తేలికగా అనిపించాయి. ఆ గాలిలో ఒక ఎలుక సాధారణ గాలిలో కంటే నాలుగు రెట్లు ఎక్కువ సేపు ప్రాణంతో ఉండటాన్ని గమనించారు. దానికి ఆయన ‘డీఫ్లోజిస్టికేటెడ్ ఎయిర్’ అని పేరు పెట్టాడు. తర్వాత ఫ్రెంచ్ శాస్త్రవేత్త లావోయిజర్ దీనికి ‘ఆక్సిజన్’ అని నామకరణం చేశారు.ప్రకృతిలో సమతుల్యత ఎలా కాపాడబడుతుందో కూడా ప్రీస్ట్లీ మొదటగా గుర్తించారు. ఒక మూసి ఉన్న పాత్రలో మంట వెలిగించినా లేదా ఎలుకను ఉంచినా కొద్ది సేపటికి ఆ గాలి కలుషితమై మంట ఆరిపోవడం, ఎలుక చనిపోవడం జరిగేది. కానీ అదే పాత్రలో ఒక పచ్చని మొక్కను ఉంచి ఎండలో పెడితే, అది గాలిని తిరిగి ‘శుద్ధి’ చేస్తుందని ఆయన కనుగొన్నారు. ఆయన కనిపెట్టిన ఆక్సిజన్ వైద్య చికిత్సల నుంచి అంతరిక్ష పరిశోధనల వరకు కీలక పాత్ర పోషిస్తున్న సంగతి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఇటువంటి పెద్ద ఆవిష్కరణలే కాదు... నిత్య జీవితంలో మనకు ఉపయోగపడే చిన్న చిన్న విషయాలను కూడా ఆయన విస్మరించలేదు. మనం పెన్సిల్‌తో రాసిన తప్పులను తుడిపే ‘రబ్బర్ ఎరేజర్’ను కూడా ఆయనే కనిపెట్టారని తెలిస్తే మనకు మరింత ఆశ్చర్యం కలుగుతుంది! అందుకే అతడు గొప్పవాడయ్యాడు!అసమ్మతి స్వరంప్రీస్ట్లీ జీవితం కేవలం ప్రయోగశాలకే పరిమితం కాలేదు. ఆయన మతపరమైన ఆలోచనలు భిన్నంగా ఉండేవి. ఆ కాలంలో ‘చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్’ సిద్ధాంతాలను ఆయన వ్యతిరేకించారు. ఆయనొక ‘డిసెంటర్’ (అసమ్మతివాది) కావడంతో ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ లాంటి పెద్ద విశ్వవిద్యాలయాల్లో చదువుకోవడానికి అనుమతి దక్కలేదు. అయినప్పటికీ పట్టుదలతో లాటిన్, గ్రీక్, ఫ్రెంచ్ వంటి భాషలు సొంతంగా నేర్చుకున్నారు.అమెరికా, ఫ్రెంచ్ విప్లవాలకు ఆయన మద్దతు పలకడం అప్పటి బ్రిటిష్ ప్రభుత్వానికి నచ్చలేదు. ఆయనపై ‘ద్రోహి’ ముద్ర వేశారు. 1791లో బర్మింగ్‌హామ్‌లో ఉన్నాదులు కొందరు ఆయన ఇంటిని, ప్రయోగశాలను తగలబెట్టారు. ఆయన రాసుకున్న ఎన్నో విలువైన పరిశోధన పత్రాలు బూడిదయ్యాయి. ప్రాణభయంతో ఆయన లండన్ పారిపోయి, చివరకు 1794లో అమెరికాకు వలస వెళ్లారు. పెన్సిల్వేనియాలోని నార్తంబర్ల్యాండ్ అనే మారుమూల గ్రామంలో స్థిరపడి మళ్ళీ పరిశోధనలు ప్రారంభించారు. అక్కడ ‘కార్బన్ మోనాక్సైడ్’ వాయువును కనిపెట్టారు. ‘యూనిటేరియన్ చర్చి’ని స్థాపించారు. అమెరికా మాజీ అధ్యక్షులు థామస్ జెఫర్సన్, బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఆయనకు ఆప్తమిత్రులు. ఆక్సిజన్‌ను కనిపెట్టిన శత వార్షికోత్సవం సందర్భంగా, ఆయన గౌరవార్థం 1876లో ‘అమెరికన్ కెమికల్ సొసైటీ’ ఏర్పాటైంది. ప్రీస్ట్లీ మరణించినప్పుడు (1804 ఫిబ్రవరి 6) ‘మానవాళికి అత్యంత విలువైన కొద్దిమంది వ్యక్తుల్లో ఒకరు’ అని థామస్ జెఫర్సన్ నివాళులర్పించారు.- ఎడిటోరియల్ టీమ్ -
శాస్త్రీయ శోధనే విశ్వాసానికి పరీక్ష
ఇటీవల పార్లమెంట్లో గోమూత్రం గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు వినవచ్చాయి. ప్రవేశ పరీక్ష సంస్కరణలపై సత్వర కార్యాచరణ బృందంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (మద్రాసు) డైరెక్టర్ వీళినాథన్ కామకోటిని నియమించిన సందర్భంలో ఈ అంశం చర్చకు వచ్చింది. ‘ఫంగల్, బ్యాక్టీరియల్, ఇన్ఫ్లమేటరీలకు నిరోధకంగా’ పనిచేయగల శక్తి గోమూత్రానికి ఉందనీ, అవి ‘వైజ్ఞానికంగా కూడా ప్రదర్శితమయ్యా’యనీ గత ఏడాది జనవరిలో ఒక బహిరంగ సమావేశంలో కామకోటి పేర్కొన్నారు. గోమూత్రంపై కామకోటి అభిప్రాయాలను తోసిపుచ్చడం రాజ్యాంగంలో పేర్కొన్న శాస్త్రీయ దృక్పథాన్ని తక్కువ చేయడం అవుతుందంటూ కొందరు విద్యావేత్తలు కామకోటికి మద్దతు పలికారు. తాను నిజమని నమ్మేదానిని ‘తాత్కాలికంగా ప్రతిపాదించే, సంప్రదాయ విజ్ఞానాన్ని చర్చకు పెట్టే’ హక్కు కామకోటికి ఉందని వారు అన్నారు. కోల్‌కతాలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ డైరెక్టర్ కూడా కామకోటికి వత్తాసు పలికారు. అధికారిక మద్దతుగోమూత్రం, పేడపై పరిశోధన కొత్తదేమీ కాదు. గోమూత్ర గుణాల గురించి 1970లు, 1980లలో కూడా కొన్ని క్లెయిములు వినవచ్చాయి. పరిశోధనా పత్రాలు వెలువడ్డాయి. కానీ, వాటిని అల్పమైనవిగానే పరిగణిస్తూ వచ్చారు. అటువంటి పరిశోధనకు అధికారిక మద్దతు లభించడం కొత్త ధోరణి. వాటికి ఐఐటీలు, ఐఐఎంల డైరెక్టర్ల వంటి ఉన్నత స్థాయి విద్యావేత్తల నుంచి కూడా మద్దతు లభిస్తోంది. అయితే, వారు బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ లేదా డ్రగ్ డిస్కవరీ వంటి రంగాల్లో నిపుణులై ఉండనక్కరలేదనే సంగతిని ఈ సందర్భంగా చాలామంది విస్మరిస్తున్నారు. ఒక అంశాన్ని పరిశోధనకు పెట్టేటప్పుడే దాన్ని శాస్త్రీయంగా నిరూపించాలనుకోవడం వల్ల ముందే ఏర్పరచుకున్న అభిప్రాయాల ప్రభావం దానిపై ఉంటుంది. దేన్నో ధ్రువీకరిం చాలనే పక్షపాత వైఖరి పరిశోధనకు మేలు చేయదు. మానవ దేహం, దానికొచ్చే వ్యాధులు, వాటిని నయం చేసే మార్గాల గురించి ప్రాచీన గ్రంథాలు, సంప్రదాయ విజ్ఞానం చెప్పే అంశాలు ఎంత స్థూలంగా ఉంటాయంటే, వాటిని ఏ ఆధునిక ఆవిష్కరణ లేదా భావనకైనా వర్తింపజేయెచ్చు. దాని ఆలంబనగా ప్లాస్టిక్ సర్జరీ, మూలకణ చికిత్స, పునరుత్పత్తి సాంకేతికత, ఉపగ్రహ కమ్యూనికేషన్ వంటివన్నీ ప్రాచీన భారతదేశంలో వాడుకలో ఉన్నవే అంటూంటారు. గోమూత్రానికి కూడా అదే విధంగా విలువను ఆపాదించే వైఖరిని కనబరుస్తున్నారు. కొన్ని ఖనిజాల జాడలు, అమైనో ఆమ్లాలు, చిన్న గొలుసులతో కూడిన చిన్న ప్రొటీన్ భాగాలు గోమూత్రంలో లేదా దాని పేడలో కనిపించినంత మాత్రాన దాని వైద్య గుణగణాలకవి తగినంత రుజువు కాబోవు. ఎందుకంటే, అలాంటివి మానవ మూత్రంలోనూ, ఎద్దులు, జడలబర్రె, లేళ్ళు వంటి ఇతర క్షీరదాలలో కూడా కనిపిస్తాయి. మహా అయితే, అటువంటి పరిశోధన సూడోసైన్స్ పరిధిలోకి వస్తుంది. యూరిన్ కెమిస్ట్రీని వర్ణించేందుకు కొంత వైజ్ఞానిక పరిభాషను ఉపయోగిస్తారు కనుక అది సైన్స్‌గా కనిపిస్తుంది. నవ భారతానికి ప్రాచీన జబ్బుకీమోథెరపీ సంబంధిత తక్కువ ప్లేట్లెట్ కౌంట్ల సమస్యకు తక్కువ ఖర్చుతో కూడిన పరిష్కారంగా బొప్పాయి ఆకుల నుంచి తీసిన దానిని వినియోగించుకోవచ్చని ఒక నూతన అధ్యయనంలో తేలినట్లు ప్రభుత్వం ఇటీవల పేర్కొంది. ఆ అధ్యయన ఫలితాలను ఒక ఆంకాలజీ జర్నల్‌లో ప్రచురించారు. కానీ, స్వతంత్ర నిపుణుల అభ్యంతరాలతో ఆ పత్రిక ఆ ఫలితాలను పునః సమీక్షించుకోవాల్సి వచ్చింది. బొప్పాయి ఆకుల నుంచి తీసిన పదార్థ ప్రభావం గొప్పగా ఉందని చూపేందుకు, ఆ పదార్థాన్ని ఉపయోగించినా ఫలితం చూపని రోగుల వివరాలను ఆ అధ్యయన ఫలితాలకు జోడించలేదని స్వతంత్ర నిపుణులు అభ్యంతరం తెలిపారు. పసుపు వేరులలో లభించే రసాయన పదార్థం కర్కుమిన్ విషయంలోనూ ఇదే జరిగింది. క్యాన్సర్‌తో సహా పలు వ్యాధులకు ఆ మూలిక గొప్ప ఔషధంగా పనిచేస్తుందని ప్రచారం చేశారు. కర్కుమిన్పై భరత్ అగర్వాల్ అనే అమెరికన్ పరిశోధకుడు రాసిన 30కి పైగా పరిశోధన పత్రాలను అంతర్జాతీయ పత్రికలు వెనక్కి తీసుకున్నాయి. గుండె వ్యాధి ముదిరే ప్రక్రియపై భారత–మధ్యధరా సముద్ర తీర ప్రాంత ఆహారపు అలవాట్లు చూపగల ప్రభావంపై మొరాదాబాద్‌కు చెందిన ఆర్.బి. సింగ్ 1990లలో పరిశోధించారు. ఆయన మన ఆహార అలవాట్లను ఇజ్రాయెల్, స్లొవేకియా ప్రాంతవాసుల ఆహార అలవాట్లతో పోల్చి చూశారు. వాటిని లాన్సెట్, బ్రిటిష్ మెడికల్ జర్నల్స్‌లో ప్రచురించారు. కొద్ది ఏళ్ళ తర్వాత, ఆ అధ్యయనానికి సంబంధించిన క్లినికల్ ట్రయల్ డేటా సాధికారతను కొందరు ఇండిపెండెంట్ సైంటిస్టులు ప్రశ్నించారు. అధ్యయనానికి చెందిన ఒరిజినల్ డేటాను కోరినప్పుడు, ఆ పత్రాలను చెద పురుగులు తినేశాయని సింగ్ జవాబిచ్చారు. ధ్రువీకరించాలనుకునే వైఖరి వల్ల సేఫ్టీ అంశాలు కూడా పక్కనపడతాయి. ప్రాచీన గ్రంథాల్లో పేర్కొన్న నేచురల్ రెమిడీల వల్ల దుష్ఫలితాలు ఏవైనా సంభవిస్తాయేమో చూడనవసరం లేదనడం కూడా తప్పుడు వాదనే అవుతుంది. ఒక మొక్క నుంచి లభ్యం కాగల జీవరసాయన పదార్థాలు కూడా ఆ మొక్క పెరిగిన భూమిపై ఆధారపడి ఉంటాయి. తిరిగి గోమూత్రం విషయానికొస్తే, దానిలో హానికరమైన బ్యాక్టీరియా ఉన్నందువల్ల , దాని సేవనం మానవులకు హానికరం కావచ్చని ఇండియన్ వెటర్నరీ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ అధ్యయంలో తేలింది. చైనా ఉదాహరణచైనాలోనూ సంప్రదాయ వైద్యానికి ఆదరణ ఉంది. కానీ, అక్కడ మతపరమైన లేదా భావజాల ఆధారిత వైఖరిని అనుసరించడానికి బదులుగా శాస్త్రీయ దృక్పథంతో పరిశీలించి వినిమయాన్ని చేపట్టారు. ఉదాహరణకు, మలేరియాపై పనిచేసే ఆర్టిమైసినిన్ కనుగొన్నందుకు తు యుయు అనే చైనా సైంటిస్టుకు 2015లో నోబెల్ బహుమతి లభించింది. ప్రాచీన గ్రంథాల్లో పేర్కొన్నవాటిని తిరుగులేని సత్యాలుగా తీసుకునే బదులు, వాటిని ఒక ఐడియాగా తీసుకుని, ఈ ప్రాజెక్టు కింద 400లకు పైగా మొక్కలను పరీక్షించి చూశారు. ఒక మాలిక్యూల్‌ను వేరు చేసి, ఔషధంగా అభివృద్ధి చేయడానికి ముందు యాభై ఏళ్ళకు పైగా నిరంతర ప్రయోగాలు నిర్వహించారు. ఆ డిస్కవరీని కూడా ప్రాచీన గ్రంథాల గొప్పదనాన్ని నిరూపించినదిగాకాక, కాలపరీక్షకు నెగ్గిన సైంటిఫిక్ పద్ధతులకు తార్కాణంగానే పేర్కొన్నారు. భారతీయ విజ్ఞాన పద్ధతులను ప్రోత్సహించే పేరుతో సందేహాస్పద సంస్థల, పరిశోధకుల అధ్యయనాలకు సౌజన్యం వహించడాన్ని సైన్స్ ఏజన్సీలు మానుకోవాలి. ప్రభుత్వం చొరవ చూపకపోతే, అకాడమీలే కలసికట్టుగా ముందుకు వచ్చి పరిశోధనల్లో నిజాయతీకి పాటుపడే ఒక స్వతంత్ర సంస్థను, ఒక రకమైన రిసెర్చ్ అంబుడ్స్‌మన్‌ను ఏర్పాటు చేసుకోవాలి. దినేశ్ సి. శర్మవ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత -
జ్ఞానాన్ని బోధించే గురువు ఎక్కడుంటాడో ఆచూకీ చెప్పండి..
జునాయెద్ అనే వ్యక్తి ఒక సూఫీ సాధువు దగ్గరకు వచ్చాడు. ‘నాకు జ్ఞానాన్ని బోధించే గురువు ఎక్కడ ఉంటాడో ఆచూకీ చెప్పండి’ అని అడిగాడు. ‘ముందు మక్కాకు వెళ్ళు. తీర్థయాత్ర చెయ్యి. ఎవరి కళ్లయితే కాంతులు విరజిమ్ముతుంటాయో, ఎవరి దేహం నుంచి కస్తూరి పరిమళం వస్తూ ఉంటుందో అతడే నీ గురువు. వెళ్ళి వెతుకు’ అన్నాడు.జునాయెద్ తన ప్రయాణం మొదలుపెట్టాడు. 20 ఏళ్లు గడిచాయి. చివరికి ఒక చెట్టు కింద ఒకరిని చూశాడు. సూఫీ సాధువు చెప్పిన లక్షణాలు ఆయనలో కనిపిస్తున్నాయి. జునాయెద్ ఆయన పాదాలపై పడి, ‘గురుదేవా, 20 ఏళ్ళుగా మీ కోసమే వెతుకుతున్నాను’ అని ఆనందం పట్టలేక ఏడ్చేశాడు. ఆ సాధువు కూడా ‘నేనూ 20 ఏళ్ళుగా నీ కోసమే చూస్తున్నాను. నన్ను సరిగ్గా చూడు’ అన్నాడు.జునాయెద్ ఎగాదిగా చూశాడు. తీరా 20 ఏళ్ళ క్రితం తనకు గురువు ఆచూకీ చెప్పి పంపిన ఆ మనిషే ఈయన! ‘ఇదేంటి? నాతో ఆటలాడారా? నా 20 ఏళ్ల కాలం వృథా అయిపోయింది. మీరే నా గురువు అని ఆ రోజే ఎందుకు చెప్పలేదు?’ అని అడిగాడు. ‘ఆ రోజే నేను చెప్పి ఉండవచ్చు. కానీ గురువును గుర్తుపట్టే కళ్ళు ఆ రోజు నీకు లేవు. ఈ 20 ఏళ్ల వెతుకులాట నీకు ఆ కళ్ళను ఇచ్చింది. ఈ ఇరవై ఏళ్ళు నిన్ను మెరుగుపరిచాయి. ఈ కస్తూరి వాసన ఆ రోజు కూడా ఉంది. కానీ దాన్ని గుర్తించే శక్తి ఆ రోజు నీకు లేదు’ అన్నాడు.నమ్మకం లేకపోతే గురువును సమీపించలేం. ఓపికతో వేచి ఉంటే, అపారమైన సహనం ఉంటే, ఏదో ఒక రోజు మార్గ నిర్దేశకుడు కనిపిస్తాడు. సత్యాన్ని వారసత్వంగా పొందలేం. దాని కోసం ఎవరికి వారు శ్రమించాలి. ఒక శిష్యుడిగా మారాలి. కఠినమైన క్రమశిక్షణ పాటించాలి. అది వ్యక్తిగత ప్రయాణం. వెతుకులాటే పరిపక్వత తెస్తుంది. అన్వేషణ ద్వారానే సత్యాన్ని తెలుసుకోగలరు. – యామిజాల జగదీశ్ -
పర్యావరణ యోధులకు రక్షణ ఏది?
హైదరాబాద్‌లోని తెరిచి ఉన్న ఒక డ్రైన్లో పడి కొట్టుకుపోయిన 70 ఏళ్ల చెత్త ఏరుకునే కార్మికుడు బాలయ్య ఉదంతం– సమాజంలో అట్టడుగున ఉన్న ఈ కార్మికుల నిస్సహాయతకు, దుఃస్థితికి ప్రత్యక్ష నిదర్శనం. స్మార్ట్ సిటీల పర్యావరణ పరిరక్షణలో చెత్త ఏరుకునేవారి సేవలు అత్యంత కీలకమైనవి. ప్రతిరోజూ టన్నుల కొద్దీ ప్లాస్టిక్, కాగితం, లోహాల వంటి వ్యర్థాలను వేరు చేయడం ద్వారా వీరు డంపింగ్ యార్డులపై పడే భారాన్ని భారీగా తగ్గిస్తున్నారు. వాస్తవానికి, అధికారిక వ్యవస్థల కంటే వీరు తరచుగా అధిక స్థాయిలో వ్యర్థాలను వేరు చేయడం, పునర్వినియోగం చేయడంలో సఫలమవుతున్నారు.పర్యావరణానికి విశేషమైన మేలు చేస్తున్నా గుర్తింపుకు నోచుకోని ఈ ‘పర్యావరణ యోధుల’ ఆరోగ్యం మాత్రం నిత్యం గాల్లో దీపంగానే మారుతోంది. కనీస రక్షణ లేకుండానే విషపూరిత వ్యర్థాలు, పగిలిన గాజు పెంకులు, ఆసుపత్రి వ్యర్థాలు, కుళ్ళిన చెత్త మధ్య వీరు పనిచేస్తుంటారు. చేతులకు గ్లోవ్స్, ముఖానికి మాస్కులు, కాళ్లకు బూట్లు లాంటి రక్షణ పరికరాలు లేకపోవడంతో చర్మ వ్యాధులు, శ్వాసకోశ సమస్యలు, విష జ్వరాలు, ఇన్ఫెక్షన్ల బారిన పడుతున్నారు.‘ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు– 2016’ ప్రకారం, చెత్త ఏరుకునేవారు పట్టణ స్థానిక సంస్థల నుండి గుర్తింపు కార్డులు పొందవలసి ఉన్నది. కానీ, బడ్జెట్ పరిమితులు లేదా అధికారుల అయిష్టత కారణంగా కొన్ని స్థానిక సంస్థలు వీటిని జారీ చేయడంలో విఫలమయ్యాయి.సేవకు ‘నమస్తే’!ఈ కార్మికులకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘యాంత్రిక పారిశుధ్య పర్యావరణ వ్యవస్థ జాతీయ కార్యాచరణ (నమస్తే) పథకం’ ఒక ఆశాకిరణం. 2024–25 నుండి, చెత్త ఏరుకునేవారిని ఈ పథకంలో అధికారికంగా చేర్చడం ముఖ్యమైన మార్పు. సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా 1.52 లక్షల మంది చెత్త ఏరుకునే వారిని గుర్తించగా, ఇందులో 48.7 శాతం మహిళలు ఉండటం గమనార్హం. వ్యర్థాల సేకరణ, పునరుద్ధరణలో వారి కృషిని గుర్తించి, అధికారిక ఘన వ్యర్థాల నిర్వహణ వ్యవస్థలలో వారిని విలీనం చేయడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. దీని ద్వారా వారికి ఆయుష్మాన్ భారత్ కింద ఆరోగ్య బీమా, వారి పిల్లలకు ప్రీ–మెట్రిక్ స్కాలర్షిప్లు, ఈ–శ్రమ్ పోర్టల్‌లో నమోదు, అలాగే అవసరమైన శిక్షణ, పరికరాలు లభిస్తాయి.దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాలు ఇప్పటికే ‘రాష్ట్ర సఫాయి కర్మచారి కమిషన్’లను ఏర్పాటు చేసి పారిశుద్ధ్య, చెత్త ఏరుకునే కార్మికుల హక్కులను పరిరక్షిస్తున్నాయి. కానీ తెలుగు రాష్ట్రాలలో అటువంటి సంస్థాగత వ్యవస్థ లేకపోవడం గమనార్హం. అత్యంత ప్రమాదకర వాతావరణంలో పనిచేస్తున్న ఈ అట్టడుగు వర్గాల భద్రతను పునరుద్ధరించడానికి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించాలి. చట్టబద్ధమైన కమిషన్లను ఏర్పాటు చేసి పూర్తిస్థాయి హక్కులు కల్పించాలి. దీనితో పాటుగా పట్టణ స్థానిక సంస్థలు గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేసి, ప్రతి ఒక్కరికీ గ్లోవ్స్, మాస్కులు, రెయిన్ కోట్లు, సేఫ్టీ బూట్లు కలిగిన కిట్లను అందించాలి. డ్రై వేస్ట్ కలెక్షన్ సెంటర్లు ఏర్పాటు చేసి వీరి శ్రమను వ్యవస్థీకృతం చేయాలి. పర్యావరణాన్ని, నగరాన్ని శుభ్రంగా ఉంచడంలో వారు చేస్తున్న సేవలను గుర్తించి, గౌరవప్రదమైన స్థానం అందించడం సామాజిక బాధ్యత.– శ్రీనివాస్ మాధవ్, సమాచార హక్కు పరిశోధకుడు -
పశ్చిమాసియాలో ప్రమాదకర పాచికలాట
సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ 2025 నవంబర్ 18న అమెరికా సందర్శించారు. పౌర అణు శక్తి వినియోగ సహకారంపై సంప్రదింపులు పూర్తయ్యాయని అదే రోజు సంయుక్త ప్రకటన వెలువడింది. ఆ మేరకు ఒప్పందంపై రెండు దేశాలు సంతకాలు చేశాయి. దశాబ్దాలుగా కొనసాగుతున్న కోట్లాది డాలర్ల పౌర అణు శక్తి భాగస్వా మ్యానికి దీనితో చట్టపరమైన పునాది ఏర్పడిందని వైట్ హౌస్ పేర్కొంది. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ప్రమాణాలను పకడ్బందీగా పాటిస్తూ సహకారాన్ని ఇచ్చిపుచ్చు కోనున్నట్లు ప్రకటించారు. అయినా, అణ్వస్త్ర నిర్మాణ వ్యాప్తిపై ఇది అటు ఇజ్రాయెల్, ఇటు యూఏఈలలో ఆందోళనను రేకెత్తించడంతో ఈ అంశం మరింత జటిలంగా మారింది. అబ్రహాం ఒప్పందాలతో ముడిఇపుడు అమెరికా–సౌదీ ఒప్పందాన్ని సౌదీ అరేబియా అబ్రహాం ఒప్పందాలకు కట్టుబడి ఉండే అంశంతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ముడిపెట్టారు. పౌర అణు ఒప్పందానికి ఆమోదం తెలుపడం చిటికెలో పని. కాకపోతే ‘చాలా మన్నన పొందిన, సఫలమైన అబ్రహాం ఒప్పందాలకు సౌదీ అరేబియా పూర్తిగా కట్టుబడి ఉండాలి’ అని ట్రంప్ జూలై 23న బాహాటంగానే వెల్లడించారు. యురేనియంను ‘శుద్ధి చేసే సామగ్రి’ ఉండబోదని కూడా ట్రంప్ తెలిపారు. కానీ, యురేనియంను శుద్ధి చేయడాన్ని నివారించే నియమ నిబంధనలు ఒప్పందం ముసాయిదాలో కొరవడ్డాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా రెండింటిని ముడిపెట్టడంతో మొత్తం పరిస్థితి మారి పోయినట్లు అయింది. ఇది ఇక ఎంతమాత్రం అణు శక్తిని పౌర అవస రాలకు వినియోగించుకునేందుకు సంబంధించినదిగానో లేదా రష్యా, చైనాలను దూరం పెట్టేందుకు కుదుర్చుకున్నదిగానో లేదు. దౌత్యం ఒక లావాదేవీగా తయారైంది. అసలే అణు శక్తి చిక్కు ముడులతో కూడుకున్న దక్షిణాసియాలో ఇది ఇంకా గుబులు రేపు తోంది. ట్రంప్ నిర్ణయాన్ని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కార్యాలయం వెంటనే స్వాగతించింది. సౌదీ గుర్తింపు ‘మధ్య ప్రాచ్యంలో శాంతి స్థాపనకు సంబంధించి ఒక చారిత్రక ముంద డుగు’ అని అది జూలై 23న వ్యాఖ్యానించింది. ఇజ్రాయెల్ అంగీకరించినట్టేనా?తెరవెనుక పరిస్థితులను బట్టి ఈ సమన్వయం ఒక ఎత్తుగడగా కనిపిస్తోంది. తుర్కియేకు అధునాతన ఎఫ్–35 విమానాల విక్ర యాన్ని వ్యతిరేకించాలని నెతన్యాహు కోరుకుంటున్నారనీ, సౌదీ అణు ఒప్పందం ఈ ప్రాంతంలో ఆయుధ పోటీని రేకెత్తిస్తుందని ఆందోళన చెందుతున్నారనీ ఇజ్రాయెలీ అధికారులు మీడియాకు తెలిపారు. ఇటీవల ట్రంప్‌ను కలుసుకునేందుకు ముందు నెతన్యాహు తన మనసులో మాటను వెల్లడించారు. సౌదీ అరేబి యాతో అమెరికా అణు సహకారం సైనిక శక్తి విషయంలో ఇజ్రా యెల్కున్న గుణాత్మక పైచేయిపై రాజీపడేటట్లు చేయదని హామీ లభించాలని ఆయన అన్నారు. ఏదైతేనేం జెరూసలెం కోరుకున్నది సాధించింది. సౌదీ అణు ఒప్పందం ఇజ్రాయెల్‌తో ముడిపడినఅంశమని ఇపుడు తేటతెల్లమైంది. రెండవసారి అధికారానికి వచ్చినప్పటి నుంచి కూడా అబ్రహాం ఒప్పందాలను మరింత విస్తరించాలని ట్రంప్ కోరుకున్నారు. సాధా రణ పరిస్థితులు నెలకొనాలంటే ‘పాలస్తీనా ఒక ప్రత్యేక రాజ్యంగా అవతరించేందుకు స్పష్టమైన బాటలు పరవా’లని సౌదీలు స్పష్టం చేశారు. గాజాలో పరిస్థితులు క్షీణించాక సౌదీ మరింత పట్టుసడలని వైఖరిని కనబరచింది. సాధారణ పరిస్థితుల స్థాపనపై చర్చలను అది 2023 అక్టోబర్ 14న విరమించుకుంది. ‘పాలస్తీనా రాజ్య స్థాప నను వ్యతిరేకిస్తున్న ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రస్తుత ప్రభు త్వాన్ని శాంతి స్థాపనకు చిత్తశుద్ధితో పనిచేసే భాగస్వామిగా’ చూడ లేమనే మొన్నీమధ్య జూలై 25 వరకు రియాద్ భావిస్తూ వచ్చింది. మారిన అమెరికా తీరుఅణ్వస్త్ర వ్యాప్తి నిరోధక విధానం విషయంలో అమెరికాలో వచ్చిన మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. గల్ఫ్‌లో యురేనియం శుద్ధికి అనుమతించకూడదనే వైఖరినే అమెరికా 15 ఏళ్ళుగా అనుస రిస్తూ వచ్చింది. యూఏఈ కూడా 2009లోనే దాన్ని విరమించుకుంది. తాజా అమెరికా ఒప్పందం కింద సౌదీ ఆ నిబంధనను తిర స్కరించింది. అంతర్జాతీయ అణు శక్తి సంస్థ అదే పనిగా పర్యవేక్షించడాలు, పరిశీలించడాలు చేయకూడదని కూడా సౌదీ పేర్కొంది. తెహ్రాన్ రహస్యంగా యురేనియంను శుద్ధి చేసే సదుపా యా లను నిర్వహిస్తోందనే కారణంతోనే ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడికి దిగాయి. ఈ ఒప్పందం ఏ విధంగా ఆవిష్కృత మవుతుందోనని అబుదాబి, కైరో, అమ్మాన్, అంకారా ఎదురు చూస్తున్నాయి. ఇంతవరకు యురేనియంను శుద్ధి చేసే శక్తి పశ్చిమా సియాలో ఒక్క ఇరాన్‌కే పరిమితం అనుకున్నారు. ఇపుడు యురేని యంను శుద్ధి చేయగల సామర్థ్యాన్ని ఆ ప్రాంతంలో దాదాపు ఐదు దేశాలు సంతరించుకోగలవని కొత్త ఆందోళనలు మొదలయ్యాయి. ‘‘ఇజ్రాయెల్ వద్ద బాంబు ఉందనుకుందాం. ఇపుడు అమెరికా ఆమోదంతో సౌదీ అరేబియా కూడా యురేనియంను శుద్ధి చేయగల శక్తిని సంతరించుకుంటుంది. మరి మేం మాత్రం ఆ పని ఎందుకు చేయకూడదు?’’ అని ఇరాన్ వాదిస్తోంది. ఇరాన్‌తో అమెరికా కుదు ర్చుకోవాలని భావించిన అణు ఒప్పందం అటకెక్కింది. ఇరాన్ లోపలికి వెళ్ళి తనిఖీలు జరపడానికి అంతర్జాతీయ అణుశక్తి సంస్థకు ఉన్న అవకాశం పరిమితం. ఇటువంటి పరిస్థితుల్లో అమెరికా ఆశీర్వా దంతో సౌదీ అరేబియా నిర్వహించే అణుశక్తి కార్యక్రమం పూర్తి ఆత్మవంచన, ద్వంద్వ ప్రమాణాల కిందకే వస్తుంది. ఇజ్రాయెల్ వైపు నుంచి చూస్తే ఈ ఒప్పందం దాని చాపకిందకు నీరు తేవడమే. అణ్వాయుధాలు కలిగిన దేశంగా ఇజ్రాయెల్ 50 ఏళ్ళుగా గుత్తాధిపత్యాన్నే అనుభవిస్తూ వచ్చింది. అది ఆ పనిని చాటుమాటునే నిర్వహిస్తూ వచ్చి ఉండవచ్చు. సౌదీ పౌర అణుశక్తి కార్యక్రమాన్ని అబ్రహాం ఒప్పందాలతో ముడిపెట్టడాన్ని పైకి స్వాగ తించి ఉండవచ్చు. కానీ, లోలోపల అణ్వస్త్ర నిర్మాణ సామర్థ్యం కలి గిన మరో అరబ్ దేశం అవతరిస్తోందని మథన పడుతోంది. సుస్థిరతకు అవకాశమెక్కడ? తాజా ఒప్పందంతో ఆ ప్రాంతంలో ఏ దేశానికాదేశం రక్షణకంచెలు ఏర్పాటు చేసుకోవాలని భావిస్తాయి. ఆయుధాల సమీకర ణకు పోటీపడతాయి. తప్పుడు అంచనాలు ప్రమాదకర స్థితినిసృష్టిస్తాయి. ఇంక ప్రాంతీయ సుస్థిరతకు అవకాశమెక్కడ? రష్యా అణు శక్తి సంస్థ రోసటామ్, చైనా నేషనల్ న్యూక్లియర్ కార్పొరేషన్లను కట్టడి చేయడానికి సౌదీ అణు కార్యక్రమం దోహద పడుతుందనీ, అమెరికా విస్తృత వ్యూహాత్మక ప్రయోజనాలను నెరవేరుస్తుందనీ అమెరికా మొదట్లో భావించింది. ఇపుడు అబ్రహాం ఒప్పందాలకు కట్టుబడి ఉండాలని చెప్పడం ద్వారా సౌదీ–ఇజ్రా యెల్ మధ్య కూడా రాజీ కుదిర్చినట్లు అవడం తన విదేశాంగ విధానానికి కలికితురాయిగా మారుతుందని ట్రంప్ సంబరపడు తున్నారు. అందుకు రియాద్‌కు పౌర అణు శక్తి పేరుతో తీపిని తిని పిస్తున్నారు. ఈ క్రమంలో, నియమ నిబంధనలను తుంగలో తొక్కారు. పౌర అణు శక్తి వినియోగానికి సౌదీకున్న హక్కును కాదనలేం. రష్యా–చైనాలతో పోటీ పడేందుకు అమెరికాకు ఉన్న హక్కును కూడా తోసిపుచ్చలేం. కానీ, ఉద్రిక్తతలతో అట్టుడుకుతున్న ప్రాంతంలో యురేనియం శుద్ధికి ద్వారాలు తెరవడం ఎంతవరకు సబబు? ఇజ్రాయెల్‌తో సయోధ్య కుదుర్చుకోవాలనీ, సాధారణ పరిస్థితుల స్థాపనకు తోడ్ప డాలనీ అమెరికా పెడుతున్న షరతును సౌదీ ఇప్పటికే తిరస్కరించింది. ఒకవేళ ఒప్పందం మూలపడ్డా, అది తెచ్చిన ప్రమాణం నిలిచే ఉంటుంది: అణు శక్తిని సంపాదించుకునేటట్లు చేయడంలో అమెరికా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. రాజకీయ ప్రయోజనాలు చూసు కుంటోంది. ఒకసారి భూతాన్ని బయటకు తెస్తే, దాన్ని తిరిగి సీసాలో బంధించడం కష్టం. -వ్యాసకర్త ‘సొసైటీ ఫర్ పాలసీ స్టడీస్’ డైరెక్టర్, న్యూఢిల్లీ-సి. ఉదయ్ భాస్కర్ -
రైతుకు ఆదాయం – ప్రకృతికి చికిత్స
వాతావరణ మార్పులు ప్రపంచ వ్యవసాయాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా కరవుప్రాంతాల్లో వ్యవసాయం అనిశ్చితితో కూడిన జీవనోపాధిగా మారుతోంది. ఈ పరిస్థితుల్లో అగ్రోఫారెస్ట్రీ– వ్యవసాయ పంటలతో పాటు వృక్షాలను సమీకృతంగా పెంచే విధానం– పర్యావరణ పరిరక్షణతో పాటు రైతుకు అదనపు ఆదాయాన్ని అందించే మార్గంగా ఎదుగుతోంది. చెట్లు వాతావర ణంలోని కార్బన్ ను బంధించడం ద్వారా ఏర్పడే కార్బన్ క్రెడిట్లను రైతుల ఆదాయంగా మలచడ గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతోంది.భారతదేశం 2070 నాటికి నెట్– జీరో లక్ష్యాన్ని ప్రకటించిన నేపథ్యంలో వ్యవసాయం కూడా కార్బన్ ఉద్గారాల నియంత్రణలో భాగస్వామి కావాల్సిన అవసరం ఉంది. రైతులను కేవలం ఆహార ఉత్పత్తిదారులుగా కాకుండా పర్యావరణ సేవలను అందించే భాగ స్వాములుగా గుర్తించే విధానాలు రూపొందాలి. కార్బన్ మార్కెట్లు అదే దిశగా ముందడుగు వేస్తున్నాయి.అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో యాక్షన్ ఫ్రెటర్నా–ఎకాలజీ సెంటర్ (ఏఎఫ్ ఎకాలజీ సెంటర్) ఈ భావనను ఆచరణలోకి తీసుకొస్తోంది. నెదర్లాండ్స్‌కు చెందిన రాబోబ్యాంక్ ప్రోత్సహి స్తున్న ‘అకార్న్’ కార్యక్రమానికి స్థానిక భాగస్వామిగా ఉంటూ, సంస్థ రైతులను అగ్రోఫారెస్ట్రీ వైపు మళ్లిస్తూ, కార్బన్ ఆదాయ వ్యవస్థలో చేర్చుతోంది. ఇప్పటికే సుమారు 8,300 మంది రైతులు, దాదాపు 10,000 హెక్టార్ల భూమిని ఈ కార్యక్రమంలో నమోదు చేయించింది. రైతుల భూములకు జియో–ట్యాగింగ్, ధ్రువీకరణ ప్రక్రియలు పూర్తి చేశారు. రెండు లక్షలకు పైగా మొక్కల పంపిణీ చేసి, ఏకపంట తోటలను బహుళ వృక్ష వ్యవస్థలుగా మార్చి ఈ కార్యక్ర మానికి బలమైన పునాది వేశారు. తొలి విడత కార్బన్ ఆదాయం 2027లో అందే అవకాశం రైతుల్లో విశ్వాసాన్ని పెంచుతోంది.ఏఎఫ్ ఎకాలజీ సెంటర్ కేవలం కార్బన్ క్రెడిట్ల నమోదు వద్దే ఆగిపోలేదు. ప్రకృతి వ్యవసాయం, నీటి సంరక్షణ, జీవవైవిధ్య పరిరక్షణ, వాతావరణ అనుకూల వ్యవసాయ పద్ధతులను సమ గ్రంగా అనుసంధానిస్తూ రైతుల స్థిరమైన జీవనోపాధిని సాధించడం లక్ష్యంగా పెట్టుకుంది. కార్బన్ ఆదాయాన్ని రైతు సంక్షేమంతో అనుసంధానించిన ఈ నమూనా దేశవ్యాప్తంగా అధ్యయనం చేయదగినది. అయితే కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. కార్బన్ ధరల్లో హెచ్చుతగ్గులు, ధ్రువీకరణ ప్రక్రియల క్లిష్టత్వం, చిన్న రైతుల సామర్థ్య పరిమితులు వంటిఅంశాలను విధానపరంగా పరిష్కరించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అగ్రో ఫారెస్ట్రీకి ప్రత్యేక ప్రోత్సాహకాలు,సాంకేతిక సహాయం, పారదర్శక కార్బన్ మార్కెట్ వ్యవస్థను అందిస్తే ఈ కార్య క్రమం మరింత విస్తరిస్తుంది.భవిష్యత్తు వ్యవసాయం కేవలం దిగుబడుల గురించే కాదు; ప్రకృతిని పునరుద్ధరించడంపైనా ఆధారపడిఉంటుంది. రైతు పెంచే ప్రతి చెట్టు వాతావరణ మార్పులను తగ్గించడమే కాకుండా కుటుంబ ఆదాయాన్ని కూడా పెంచగలదని ఈ కార్యక్రమం నిరూపిస్తోంది. రైతు–ప్రకృతి–మార్కెట్ మధ్య సమ తుల్యతను సాధించే ఇటు వంటి ప్రయత్నాలే సుస్థిర వ్యవసా యానికి బాటలు వేస్తాయి.-వ్యాసకర్త డైరెక్టర్, ఎ.ఎఫ్. ఎకాలజీ సెంటర్, అనంతపురం-డా‘‘ వై.వి. మల్లారెడ్డి -
అది రాజ్యాంగబద్ధమేనా?
బంకించంద్ర ఛటర్జీ రాసిన వందేమాతరం గేయాన్ని ‘పూర్తిగా పాడాలి’ (అంటే ఆరు చరణాలనూ పాడాలి) అంటూ ప్రభుత్వం రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదం పొందింది. లోక్‌సభ, రాష్ట్రపతి ఆమోదాల తరువాత అది చట్టమవుతుంది. ఆ తరువాత, ఈ గేయాన్ని ఎక్కడైనా పూర్తిగా పాడకపోయినా, దాన్ని అవమానించినా, ఆటంకపరిచినా అలా చేసిన వాళ్లకు మూడేళ్ల జైలుశిక్ష పడుతుంది.1971లో తయారు చేసిన ‘ప్రివెన్షన్ ఆఫ్ ఇన్ సల్ట్స్ టు నేషనల్ హానర్ యాక్ట్’ను ప్రభుత్వం సవరిస్తూ ఈ బిల్లు ప్రవేశపెట్టింది. నిజానికి ఆ చట్టంలో– ‘జాతీయ జెండానిగానీ, జాతీయ గీతాన్ని గానీ, రాజ్యాంగాన్నిగానీ ఎవరైనా అవమానిస్తే వారు శిక్షార్హులవు తారు’ అని మాత్రమే వుంది. ‘వందే మాతరం’ గురించి ఏమీ లేదు. ఆ చట్ట పరిధిలోకి ఇప్పుడు దీన్ని కూడా తెస్తున్నారు.జనగణమనకూ, వందేమాతరానికీ తేడా వుంది. ఆ తేడా ఉండటం వలనే అది ‘జాతీయ గీతం’ కాలేక పోయింది. మొత్తం ‘ఆరు చరణాలు’ గా ఉండే అందులో మొదటి రెండు చరణాల్లో ప్రకృతి గురించి, భూమి గురించి, దేశభక్తి గురించి వర్ణన ఉంటుంది. ఆ తరువాత వచ్చే నాలుగు చరణాల్లో– భూమిని తల్లితో, ఆ తల్లిని కాళికతో, సరస్వతితో, లక్ష్మితో పోలుస్తూ ఉంటుంది. అంటే– హిందూ ఆధ్యాత్మికతా, దేశభక్తీ రెండూ కలగలసి ఉంటాయి.ఛటర్జీ ఈ గేయాన్ని విడిగా రాయలేదు. 1870లో రాసిన ‘ఆనంద్ మఠం’ నవలలోనిది అది. 1896 కలకత్తా కాంగ్రెస్ సమా వేశంలో ‘రవీంద్రనాథ్ టాగూర్’ దీన్ని మొదటగా ఆలపించారు. అప్పటికి ఆయన ‘జనగణమన’ రాయలేదు. అంతకుముందు సాహిత్యకారులలోనే ఆ పాటకు, టాగూర్ పాడాక, జాతీయ గుర్తింపు వచ్చింది. 1905లో ‘లార్డ్ కర్జన్’ బెంగాల్‌ను విభజించాక, అదొక ‘ఉద్యమ నినాదం’గా మారింది. బ్రిటిష్ ప్రభుత్వం కొన్ని ప్రాంతాల్లో ‘వందే మాతరం’ నినాదాన్ని నిషేధించింది. నిషేధం కారణంగా ఇది మరింత ప్రజాదరణ పొందింది. రానురాను స్వాతంత్య్ర ఉద్యమంలో ఇది భావోద్వేగ గీతంగా కూడా నిలిచింది.1930లలో కాంగ్రెస్ వర్గాల్లో దీన్ని ‘జాతీయ గీతం’గా స్వీకరించాలనే చర్చలు జరిగాయి. కానీ ‘ముస్లిం లీగ్ నాయకులు’ అభ్యంతరం తెలిపారు. లీగ్ వాళ్ళే కాకుండా కాంగ్రెస్‌లోని ముస్లిమ్స్ కూడా తమ అభ్యంతరాల్ని బైట పెట్టడం మొదలెట్టారు. వాళ్ళల్లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ (కాంగ్రెస్ అధ్యక్షుడు, తొలి విద్యాశాఖమంత్రి) ప్రథములు. ‘వందే మాతరానికి స్వాతంత్య్ర ఉద్యమంలో చారిత్రక పాత్ర ఉంది. దాన్ని ఎవ్వరమూ కాదనలేము కానీ, వాటి లోని హిందూ దేవతారాధన భావనలతో కూడిన వ్యాఖ్యలు ముస్లింలకు అసౌకర్యాన్ని కలిగిస్తాయి. మొదటి రెండు శ్లోకాలు మాత్రమే దేశభక్తిని సూచిస్తాయి’ అని ఆయన తన అభిప్రాయాన్ని ప్రక టించారు. మౌలానా మహ్మద్ అలీ జౌహర్ (ఖిలాఫత్ నాయకుడు) ‘వందే మాతరాన్ని నినాదంగా వాడటానికి నేను వ్యతిరేకం కాదు; కానీ దాన్ని మతసంబంధమైన ప్రతీకగా మార్చకూడదు’ అన్నారు. ఎప్పుడైతే ముస్లిం సమూహం నించి వ్యతిరేకత వచ్చిందో, హిందూ సమూహంలోని వాళ్ళు కూడా మాట్లాడటం మొదలు పెట్టారు. రాజ్యాంగ సభ అధ్యక్షుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మొదటి అడు గులు వేశారు. ‘వందే మాతరం పట్ల గౌరవం ఉండాలి. కానీ ఎవ్వరి మనస్సాక్షికీ వ్యతిరేకంగా బలవంతం చేయకూడదు’ అన్నారు.ఆ తరువాత జనగణమనను ‘జాతీయ గీతం’గా చేస్తూ, ‘వందే మాతరం’కు సమాన గౌరవం ఇస్తూ (మొదటి రెండు పద్యాలకే పరిమితం చేస్తూ) 1950 జనవరి 24న రాజేంద్ర ప్రసాద్ ఒక ప్రక టనను చేశారు. దీని మీద గాంధీజీ కూడా మాట్లాడారు. ‘వందే మాతరం దేశభక్తి గీతం. మత భావనతో ఎవరికైనా ఇబ్బంది అయితే బలవంతం చేయరాదు. దేశభక్తి అనేది స్వచ్ఛందంగా ఉండాలి. బలవంతం చేస్తే అది హింసతో సమానం’ అన్నారు. అనేక మతాలు ఉన్న ఈ దేశంలో హిందూ మతానికి చెందిన దేవతా మూర్తుల్ని ఆరాధించే చరణాల్ని ‘తప్పనిసరిగా మొత్తం పాడాలి’ అనడం న్యాయమేనా? అది లౌకికత్వం అవుతుందా? రాజ్యాంగబద్ధం అవుతుందా?– నన్నూరి వేణుగోపాల్, పౌరహక్కుల కార్యకర్త -
నూతన యూరియా విధాన సవాళ్లు
హార్మూజ్ జలసంధి మూసుకుపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో యూరియా ధర ఒక్కసారిగా టన్నుకు దాదాపు వెయ్యి డాలర్లకు పెరిగింది. దేశ యూరియా అవసరాల్లో నాలుగో వంతును దిగుమతి చేసుకునే భారత్‌కు ఇది దిగుమతుల మీద ఆధారపడే పాత భయాన్ని మళ్లీ గుర్తుకు తెచ్చింది. దీంతో కేంద్ర ప్రభుత్వం నుంచి వెంటనే నూతన యూరియా పెట్టుబడి విధానం రూపంలో స్పందన వచ్చింది. దేశం ఇప్పుడు దిగుమతి చేసుకుంటున్న కోటి టన్నుల యూరియాను ఇక్కడే తయారు చేసేందుకు ఎనిమిది–తొమ్మిది కొత్త గ్యాస్ ఆధారిత కర్మాగారాలను నెలకొల్పడమే దీని లక్ష్యం.వేసిన నత్రజని పనికొచ్చేనా?తర్కంగా చూస్తే ఇది సరైన నిర్ణయమే. కానీ ఆ తర్కమే అసలు సమస్య. సరఫరా సంక్షోభం వచ్చినప్పుడు మన వ్యవసాయ విధానం చూపే ప్రతిస్పందన ఒక్కటే– ఎరువును మరింత ఎక్కు వగా ఉత్పత్తి చేయడం. కానీ ఎవరూ అడగని ప్రశ్న ఒకటుంది. పద్నాలుగు కోట్ల రైతు కుటుంబాలు, ప్రపంచంలోనే అతిపెద్ద పశు సంపద, ప్రతి శీతాకాలంలో తగలబెట్టే కోట్లాది టన్నుల పంట వ్యర్థాలు– ఇవన్నీ ఉన్న దేశం ఇంత భారీ మొత్తంలో కృత్రిమ నత్రజనిని ఎందుకు దిగుమతి చేసుకోవాలి?గత అరవై ఏళ్లుగా మన వ్యవసాయ విధానాన్ని ఒక నమ్మకం శాసిస్తోంది– ప్రతి ఉత్పాదకత సమస్యా ఎరువుల సమస్యే; దాన్ని మరిన్ని ఎరువులు ఉత్పత్తి చేయడం, దిగుమతి చేయడం, రాయితీ ఇవ్వడం ద్వారానే పరిష్కరించాలి. హరిత విప్లవం కాలంలో ఇది నిజమే. అప్పుడు నత్రజని కొరత ఒక అడ్డంకి. కానీ ఇవాళ మన అసలు సమస్య నత్రజని కొరత కాదు; పంటకు నత్రజనిని అందించే నేల ఆరోగ్యం బాగా క్షీణించింది. ప్రభుత్వ నేల ఆరోగ్య కార్డుల డేటానే చూస్తే– దేశంలో దాదాపు 64 శాతం నేలల్లో నత్రజని తక్కువ, 48.5 శాతం నేలల్లో సేంద్రియ కర్బనం తక్కువ.మరో గణాంకం మరింత భయపెడుతుంది. హరిత విప్లవం తొలినాళ్లలో ఒక కిలో ఎరువుకు దాదాపు పదమూడు కిలోల అదనపు ధాన్యం వచ్చేది– అంటే 1:13 నిష్పత్తి. ఇవాళ అది 1:2.7కి పడి పోయింది. అంటే అదే కిలో ఎరువు ఇప్పుడు నాలుగో వంతు ధాన్యాన్ని మాత్రమే ఇస్తోంది. మనం వేసే నత్రజనిలో అరవై శాతానికి పైగా పంటకు అందకుండా గాలిలోకి, భూగర్భ జలాల్లోకి కొట్టుకుపోతోంది. నత్రజని చౌకగా దొరకడంతో రైతులు దాన్నే మోతాదు మించి వాడుతున్నారు; ఫలితంగా ఎన్ పీకే(నత్రజని, భాస్వరం, పొటాషియం) నిష్పత్తి 4:2:1 ఉండాల్సిన చోట దాదాపు 11:4:1కి చేరింది.ఒక ప్రాథమిక తేడాను మనం మరచిపోయాం. పంటకు పోషకాలు అందించడం వేరు, నేల సారాన్ని కాపాడటం వేరు. యూరియా పంటకు తక్షణ ఆహారం అందిస్తుంది. కానీ నేలలో సేంద్రియ కర్బనం, సూక్ష్మజీవులు, శిలీంధ్రాలు, వానపాములు– వీటిని అది పెంచదు. నిజానికి మోతాదు మించిన నత్రజని వీటిని దెబ్బతీస్తుంది. ఈ జీవరాశే నేలకు నీటిని పట్టి ఉంచే శక్తిని, గాలి ఆడే నిర్మాణాన్ని, పోషకాలను చక్రంలా తిప్పే సామర్థ్యాన్ని ఇస్తుంది. వీటిని రసాయనిక ఎరువులతో తిరిగి నిర్మించలేం– ఎందుకంటే ఎన్పీకే అనేది కర్బనం కాదు, జీవం అసలే కాదు.నిజంగా ఇది స్వావలంబనా?నూతన యూరియా విధానం చెప్పే స్వావలంబన కూడా చాలావరకు భ్రమే. యూరియా అమోనియా నుంచి, అమోనియా సహజ వాయువు నుంచి తయారవుతాయి. ఆ సహజ వాయువులో చాలా భాగం మనం ద్రవీకృత సహజ వాయువు (ఎల్ఎన్జీ) రూపంలో దిగుమతి చేసుకునేదే. యూరియా ఉత్పత్తి వ్యయంలో ఇది 70–80 శాతం. అంటే కొత్త కర్మాగారం అంటే దిగుమతి చేసుకున్న వాయువును ఇక్కడ యూరియాగా మార్చే యంత్రం మాత్రమే. మన ఆధారపడటం పోలేదు, కేవలం ఒక మెట్టు పైకి జరిగింది. భాస్వరం, పొటాష్ విషయంలో అయితే మనం దాదాపు పూర్తిగా దిగుమతులపైనే ఆధారపడతాం.అమెరికా ఉదాహరణ చూడండి: ఆ దేశం నత్రజనిలో స్వావలంబన సాధించిన మాట నిజమే, కానీ కర్మాగారాలు కట్టడం వల్ల కాదు. దానికి సొంత షేల్ గ్యాస్ ఉంది; మొక్కజొన్న–సోయాబీన్ మార్పిడి సాగులో పప్పుజాతి పంట తనకు తానే నత్రజనిని స్థిరీక రించుకుంటుంది. ఈ రెండూ మనకు లేవు. అక్కడి వాతావరణం కూడా వేరు. మన ఉష్ణోగ్రతలకు సేంద్రియ కర్బనం తొందరగా కోల్పోతాం. అక్కడ సంవత్సరానికి ఒక పంట కాలమే, రెండో కాలంలో నేల పునర్జీవనం కావటానికి అవకాశం ఉంది. కాబట్టి అమెరికా బాటలో కేవలం కర్మాగారాల స్థాపనను కాపీ చేస్తే, భారం మిగులుతుంది తప్ప భద్రత రాదు.నిజమైన స్వావలంబన అంటే మనం అదుపులో ఉంచుకోగల వనరుల నుంచి పంట అవసరాలను తీర్చుకోవడం. పప్పు ధాన్యాలు, జీవన ఎరువులు, పచ్చి రొట్ట ఎరువులు, అజొల్లా ద్వారా జీవ నత్రజని స్థిరీకరణ, పంట వ్యర్థాల పునర్వినియోగం, పశువుల ఎరువు, అన్నిటికీ ఆధారమైన నేలలో సేంద్రియ పదార్థం– ఇవి పెరిగితే వేసే ప్రతి కిలో ఎరువూ మరింత సమర్థంగా పనిచేస్తుంది.జీవసారం పెంచితే ప్రోత్సాహకాలుఇప్పుడు డబ్బుల మాట. దేశ ఎరువుల రాయితీ దాదాపు రూ.1.7 లక్షల కోట్లు; అందులో యూరియాదే రూ.1.19 లక్షల కోట్లు. తగ్గిపోతున్న రసాయనిక ఎరువుల సామర్థ్యం, వృథా అవు తున్న సగం నత్రజని– వీటిని చూస్తే ఇది తక్కువ ప్రయోజనం ఇచ్చే ఖర్చు. ఈ రాయితీలో సగాన్ని– అంటే దాదాపు 85 వేల కోట్లను– నేల ఆరోగ్యాన్ని పునరుద్ధరించడానికి మళ్లిస్తే ఏమవుతుంది?ఒక టన్ను యూరియా ఒక్క సీజన్ కే అయిపోతుంది, మళ్లీ కొనా ల్సిందే. కానీ నేలలో పెరిగిన సేంద్రియ కర్బనం ఏళ్ల తరబడి నిలు స్తుంది. ప్రతి ఏటా దిగుబడిని, నీటి నిల్వను, ఎరువుల సామర్థ్యాన్ని పెంచుతుంది. నేల బాగుపడిన కొద్దీ దానికి కావాల్సిన నత్రజని తగ్గుతుంది, దాంతోపాటే రాయితీ భారమూ తగ్గుతుంది.అందుకే ఒక జాతీయ/రాష్ట్ర స్థాయి నేల ఆరోగ్య పునరుద్ధరణ మిషన్ అవసరం. నేలలో సేంద్రియ కర్బనం, జీవసారం పెరిగిన కొద్దీ రైతుకు నేరుగా ప్రోత్సాహకం అందాలి. గ్రామ స్థాయి కంపోస్ట్, పంట వ్యర్థాల పునర్వినియోగం, రైతు ఉత్పత్తిదారుల సంఘాల ఆధ్వర్యంలో జీవ ఎరువుల యూనిట్లు– వీటిని ఉపాధి హామీ పథకం, ప్రకృతి వ్యవసాయంతో అనుసంధానం చేయాలి.‘రసాయనిక ఎరువులు లేకుండా దేశాన్ని పోషించలేం’ అనే వాదన రావచ్చు. ఎరువులను పూర్తిగా వదిలేయాలని అనడం లేదు. మొదట్లో రసాయనికం, జీవసంబంధం రెండింటినీ కలిపి వాడే సమీ కృత పోషక యాజమాన్యమే మార్గం. భారత్ తదుపరి వ్యవసాయ విప్లవం మరిన్ని రసాయనిక ఎరువులపై కాదు– ప్రాణమున్న నేల లను తిరిగి నిర్మించడంపై ఆధారపడాలి. ఏ ఓడరేవు, గ్యాస్ పైప్‌లైన్ కోసం మనం ఎదురుచూడనక్కర్లేదు– మన అతిపెద్ద ఎరువుల కర్మాగారం ప్రతి రైతు కాళ్ల కింద, నేల జీవంలోనే ఉంది. - డా. జి.వి. రామాంజనేయులు, వ్యాసకర్త సుస్థిర వ్యవసాయ కేంద్రం (సీఎస్ఏ) కార్యనిర్వాహక సంచాలకులు -
ట్రేడింగ్ ఒక వృత్తి కాగలదా?
నేటి ఆధునిక ఆర్థిక ప్రపంచంలో ‘ఆర్థిక స్వాతంత్య్రం’ సాధించ డానికి ట్రేడింగ్ ఒక ఆకర్షణీయమైన మార్గంగా కనిపిస్తోంది. గతంలో దీనిని కేవలం ఒక జూదంగానో లేదా పార్ట్–టైమ్ ఆదాయ వనరుగానో చూసేవారు. నేడు సాంకేతిక విప్లవం, మార్కెట్లపై అవగాహన పెరగడంతో చాలామంది దీనిని పూర్తి స్థాయి వృత్తిగా ఎంచుకోవాలని భావిస్తున్నారు.భారతీయ మార్కెట్ల నియంత్రణ సంస్థ అయిన ‘సెబీ’ రిటైల్ ట్రేడర్ల శైలి, వారి లాభనష్టాలపై ఒక లోతైన అధ్యయన నివేదికను విడుదల చేసింది. ఈ గణాంకాలు ట్రేడింగ్‌ను వృత్తిగా మార్చుకోవాల నుకునే వారికి కనువిప్పు కలిగిస్తున్నాయి.భారతదేశంలో ఈక్విటీ డెరివేటివ్స్ విభాగంలో ట్రేడింగ్ చేసే వ్యక్తిగత ట్రేడర్లలో దాదాపు 90% నుండి 93% మంది నష్టపోతున్నారు. నష్టపోయే ప్రతి యాక్టివ్ ట్రేడర్ సగటున ఏడాదికి రూ. 1.25 లక్షల నుండి రూ. 1.50 లక్షల వరకు నష్టపోతున్నట్లు సెబీ గణాంకాలు చెబుతున్నాయి. కేవలం 7% నుండి 10% మంది మాత్రమే మార్కెట్లో లాభాలు గడిస్తున్నారు. వీరిలో కూడా కేవలం 1.5% మంది మాత్రమే నెలకు రూ. 1 లక్ష కంటే ఎక్కువ ఆదాయాన్ని స్థిరంగా సంపాదించగలుగుతున్నారు. ట్రేడర్లు సంపాదించే లాభాల్లో లేదా నష్టాల్లో దాదాపు 15% నుండి 25% వరకు కేవలం బ్రోకరేజ్, పన్నులు, ఇతర లావాదేవీల ఖర్చులకే సరిపోతుందని తేలింది.ట్రేడింగ్‌లో లాభాలతో పాటు నష్టాలు కూడా ఉంటాయి. మార్కెట్ హెచ్చుతగ్గులు తీవ్రంగా ఉన్నప్పుడు భయం, దురాశ వంటి భావోద్వేగా లను నియంత్రించుకోవడం అందరికీ సాధ్యం కాదు. ట్రేడింగ్‌ను విజయ వంతమైన కెరీర్‌గా మార్చుకోవాలంటే ట్రేడింగ్‌కు సంబంధించి చాలా అంశాలపై పట్టు సాధించాలి. ప్రతి ట్రేడ్‌లోనూ మీ పెట్టుబడిపై ఎంత శాతం నష్టాన్ని (స్టాప్–లాస్ విధానం) భరించగలరో ముందే నిర్ణయించుకోవాలి. క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్, చార్ట్ ప్యాటర్న్స్, టెక్నికల్ ఇండికేటర్లపై శాస్త్రీయ మైన పట్టు ఉండాలి.ఇతర అభివృద్ధి చెందిన దేశాలలో (ముఖ్యంగా అమెరికా, యూరప్, సింగపూర్, దుబాయ్ వంటి ప్రాంతాల్లో) ట్రేడింగ్‌ను ఒక జూదంగానో లేదా సైడ్ హాసిల్గానో కాకుండా, గౌరవప్రదమైన, వ్యవస్థీకృతమైన ‘వైట్ కాలర్‘ వృత్తిగా చూస్తారు. విదేశాలతో పోలిస్తే భారతదేశంలో ట్రేడింగ్‌ను వృత్తిగా మార్చుకోవడానికి ఉన్న అతిపెద్ద సవాలు ఆర్థిక అక్షరాస్యత లోపించడం, సరైన గైడెన్స్ లేకపోవడం.– డా. ఎం.డి. ఖ్వాజా మొయినుద్దీన్, స్టాక్ మార్కెట్ విశ్లేషకుడు -
మాధవుడి మందిరంలో మన్మథుడికి చోటుందా?
దేవతలు తాగే అమృతం కావాలంటే, మందర పర్వతాన్ని మోసుకొచ్చి, దాన్ని కవ్వంగా చేసి, క్షీర సాగరాన్ని చేతులు పడిపోయేలా చిలకాలి. అది మహామహులకే తప్ప, మామూలు మనుషులకు సాధ్యమయ్యే పని కాదు. అలాగని దిగులు అక్కర్లేదు. భక్త కవీంద్రుడు లీలాశుకుడు తన కవితాశక్తి అనే కవ్వంతో, నుడి కడలిని మథించి వెలికి తీసిన ‘కృష్ణ కర్ణామృతం’ ఉంది.వీనుల విందు చేసే ఈ అమృతాన్ని, అభిరుచి ఉన్నవారెవరయినా, ఉచితంగా, తనివి తీరా ఆస్వాదించవచ్చు. లీలాశుకుడు ఈ కావ్యంలో తన ఇష్టదైవమైన బాలగోపాల కృష్ణుడిని ఎన్నెన్నో శబ్దాలంకారాలతో, అర్థాలంకారాలతో, చమత్కారాలతో అలంకరించి తరించాడు. ఆ కర్ణామృత కలశంలో ఒక్క చుక్క పట్టి చూసినా, అమృతం నాణ్యత అర్థమైపోతుంది.మన్మథుడు తుంట వింటివాడే కాదు. తుంటరివాడు కూడా. ఎంతో ప్రయత్నంతో, ఎన్నో సాధనలతో కష్టపడి, శుద్ధి చేసుకొన్న మహాభక్తుడి మనసులోకి ఎలాగో చొచ్చుకుపోతాడు. మదన వికారాల మాలిన్యంతో దాన్ని మళ్లీ మైల పడేస్తాడు. అలాంటి ఆగడాలు తన దగ్గర సాగవని లీలాశుకుడు మృదుమధురంగా, సొగసుగా, గడుసుగా మంద లిస్తూ..‘మార! మా రమ మదీయ మానసే,మాధవైక నిలయే యాదృచ్ఛయా!’అంటాడు. ‘‘మదనుడా! నా మనసులో దూరి అల్లరి చేయకు. ఇది మాధవుడు ఒక్కడి కోసం అచ్చంగా ఏర్పరచిన మందిరం. ఇక్కడ స్వేచ్ఛా విహారం చేస్తూ, ‘రమించ’కు. మా రమ!’ అని. అలా రమిస్తూ, ఆగం చేస్తే ఏమౌతుంది? కొంప మునుగుతుంది.ఎందుకంటే, 'శ్రీ రమాపతిః – ఇహ – ఆగమేత్ – అసౌ’ ఇల్లుగలాయన అయిన ‘రమాధవుడు ఇప్పుడో, ఇంకాసే పట్లోనో ఇక్కడికి వస్తాడు.’ ఆయన నీ గోల చూస్తే నీ వీపు విమానం మోత మోగిస్తాడో, తాట ఒలిచేస్తాడో!కః సహేత నిజ వేశ్మ లంఘనమ్? ‘తన ఇంట్లో పరులు స్వేచ్ఛగా జొరబడితే, ఎవరు సహిస్తారు?’ అందులో ఆయన సామాన్యుడా? సకల శక్తిశాలి. ఏమయినా చేయగలడు. ‘కనుక బతుకు మీద తీపి ఉంటే, నా నుంచి దూరంగా పారిపో!’’ అని పంచశరుడిని భక్తాగ్రణి హెచ్చరిస్తున్నాడు.– ఎం. మారుతి శాస్త్రి -
ఇక ఉద్యోగాలు, ఉత్పాదకతే లక్ష్యం
1991లో చేపట్టిన సంస్కరణలను అనేకమంది భారతదేశ ఆర్థిక రంగానికి ‘లాంచ్ ప్యాడ్’ (అభివృద్ధికి పునాది)గా భావిస్తారు. 1991 జూలై 4న– సరిగ్గా 35 ఏళ్ళ క్రితం అప్పటి ఆర్థిక మంత్రి మన్మో హన్ సింగ్ తన బడ్జెట్ ప్రసంగంలో విక్టర్ హ్యూగో మాటలను ఉటంకిస్తూ, ‘సమయం ఆసన్నమైన ఆలోచనను ప్రపంచంలో ఏ శక్తీ ఆపలేదు’ అని పేర్కొన్నారు. ‘ప్రపంచంలో భారత్ ఒక ప్రధాన ఆర్థిక శక్తిగా ఆవిర్భవించడం అనేది కూడా అలాంటి ఆలోచనే’ అని ఆయన ప్రకటించారు.ముప్పై ఐదు సంవత్సరాల తరువాత, మనకు స్పష్టంగా కనిపిస్తున్నది ఏమిటంటే– ఆ రోజున పారిశ్రామిక, వాణిజ్య నియంత్రణలను తొలగించడం అనేది భారతదేశ ఆర్థిక వృద్ధి రేటునూ, అలాగే పేదరిక నిర్మూలన వేగాన్నీ పెంచడానికి ఎంతగానో తోడ్పడింది. అయితే 1991లో చేసిన వాగ్దానం పాక్షికంగా మాత్రమే నెరవేరిందని మనం అంగీకరించక తప్పదు. నిజానికి, అంత అను కూలంగా లేని అంతర్జాతీయ వాతావరణంలో, ఎటువంటి సులువైన పరిష్కారాలు లేని ఆర్థిక భద్రత, సాంకేతిక పరిపక్వత, సమ్మిళిత వృద్ధి అనే నూతన సవాళ్ళను ఎదుర్కొంటూ దేశం మరోసారి ఒక సంక్లిష్టమైన స్థితిలో నిలబడింది.అభివృద్ధి నిజమే కానీ...1990–91 నాటికి అంతకు ముందు 40 సంవత్సరాలలో, మన ఆర్థిక వ్యవస్థ ఐదు రెట్లు పెరిగింది. కానీ అదే సమయంలో జనాభా రెండున్నర రెట్లు పెరగడంతో, తలసరి ఆదాయం కేవలం రెట్టింపు మాత్రమే అయింది. దానికి భిన్నంగా, 1990–91 తర్వాత గత 35 ఏళ్లలో, ఆర్థిక వ్యవస్థ ఎనిమిది రెట్లు పెరిగింది. ఈ మధ్యకాలంలో జనాభా 70 శాతం మాత్రమే పెరగడం వల్ల, తలసరి ఆదాయం నాలుగున్నర రెట్లకు పైగా పెరిగింది.మొదటి కాలంలో భారత్ ఇతర దేశాలతో పోలిస్తే తక్కువ పనితీరు కనబరచగా, రెండవ (ఆర్థిక సంస్కరణల తరువాతి) కాలంలో చాలా తక్కువ దేశాలు మాత్రమే పోటీ పడగలిగేలా అద్భుతమైన వృద్ధి నమోదు చేసింది. అయితే, ఇంకా ఎంతో సాధించి ఉండవచ్చని చైనా, వియత్నాంలు నిరూపిస్తున్నాయి. భారత్‌కు సమానమైన స్థాయి నుండి ప్రయాణం ప్రారంభించిన చైనా, ఇప్పుడు ‘అధిక ఆదాయ’ దేశాల జాబితాలోకి చేరే స్థితిలో ఉంది.1991లో భారతదేశ తలసరి ఆదాయంలో సగం కంటే తక్కువ ఆదాయం ఉన్న వియత్నాం ఇప్పుడు భారత్ కంటే 80 శాతం అధిక ఆదాయాన్ని కలిగి ఉంది. భారత్ ఇప్పటికీ ‘దిగువ–మధ్య ఆదాయ’ గ్రూపులోనే ఉంది. మన తలసరి ఆదాయం ప్రపంచ సగటులో నాలుగో వంతు కంటే తక్కువగానే ఉంది. తీవ్ర పేదరికం 1991లో 37 శాతంగా ఉండగా, ఇప్పుడు 5 శాతానికి పడిపోయింది. కానీ బహుమితీయ పేదరిక సూచీ ప్రకారం, ఇప్పటికీ ఆరో వంతు జనాభా పేదరికంలోనే ఉన్నారు. ఐక్యరాజ్యసమితి మానవాభివృద్ధి సూచీలో భారత్ దిగువనే ఉంది. అయినప్పటికీ, వంటగ్యాస్,మంచినీటి కనెక్షన్లు, మరుగు దొడ్లు, గృహ విద్యుత్ వంటి ప్రాథమిక వస్తువుల లభ్యత గతంలో కంటే ఇప్పుడు మెరుగైంది.అయినా ప్రపంచ దృష్టి భారత్‌పైనే...కొన్ని విజయాలు పరిమి తమైనవిగా అనిపించినప్పటికీ, గతంలో ఎన్నడూ లేని విధంగా భారత్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. దీనికి ప్రధాన కారణం ప్రపంచంలోనే అతిపెద్దదైన ఇక్కడి జనాభా పరిమాణమే. ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, అనేక రకాల ఉత్ప త్తులు, సేవలకు భారత్ ప్రపంచంలోనే అత్యంత భారీ మార్కెట్లలో ఒకటిగా ఉంది. ఇది, ఖర్చు పెట్టే శక్తి ఉన్న ఒక పెద్ద మధ్యతరగతి విభాగ ఆవిర్భా వాన్ని ప్రతిబింబిస్తుంది.భారత్‌లోని 145 కోట్ల జనాభాలో 30 నుండి 40 శాతం మంది మధ్యతరగతి పరిధిలోకి వస్తారు. ఈ వర్గంలో దాదాపు 8 నుండి 10 కోట్ల కుటుంబాలు ఉన్నాయనడానికి ఏటా విక్రయించే 2 కోట్ల ద్విచక్ర వాహనాలు, 15 కోట్ల స్మార్ట్ఫోన్లు సాక్ష్యంగా ఉన్నాయి. 1991లో ఏడాది మొత్తం అమ్మిన కార్ల సంఖ్యను ఇప్పుడు కేవలం పదిహేను రోజుల్లోనే విక్రయిస్తున్నారు. ఆదాయంతో పోలిస్తే ఉత్ప త్తులు అందుబాటు ధరల్లో, మెరుగైన నాణ్యతతో లభిస్తున్నాయి. సాఫ్ట్వేర్ సేవలు, తక్కువ ఖర్చుతో కూడిన ఫార్మాస్యూటికల్స్ తయారీలో భారత్ ప్రత్యేక గుర్తింపు పొందింది. భారత్ రూపొందించిన డిజిటల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్, ఆయిల్ రిఫైనింగ్, వైద్యసంరక్షణ రంగాలలో సాంకేతిక పరిణతి కూడా గుర్తింపు పొందాయి. హార్వర్డ్ గ్రోత్ ల్యాబ్ వారి ‘ఎకనామిక్ కాంప్లెక్సిటీ ఇండెక్స్’లోని 145 దేశాలలో భారత్ పైనుండి మూడో స్థానంలో ఉంది. 1991 సంస్కరణల మూల సూత్రాన్ని దేశం సరిగ్గా అనుసరించి ఉంటే ఇంకా ఎంతో సాధించి ఉండేది. ప్రైవేట్ రంగం, మార్కెట్లు అవి సాధించగలిగినవాటిని వదిలేయడం, బయటి ప్రపంచానికి తలుపులు తెరవడం, ప్రభుత్వం మాత్రమే అందించగలిగే వాటిపై శ్రద్ధను కేంద్రీకరించడం–అంటే శాంతిభద్రతలు, న్యాయం, ప్రజారోగ్యం, నాణ్యమైన ప్రభుత్వ పాఠశాలలు, పర్యావరణ పరి రక్షణ, మార్కెట్ల సరైన నియంత్రణ కలిగి ఉండటమే ఆ సూత్రం.వాస్తవ స్థితివీటిలో ప్రతి విషయంలోనూ భారత్ వెనుకబడి ఉంది. దేశంలో 22 లక్షల మంది పోలీసులు ఉంటే, దానికి నాలుగు రెట్లు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు ఉన్నారు. కోర్టుల్లో ఆలస్యం అనేది సర్వసా ధారణమైపోయింది. సగానికి పైగా పాఠశాల విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలకు వెళ్తున్నారు. 40 శాతం ఆసుపత్రి పడకలు ప్రైవేట్రంగానివే. ప్రజల ఆదాయాలు ఇంకా పరిమితంగా ఉన్న సమయంలో ఈ రెండింటికీ భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. సరిపడా పోషకాహారం లేకపోవడం వల్ల పిల్లల్లో ఎదుగుదల లోపాలు విస్తృతంగా కనిపిస్తున్నాయి.కోవిడ్ మహమ్మారి తర్వాత ప్రభుత్వ అప్పులు ఆందోళన కరమైన స్థాయికి చేరాయి. విద్య, రక్షణ రెంటిపై ప్రభుత్వం చేసే వ్యయం తగ్గుతోంది. వ్యవసాయ రంగంలో ఉత్పాదకత ప్రపంచ సగటుతో పోలిస్తే చాలా తక్కువ. గత దశాబ్దపున్నర కాలంగా రక్షణాత్మక సుంకాలు, ఇతర అడ్డంకులు పెరిగిన కొద్దీ, జీడీపీలో వస్తువుల ఎగుమతుల నిష్పత్తి తీవ్రంగా తగ్గుతూ వచ్చింది. మంచి ఉద్యోగాల కల్పన కష్టంగా మారడంతో మధ్యతరగతి పరిమాణం గతంలోలాగా పెరగడం లేదు. దేశంలోని అత్యున్నత అర్హతలు కలిగినవారు పెద్ద సంఖ్యలో దేశం విడిచి వెళ్తున్నారు. స్వదేశీ ప్రైవేట్ పెట్టుబడులు ఆశించిన స్థాయిలో లేవు. అత్యంత తీవ్రంగా దెబ్బ తిన్నది మాత్రం మధ్యతరగతికి, పేదలకు మధ్యన ఉన్న ‘ఆకాంక్షల వర్గం’. అసంఘటిత రంగంలో అస్థిరమైన, తక్కువ ఆదాయాల వల్ల వీరిలో అత్యధికులు ‘నిశ్శబ్ద నైరాశ్యంతో కూడిన జీవితాలను’ గడుపుతున్నారు. ఈ వర్గానికి చెందిన కొందరు యువకులు గత నెల రోజు లుగా న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ నిరసన ప్రాంతంలో కనిపించారు. ఈ వయస్సు వర్గాలలో 25 శాతం నుండి 40 శాతం వరకు నిరుద్యోగం ఉంది. 1991 సంస్కరణల స్ఫూర్తిని కొనసాగిస్తూ, ప్రభుత్వం తన శ్రద్ధను ప్రాథమిక సేవలపై కేంద్రీకరించడం ద్వారా మాత్రమే ఈ స్థితిని మార్చగలదు.-వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)-టి.ఎన్. నైనన్ -
అమెరికా రాజనీతికి యుద్ధం కేంద్రకం
ఇరాన్, ఉక్రెయిన్ యుద్ధాలను, వీటిలో యూఎస్ఏ పాత్రను విస్తృత అంతర్జాతీయ జియో పొలిటికల్ క్రీడలో భాగంగా చూడాలి. 2035లో ప్రపంచ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారబోతున్నది. ఈ పరిణామంలో భాగమే ఈ యుద్ధాలు. గత 250 సంవత్సరాల అమెరికా చరిత్ర పూర్తిగా యుద్ధాలతోనే ముడిపడి ఉన్నది. గత శతాబ్దంలో ప్రతి 20 సంవత్సరాలకు కనీసం ఒక పెద్ద యుద్ధానికి తెరతీసింది. పద్దెనిమిది,పందొమ్మిది శతాబ్దాలలో దేశ విస్తరణకు బ్రిటన్, ఫ్రాన్స్, స్పెయిన్, మెక్సికోలతో యుద్ధం చేసింది. ఇరవయ్యవ శతాబ్దంలో ఫిలిప్ఫైన్, రెండు ప్రపంచ యుద్ధాలు, కొరియా, వియత్నాం, బోస్నియా, గల్ఫ్ యుద్ధాలలో నిమగ్నమైంది. ఇరవయ్యొకటవ శతాబ్దంలో అఫ్గాని స్తాన్, ఇరాక్, లిబియా, యెమెన్, సిరియా, సోమాలియాలలో యుద్ధాలను లేవనెత్తింది. గత 250 ఏళ్లలో యూఎస్ఏ కేవలం 1865–1898 (33 సం‘‘లు), 1918–1945 (27 సం‘‘లు) మధ్య మాత్రమే యుద్ధానికి దూరంగా ఉన్నది. శాంతి కోసం యుద్ధం, సుభిక్షానికి యుద్ధం, సుస్థిరతకు యుద్ధం అనేది అమెరికా పాలనా విధానం. శక్తిని చాటి చెప్పటానికి యుద్ధాన్ని ఒక పరికరంగా పరిగణిస్తుంది. ఈ యుద్ధ తంత్రానికి ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, ఉదారవాద విధానాల ముసుగు కప్పుతుంది. కథ అడ్డం తిరిగింది!సోవియెట్ యూనియన్ విచ్ఛిన్నం తరువాత ప్రపంచంపై తన ఏకచ్ఛత్రాధిపత్యాన్ని నిలబెట్టుకోవటానికి అమెరికా సర్వశక్తులు ఒడ్డింది. ప్రత్యర్థి రష్యాను పూర్తిగా అణచివేయాలని నాటోను విస్త రించింది. 2010కల్లా రష్యా ఆర్థికంగా పుంజుకొని అమెరికాకు సవా లుగా తయారైంది. ఇదే సమయంలో అనూహ్యంగా చైనా బలమైన ప్రత్యర్థిగా ఎదిగింది. 2020కల్లా భారత్, బ్రెజిల్, దక్షిణ ఆఫ్రికాలు కూడా బలమైన శక్తులుగా రూపుదిద్దుకున్నాయి. బ్రిక్స్ రూపంలో కూటమిగా చేరి, అమెరికన్ ఆర్థిక వ్యవస్థకు ప్రత్యామ్నాయాలను సంకల్పించటంతో కథ అడ్డం తిరిగింది.బహుళ ధ్రువ ప్రపంచం ఏర్పడటం ఖాయమనే విశ్లేషకుల జోస్యాన్ని తప్పుగా నిరూపించాలని కృతనిశ్చయంతో ఉన్నది. అమెరికా ముందు మూడు ప్రత్యామ్నాయాలున్నాయి. 1. ప్రత్యర్థు లను నిర్వీర్యం చేసి ఏకైక ప్రపంచ శక్తిగా కొనసాగటం. 2. ప్రత్య ర్థులతో రాజీపడి పరిమిత ధ్రువ (లిమిటెడ్ పోలార్) ప్రపంచంలో ప్రధాన శక్తిగా కొనసాగటం. 3. ప్రత్యర్థులతో రాజీపడి బహుళ ధ్రువ (మల్టీ పోలార్) ప్రపంచంలో ప్రధాన శక్తిగా కొనసాగటం.మూడింట్లో మొదటి దారిప్రస్తుతం అమెరికా ఏకైక ప్రపంచ శక్తిగా కొనసాగాలనే పట్టు దలతోనే ఉన్నట్లుగా కన్పిస్తున్నది. ఇందులో భాగంగానే ఇంధన వనరులు, ఇంధన రవాణా మార్గాలపై పెత్తనానికి సర్వశక్తులు ఒడ్డు తున్నది. రష్యాపై తీవ్రస్థాయిలో ఆంక్షలు విధించి ఉక్రెయిన్ యుద్ధపు పద్మవ్యూహంలోనికి రష్యాను లాగింది. రష్యానుండి చమురు, గ్యాస్ ఎవరూ కొనగూడదని ఐరోపా, భారత్‌లను కట్టడి చేసింది. దీర్ఘకాలిక యుద్ధంలో ఉక్రెయిన్ వెనుక నిలబడి రష్యా అలసిపోయి నిర్వీర్యమవటానికి దీర్ఘకాలిక ప్రణాళికను అమలు పరుస్తున్నది. అందుకే నెల లోపున ముగుస్తుందనుకున్న ఉక్రెయిన్ యుద్ధం నాలుగన్నర సంవత్సరాలకు కూడా కొనసాగుతున్నది. ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం చైనా చేతిలో పడకుండా చూడటం ద్వారా చైనాను కట్టడి చేయాలనేది అమెరికా వ్యూహం. ‘చిప్ 4’ అలయన్స్‌లో భాగంగా అమెరికా, తైవాన్, ద.కొరియా, జపాన్‌లు చైనాకు అత్యాధునిక సెమీకండక్టర్ చిప్‌లు అందుబాటు లోనికి రాకుండా ప్రయత్నిస్తున్నాయి. ఆకస్ కూటమిలో భాగంగా ఆస్ట్రేలియా, యూకే, యూఎస్ఏలు ఏఐ, క్వాంటమ్ మెకానిక్స్ హైపర్సోనిక్ టెక్నాలజీని చైనాకు అందకుండా చేయటానికి ప్రయ త్నిస్తున్నాయి. జీ7, యూరోపియన్ యూనియన్ల ద్వారా అత్యాధు నిక చిప్స్ తయారు చేసే యంత్రాలను ఏఎస్ఎంఎల్ (నెదర్లాండ్స్), టోక్యో ఎలక్ట్రానిక్ (జపాన్) కంపెనీలు చైనాకు ఎగుమతి చేయకుండా ఆంక్షలు పెట్టాయి. తైవాన్ను సమర్థించటం ద్వారా కూడా చైనాకు చెక్ పెట్టటానికి అమెరికా ప్రయత్నిస్తున్నది.విశేషంగా ఇంధన వనరులున్న ఇరాన్, ఇరాక్, సౌదీ, యూఏఈ, కువైట్ మొదలైన గల్ఫ్ దేశాలపై నియంత్రణకు అమెరికా దీర్ఘకాలికంగా వ్యూహాలను అమలుపరుస్తున్నది. సైనిక స్థావరాల ద్వారా గల్ఫ్ దేశాలలో అమెరికా ఇప్పటికే పాగా వేసింది. ఈ ఇంధన వనరుల నియంత్రణలో అమెరికాకు కొరకరాని కొయ్యగా మారింది ఇరాన్. అందుకే హార్మూజ్, బాబెల్ మాండెబ్ జలసంధులపై పెత్తనానికి అమెరికా ప్రయత్నిస్తున్నది.ఆసియాలో భారత్ ఆధిపత్యం?అమెరికా తన ఆధిపత్యాన్ని కొనసాగించే వ్యూహంలో భాగాలే ఉక్రెయిన్, ఇరాన్ యుద్ధాలు. అందువలన ఈ రెండు ఇప్పట్లో ముగిసే అవకాశాలు లేవు. ఇరాన్ యుద్ధం వలన తీవ్రంగా నష్ట పోయేది భారత్, చైనాలని గుర్తించాలి. చైనా, రష్యా, భారత్‌లను ఈ రెండు యుద్ధాల ద్వారా కట్టడి చేయటం సాధ్యం కాని పక్షంలో అమె రికా పరిమిత ధ్రువ ప్రపంచానికి రాజీ పడాల్సి వస్తుంది. రష్యా, చైనా/భారత్‌లను ప్రపంచ శక్తులుగా అంగీకరించాల్సి వస్తుంది. క్రమంగా నాటోను రద్దుపరచి ఐరోపాపై రష్యా ఆధిపత్యానికి అంగీ కరించి ఉత్తర, మధ్య, దక్షిణ అమెరికాలకు యూఎస్ఏ తన ఆధిప త్యాన్ని పరిమితం చేసుకోవాల్సి ఉంటుంది. దక్షిణ, తూర్పు ఆసి యాలలో చైనా ఆధిపత్యాన్ని అంగీకరించి గల్ఫ్ ప్రాంతంలో ఇజ్రా యెల్–యూఏఈ– సౌదీల ద్వారా నియంత్రణకు ప్రయత్నిస్తుంది. అయితే దక్షిణ, తూర్పు ఆసియాలలో ఆధిపత్యంతో చైనా సరిపెట్టుకోక పోవచ్చును. చైనా ప్రపంచాధిపత్యానికి ప్రయత్నించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాక్రమంగా రష్యాతో ఒప్పందం ద్వారా చైనాకు వ్యతిరేకంగా భార త్ను ఆసియాలో ఆధిపత్యానికి ప్రోత్సహించవచ్చును.2040 కల్లా చైనా ప్రపంచ శక్తిగా అమెరికా, రష్యాలనే సవాలు చేయవచ్చని విశ్లేషకుల అంచనా. ఈనాడు ప్రత్యర్థులుగా ఉన్న రష్యా, అమెరికాలు కలిసి చైనాను నిలువరించాల్సి రావచ్చును. రాజకీయాలలో శాశ్వత మిత్రత్వం కానీ శాశ్వత శతృత్వం కానీ ఉండదు. అమెరికా, రష్యాలు, ఆసియాలో భారత్ వైపే మొగ్గు చూప టానికి అవకాశం ఉన్నది. తైవాన్ను చైనా ఆక్రమించటానికి ప్రయ త్నించినప్పుడు చైనాను ఇంకొకవైపు నుండి నిలువరించటానికి భారత్ సిద్ధమవవచ్చును. ఒకవైపు హిమాలయాలలో చైనాపై దాడి చేస్తూనే భారత్ మలక్కా జలసంధిని దిగ్బంధనం చేయవచ్చు. ఆ సందర్భంలో చైనా సముద్రంలో అమెరికా, జపాన్‌లను చైనా ఎదు ర్కోవటం కష్టమవుతుంది. భారత్‌కు అమెరికా సైనిక, వ్యూహాత్మక మద్దతును అందించవచ్చును.కాకపోతే, ఈ అమెరికన్ అంతర్జాతీయ రాజకీయ వ్యూహంలో పావుగా మారటానికి భారత్ ఒప్పుకోకపోవచ్చును. ప్రాంతీయంగా ఆసియాలో చైనాను నియంత్రించటానికి భారత్ ఒప్పుకుంటుంది. కానీ అంతర్జాతీయంగా చైనాను నిరోధించే వ్యూహంలో భారత్ భాగ స్వామిగా మారాల్సిన అవసరం భారత్‌కు లేదు. ఏది ఏమయినా ఉక్రెయిన్, ఇరాన్ యుద్ధాలు అంతర్జాతీయ రాజకీయ యవనికను నియంత్రించే కీలక ఘట్టాలనటంలో సందేహం లేదు. భారత్ ఆచి తూచి అడుగులు వేయాల్సి ఉంటుంది.-వ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్); సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు- గురజాల శ్రీనివాసరావు -
వ్యవసాయ భవిష్యత్తుకు కొత్త ఊపిరి
భారత వ్యవసాయం వందల ఏళ్లుగా కరవులను, వరదలను, ధరల పతనా లను, విధాన మార్పులను తట్టుకుని నిల బడింది. అభిరుచులు, మార్కెట్లు, సాంకే తికతలు మారుతున్న కొద్దీ పంటలు వచ్చాయి, పోయాయి. కొన్ని పంటలు రైతులకు తాత్కాలిక ఊరటనిస్తే, కొన్ని వారిని అప్పుల్లో పడేశాయి. చరిత్ర చెప్పే నిజం ఏమిటంటే– సరైన విధానం, ముందుచూపు తోడైతే ఒక్క పంట కూడా ఊరు, దేశం ఆర్థిక పరిస్థితినే మార్చగలదు. ప్రపంచంలో వంట నూనెలకు డిమాండ్ పెరుగుతున్న ఈ కాలంలో, ఆ మార్పు తెచ్చే పంట ఆయిల్ పామ్. తెలంగాణకు ఆయిల్ పామ్ కేవలం ఒక కొత్త పంట కాదు– ఇది దీర్ఘకాలిక అభివృద్ధి వ్యూహం. ఒక గేమ్ ఛేంజర్ కాగల పంట.ప్రధాన ఆర్థిక వనరుతెలంగాణ ఏర్పడిన మొదటి పదేళ్లలో మిషన్ కాకతీయ లాంటి పథకాల ద్వారా సాగునీటిని వసతులని పునరుద్ధరించడం సబబే. కానీ కేవలం వరి, పత్తి పంటల పైనే ఆధారపడిన వ్యవసాయం వాంఛనీయం కాదు. రాష్ట్రం రెండో పదేళ్లలోకి అడుగుపెడుతున్న ఈ సమయంలో, మన వ్యవసాయ భవిష్యత్తుకు ఒక కొత్త ఆధారం కని పిస్తోంది. ఆయిల్ పామ్‌ను ఒక చిన్న పంటగా చూడటం మానేసి, నర్సరీ నుంచి రిఫైనరీ దాకా పూర్తి వ్యవస్థను నిర్మించే కొత్త గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు దీన్ని పునాదిగా చూడాల్సిన సమయం వచ్చింది.ఆయిల్ పామ్ ఎందుకింత ముఖ్యమో అర్థం కావాలంటే మనం మన దేశ సరిహద్దులు దాటి చూడాలి. జనాభాలో మన కంటే చాలా తక్కువగా ఉన్న ఇండోనేషియా, మలేషియా దేశాలు ఈ ఒక్క పంటతో తమ గ్రామాల రూపురేఖలనే మార్చేశాయి. సుమారు 28.3 కోట్ల జనాభా ఉన్న ఇండోనేషియా, దాదాపు 4.2 కోట్ల ఎక రాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తూ, ఏటా సుమారు 4.6 కోట్ల టన్నుల పామ్ ఆయిల్ ఉత్పత్తి చేస్తోంది. ఆ దేశ జీడీపీలో ఆయిల్ పామ్ వాటా సుమారు 4.5 శాతం, ప్రత్యక్షంగా, పరోక్షంగా 16 లక్షలకు పైగా కుటుంబాలకు ఇది జీవనోపాధి.మలేషియా కథ కూడా ఇలాంటిదే. కేవలం 3.56 కోట్ల జనాభా ఉన్న ఈ దేశం దాదాపు 1.4 కోట్ల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తూ, ఏటా సుమారు 2 కోట్ల టన్నులు ఉత్పత్తి చేస్తోంది. 1970లు, 1980లలో రబ్బరు ధరలు పెరగకుండా, గ్రామాల్లో ఆదాయం తగ్గి నప్పుడు, మలేషియా వ్యూహాత్మకంగా ఆయిల్ పామ్ వైపు మళ్లింది. భద్రత–స్థిరత్వం 147 కోట్ల జనాభా ఉన్న మన భారత ప్రజానీక ఆశలు, తినే అలవాట్లు వేగంగా మారుతున్నాయి. మన దేశంలో పండించే వంట నూనె మన అవసరంలో సగం మాత్రమే తీరుస్తోంది. ప్రతి ఏటా సుమారు 130 లక్షల టన్నుల వంట నూనెలను బయటి నుంచి తెచ్చుకుంటున్నాం. కేవలం పామ్ ఆయిల్ కోసమే ఏటా సుమారు రూ.1 లక్ష కోట్లు ఖర్చు పెడుతున్నాం. సూటిగా చెప్పాలంటే, మనం మన విలువైన విదేశీ మారకాన్ని బయటికి పంపి, దానికి బదులు అనిశ్చితిని తెచ్చుకుంటున్నాం. ప్రపంచంలో ఎక్కడైనా సరఫరాలో ఏ చిన్న ఆటంకమైనా, ఏ దేశాల మధ్య ఉద్రిక్తతైనా, అంతర్జాతీయ ధరలు పెరిగినా, దాని ప్రభావం నేరుగా మన వంట గదులపైనా, మన రైతులపైనా పడుతుంది.ఇలా బయటి నుంచి తెచ్చుకోవాల్సి రావడానికి కారణం మన రైతులకు సామర్థ్యం లేకపోవడం కాదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఆయిల్ పామ్ సాగును బాగా పెంచగల వాతావరణం, నేలలు ఉన్నాయి. అయినా, దేశం మొత్తం మీద కేవలం 10 లక్షల ఎకరాల్లోనే ఆయిల్ పామ్ సాగవుతోంది. ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండగా, తక్కువ మొత్తంతో మొద లైనా తెలంగాణ ఇప్పటికే రెండో స్థానానికి చేరుకుంది. భద్రత, స్థిరత్వం ఇచ్చే ఈ పంటను చేపట్టడానికి తెలంగాణ రైతుల్లో ఉన్న ఆసక్తిని, సంసిద్ధతను ఇది చూపిస్తుంది.ఈ రోజు తెలంగాణలో సుమారు 2.8 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగవుతోంది, అందులో అవిభక్త ఖమ్మం జిల్లా ఒక్కటే దాదాపు 1.35 లక్షల ఎకరాలు కలిగి ఉంది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో, రాబోయే సంవత్సరాల్లో ఈ సాగును 10 లక్షల ఎకరాలకు పెంచాలని రాష్ట్రం ఒక పెద్ద, కానీ సాధించగల లక్ష్యాన్ని పెట్టుకుంది.ఆయిల్ పామ్ తోట దాదాపు 30 నుంచి 40 సంవత్సరాల పాటు దిగుబడి ఇస్తుంది. ఒకే పంటకోతపై, ఒకే మార్కెట్ ధరపై ఆధారపడే కాలానుగుణ పంటల్లా కాకుండా, ఏడాది పొడవునా తాజా పండ్ల గెలలు ఇస్తుంది. అంటే ఏడాదికోసారి వచ్చే పెద్ద మొత్తం కాదు, ప్రతి నెలా చేతికి డబ్బు అందుతుంది. తోటలు పూర్తి దిగుబడికి వచ్చాక, దిగుబడి, నిర్వహణను బట్టి, ఇప్పటి ధరల ప్రకారమే రైతులు ఎకరాకు ఏటా రూ.2 లక్షల వరకు సంపాదించ గలుగుతున్నారు. తాజా పండ్ల గెలల ధర టన్నుకు రూ. 22,000 నుంచి రూ.24,500 వరకు ఉంటూ, నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్–ఆయిల్ పామ్ (ఎన్ ఎంఈఓ–ఓపీ) లాంటి పథ కాల కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంచి తోడ్పాటునందిస్తుండటంతో, చాలా గ్రామీణ కుటుంబాలకు ఆయిల్ పామ్ నెలనెలా జీతం లాంటిదిగా మారింది. దీనికి తోడు, మొక్కలు, ఇన్ పుట్లు, మొదట్లో అయ్యే ఖర్చుల కోసం తెలంగాణ ప్రభుత్వం ఎకరాకు సుమారు రూ.50,000 వరకు సబ్సిడీ ఇస్తోంది. దీనితో పూర్తి దిగుబడి రాకముందు మొదటి మూడు, నాలుగేళ్లలో రైతులపై పడే భారం తగ్గుతుంది.విత్తనం నుంచి నూనె ప్యాకెట్ దాకా...ఆయిల్ పామ్‌లో ఏదీ వృథా పోదు. పండు నుంచి ముడి పామ్ ఆయిల్, పామ్ కెర్నల్ ఆయిల్ తీస్తారు. పీచు, పెంకులను కరెంటు తయారీకి వాడొచ్చు. మిగిలిన వ్యర్థాలను సేంద్రియ ఎరువుగా, పశుగ్రాసంగా మార్చొచ్చు. కోకో, జాజికాయ, మిరియాలు, పూలు లాంటి నీడలో పెరిగే పంటలను కలిపి వేసుకుంటే, ఆయిల్ పామ్ తోటలు ఒకే పంట తోటలుగా కాక, రకరకాల ఆదాయాలు ఇచ్చే తోటలుగా మారతాయి.పొలం గట్టు దాటి కూడా, ఆయిల్ పామ్ వల్ల ఉద్యోగాలు, వ్యాపారాలు పుడతాయి. నర్సరీలు, ఇన్ పుట్లు అమ్మేవారు, కోత సేవలు, రవాణా చేసేవారు, ఫ్రూట్ కలెక్షన్ కేంద్రాలు, క్రషింగ్ యూనిట్లు, రిఫైనరీలు, ప్యాకింగ్ యూనిట్లు, హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులు, వీళ్లందరూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో భాగమై ఉపాధిని పెంచుతారు.అశ్వారావుపేట, దమ్మపేట లాంటి ప్రాంతాల్లో ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఇప్పటికే వ్యాపార కేంద్రాలుగా మారడం చూశాం. సిద్దిపేటలో కొత్త ఫ్యాక్టరీ ఇప్పటికే ప్రారంభమైంది. ఖమ్మం జిల్లా కొణిజర్లలో గోద్రెజ్ సంస్థ పామ్ ఆయిల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసింది. ‘విత్తనం నుంచి నూనె ప్యాకెట్ దాకా‘ ఒకే గొలుసుగా చేయడమే తెలంగాణ వ్యూహం.ఆయిల్ పామ్ పర్యావరణానికి హానికరం అని కొందరు అంటున్నారు. ఈ అభిప్రాయం ఎక్కువగా వేరే దేశాల్లో సున్నితమైన అడవులు, తడి నేలల్లో పెద్ద ఎత్తున అడవులను కొట్టేసిన అనుభవాల నుంచి వచ్చింది. తెలంగాణ పరిస్థితి పూర్తి భిన్నం. మనం అడవు లను కొట్టేయడం గురించి మాట్లాడటం లేదు; తక్కువ దిగుబడి ఉన్న, వర్షాధార లేదా ఒకే పంట పండే భూములను సరైన నీటి వాడకంతో మంచి విలువ ఇచ్చే చెట్ల తోటలుగా మార్చడం గురించి మాట్లాడుతున్నాం. సరిగ్గా ప్రణాళిక వేసుకుంటే, ఆయిల్ పామ్ తోటలు పచ్చదనాన్ని పెంచుతాయి, గాలిలో కార్బన్‌ను ఎక్కువగా పీల్చుకుంటాయి, కొండ ప్రాంతాల్లో నేల కొట్టుకుపోకుండా చూస్తాయి, తేమను నిలుపుతాయి. సహజ అడవులను కొట్టేయకుండా కఠినంగా ఉంటూ, అంతర పంటలు, జీవవైవిధ్యానికి మేలు చేసే పద్ధతులను ప్రోత్సహిస్తూ ఉంటే, ఆయిల్ పామ్ తెలంగాణలో పర్యావరణానికి శత్రువు కాదు, స్నేహితుడు కాగలదు.- తుమ్మల నాగేశ్వర రావు, వ్యాసకర్త, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి -
చైనా ఫ్లయింగ్ పవర్ స్టేషన్
అత్యాధునిక పద్ధతులతో మౌలికరంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్న చైనా, విద్యుత్ ఉత్పత్తి రంగంలోనూ వినూత్న ప్రయోగాలకు తెరలేపింది. ఇటీవల సిచువాన్ ప్రావిన్స్‌లోని యిబిన్ ప్రాంతంలో భారీ ఎయిర్ షిప్‌ను ఆకాశంలోకి ఎగురవేసింది. దీనికి ‘ఫ్లయింగ్ విండ్ పవర్షిప్ ఎస్–2000’ అని పేరు పెట్టింది. ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన ఫ్లయింగ్ పవర్ స్టేషన్‌గా గుర్తింపు పొందింది. ఇది గాలి వేగాన్ని ఉపయోగించుకుని విద్యుత్తును ఉత్పత్తి చేసే సాంకేతికత. సాధారణ విండ్ మిల్లులు భూమికి తక్కువ ఎత్తులోఉంటాయి. అక్కడ గాలి వేగం తక్కువగా ఉంటుంది. కానీ ఎస్–2000 వంటి వ్యవస్థలు సుమారు 300 నుండి 600 మీటర్ల ఎత్తుకు ఎగిరి, అక్కడ వేగంగా వీచే గాలులను ఉపయోగించుకుంటాయి. ఈ ఎత్తులో గాలి నుండి లభించే శక్తి భూమిపై కంటే 3 నుండి 4 రెట్లు ఎక్కువ.సుమారు 60 మీటర్ల పొడవు, 40 మీటర్ల వెడల్పు, 40 మీటర్ల ఎత్తు ఉండే ఈ ఎయిర్‌షిప్ హీలియం నింపిన తేలియాడే వేదిక. భూమిపై కంటే ఆకాశంలో గాలి వేగం స్థిరంగా, బలంగా ఉంటుంది, కాబట్టి ఇది ఎక్కువ విద్యుత్తును ఉత్పత్తి చేయగలదు. భారీ విండ్ టవర్లు కట్టాల్సిన అవసరం లేదు కాబట్టి, నిర్మాణానికి అయ్యే ఖర్చు, ఇనుము వాడకం తగ్గుతుంది. వీటిని అవసరమైన చోటికి సులభంగా తీసుకువెళ్లవచ్చు.ఎస్ –2000 వంటి వ్యవస్థలు ప్రధానంగా రెండు రకాలుగా విద్యుత్తును తయారు చేస్తాయి: ఆన్–బోర్డ్ జనరేషన్ ఒకటైతే, గ్రౌండ్–బేస్డ్ జనరేషన్ రెండోది. ఆన్–బోర్డ్ పద్ధతిలో షిప్ రెక్కలకు ఉండే చిన్న టర్బైన్లు ఆకాశంలో గాలి వేగానికి తిరిగి విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి. గ్రౌండ్–బేస్డ్ పద్ధతిలో షిప్ ఆకాశంలో ఎనిమిది అంకె ఆకారంలో తిరుగుతూ కేబుల్‌ను బలంగా లాగుతుంది. దీంతో భూమిపై ఉన్న డ్రమ్ము తిరుగుతుంది. ఆ డ్రమ్ముకు అనుసంధానించిన జనరేటర్ విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది.ఒక సాధారణ విండ్ టవర్ నిర్మించడానికి వందల టన్నుల స్టీల్, కాంక్రీట్ అవసరం కాగా, ఎస్–2000కు అందులో 10% మెటీరియల్ ఉంటే సరిపోతుంది. కేవలం ఒక చిన్న బేస్ స్టేషన్ మాత్రమే భూమిపై ఉంటుంది, కాబట్టి మిగిలిన భూమిని వ్యవసాయానికి వాడుకోవచ్చు. ఈ షిప్ బాడీని కార్బన్ ఫైబర్‌తో తయారు చేస్తారు. ఇది ఉక్కు కంటే ఐదు రెట్లు బలంగా ఉంటుంది. అలాగే బరువు చాలా తక్కువ.భారత్ పరిస్థితిభారతదేశం పవన శక్తి ఉత్పత్తిలో ప్రపంచంలోనే నాల్గవ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ఎత్తైన కొండ ప్రాంతాల్లో మారు మూల గ్రామాల్లో గ్రిడ్ కనెక్షన్ లేని చోట్ల వీటిని ఉపయోగించవచ్చు. ముఖ్యంగా లదాఖ్ వంటి హిమాలయ ప్రాంతాల్లో సాధారణ విండ్ టవర్లు కట్టడం చాలా కష్టం. అక్కడ ఈ ‘ఫ్లయింగ్ షిప్స్’ను సులభంగా తరలించి విద్యుత్ సమస్యను తీర్చవచ్చు.అయితే, మన దేశంలో ఎయిర్ ట్రాఫిక్ నిబంధనలు కఠినంగా ఉంటాయి. 2,000 మీటర్ల ఎత్తులో వీటిని ఎగరవేయడానికి డీజీసీఏ నుండి ప్రత్యేక అనుమతులు కావాలి. రుతుపవనాల సమయంలో వీచే భారీ గాలులు, తుఫానుల నుండి ఈ షిప్స్‌ను రక్షించడం ఒక సవాలు. ఏది ఏమైనా ఫ్లయింగ్ పవర్ స్టేషన్స్ ఆకాశంలో వీచే గాలి నుండి శక్తిని పొందే సాంకేతికతలో ఒక ముఖ్యమైన మైలురాయి.– తరిగొప్పుల వీఎల్ఎన్ మూర్తి, జర్నలిస్ట్ -
రైతు కాళ్ల కిందే కర్మాగారం
హార్మూజ్ జలసంధి మూసుకుపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో యూరియా ధర ఒక్కసారిగా టన్నుకు దాదాపు వెయ్యి డాలర్లకు పెరిగింది.దేశ యూరియా అవసరాల్లో నాలుగోవంతును దిగుమతి చేసుకునే భారత్‌కు ఇది దిగుమతుల మీద ఆధారపడే పాత భయాన్ని మళ్లీ గుర్తుకు తెచ్చింది. దీంతో కేంద్ర ప్రభుత్వం నుంచి వెంటనే నూతన యూరియా పెట్టుబడి విధానం రూపంలో స్పందన వచ్చింది. దేశం ఇప్పుడు దిగుమతి చేసుకుంటున్న కోటి టన్నుల యూరియాను ఇక్కడే తయారు చేసేందుకు ఎనిమిది–తొమ్మిది కొత్త గ్యాస్ ఆధారిత కర్మాగారాలను నెలకొల్పడమే దీని లక్ష్యం.వేసిన నత్రజని పనికొచ్చేనా?తర్కంగా చూస్తే ఇది సరైన నిర్ణయమే. కానీ ఆ తర్కమే అసలు సమస్య. సరఫరా సంక్షోభం వచ్చినప్పుడు మన వ్యవసాయ విధానం చూపే ప్రతిస్పందన ఒక్కటే– ఎరువును మరింత ఎక్కు వగా ఉత్పత్తి చేయడం. కానీ ఎవరూ అడగని ప్రశ్న ఒకటుంది. పద్నాలుగు కోట్ల రైతు కుటుంబాలు, ప్రపంచంలోనే అతిపెద్దపశు సంపద, ప్రతి శీతాకాలంలో తగలబెట్టే కోట్లాది టన్నుల పంట వ్యర్థాలు– ఇవన్నీ ఉన్న దేశం ఇంత భారీ మొత్తంలో కృత్రిమ నత్రజనిని ఎందుకు దిగుమతి చేసుకోవాలి?గత అరవై ఏళ్లుగా మన వ్యవసాయ విధానాన్ని ఒక నమ్మకం శాసిస్తోంది– ప్రతి ఉత్పాదకత సమస్యా ఎరువుల సమస్యే; దాన్ని మరిన్ని ఎరువులు ఉత్పత్తి చేయడం, దిగుమతి చేయడం, రాయితీ ఇవ్వడం ద్వారానే పరిష్కరించాలి. హరిత విప్లవం కాలంలో ఇది నిజమే. అప్పుడు నత్రజని కొరత ఒక అడ్డంకి. కానీ ఇవాళ మన అసలు సమస్య నత్రజని కొరత కాదు; పంటకు నత్రజనినిఅందించే నేల ఆరోగ్యం బాగా క్షీణించింది. ప్రభుత్వ నేల ఆరోగ్య కార్డుల డేటానే చూస్తే– దేశంలో దాదాపు 64 శాతం నేలల్లో నత్రజని తక్కువ, 48.5 శాతం నేలల్లో సేంద్రియ కర్బనం తక్కువ. మరో గణాంకం మరింత భయపెడుతుంది. హరిత విప్లవం తొలినాళ్లలో ఒక కిలో ఎరువుకు దాదాపు పదమూడు కిలోల అదనపు ధాన్యం వచ్చేది– అంటే 1:13 నిష్పత్తి. ఇవాళ అది 1:2.7కి పడి పోయింది. అంటే అదే కిలో ఎరువు ఇప్పుడు నాలుగో వంతు ధాన్యాన్ని మాత్రమే ఇస్తోంది. మనం వేసే నత్రజనిలో అరవై శాతానికి పైగా పంటకు అందకుండా గాలిలోకి, భూగర్భ జలాల్లోకి కొట్టుకుపోతోంది. నత్రజని చౌకగా దొరకడంతో రైతులు దాన్నే మోతాదు మించి వాడుతున్నారు; ఫలితంగా ఎన్ పీకే(నత్రజని, భాస్వరం, పొటాషియం) నిష్పత్తి 4:2:1 ఉండాల్సిన చోట దాదాపు 11:4:1కి చేరింది. ఒక ప్రాథమిక తేడాను మనం మరచిపోయాం. పంటకు పోషకాలు అందించడం వేరు, నేల సారాన్ని కాపాడటం వేరు. యూరియా పంటకు తక్షణ ఆహారం అందిస్తుంది. కానీ నేలలోసేంద్రియ కర్బనం, సూక్ష్మజీవులు, శిలీంధ్రాలు, వానపాములు– వీటిని అది పెంచదు. నిజానికి మోతాదు మించిన నత్రజని వీటిని దెబ్బతీస్తుంది. ఈ జీవరాశే నేలకు నీటిని పట్టి ఉంచే శక్తిని, గాలి ఆడే నిర్మాణాన్ని, పోషకాలను చక్రంలా తిప్పే సామర్థ్యాన్ని ఇస్తుంది. వీటిని రసాయనిక ఎరువులతో తిరిగి నిర్మించలేం– ఎందుకంటే ఎన్పీకే అనేది కర్బనం కాదు, జీవం అసలే కాదు.నిజంగా ఇది స్వావలంబనా?నూతన యూరియా విధానం చెప్పే స్వావలంబన కూడా చాలావరకు భ్రమే. యూరియా అమోనియా నుంచి, అమోనియా సహజ వాయువు నుంచి తయారవుతాయి. ఆ సహజ వాయువులో చాలా భాగం మనం ద్రవీకృత సహజ వాయువు (ఎల్ఎన్జీ) రూపంలో దిగుమతి చేసుకునేదే. యూరియా ఉత్పత్తి వ్యయంలో ఇది 70–80 శాతం. అంటే కొత్త కర్మాగారం అంటే దిగుమతి చేసుకున్న వాయువును ఇక్కడ యూరియాగా మార్చే యంత్రం మాత్రమే. మన ఆధారపడటం పోలేదు, కేవలం ఒక మెట్టు పైకి జరిగింది. భాస్వరం, పొటాష్ విషయంలో అయితే మనం దాదాపు పూర్తిగా దిగుమతులపైనే ఆధారపడతాం.అమెరికా ఉదాహరణ చూడండి: ఆ దేశం నత్రజనిలో స్వావలంబన సాధించిన మాట నిజమే, కానీ కర్మాగారాలు కట్టడం వల్ల కాదు. దానికి సొంత షేల్ గ్యాస్ ఉంది; మొక్కజొన్న–సోయాబీన్ మార్పిడి సాగులో పప్పుజాతి పంట తనకు తానే నత్రజనిని స్థిరీక రించుకుంటుంది. ఈ రెండూ మనకు లేవు. అక్కడి వాతావరణం కూడా వేరు. మన ఉష్ణోగ్రతలకు సేంద్రియ కర్బనం తొందరగా కోల్పోతాం. అక్కడ సంవత్సరానికి ఒక పంట కాలమే, రెండోకాలంలో నేల పునర్జీవనం కావటానికి అవకాశం ఉంది. కాబట్టి అమెరికా బాటలో కేవలం కర్మాగారాల స్థాపనను కాపీ చేస్తే, భారం మిగులుతుంది తప్ప భద్రత రాదు.నిజమైన స్వావలంబన అంటే మనం అదుపులో ఉంచుకోగల వనరుల నుంచి పంట అవసరాలను తీర్చుకోవడం. పప్పు« దాన్యాలు, జీవన ఎరువులు, పచ్చి రొట్ట ఎరువులు, అజొల్లా ద్వారా జీవ నత్రజని స్థిరీకరణ, పంట వ్యర్థాల పునర్వినియోగం, పశువుల ఎరువు, అన్నిటికీ ఆధారమైన నేలలో సేంద్రియ పదార్థం– ఇవి పెరిగితే వేసే ప్రతి కిలో ఎరువూ మరింత సమర్థంగా పనిచేస్తుంది. జీవసారం పెంచితే ప్రోత్సాహకాలుఇప్పుడు డబ్బుల మాట. దేశ ఎరువుల రాయితీ దాదాపు రూ.1.7 లక్షల కోట్లు; అందులో యూరియాదే రూ.1.19 లక్షల కోట్లు. తగ్గిపోతున్న రసాయనిక ఎరువుల సామర్థ్యం, వృథా అవు తున్న సగం నత్రజని– వీటిని చూస్తే ఇది తక్కువ ప్రయోజనం ఇచ్చే ఖర్చు. ఈ రాయితీలో సగాన్ని– అంటే దాదాపు 85 వేల కోట్లను– నేల ఆరోగ్యాన్ని పునరుద్ధరించడానికి మళ్లిస్తే ఏమవుతుంది?ఒక టన్ను యూరియా ఒక్క సీజన్ కే అయిపోతుంది, మళ్లీ కొనా ల్సిందే. కానీ నేలలో పెరిగిన సేంద్రియ కర్బనం ఏళ్ల తరబడి నిలు స్తుంది. ప్రతి ఏటా దిగుబడిని, నీటి నిల్వను, ఎరువుల సామర్థ్యాన్ని పెంచుతుంది. నేల బాగుపడిన కొద్దీ దానికి కావాల్సిన నత్రజని తగ్గుతుంది, దాంతోపాటే రాయితీ భారమూ తగ్గుతుంది.అందుకే ఒక జాతీయ/రాష్ట్ర స్థాయి నేల ఆరోగ్య పునరుద్ధరణ మిషన్ అవసరం. నేలలో సేంద్రియ కర్బనం, జీవసారం పెరిగిన కొద్దీ రైతుకు నేరుగా ప్రోత్సాహకం అందాలి. గ్రామ స్థాయి కంపోస్ట్, పంట వ్యర్థాల పునర్వినియోగం, రైతు ఉత్పత్తిదారుల సంఘాల ఆధ్వర్యంలో జీవ ఎరువుల యూనిట్లు– వీటిని ఉపాధి హామీ పథకం, ప్రకృతి వ్యవసాయంతో అనుసంధానం చేయాలి.‘రసాయనిక ఎరువులు లేకుండా దేశాన్ని పోషించలేం’ అనే వాదన రావచ్చు. ఎరువులను పూర్తిగా వదిలేయాలని అనడం లేదు. మొదట్లో రసాయనికం, జీవసంబంధం రెండింటినీ కలిపి వాడే సమీ కృత పోషక యాజమాన్యమే మార్గం. భారత్ తదుపరి వ్యవసాయ విప్లవం మరిన్ని రసాయనిక ఎరువులపై కాదు– ప్రాణమున్న నేల లను తిరిగి నిర్మించడంపై ఆధారపడాలి. ఏ ఓడరేవు, గ్యాస్ పైప్‌లైన్ కోసం మనం ఎదురుచూడనక్కర్లేదు– మన అతిపెద్ద ఎరువుల కర్మాగారం ప్రతి రైతు కాళ్ల కింద, నేల జీవంలోనే ఉంది. -వ్యాసకర్త సుస్థిర వ్యవసాయ కేంద్రం (సీఎస్ఏ) కార్యనిర్వాహక సంచాలకులు-డా‘‘ జి.వి.రామాంజనేయులు -
నిర్మాణాత్మక రాజకీయాలు కావాలి!
ప్రజా విశ్వాసాన్ని పునరుద్ధరించాలంటే రాజకీయాలు పక్షపాతాన్ని అధిగమించాలి. ప్రజాస్వామ్యం అంటే కేవలం ఎన్నికలు నిర్వహించడం మాత్రమే కాదు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ప్రజలకు జవాబు దారీగా ఉండటం, పారదర్శకంగా పని చేయడం, ప్రజల ప్రయోజనాలను అన్నింటికంటే ముందు ఉంచడం కూడా అంతే ముఖ్యమైన అంశాలు. ప్రజాస్వామ్యంలో ప్రజల విశ్వాసం అత్యంత విలువైన సంపద. ఒకసారి ఆ విశ్వాసం దెబ్బతింటే దానిని తిరిగి సంపాదించడం చాలా కష్టం.దేశంలో ఏదైనా పెద్ద ప్రజా వివాదం, అవినీతి ఆరోపణ లేదా ప్రజల జీవితాలను ప్రభావితం చేసే సంఘటన వెలుగులోకి వచ్చిన ప్రతిసారి దాదాపు ఒకే పరిస్థితి కనిపిస్తున్నది. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటాయి. పార్లమెంట్, శాసనసభల సమావేశాలు వాగ్వాదాలతో స్తంభిస్తాయి. టెలివిజన్ చర్చలు రోజంతా వేడెక్కుతాయి. సోషల్ మీడియాలో కూడా తీవ్ర వాదోపవాదాలు సాగుతాయి. ప్రజల్లో కొంతకాలం ఆగ్రహం వ్యక్తమవుతుంది. కానీ కొద్ది రోజుల తర్వాత ఆ చర్చలు తగ్గిపోతాయి. వార్తల్లో కొత్త అంశాలు వస్తాయి. చివరకు అసలు సమస్య మాత్రం అలాగే మిగిలిపోతుంది. ఈ పరిస్థితి ప్రజల్లో వ్యవస్థపై నమ్మకాన్ని క్రమంగా తగ్గిస్తుంది.సమాజంలో ఉన్న విద్యావంతులు, నిజాయితీ గల వ్యక్తులు, నిష్పక్షపాతులు, సమర్థులు రాజకీయాలకు దూరంగా ఉండటాన్ని ఎంచుకున్నారు. ఇది సరికాదు. ప్రజాస్వామ్యం నిజమైన అర్థంలో విజయవంతం కావాలంటే ప్రజాసేవ పట్ల నిబద్ధత ఉన్న వ్యక్తులు ప్రజా జీవితంలోకి రావాలి.పోటీ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీలు మన దేశంలో తీవ్ర ఆందోళన కలిగిస్తున్న అంశంగా మారాయి. ఇవి యువతలో ప్రతిభపై ఉన్న నమ్మకాన్ని దెబ్బతీస్తాయి. ప్రభుత్వ నియామక వ్యవస్థల విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేస్తాయి. దేశ భవిష్యత్తుపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది. అయితే ఈ సమస్యను రాజకీయ కోణంలో మాత్రమే చూడటం సరైంది కాదు. అందుబాటులో ఉన్న సమాచారాన్ని పరిశీలిస్తే 2004–2014 మధ్య కాలంలో దేశంలోని అనేక రాష్ట్రాలు, కేంద్ర సంస్థల్లో కూడా ప్రశ్నపత్రాల లీకేజీ సంఘటనలు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో 2, అరుణాచల్ ప్రదేశ్‌లో 1, అస్సాంలో 6, బిహార్‌లో 5, ఢిల్లీ, కేంద్ర సంస్థల్లో 27, గుజరాత్లో 8, హరియాణాలో 5, హిమాచల్ ప్రదేశ్‌లో 4, జమ్మూ కశ్మీర్లో 5, జార్ఖండ్‌లో 2, కర్ణాటకలో 6, కేరళలో 2, మహారాష్ట్రలో 9, మణిపూర్‌లో 1, మధ్యప్రదేశ్‌లో 7, ఒడిశాలో 3, పంజాబ్‌లో 2, రాజస్థాన్ లో 10, తమిళనాడులో 2, తెలంగాణలో 3, త్రిపురలో 1, ఉత్తరాఖండ్‌లో 3, పశ్చిమ బెంగాల్లో 10, ఉత్తరప్రదేశ్‌లో 9 సంఘటనలు నమోదైనట్లు సమాచారం. ఈ వివరాలు చూస్తే ప్రశ్నపత్రాల లీకేజీ సమస్య ఏ ఒక్క రాష్ట్రానికి, ఏ ఒక్క ప్రభుత్వానికి లేదా ఏ ఒక్క రాజకీయ పార్టీకి మాత్రమే పరిమితం కాదని అర్థమవుతుంది.అందువల్ల ఈ అంశంపై రాజకీయ విమర్శలు చేయడం కంటే శాశ్వత పరిష్కారాలపై దృష్టి పెట్టడం అవసరం. ప్రతి ప్రభుత్వం నేరస్థులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అదే సమయంలో భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఆధునిక సాంకేతిక భద్రతా వ్యవస్థలు, డిజిటల్ రక్షణ, స్వతంత్ర పర్యవేక్షణ, కఠిన చట్టాలు, పారదర్శక నియామక విధానాలు అమలు చేయాలి. పరీక్షల నిర్వహణలో ప్రతి దశను అత్యంత భద్రతతో నిర్వహించే విధంగా వ్యవస్థను బలోపేతం చేయాలి.దేశ నిర్మాణంలో ప్రభుత్వాల పాత్ర ఎంత ముఖ్యమో, బాధ్యత గల పౌరుల పాత్ర కూడా అంతే ముఖ్యమైనది. ఉపాధ్యాయులు, మాజీ న్యాయమూర్తులు, పదవీ విరమణ పొందిన అధికారులు, పాత్రికేయులు, మేధావులు, పారిశ్రామికవేత్తలు, సామాజిక సంస్థలు తమ అనుభవాన్ని దేశ ప్రయోజనాల కోసం వినియోగించాలి. సమస్యలను మాత్రమే చూపించడం కాకుండా వాటికి ఆచరణాత్మక పరిష్కారాలను కూడా సూచించాలి. సమాజం మొత్తం కలిసి పని చేసినప్పుడే ప్రజాస్వామ్యం మరింత బలపడుతుంది.- పి. వేణుగోపాల్ రెడ్డి, వ్యాసకర్త ఏకలవ్య ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ -
సహజమైనదే చేయాలి!
ఒక జెన్ గురువును ఓ కుటుంబం ఇంటికి ఆహ్వానించింది. ఆయన కోసం అద్భుతమైన విందు సిద్ధం చేశారు. సరిగ్గా పన్నెండు గంటలకు గురువు గారు వచ్చారు. ఇంట్లో ఉన్నవారంతా ఆయన పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. కొద్దిసేపటి తర్వాత భోజనం వడ్డించారు. ఎంతో శ్రద్ధతో వండిన వంటకాలను గురువుగారు బాగా ఆస్వాదిస్తూ తిన్నారు. చివరగా చేయి కడుక్కునే సమయంలో, ‘అన్నీ శాకాహారమే వండారేం? చిన్న చేప ముక్క అయినా కలిపి ఉంటే బాగుండేది కదా!’ అన్నారు.ఆహ్వానించిన వారు ఆలోచనలో పడ్డారు. ‘మీరు మాంసాహారం తినరని అనుకున్నాం’ అని నమ్రతగా చెప్పారు. గురువు తల పట్టుకున్నారు. ‘మీ ముందస్తు అంచనాల్లో నన్ను పెట్టి బంధించకండి. నాకు ఊపిరి ఆడదు’ అన్నారు. ‘మాకు అర్థం కాలేదు గురుదేవా! ఇతర మనుషులకు, జంతువులకు, చివరికి చెట్టు చేమలకు కూడా హాని చేయకూడదు అని జెన్ సిద్ధాంతం చెప్తోంది కదా?’ అని అడిగారు.‘అవును, దానికి నేను ఇప్పుడు చేప తినాలి... తినకూడదు అనుకోవడానికి సంబంధం ఏమిటి? మనం మనలాగే ఉండాలి. మనకు ఏది సహజమో అదే చేయాలి. అనవసరమైన నటనలు వద్దు. వదులుకోవాలనే ఆలోచన బలంగా ఉంటే, కాలక్రమేణా అనవసరమైన విషయాల నుండి బయట పడవచ్చు. ఇది నా అనుభవం కూడా. బలవంతంగా శాకాహారం మాత్రమే తింటూ లోపల బాధ పడటం కంటే, ఆశ కలిగినప్పుడు మాంసాహారం తినేసి, ఆ క్షణంలో జీవించడమే అసలైన జెన్. వదులు కోవాలనే సంకల్పం దృఢంగా ఉంటే చాలు, మిగిలినది సహజంగా దానికదే జరుగుతుంది’ అన్నారు గురువుగారు.– యామిజాల జగదీశ్ -
పరిష్కారమా... కొత్త సవాలా?
2026 ‘నీట్’ ప్రశ్నాపత్రం లీక్ ఆరోపణలు దేశవ్యాప్తంగా ఆందో ళనకు దారితీశాయి. ఫలితంగా పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది నుంచి నీట్‌ను కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ)గా నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. అయితే ప్రశ్నాపత్రాన్ని కాగితం నుంచి కంప్యూ టర్కు మార్చడమే సమస్యకు శాశ్వత పరిష్కారం కాదని గుర్తించాలి. అసలు సమస్య పరీక్షా విధానంలో కాదు, ప్రశ్నపత్రాల గోప్యత, భద్రత, జవాబుదారీతనం వంటి వ్యవస్థాగత లోపాల్లో ఉంది. అంతర్జాతీయ అనుభ వాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.ప్రపంచంలోనే అతిపెద్ద ప్రవేశ పరీక్షలలో ఒకటైన చైనా గావ్కావ్, దక్షిణ కొరియా సీఎస్ఏటీ ఇప్పటికీ పేపర్–పెన్సిల్ విధానంలోనే అత్యంత కట్టు దిట్టమైన భద్రతతో విజయవంతంగా నిర్వహిస్తున్నాయి. దీనివల్ల పరీక్షా విధానం కంటే పటిష్టమైన భద్రతా వ్యవస్థ, పారదర్శకత, క్రమశిక్షణే విశ్వస నీయ పరీక్షలకు పునాది అని స్పష్టమవుతోంది. నీట్‌ను కంప్యూటర్ ఆధారిత పరీక్షగా నిర్వహిస్తే, కోట్లాది మంది విద్యార్థులను ఒకే సమయంలో పరీక్షించడం సాధ్యం కాదు. అందువల్ల బహుళ షిఫ్టులు తప్పనిసరి అవుతాయి. జేఈఈ మెయిన్‌లో కనిపించినట్లుగా వివిధ షిఫ్టుల్లో ప్రశ్న పత్రాల క్లిష్టతలో తేడాలు రావడం, నార్మలైజేష¯Œ పై వివాదాలు తలెత్తడం వల్ల సమాన ప్రతిభ కలిగిన విద్యార్థులకు కూడా అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల శాట్, జీఆర్ఈ వంటి పరీక్షల్లో ఉపయోగించే ఐటమ్ రెస్పాన్స్ థియరీ వంటి శాస్త్రీయ మనో కొలమాన పద్ధతులను అధ్యయనం చేసి అమలు చేయడం మరింత సముచితం.కంప్యూటర్ ఆధారిత పరీక్షల్లో మరో ప్రధాన సవాలు డిజిటల్ అంతరం. పట్టణ విద్యార్థులతో పోలిస్తే గ్రామీణ, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల విద్యార్థులకు కంప్యూటర్ వినియోగం, ఆన్లైన్ పరీక్షల అనుభవం తక్కువగా ఉండే అవకాశం ఉంది. వైద్య విద్య వంటి అత్యంత కీలకమైన ప్రవేశ పరీక్షలో సాంకేతిక పరిజ్ఞాన పరిచయం విద్యార్థి ప్రతిభను ప్రభావితం చేయకూడదు. కాబట్టి ఆన్లైన్ విధానాన్ని అమలు చేయాలంటే ముందుగా దేశవ్యాప్తంగా సమాన డిజిటల్ మౌలిక సదుపాయాలు, శిక్షణ, మాక్ పరీక్షలు అందుబాటు లోకి తీసుకురావడం అత్యవసరం. పరీక్షపై నమ్మకాన్ని పునరుద్ధరించడం. ప్రశ్నాపత్రాల భద్రతను అంతర్జాతీయ ప్రమాణాలకు తీసుకెళ్లడం, లీకేజీలకు పాల్పడిన వారిపై వేగంగా కఠిన చర్యలు తీసుకోవడం, అత్యవసరం. కోట్లాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన పరీక్షల్లో సంస్కరణలు హడా వుడిగా కాకుండా సమగ్ర ప్రణాళికతో చేపట్టాల్సిన అవసరం ఉంది.– ఏటూరి శేఖర్ శర్మ, విశ్రాంత జిల్లా విద్యాశాఖాధికారి -
పిల్లలకు కాదు... పాఠం పెద్దలకే!
ఒక కాలానికి సరిపోయిన ఆలోచనలు, నేడు ప్రశ్నించకుండా సత్యాలుగా మిగిలిపోతున్నాయి. ఉదాహరణకు, పిల్లవాడు ఒక సమస్యకు కొత్త పరిష్కారం చెబితే, ‘మేం ఇన్నేళ్లుగా ఇలాగే చేస్తున్నాం’ లేదా ‘అందరూ ఇలానే చేస్తున్నారు’ అనే ఒక్క వాక్యంతో ఆ ఆలోచనను పక్కన పెట్టేస్తాం. ఆ పరిష్కారం సరైందా, కాదా అని పరిశీలించే ముందే, అది కొత్తదనే కారణంతో తిరస్కరిస్తాం. అలా ఓడిపోతు న్నది కొత్త ఆలోచన కాదు; గెలుస్తున్నది పాత అలవాటు.అందుకే ప్రపంచం మారుతున్నా, మన సమాధానాలు మాత్రం అలాగే మిగిలిపోతున్నాయి. ఫలితంగా అసలు ప్రశ్న పిల్లలు ఏమి నేర్చుకోవాలనేది కాదు; పెద్దలు ముందుగా ఏమి వదిలే యాలనేదే!‘పిల్లలు నేర్చుకున్నదాన్ని వదలాలి (ఆన్లెర్న్), కొత్తగా ఆలోచించాలి’– ఈ మధ్య విద్యా చర్చల్లో బాగా వినిపిస్తున్న మాట. ఇక్కడ ‘వదలడం’ అంటే నేర్చుకున్న జ్ఞానాన్ని మర్చిపోవడం కాదు; కాలం చెల్లిన ఆలోచనా విధానాలను ప్రశ్నిస్తూ కొత్త దృక్ప థాన్ని స్వీకరించడం. కానీ ఈ ఆలోచనను మరో కోణంలో చూడాల్సిన అవసరం ఉంది.పిల్లల దగ్గర వదిలేయాల్సినంత పాత నమ్మకాలు ఏము న్నాయి? వాళ్లు మొదటిసారి ప్రపంచాన్ని చూస్తున్నారు; పాత కళ్లద్దాలు మాత్రం మన పెద్దలవే. వాటిని వాళ్లకు అందించింది మనమే. కాబట్టి ఇప్పుడు ప్రశ్న– ‘పిల్లలు ఏం నేర్చుకోవాలి?’ అని కాదు; ‘మనం ముందుగా ఏ పాత నమ్మకాలను వదిలించు కోవాలి?’ అనేది. ఒకప్పుడు ఇవి విజయానికి మార్గదర్శకాలుగా ఉండి ఉండొచ్చు. కానీ వాటిని శాశ్వత సత్యాలుగా మార్చింది మనమే.ఇది ఎందుకు అంత కష్టం?ఒక నమ్మకాన్ని వదలడం అంటే, దాన్ని పట్టుకుని జీవించిన మన సొంత గతాన్నే ప్రశ్నించడం. ‘నేను ఇలా పెరిగాను, నేను బాగానే ఉన్నాను కదా’ అనే భావన మనలో బలంగా ఉంటుంది. ఆ నమ్మకాన్ని వదిలేస్తే, మన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, రాజీలు అన్నీ వృథా అన్నట్టుగా అనిపిస్తుంది. ఇది దురుద్దేశ్యం కాదు; తెలిసిన దానిపై ఉండే భద్రతా భావం. తల్లిదండ్రులు, ప్రతి ఉపాధ్యాయుడు ఒకప్పుడు ఒక వ్యవస్థ గుండా వచ్చినవారే. వాళ్ల మీద కూడా ఎవరో ఒక ముద్ర వేశారు. ఇప్పుడు వాళ్లు చేస్తున్నది– తమకు వేసిన అదే ముద్రను, తెలియకుండానే, తర్వాతి తరానికి బదిలీ చేస్తున్నారు. ప్రతి కాలం తన సమస్యలకు తన సమాధానాలు సృష్టించుకుంటుంది. కలంతో పాటూ సమాధా నాలూ మారాలి.ప్రపంచ ఆర్థిక వేదిక ప్రకారం, 2030 నాటికి ఉద్యోగ నైపుణ్యాల్లో 39% మారిపోతాయి. ఈ రోజు నేర్పే సగం నైపుణ్యాలు అప్పటికి పనికిరాకపోవచ్చు. అందుకోసం సిలబస్ మార్చడం సరిపోదు; దాన్ని బోధించే వారి ఆలోచనా విధానం కూడా మారాలి. వ్యవస్థ ఎంత మారినా, దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చేది మను షులే– ఇంట్లో తల్లిదండ్రులు, తరగతి గదిలో ఉపాధ్యాయులు. వ్యవస్థ ఒక వైపు మారుతుంటే, పెద్దల ఆలోచనలు అక్కడే నిలిచి పోతే, ఆ మార్పు అసంపూర్ణంగా మిగిలిపోతుంది. కాబట్టి పిల్లల భవిష్యత్తును మార్చేది కొత్త సిలబస్ మాత్రమే కాదు; పెద్దల మనస్తత్వంలో వచ్చే చిన్న మార్పు కూడా. పిల్లలు రేపటి తరాన్ని నిర్మించాలంటే, ఈరోజు పెద్దలు నిన్నటి కళ్లద్దాలను వదిలించు కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.– వంగవోలు రవి, ఉపాధ్యాయుడు -
చిద్రూపమే జగత్తు!
దీర్ఘతముడనే ఒక ముని అడవిలో తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. అతడికి ఇద్దరు కొడుకులు. తండ్రికి సపర్యలు చేయడం వారి దినచర్య. కాలం తీరి కొన్నాళ్ళకు దీర్ఘతముడు మరణించాడు. విధిగా నిర్వర్తించాల్సిన ఉత్తరకర్మలన్నిటినీ పెద్దకొడుకు భక్తితో నిర్వర్తించాడు. అంతా సజావుగా జరిగాక, తమ్ముడి కోసం చూడగా, అతడు ఆశ్రమంలో కనిపించలేదు. అడవిలో వెదికాడు. ఒక పెద్ద చెట్టు మొదట్లో కూర్చుని శోకిస్తూ కనిపించాడు తమ్ముడు. అన్న హృదయం ద్రవించింది. తమ్ముడి దగ్గరికి వెళ్ళి, ఆప్యాయంగా తల నిమిరి ఇలా చెప్పాడు:‘పూర్వం వైరోచనుడనే ఒక రాజు ఉండేవాడు. దీర్ఘకాలం వసుధను పాలించాడు. ప్రపంచంలో లభించే అన్ని సుఖాలను తృప్తి తీరా అనుభవించాడు. ఒకనాడు రాజప్రాసాదపు మేడపై నిలబడి ఆలోచిస్తూ ‘ముల్లోకాలలో అద్భుత కారణంబును, సకల భోగాలకు ఆలవాలము అయిన ఈ భూమిలో, సౌఖ్యాలు అస్థిరములైనవే! అనుభవించే పదార్థాన్నే మళ్ళీ మళ్ళీ అనుభవించి, దినదినమూ భ్రాంతుడనై తిరుగుతూ ఉండడమేగా ఇక్కడ ఎన్నాళ్ళైనా! రాత్రి, పగలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అవి ఆగేవి కావు. చెప్పిందే చెప్పడం అన్నట్లుగా కాలం చర్వితచర్వణం. ఈ సుఖాలన్నీ ప్రాజ్ఞుల దృష్టిలో అల్పాలే’ అని తలచి బాల్యంలో తన తండ్రి చెప్పిన మాటలను మననం చేసుకున్నాడు.తే. కణగి యెల్ల చోట గలది చిద్రూపంబుఅదియ నీవు నేను నఖిలములునుఇదియ నిశ్చితార్థ మిది దప్ప మఱి లేదుసర్వశాస్త్రసార సంగ్రహంబు.‘ఈ విశ్వంలోని ప్రతి అణువు చిత్తమనే చేతనతో నిండి ఉంది. చేతనతో నిండినదైన చిద్రూపమే నీవు, నేను, అది, ఇది, ఇలలో అన్నీ. అదే నిశ్చయం. అది తప్ప మరొకటి లేదు. సర్వ విజ్ఞాన, వేదాంత శాస్త్రములు బోధించేది కూడా అదే! ఆ సత్యాన్ని గ్రహించిన చిత్తానికి చింత ఉండదు. అది తెలుసు కుని నీవు కూడా స్వస్థత చెందిన అంతరంగాన్ని పొందు’ అని అన్న చెప్పిన మాటలను ఆలకించాడు తమ్ముడు. శోకోపశమనం పొందాడు.– భట్టు వెంకటరావు -
ఏమైనా సరే... ఆరు ఆరే!
భారతీయ తత్త్వంలో అరిషడ్వర్గాలు, షడ్దర్శనాలు, షడ్రసాలు, షట్చక్రాలు, షడృతువులు వంటి ఎన్నో భావనలు ఆరు (6) అంకెతో నిర్వచితమయ్యాయి. బౌద్ధంలో షట్పారమితలు, జైనంలో షడ్ద్ర వ్యాలు, జొరాస్ట్రియనిజంలో అమేష స్పెంతాలు, తావోయిజంలో హెక్సాగ్రాం... ఇలా విదేశీ సంప్ర దాయాల్లోనూ ‘ఆరు’ విశిష్టంగా నిలిచింది. ఈ సంప్రదా యాలు, వేర్వేరు ప్రాంతాలలో, వేర్వేరు కాలాల్లో ఉద్భవించినా, అన్నింటిలోనూ ఆరు పరిపూర్ణతకు సూచికగా నిలవడం విశేషం.భారతీయ తత్త్వశాస్త్రం మనిషిలోని కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే ఆరు శత్రువులుగా గుర్తిస్తే; న్యాయ, వైశేషిక, సాంఖ్య, యోగ, మీమాంస, వేదాంతాలనే ఆరు దర్శ నాలు (షడ్దర్శనాలు) విశ్వాన్ని వివరించాయి. కణాదుని వైశేషిక దర్శనం ఈ విశ్వం సూక్ష్మమైన పరమా ణువులతో నిర్మితమైందని చెప్తూ... దాన్ని ద్రవ్య, గుణ, కర్మ, సామాన్య, విశేష, సమవాయ మనే ఆరు పదార్థాలుగా విభజిస్తే; పతంజలి యోగం చిత్తవృత్తి నిరోధమే లక్ష్యంగా చూపింది. విష్ణుపురాణం ఐశ్వర్యం, ధర్మం, యశస్సు, శ్రీ, జ్ఞానం, వైరాగ్యమనే ఆరు గుణాల సమాహారమే భగవంతుడని నిర్వచిస్తే; శైవ సంప్రదాయంలో షట్కోణాకారం శివ–శక్తుల సంయోగానికి సంకేతం. దీని నుంచి జన్మించిన సుబ్రహ్మణ్యుడు షణ్ముఖుడయ్యాడు.వేదాధ్యయనానికి శిక్ష, కల్ప, వ్యాకరణ, నిరుక్త, ఛందస్, జ్యోతిషమనే షడంగాలు అవసరమైతే; ఆయుర్వేదంలో మధుర, అమ్ల, లవణ, కటు, తిక్త, కషాయమనే ఆరు రసాల సమతుల్యతే ఆరోగ్యానికి మూలమని చరక సంహిత చెప్తుంది. శరీరాన్ని కూడా శిరస్, ఉరస్, ఉదరం, పృష్ఠం, ఊర్ధ్వ, అధశ్శాఖలనే ఆరు అంగా లుగా చరక, సుశ్రుత సంహితలు విభజించాయి. హఠయోగం నేతి మొదలు త్రాటక వరకు ఆరు శుద్ధి క్రియలను, మూలాధారం నుంచి ఆజ్ఞ వరకు ఆరు చక్రాలను నిర్దేశించింది.కాలగణనలో వసంతం మొదలు శిశిరం వరకు ఆరు ఋతు వులు, రోజుకు ఆరు భాగాలు కనిపిస్తాయి. సంగీతంలో మొదటి స్వరం షడ్జం– నారదీయ శిక్ష ప్రకారం నాసిక, కంఠం, ఉరస్సు, తాలువు, జిహ్వ, దంతాలనే ఆరు అవయ వాల నుంచి పుట్టేది కాబట్టే ఆ పేరు వచ్చింది. జ్యోతిష్యంలో రాశి, హోర, ద్రేక్కాణం వంటి ఆరు వర్గ పట్టికలను షడ్వర్గం అంటారు. ఒక్కో పట్టిక జీవితంలో ఒక్కో కోణాన్ని చూపిస్తుంది. వేదాంతంలో శోక, మోహ, జర, మృత్యు, క్షుధ, పిపాసలనే షడూర్మి మానవ అస్తిత్వపు ఆరు అలలుగా వర్ణితమయ్యాయి.బౌద్ధంలో దాన, శీల, క్షాంతి, వీర్య, ధ్యాన, ప్రజ్ఞలనే ఆరు పారమితలు మోక్షమార్గం చూపిస్తే; సంసారంలో దేవతలు, మానవులు, అసురులు, జంతువులు, ప్రేతలు, నరకభోగులనే ఆరు గతులు జీవులకు నిర్దేశించబడ్డాయి. జైనంలో జీవ, పుద్గల, ధర్మ, అధర్మ, ఆకాశ, కాలమనే ఆరు ద్రవ్యాలు విశ్వాన్ని నిర్వచి స్తాయి. శ్వేతాంబరులు సామా యికం మొదలు ప్రత్యాఖ్యానం వరకు ఆరు నిత్యకర్తవ్యాలను (షడావశ్యకాలు) పాటిస్తారు.ఆరు రోజుల సృష్టితోరా, బైబిల్ల ప్రకారం సృష్టి ఆరు రోజుల్లో పూర్తయి, ఏడవ రోజు విశ్రాంతి జరిగిందని నమ్మకం. ఖురాన్ లో ఆరు రోజుల సృష్టి ప్రస్తావన ఏడు చోట్ల వస్తుంది, అయితే విశ్రాంతి భావన అందులో లేదు. ఇస్లాంలో విశ్వాసానికి అల్లా, దూతలు, గ్రంథాలు, ప్రవక్తలు, తీర్పుదినం, దైవ నిర్ణయమనే ఆరు మూలసూత్రాలు (అర్కానుల్ ఈమాన్) పునాది. జొరాస్ట్రియనిజంలో అహురమజ్డా సృష్టించిన ఆరు అమేష స్పెంతాలు– పశువులు, అగ్ని, లోహాలు, భూమి, జలం, వృక్షాలకు అధిపతులుగా నిలిచాయి. చైనా తావో యిజంలో ఐ చింగ్ గ్రంథం ఆరు గీతల 64 హెక్సాగ్రాంలపై నిర్మిత మైంది. ప్రతి హెక్సాగ్రాం ఒక్కో జీవన పరిస్థితిని సూచిస్తుంది.గణితశాస్త్రంలో ఆరు ఒక పరిపూర్ణ అంకె (1+2+3=6, దాని భాజకాల మొత్తం దానికే సమానం), త్రిభుజ అంకె కూడా. అందుకే పురాతన గ్రీకు గణితవేత్తలు ఆరును విశేషంగా పరిగణించారు. ప్రకృతిలోనూ ఆరు భుజాల నిర్మాణం పదే పదే కనిపిస్తుంది: తేనెతుట్టెలు, మంచు పలకలు, బెంజీన్ రింగ్‌లోని కార్బన్ అణువులు, అగ్నిపర్వత లావా చల్లారి ఏర్పడే బసాల్ట్ శిలా స్తంభాలు (ఉదా: ఐర్లాండ్‌లోని జయింట్స్ కాజ్వే), అన్నీ షడ్భుజా కారాన్నే ఎంచుకుంటాయి. ఎందుకంటే తక్కువ పదార్థంతో అత్య ధిక స్థలాన్ని ఆవరించే, శక్తిని సమర్థవంతంగా పంచుకునే జ్యామి తీయ ఆకారం అదే.వేర్వేరు కాలాల్లో ఉద్భవించిన ఎన్నో వైరుధ్య సంప్రదాయా లలో ఆరు అంకెకు ఇంతటి ప్రత్యేక స్థానం ఎందుకు వచ్చిందో చెప్పలేం. తత్త్వశాస్త్రం, ఆధ్యాత్మికం, గణితం, ప్రకృతి శాస్త్రం అన్నీ ఏకగ్రీవంగా ఈ ఒక్క అంకె చుట్టూ తిరగడం యాదృచ్ఛికమా, ఏదైనా తాత్త్విక సూత్రం దాగుందా? బహుశా ఆరుకే తెలుసు!- డా. కొవ్వలి గోపాలకృష్ణ, వ్యాసకర్త అమెరికాలో ఆంకాలజీ డ్రగ్ డెవలప్మెంట్ సైంటిస్ట్ -
నాస్తికోద్యమ నిర్మాత
ప్రజల మధ్య జాతి, మతం, కులం పేరుతో విషం పెరు గుతూ ఉంది. దానితో విద్వే షాలు పెరుగుతున్నాయి. దేవుడు, కర్మ, పునర్జన్మ లాంటి భావాలు పోతే మనిషి మతస్తు డిగా కాకుండా స్వచ్ఛమైన నీతి మంతుడైన మానవుడిగా మిగు లుతాడు. ప్రజల మధ్య అడ్డు గోడలుండవు. అందరం ఒకటే అన్న భావనలోకి వచ్చి నప్పుడు సోదరభావం దానంతట అదే వెళ్లి విరుస్తుంది. ప్రేమ, అప్యాయత, ఒకరికి ఒకరం ఉన్నామన్న ధీమా పెరుగుతుంది!– అనేవి గోపరాజు రామచంద్రరావు (గోరా) అలోచనలు.ఎవరీ గోరా? ఒరిస్సాలో పుట్టి(1902 నవంబర్ 15), కృష్ణా జిల్లా విజయవాడను ప్రపంచ నాస్తిక కేంద్రంగా మలచినవాడు. భారతీయ సనాతన సంస్కృతి అయిన చార్వాకుల స్ఫూర్తిని మళ్ళీ ఈ ఆధునిక కాలానికి అందించిన ఘనుడు. గోరా ప్రత్యేకత ఏమిటంటే, వృక్ష శాస్త్ర అధ్యాపకుడిగా సమాజంలో వేళ్ళూను కుని ఉన్న మూఢ విశ్వాసాలకు చికిత్స– ఆ వేరు మూలాల నుండే ప్రారంభించాలని తీర్మానించారు. అస్పృశ్యతా నివార ణకు, ఆర్థిక సమానత్వ సాధనకు కృషి చేస్తూనే– ప్రజల్లో కుల, మతతత్వ నిర్మూలనకు నడుం బిగించిన కార్యకర్త. సమిష్టి భోజనాలను నిర్వహిస్తూ జనాన్ని మతాంతర వివాహాల వైపు నడిపించిన కార్యశీలి.గోరా అనేకచోట్ల అనేక ఉద్యోగాలు చేశారు. మధుర లోని మిషన్ కళాశాలలో తొలుత అధ్యాపకుడయ్యారు. ఆ తరువాత కోయంబత్తూర్ వ్యవసాయ కళాశాలలో పత్తి పరిశోధక సహాయకుడిగా పని చేశారు. కొంతకాలం శ్రీలంక వెళ్ళి కాలంబోలోని ఒక కళాశాలలో జీవశాస్త్ర అధ్యాపకుడ య్యారు. తిరిగి వచ్చి మళ్ళీ కాకినాడ కళాశాలలో ఆధ్యాప కుడిగా చేరారు. నాస్తిక కేంద్ర స్థాపన నాస్తికుడిగా మారుతున్న దశలో ఆయన – ఇంట్లో ఉండే సంప్రదాయాలు, ఆచారాలతో రాజీ పడేవాడు కాదు. తను నడిచే మార్గం సంప్రదాయవాదులైన తన తల్లిదండ్రులకు ఇష్టం లేదని గ్రహించి... భార్యా పిల్ల లతో ఇల్లు వదిలి బయటికి వచ్చేశాడు. స్వతంత్ర జీవనం ప్రారంభించాడు. సమాజంలో మార్పు తేవడానికి ఏదో ఒక కేంద్రం ప్రారంభించాలని అను కున్నారు. ఆ ఆలో చనను ఆయన భార్య సరస్వతీ గోరా బలపరిచారు.సంపూర్ణ గ్రామీణాభివృద్ధి సాధించడానికి కుల మతాలకు అతీతంగా మానవవాద మూలాలపై నడిచే ఒక జీవన శైలిని ప్రవేశపెడుతూ కృష్ణా జిల్లా ముదు నూరులో ‘నాస్తిక కేంద్రం’ ఏర్పాటు చేశారు. గాంధీజీ కోరిక మేరకు 1944లో అఖిల భారత కాంగ్రెస్ ఆర్గనైజర్‌గా అలహాబాదు, ఢిల్లీలలో పని చేశారు. నాస్తిక కేంద్రం ముదునూరు నుండి పని చేస్తున్నప్పుడే, దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. కేంద్రం కార్యకలాపాలు మరింత విస్తృత పరచడానికి దాన్ని విజయవాడకు మార్చారు. ప్రపంచ హేతువాద, నాస్తికోద్యమాలకు గోరా స్థాపించిన ఆ నాస్తిక కేంద్రమే కేంద్ర బిందు వయ్యింది. 1972లో తొలి ప్రపంచ నాస్తిక మహాసభలు విజయవాడలో నిర్వహించిన ఘనత ఆయనదే! అప్పు డాయన వయసు 70 సంవత్సరాలు.భారత గ్రామీణ సమాజంలో ఎలా మార్పులు తేవాలి అనే అంశంపై ఉపన్యసిస్తూనే 1975 జూలై 26న గోరా తుదిశ్వాస విడిచారు. ఊరికే ఉపన్యాసాలివ్వడం కాకుండా, గోరా కార్యాచరణలోకి దిగి చూపించారు. గ్రహణ సమయంలో గర్భిణులు బయట తిరిగితే పుట్టే పిల్లలకు ‘గ్రహణం మొర్రి’ రాదని, తన భార్య గర్భ వతిగా ఉన్నప్పుడు తప్పని సరిగా బయట తిప్పేవారు. ఆ దంపతులకు తొమ్మిదిమంది పిల్లలు పుట్టినా ఎవరికీ గ్రహణం మొర్రి రాలేదు. రాహు–కేతువులు ఎక్కడో లేరు, సమాజంలోనే ఉన్నారు. వారిని జనం అదుపు చేస్తూ ఉండాలని సరస్వతి గోరా తరచూ చెబుతూఉండేవారు.- డా. దేవరాజు మహారాజు, వ్యాసకర్త సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త(నేడు ‘గోరా’ వర్ధంతి) -
సముద్రాలకు రక్షణ సైన్యం
కోస్తా తీరప్రాంతాన్ని కంటికి రెప్పలా కాపాడే మడ అడవులు, సరుగుడు చెట్లు, అరుదైప వృక్షాలు క్రమంగా అంతరించి పోతున్నాయి. చాలామందికి మడ అడవులు అంటే సముద్రం పక్కన పెరిగే కొన్ని చెట్లు మాత్రమే. కానీ అవి కేవలం చెట్లు కావు. అవి ఒక సంపూర్ణ జీవ వ్యవస్థ. సముద్రం, నదులు, నేల, చేపలు, పక్షులు, మనుషులు... ఇవన్నింటినీ ఒకే దారంతో కలిపే ప్రకృతి వలయం.సముద్రపు ఉప్పునీటిలోనూ మనగలిగే ఈ అడవులు లేకపోతే తీరప్రాంత మత్స్య సంపదలో గణనీయమైన భాగం ఉండదు. అనేక చేపలు, రొయ్యలు, పీతలు తమ జీవితాన్ని ప్రారంభించేది ఈ మడ అడవుల్లోనే. అందుకే మడ అడవులను శాస్త్రవేత్తలు ‘సముద్రా నికి నర్సరీ’ అని పిలుస్తారు. మడ అడవుల వేర్లు సముద్ర అలల వేగాన్ని తగ్గిస్తాయి. మట్టిని నిలబెడతాయి. తుఫాను ప్రభావాన్ని గణనీయంగా తగ్గిస్తాయి.1977 నవంబర్‌లో ఆంధ్రప్రదేశ్‌ను తాకిన దివిసీమ ఉప్పెన దేశ చరిత్రలోనే అత్యంత విషాదకర ప్రకృతి విపత్తుల్లో ఒకటి. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయు లయ్యారు. సముద్రంతో యుద్ధం చేయడం కాదు... దానితో కలిసి జీవించడం నేర్చుకోవాలని ఆ రోజు ప్రకృతి ఒక కఠినమైన పాఠం నేర్పింది. మడ అడవులను కాపాడటం ద్వారా ఇటువంటి విపత్తులను కాపాడవచ్చు.‘సముద్రాన్ని ఆపేశాము’!ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా తీరప్రాంతాల్లో మడ అడవుల పునరుద్ధరణ కార్యక్రమాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. స్థానిక ప్రజల భాగస్వామ్యంతో మడ మొక్కలను పెంచడం, చేపల పెంప కాన్ని మడ అడవులతో అనుసంధానం చేయడం, ఉప్పునీటిలో సాగు చేయగల పంటలను ప్రోత్సహించడం వంటి చర్యలు పర్యా వరణ పరిరక్షణతో పాటు గ్రామీణ జీవనోపాధిని కూడా బలోపేతం చేస్తున్నాయి. కృష్ణా జిల్లా తీరప్రాంతంలో కొన్ని గ్రామాలను సముద్రం మింగేస్తోంది. అయితే ‘మా ఊరికి రాకుండా సముద్రాన్ని ఆపేశాము’ అంటారు కృష్ణా జిల్లా తీరప్రాంత గ్రామం బసవాని పాలెంకు చెందిన పద్మ. సముద్ర నీటి మట్టం పెరిగినపుడల్లా తీరప్రాంతం కోతకు గురయ్యేది. ఎం.ఎస్. స్వామినా«థన్ ఫౌండేషన్ సహకారంతో ఎస్జీహెచ్ మహిళలు దశాబ్దం క్రితం నాగాయి లంక, బసవవాని పాలెంలో 200 హెక్టార్లలో మడ మొక్కలను నాటారు. ఇపుడు అవి అడవిగా మారి తీర ప్రాంతానికి రక్షణ కవచంగా మారాయి.వీరి కృషి ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నది. ప్రకృతిని కాపాడితే... ప్రకృతి మనిషిని కాపాడుతుంది. అభివృద్ధి అంటే విధ్వంసం కాదు. మడ అడవులను కాపాడటం అటవీ శాఖ బాధ్యత మాత్రమే కాదు. ఇది పర్యావరణ శాఖ, మత్స్యశాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, స్థానిక సంస్థలు, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, మత్స్యకారులు, రైతులు కలిసి చేయాల్సిన పని.ప్రతి జిల్లాలో మడ అడవుల మ్యాపింగ్ జరగాలి. దెబ్బతిన్న ప్రాంతాలను గుర్తించి పునరుద్ధరణ చేపట్టాలి. తీరప్రాంత గ్రామాల యువతను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలి. సముద్రాన్ని మనం ఆపలేము. తుఫాన్లను కూడా ఆపలేము. కానీ వాటి విధ్వంసాన్ని తగ్గించే సహజ రక్షణ కవచాన్ని మాత్రం కాపాడగలం.– శ్యాం మోహన్, సీనియర్ జర్నలిస్ట్ (రేపు ప్రపంచ మడ అడవుల దినోత్సవం) -
యుగానుకూల మాతృత్వ శక్తి..
ప్రకృతిలో మాతృత్వం కేవలం ఒక బంధం మాత్రమే కాదు, అది ఒక అద్భుతమైన శక్తి. ఒక దేశ సంస్కృతి, సంప్రదాయాలు, విలువలు తరతరాలకు అందాలంటే ఆ బాధ్యతను మోసేది మాతృశక్తే. మాతృత్వాన్ని కేవలం కుటుంబానికే పరిమితం చేయ కుండా, దేశ నిర్మాణ శక్తిగా గుర్తించే దిశగా ‘విశ్వ మాంగళ్య సభ’ కృషి చేస్తోంది.2010లో స్థాపితమైన విశ్వ మాంగళ్య సభ, ఒక సామాజిక ఉద్యమంగా, సాంస్కృతిక పునరు జ్జీవన వేదికగా రూపాంతరం చెందింది. సంస్కార్ (విలువలు), సామర్థ్యం (శక్తి), సదాచారం (మంచి ప్రవర్తన), సేవ అనే నాలుగు సూత్రాల ప్రాతిపది కన ఈ సంస్థ పనిచేస్తోంది. ఆధునికత పేరుతో మనం కోల్పోతున్న భారతీయ విలువలను, కుటుంబ వ్యవస్థలోని సౌందర్యాన్ని తిరిగి నిల బెట్టడం ఈ సభ ప్రధాన ఉద్దేశ్యం. ఒక వ్యక్తికి మొదటి పాఠశాల కుటుంబం అయితే, మొదటి గురువు తల్లి. ఈ భావనతోనే, మహిళలను సాంస్కృతికంగా బలోపేతం చేసి, విలువలతో కూడిన ‘నవ భారత’ నిర్మా ణంలో వారిని భాగస్వామ్యం చేస్తోంది.ఒక మహిళ కేవలం ఒక వ్యక్తి కాదు, ఆమె ఒక వ్యవస్థ. మహిళ విద్యా వంతురాలైతే ఒక కుటుంబం బాగుపడుతుంది. మహిళ ఆలోచిస్తే ఒక సమాజం బాగుపడుతుంది. అదే మహిళ నాయకత్వం వహిస్తే ప్రపంచమే బాగుపడుతుంది. ఆధునిక జీవనశైలిలో ఒత్తిడిని అధిగమించడానికి యోగా, ధ్యానం వంటి సంప్రదాయాలు ఏ విధంగా తోడ్పడతాయో అవగాహన కల్పిస్తూ, మహిళలను శక్తిమంతం చేయడం ద్వారానే మనం ‘విశ్వమాంగ ళ్యాన్ని’ (ప్రపంచ శ్రేయస్సును) సాకారం చేయగమని ఈ సభ నమ్ముతోంది.నేటి మహిళ, విజ్ఞాన శాస్త్రాన్ని ఆయుధంగా మలుచుకుంటూనే, సంస్కారాన్ని కవచంగా ధరించాలి. భారతీయ విలువల పునాదులను పటిష్ట పరచి వాటిపై ఆధునిక ప్రగతి సౌధాన్ని నిర్మించాలి. మాతృశక్తి మేల్కొన్న సమాజానికి ఓటమి లేదు; అది ఎప్పుడూ విశ్వ శ్రేయస్సును కాంక్షిస్తుంది. ఈ యుగానుకూల మాతృత్వ శక్తితోనే ఉత్తమ వ్యక్తి నిర్మాణం, కుటుంబ నిర్మాణం ఆ పై ఉన్నత నవభారత నిర్మాణం సాధ్యమవుతాయి.– డా. సంగీతా రెడ్డి, అపోలో హాస్పిటల్స్ గ్రూప్ డైరెక్టర్ (రేపు హైదరాబాద్‌లో విశ్వ మాంగళ్య సభ సమావేశం సందర్భంగా...) -
శంకరుల బాట..
ఆదిశంకరుల రచనలైన కనకధారాస్తోత్రమ్, దక్షిణామూర్తి స్తోత్రమ్, గుర్వష్టకమ్, నిర్వాణ షట్కమ్, భజగోవిందం, సౌందర్యలహరి – దేన్ని చదివినా, వినినా మనసు ఆనందంతో నిండి పోతుంది. వాటి అర్థాన్ని గ్రహించి, తదనుగుణంగా జీవిస్తే మన జీవితాలే ధన్యమవుతాయనిపిస్తుంది. శంకరులవారి అన్నపూర్ణా స్తోత్రాన్ని ప్రతి రోజు ఉదయం, సాయంత్రం పాడుతుంటే ఆనందం, ఆరోగ్యం పుష్కలంగా లభిస్తాయని పెద్దలంటారు. అందులో చివరి శ్లోకం మరీ ముఖ్యమైనది:‘‘అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే / జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ!మాతా చ పార్వతీ దేవీ పితాదేవో మహేశ్వరః / బాంధవా శ్శివ భక్తశ్చ స్వదేశో భువనత్రయమ్!!ఇందులో ఆది శంకరులవారు జ్ఞాన, వైరాగ్యాలను కాంక్షించటమేకాక తన తల్లి పార్వతీదేవి అనీ, తండ్రి మహేశ్వరుడనీ, శివ భక్తులందరు తన బంధువులనీ, మూడు లోకాలూ తనకు స్వదేశమనీ ప్రకటిస్తారు. శ్రేష్ఠులు దేన్ని ఆచరిస్తారో దాన్నే ప్రమాణంగా ఇతరులు తీసికొని ఆచరిస్తారని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెబుతారు.మరి మనం ఆది శంకరుల అనుచరులం అని చెప్పుకొంటే సరిపోతుందా? ఆయన వలె మనమూ జ్ఞాన, వైరాగ్యాలనే కోరుకోవాలిగానీ ధన ధాన్యాలను, సంపదలను కాదు. లోకాలనన్నిటినీ, లోకులందర్నీ సృష్టించిన ప్రకృతి, పురుషులు మన తల్లి తండ్రులని, జీవులన్నీ మన బంధువులని, ముల్లోకాలూ స్వదేశమని గ్రహించి జీవిస్తే ఆధ్యాత్మిక శిఖరాన్ని ఆదిశంకరులవారు ఎలా అధిరోహించారో మనమూ అధిరోహించవచ్చు. – రాచమడుగు శ్రీనివాసులు -
గల్ఫ్‌లో మళ్లీ యుద్ధమేఘాలు
జూన్ 17, 2026న ఇరాన్–యూఎస్ఏల మధ్య అవగాహన (మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్–ఎంవోయూ) కుదర టంతో పర్షియన్ గల్ఫ్‌లో శాంతి పునః స్థాపితమవుతుందనే అందరూ భావించారు. ప్రపంచ విపణిలో చమురు ధరలు దిగిరావటంతో ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకున్నాయి. మూడు వారాలు తిరగక ముందే హార్మూజ్ మళ్లీ మూతపడటంతో శాంతి మూణ్నాళ్ల ముచ్చటయింది. ఈ రెండవ దశ యుద్ధం మరింత విస్తృతంగా, తీవ్రంగా కనపడుతున్నది. ప్రాంతీయ, అంతర్జా తీయ రాజకీయాలలో కీలక మలుపునకు ఈ దశ నాంది కావచ్చు.దిక్కుతోచని అమెరికా ఇరాన్–యూఎస్ అంగీకరించిన అవగాహన పత్రం 60 రోజులలో సమగ్ర ఒప్పందాన్ని తయారు చేయటానికి ఒక చట్రంగా ఉపయోగపడాలనేది ప్రధాన ఉద్దేశ్యం. ఈ రెండు నెలల వ్యవధిలో హార్మూజ్ జలసంధి ద్వారా నిరాటంకంగా ఎలాంటి రుసుములు లేకుండా వాణిజ్య నౌకల రవాణా జరగాలనీ, తత్సంబందిత ఏర్పాట్లను ఇరాన్ చేయాలనీ ఎంవోయూలోని అయిదవ ఆర్టికల్ నిర్దేశిస్తుంది. ఇదే పీటముడిగా మారింది. హార్మూజ్ జలసంధి ద్వారా రవాణా పూర్తిగా తన అజమాయిషీ, ఆధ్వర్యంలో జరగాలని ఇరాన్ నిర్దేశాలు జారీ చేసింది. ఈ నిర్దేశాల ప్రకారం హార్మూజ్ నుండి ప్రయాణించే ప్రతి నౌక ముందుగా ఇరాన్ వద్ద తమ పూర్తి వివరాలను నమోదు చేసుకుని నిర్దేశించిన మార్గంలో, నిర్దేశించిన సమయంలో ప్రయాణించాలి. యూఎస్ఏ ఈ వాదనను తిరస్క రిస్తూ హార్మూజ్ జలసంధి అంతర్జాతీయ రవాణా మార్గం, దీనిపై ఇరాన్ అజమాయిషీ కుదరదని తేల్చి చెప్పింది. ఇరాన్ తీరానికి సమీపంగా కాకుండా ఒమన్ తీరానికి సమీపంలో ఒమన్ ప్రాదేశిక జలాల గుండా నౌకల రవాణాను ప్రోత్సహించింది. ఒమన్ తీరంగుండా ప్రయాణిస్తున్న నౌకలపై ఇరాన్ దాడి చేయటంతో యూఎస్ఏ తన నౌకాబలంతో హార్మూజ్‌ను దిగ్బంధించింది. ప్రతిగా ఇరాన్ గల్ఫ్ దేశాలపై దాడులు ప్రారంభించింది.మొదటి దశ 40 రోజుల దాడులతో పోల్చితే గత పన్నెండు రోజులుగా జరుగుతున్న రెండవ దశ యుద్ధం భిన్నంగా ఉన్నది. మొదటిసారిగా అమెరికా ఇరాన్‌లోని పౌర లక్ష్యాలపై దాడి చేసింది. రహదారులు, వంతెనలు, పవర్ ప్లాంట్లు, డీసాలినేషన్ ప్లాంట్లను లక్ష్యంగా చేసుకున్నది. బుషేర్లో నిర్మాణంలో ఉన్న పౌర అణువిద్యు చ్ఛక్తి కేంద్రంపై కూడా దాడి చేసింది. ఇది అంతర్జాతీయ యుద్ధనేరం (వార్ క్రైమ్) కిందకు వస్తుంది. ఇరాన్ కూడా అవగాహన పత్రంపై అమెరికా అధ్యక్షుడి సంతకానికి విలువ లేదని చెప్పి, అదే స్థాయిలో విరుచుకుపడింది. కువైట్‌లోని అల్సుబియా డీసాలినేషన్ ప్లాంట్, విద్యుచ్ఛక్తి కేంద్రంపై దాడి చేసింది. బహ్రెయిన్‌లో అమెరికా అయిదవ నౌకాదళ ప్రధాన కార్యాలయం ఉన్న సల్మాన్ పోర్టుపై దాడి చేసింది. మొదటిసారిగా సిరియా, జోర్డాన్‌లలోని యూఎస్ వైమానిక స్థావరాలు, విమానాశ్రయాలు, రేపు పట్టణాలపై కూడా దాడి చేసింది. అవగాహన పత్రంపై ట్రంప్ తప్పనిసరి పరిస్థితులలో సంతకం పెట్టినట్లుగా కన్పడుతున్నది. ఏదోరకంగా హార్మూజ్ జలసంధిని తెరిపించి, చమురు ధరలను కిందకు తేవాలనే ఆరాటం కనపడుతుంది. కానీ ఎంవోయూలో ఎక్కడా ఇరాన్ అణుకార్యక్రమాన్ని వీడుతున్నట్లు లేదు. ఒక రకంగా ఎంవోయూ అమెరికాకు ప్రతి కూలంగా, ఇరాన్‌కు ప్రయోజనకారిగా ఉన్నదని విశ్లేషకుల అభి ప్రాయం. ఈ నేపథ్యంలో ఇరాన్ హార్మూజ్‌ను తన ఆజమాయిషీ లోకి తీసుకునే ప్రయత్నాలు చేయటంతో అమెరికా దిక్కుతోచక మళ్లీ దాడులు మొదలుపెట్టింది.ఇరు పక్షాలకూ నష్టమే!ఇరాన్‌తో యుద్ధం అమెరికాకు కొరివితో తల గోక్కున్నట్లయింది. అమెరికా రక్షణ శాఖ మంత్రి పీటర్ హెగ్సెత్ అమెరికా ప్రభుత్వం ఇప్పటికే 37.5 బిలియన్ డాలర్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. మూడీస్ సంస్థ అంచనాల ప్రకారం ఇరాన్‌పై దాడి వలన అమెరికన్ పౌరులపై పన్నులు, అధిక ధరల రూపంలో 132 బిలియన్ డాలర్ల అదనపు భారం పడింది. పెంటగాన్, యుద్ధం కోసం అదనంగా 80 బిలియన్ డాలర్ల నిధులను కోరుతున్నది.తరిగిపోతున్న మందుగుండు సామగ్రి నిల్వలను పూర్తి చేయటానికి అమెరికా రక్షణ శాఖ 114 బిలియన్ డాలర్లను కోరుతున్నది. ఆర్థిక భారంతో పాటు, ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇప్పటికి 18 మంది అమెరికన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. గత రెండు వారాల లోనే వందమందికి పైగా అమెరికన్ సైనికులు గాయపడ్డారు. ఇరాన్‌పై దాడితో అమెరికా సాధించిందేమిటనేది ప్రశ్నార్థకం. ఇరాన్ అణుకార్యక్రమాన్ని, అణుసామర్థ్యాన్ని నిర్మూలించే లక్ష్యం నెరవేరే సూచనలు లేవు. గల్ఫ్ దేశాలను రక్షించే సామర్థ్యం అమెరికాకు ఉన్నదా అనే సందేహాలను ఈ యుద్ధం లేవనెత్తుతున్నది. ఇక ఇరాన్ విషయానికొస్తే, ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం ఈ సంవత్సరం ఇరాన్ ఆర్థిక వ్యవస్థ 6.1 శాతం క్షీణిస్తున్నది. ద్రవ్యో ల్బణం 68.9 శాతం. ఆహార ద్రవ్యోల్బణం 105 శాతం. ఇరాన్ కరెన్సీ (రియల్) దారుణంగా పతనమయింది. ఒక డాలర్‌కు 1.32 మిలియన్ల రియల్స్ పలుకుతున్నది. యుద్ధం వలన 144 బిలియన్ డాలర్ల నష్టం జరిగింది. ఇది ఇరాన్ జీడీపీలో 40 శాతం. సుమారుగా 3,460 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉన్నతస్థాయి సైనిక, రాజ కీయ నాయకత్వం తుడిచిపెట్టుకుపోయింది. అయితే, అమెరికా, ఇజ్రాయెల్ దాడులు రాజకీయంగా ఇరాన్ నాయకత్వానికి కలిసి వచ్చాయి. ప్రజలలో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత అమెరికా–ఇజ్రా యెల్ వైపు మళ్లింది. ఖమేని అంత్యక్రియలను ఇరాన్ తెలివిగా వాడుకున్నది. అన్నింటికంటే ముఖ్యంగా ఇరాన్ హార్మూజ్ జలసంధి రూపంలో ఒక కొత్త అస్త్రాన్ని కనుక్కొన్నది. ఈ యుద్ధం ద్వారా ఇరాన్–రష్యా–చైనా మైత్రీబంధం మరింత బలపడింది.కొత్త గుణపాఠాలుహార్మూజ్, బాబెల్ మాండెబ్, సూయజ్, పనామా, మలక్కా వంటి ఇరుకైన జలసంధుల (చోక్ పాయింట్ల) ద్వారా రవాణాపై పూర్తిగా ఆధారపడటం వలన వచ్చే ముప్పు అన్ని దేశాలకు అర్థమైంది. హార్మూజ్ నుండి తప్పించుకోవటానికి సౌదీ ఈస్ట్–వెస్ట్ పైప్ లైన్ ద్వారా రోజూ సుమారు 5 బిలియన్ బారల్స్ చమురును ఎర్ర సముద్రంలోని యాంబూ రేవు పట్టణం గుండా పంపిస్తున్నది.అందుకే ఇరాన్‌కు మద్దతునిచ్చే యెమెన్‌లోని హౌతీలు బాబెల్ మాండెబ్‌ను మూసివేశారు. యూఏఈ హార్మూజ్‌కు ప్రత్యామ్నాయంగా హబ్షాన్ నుండి పైప్‌లైన్ ద్వారా ఫుజేరాకు పంపించి ఒమన్ సింధుశాఖ గుండా రవాణా చేస్తున్నది. అందుకే ఇరాన్ ఫుజేరాపై దాడి చేసింది. భారత్ ప్రతిపాదించిన ‘ఐమెక్’(ఇండియా–మిడిల్ ఈస్ట్– యూరప్ ఎకనామిక్ కారిడార్) వీటన్నింటికి విరుగుడు. ఐమెక్ రూపుదిద్దుకోవాలంటే గల్ఫ్ దేశాలు ఇజ్రాయెల్‌తో ఆచరణాత్మక వైఖరిని రూపొందించుకోవాలి. అధునాతన ఎయిర్‌క్రాఫ్ట్ కారియర్లు, స్టెల్త్ యుద్ధ విమానాలు, అణ్వస్త్రాలు, క్షిపణి రక్షణ వ్యవస్థల ద్వారా దిగ్గజ శక్తులు చిన్న రాజ్యాలను లొంగదీసుకోవటం అసాధ్యమని ఉక్రెయిన్, ఇరాన్ యుద్ధాలు రుజువు చేస్తున్నాయి. చౌకైన డ్రోన్లు, క్షిపణులతో కూడా ఎదురొడ్డి నిలువవచ్చని చాటి చెప్తున్నాయి. ఒకరకంగా ఈ రెండు యుద్ధాలు రెండు కూటముల మధ్య జరుగుతున్నట్టు లెక్క. అమెరికా, ఐరోపా దేశాలు ఒకవైపు; చైనా, రష్యా, ఇరాన్, ఉత్తర కొరియా ఇంకొకవైపు మోహరించి ఉన్నాయి. ఉక్రెయిన్ వెనుక అమెరికా, యూరప్ ఉన్నాయి. ఇరాన్ వెనుక చైనా, రష్యా ఉన్నాయి. గల్ఫ్ దేశాల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కగా మారింది. గల్ఫ్ దేశాల రక్షణను ఇజ్రాయెల్ పట్టకంలోంచి అమెరికా చూస్తుందనే విషయాన్ని అవి గుర్తించాలి. తమ భద్రతకై జీసీసీ దేశాలు, నాటో తరహా కూటమిని ఏర్పాటు చేసుకోవటం మేలు. ఇరాన్‌తో సత్సంబంధాలకు ప్రయత్నించాలి. భద్రత, రక్షణ, ఆర్థిక అంశాలలో వ్యూహాత్మక స్వాతంత్య్రాన్ని అనుసరించాలి. ఈ విషయంలో భారత్ విధానాల నుండి నేర్చుకోవచ్చును.-వ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్); సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు-గురజాల శ్రీనివాసరావు -
నంబర్ వన్ నుంచి ‘పదిలో ఒకటి’కి!
పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలు, సంస్థలు ఒక రాష్ట్రం వైపు అడుగులు వేసేముందు మొట్టమొదట పరిశీలించేది అక్కడి ప్రభుత్వ విధానాలు తమను ప్రోత్సహించడానికి అనువుగా ఉన్నాయా అన్నదే. దానికి దేశవ్యాప్తంగా ఆమోదం పొందిన కొలబద్ద ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ ర్యాంకింగులు. అయితే ఆంధ్రప్రదేశ్ తాజా ర్యాంకులను చూస్తే ఆందోళన కలగకమానదు.వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఈ ర్యాంకుల్లో ఏపీ సాధించిన ఫలితాలు ఇప్పటికీ రికార్డులుగానే నిలిచి ఉన్నాయి. 2020 సెప్టెంబర్ 5న డీపీఐఐటీ ప్రకటించిన ఫలితాల్లో 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల జాబితాలో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2022 జూన్ 30న ప్రకటించిన బీఆర్ఏపీ–2020 ఫలితాల్లో ‘టాప్ అచీవర్స్’ హోదా పొందిన 7 రాష్ట్రాల్లో ఒకటిగా నిలవడమే కాదు, 97.89 శాతం స్కోరుతో దేశం లోనే అత్యధిక స్కోరు సాధించి గుజరాత్(97.77 శాతం) కంటే ముందు నిలిచింది. మరో విశేషం ఏంటంటే, 2024 సెప్టెంబర్‌లో ఢిల్లీలో జరిగిన తొలి ‘ఉద్యోగ్ సమాగమ్’ వేదికపై డీపీఐఐటీ వెల్లడించిన బీఆర్ఏపీ ఫలితాల్లో దేశం మొత్తం మీద ‘టాప్ పెర్ఫార్మర్’ హోదా దక్కింది మూడంటే మూడు రాష్ట్రాలకే. అవి కేరళ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్. ఆ మదింపు నకు ప్రాతిపదిక జగన్ ప్రభుత్వ 2022–23 నాటి సంస్కరణల అమలు.2025 నవంబర్‌లో జరిగిన రెండో ‘ఉద్యోగ్ సమాగమ్’లో డీపీఐఐటీ ప్రకటించిన బీఆర్ఏపీ–2024 ఫలితాలు కళ్లు తెరిపించేలా ఉన్నాయి. ఐదు సంస్కరణ రంగాల్లో ‘టాప్ అచీవర్’ గుర్తింపును ఉత్తరాఖండ్, పంజాబ్ దక్కించుకోగా, ఆంధ్రప్రదేశ్ నాలుగు రంగాల గుర్తింపుతో పది రాష్ట్రాల గుంపులో ఒకటిగా మిగిలిపోయింది. ‘ఫాస్ట్ మూవర్స్’ జాబితాలో ఏపీ పేరు ఒడిశా, పంజాబ్ తర్వాతే వినిపించింది. ఈ నెల 17న నీతి ఆయోగ్ విడుదల చేసిన ‘ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్’ ఆ దృశ్యాన్ని మరింత స్పష్టం చేసింది. పెట్టుబడులకు అనుకూలమైన దేశంలోని 17 పెద్ద రాష్ట్రాల జాబితాలో ఏపీ స్థానం ఆరు. దేశంలోని అన్ని రాష్ట్రాల లెక్కన ఎనిమిదో స్థానం.‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అంటూ ప్రస్తుత ప్రభుత్వం వినిపిస్తున్న నినాదాలు, దావోస్ వేదికలపై ప్రకటనలు, లక్షల కోట్ల ఒప్పందాల హోరు వార్తా శీర్షికలకే పరిమితమవుతున్నాయి. పెట్టుబడి నిర్ణయాలు తీసుకొనే ముందు పారిశ్రామికవేత్తలు పరిశీలించేది డీపీఐఐటీ, నీతి ఆయోగ్ వంటి సంస్థల తటస్థ గణాంకాలనే తప్ప ప్రచార ఆర్భాటాలను కాదు. ర్యాంకుల భాషను పెట్టుబడిదారులు ఎప్పుడో చదివేశారు; చదవాల్సింది ఏపీ పాలకులే.– డా. కొత్తపల్లి శ్రీనివాస వర్మ, సీనియర్ జర్నలిస్ట్ -
చెరువులెవరివి? లాభాలెవరికి?
పురాతన కాలం నుంచి ఉన్న వేలాది చెరువులు మన గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు, ముఖ్యంగా మత్స్యకారుల జీవనానికి మూలస్తంభాలు. తెలంగాణలో ప్రస్తుతం సుమారు 24,189 చెరువులు, జలాశయాలు, రిజర్వాయర్లు ఉన్నాయి. రాష్ట్రంలో 5,72,167 ఎకరాలకు పైగా విస్తీ ర్ణంలో చెరువులు అందుబాటులో ఉన్నాయి. వీటిపై ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 27 లక్షల మంది జీవనం సాగిస్తు న్నారు. అలాగే 4,500కు పైగా మత్స్యకార సహకార సంఘాలు నమోదై ఉన్నాయి.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మత్స్య రంగం గణనీయంగా విస్తరించింది. 2014– 15లో సుమారు 2 లక్షల టన్నులుగా ఉన్న చేపల ఉత్పత్తి ప్రస్తుతం 4.5 లక్షల టన్నులకు పైగా పెరిగింది. అయినా మత్స్యకార కుటుంబాల జీవన పరిస్థితుల్లో ఆశించిన మార్పు లేదు. అప్పులు, అస్థిర ఉపాధి, మధ్యవర్తుల దోపిడీ, తక్కువ ఆదాయం వారిని వెంటాడుతున్నాయి. ప్రభుత్వ విధానం ప్రకారం చెరువుల చేపల పెంపకం హక్కులు నేరుగా మత్స్యకార సహకార సంఘాలకు ఇవ్వాలి. ఈ విధానం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం మధ్యవర్తులను తొలగించి ఉత్పత్తి ద్వారా వచ్చే లాభాలు నిజమైన మత్స్యకారులకు చేరేలా చేయడం.కానీ నేడు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో మత్స్యకార సంఘాల పేరుతో లీజుకు తీసుకున్న చెరువులను గోప్యంగా కాంట్రాక్టర్లకు, వ్యాపారులకు, దళా రులకు సబ్ లీజుకు ఇస్తున్నారు. ఫలితంగా అసలు మత్స్యకారులు తమ సొంత చెరువుల్లోనే కూలీలుగా మారిపోతున్నారు. చేపల మార్కెట్లో ప్రస్తుతం రోహు, కట్ల వంటి సాధారణ చేపల ధరలు అనేక పట్టణాల్లో కిలోకు రూ. 180 నుంచి రూ. 250 వరకు ఉన్నాయి. కొన్ని ప్రత్యేక జాతుల చేపలు రూ. 300 నుంచి రూ. 500 వరకు విక్రయమవుతున్నాయి. చెరువుల వద్ద మత్స్యకారు లకు లభిస్తున్న ధరలు దీనికంటే చాలా తక్కువ. ఉత్పత్తి ధరకు, మార్కెట్ ధరకు మధ్య ఉన్న భారీ వ్యత్యాసాన్ని మధ్యవర్తులు మింగేస్తున్నారు.మత్స్యకార సహకార సంఘాలకు అనేక చోట్ల ఎన్నికలు ఏళ్ల తరబడి జర గడం లేదు. సభ్యులకు లీజు వివరాలు తెలియడం లేదు. ఆదాయం–ఖర్చుల లెక్కలు బహిర్గతం కావడం లేదు. కొన్ని ప్రాంతాల్లో మత్స్యశాఖ అధికారులే బినామీ పేర్లతో కాంట్రాక్టు వ్యవస్థలో భాగమవుతున్నారనే ఆరోపణలున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చెరువుల లీజులపై సమగ్ర సామాజిక తనిఖీ జరగాలి. చేపల కొనుగోలు, మార్కెటింగ్ కోసం ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రత్యక్ష మార్కెట్ వ్యవ స్థలను ఏర్పాటు చేయాలి. శీతల గిడ్డంగులు, ప్రాసెసింగ్ కేంద్రాలు మత్స్యకార సంఘాల ఆధీనంలో ఉండాలి. లాభాలు నిజమైన మత్స్యకారునికి చేరాలి.– మామిండ్ల రమేష్ రాజా, సీపీఐ (ఎమ్ఎల్) లిబరేషన్ తెలంగాణ కార్యదర్శి -
మాయాబజార్లో ఓటర్ల దేవులాట
‘లాహిరి లాహిరి లాహిరిలో...’ అని పాడుకునే ‘మాయాబజార్’ సినిమా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిర స్థాయిగా నిలిచిపోయింది. ఆ చిత్రానికి నిజానికి ‘శశిరేఖా పరిణయం’ అని ఉండాలి. కానీ ప్రపంచం మాయాబజార్ గానే గుర్తుంచుకుంది. ఎందుకంటే ఆ కథలో మాయ, వ్యూహం, వేషధారణ, భ్రమ – అన్నీ కలగలిసి ఉంటాయి. ఎవరు నిజం? ఎవరు మాయ? అనే సందేహమే కథకు ప్రాణం. నేటి ఓటరు జాబితాల ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (సర్) ప్రక్రియను గమనిస్తే కూడా ఇటువంటి సందేహాలే తలెత్తుతున్నాయి. ప్రజాస్వా మ్యంలో ఎన్నికలు ఒక పవిత్ర ప్రక్రియ. ఆ ప్రక్రియలో పారదర్శకత కనిపించకపోతే, అది ‘మాయాబజార్’లా అనిపించడం సహజం.మాయాబజార్లో ‘సత్యపీఠం’ ఉంటుంది. దానిపై కూర్చుంటే అసత్యం బయటపడుతుందని భావిస్తారు. కానీ వాస్తవ జీవితంలో రాజ్యాంగ పదవులు చేపట్టే రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్, న్యాయమూర్తులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు– అందరూ సత్యనిష్ఠతో పనిచేస్తామని ప్రమాణం చేస్తారు. అయినప్పటికీ, వారి నిజాయితీని నిరూపించేందుకు అటువంటి ‘సత్యపీఠం’ లేదు. భారత సుప్రీంకోర్టు కూడా ‘సెల్వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక’ (2010) కేసులో పాలీగ్రాఫ్, నార్కో అనాలిసిస్, బ్రెయిన్ మ్యాపింగ్ వంటి పరీక్షలను వ్యక్తి సమ్మతి లేకుండా నిర్వహించడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. ప్రశ్న ఏమిటంటే, పౌరుడి విషయంలో రాజ్యాంగం అంత జాగ్రత్తగా వ్యవహరిస్తే, ఓటరును మాత్రం మళ్లీ మళ్లీ తన ఉనికిని నిరూపించమని అడగడం ఎంత వరకు సమంజసం?ఓటరు ఎవరు?ఎన్నికల సంఘం చెబుతున్నది ఒకటే: ఫారం నింపండి, పత్రాలు ఇవ్వండి, వివరాలు సమర్పించండి. ప్రజలు అడుగుతున్న ప్రశ్న కూడా ఒక్కటే: ‘నేను ఇరవై ఏళ్లుగా ఓటు వేస్తున్నాను. నా పేరు ఇప్పటికే ఓటరు జాబితాలో ఉంది. మళ్లీ నేను ఎవరో ఎందుకు నిరూపించాలి?’ ఈ ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఇప్పటివరకు ప్రజలకు అందలేదు. 2002లో జరిగిన ప్రత్యేక సవరణ తరువాత అనేక ఎన్నికలు జరిగాయి. అదే జాబితాల ఆధారంగా లోక్‌సభ, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో లక్షలాది మంది ఓటు వేశారు. అప్పుడు చెల్లుబాటైన ఓటరు ఇప్పుడు అకస్మాత్తుగా సందేహా స్పదుడిగా ఏ విధంగా మారాడు?ఎన్నికల జాబితా రూపొందించడం భారత ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధ బాధ్యత. ఇంటింటికీ వెళ్లి ఓటర్లను గుర్తించడం, ఫారాలు అందించడం, సందేహాలు నివృత్తి చేయడం బూత్ లెవల్ అధికారుల విధి. కానీ అనేక ప్రాంతాల్లో పరిస్థితి భిన్నంగా కనిపి స్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి వంటి పట్టణ ప్రాంతాల్లో వేలాది మందికి ఫారాలు అందలేదని ఫిర్యాదులు వస్తున్నాయి. కొన్నిచోట్ల బీఎల్వోలు కాలనీల్లో కూర్చొని వచ్చిన వారికి మాత్రమే ఫారాలు ఇస్తున్నారు. అలాంటి పరిస్థితిలో, ఫారం అందకపోయినా బాధ్యత ఓటరుపైనే వేయడం న్యాయమా?జూలై మధ్య నాటికి సుమారు 1.66 కోట్ల తెలంగాణ ఓటర్లలో సగానికి కూడా తక్కువ మంది మాత్రమే ఫారాలు సమర్పించారని అధికారిక సమాచారం చెబుతోంది. అంటే మిగిలిన వారి పరిస్థితి ఏమిటి? ఫారం అందలేదా? సమయం సరిపోలేదా? లేక ప్రక్రియపై సరైన అవగాహన కల్పించలేదా? ఈ ప్రశ్నలకు సమాధానాలు లేకుండా గడువులు పొడిగించడం ప్రజల సందేహాలను తగ్గించదు.డిజిటలైజేషన్ ఎందుకు?డిజిటల్ ఇండియా గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఆధార్, ఓటర్ ఐడీ, జనన–మరణ నమోదు, చిరునామా రికార్డులు, ప్రభుత్వం వద్ద ఇప్పటికే విస్తృత సమాచారం ఉంది. ఈ సమాచారాన్ని సమన్వయం చేయకుండా, ప్రతి ఓటరునూ మళ్లీ పత్రాలతో రావాలని అడగడం పరిపాలనా సామర్థ్యంపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. డిజిటల్ వ్యవస్థ పౌరుడికి సౌలభ్యం కలిగించాలా? లేక అతనిపై కొత్త భారం మోపాలా?ప్రత్యేకంగా హైదరాబాద్ మహానగర పరిధిలోనే లక్షలాది నమోదులు పరిశీలనకు వస్తే, ఎన్నికల విశ్వసనీయతపై ప్రశ్నలు తలెత్తడం సహజం. ఇటువంటి సందర్భాల్లో ఎన్నికల సంఘం మరింత పారదర్శకంగా వివరాలు వెల్లడించడం అత్యవసరం. ఎన్నికల సంఘం ఒక సాధారణ ప్రభుత్వ శాఖ కాదు. అది రాజ్యాంగం సృష్టించిన స్వతంత్ర సంస్థ. దాని నిర్ణయాలు ప్రజల్లో నమ్మకాన్ని పెంచాలి, అనుమానాలను కాదు. పౌరుడు ఎన్నికల సంఘాన్ని నమ్మాలి, ఎన్నికల సంఘం కూడా పౌరుడిని నమ్మాలి. ఈ పరస్పర విశ్వాసమే ప్రజాస్వామ్యానికి మూలాధారం.మాయాబజార్ సినిమాలో చివరికి మాయ తొలగిపోతుంది. నిజం బయటపడుతుంది. అందుకే ఆ కథ సుఖాంతమవుతుంది. ప్రజాస్వామ్యంలో కూడా అదే జరగాలి. ఎన్నికల ప్రక్రియలో మాయకు, సందేహాలకు, అపార్థాలకు చోటు ఉండకూడదు. ‘నీవు ఓటరువని నిరూపించు’ అనే ధోరణి కంటే, ‘నీ ఓటు హక్కు రక్షించడం మా రాజ్యాంగబద్ధ బాధ్యత’ అనే ధోరణి ఎన్నికల సంఘానికి మరింత గౌరవాన్ని తీసుకొస్తుంది.సర్ అనేది కేవలం ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ మాత్రమే కాదు. అది ఎన్నికల సంఘం విశ్వసనీయతకు కూడా పరీక్ష. ఆ పరీక్షలో విజయం సాధించేది గణాంకాలు కాదు; పారదర్శకత, నిష్పాక్షికత, ప్రజల విశ్వాసం. అదే ప్రజాస్వామ్యానికి నిజమైన ‘సత్యపీఠం’.- మాడభూషి శ్రీధర్, వ్యాసకర్త కేంద్ర సమాచార సంఘం మాజీ కమిషనర్ -
మహాత్ముల చేష్టలు..
బాలోన్మత్త పిశాచవత్ సిద్ధానాం రీతిః మహాత్ములయిన సిద్ధపురుషుల పద్ధతంతా విపరీ తంగా ఉంటుంది. పిల్ల చేష్టలు చేస్తారు. పిశాచం పట్టిన వాళ్ళలాగా వింతగా ప్రవర్తిస్తారు. పిచ్చివాళ్ళలాగా సంచరిస్తారు. వాళ్ళ చూపులు, పనులు వంటివన్నీ పైకి అలాగే కనిపిస్తాయి. అలాంటి మహనీయుల గొప్పతనాన్ని మహాత్ములే గుర్తిస్తారు. సామాన్యులకు తెలియదు.గౌతమ మహర్షి మహామహితాత్ముడు. గొప్ప సిద్ధుడు. శ్రీవిద్యోపసనా దురంధరుడు. ముద్రోపాసనను, శైవ సిద్ధాంతాన్ని మనకందించిన పుణ్యమూర్తి. పెద్ద పెద్ద పండితులు, చక్రవర్తులు ఆయన ఆశ్రమానికి వెళ్ళి వారి దర్శనం చేసుకొని వెళ్ళేవారు. నిత్యం వేదపారా యణం, ఉపాసన, యజ్ఞయాగాది క్రతువులు, పూజలు, సంద్గ్రంథ పారాయణాలు జరిగేవి.ఒక ఉన్మత్తుడు ఆశ్రమంలోనే ఉంటూ అందరికీ తపో, ధ్యాన భంగం చేస్తూ ఉండేవాడు. గౌతముడు మాత్రం ఆ పిచ్చివాణ్ణి దగ్గరకు పిలిచి ఆదరించేవాడు. ఆశ్రమవాసులందరూ ఆ పిచ్చివాణ్ణి తిట్టేవారు. ఇలా ఉండగా ఒక రోజున పండితులు, రాజు గౌతముని సన్మానించటానికి, పూజా సామగ్రిని, కానుకలను తీసుకొనివస్తే ఆ పిచ్చివాడు ఆ సామగ్రినంతటినీ చిందరవందర చేసి అందరిచేత తన్నులు తిన్నాడు. అందుకు గౌతముడు చాలా బాధపడ్డాడు. పాపం పిచ్చివాడిలాగా తిరిగే అవధూత మరణించాడు. ఇది చూచి గౌతముడు కూడా ప్రాణం వదిలేశాడు. అది తెలిసి శుక్రాచార్యులు కూడా ప్రాణత్యాగం చేశారు.ఆ విషాదం చూచి భరించలేక దేవతలందరూ జగన్మాతను ప్రార్థించారు. శ్రీమాత వాళ్ళ ప్రార్థన విని గౌతముని బ్రతికించింది. గౌతముడు మంత్రజలం చల్లి అవధూతను బ్రతికించాడు. శుక్రాచార్యుని సైతం బ్రతికించాడు. అక్కడి వాళ్ళతో గౌతముడు ‘ఈయనను పిచ్చివాడనుకొంటున్నారు మీరు. ఇది భ్రమ తప్ప నిజం కాదు. ఈయనొక మహాయోగి. అవధూత! నా పూర్వజన్మలో నా గురుదేవుడు. ఈయన ఇంతవరకు మీ విషయంలో చేసిన వింతచేష్టలు మిమ్మల్ని అనుగ్రహించటానికే. కానీ ఈ యధార్థం మీకు తెలియదు’ అని చెప్పాడు.- శ్రీ గణపతి సచ్చిదానందస్వామి -
మన్యం నుంచి పార్లమెంటు దాకా...
అల్లూరి సీతారామరాజు ఆధ్వర్యంలో జరిగిన మన్యం పితూరీలో ఆయనకు ప్రధాన అనుచరులుగా గాం గంటందొర, గాం మల్లుదొర పేరెన్నిక గన్నారు. వీరు గిరిజనులలో భగత తెగకు చెందినవారు. ఇందులో మల్లు దొర స్వాతంత్య్రానంతరం పార్లమెంటుకూ ఎన్నిక య్యాడు. విశాఖపట్నం జిల్లా చింతపల్లి తాలూకాలోని కొయ్యూరు మండలం ‘బట్టపనుకులు’ గ్రామంలో 1900లో జన్మించాడు.గంటందొర చిన్న తమ్ముడు మల్లుదొర. బ్రిటిష్ తాబేదారుల అక్రమ చర్యలను గాం సోదరులు ప్రతిఘటించారు. ప్రభుత్వాన్ని ధిక్కరిస్తున్నాడనే నేపంతో చింతపల్లి తాసిల్దార్ సెబాస్టియన్ గంటందొరను మునసబు పదవి నుంచి తొలగించాడు. అంతేగాదు, గంటందొర భూమితో పాటు మరికొందరి ఆదివాసుల భూములను ప్రభుత్వపరం చేశాడు. గాం సోదరులకు జరిగిన అన్యాయాన్ని ప్రతిఘటించడానికి మన్యం ప్రజలు అల్లూరి సీతారామరాజుకు తెలియుజేశారు.సీతారామరాజు 1922లో మన్యం పోరాటాన్ని ప్రారంభించాడు. బ్రిటిష్ వారి ఆగడాలను అంత మొందించడానికి 150 మంది సైనికులను సేకరించ డంలో గాం సోదరుల కృషి చెప్పుకోదగినది. వీరికి భగత తెగ గిరిజనులైన సింగన్న, పడాలు, గోవిందు, వీరయ్య దొర, గోకేరు ఎర్రేసు, అగ్గిదొర వంటి వారి సహకారం తోడైంది. సీతారామరాజు నాయకత్వంలో చింతపల్లి, కృష్ణదేవిపేట, రాజవొమ్మంగి, అడ్డతీగల పోలీస్ స్టేషన్లపై దాడిచేసి ఆయుధాలను సేకరించారు. బ్రిటిష్ ప్రభుత్వం అల్లూరిని పట్టిచ్చిన వారికి 10 వేలు, గంటందొర, మల్లుదొరలను పట్టిచ్చిన వారికి ఒక్కొక్కరికి వెయ్యేసి రూపాయల పారితోషికం ప్రకటించింది.ఉద్యమంలో కాస్త చురుకుదనం కోల్పోయిన సందర్భంలో ఆయుధాలను అల్లూరి సైన్యానికి అప్పగించి మల్లుదొర దళాన్ని విడిచి వెళ్లాడు. 1923 సెప్టెంబర్ 17న గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం నడింపాలెం చేరుకున్నాడు. ఒక రహస్య ప్రదేశంలో బ్రిటిష్ వారికి పట్టుబడ్డాడు. అల్లూరి ఆచూకీ తెలుప మని మల్లుదొరను చిత్రహింసలు పెట్టినా ఏమీ చెప్పలేదు. 1924 మే 7న పట్టు బడిన అల్లూరి వీరమరణం పొందాడు. వాల్తేరు ఏజెన్సీ న్యాయమూర్తి మల్లు దొరకు మరణశిక్ష విధిస్తూ తీర్పు చెప్పాడు. మల్లుదొర అప్పీలు చేయగా మరణ శిక్షణను ద్వీపాంతరవాస శిక్షగా మార్చారు. 1937లో అండమాన్ జైలు నుంచి విడుదౖలñ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1952లో జరిగిన పార్లమెంటు ఎన్నికలలో విశాఖపట్నం ఏజెన్సీ నుంచి గెలుపొంది ఆదివాసీలలో తొలి పార్లమెంటు సభ్యుడిగా వ్యవహరించారు. 1969 జూలై 21న తుదిశ్వాస విడిచారు.– గుమ్మడి లక్ష్మీనారాయణ, ఆదివాసీ రచయితల వేదిక వ్యవస్థాపకుడు -
సంపద... సామాజిక బాధ్యత!
కంపెనీల రూపంలో వ్యాపారం నిర్వహించడం 1600 సంవత్సరంలో ‘ఈస్ట్ ఇండియా కంపెనీ’తో ప్రారంభమైనదని చెప్పవచ్చు. చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారు సాధారణంగా సొంత యాజమాన్యంలో లేక భాగస్వామ్యంలో వ్యాపారాలు నిర్వ హిస్తుంటారు. పెద్ద ఎత్తులో వ్యాపారాలు నిర్వ హించాలంటే, ఆర్థిక వనరులు సమకూర్చుకోవడానికి ‘కంపెనీ’ రూపంలో వ్యాపారం నిర్వహించాల్సి ఉంటుంది. 19వ శతాబ్దం మధ్య నుంచి కంపెనీల రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. ప్రస్తుతం మన దేశంలో రిజిస్టర్ అయిన కంపెనీల సంఖ్య దాదాపు 28 లక్షలు.ఎప్పుడైతే కంపెనీలు దేశ ఆర్థిక వ్యవస్థలను శాసించడం మొదలైందో, అప్పుడే వాటి సామాజిక బాధ్యత (కార్పొరేట్ సోషల్ రెస్సాన్సిబి లిటీ–సీఎస్ఆర్) గురించి కూడా చర్చమొదలైంది. హోవార్డ్ బోవెన్ 1953లో మొదటిసారిగా, ‘కార్పొ రేట్ల సామాజిక బాధ్యత’ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. సామాజిక విలువలకు అనుగుణంగా కంపె నీల నిర్ణయాలు, పాలసీలు ఉండాలనీ, సమాజ అభివృద్ధికి ఆర్థికంగా సహాయపడాలనీ ఆయన స్పష్టం చేశారు. ఆర్థిక శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ గ్రహీత మిల్టన్ ఫ్రైడ్‌మ్యాన్ మాత్రం చట్టబద్ధంగా వ్యాపారం నిర్వహించి, కంపెనీలను లాభాల బాట పట్టించడం, కంపెనీ వాటాదారుల సంపద పెంచడం మాత్రమే ‘కార్పొరేట్ల సామాజిక బాధ్యత’ అని వాదించారు.కంపెనీలు సామాజిక బాధ్యతలను కూడా నిర్వహిస్తే, ఆదాయపు పన్ను రాయితీలు, ఇతర ప్రోత్సాహకాలను అందిస్తామని ప్రపంచ దేశాలు వాటిని ప్రోత్సహిస్తున్నాయి. భారత ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి, కంపెనీ చట్టం–2013 లోని సెక్షన్ 135 ద్వారా సామాజిక బాధ్యతలను నిర్వర్తించడం కంపెనీలకు తప్పనిసరి చేసింది. చట్టంలో పొందుపరచిన సామాజిక బాధ్యతలను నిర్వర్తించకుంటే, అందుకు బాధ్యులైన కంపెనీ అధికారులకు మూడేళ్ల వరకు జైలుశిక్షను కూడా నిర్దేశించింది. ఆ విధంగా, ప్రపంచం మొత్తం మీద, శాసనం ద్వారా సామాజిక బాధ్యతలను నిర్వర్తించడం తప్పనిసరి చేసిన మొట్టమొదటి దేశంగా భారత్ నిలిచింది. తరవాత, 2020లో జైలు శిక్ష స్థానంలో జరి మానాను విధించాలని పార్లమెంటు చట్టాన్ని సవ రించి కంపెనీలకు ఊరట కలిగించింది. సవరించిన చట్టం ప్రకారం, సామాజిక బాధ్యతలకై నిర్దే శించిన ఖర్చు చేయని డబ్బుపై రెండింతల జరి మానా ప్రభుత్వానికి కంపెనీ చెల్లించాలి. అందుకు బాధ్యులైన కంపెనీ అధికారులకు రెండు లక్షల వరకు జరిమానా విధించవచ్చు. ఇంకా, తన సామాజిక బాధ్య తను ఏ పరిస్థితుల్లో నిర్వర్తించ లేకపోయిందో వివరణ ఇవ్వాలి.లక్ష్యం నెరవేరినట్టే!గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఐదు కోట్ల రూపాయల లాభం, వెయ్యి కోట్ల రూపాయల ఆదాయం, 500 కోట్ల రూపాయల నెట్‌వర్త్‌ను కంపెనీలు కలిగి ఉంటే... అవి తమ లాభాల్లో కనీసం 2 శాతం సీఎస్ఆర్ కార్యకలాపాలపై ఖర్చు చేయాలి. అది కూడా చట్టం నిర్దేశించిన 12 విభాగాలలో నుంచి ఒక దాన్ని ఎంచుకోవాలి. విద్య, వైద్యం, పర్యావరణం, గ్రామీణాభివృద్ధి, విపత్తు నిర్వహణ వంటివి ఇందులో ఉన్నాయి. సీఎస్‌ఆర్‌పై చేసిన ఖర్చుపై ‘బిజినెస్ ఎక్స్పెండి చర్’ కింద ఆదాయపు పన్ను మినహాయింపు లేదు.అయితే, ఈ చట్టం చేయకముందే ఎన్నో ఏళ్లుగా, టాటాలు, బిర్లాలు, మరెన్నో కార్పొరేట్ సంస్థలు విద్య, వైద్యం లాంటి ఎన్నో సామాజిక విషయాలపై స్వచ్ఛందంగా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టాయి. కానీ చట్టం చేసిన తరువాత, గత పదేళ్ళలో కార్పొరేట్ సంస్థలన్నీ కలిసి 2 లక్షల కోట్ల రూపాయలకు పైన తమ సామాజిక బాధ్య తను నిర్వర్తించడానికి ఖర్చు చేశాయి. ఇది గర్వించదగ్గ విషయం. న్యాయవ్యవస్థలో, మౌలిక సదుపాయాల కొరత వల్ల కూడా, కేసులు విపరీ తంగా పెండింగ్‌లో ఉన్నాయి. కాబట్టి, న్యాయ వ్యవస్థను కూడా సీఎస్ఆర్లో 13వ విభాగంగా చేర్చుతూ చట్టాన్ని సవరించాలి.– హరీష్ కుమార్ కొలిచాల, న్యాయవాది, రిటైర్డ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (లా), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా -
గురువే దేవుడి కన్నా ఉన్నతుడు..
భారతీయ సంస్కృతిలో గురువుకు ఉన్న స్థానం అద్వితీయం. అందుకు ఈ కథ ఒక ఉదాహరణగా చెప్పవచ్చు: ఒక రోజు గురువు, దేవుడు ఇరువురూ కలిసి ఓ వ్యక్తి దగ్గరకు వచ్చారు. వెంటనే అతడు భగవంతుని పాదాలను తాకి నమస్కరించబోయాడు. భగవంతుడు అతణ్ణి ఆపి, ‘ముందు నీ గురువును పూజించు’ అన్నాడు. సరే అని, అతడు గురువును పూజించడం ప్రారంభించాడు. కానీ గురువు ‘శిష్యా, నేను భగవంతుడిని నీ ఇంటికి తీసుకువచ్చాను, కాబట్టి నువ్వు ముందు భగవంతుడిని పూజించాలి’ అన్నారు.గురువు సలహా విని, శిష్యుడు భగవంతునివైపు తిరిగాడు. ‘నీ జీవితంలోకి భగవంతుడిని తీసుకువచ్చింది నీ గురువే. నన్ను చేరుకోవడానికి సరైన మార్గాన్ని నీకు చూపింది ఆయనే, కాబట్టి నువ్వు ముందు ఆయనను పూజించాలి’ అన్నాడు భగవంతుడు. ‘నేను భగవంతుని వద్దకు మార్గం చూపినప్పటికీ, ప్రతిదానికీ ఆయనే బాధ్యుడు, కాబట్టి నువ్వు ముందు భగవంతుని ఆశీర్వాదం పొందడం మంచిది’ అన్నారు ఈసారి గురువు. దీంతో శిష్యుడు దేవుని ఉద్దేశించి ‘తండ్రీ, గురువుగారు చెప్పేదంతా నిజమే కదా’ అన్నాడు. అందుకు భగవంతుడు ‘కర్మఫలాలను బట్టి, నేను ఎలాంటి భేదం లేకుండా జనులకు సుఖదుఃఖాలను ఇస్తాను. నేను ఎవరికీ కీడుగానీ, మేలుగానీ చేయను. ప్రతి వ్యక్తికీ వారి కర్మఫలాన్నే ఇస్తాను. కానీ గురువు అలాంటివాడు కాదు. ఆయన పవిత్రుడు. నిరాడంబరుడు. ప్రేమమయుడు. గురువు మార్గదర్శకత్వం కోరిన శిష్యుడిని, అతను ఎలా ఉన్నాడో అలాగే స్వీకరిస్తాడు. నన్ను చేరే మార్గాన్ని అతనికి చూపించి ఆశీర్వదిస్తాడు. అతను ఎలా ఉన్నా సరే సరిదిద్దుతాడు. శిష్యుడి కర్మఫలాల నుండి అతడిని కాపాడుతాడు. అతనితో ఉండి మార్గనిర్దేశం చేస్తాడు. కానీ నేను అలా చేయను. అందువల్ల, గురువే దేవుడి కన్నా ఉన్నతుడు’ అన్నాడు.– యామిజాల జగదీశ్ -
రేపటిని సొంతం చేసుకోవడానికి...
‘విద్య సమాజ భవిష్యత్తుకు పాస్‌పోర్ట్ లాంటిది. రేపు అనేది, ఈ రోజే దానికోసం సిద్ధపడే వాళ్లకే సొంతం’ అంటాడు అమెరికన్ పౌర హక్కుల ఉద్యమకారుడు మాల్కం ఎక్స్. ప్రపంచంలో మున్ముందు సంభవించగల సాంకేతిక మార్పులకు, ఉద్యోగ మార్కెట్ అవలంబించే కొత్త రిక్రూట్మెంట్ విధానాలకు అనుగుణంగా విద్యా నిపుణులు రూపొందించిన ‘ఫ్యూచర్ రెడీ కోర్సులు’ విద్యార్థులను రేపటిని సొంతం చేసుకోవడానికి సిద్ధం చేస్తాయి.మెరుగైన ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకునేందుకు డేటా సైన్స్, కృత్రిమ మేధ (ఏఐ), సైబర్ సెక్యూరిటీ వంటి ఫ్యూచర్ రెడీ కోర్సులు విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లోనూ అందుబాటులో ఉండటం గమనించాల్సిన సంగతి. ‘ఇరవై ఒకటో శతాబ్దంలో నిరక్షరాస్యులు అంటే చదవడం, రాయడం రానివారు కాదు; నేర్చుకోవడం, నేర్చు కున్నదాన్ని వదిలేయడం, మళ్లీ కొత్తగా నేర్చుకోవడం తెలియని వారే’ అంటాడు అమెరికన్ రచయిత, ఫ్యూచరిస్ట్ ఆల్విన్ టాఫ్లర్. ప్రస్తుతం డేటా సైన్స్, ఏఐ, సైబర్ సెక్యూరిటీ ఇత్యాది కోర్సులు, టాఫ్లర్ చెప్పినట్టుగా విద్యార్థుల వ్యక్తిగత ప్రతిభకు తగిన గుర్తింపునూ, సరిపడా ఆదాయాన్నీ తెచ్చిపెడతాయి. అందుకే ఈ కోర్సు లకే యువకులు అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తున్నారు. మునుపటితో పోల్చితే పూర్తి అధునాతనమైన ఈ కోర్సుల్లో ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత. కోట్ల కొద్దీ ఉన్న పాత సమాచారాన్ని అర్థంచేసుకొని, భవిష్యత్తులో ఏం జరగబోతుందో ముందే ఊహించే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. మనం యూట్యూబ్ లేదా నెట్‌ఫ్లిక్స్‌లో ఒక వీడియో చూడగానే ‘మీకు ఇది కూడా నచ్చుతుంది’ అంటూ కింద కొన్ని ఆప్షన్స్ వస్తుంటాయి. ఇది డేటా సైన్స్ మహిమే. మనుషుల్లాగే సొంతంగా ఆలోచించి నిర్ణ యాలు తీసుకునే తెలివితేటలు యంత్రాలకు వచ్చేశాయి. డ్రైవర్ లేకుండా దానంతటదే రోడ్లపై నడిచే ‘టెస్లా’ కార్లు, మనతో మనిషిలా మాట్లాడే ‘చాట్‌జీపీటీ’... కంప్యూటర్లకు కళ్ళు, చెవులు, మెదడు వచ్చేశాయి. ఇది ఏఐ పుణ్యమే!మారిన మార్కెట్ స్వరూపం మన డబ్బును, వ్యక్తిగత సమాచారాన్ని రక్షించే ఒక అదృశ్య సైన్యం మనకు అందుబాటులో ఉంది. మన బ్యాంక్ అకౌంట్ హ్యాక్ కాకుండా వచ్చే ఓటీపీలు, ఫోన్ లాక్ చేసే బయోమెట్రిక్ సిస్టమ్స్ ఇలా చాలా విషయాల్లో ఈ అదృశ్య సైన్యం పర్యవేక్షిస్తూ అభయ హస్తం చూపుతుంది. ఇదే సైబర్ సెక్యూరిటీ. ఇట్లాంటి ఫ్యూచర్– ప్రూఫ్ కోర్సుల ఫలితంగానే కాలేజీలు కేవలం డిగ్రీలు ఇచ్చే ఫ్యాక్టరీ లుగా కాకుండా, విద్యార్థులను ఆధునిక సవాళ్లను ఎదుర్కొనే సమ ర్థులుగా రూపొందించే నైపుణ్య కేంద్రాలుగా నిలబడుతున్నాయి.ఈ కోర్సులను పూర్తి చేసి ఫేస్బుక్, అమెజాన్, యాపిల్, నెట్‌ఫ్లిక్స్, గూగుల్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలకు ఎంపికైతే, ఫ్రెషర్ స్థాయిలోనే నెలకు 1.5 లక్షల నుండి 2 లక్షల పైనే ప్రారంభ వేతనం లభిస్తోంది. ఈ ‘ఫాంగ్’ సంస్థలు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞా నాన్ని ఉపయోగించి, సంప్రదాయ వస్తుసేవల రంగాన్ని పూర్తిగా డిజిటలైజ్ చేశాయి. వినియోగదారులు వస్తువులను కొనుగోలు చేసే విధానం నుండి సేవలను పొందే విధానం వరకు ఈ సంస్థలు సృష్టించిన డిజిటల్ ఎకోసిస్టమ్ మార్కెట్ స్వరూపాన్నే మార్చేసింది. ఒక్కమాటలో, ఈ ఫ్యూచర్ రెడీ కోర్సులు ‘నేర్చుకోండి, సంపాదించండి, ఎదగండి’ నినాదానికి ఆచరణాత్మక రూపాలు. – ప్రొ. బెల్లి యాదయ్య, ప్రధానాచార్యులు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నకిరేకల్ -
Sushila Nayyar: గ్రామీణ భారత ఆరోగ్యం కోసం...
స్వాతంత్య్ర సమరయోధగా, రాజకీయ నాయకురాలిగా, త్యాగ శీలిగా ప్రఖ్యాతురాలైన సుశీలా నయ్యర్ గొప్ప వైద్యులు కూడా. ప్రస్తుతం పాకిస్తాన్లో అంతర్భాగంగా ఉన్న కుంజాలో 1914 డిసెంబర్ 26న ఆమె జన్మించారు. న్యూఢిల్లీలోని లేడీ హార్డింజ్ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన సుశీల 1939లో గాంధీజీ కార్య దర్శిగా పనిచేసే తన అన్న ప్యారేలాల్ను కలవడానికి వార్ధా వెళ్లారు. అక్కడ కలరా సోకినప్పుడు సుశీల ఒక్కరే ఆ మహమ్మారిని లొంగ దీయగలిగారు. ఈ విజయాన్ని గాంధీజీ ఎంతో కొనియాడారు. పిమ్మట బి.సి. రాయ్ ఆమెను గాంధీ దంపతుల వ్యక్తిగత వైద్యు లుగా నియమించారు.క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో గాంధీ, కస్తూర్బా దంపతులతో పాటు ఆమె కూడా ఆగాఖాన్ భవనంలో బందీగా ఉన్నారు. కస్తూర్బా మరణించిన తర్వాత, 1945లో సేవాగ్రామ్‌లో ‘కస్తూర్బా హాస్పిటల్’ను ప్రారంభించారు. అదే ఇప్పుడు ‘మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్’గా అభివృద్ధి చెందింది.సుశీల ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి 1950లో భారతదేశం తిరిగి వచ్చి ఫరీదాబాద్‌లో ‘ట్యూబర్ కులోసిస్ శానిటోరియం’ ప్రారంభించారు. ‘గాంధీ మెమోరియల్ లెప్రసీ ఫౌండేషన్’కు సారథ్యం వహించారు. 1952లో రాజకీయాలలో ప్రవేశించారు. జవహర్లాల్ నెహ్రూ మంత్రి వర్గంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సహాయ మంత్రిగా సేవలందించారు. ఈ హోదాలో ఢిల్లీలో ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్‌ను ప్రారంభించడంతోపాటు, పలు రోగాల నిర్మూలనకు మౌలికమైన ఆరోగ్య పథకాలు ప్రారంభించారు. 1955లో ఢిల్లీ విధాన సభకు స్పీకర్‌గా ఎంపికయ్యారు.1962లో రెండవసారి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి బాధ్యతలు స్వీకరించి 1967 దాకా గ్రామీణ ప్రాంతాలలో కుటుంబ నియంత్రణ, స్త్రీల, పిల్లల ఆరోగ్యం సంరక్షణా కార్యక్రమాలతో పాటు మలేరియా, సుఖరోగాలు, క్షయ, కుష్టు వంటి వ్యాధుల నిర్మూలనకు పలు పథకాలు చేపట్టారు. సమాజం పట్ల ఎంతో ఆర్తి ఉన్న సుశీల అవివాహితగానే ఉండిపోయారు. కుటుంబ నియంత్రణ, మద్యపాన నిషేధంలో స్త్రీల పాత్ర గురించి రెండు పుస్తకాలు వెలువరించారు. గాంధీజీ, కస్తూర్బాలకు సంబంధించి మరో ఎనిమిది పుస్తకా లను రచించిన డా‘‘ సుశీలా నయ్యర్ 2001 జనవరి 3న సేవాగ్రామ్‌లో గుండెపోటుతో 86 ఏళ్ల వయసులో కనుమూశారు.– డా. నాగసూరి వేణుగోపాల్, ఆకాశవాణి విశ్రాంత ఉన్నతాధికారి -
అశాశ్వతత్వం..
ఒక పల్లెటూరి శివారులో ఒక వృద్ధుడు నివసించేవాడు. కొన్ని నెలల క్రితం అతడి భార్య చని పోయింది. భార్య చనిపోయి నెలలు గడిచినా, ఆమె జ్ఞాపకాలు అతడి హృదయాన్ని విడిచిపెట్టేవి కాదు. ఒకరోజు, భారమైన మనసుతో దేవాలయానికి వెళ్లాడు. పూజారి ‘ప్రాణులన్నీ అశాశ్వతములే.ఈ ధర్మాన్ని అంగీకరించినప్పుడు మాత్రమే దుఃఖం తగ్గుతుంది. మనసు ఉపశమిస్తుంది!’ అన్నాడు. ఆ మాటలు అతని హృదయంలో ఆలోచనను రేకెత్తించాయి. ఇంటికి తిరిగి వచ్చి, భార్య ఇష్టపడే తోటలో కూర్చున్నాడు. అక్కడ ఒక వాడిపోయిన పువ్వు అతడి కనుల ముందే రాలి నేలపై పడింది. అతడు దాన్ని చేతిలోకి తీసుకుని మృదువుగా పలికాడు: ‘నువ్వు వచ్చావు, వెళ్లిపోయావు. కానీ నీ సువాసన మాత్రం మిగిలింది.’ఆ తరువాత అతడు ప్రతిరోజూ అశాశ్వత ధర్మం గురించి ధ్యానం చేయడం మొదలుపెట్టాడు. కొద్ది రోజుల్లోనే అతని హృదయం తేలికైంది. భార్యను కోల్పోయిన బాధ తగ్గలేదు కానీ ఆమెను ప్రేమించిన శాంతి పెరిగింది. ‘అశాశ్వతత్వాన్ని అంగీకరించడం అంటే విడిచిపెట్టడం కాదు, మనసును విముక్తి చేయడం! అనుకున్నాడు. మహా భారతం, శాంతిపర్వంలోని ఈ పద్యం అతడికి జ్ఞాపకానికి వచ్చింది.'కం. భూతము లనిత్యములు, నీవీ తెరువెప్పుడును విం దహీన ధృతిన్ నీచేతోగతి నలవఱపుముభూతానిత్యత్వ మదియ పుచ్చును వగలన్'‘ప్రాణులన్నీ అశాశ్వతములే. ఈ ధర్మాన్ని గురించి ఎప్పుడూ వింటూనే ఉన్నావు. కనుక, ధైర్యం నిండిన మనస్సుతో, ప్రాణములు అశాశ్వతాలనే ధర్మాన్ని అభ్యసించడం మొదలుపెట్టు.ఆ జ్ఞానమే అన్ని దుఃఖాలను పోగొట్టి మనసుకు ఉపశమనాన్ని కలిగిస్తుంది!’ అని తనవంటి వారి గురించే చెప్పినట్లున్న పై పద్యం భావాన్ని స్ఫురణకు తెచ్చుకున్నపుడు అతడిలోని దుఃఖం పూర్తిగా ఉపశమించి, మనసుశాంతిని పొందింది.– భట్టు వెంకటరావు -
మల్లికార్జున్ ఖర్గే (కాంగ్రెస్ అధ్యక్షుడు) రాయని డైరీ
చెట్లను రాల్చుకుని గంపలకు ఎత్తుకునేవి కావు ‘నినాదాలు’! నిరసనకారులే ‘నినాదాలకు’ గుత్తులు గుత్తులుగా ప్లకార్డులై కాస్తారు. రేపటి నుండి వర్షాకాల సమావేశాలు. పార్లమెంట్ ప్రాంగణంలో ఎంపీలు ఎలాంటి నిరసనలు, ధర్నాలు, సమ్మెలు, దీక్షలు చేయకూడదని లోక్‌సభ స్పీకర్ ఆదేశాలు!వర్షం కురవకూడదని పార్లమెంటు భవనం పైకెక్కి నిబంధనలు విధిస్తే ఆకాశం ఆలకిస్తుందా? మబ్బులు ఎక్కడివక్కడ తేలిపోతాయా? ఉరుములు వెళ్లి దిక్కుల్లో దాక్కుంటాయా? పిడుగులు మౌనంగా గొడుగుల కిందకు చేరతాయా? ఏం జరగబోతున్నాయి లోపల? పార్లమెంట్ సమావేశాలే కదా! ఎవరు వెళ్లబోతున్నారు లోపలికి? పార్లమెంటు సభ్యులే కదా! సభ్యుల్లో ఒక్కరైనా ఒక్క నినాదమైనా ఇవ్వకుండానే, నిరసన గళం వినిపించకుండానే పార్లమెంటుకు ఎన్నికై వచ్చి ఉంటారా?! దీక్షలు, ధర్నాలు చేయకుండానే విద్యార్థి సంఘాలను, కార్మిక ఉద్యమాలను నడిపి ఉంటారా?!నినాదం నిన్ను స్కూల్లోనో, కాలేజ్‌లోనో పట్టుకుంటుంది. అక్కడ వదిలేసినా, నువ్వు పని చేసే ఫ్యాక్టరీలో చిమ్నీ పొగలోంచి వచ్చి నిన్ను కమ్మేస్తుంది. నిన్ను నిరసనకారుడిని చేస్తుంది. నినాదాలను నిషేధిస్తూ స్పీకర్ తన సెక్రెటేరియట్ జనరల్ చేత ‘ప్రకటన లాంటి చట్టం’ చేయించినప్పుడు, నా తండ్రి మాపన్న నన్ను మందలించటం గుర్తొచ్చింది.‘‘పొద్దున్నే లేస్తావు. సమ్మెలు, నిరసనలు అని వెళ్తావు. చట్టం అంటే నీకు గౌరవం లేదా, కనీసం భయం లేదా...’’ అని ఆందోళనచెందేవారు ఆయన. చట్టానికి కదా పౌరులంటే గౌరవం ఉండాలి! చట్టానికి కదా పౌరులంటే భయం ఉండాలి! నాన్నకు తెలియక కాదు. తన కొడుకు చేతిని ‘నినాదపు పిడికిలి’ నుంచి విడిపించాలని ఆయన ప్రయత్నం. నినాదం నన్ను ఈ జన్మకూ, ఏ జన్మకూ వదిలేది కాదు.రజాకార్లు ఇంటికి నిప్పు పెట్టినప్పుడు ఆ చీకటి మధ్యాహ్నం ఆరేళ్ల వయసులో నాకు అంటుకున్న నినాదం; ఆ మంటల్లో అమ్మ, చెల్లి, మామయ్య కాలి పోయినప్పుడు నా చేత పెడబొబ్బలు పెట్టించిన నినాదం; నాన్న నన్ను నెలరోజులు అడవిలో దాచి, నాకోసం ఊళ్లో బంధువుల ఇళ్లకు భిక్షాటనకు వెళ్లినప్పుడు నన్ను జోలె పట్టిన నినాదం;కూలీగా నాన్న పని చేస్తున్న మిల్లులో, ఆ మిల్లు నడిపే బడి... పేద పిల్లలకు ట్రైనింగ్ లేని టీచర్లతో, పెద్దవాళ్ల పిల్లలకు పేరున్న టీచర్లతో పాఠాలు చెప్పిస్తున్నప్పుడు నన్ను పలకపై దిద్దిన నినాదం... ఇప్పుడీ సమావేశా లలో నా నిరసనను తెలియజేయకుండా నన్ను ఆపుతుందా? నీట్ అవకతవకలు, డీలిమిటేషన్ దురుద్దేశాలు, ఫిరాయింపు ఆపరేషన్లు, ఓటర్ల జాబితా అక్రమ సవరణల మీద నన్ను మౌనం వహించనిస్తుందా?పార్లమెంటు సమావేశాలలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై 10 జన్‌పథ్‌లోని సోనియాజీ నివాసంలో జరిగిన సమావేశం ముగిశాక, బయటికి వస్తున్నప్పుడు రాహుల్ గాంధీ నన్ను ఒక్క చిరునవ్వుతో ఆపారు.‘‘ఖర్గేజీ, ప్రతి మాన్సూన్ సెష¯Œ ్స ప్రారంభా నికీ కాస్త అటూ ఇటుగా ఒక ప్రత్యేకత ఉంటుంది. అదేమిటో చెప్పండి’’ అన్నారు రాహుల్. ఆయన దేని గురించి మాట్లాడుతున్నారో నేను వెంటనే గ్రహించలేకపోయాను. ‘‘సరే, జూలై 21కి మీకేం గిఫ్టు కావాలో చెప్పండి ఖర్గేజీ...’’ అని మళ్లీ అడిగారు రాహుల్. అప్పుడు జ్ఞాపకానికి వచ్చింది! ఈ 85 ఏళ్ల వయసులోనూ ప్రజల కోసం పాటు పడవలసిన పని ఒకటి ఉండటం, ప్రజల తరఫున ప్రదర్శన జరపటానికి చేతిలో ఒక నినాదం ఉండటం... వీటిని మించిన బర్త్ డే గిఫ్ట్ ఏముంటుంది?!- మాధవ్ శింగరాజు -
కర్బన క్రెడిట్లతో రైతులకు ఆదాయం
వరి సాగు ప్రపంచవ్యాప్తంగా హరిత గృహ వాయువుల (గ్రీన్ హౌస్ గ్యాసెస్) ఉద్గారాలకు ముఖ్యమైన వ్యవసాయ కార్యకలాపాలలో ఒకటిగా నిలిచింది. ప్రపంచ వాతావరణ సంస్థ నివేదిక ప్రకారం, దశాబ్ద కాలంలో కార్బన్ డయాక్సైడ్ 11.4 శాతం పెరిగింది. వాతావరణ మార్పులకు కారణమవుతున్న కార్బన్ ఉద్గారా లలో 30 శాతం వ్యవసాయం ద్వారా విడుదలవుతున్నాయి. కొద్దిపాటి మార్పులు చేస్తే వ్యవసాయ రంగం నుండి వెలువడే ఉద్గారాలను గణనీయంగా తగ్గించవచ్చు.కర్బన ఉద్గారాలు, ముఖ్యంగా మీథేన్ వెలువడే పంటపొలాల్లో అనేక పర్యావరణహిత సాగు పద్ధతులను అనుసరించడం ద్వారా అతి తక్కువ స్థాయికి తగ్గించడం మాత్రమే కాకుండా అంతకన్నా ఎక్కువ కర్బనాన్ని వాతావరణంనుంచి సంగ్రహించి భూమిలో స్థిరీకరించే దిశగా యాజమాన్య పద్ధతులుపాటించవచ్చు.నీటినిల్వ వరి సాగుతో పోలిస్తే అడపా దడపా నీటి పారుదల ద్వారా సాగు చేసే వరి కర్బన ఉద్గారాలను తగ్గిస్తుంది. ఇంకా వరుసల మధ్యలో మురుగునీటిని తీసివేయడం వలన దిగుబడిలో వ్యత్యాసం లేకుండా 50 శాతం వరకు ఉద్గారాలను తగ్గించుకోవచ్చు. దీని వలన కార్బన్ క్రెడిట్లు ఎకరాకు 1–2 చొప్పున పొంద వచ్చు. నేరుగా దమ్ములో వరి విత్తడం ద్వారా, వరి నాటు పద్ధతితో పోల్చుకుంటే 16–54% మీథేన్ వాయువు విడుదల తగ్గుతుంది. దమ్ము చేసి వరి నాటే పద్ధతి నుంచి నేరుగా వరి విత్తే పద్ధతిని అవలంబించి, కలుపు రసాయనాల ద్వారా కలుపు నివారించి, నీటి యాజమాన్యం చేపట్టి, యాంత్రీకరణ ద్వారా కొంత మేర మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ ఉద్గారాలను తగ్గించుకోవచ్చు. వరిలో అధిక మోతాదులో నత్రజని వాడటం వలన మిథనోజెనిక్ బ్యాక్టీరియా చర్యను తగ్గించి 30–50 శాతం మిథేన్ ఉద్గారాలు తగ్గించవచ్చు. వేపచెక్క, వేపనూనె, వేప పూసిన యూరియా వాడటం వల్ల కర్బన ఉద్గారాల విడుదలను తగ్గించుకోవచ్చు. సమగ్ర పోషక యాజమాన్య పద్ధతుల ద్వారా నత్రజని, భాస్వరం, పొటాషియం ఎరువులతో పాటుగా పశువుల ఎరువు వర్మీ కంపోస్ట్, కోళ్ల ఎరువును జాగ్రత్తగా ఉపయోగించాలి. ఎందుకంటే సేంద్రియ ఎరువులు రసాయన ఎరువులు కంటే ఎక్కువ మిథేన్, నైట్రస్ ఆక్సైడ్, బొగ్గు పులుసు వాయువు లాంటి ఉద్గారాలను ఉత్పత్తి చేస్తాయి. వరి గడ్డి కాల్చడం వల్ల కాలుష్యం, కర్బన ఉద్గారాలు విడుదలై జీవ వైవిధ్యం దెబ్బతింటుంది. వరిగడ్డిని కంపోస్ట్ చేసి కానీ లేదా భూమిలో కలియ దున్నటం వలన నేలలో సేంద్రియ కర్బనం పెరుగుతుంది. ఖరీఫ్‌లో వరి కోసిన తర్వాత వరి గడ్డి మల్చింగ్ చేయడం వలన నైట్రస్ ఆక్సైడ్ 10% తగ్గింది కానీ మీథేన్ 8% పెరిగినది. దీని వలన నేలలో సేంద్రియ కర్బనం పెరుగుతున్నందువలన ఈ పద్ధతిని ప్రోత్సహించాలి. సహజ వ్యవసాయం, సమీకృత సేంద్రియ వ్యవసాయ పద్ధతులను పాటించాలి. ఈ సమీకృత వ్యవసాయ విధానంలో వరినాట్లు వేసిన తరువాత, వరి పంట చుట్టూ కందకంలా చేసుకొని అందులో చేపల పెంపకం, అలాగే కందకం గట్టుపై కూరగాయలు, ఆకు కూరలు, పండ్ల మొక్కలు, పూలు మొక్కలు, ఇతర ధాన్యపు పంటలు సాగుచేయాలి. ఈ పంటలతో పాటుగా పాడి, కోళ్ళ పెంపకం చేపట్టినట్లైతే కర్బన ఉద్గారాలను తగ్గించుకోవచ్చు.కర్బన క్రెడిట్–కర్బన మార్కెట్లు కర్బన క్రెడిట్ అనేది వాతావరణంలోకి విడుద లయ్యే హరిత గృహ వాయువుల ఉద్గారాలను తగ్గించడం లేదా తొలగించడం ద్వారా సంపాదించే వ్యాపారయోగ్యమైన ధ్రువీకృత యూనిట్. సాధారణంగా ఒక కర్బన క్రెడిట్ = ఒక మెట్రిక్ టన్ను (1000 కిలోగ్రాములు) కార్బన్ డై ఆక్సైడ్ లేదా దానికి సమానమైన ఇతర హరిత గృహ వాయువుల ఉద్గారాల తగ్గింపును సూచిస్తుంది.పరిశ్రమలు, సంస్థలు లేదా వ్యక్తులు తమ ఉద్గారాలను పూర్తిగా తగ్గించలేని పరిస్థితిలో, ఇతరులు సాధించిన ఉద్గారాల తగ్గింపుకు సంబంధించిన కర్బన క్రెడిట్లను కొనుగోలు చేసి తమ ఉద్గారాలను సమ తుల్యం చేసుకోవచ్చు.వరి సాగులో నీటి నిర్వహణ, ఎరువుల సమర్థ వినియోగం, మీథేన్ ఉద్గారాల తగ్గింపు వంటి పద్ధతుల ద్వారా వాతావరణంలోకి విడుదలయ్యే హరిత గృహ వాయువులను తగ్గిస్తే, ఆ తగ్గింపును కొలిచి ధ్రువీకరించిన తర్వాత రైతులకు లేదా రైతు సమూహాలకు కార్బన్ క్రెడిట్లు జారీ చేస్తారు. దీనివల్ల అదనపు ఆదాయం, నీటి వినియోగంలో గణనీయమైన ఆదా, సాగు ఖర్చుల తగ్గింపు, నేల ఆరోగ్యం మెరుగుదల, వాతావరణ మార్పులకు అనుకూలమైన వ్యవసాయం, అంతర్జాతీయ కార్బన్ మార్కెట్లలో భాగస్వామ్యం రైతులకు చేకూరతాయి. – డా‘‘ బి. సహదేవ రెడ్డి, డా‘‘ కె. తేజస్వరరావు ,ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయ శాస్త్రవేత్తలు -
ఆయన ప్రాణం కాపాడండి!
సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ జూన్ 28 నుంచి ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ‘నిరవధిక నిరాహార దీక్ష’లో ఉన్నాడు. బరువు తగ్గాడు. బలహీనపడ్డాడు. అయినా ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోంది. వాంగ్‌చుక్ లద్ధాఖ్లోని ఉలేటోక్ఫో గ్రామ నివాసి. పర్యావరణ కార్యకర్త. విద్యా సంస్కర్త. హిమాలయ ప్రాంతానికి అనువైన ‘ఐస్ స్థూప’ అనే కృత్రిమ మంచు నిల్వ వ్యవస్థను అభివృద్ధి చేసి, అంతర్జాతీయ గుర్తింపును పొందారు. విద్యార్థులకు ‘ప్రత్యామ్నాయ విద్య’ను అందించాలనే లక్ష్యంతో ‘సెక్మోల్’ విద్యా సంస్థను స్థాపించారు. 2018లో ‘రామన్ మెగసెసే’ అవార్డును అందుకున్నారు.ఆయనకు దీక్షలు చేయడం కొత్తేమీ కాదు. ‘లద్ధాఖ్‌ను భారత రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్ పరిధిలోకి తేవాలి’ అంటూ, 2024లో 21 రోజుల పాటు ‘నిరాహార దీక్ష’ చేశారు. ప్రస్తుత దీక్ష సంగతికి వస్తే: ఈ ఏడాది మే నెలలో జరిగిన ‘నీట్’ పరీక్షలో ప్రశ్నాపత్రం లీక్ అయ్యింది. పరీక్ష నిర్వహణలో కొన్ని అవకతవకలు జరిగాయి. ఇది విద్యార్థుల్లో తీవ్ర ఆందోళనకు కారణమైంది. ఈ నేపథ్యంలో ‘కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, పరీక్షల నిర్వహణలో జవాబుదారీతనం తీసుకు రావాలి’ అంటూ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ఉద్యమం ప్రారంభించింది. దానికి సంఘీ భావంగా సోనమ్ వాంగ్‌చుక్ దీక్షను మొదలెట్టారు.‘పరీక్షల నిర్వహణలో సంస్కరణలు చేపడతామని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తామని’ జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) తెలిపింది. కానీ ఇలాంటి హామీలను నమ్మే స్థితిలో విద్యార్థులూ, ఉద్యమకారులూ లేరు. ఎందుకంటే 2024లో బిహార్‌లో ఇలాగే జరిగింది. అప్పుడు కూడా ప్రభుత్వం కేసును సీబీఐకి అప్పగించింది. బిహార్‌లోని పట్నా, జార్ఖండ్‌లోని హజారీబాగ్ ప్రాంతాల్లో ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు గుర్తించింది. ‘155 మంది విద్యార్థులు ఈ మోసంతో ప్రయోజనం పొందినట్లు’ సుప్రీమ్ కోర్టుకు సీబీఐ తెలియజేసింది.2019లో తమిళనాడులోనూ ఇలాగే జరిగింది. అయితే అది లీకేజీ కాదు. అది ఇంపర్సనేషన్ రాకెట్! పరీక్షలు రాయవలసిన వారి స్థానంలోకి వేరేవాళ్లు వెళ్లి పరీక్షలు రాయడమన్నమాట! 2021, 2023లో కూడా ఇలాంటి స్కాములు కొన్ని చోట్ల జరిగాయి. కాబట్టి, ‘భవిష్యత్‌లో జరగకుండా చూసుకొంటాము’ అనే మాట నీటిమూట. 2018కి 2019 ఒక భవిష్యత్తు. 2024కు 2026 ఇంకో భవిష్యత్తు. కాబట్టి ఈ ‘భవిష్యత్తు హామీ’ అనేది ‘విద్యార్థుల భవిష్యత్తు’ నాశనం చేయడానికి తప్ప ఎందుకూ పనికిరాదు. ఆ విషయం తెలిసే వాంగ్‌చుక్ దీక్షకు కూర్చున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు ‘ప్రతి పౌరుడి ప్రాణం అమూల్యమైనదే. అతడి ప్రాణాలు కాపాడేందుకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నాలు చేయాలి’ అంటూ కీలకమైన ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.– నన్నూరి వేణుగోపాల్, పౌర హక్కుల కార్యకర్త -
ప్రతిభకు పట్టం
భారతీయ ఇతిహాసాలలో శ్రీరాముడు కేవలం ధర్మప్రభువు మాత్రమే కాదు; ఆయన ఒక దూరదృష్టి గల నాయకుడు, ప్రతిభను గుర్తించే వ్యక్తి, మనుషులను తీర్చిదిద్దే సమర్థ నిర్వాహకుడు. ఆయన ఎవరినీ వారి జన్మ, హోదా, వయస్సు ఆధారంగా అంచనా వేయలేదు. ఒక వ్యక్తి పనితనం, సమర్థత, లక్ష్యానికి ఎంతగా ఉపయోగపడగలడనే ఒక్క ప్రమాణమే ఆయన ముందుండేది.వానర సేనలో హనుమంతుడు మొదట ఒక సాధారణ యోధుడిలా కనిపించవచ్చు. కానీ అతని వాక్చాతుర్యం, బుద్ధిశక్తి, సమస్య పరిష్కరణ సామర్థ్యాన్ని గమనించిన రాముడు, లంకా ప్రయాణం వంటి అత్యంత కీలకమైన బాధ్యతను హనుమకే అప్పగించాడు. చివరికి జాంబవంతుడు వంటి అనుభవజ్ఞులు కూడా హనుమంతుడిని ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మాటలకంటే ఆచరణను గమనించే మేనేజర్‌గా శ్రీరాముడిని చూడవచ్చు. ఎవరు ఎంత చెప్పారు అనేదానికంటే, సంక్షోభ సమయంలో ఎవరు ముందుకు వచ్చారనే విషయానికే ప్రాధాన్యం ఇచ్చాడు. అందుకే విభీషణుడు రావణుని సోదరుడైనప్పటికీ, అధికారబలం లేకపోయినా, నిజాయితీగా సరైన సలహా చెప్పగల ధైర్యం ఉందని గుర్తించి, అనేక మంది వ్యతిరేకించినా లంకకు రాజుగా నియమించాడు.చాలామంది ప్రతిభను గుర్తించిన తర్వాత అవకాశం మాత్రమే ఇస్తారు. కానీ శ్రీరాముడు నమ్మిన వారికి అధికారాన్ని కూడా అప్పగిస్తాడు. దీనికి ఉత్తమ ఉదాహరణ సుగ్రీవుడు. ఆయనను కేవలం మిత్రుడిగా కాకుండా, వానర సేనాధిపతిగా పూర్తి నిర్ణయాధికారంతో నియమించాడు. విద్య, అధికారమేమీ లేని గిరిజన మహిళ శబరి భక్తి, అంకితభావం, సేవాభావాన్ని గుర్తించి ఆమెను అనుగ్రహించడం ఆయన విశాల హృదయానికి నిదర్శనం. శ్రీరాముడి ప్రతిభా నిర్వహణ నమూనా మనకు చెప్పే సందేశం ఏమిటంటే, ప్రతిభే ప్రధాన అర్హత. బాధ్యతను స్వీకరించే ధైర్యం, బృందాన్ని ముందుకు నడిపించే నైతికతే నిజమైన నాయకత్వ లక్షణాలు. రాముడు చూపిన ప్రతిభా నిర్వహణ నమూనా నేటి సీఈవోలు, హెచ్ఆర్ నాయకులు, ప్రాజెక్ట్ మేనేజర్లకు విలువైన పాఠం.– డా. బాలాజీ దీక్షితులు పి.వి. -
విడుదలలో జాప్యం తగదు!
ప్రభుత్వ ఉద్యోగికి పదవీ విరమణ పొందిన తరువాత ఆర్థిక భరోసా కల్పించేది పెన్షన్. అయితే ద్రవ్యోల్బణం పెరుగు తున్నకొద్దీ పెన్షన్ విలువ తగ్గిపోకుండా రక్షించేందుకు డియర్నెస్ రిలీఫ్ (డి.ఆర్.) పొందే హక్కు పెన్షనర్లకు ఉంది. దీని చెల్లింపును ఆలస్యం చేయడం అంటే పెన్షనర్ల జీవన భద్రతను బలహీన పరచడమే. భారత సుప్రీంకోర్టు డి.ఎస్. నకారా వర్సెస్ యూని యన్ ఆఫ్ ఇండియా (1983) కేసులో పెన్షన్ అనేది ప్రభుత్వం దయాదాక్షిణ్యంతో ఇచ్చే సాయం కాదనీ, ఉద్యోగి తన సేవల ద్వారా సంపాదించిన ఆస్తి హక్కు అనీస్పష్టంగా పేర్కొంది. పెన్షన్‌కు అను బంధమైన డియర్నెస్ రిలీఫ్ కూడా అదే సూత్రానికి లోబడి ఉంటుంది.ఆర్టికల్ 41 ప్రకారం వృద్ధాప్యంలో ప్రజలకు సామాజిక భద్రత కల్పించడం రాజ్య విధాన నిర్దేశక సూత్రాలలో ఒకటి. కాబట్టి డి.ఆర్.ను సకాలంలో చెల్లించడం సంక్షేమరాష్ట్ర బాధ్యత. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పెన్షనర్లకు 37.31 శాతం డి.ఆర్. మాత్రమే అమలులో ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ద్రవ్యోల్బణ సూచికల ప్రకారం 1.7.2024 నుండి 2.73 శాతం, 1.1.2025 నుండి 1.82 శాతం, 1.7.2025 నుండి మరో 2.73 శాతం, 1.1.2026 నుండి మరో 1.82 శాతం పెంపుదల రావలసి ఉంది. ఈ పెండింగ్ శాతం కేవలం గణాంకం కాదు; 3.60 లక్షల మంది పెన్షనర్ల కుటుంబాల ఆర్థిక ఇబ్బందులకు కారణం కూడా. ధరల పెరుగుదల, వైద్య వ్యయాలు, మందుల ఖర్చులు, విద్యుత్ చార్జీలు, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిన ప్రస్తుత పరిస్థితుల్లో ఈ బకాయిలు వారి జీవనా«న్ని దెబ్బతీస్తున్నాయి. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నదనీ, అందుకే డి.ఆర్. చెల్లింపుల్లో ఆలస్యం జరుగుతోందనీ అనవచ్చు. ఆర్థిక పరిమితులు ఉన్నప్పటికీ ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లించవలసిన చట్టబద్ధమైన బకాయిలను నిరవధికంగా వాయిదా వేయడం సరైన పరిపాలనా విధానం కాదు. ఈ చెల్లింపు ఆలస్యం చేయరాని బాధ్యత; అమలు చేయవలసిన న్యాయం.– టి.ఎం.బి. బుచ్చిరాజు, ఏపీ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి ఇంజినీరింగ్ రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు -
బకాయిలకు వడ్డీ చెల్లించండి!
‘పెన్షన్ ప్రభుత్వాలు ఇచ్చే భిక్ష కాదు– అది ఉద్యోగుల హక్కు’ అని సుప్రీంకోర్టు 1982 డిసెంబర్ 17న డి.ఎస్. నకారా కేసులో తీర్పు చెప్పింది. ఈ తీర్పు ప్రకారం 2024 మార్చి నుండి ఇప్పటివరకు రిటైర్ అయిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు హక్కుగా చెల్లించాల్సిన రిటైర్మెంట్ బకాయిలు రెండేళ్లయినా ప్రభుత్వం చెల్లించడం లేదంటూ కొంతమంది తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ప్రారంభంలో కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం చెల్లింపులు చేసింది కానీ తర్వాత ఆపింది. దీంతో కోర్టు ధిక్కారం కింద హైకోర్టులో కేసులు నమోదయ్యాయి.రిటైర్మెంట్ బకాయిలు 10% వడ్డీతో సహా వెంటనే చెల్లించాలని కోర్టు ఆదేశించినప్పటికీ కొంతమందికి మాత్రమే పూర్తి స్థాయిలో చెల్లించి, మరికొంత మందికి కొన్ని బిల్లులు మాత్రమే పాక్షికంగా చెల్లించి, పూర్తిగా చెల్లించామని కోర్టు ధిక్కరణకు మళ్లీ ప్రభుత్వం పాల్పడు తోంది. ఉద్యోగ, ఉపాధ్యాయులు సర్వీసులో ఉన్నప్పుడు కొంత మంది హోమ్ లోన్, పర్సనల్ లోన్, ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పులు తీసుకొన్న వారు ఇప్పటికీ వడ్డీలు భారీగా కడుతున్నారు. కాబట్టి గౌరవ హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయి లపై10 శాతం వడ్డీ చెల్లించాలి.2024 మార్చి నుండి 2026 జూన్ వరకు దాదాపు 26,000 మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు పదవీ విరమణ పొందారు. ఎనిమిది నెలలుగా వివిధ పెన్షనర్ సంఘాలు ఉద్యమాలు చేస్తే వంద రోజులలో ఆరువేల కోట్లు చెల్లిస్తామని – వాటిలో మే నెలలో 2,000 కోట్లు, జూన్‌లో 2,000 కోట్లు, సెప్టెంబర్ 2025 వరకు కమ్యుటేషన్, జీపీఎఫ్ 100 శాతం చెల్లించామని ప్రకటించుకొంది ప్రభుత్వం. కానీ సెప్టెంబర్ 2025 వరకు ఎస్టీఓలో కమ్యుటేషన్ బిల్లు సబ్మిట్ చేసినప్పటికీ కొంతమందికి రాలేదు.కొంతమందికి జీపీఎఫ్ కూడా రాలేదు. కొంతమంది బిడ్డల పెళ్లిళ్లు ఉన్నాయని పెండ్లి కార్డులు పెట్టినప్పటికీ వారికి జీపీఎఫ్ డబ్బులు అందకపోవడం దారుణం. కాబట్టి వారి టోకెన్ నంబర్లు పరిశీలించి, వారికి ఈ జూలై నెలలో చెల్లించాలి. రిటైర్ అయిన ఉద్యోగులందరికీ రిటైర్మెంట్ బకాయిలన్నింటినీ దశలవారీగా కాకుండా ఏక మొత్తంగా ఈ జూలై నెలలోనే చెల్లించాలి.– కందుకూరి దేవదాసు, రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (తెలంగాణ) అసోసియేట్ అధ్యక్షుడు -
మానవీయతే ఇస్లాం హృదయం
ఇస్లాం ధర్మం కేవలం కొన్ని ఆరాధనల సమాహారం కాదు; అది పరస్పర ప్రేమ, కరుణ, మాన వీయ విలువలతో కూడిన సంపూర్ణ జీవన విధానం. ‘భూమిపై ఉన్నవారి పట్ల మీరు దయ చూపండి, ఆకాశంలో ఉన్నవాడు (సృష్టికర్త) మీ పట్ల దయ చూపుతాడు’ అనే ప్రవక్త (స) వారి బోధన ఇస్లామీయ మానవీయ దృక్పథానికి అద్దం పడుతుంది.ఒకరి కష్టాన్ని చూసి చలించి పోవడం, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, అనాథలను ఆదరించడం, తోటి మనిషిని చిరునవ్వుతో పలకరించడం కూడా ఇస్లాంలో పుణ్యకార్యం (సదఖా)గా పరిగణించబడుతుంది. నిజమైన విశ్వాసం అనేది తోటి మనుషులకు మేలు చేయడంలోనే దాగి ఉందనేది ఇస్లాం అంతరార్థం. తన పొరుగువాడు ఆకలితో అలమటిస్తుంటే, తాను మాత్రం తృప్తిగా భుజించేవాడు నిజమైన విశ్వాసి కాదనే హెచ్చరిక సమాజం పట్ల మనకున్న బాధ్యతను గుర్తు చేస్తుంది.హృదయాలను ముక్కలు చేయడం కాదు, గాయపడిన హృద యాలను ఆప్యాయతతో కలపడమే ఇస్లాం నేర్పిన జీవన విధానం. మనుషుల మధ్య ద్వేషాన్ని తుడిచేసి, క్షమా గుణాన్ని, సహనాన్ని అలవర్చుకున్నప్పుడే ఒక మనిషి సృష్టికర్తకు అత్యంత ప్రియమైనవాడిగా మారతాడు. సృష్టిలోని ప్రాణులన్నిటినీ ప్రేమిస్తేనే దైవాన్ని ప్రేమించినవారమవుతామనే ఉదాత్త సందేశం ఇస్లామీయ జీవన విధానంలో ప్రతిధ్వనిస్తుంది.– ఎం.డి. ఉస్మాన్ ఖాన్ -
విద్యుత్తు ప్రమాదాలు నివారించగలిగినవే!
భారతదేశంలో విద్యుత్ ఉత్పత్తి, ప్రసారం, పంపిణీ వ్యవస్థలు ఆధునికీకరణ దిశగా వేగంగా పయనిస్తున్నప్పటికీ, విద్యుత్ భద్రత అదే వేగంతో ముందుకు సాగడం లేదు. ఫలితంగా ప్రతి సంవ త్సరం వందలాది మంది ఉద్యోగులు, రైతులు, సాధారణ ప్రజలు విద్యుత్ ప్రమాదాలకు బలవుతున్నారు. వరుసగా చోటుచేసుకున్న విద్యుత్ ప్రమాదాలు యాదృచ్ఛికాలు కావు; విద్యుత్ భద్రతా వ్యవస్థలో ఎక్కడో తీవ్రమైన లోపం ఉందని సూచిస్తున్నాయి.విద్యుత్ రంగంలో నాలుగు దశాబ్దాలుగా పనిచేసిన ఒక ఇంజినీర్‌గా నా అనుభవం చెబుతున్నది ఒక్కటే– విద్యుత్ ప్రమాదాల్లో ఎక్కువ శాతం నివారించగలిగేవే. ప్రతి ప్రమాదం వెనుక డిజైన్, నిర్వహణ, రక్షణ వ్యవస్థ, పర్యవేక్షణ, శిక్షణ, భద్రతా సంస్కృతి, జవాబుదారీతనం వంటి అనేక అంశాలు పరస్పరం ముడిపడి ఉంటాయి. కాబట్టి ప్రతి ప్రమాదాన్ని రూట్ కాజ్ ఎనాలిసిస్ (మూల హేతువు విశ్లేషణ) పద్ధతిలో విచారించి, అసలు కారణాలను గుర్తించడం తప్పనిసరి.భారతదేశంలో విద్యుత్ భద్రతకు సంబంధించిన చట్టపరమైన వ్యవస్థ స్పష్టంగానే ఉంది. ఎలక్ట్రిసిటీ యాక్ట్– 2003, అలాగే సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (మెజర్స్ రిలేటింగ్ టు సేఫ్టీ అండ్ ఎలెక్ట్రిక్ సప్లై) రెగ్యులేషన్స్... విద్యుత్ సంస్థలు, కాంట్రాక్టర్లు, ఉద్యోగులు పాటించాల్సిన భద్రతా ప్రమాణాలను నిర్దేశించాయి. అయినప్పటికీ ప్రమాదాలు ఎందుకు తగ్గడం లేదు? దానికి సమాధానం ‘వ్యవస్థాపరమైన భద్రతా సంస్కృతి’ లోపించడంలో ఉంది. ప్రమాదం జరిగిన తర్వాత విచారణ కమిటీలు వేయడం, పరిహారం ప్రకటించడం, సంతాపం తెలియ జేయడం అవసరమే. కానీ ప్రమాదం జరగకముందే దానిని నివా రించే వ్యవస్థను నిర్మించడం ఇంకా ముఖ్యమైన బాధ్యత. అభివృద్ధి చెందిన దేశాల్లో విద్యుత్ రంగం ‘జీరో ఫెటాలిటీ విజన్’ అనే సిద్ధాంతాన్ని అనుసరిస్తోంది. అంటే, విద్యుత్ ప్రమాదాల వల్ల ఒక్క మరణం కూడా సంభవించకూడదనే లక్ష్యంతో వ్యవస్థలు రూపు దిద్దుకుంటున్నాయి. మన దేశంలో కూడా ఇదే లక్ష్యం కావాలి.తీసుకోవలసిన భద్రతా చర్యలుప్రతి విద్యుత్ ప్రమాదాన్ని ‘అనివార్యమైన ప్రమాదం’గా కాకుండా, ‘నివారించగలిగిన వ్యవస్థ వైఫల్యం’గా పరిగణించే దృక్పథం ఏర్పడాలి. తెగిపోయిన 11 కేవీ లేదా 33 కేవీ విద్యుత్ లైన్ నేలపై పడిన క్షణంలోనే సంబంధిత రక్షణ వ్యవస్థ స్పందించి ఫీడర్‌ను ట్రిప్ చేయాలి. అది జరగకపోతే ఆ రక్షణ వ్యవస్థ ఎందుకు పనిచేయలేదో విచారణ జరగాలి. రక్షణ పరికరాల లోపమా? నిర్వ హణ నిర్లక్ష్యమా? పరీక్షలు సకాలంలో జరగలేదా? లేక పర్యవేక్షణలో వైఫల్యమా? ఈ ప్రశ్నలకు సమాధానం దొరికినప్పుడే తదుపరి ప్రమాదాన్ని నివారించగలం.ఇక మరో ముఖ్యమైన అంశం – విద్యుత్ ప్రమాదాలను కేవలం ఉద్యోగుల సమస్యగా చూడరాదు. వీటిలో పెద్ద సంఖ్యలో సాధారణ ప్రజలు, రైతులు, చిన్నారులు కూడా బలవుతున్నారు. తెగిపడిన తీగలను తాకడం, ట్రా¯Œ ్సఫార్మర్ల సమీపంలో నిర్లక్ష్యంగా తిరగడం, చెట్ల కొమ్మలు విద్యుత్ తీగలకు తగిలినా పట్టించుకోకపోవడం, అక్రమ విద్యుత్ కనెక్షన్లు తీసుకోవడం వంటి కారణాలు కూడా ప్రమాదాలకు దారితీస్తున్నాయి.ఒక ఆధునిక విద్యుత్ వ్యవస్థలో మూడు రక్షణ వలయాలు ఉండాలి – నాణ్యమైన ఇంజినీరింగ్ రూపకల్పన, సమర్థవంతమైన రక్షణ వ్యవస్థలు, కఠినమైన భద్రతా సంస్కృతి. ఈ మూడూ బలంగా ఉన్నప్పుడే విద్యుత్ ప్రమాదాలు గణనీయంగా తగ్గుతాయి. వీటిలో ఏ ఒక్కటి బలహీనపడినా, దాని మూల్యం ఒక అమాయ కుడి ప్రాణంగా మారుతుంది.ప్రతి విద్యుత్ ప్రమాదం తర్వాత ఒకే ప్రశ్న మనకు మనం వేసుకోవాలి – ‘ఈ ప్రమాదం నిజంగా తప్పించలేనిదేనా?’ నిజా యితీగా సమాధానం వెతికితే, చాలా సందర్భాల్లో జవాబు ‘కాదు’ అనే వస్తుంది. అప్పుడు మనం అంగీకరించాల్సిన సత్యం ఒక్కటే– ప్రాణాలను కోల్పోయిన వారు విద్యుత్ వల్ల కాదు; భద్రతా వ్యవస్థ లోని లోపాల వల్ల మరణించారు అని. ఈ సత్యాన్ని అంగీకరించిన రోజే విద్యుత్ రంగంలో నిజమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టి నట్లవుతుంది.– తుల్జారాంసింగ్ ఠాకూర్, రిటైర్డ్ విద్యుత్ ఇంజినీర్ -
అతడో అస్తిత్వ స్వరం!
తెలుగు దళిత సాహిత్యంలో మాదిగ అస్తిత్వాన్ని స్వతంత్ర సాహిత్య వాదంగా ముందుకు తీసుకొచ్చిన రచయిత నాగప్పగారి సుంద ర్రాజు. దళిత, బహుజన ఉద్యమాల ధిక్కార స్వరాన్ని మాదిగ సాహిత్యం ద్వారా కొత్త ఎత్తుకు తీసుకెళ్లాడు. 1968 మే 31న కర్నూలు జిల్లా మొలగవెల్లి కొట్టాలలో జన్మించాడు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పులికంటి కృష్ణారెడ్డి దళిత కథలు, రాయలసీమ కథలపై పరిశోధన చేశాడు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశాడు. కేవలం 32 ఏళ్లకే 2000 జూలై 17న కన్ను మూశాడు. ఆ స్వల్ప జీవితకాలంలోనే తెలుగు దళిత సాహిత్యంపై చెరగని ముద్ర వేశాడు.సుందర్రాజు రచనలు మాదిగ సమాజ జీవన వాస్తవాలను, కులవివక్షను, భూస్వామ్య దోపిడీని, జోగిని వ్యవస్థ వంటి అమానవీయ ఆచారాలను వాస్తవిక దృక్పథంతో చిత్రించాయి. ఛండాల చాటింపు, మాదిగోడు, మాదిగ చైతన్యం, మా ఊరి మైసమ్మ వంటి రచనలు మాదిగల ఆత్మగౌరవ పోరాటానికి సాహిత్య రూపాలుగా నిలిచాయి. తెలుగులో తొలి మాదిగ కవుల సంకలనం ‘మాదిగ చెతన్యం’. సెంట్రల్ యూనివర్సిటీలో ‘మాదిగ సాహిత్య వేదిక’ను స్థాపించి, మాదిగ సాహిత్యానికి ప్రత్యేక అస్తిత్వాన్ని కల్పించేందుకు ఆయన చేసిన కృషి తెలుగు దళిత సాహిత్య చరిత్రలో ఒక సంచలనానికి కారణమయ్యింది.మాండలికం ద్వారా కూడా ఒక సామాజిక చరిత్రను అస్తిత్వ వ్యక్తీకరణగా మలచడం ఎలాగో ఆయన కథా శిల్పంలోని ప్రధాన విశిష్టత. ఈ కారణంగానే ఆయన రచనలు రాయలసీమ మాండలిక సాహిత్యానికి కొత్త దిశను నిర్దేశించి నవిగా గుర్తింపుపొందాయి. ఆచార్య రాచపాళెం చంద్రశేఖర రెడ్డి, బండి నారాయణస్వామి వంటి సాహితీవేత్తల ప్రశంసలు పొందాయి.నాగప్పగారి సుందర్రాజు సాహిత్యం కేవలం సృజనాత్మక రచన మాత్రమే కాదు; అది అణగారిన వర్గాల ఆత్మగౌరవానికి ప్రతిధ్వనిగా, సామాజిక న్యాయానికి సాహిత్య ప్రకటనగా, అన్యాయంపై ధిక్కార స్వరంగా వినిపిస్తుంది. అర్ధశతాబ్దం కూడా భౌతికంగా జీవించలేకపోయినా అనేక శతాబ్దాల దళిత జీవితాల బాధలను, గాథలను సాహిత్యీకరించి తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయాడు. ఆయన రచనలు దళిత సాహిత్య అధ్యయనానికి, సామాజిక చైతన్యానికి స్ఫూర్తిదాయకమైన మార్గదర్శకాలుగా నిలిచాయి.– డా. దార్ల వెంకటేశ్వరరావు, ప్రొఫెసర్, తెలుగు శాఖ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (రేపు నాగప్పగారి సుందర్రాజు వర్ధంతి) -
సమాజంలో ఏ గొడవలతోనూ పని లేకుండా..
సమాజంలో ఏ గొడవలతోనూ పని లేకుండా మంచి ప్రవర్తనతో, దైవచింతనతో జీవితం గడపాలనుకొనేవారు శుద్ధమైన ఆహారమే తీసుకోవాలి. ప్రేమ, దయ, దాక్షిణ్యం, కోపం లేకుండటం, ఉపకార బుద్ధి, ఇతరుల సుఖదుఃఖాలను తనవిగా భావించే గుణం వంటి గుణాలన్నీ సాత్త్విక గుణాలు. ఇవి శుద్ధమైన ఆహారం తీసుకోవటం వల్లనే కలుగుతాయి. దేశ కాల ప్రాంతాలకు అనుకూలంగా భోజనం చేయాలని శాస్త్ర వచనం.భీష్మాచార్యులవారు అస్త్ర సన్యాసం చేసి అంపశయ్యమీద పడుకొన్నాడు. వైకుంఠ గమనానికి వేచి ఉన్నాడు. ఆయన చేసిన బోధలను పాండవులందరూ శ్రద్ధగా విన్నారు. ఆ సమయంలో దూరం నుండి వింటున్న ద్రౌపదీ దేవి నవ్వింది. తన మాటలు విని నవ్వినందుకు భీష్ముని మనస్సు బాధపడింది. కారణం తెలియగోరాడు. ద్రౌపది వినయంగా విన్నవించింది. ‘అయ్యా! మీరు మాకెప్పడూ ధర్మ ప్రబోధం చేయవలసినవారే. ఇప్పుడు నా నవ్వుకు కారణం మాత్రం వేరే ఉంది. మరేమీ లేదు. ఆనాడు నిండు కౌరవసభలో అందరూ చూస్తుండగా దుశ్శాసనుడు నాకు వస్త్రాపహరణం చేశాడు. అప్పుడా సభలో మీరు కూడా ఉన్నారు. కాని ఇది అకృత్యమని మీరెవరికీ బుద్ధి చెప్పలేదు. పోనీ ఆ దుష్కృత్యాన్ని చూడలేక అక్కడ నుండి లేచి బయటకు వెళ్ళనూ లేదు. అదీ కాకపోతే రెండు కళ్ళు మూసుకొనవచ్చు కదా! అదీ చేయలేదు మీరు. అలాంటి మీకిప్పుడు ఈ ధర్మప్రబోధం చేయాలనే బుద్ధి యెలా పొడమింది? అని సందేహం కలిగి నవ్వాను’.‘అమ్మా! ద్రౌపదీదేవీ! నీకు సందేహం రావలసినదే తల్లీ! నిన్న మొన్నటివరకు నేను కౌరవుల పక్షంలోనే ఉన్నాను కదా! వారి ఉప్పు తిన్నవాడనయ్యాను. వారి ఆహార ప్రభావం వల్ల వాళ్ళ మాటలే చెవికెక్కాయి. నేను గాంగేయుడను. తిరిగి నా తల్లి గంగతోనే పవిత్రుడను కావాలి. అందుకని ఇప్పుడు అర్జునుడు తన బాణంతో పాతాళం నుంచి పరమ పవిత్రమైన గంగాజలాన్ని పైకి తెప్పించాడు. దాని ప్రభావంతో లోగడ కోల్పోయిన సాత్త్విక భావన తిరిగి వచ్చింది తల్లీ!’ అని చెప్పాడు. ‘ఆహార శుద్ధౌ సత్త్వ శుద్ధిః సత్త్వ శుద్ధౌ ధ్రువామతిః’- శ్రీ గణపతి సచ్చిదానందస్వామి -
చెరువు గట్టుకు చేరనున్న భరోసా
పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరాన్ని దేశ ఆక్వా రాజధానిగా నిలబెట్టాడు రైతు. ఆ ‘తెల్లబంగారం’ డాలర్ల వర్షం కురిపించిన రోజులూ ఉన్నాయిగానీ నేడు అదే చెరువు గట్లపై నిలబడి రైతు ఏంచేయాలో పాలుపోని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. మే నెలలో పాలకొల్లు–భీమవరం రహదారిపై, రెక్కలు ముక్కలు చేసుకుని పండించిన రొయ్యలను కుప్పలుగా పారబోసి రైతులు ఆక్రోశించిన దృశ్యం, ఈ రంగం ఎంతటి సంక్షోభంలో కూరుకుపోయిందో ప్రపంచానికి చెప్పకనే చెప్పింది.ఇది ఏదో ఒక జిల్లాకు పరిమితమైన కథ కాదు. రాష్ట్రవ్యాప్తంగా 5.74 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతోంది. లక్షలాది కుటుంబాలు ఆక్వా రంగంపై బతుకుతున్నాయి. కేవలం పదిహేను రోజుల వ్యవధిలో 100 కౌంట్ రొయ్య ధర రూ. 270 నుంచి రూ. 215కు కుప్పకూలింది. 100 కౌంట్ రొయ్య పండించేందుకు రూ. 270 వరకు ఖర్చవుతుండగా, మార్కెట్లో దక్కుతున్నది రూ. 220–240 మాత్రమే. యాభై దాకా ఉన్న ఎగుమతి కంపెనీలు ఏకపక్షంగా ధరలు నిర్ణయించి, ‘100 కౌంట్‌కు రూ. 230, 40 కౌంట్‌కు రూ. 330, 30 కౌంట్‌కు రూ. 430, నెలాఖరు వరకు ఇవే రేట్లు’ అని ప్రక టించే స్థాయికి పరిస్థితి దిగజారిందంటే, మార్కెట్లో రైతుకు మిగిలే మాటే లేదని అర్థం.మేత, సీడ్, ప్రాసెసింగ్ సంస్థలన్నీ ఒక్కటై సిండికేట్‌గా వ్యవహ రిస్తూ పంట చేతికొచ్చే వేళకే కొనుగోలు ధర దించుతున్నాయనీ, వాటిలో అధిక భాగం అధికార పెద్దల అనుకూలుర చేతుల్లోనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో పంటను కాపాడుకునేందుకు రైతు అధిక వడ్డీ అప్పుల ఊబిలో దిగబడుతున్నాడు.నీటిమూటలైన హామీలు ఎన్నికల ముందు ‘ఆక్వా జోన్ తో నిమిత్తం లేకుండా రైతులందరికీ యూనిట్ రూ. 1.50కే విద్యుత్’ అని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం, అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా ఆ దిశగా పైసా విడుదల చేయలేదు. ‘హామీని అమలుపర్చలేదు సరికదా సబ్సిడీపై ఇస్తామన్న ట్రాన్ ్సఫార్మర్లు, పరికరాలు కూడా ఇవ్వలేదు’ అని రైతులు వాపోతున్నారు. జీవో 169లోని పవర్ ఫ్యాక్టర్ నిబంధన (క్లాజ్ 4) పారిశ్రామిక ప్రమాణాలు పాటించలేని వేలాది సన్న, చిన్నకారు ఆక్వా రైతులకు గుదిబండగా మారింది. హేచరీలకు నాణ్యమైన విద్యుత్ కావాలంటూ 2024 నవంబర్లోనే భీమవరం వేదికగా విద్యుత్ శాఖ మంత్రి ఎదుట రైతులు మొరపెట్టుకున్నారు. ‘త్వరలోనే కచ్చితమైన నిర్ణయం’ అని మంత్రి హామీ ఇచ్చి పంతొ మ్మిది నెలలు గడుస్తున్నా క్షేత్రస్థాయిలో మారిందేమీ లేదు.ఈ నేపథ్యంలోనే గత నెల 16న ‘ఏపీ ప్రాన్ ఫెడరేషన్’ ప్రతినిధులు, మాజీ అగ్రికల్చర్ కమిషన్ వైస్ చైర్మన్, ఆక్వా రైతులు తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్య మంత్రి వైఎస్ జగన్ ను కలిశారు. పెరిగిన మేత ధరలు, పడిపోయిన రొయ్య ధరలు, పెరిగిన పెట్టుబడి వ్యయం, నిలిచిపోయిన రాయి తీల వ్యథను ఆయనకు వివరించారు. ఫలితంగా జూలై 15న జగన్ ఆక్వా రైతులకు అండగా భీమవరం బాట పడుతున్నారు. ఇది మామూలు రాజకీయ పర్యటన కాదు. చెరువు గట్ల మీదకే వెళ్లి రైతు కష్టాన్ని కళ్లారా చూడటం, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిలదీయడం, కుంగిన గుండెల్లో భరోసా నింపడం: ఈ మూడూ ఆ పర్యటన లక్ష్యాలు. ప్రజా సంకల్ప పాదయాత్రలో పశ్చిమ గోదావరి గడ్డపైనే ఆక్వా రైతుకు రూ. 1.50 విద్యుత్ మాట ఇచ్చి, అధికారంలోకి రాగానే అక్షరాలా అమలు చేసి చూపిన నేత ఆయన. అందుకే ఆయన రాక అంటే ఆక్వా సీమకు అది కేవలం సానుభూతి పలకరింపు కాదు, అనుభవం రుజువు చేసిన భరోసా.– డా. కొత్తపల్లి శ్రీనివాస వర్మ, సీనియర్ జర్నలిస్ట్ -
వైద్యుల భద్రతే ఆరోగ్య భద్రత
మహారాష్ట్రలోని ఒక ఆసుపత్రిలో వైద్యులు, నర్సులపై స్థానిక కార్పొరేటర్ దాడి చేశాడనే వార్తలొచ్చాయి. అరెస్టు చేయబోతున్నారని తెలియగానే, ఆ కార్పొరేటర్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాడని సమాచారం. తాను దాడి చేసిన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ నుంచే తనకు వైద్యం అందాలని ఆయన ఏ సంకోచం లేకుండా ఆశించడం హాస్యాస్పద విషాదం.ఇదే సంఘటన సింగపూర్‌లో జరిగితే పరిస్థితి వేరేలా ఉండేది. ‘ఆరోగ్య సంరక్షణ రంగంలో దాడులు, వేధింపుల నివారణకు త్రైపాక్షిక విధానం’ అక్కడ అమలవుతోంది. దాడి చేసిన వ్యక్తికి (అత్యవసరం కాని) చికిత్సను నిరాకరించడంతో పాటు, మెడికల్ రికార్డులలో ‘దురుసుగా ప్రవర్తించే వ్యక్తి’గా శాశ్వతంగా ముద్రించే అవకాశం ఉంది. వైద్యులపై హింసకు అక్కడ జీవితకాల పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.భారతదేశంలో ఆరోగ్య సంరక్షకులపై హింస సాధారణమై పోయింది. వైద్యులు, నర్సులు ఇప్పటికే సుదీర్ఘ పనివేళలు, మాన సిక ఒత్తిడి, వసతుల కొరతతో సతమత మవు తుండగా... ఇప్పుడు బెదిరింపులు, భౌతిక దాడుల భయం పెరుగుతున్నాయి. ‘ఫ్రాంటియర్స్ ఇన్ పబ్లిక్ హెల్త్’లో ప్రచురి తమైన ఉత్తరాఖండ్ అధ్యయనం వివరాల ప్రకారం, 75% మంది వైద్యులు ప్రతీకార దాడులు ఎదుర్కొన్నారు. ఇందులో 68% దాడులు రోగుల బంధు వులు చేస్తే, కేవలం 18% కేసులు మాత్రమే పోలీసుల దృష్టికి వెళ్లాయి. సఫ్దర్ జంగ్ వంటి ఢిల్లీ ప్రభుత్వ ఆసుపత్రుల నెట్‌వర్క్‌లలో జరిగిన ఆడిట్ ప్రకారం అధిక ఒత్తిడి షిఫ్ట్‌లలో హింస రేటు 63.6%గా ఉంది. పరిస్థితి ఇలాగే కొనసా గితే వైద్య శాస్త్రాన్ని అభ్యసించడానికి ప్రతిభావంతులైన విద్యార్థులు ముందు కురారు. ఫలితంగా దేశంలో వైద్య నిపుణుల కొరత ఏర్పడే ప్రమాదం ఉంది.ఆరోగ్య సంరక్షణ సిబ్బందిపై హింసను, ఆసుపత్రులకు నష్టం కలిగించ డాన్ని నిషేధిస్తూ అనేక రాష్ట్రాలు చట్టాలను రూపొందించాయి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ‘హెల్త్‌కేర్ సర్వీసెస్ పర్సనల్ అండ్ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ (ప్రొహిబిషన్ ఆఫ్ వయొలెన్స్ అండ్ డామేజ్ టు ప్రాపర్టీ) బిల్లు’ ముసాయిదాను 2019లో రూపొందించింది. అయితే అది చట్టంగా మారలేదు. కోవిడ్–19 మహమ్మారి సమయంలో, ‘అంటు (ఎపిడమిక్) వ్యాధుల చట్టాన్ని’ సవరించి, వైద్య సిబ్బందిపై హింసకు పాల్పడటాన్ని నాన్– బెయిలబుల్ నేరంగా పరిగణించి, ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించేలా 2020లో చట్టం తీసుకువచ్చినా ఆశించిన స్థాయిలో ప్రభావం కనిపించడం లేదు. వైద్యుల భద్రత – జాతీయ ఆరోగ్య భద్రతకు కీలకం. వైద్యులను గౌరవించడం అంటే – ఆరోగ్య సంరక్షణ పొందే పౌరుల రాజ్యాంగ హక్కును కాపాడటమే.– శ్రీనివాస్ మాధవ్, సామాజిక కార్యకర్త -
నాటి వైభవం ఎందుకు సాధ్యం కాదు?
ఆమధ్య ఓ సాయంత్రం పురానాపూల్ మీద నిలబడినప్పుడు కింద మురికి నీటిలో ప్లాస్టిక్ కవర్లు, జంతు కళేబరాలు తేలుతూ కనిపించాయి. దుర్గంధం వెదజల్లుతోంది. నాలుగు శతాబ్దాల క్రితం ఇదే బ్రిడ్జి మీద నుండి కుతుబ్ షాహీలు నది అందాలను చూసి మైమరచి పోయారన్న చరిత్ర గుర్తుకు వస్తే మనసు వికలమవుతుంది.1578లో కుతుబ్ షాహీల కాలంలో ఈ పురానాపూల్ నిర్మాణం జరిగింది. గోల్కొండ కోటకు, మూసీకి ఆవల ఉన్న ప్రాంతానికి మధ్య రాకపోకలు సాగించే ఆలోచనతో పురుడుపోసుకుంది. ఇరవై ఆరు రాతి కమానులతో నిర్మితమైన ఈ వంతెనను ‘బ్రిడ్జ్ ఆఫ్ లవ్’గా ఫ్రెంచ్ యాత్రికుడు టావెర్నియర్ వర్ణించాడని ప్రతీతి. 17వ శతాబ్దంలో హైదరాబాద్‌ను సందర్శించిన విదేశీ యాత్రికులు మూసీ నది ఒడ్డున ఉన్న తోటలు, భవనాలు చూపరులను కట్టిపడేస్తాయని వర్ణించారు. ప్రజలు ఈ నీటినే మంచినీరుగా వాడుకునేవారు.కానీ ఇదే మూసీ 1908లో భారీ వరదలతో విలయాన్ని చూపించింది. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక వందల ఇళ్లు నేలమట్టమయ్యాయి. నదిని నిర్లక్ష్యం చేస్తే అది తన ప్రకోపాన్ని చూపిస్తుందని అది హెచ్చరించిన గుణపాఠాన్ని పట్టించుకోకపోతే ఎలా? స్థానికుల కథనం–శాటిలైట్ చిత్రాల విశ్లేషణ వల్ల తేలిందేమంటే... గత మూడు దశాబ్దాల్లో పురానాపూల్ దగ్గర మూసీ నది సహజంగా ఉన్న వెడల్పు చాలా వరకు తగ్గిపోయిందని! అంటే నదిని మనం మింగేశామన్న మాట! హైదరాబాద్‌లో ఉత్పత్తి అయ్యే మురుగునీటి మొత్తంలో ఎక్కువ శాతం శుద్ధి కాకుండానే నేరుగా మూసీలో కలుస్తోంది. వర్షం పడగానే వ్యర్థాలన్నీ బ్రిడ్జి పిల్లర్లకు తట్టు కుని ప్రవాహం ఆగిపోయేలా చేస్తున్నాయి. ఫలితంగా దిగువన ఉన్న చాదర్‌ఘాట్, మూసారాంబాగ్ లాంటి లోతట్టు ప్రాంతాలు కూడా చిన్న వర్షానికే నీట మునిగిపోతున్నాయి.ప్రస్తుతం మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నదికి ఇరువైపులా ఫెన్సింగ్ వేస్తోంది. ఆక్రమణలు ఆపడం, చెత్త వేయకుండా చూడటం దీని ఉద్దేశ్యం కావచ్చు. కానీ నదిని ప్రజలకు దూరం చేసినట్లు అవుతుంది. 1950ల్లో లండన్‌లో థేమ్స్ నదిని ‘జీవ శాస్త్రపరంగా మృత నది’గా ప్రకటించారు. కానీ బ్రిటిష్ ప్రభుత్వం ప్రజల భాగస్వామ్యంతో దాన్ని పునరుజ్జీవింపచేసింది. ఫలితంగా ఇటీవల కాలంలో థేమ్స్ నదిలో సీల్స్, డాల్ఫిన్లు కనిపిస్తున్నాయి. ఇప్పుడు నది ఒడ్డున రెస్టారెంట్లు, వాకింగ్ ట్రాక్‌లు, టూరిస్ట్ బోట్ లతో బిలియన్ల పౌండ్ల ఆర్థిక వ్యవస్థ నడుస్తోంది. అహ్మదాబాద్‌లో సబర్మతి రివర్‌ఫ్రంట్ కూడా ఇదే మోడల్. మరి చరిత్ర నేర్పిన పాఠాల నుండి మనమేం నేర్చుకుంటున్నాం?స్మార్ట్‌గా ఆలోచించాలి!మూసీని బతికించాలంటే మనకు కావాల్సింది కేవలం కాంక్రీట్ కాదు, ‘స్మార్ట్ సైన్స్’. ముందుగా డ్రోన్లు, ఉపగ్రహాలతో మూసీ నదికి 1:1000 స్కేల్లో త్రీ డీ మ్యాప్ తయారు చేయాలి. ఎక్కడ ఆక్రమణ ఉంది, ఎక్కడ నాలా కలుస్తుంది, ఎక్కడ నీరు నిల్వ ఉంది అనేది ప్రతి మీటర్ లెక్క తేలాలి. పురానాపూల్, చాదర్‌ఘాట్, నాగోల్ వంటి కీలక పాయింట్ల దగ్గర నీటి నాణ్యతను, నీటి మట్టాన్ని 24 గంటలూ కొలిచే ఐఓటీ (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) సెన్సార్లు పెట్టాలి. ఏ నాలా నుండి కాలుష్యం వస్తోందో వెంటనే తెలిసిపోతుంది. పర్యాటక అవకాశం, జనసాంద్రత, కాలుష్య స్థాయి, వరద ముప్పు వంటి అంశాలను తీసుకుని, ప్రాధాన్యతా పట్టిక ప్రకారం నిధులు ఖర్చు పెడితే ప్రతి రూపాయి సద్వినియోగం అవుతుంది. పురానాపూల్‌ను కేవలం బ్రిడ్జిలా కాకుండా ‘సాంస్కృతిక వ్యాఖ్యాన కేంద్రం’గా మార్చాలి. నాలుగు శతాబ్దాల క్రితం కుతుబ్ షాహీలు చూసిన అందమైన మూసీని మన పిల్లలకు చూపించే బాధ్యత మనదే! – డా. రామకృష్ణ మనిమద్దె, ఎర్త్ సైంటిస్ట్, నదీ వ్యవస్థల పరిశోధకులు -
అనుగ్రహం అవసరం!
సురాసురులు కలిసి కష్టించి, ఎన్నెన్నో మహత్తరమైన అవరోధాలనూ, విఘ్నాలనూ అధిగమించి, ఎట్టకేలకు అమృతం సాధించారు. ధన్వంతరి అందించిన అమృత కలశాన్ని తటాలున అందుకొని, అసురులు అన్యాయంగా స్వాధీనం చేసుకొన్నారు. అప్పటికప్పుడు శ్రీహరి మోహినీ అవతారాన్ని ఎత్తి, వాళ్ళను కామ మోహితులను చేశాడు. ఆ మోహంతో వాళ్ళు అందరికీ అమృతం పంచే బాధ్యతను ఆమెకు అప్పగించారు. ఆమె దాన్ని ఎలా పంచినా, తాము అడ్డుపడమని ఒప్పందం చేసుకొన్నారు.మోహిని అమృతాన్ని మొదట దేవతల పంక్తికి పంచటం పూర్తయేసరికి, పాత్ర ఖాళీ అయిపోయింది. ఆమె అంతర్ధానమై పోయింది. రాక్షసులకు ఏమీ మిగలలేదు. రాహువు అనే రాక్షసుడు మాత్రం, మారువేషంలో దేవతల పంక్తిలో చేరి, అమృతం పుచ్చుకొన్నాడు. సూర్యచంద్రులు ఇది గమనించి చెప్పగానే, సుదర్శన చక్రం రివ్వున వచ్చి, పుచ్చుకొన్న అమృతం నాలుక దాటకుండానే, రాహువు తలను నరికి వేసింది. అమృత ప్రభావం వల్ల అతడి తల సజీవంగా మిగిలిపోయింది. అమృత స్పర్శ లేని మొండెం పతనమై నశించింది. (అప్పటి నుంచి ‘రాహువు తల’ అనేది ప్రత్యేకంగా లేదు. రాహువు అంటేనే రాహువు తల. కాబట్టి ‘రాహు మస్తకం’ అని చెప్పనక్కర్లేదు. చెప్తే అది, ‘సీతా ఫలం పండు’, ‘పేపరు కాగితం’ అన్నట్టు పునరుక్తి అవుతుంది!)దేవాసురులు ఒకే పరిస్థితులలో, ఒకే ప్రదేశంలో, ఒకే సమయంలో, ఒకే సాధన సామగ్రితో, ఒకే విధమైన శ్రమను, ఒకే సంకల్పంతో చేశారు. కానీ వాళ్ళకు లభించిన ఫలంలో మాత్రం తేడాలు వచ్చాయి. ఏవం సురాసుర గణాః సమ దేశ, కాల,/ హేతు–అర్థ, కర్మ, మతయః–అపి, ఫలే వికల్పాః. ఎలాంటి తేడాలు? తత్ర అమృతం సురగణాః ఫలం–అంజనా–ఆపుః, నదైత్యాః – అక్కడ సురగణాలు అమృతం అనే ఫలాన్ని సులభంగా పొందారు, దైత్యులు పొందలేదు. కారణమేమిటి? పాద పంకజ రజ–ఆశ్రయాత్– శ్రీహరి పదకమలాల ధూళిని (దేవతలు) ఆశ్ర యించి, సేవించటం వల్ల. హరి విముఖులు కనక అసురుల శ్రమ నిష్ఫలమైంది. శ్రమకు దైవానుగ్రహం తోడయి తేనే ఫల ప్రాప్తి ఉంటుంది, అంటుంది భాగవతం.– ఎం.మారుతి శాస్త్రి -
ఆచార్యులలో మేటి!
తెలుగు భాషా సాహిత్యాలతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసు ఆచార్య జి.ఎన్. రెడ్డి. ఆయన చిత్తూరు జిల్లాలోని ‘మహా సముద్రం’లో పుట్టారు. తెలుగు ఆచార్యులకు ఏనాడూ రాని వైస్– ఛాన్స్లర్ పదవి ఆయనతో 1984లో మొదలయ్యింది. శ్రీ వేంకటే శ్వర విశ్వ విద్యాలయానికి వైస్–ఛాన్స్‌లర్‌గా బోధన, బోధనేతర సిబ్బంది నియామకాల్లో ఆయన నిష్పక్షపాతంగా వ్యవహరించి అందరి మన్ననలను అందుకొన్నారు.ఆయన గొప్ప నిఘంటుకారుడు. నిఘంటు నిర్మాణంతో పాటు నామ విజ్ఞానం, భాషా సాహి త్యాలలో అందెవేసిన చేయి. తెలుగు–తెలుగు నిఘంటువులు, ఇంగ్లీష్–తెలుగు ద్విభాషా నిఘంటువు, కుమ్మరం, వడ్రంగం మాండలిక వృత్తి పద కోశాలు, తెలుగు పర్యాయ పద నిఘంటువులు ఆయనకు ఎంతో పేరు తెచ్చి పెట్టాయి. మహాభారతం శల్య సౌప్తిక స్త్రీ పర్వాలకు రచించిన పీఠిక, భగవద్గీతకు రాసిన పీఠిక, బ్రౌన్ గ్రంథాలకు రచించిన పీఠికలు ఎంతో విశ్లేషణాత్మకమైనవి.వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో బంగోరె సహకారంతో సి.పి.బ్రౌన్ ప్రాజెక్టును చేపట్టారు. తద్వారా బ్రౌనుకు సంబంధించిన స్వీయ సాహితీ జీవిత చరిత్రల మీద అనేక పుస్తకాలను వెలుగులోకి తెచ్చారు. వాటిలో బ్రౌన్ లేఖలు, బ్రౌన్ కడప జాబులు, ఆంధ్ర గీర్వాణ ఛందము వంటి అమూల్యమైన గ్రంథాలు ఉన్నాయి. అలాగే జి.ఎన్. రెడ్డి భాషా విజ్ఞాన పరిచయం, ద్రావిడ భాషా విజ్ఞా్ఞనం, తన జీవిత చరిత్ర అయిన ‘జి.ఎన్. రెడ్డి జీవితరేఖలు’ కూడా రాశారు. జానపదులు చెప్పుకొనే పొడుపు కథలను సేకరించి ‘పొదుపు కథలు’ అనే గ్రంథాన్ని కూడా ప్రచురించారు.1962–64 మధ్య అమెరికాలోని విస్కాన్సిన్ విశ్వవిద్యాలయంలో లెక్చ రర్‌గా పని చేసి అక్కడి విద్యార్థుల కోసం కూడా వాచకాలను రాశారు. చికాగో యూనివర్సిటీలో కూడా లింగ్విస్టిక్స్ పాఠాలు బోధించారు. కల్చరల్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రావ్‌ు కింద 1974లో బల్గేరియా, 1981లో మలేషియా, 1983లో బ్రిటన్ వంటి ఎన్నో దేశాల్లో పర్యటించారు. బ్రిటన్ గ్రంథాలయంలోని అరుదైన పుస్త కాలను మెక్రో ఫిల్మ్‌ల ద్వారా ఎస్వీయూ తెలుగు అధ్యయన శాఖకు అందించారు. ఆయన విస్కాన్సిన్ యూనివర్సిటీలో పని చేసేటప్పుడు చేకూరి రామా రావు, భద్రిరాజు కృష్ణమూర్తి లాంటి ఉద్దండ భాషావేత్తలతో కలిసి ఒకే ఇంటిలో ఉండేవారు. ప్రసిద్ధ భాషావేత్త గెరాల్డ్ కెల్లీతో కూడా స్నేహం చేశారు. తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవ చేసిన ఆయన సాహితీ చరిత్రలో చిరకాలం నిలిచిపోతారు.– ఆచార్య పేట శ్రీనివాసులు రెడ్డి, ఫౌండర్ డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ (నేడు ఆచార్య జి.ఎన్. రెడ్డి వర్ధంతి) -
సజ్జనుడు – దుర్జనుడు
జీవశాస్త్రం ఆధారంగా ఒక ఆసక్తికరమైన పోలికతో ఆరిషడ్వర్గాలను వ్యాఖ్యానించవచ్చు. అరిషడ్వర్గాలు దుష్టుడికి ‘ప్రొటో– ఆంకోజీన్స్’ లాంటివి. మొదట సాహచర్యం చేస్తాయి, తర్వాత మార్పుచెంది అజమాయిషీ చేయడం మొదలుపెడతాయి. చివరకు ప్రాణాధారంగా మారతాయి.ఆరోగ్యకరమైన కణంలో ‘ప్రొటో–ఆంకోజీన్స్’ అనేవి కణ విభజనను నియంత్రించే ప్రొటీన్లను తయారుచేసే జన్యువులు. కొన్ని సంకేతాలు అందుకున్నప్పుడు ఈ జన్యువులు క్రియాశీలమై, ఆ ప్రొటీన్లను ఉత్పత్తి చేసి కణాన్ని విభజనకు ప్రేరేపిస్తాయి. పని పూర్తయ్యాక మళ్ళీ నిష్క్రియగా మారతాయి. ఈ జన్యువులు ప్రతి కణంలోనూ ఉంటాయి.కామ–క్రోధ–లోభాది ఆరు మనిషి సహజ ప్రవృత్తులు (షడ్వర్గాలు) కూడా అంతే. ఇవి సజ్జనులలోనూ, దుర్జనులలోనూ ఉంటాయి. అవి శ్రుతిమించినప్పుడే సమస్య. ఆరోగ్యకరమైనకణంలో ప్రొటో– ఆంకోజీన్ ఎలా అవసరమైనప్పుడు నియంత్రణ మేరకు పనిచేసి, ఆ తర్వాత మౌనం వహిస్తుందో... అలాగే సజ్జను లలో షడ్వర్గాలు నియంత్రణకు లోబడి ఉంటాయి. నియంత్రణ తప్పినప్పుడు మాత్రమే చెడు మార్పు మొదలవుతుంది.నియంత్రణ తప్పడమే మ్యుటేషన్ ఈ నియంత్రణ తప్పడాన్నే జీవశాస్త్రంలో మ్యుటేషన్‌గా వ్యవహరిస్తారు. ప్రొటో–ఆంకోజీన్ మ్యుటేషన్ చెందినప్పుడు రూపాంతరం చెంది ఆంకోజీన్గా మారుతుంది. ఇది కేవలం పేరు మార్పు మాత్రమే కాదు, జన్యువు పనిచేసే స్థితిలో (ఫంక్షనల్ స్టేటస్)లో కలిగే నిజమైన మార్పు కూడా. దాని పర్యవసానంగా కణం మొత్తం గుర్తింపు (ఐడెంటిటీ) మారిపోతుంది. అంటే ఆరోగ్య కరమైన కణం, క్యాన్సర్ కణంగా మారుతుంది.షడ్వర్గాల విషయంలో కూడా సరిగ్గా ఇదే జరుగుతుంది. నియంత్రణ తప్పిన మనిషిలో, గుణాలు అరిషడ్వర్గాలుగా పరిణమిస్తాయి: షడ్వర్గ సహిత మనిషి సజ్జనుడు, అరిషడ్వర్గ సహిత మనిషి దుర్జనుడు! దుర్జనుడు ఈ అరిషడ్వర్గాల నియంత్రణలోనే నడుస్తాడు. వీటి ప్రేరణతోనే నిర్ణయాలు తీసుకుంటాడు. అవే అతనికి శక్తినిచ్చే ప్రేరకాలు. అంటే ఇప్పుడు అరిషడ్వర్గాలు యజమానులుగా మారా యన్నమాట!ఈ యజమానిత్వం కూడా ఒక మజిలీయే, గమ్యం కాదు. జీవశాస్త్రంలో దీనికి ‘ఆంకోజీన్ ఎడిక్షన్’ అనే పేరుంది. కణంలో అనేక ఇతర జన్యుపరమైన లోపాలు పోగుపడినా, ఆ కణం తన మనుగడ మొత్తాన్నీ ఒక్క మార్పు చెందిన (మ్యుటేటెడ్) ఆంకోజీన్ మీదే ఆధారపడేలా చేసుకుంటుంది. ఆ ఒక్క జన్యువుని నిరోధిస్తే చాలు, కణం మొత్తం నశిస్తుంది. దుష్టుడి స్థితి కూడా ఇదే. అరిషడ్వర్గాలే వాడికి శక్తినిచ్చి నడిపే జీవాధారాలుగా నిలుస్తాయి. వాటిని అదుపుచేస్తే సహజ స్థితిని పొంది సజ్జనుడు కాగలడు.ఆసక్తికరమైన విషయం ఏమంటే గుణాల మూలతత్త్వం ఒక్కటే. గుణం ఎప్పటికీ మారదు, దాని స్వరూపం స్థిరంగానే ఉంటుంది. మారేది దాని నియంత్రణ స్థితి మాత్రమే. ఈ స్థితి మారడం వల్లే మనిషి స్వరూపం మారిపోతుంది. ప్రోటో–ఆంకోజీన్... ఆంకోజీన్గా మారి కణాన్ని క్యాన్సర్ కణంగా మార్చి నట్టే, షడ్వర్గాలు అరిషడ్వర్గాలుగా మారి సజ్జనుడిని దుర్జనుడిగా మారుస్తాయి. మనిషి స్వభావాన్ని నియంత్రించే శక్తి ఏది అనేది ఒక తాత్త్విక ప్రశ్న. పురాణాలు, ఉపనిషత్తులలో చెప్పిన ఎన్నో విషయా లను ఆధ్యా త్మిక ధోరణిలోనే కాకుండా సామాజిక కోణంలోనూ, శాస్త్రీయ దృక్పథంతోనూ వ్యక్తిగత ఉన్నతికి ఉత్ప్రేరకాలుగానూ విశ్లేషించి ఆచరించే ప్రయత్నం చేస్తే వ్యక్తులు, సమాజం అభివృద్ధిపథంలో పయనించగలరు.- డా. కొవ్వలి గోపాలకృష్ణ, వ్యాసకర్త అమెరికాలో ఆంకాలజీ డ్రగ్ డెవలప్మెంట్ సైంటిస్ట్ -
సామాజిక ఇతిహాసం..
ఆధునిక తెలుగు పద్యకవిత్వంలో మల్లవరపు జాన్ విశిష్టమైన కవి. ధారాళమైన పద్య రచనా ప్రజ్ఞతో, సామా జిక చైతన్యంతో ఆయన ప్రజారంజకమైన ఖండ కావ్యా లను రచించి విమర్శకుల ప్రశంసలందుకున్నాడు. ‘దురాచార మెంతేని ఖండింప కలమునాయుధముగా మలుచు కొని’ సాంస్కృతిక సమరం చేశాడు. తెలుగుదేశ చారిత్రక, సాంస్కృతిక వైభవ, ప్రాభవాలను రమణీయంగా తన కవిత్వంలో చిత్రించడమే కాకుండా, తనకాలం నాటి సాంఘిక, రాజకీయ, ఆర్థిక అసమానతలను ధిక్కరించి, సమానత్వాన్ని ప్రబోధించిన మల్లవరపు జాన్ పద్యకవుల్లో ప్రజాకవి. జాన్ కవిత్వం మాధుర్యగుణ భరితమైనదని, శ్రీనాథుడు చెప్పిన హర చూడాహరిణాంక వక్రతలోని సౌందర్యం ఆయన పద్యాల్లో ఉందని (అతుకుల బ్రతు కులు – పీఠిక) దాశరథి విశ్లేషించాడు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని చీమ కుర్తి గ్రామంలో మల్లవరపు దావీదు – రత్నమ్మ దంపతులకు 1927 జనవరి 22న ఆయన జన్మించాడు. పేదరికం అనే కత్తుల వంతెన మీదనడిచి, కుల, మత వివక్షల నిప్పుల వానలో తడిసి, మొక్క వోని సంకల్పంతో కఠోర శ్రమతో ‘మధుర కవి’గా, దేశికోత్తముడిగా ప్రసిద్ధిగాంచాడు. ‘చెప్పులు కుట్టి జీవనము సేయు కుటుంబము నందు బుట్టి చిన్నప్పటినుండి శారద పదార్చన జేసితి’ అని ఆయన, తన నేపథ్యాన్ని చెప్పుకున్నాడు. విద్యాభ్యాసం అనంతరం ఉపాధ్యాయు డిగా స్థిరపడినా, ఆయనలో జ్ఞానతృష్ణ చల్లార లేదు.ఒంగోలులోని శఠగోపనాచార్యుని శిష్యరికంలో సంస్కృ తాంధ్ర భాషా సాహిత్యాలను, పంచకావ్యాలను అధ్య యనం చేశాడు. జాషువానంతర తెలుగు కవిత్వంలో ప్రామాణికమైన పద్య కవిగా ప్రఖ్యాతిగాంచిన జాన్ 2006 ఆVýæస్టు 12న కన్నుమూశాడు.సజ్జనాను రక్తి జాను సూక్తి వామపక్ష, విప్లవ పోరాటాల నుండి అస్తిత్వ ఉద్య మాల వరకు సాగిన సామాజిక, సాహిత్య ఉద్యమాల ప్రభావం జాన్ కవిత్వంలో స్పష్టంగా కనబడుతుంది. 1967లోనే తన స్వీయానుభవాలను అక్షరబద్ధం చేసి, ‘కొండడు’ శీర్షికతో లఘు కావ్యం వెలువరించాడు. క్రైస్తవ కథాంశ నేపథ్యంలో రాసిన ‘సాంసన్–డెలీల’ పద్య నాటకం ఎంతగానో పేరు తెచ్చింది. విశ్వప్రకాశం, కాంతి రేఖలు, భావ విపంచి, చిరస్మరణీయులు, సరసవినోదిని, పుణ్యపురుషుడు వంటి ఖండ కావ్యాలతో తెలుగు సాహి త్యంలో పద్యకవిగా సుస్థిర స్థానాన్ని సంపాదించు కున్నాడు. ‘సజ్జనానురక్తి జాను సూక్తి’ అనే మకుటంతో సూక్తి శతకం,‘భవ్యగుణవిచార బాలవీర!’ మకుటంతో రాసిన పద్యాల ద్వారా జీవనతాత్త్విక ఎరుకను, మూర్తి మత్వ స్ఫూర్తిని చాటి చెప్పాడు. ఆయన రాసిన చైతన్య గేయాలు, న్యాయం కావాలి, పంచముడు వంటి అముద్రితా లుగానే మిగిలిపోయాయి. అవిద్య, పేద రికం, మద్యపానం, అధిక జనాభా, కుటుంబ నియంత్రణ, అవినీతి, లంచ గొండితనం, దళిత జనోద్ధరణ, కుల నిర్మూలన, దేశభక్తి, విశ్వశాంతి లాంటి అంశాలపట్ల ప్రజల్లో సదావగా హన కల్పించడానికి జాన్ కృషి చేశాడు.మనుషులకు ‘చితులను పేర్చినది మతమా? రెటమతమా? కపటమతుల రచితమా’ అని మతోన్మాదాన్ని నిరసించాడు. ద్వేషజ్వాలలతో ‘కలుష వ్యాపార పారీణులై త్రోవల్ దప్పి’ మతకల్లోలాలు కల్పించే దురాత్ముల’ను దేశద్రోహులుగా దుయ్యబట్టాడు. చాలామంది పద్య కవుల్లో మృగ్యమైన మహిళాభ్యుదయ చింతన జాన్ పద్యాల్లో కనిపిస్తుంది.వివిధ విశ్వవిద్యాలయాల్లో జాన్ సాహిత్యంపై పరి శోధనలు జరిగాయి. జాన్ కావ్యాలు విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా ఉన్నాయి. ‘అభినవ బాణ’, ‘కవిభూషణ’ వంటి అరుదైన బిరుదులను కూడా ఆయన అందు కున్నాడు. అటువంటి జాన్ శత జయంతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి.– ఆచార్య కోయి కోటేశ్వరరావు, తెలుగు శాఖ అధ్యక్షులు, ప్రభుత్వ సిటీ కళాశాల, హైదరాబాద్ (మల్లవరపు జాన్ శతజయంతి సదస్సు నేడు ఒంగోలులో) -
ఇది చైనాకు సవాలా? భారత్‌కు అవకాశమా?
21వ శతాబ్దంలో ప్రపంచ రాజకీయాలను భూభాగాల కంటే సముద్రాలు, సరఫరా గొలుసులు (సప్లై చెయిన్స్), సెమీకండక్టర్లు, కృత్రిమ మేధస్సు, అరుదైన ఖనిజాలు వంటి వ్యూహాత్మక వనరులే ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో హిందూ మహా సముద్రం ప్రపంచ భౌగోళిక–రాజకీయాల్లో కేంద్ర స్థానాన్ని సంపాదించింది. ప్రపంచ చమురు రవాణాలో అధిక భాగం, ఆసియా–యూరప్ వాణిజ్యంలో కీలక సముద్ర మార్గాలు ఈ ప్రాంతం గుండా సాగుతాయి. అందుకే అమెరికా, చైనా, భారత్, జపాన్ వంటి దేశాలు ఈ ప్రాంతంలో తమ ప్రభావాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి.భారత్‌కు హిందూ మహాసముద్రంలో సహజమైన వ్యూహాత్మక ఆధిక్యం ఉంది. అయితే గత రెండు దశాబ్దాలుగా చైనా ‘స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్’ వ్యూహం ద్వారా పాకిస్తా¯Œ లో గ్వాదర్, శ్రీలంకలో హంబ¯Œ టోటా; జిబూతి, మయన్మార్ వంటి ప్రాంతాల్లో నౌకాశ్రయాలు, వ్యూహాత్మక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తూ తన ప్రభా వాన్ని విస్తరించింది. ఈ పరిస్థితుల్లో భారతదేశం, హిందూ మహా సముద్రంలోని సెషెల్స్, మారిషస్, మాల్దీవులు వంటి చిన్న ద్వీప దేశాలతో సముద్ర భద్రత, తీరరక్షణ, బ్లూ ఎకానమీ రంగాల్లో సహ కారాన్ని విస్తరిస్తోంది. ఇటీవల సెషెల్స్‌తో కుదిరిన ఒప్పందాలు కూడా ఈ వ్యూహంలో భాగమే. అదే సమయంలో జపాన్‌తో వ్యూహా త్మక సంబంధాలను మరింత బలోపేతం చేయడం ఆసియాలో కొత్త శక్తి సమీకరణాలకు దారితీస్తోంది.మనవైపు ఎందుకు చూస్తున్నట్లు?మారుతున్న భద్రతా పరిస్థితులు జపాన్నే రక్షణ వ్యయాన్ని పెంచుకునేలా చేశాయి. ఈ నేపథ్యంలో భారత్ సహజమైన ప్రజాస్వామ్య భాగస్వామిగా జపాన్‌కు కనిపిస్తోంది. ఇరుదేశాల భాగ స్వామ్య అసలు బలం పెట్టుబడుల్లో కాదు, సాంకేతిక పరిజ్ఞాన బదిలీలో ఉంది. సెమీకండక్టర్లు, రోబోటిక్స్, కృత్రిమ మేధస్సు, రక్షణ తయారీ, పరిశోధన, ఆవిష్కరణలలో భారత్–జపాన్‌లు కలిసి పనిచేస్తే ప్రపంచ సరఫరా గొలుసుల్లో చైనాపై ఆధారపడటాన్ని తగ్గించవచ్చు. ఇదే అంశం చైనాను ఆందోళనకు గురిచేస్తోంది. భారత్‌ను ఇప్పటివరకు పెద్ద వినియోగ మార్కెట్‌గా చూసిన చైనా, ఇప్పుడు అది ప్రత్యామ్నాయ తయారీ కేంద్రంగా ఎదిగే అవకాశాన్ని గమని స్తోంది. అందుకే సరిహద్దుల్లో ఒత్తిడిని కొనసాగిస్తూనే, భారత్ పూర్తిగా అమెరికా వ్యూహాత్మక వలయంలోకి వెళ్లకుండా నిరోధించే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు అమెరికా కూడా భారత్‌ను ఇండో–పసిఫిక్ వ్యూహంలో కీలక భాగస్వామిగా చూస్తోంది. అయితే అమెరికా తన జాతీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తుంది. అందుకే ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో అలీన విధానాన్ని అనుసరించిన భారత్, నేడు ‘మల్టీ–అలైన్మెంట్’ విధానంతో అమెరికా, జపాన్, యూరప్, రష్యా, గ్లోబల్ సౌత్ దేశాలతో సమతుల్య సంబంధాలను కొన సాగిస్తోంది. ఇదే భారత విదేశాంగ విధానం బలం. అయితే విదేశాంగ విధానానికి ఆర్థిక బలం కూడా తోడవ్వాలి. నీతి ఆయోగ్ సూచిస్తున్నట్లుగా, భారత్ కేవలం అసెంబ్లింగ్ కేంద్రంగా కాకుండా, పరిశోధన, ఆవిష్కరణ, అధునాతన తయారీ కేంద్రంగా ఎదగాలి. ఈ ప్రయాణంలో జపాన్ అత్యంత విశ్వసనీయ భాగస్వామి కావా లని ఆశించడంలో తప్పు లేదు.భారత్–జపాన్‌లను చైనా వ్యతిరేక కూటమిగా మాత్రమే చూడటం సబబు కాదు. ఇది ప్రజాస్వామ్య విలువలు, నియమాధా రిత అంతర్జాతీయ వ్యవస్థ, స్వేచ్ఛాయుత నౌకాయానం, సాంకేతిక సహకారం, ఆర్థిక భద్రతపై ఆధారపడిన వ్యూహాత్మక భాగస్వామ్యం. 2047 నాటికి ‘అభివృద్ధి చెందిన భారతదేశం’ లక్ష్యాన్ని సాధించాలంటే విదేశీ పెట్టుబడులు మాత్రమే సరిపోవు. సాంకేతిక పరిజ్ఞానం, సంయుక్త పరిశోధన, నైపుణ్యాభివృద్ధి, రక్షణ తయారీ, సముద్ర భద్రత, ప్రపంచ సరఫరా గొలుసుల్లో నాయకత్వం అవ సరం. ఈ లక్ష్యాలను సాధించడంలో జపాన్‌తో భాగస్వామ్యం భారతదేశానికి ఒక చారిత్రక అవకాశం.భారత్ ముందున్న అసలు సవాలు చైనా లేదా అమెరికా కాదు; తన జాతీయ ప్రయోజనాలను కాపాడుకుంటూ, వ్యూహాత్మక స్వతంత్రతను నిలబెట్టుకొని, ఆర్థిక–సాంకేతిక శక్తిగా ఎదగడం. అదే జరి గితే హిందూ మహాసముద్రంలో భారత్ ఒక ప్రాంతీయ శక్తిగానే కాదు, ప్రపంచస్థాయి ‘సంతులన శక్తి’గా అవతరిస్తుంది. అదే భారత్ – జపాన్ భాగస్వామ్యానికి నిజమైన విజయంగా చరిత్రలో నిలిచి పోతుంది.- సీహెచ్.వి. ప్రభాకర్ రావు, వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
నిష్కళంక నాయకుడు..
తన సొంత గ్రామం బ్రాహ్మణపల్లి సర్పంచిగా, భువనగిరి పంచాయతి సమితి అధ్యక్షునిగా, ఎమ్మెల్యేగా అట్టడుగునుంచి ఎదిగిన కొమ్మిడి నర్సింహారెడ్డి ఇవ్వాళ లేడు. కొంత కాలంగా అనారోగ్యంతో సతమతమవుతూ తన 83వ ఏట జూలై 7న ‘నిమ్స్’ ఆసుపత్రిలో కన్నుమూశారు. సొంత ఇల్లు కూడా లేని నర్సింహారెడ్డి దంపతులకు నిమ్సే ఒక ఇల్లయింది. స్నానానికని బాత్రూమ్లోకెళ్లి చన్నీళ్ల నల్లా ఇప్పు తున్నాననుకొని వేడినీళ్ల నల్లా ఇప్పితే... కాళ్ళు బొబ్బలెక్కి చివరి రోజుల్లో అవస్థపడ్డారు. ఊళ్ళో ఉన్న ఇల్లు (పెద్దల ద్వారా సంక్రమించింది) శిథిలం కాగా, హైదరాబాదు పెద్దకూతురు ఇంట్లో ఉండేవారు.ఒక చారిత్రక కుటుంబం నుంచి వచ్చినవారు నర్సింహా రెడ్డి. వారి అన్న కోదండ రాంరెడ్డి, తెలంగాణ సాయుధ పోరాటంలో భాగస్వామి. పోలీస్ స్టేషన్లో చంపబడ్డారు. కాంగ్రెస్ రాజకీయాలకు కొంతకాలంగా నర్సింహారెడ్డి దూరంగా ఉన్నా విద్యుచ్ఛక్తి సమస్యలపై భువనగిరిలో నిరాహారదీక్ష చేశారు. గోదావరి నీళ్ళు రప్పించడం గురించి, మూసీ నది కాలుష్యం గురించి, పోచంపల్లిలోని రామానంద తీర్థ ఇనిస్టిట్యూట్ గురించి తపన పడేవారు. నిఖిలేశ్వర్ రాసినట్టు ‘వ్యక్తిగతంగా జీవితంలో – సామాజికంగా ప్రజాస్వామిక విలువలను కాపాడాలని ఆలోచించేవారు’. ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూనే ఉండేవారు. ‘ప్రజా చైతన్య వేదిక’ స్థాపించి సదస్సులు నిర్వహించేవారు. ఉపన్యాసాలు ఇప్పించేవారు. నిజాం కాలం నాటి చరిత్రను అధ్యయనం చేసి, చిన్న చిన్న పుస్తకాలు ప్రచురించి పంచారు.మా ఇద్దరిది 56 ఏళ్ల అనుబంధం. 1969లో మా మొదటి పరిచయం, తెలంగాణ ఉద్యమ సందర్భంగా. హెచ్ఎస్సీ పాస్ కాగానే సర్పంచిగా పోటీ చేసి గెలిచారు. భువనగిరిలో తెలంగాణ ఉద్యమం జోరందుకున్న రోజులవి. ‘తెలంగాణ ప్రజాసమితి’ అధ్యక్షుడిగా పులుమామిడి బాలక్రిష్ణారెడ్డి, నేను ‘విద్యార్థి కార్యాచరణ సమితి’ కన్వీనర్‌గా, ఇంకా అనేక మంది ఉద్యమం నడుపుతున్న రోజులు. కాంగ్రెస్‌లో గ్రూపులు ఉండేవి. ఒక గ్రూపు ప్రత్యేక తెలంగాణకు అనుకూలం. ఆ గ్రూపులో కొమ్మిడి ఉండేవారు. ఒకరోజు బాలక్రిష్ణారెడ్డి ఇంటికి వచ్చి, ‘తెలంగాణ గురించి ఏం జేయమంటవన్నా’ అని అడిగారు. అప్పుడు బాలక్రిష్ణారెడ్డి ‘మీ సర్పంచులను కొందరిని కలుపుకొని సమితి ఆఫీసు ముందు డేరా వేసి రిలే నిరాహారదీక్షలు చేపట్టండి’ అని సలహా ఇస్తే పాటించారు.ఒక విషయంలో నాకు నర్సింహారెడ్డి స్ఫూర్తి. ‘అరవై తొమ్మిది’ ఉద్యమం ముగిసింది. ఒకరోజు భువనగిరి తహసిల్ ఆఫీసులో తారసపడ్డాం. ‘ఓరేయ్ ముత్యం, మీ మామలెక్క నువు కూడా పైరవికారువైతవురా’ అన్నాడు. అప్పుడనిపించింది పైరవికారు అవడం మంచిది కాదూ అని! అది మనసులో ఉండిపోయింది. ఏ నాయకుడి దగ్గరికీ వెళ్లేవాడిని కాదు. తను నన్ను ముత్యం అని పిలిస్తే, నేను అన్నా అని పలికేవాణ్ణి. అన్నా! నర్సన్నా! మసి అంటని నాయకుడా... నీకివే జోహార్లు!– ఆచార్య కట్టా ముత్యంరెడ్డి -
మనిషి పతన దశలు
స్వయంకృత అపరాధం మనిషి జీవితంలో జరిగే అనేక మార్పులకు హేతువు. ఒక మనిషి పతనం కావడానికి ఇదే మూలమవుతుంది. ఆ పతనం నాలుగు దశల్లో కొనసాగుతుంది.నైతిక పతనం..మనిషి ప్రవర్తన కృతజ్ఞతాహీనంగా మారుతుంది. సాయం చేసినవారికి ద్రోహం తలపెట్టడం, తిన్న ఇంటి వాసాలు లెక్కించడం జరుగుతుంది.విలువల పతనం..దురాశ, దురలవాట్లు ఎక్కువవుతాయి. ఎలానైనా తాము కోరు కున్నది పొందడానికి అడ్డదారులు వెతుకుతారు.సామాజిక పతనం..మనిషి సామాజిక ప్రాణి అనే విషయం మర్చిపోవడం జరుగుతుంది. తన గురించి ఈ లోకం ఏమి అనుకుంటుందనే భయం ఉండదు. వావి వరసలు చూడరు. స్వార్థం తలకెక్కుతుంది. తను చేసిందే సరైనది అనే భావనతో దుశ్చర్యలకు పాల్పడుతుంటారు.ఆర్థిక పతనం..తనువెల్లా అహంతో నిండిన మనుషులకు ఆర్థిక పతనమే ఆఖరి దశ. ఆర్థిక పతనం మొదలైన తర్వాత క్రమంగా పశ్చాత్తాప లక్షణాలు అంకురిస్తాయి. అందులో అతి కొద్ది మంది మాత్రమే చేసిన తప్పులను సరిదిద్దుకుని కొత్త జీవితాలను మొదలెడతారు. ఎక్కువ శాతం మంది అహం మత్తు నుండి బయటపడకుండా జీవితాలనే బలి చేసుకుంటారు.అందుకే మనుషులు ముందుగా నైతికంగా పతనం చెందకూడదు. విచక్షణా జ్ఞానం కోల్పోకూడదు. ఏది మంచో, ఏది చెడో తెలుసుకుని అడుగులు వేయాలి. కష్టపడకుండా వచ్చేది ఎప్పటికైనా మన దగ్గర ఎక్కువ రోజులు ఉండదు అనే సత్యాన్ని విస్మరించకూడదు.– దుర్గమ్ భైతి -
పరిష్కారమే సమస్యగా నిలిచేనా?
భారత్ ప్రభుత్వం 2025–26 నాటికి పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ మిశ్రమం (ఇ20) లక్ష్యాన్ని సాధించే దిశగా గణనీయ మైన పురోగతి సాధించింది. ఇందుకోసం ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంతో పాటు చమురు మార్కెటింగ్ సంస్థల ద్వారా ఇథనాల్ కొనుగోలును కూడా విస్తరించింది. అయితే ఈ కార్యక్రమానికి అనేక సవాళ్లు ఉన్నాయి: అధిక నీటి అవసరం; 2023కు ముందు కొన్న లక్షల వాహనాలు ఇ20కి పూర్తిగా అనుకూలంగాలేకపోవడం; ఆహారానికీ, ఇంధనానికీ మధ్య సమతుల్యతను కాపాడటం.‘నీళ్లు’ కలుపుతున్నారా?అనేక ప్రాంతాలలో ఇ20తో కూడిన పెట్రోల్ వేసుకున్నాక వాహనాలు ఆగిపోవడం, ఇంజిన్ చెడిపోవడం వంటి అనుభవాలు పెరిగినాయి. అనేక పెట్రోల్ బంక్‌లలో పెట్రోల్‌తో పాటు నీళ్ళు పోస్తున్నారని వాహనదారులు ఆందోళనకు దిగుతున్నారు. ఆమధ్య మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మొత్తం వాహనశ్రేణికి ఇదే సమస్య ఉత్పన్నమయ్యింది. మధ్యప్రదేశ్ పెట్రోల్ బంక్‌ల సంఘం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినా ప్రతిస్పందన లేదు. నిత్యావసర వస్తువు లలో ఒకటైన పెట్రోల్, డిజిల్ గురించిన నియంత్రణ జిల్లా కలెక్టర్లు చేస్తారు. వారి అభిప్రాయానికి కూడా ప్రభుత్వం విలువ ఇవ్వడం లేదు. పెట్రోల్‌లో ఇథనాల్ కలిపితే నీళ్ళు రావడం సాధారణం అని ఒప్పుకొన్నా చమురు కంపెనీలు సాంకేతిక అవసరాలకు అనుగుణంగా కలపడం లేదని పెట్రోల్ బంక్‌ల ఆరోపణ. దాదాపు 30 కోట్ల వాహనాలు ఇ20 వల్ల పాడయితే దేశ ఆర్థిక స్థితి, వ్యక్తిగత వాహనదారుల మీద పడే ఆర్థిక భారం గురించి ఆలో చన చేయవలసి ఉన్నది. సరుకు రవాణా వాహనాలు మొరాయిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఆటోలు, టాక్సీ తదితర రవాణా సదుపాయాలు కుంటుపడితే ఆ యా కుటుంబాల మీద భారంతో పాటు నిత్య రవాణా మీద దుష్ప్రభావం ఉంటుంది.పర్యావరణ హితమేగానీ...భారత్‌లో ఇథనాల్ కార్యక్రమం (ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ ప్రోగ్రామ్–ఈబీపీ) దేశ ఇంధన భద్రతను బలోపేతం చేయడం, పెట్రోలియం దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, రైతుల ఆదాయాన్ని పెంచడం, పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించడం అనే ముఖ్య ఉద్దేశాలతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇది 2003లో ప్రారంభమైంది. ప్రపంచ వాతావరణ సదస్సులలో కర్బన ఉద్గారాలు తగ్గిస్తామని భారత్ చేసిన లిఖితపూర్వక వాగ్దానంలో ఇది ఒక భాగమైంది. చెరకు రసం, మొలాసెస్, మొక్కజొన్న, బియ్యం వంటి వ్యవ సాయ పంటలు, వాటి ఉప ఉత్పత్తుల నుంచి తయారయ్యే జీవఇంధనం (బయో ఫ్యూయల్) ఇథనాల్. ఇది పునరుత్పాదకఇంధనం కావడంతో పెట్రోల్ తరహ వాయు కాలుష్యం ఉండదు గానీ పూర్తిగా సున్నా కాదు. ఇంకొక కొత్త రకం కాలుష్యం ఏర్పడు తున్నది. కొన్ని పరిస్థితుల్లో నైట్రోజన్ ఆక్సైడ్లు లేదా ఆల్డిహైడ్లు పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల అన్ని రకాల ఉద్గారాలు సమానంగా తగ్గుతాయని చెప్పలేము. టెయిల్‌పైప్ ఉద్గారాలు సాధారణంగా తగ్గుతాయి. అయితే ఏ ఉద్గారాలు ఎంత తగ్గుతాయనేది ఇంజిన్ రకం, ఇథనాల్ మిశ్రమ శాతంపై ఆధారపడి ఉంటుంది. కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోకార్బన్లు, పార్టిక్యులేట్ మ్యాటర్ తగ్గు తాయి. వివిధ ఇంధనాల ఉత్పత్తి నుంచి వినియోగం పోల్చితే కార్బన్ డయాక్సైడ్ నికర ప్రభావం కూడా తగ్గుతుంది. అయితే, కార్బన్ డయాక్సైడ్ తగ్గుదల కూడా ఇథనాల్ తయారు చేసే విధా నాన్ని బట్టి ఉంటుంది. చెరుకు, మక్కలు, వడ్ల నుంచి తయారు చేసే క్రమంలో వివిధ రకాల ప్రభావం ఉంటుంది. ఇథనాల్‌ను పెట్రో ల్లోనే కలుపుతున్నారు; డీజిల్ వాడకం వల్ల వచ్చే వాయు కాలుష్యం గురించి ఎటువంటి అడుగులు వేయడం లేదు. రైతులకు ఎంత మేలు?భారత్‌లో ఇథనాల్‌ను చెరకు రసం, మొలాసెస్, మొక్కజొన్న, బియ్యం, గోధుమలు, జొన్నలు, సజ్జల నుంచి తయారు చేస్తారు. ఆయా పంటలకు డిమాండ్ పెరిగి తద్వారా రైతులకు అదనపు ఆదాయం సమకూరుతుందనేది ఆలోచన. ఇది ఒక నినాదంగా, ఆకర్షణీయ ప్రకటన లాగానే ఉన్నది. ఆహార పంటలకు డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. రైతుకు గిట్టుబాటు ధర రాకపోవడానికి కారణం ఆ యా పంటలకు డిమాండ్ లేక కాదు – మార్కెట్లో వ్యవస్థీ కృతమైన దోపిడీ వల్ల. మార్కెట్ల దోపిడీ ఈ పంటలను ఇథనాల్ ఉత్పత్తికి మళ్ళించడం వల్ల తగ్గదు. ప్రస్తుతం దేశంలో ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా పెరిగింది. 2014లో సుమారు 421 కోట్ల లీటర్ల సామర్థ్యం ఉండగా, 2026 నాటికి అది సుమారు 2,000 కోట్ల లీటర్ల వార్షిక సామర్థ్యానికి పెరిగింది. ప్రభుత్వం కొత్తగా అనేక ధాన్యాధారిత, చెరకు ఆధారిత డిస్టిలరీలకు అనుమతులు ఇచ్చింది. పెట్రోల్‌లో 20% ఇథనాల్ కలప డానికి సంవత్సరానికి సుమారు 1,016 కోట్ల లీటర్ల ఇథనాల్ అవస రమని ప్రభుత్వం, నీతి ఆయోగ్ అంచనా.ఇంధనం కాకుండా పరి శ్రమలు, రసాయనాలు, మద్యం తదితర ఇతర అవసరాలను కలి పితే మొత్తం సుమారు 1,350 కోట్ల లీటర్ల ఇథనాల్ అవసరం. సుమారు 2,000 కోట్ల లీటర్ల వార్షిక ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పూర్తిగా ధాన్యాలపై ఆధారపడి నడపాలంటే దాదాపు 5 కోట్ల టన్నుల ధాన్యం అవసరం అవుతుంది. మొత్తం ధాన్య ఉత్పత్తి దాదాపు 37.66 కోట్ల టన్నులు. అంటే, అది దేశ మొత్తం ఆహార ధాన్య ఉత్పత్తిలో సుమారు 13% అవుతుంది. అమెరికా నుంచి డీడీజీఎస్ (డిస్టిల్లర్స్ డ్రైడ్ గ్రెయిన్స్ విత్ సొల్యూబుల్స్) దిగుమతులు, భారత ఇథనాల్ కార్యక్రమంతో ముడిపడి ఉన్న నేపథ్యంలో అది ఇంకొన్ని సమస్యలను సృష్టిస్తుంది. ఇథనాల్ తయారీ తర్వాత మిగిలే అధిక ప్రోటీన్ కలిగిన ఉప ఉత్పత్తిని డీడీజీఎస్ అంటారు. దీనిని పశువులు, కోళ్లు, చేపలకు దాణాగా ఉపయోగిస్తారు. అమెరికా నుంచి చౌకగా డీడీజీఎస్వస్తే దేశీయ డీడీజీఎస్ ధరలు పడిపోవచ్చు. దీంతో భారతఇథనాల్ డిస్టిలరీల ఆదాయం తగ్గుతుంది. మొక్కజొన్న రైతులపై కూడా ప్రభావం ఉంటుంది. అమెరికా దిగుమతులతో జీఎం (జన్యు మార్పిడి) వివాదం కూడా ఉన్నది. జీఎం మొక్కజొన్ననుంచి అమెరికా డీడీజీఎస్ వస్తుంది కాబట్టి, జన్యుమార్పిడిదాణా వల్ల ఏర్పడే అనారోగ్య సమస్యలు అదనం. అందుకే ఈఅన్ని సమస్యలపై కేంద్ర ప్రభుత్వం వివరంగా స్పందించాల్సిన అవసరం ఉంది.-వ్యాసకర్త వ్యవసాయ రంగ నిపుణులు-దొంతినరసింహారెడ్డి -
చేప పిల్లల రాజధానికి సవాళ్లెన్నో!
భారతదేశ ఆక్వా రాజధానిగా గుర్తింపు పొందిన ఆంధ్రప్రదేశ్ దేశీయ మంచినీటి చేపల పెంపకంలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. చేపల పెంపకంలో పెట్టుబడి వ్యయం తక్కువే అయినప్పటికీ, నాణ్యమైన చేప పిల్లలే సాగు లాభా లను నిర్ణయిస్తాయి. కృత్రిమ ప్రేరిత ప్రజనన(ఇండ్యూస్డ్ బ్రీడింగ్) సాంకేతికత, చైనీస్ సర్క్యులర్ హేచరీల ప్రవేశంతో చేప పిల్లల ఉత్పత్తి రంగంలో విప్లవాత్మక మార్పు చోటు చేసుకుంది.నాలుగు దశాబ్దాలుగా ప్రభుత్వ సంస్థలు, పరి శోధనా సంస్థలు, ప్రైవేట్ పారిశ్రామికవేత్తల సమష్టి కృషితో గోదావరి, కృష్ణా, పెన్నా నదీ పరివాహక ప్రాంతాల్లో వందలాది హేచరీలు, నర్సరీలు ఏర్పడటంతో చేప పిల్లల ఉత్పత్తి గణనీయంగా విస్తరించింది. గోదావరి, కృష్ణా డెల్టా ప్రాంతాల్లో విస్తరించి ఉన్న బ్రూడ్‌స్టాక్ ఫారాలు, హేచరీలు, నర్సరీల నెట్వర్క్ ద్వారా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిషా వంటి అనేక రాష్ట్రాలకు నాణ్యమైన చేప పిల్లలు సరఫరా అవుతున్నాయి. చేపల పెంపకం రాష్ట్ర గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు, ఉపాధికి పెద్ద పీట వేస్తోంది.ఏపీ చేపల పెంపక రంగం ఎదుర్కొంటున్న సవాళ్లలో జన్యు నాణ్యత క్షీణించటం ముఖ్యమైనది. అవే తల్లి చేపలను పదే పదే విత్తనోత్పత్తికి వాడటం వల్ల ఇన్–బ్రీడింగ్ జరిగి చేప పిల్లల ఎదుగుదల మందగిస్తోంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, అస్థిర వర్షాలు హేచరీల ఉత్పాదకతను దెబ్బతీస్తున్నాయి. బ్యాక్టీరియా, పరాన్నజీవులు, శిలీంధ్రాల ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నాయి. జాతుల వైవిధ్యీకరణ కొరవడటం మరో పెద్ద సవాలు. మార్కెట్లో ఫంగాసియస్, గిఫ్ట్ తిలాపియా, కొర్రమీను వంటి కొత్త జాతులకు డిమాండ్ పెరుగుతున్నా, ఇప్పటికీ మేజర్ కార్ప్ చేపలదే పైచేయిగా ఉంది.జన్యుపరంగా మెరుగైన మంచినీటి చేపల రకాలను జన్యుపరంగా అభివృద్ధి చేయ డానికి రాష్ట్రస్థాయిలో ప్రత్యేక చేపల జన్యు మిషన్‌ను ఏర్పాటు చేయాలి. హేచరీల గుర్తింపు, నాణ్యత హామీ కోసం చేపల విత్తన ధ్రువీకరణ సంస్థ వంటి ప్రత్యేక అథా రిటీని నెలకొల్పాలి. క్యూఆర్ కోడ్ ద్వారా చేప పిల్లల సరఫరా గొలుసును, రవాణాను ట్రాక్ చేయాలి. సౌరవిద్యుత్‌తో నడిచే హేచరీలు, రీసర్క్యులేటరీ ఆక్వాకల్చర్ సిస్టమ్స్ (ఆర్ఏఎస్) వంటి మౌలిక వసతుల్లో పర్యావరణ అనుకూల ఆధునిక సాంకేతికతలను ప్రోత్సహించాలి.చేపల సాగు విస్తీర్ణాన్ని పెంచటం కంటే నాణ్యతను మెరుగుపరచటంపైనే భవి ష్యత్తు పోటీతత్వం ఆధారపడి ఉంటుంది. వికసిత్ భారత్–2047 లక్ష్యాలకు అనుగుణంగా.. డిజిటల్ ట్రేసబిలిటీ, జీవ భద్రతా ప్రమాణాలతో దేశంలోనే ధ్రువీకరించబడిన చేప పిల్లల ఉత్పత్తికి జాతీయ కేంద్రంగా ఏపీ ఎదగాలి. అప్పుడే రాష్ట్రం భారతదేశ ‘బ్లూ ఎకానమీ’కి వెన్నెముకగా నిలిచి ‘ఫిష్ సీడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా’గా తన స్థానాన్ని బలోపేతం చేసుకోగలుగుతుంది.- డా. పి. రామమోహనరావు, వ్యాసకర్త విశ్రాంత మత్స్యశాఖ ఉప సంచాలకులు, కాకినాడ (జూలై 10న జాతీయ చేపల రైతుల దినోత్సవం) -
తరతరాల కళా నిబద్ధత
ఐదు దశాబ్దాలుగా ‘కడ్డి తంత్రి’ అనే అపురూప జానపద సంగీత కళారూపాన్ని సంరక్షిస్తున్న దురిశెట్టి రామయ్యకు కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారం లభించింది. ఇది తెలంగాణ జానపద కళా ప్రపంచానికే గర్వకారణం. పెద్దపల్లి జిల్లా (ఉమ్మడి కరీంనగర్ జిల్లా) సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామానికి చెందిన ఆయన అరుదైన కళాసాధకుడు. ఎస్సీ మాల సామాజిక వర్గంలోని ‘మిత్తుల అయ్య వార్లు’ లేదా ‘నిత్యులు’ అనే ఉపకులానికి చెందిన రామయ్య, చిన్నతనంలోనే తన తండ్రి రామానుజం వద్ద ఈ కడ్డి తంత్రి కళను అభ్యసించారు. రామానుజం కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి చేతుల మీదుగా పురస్కారం అందుకోవడం విశేషం.కడ్డి తంత్రి వాయిద్యం తెలంగాణలోని అత్యంత ప్రాచీన జానపద సంగీత వాయిద్యాల్లో ఒకటి. అడ విలో లభించే టేకు చెట్టు మొద్దును లోపల ఖాళీగా తొలిచి ఈ వాయిద్యాన్ని ప్రత్యేకంగా తయారు చేస్తారు. రామయ్య వద్ద ఉన్న వాయిద్యానికి దాదాపు ఆరు నుంచి ఏడు దశాబ్దాల చరిత్ర ఉంది. కశ్మీర్‌కు చెందిన సంతూర్, పాశ్చాత్య దేశాల డల్పీమర్, సింబలోన్ వంటి వాటిలో అనేక తంత్రులు (తీగలు) ఉంటాయి. కానీ, కడ్డి తంత్రి లేదా కడ్డి వీణలో కేవలం మూడు లేదా నాలుగు తంత్రులే ఉంటాయి. వీటితోనే 32 స్వరాలను పలికించడం గమనార్హం. చిన్న వెదురు బద్ద చివర కొన్ని గజ్జెలు కట్టి వాటితో తీగలను కొడతారు. బద్దతో వాయించినప్పుడు వచ్చే రాగతాళాలకు అనుగుణంగా గజ్జెల శబ్దం మేళవించి శ్రోతలకు వీనులవిందు కలిగిస్తుంది.ఈ వాయిద్యం కథాగానం, పురాణ ప్రవచనాలకు మాధ్యమంగా రూపుదిద్దుకుంది. రామయ్య తన బృందంతో కలిసి భాగవతం, భారతం వంటి ఇతిహాస గాథలను విని పిస్తారు. ముఖ్యంగా గజేంద్ర మోక్షం, కీచక వధ, సతీ సావిత్రి, భక్త ప్రహ్లాద, రామదాసు చరిత్ర, విరాట పర్వం, సుందరకాండ వంటి ఘట్టాలను ప్రదర్శిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. కడ్డి తంత్రి వాయిద్యంతో నిర్వహించే సాధారణ ప్రదర్శనల్లో ఆరు గురు కళాకారులు పాల్గొంటారు. అదే వేషధారణతో కూడిన నాటక రూప ప్రదర్శనలైతే 12 మంది కళాకారులు భాగస్వాములవుతారు. సాయంత్రం ప్రారంభమయ్యే ఈ ప్రద ర్శనలు తెల్లవారుజాము వరకు సాగుతుంటాయి. ఐదు దశాబ్దాలుగా ఎన్నో కష్టనష్టాల కోర్చి ‘కడ్డి తంత్రి’ కళను కాపాడుకుంటూ వస్తున్న దురిశెట్టి రామయ్య జీవితం... జానపద వారసత్వ పరిరక్షణకు అంకితమైన ఒక మహోన్నత ప్రస్థానం!– జంపాల ప్రవీణ్, ఔత్సాహిక పరిశోధకుడు -
ఒక యువకుడు శ్రీకృష్ణుని వద్దకు వచ్చి ‘ప్రభో!
ఒకరోజు ద్వారకలో, ఒక యువకుడు శ్రీకృష్ణుని వద్దకు వచ్చి ‘ప్రభో! మంచి పనులు చేసిన వారు ధన్యులు అని అందరూ అంటారు. కానీ మంచి పనులు చేసిన వారు ఎవరు? ఎక్కువ దానధర్మాలు చేసేవారా? గొప్ప యజ్ఞాలు చేసేవారా?’ అని అడిగాడు. కృష్ణుడు ఆ యువకుడిని ఒక దేవాలయం దగ్గరకు తీసుకెళ్లాడు. ఒక వృద్ధుడు మౌనంగా ఆలయ ప్రాంగణం శుభ్రం చేసుకుంటున్నాడు.కృష్ణుడు ఆ యువకుడితో ‘రా! అతనికి తెలియకుండా రోజంతా మనం ఇతనిని అను సరిద్దాం’ అన్నాడు. వృద్ధుడు తన ఆహారంలో కొంత భాగాన్ని ఆకలితో ఉన్న కుక్కకు ఇచ్చాడు. దేవాలయా నికి వచ్చిన ఒక పేద వృద్ధురాలికి నీళ్ళు ఇచ్చి, తన చేతిలో ఉన్న కొన్ని నాణేలను కూడా ఇచ్చాడు. ఆలయ మార్గంలోని ముళ్ళను, రాళ్లను తొలగించాడు. సాయంత్రం ఇంటికి వెళ్లేముందు, ఇలా ప్రార్థించాడు: ‘కృష్ణా! ఈ రోజు నేను ఏదైనా మంచి పని చేసి ఉంటే, దానిని నీ పాదాల చెంత సమర్పిస్తున్నాను.’ఇది చూసి ఆ యువకుడు ఆశ్చర్యపోయాడు. ‘ప్రభో! ఇదేనా పుణ్యం? పెద్ద దానాలు లేవు, యజ్ఞాలు లేవు.’ కృష్ణుడు నవ్వి ఇలా అన్నాడు: ‘విజయం అనేది చేసిన పని వల్ల వచ్చే కీర్తిలో లేదు; అది ఆ పని చేసే హృదయపు నిర్మలత్వంలో ఉంది. ఎవరూ చూడనప్పుడు కూడా ధర్మాన్ని నిలబెట్టేవాడు పుణ్యపురుషుడు’.అప్పుడు ఆ యువకుడు మళ్ళీ అడిగాడు: ‘అయితే, ప్రభూ, సద్గుణ ఫలం ఏమిటి?’ అందుకు కృష్ణుడు ‘సద్గుణానికి గొప్ప ఫలం సంపదగానీ, కీర్తిగానీ కాదు. ప్రపంచమంతా అతణ్ణి విడిచి పెట్టినా, నన్ను చేరే మార్గం అతని హృదయంలో ఎల్లప్పుడూ తెరిచే ఉంటుంది. అదే సద్గుణానికి నిజమైన ఫలం’ అన్నాడు. సద్గుణం స్వర్గానికి మార్గం కాదు; అది భగవంతుని హృదయాన్ని చేరే మార్గం!– యామిజాల జగదీశ్ -
జాతీయ పునర్నిర్మాణ శక్తిగా...
ఒక దేశ అభివృద్ధి కేవలం ప్రభుత్వాల నిర్ణయాలతోనే సాధ్యం కాదు. సమాజంలోని ప్రతి వర్గం, ముఖ్యంగా యువత తమ బాధ్యతను గుర్తించి దేశ పునర్నిర్మాణంలో భాగస్వామ్యం అయినప్పుడే సంపూర్ణమైన ప్రగతి సాధ్యమవుతుంది. ఈ ఆలోచనకు కార్య రూపమే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ). 1948 జూన్‌లో ప్రారంభమైన ఈ సంస్థ 1949 జూలై 9న అధికారికంగా నమోదు అయ్యింది. ఏబీవీపీ మొదటి రోజు నుంచే జాతీయ పునర్నిర్మాణం తన లక్ష్యం అని స్పష్టంగా ప్రకటించింది.విద్యార్థులు కేవలం విద్యను పొందే వ్యక్తులు కాకుండా, సమాజ సమస్యలను అర్థం చేసుకుని పరిష్కార మార్గాలను అన్వేషించే బాధ్యత గల పౌరులుగా ఎదగా లని పరిషత్ భావించింది. ఈ లక్ష్య సాధన కోసం నిర్మాణా త్మక కార్యక్రమాలు, ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఉద్యమాలు, విద్యార్థి వ్యవస్థల్లో భాగస్వామ్యం అనే మూడు ప్రధాన మార్గాలను అనుసరించింది.భారతదేశ వైవిధ్యంలో ఏకత్వాన్ని బలపరిచే లక్ష్యంతో ఏబీవీపీ చేపట్టిన ముఖ్యమైన కార్యక్రమాల్లో సేయిల్ (స్టూడెంట్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇంటర్ స్టేట్ లివింగ్ ) ఒకటి. దీని ద్వారా ఈశాన్య భారత రాష్ట్రాల విద్యార్థులు దేశంలోని ఇతర ప్రాంతాల కుటుంబాలతో కలిసి నివసిస్తూ భిన్న సంస్కృతులు, భాషలు, సంప్రదాయాలను ప్రత్యక్షంగా అనుభవించే అవకాశం పొందారు. ఇది కేవలం పరిచయ కార్యక్రమం కాకుండా భావోద్వేగపూర్వక జాతీయ ఐక్యతకు ఒక వేదికగా నిలిచింది. ప్రత్యేక తెలంగాణ అంశంపై 1998లో తీర్మానం చేయడం, 2001లో ‘తెలంగాణ సస్యశ్యామల యాత్ర’ నిర్వహించడం, మలిదశ ఉద్యమ సమయంలో విద్యార్థులను సంఘటితం చేయడం వంటి కార్యక్రమాలు కూడా చేపట్టింది.కాలం మారుతున్న కొద్దీ విద్యార్థి ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లు మారుతున్నాయి. ప్రపంచీకరణ, సాంకేతిక విప్లవం, కృత్రిమ మేధస్సు, పర్యావరణ మార్పులు వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ఏబీవీపీ తన కార్యక్రమాలను విస్తరించింది. అలాగే ‘ఖేలో భారత్’ ద్వారా క్రీడాస్ఫూర్తిని, ‘రాష్ట్రీయ కళా మంచ్’ ద్వారా భారతీయ కళా సంస్కృతిని, ‘స్టూడెంట్స్ ఫర్ డెవలప్మెంట్’ ద్వారా పర్యావరణ బాధ్యతను, ‘స్టూడెంట్స్ ఫర్ సేవ’ ద్వారా సేవా భావాన్ని ప్రోత్సహిస్తోంది. మెడివిజన్, అగ్రివిజన్, టెక్నికల్ సెల్, లా సెల్, పరిశోధన, విద్యా విధానాలపై చర్చలు, నైపుణ్యాభివృద్ధి వంటి రంగాల్లో తన కార్యకలాపాలను విస్తరించింది. యువ శక్తిని జాతీయ పునర్నిర్మాణ దిశగా నడిపించే ఈ ప్రయాణాన్ని ఏబీవీపీ నిరంతరం కొనసాగిస్తోంది.– రావుల కృష్ణ, ఏబీవీపీ తెలంగాణ అధ్యక్షుడు, (నేడు ఏబీవీపీ ఆవిర్భవించిన రోజు) -
శిక్షణ లేని శిశు సంరక్షణ కేంద్రాలు
మన దేశంలో డే కేర్ సెంటర్స్ పేరుతో శిశు సంరక్షణ కేంద్రాలను నడుపుతారు. వీటిలో కొన్ని ప్రైవేటు సంస్థల గొలుసు కేంద్రాలు, కొన్ని స్థానిక మైనవి. వీటిలో రోజుకు గంట చొప్పున నెల రుసుం రూ. 3,000 నుండి రూ. 15,000 వరకు ఉంటుంది. ఇటీవల బెంగళూరు బ్రూక్ (వైట్) ఫీల్డ్‌లో క్యాప్‌జెమిని సాంకేతిక సేవల కంపెనీ ప్రాంగణంలోని డే కేర్ సెంటర్లో పిల్లలను వాష్‌రూమ్‌లు, ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్లలో ఉంచడం, టాయిలెట్ గొట్టాలతో నోటిలో నీళ్ళు కొట్టడం వంటి దుశ్చర్యలకు పాల్పడ్డ దృశ్యాలు బహిర్గత మయ్యాయి. అరిస్తే, ఏడిస్తే కొడతామనీ, చంపు తామనీ బెదిరింపులు ఉన్న వీడియో బయటికి వచ్చింది.ఇవ్వాళ పిల్లల చదువు, వైద్యం, ఇతర సౌక ర్యాలకోసం ఒకరి సంపాదన సరిపోవడం లేదు. దంపతులిద్దరూ కష్టపడితే కాని ఇల్లు గడవదు. నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. ఒకసారి ఉద్యోగం వదిలితే తిరిగిరాదు. అందుకే ఇంట్లో ఆలనా, పాలనా చూసే పెద్దలు ఎవరూ లేని యువ దంపతులు తమ పిల్లలను శిశుసంరక్షణ కేంద్రాలలో చేర్చవలసి వస్తోంది. మానసిక శాస్త్ర సూత్రాలు తెలియవు!డే కేర్ సెంటర్లలో పసిపిల్లల పట్ల యాజ మాన్యాలు, అక్కడ పనిచేసేవారూ ఎందుకింత బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారో కారణాలను వేతకాలి. ఈ కేంద్రాలను నిర్వాహకులు లాభా లకు నడుపుతారు. వారికిగానీ, అందులో ఉద్యో గులకుగానీ ఏ మాత్రం సేవాదృక్పథం ఉండటం లేదు. పిల్లల కోసం ఇచ్చిన తిండి, తీర్థాలను తిని పిల్లలను మాడ్చే ఆయాలున్నారు (తిండిలేని వారి పేదరికం కారణమేమో).యాజమాన్యం, సిబ్బందికి శిశు సంరక్షణలో శిక్షణ ఉండదు. వీరికి పిల్లలు ఎందుకు ఏడుస్తున్నారో తెలియదు. ఏడుపు మాన్పడం, బుజ్జగించడం, ఆడించడం రాదు. శిశుకేంద్రాలలో ఆట వస్తువులు ఉండవు. ఉన్నా పనిచేయవు. ఎదుటి వారితో సరిగ్గా వ్యవ హరించడానికీ, జీవితంలో అతి చిన్న సమస్యలను ఎదుర్కోవడానికీ మాన సిక శాస్త్ర సాధారణ సూత్రాలు తెలియాలి. ఇవి తెలియకనే పిల్లలు, విద్యార్థులు, పెద్దలు, రైతులు చిన్నపాటి ఇబ్బందులకే ఆత్మహత్యలకు ఒడి గడుతున్నారు.పసిపిల్లల సంరక్షణకు శిశు మనస్తత్వాన్ని తెలుసుకోవాలి. దాన్ని అధ్యయనం చేయాలి. అనుదిన అనువర్తిత చర్యలను అమలుచేయాలి. పిల్లలందరూ ఒకేలా ప్రవర్తించరు. ఒకే సమస్యకు ఒకేలా స్పందించరు. ఇండియాలో అధిక శాతం ప్రజలకు శిశు సంరక్షణపై అంతగా అవగాహన లేదు. పిల్లల సంరక్షణలో వాళ్ళకు తెలిసినవి మామూలు మొద్దు మార్గాలే.స్వీడన్ లాంటి దేశంలో విద్య, వైద్యం ఉచితం. ప్రభుత్వం పిల్లలను దేశ సంపదగా పరిగణిస్తుంది. శారీరక, మానసిక ప్రత్యేకతలు ఉన్న పసిపిల్లలకు నిద్ర, సంగీతం, మేధో ప్రేరణ, మానసిక ఉల్లాసం, మాట, ఆటల కోసం అత్యంత ఆధునిక యంత్ర సౌకర్యాలతో ప్రత్యేక పాఠశా లలు ఉంటాయి. నలుగురు పిల్లలకు ఐదుగురు శిక్షణపొందిన మానసిక నైపుణ్య ఉపాధ్యాయులు ఉంటారు. వీరు వృత్తి రీత్యానేగాక, ప్రవృత్తి పరంగానూ మానవత్వంతో పసిపిల్లలను తల్లిదండ్రుల కంటే బాగా చూడగలరు.మానసిక ఆరోగ్యం, శిశురక్షణ, పిల్లల భద్రత, పాలన, పోషణ వంటి సున్నిత విషయాలను పౌర సమాజం ప్రచారం చేయాలి. ప్రజాపక్ష రాజకీయ పక్షాలు వీటిని తమ పాలనా విధానాలుగా ప్రకటించాలి. - సంగిరెడ్డి హనుమంత రెడ్డి, ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యదర్శి -
కంచంలో ఉన్నది అమృతమేనా?
‘మనిషి తినే ఆహారం ఔషధంలా ఉండాలి... ఔషధమే ఆహారంలా మారే పరిస్థితి రాకూడదు’ అని హిప్పోక్రటీస్ ఏనాడో చెప్పాడు. కానీ నేడు పరిస్థితి ఏమిటి? మనం తినేది ఆహారమో, విషమో తెలియని దుఃస్థితి. కల్తీ ఆహారం అనేది ‘స్లో పాయిజన్’. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం 2021లో ప్రపంచవ్యాప్తంగా 86 కోట్లకు పైగా ఆహార సంబంధిత అనారోగ్య కేసులు నమోదయ్యాయి. 15 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది కేవలం రికార్డుల్లోకెక్కిన లెక్క మాత్రమే!అవే లెక్కల ప్రకారం, మన దేశంలోని మొత్తం మరణాల్లో 63 శాతం అంటురోగాలు కానివాటివల్లే కలుగుతున్నాయి. అందులో 27 శాతం మంది గుండె జబ్బుల వల్లే కన్నుమూస్తున్నారు. క్యాన్సర్ల గురించైతే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఐసీఎమ్ఆర్ అంచనా ప్రకారం ఒక్క 2022లోనే భారత్‌లో 14.6 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి. ప్రతి 9 మంది భారతీయుల్లో ఒకరికి తమ జీవితకాలంలో క్యాన్సర్ ముప్పు పొంచి ఉందట! మరోవైపు, దాదాపు 13.8 కోట్ల మంది దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులతో మగ్గి పోతున్నారు.ఎందుకిలా జరుగుతోంది? కూర గాయల నుంచి పండ్ల దాకా కొడుతున్న రసాయనాలు... హోటళ్లలో వాడిన నూనెనే పదే పదే వాడటం, ప్రాసెస్డ్ ఫుడ్‌లో ఉండే విషపూరిత ప్రిజర్వేటివ్స్, అల్లం పేస్ట్ నుంచి కారం వరకు అన్నింటిలో జరుగుతున్న కల్తీ– ఇవన్నీ మనిషిని బతకనిస్తాయా? అందుకే అభివృద్ధిచెందిన దేశాలు ఆహార భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నాయి.మన తెలంగాణ విషయానికి వస్తే... గతంలో జరిగిన తప్పులను సరిదిద్దు కుంటూ... ‘కల్తీ లేని తెలంగాణ’ లక్ష్యంగా 2024 జనవరి నుండి సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్తోంది. ఇందులో భాగంగానే హెచ్‌ఫాస్ట్, ప్రత్యేక ఫుడ్ సేఫ్టీ టాస్క్‌ఫోర్స్ బృందాలను రంగంలోకి దించి కఠిన చర్యలు తీసుకుంటోంది.2024 నుండి 5,500కి పైగా ముమ్మర తనిఖీలు చేసి, నాణ్యత లేని 2,000కి పైగా సంస్థలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడిన 150కి పైగా హోటళ్లు, తయారీ కేంద్రాలను సీజ్ చేయడమే కాకుండా, రూ. 2 కోట్లకు పైగా జరిమానాలు విధించారు. 100కి పైగా క్రిమినల్ కేసులు నమోదు చేసి నిర్వాహకులను అరెస్ట్ చేశారు. దేశాన్ని అభివృద్ధి చేయడంతో పాటు ప్రజల కంచంలో పడే అన్నం సురక్షితంగా ఉండేలా ప్రభుత్వాలు చూడాలి. మన కంచంలోని ఆహారం సురక్షితం కాకపోతే... అభివృద్ధి కథనాలన్నీ చివరకు ఆసుపత్రి కారిడార్లలో ముగిసి పోతాయి. – నవీన్ కుమార్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ -
ఆ విధంగా నా త్రివిధ సాధన..
కృష్ణాబాయికి స్వామి రామదాసు ‘ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ’ అనే మంత్రాన్ని ఉపదేశించారు. రామనామం సుధామధురం. ఎందరెందరినో మహనీయులుగా తీర్చిదిద్దిన మంత్రం అది. కృష్ణాబాయి కూడా ఎంతో శ్రద్ధగా ఆ మహత్తర నామాన్ని జపించటం ప్రారంభించింది. కానీ ‘చంచలం హి మనః కృష్ణా!’ అని అర్జునుడు చెప్పాడు కదా, కృష్ణాబాయి మనసు ఎక్కడెక్కడికో పరుగులు తీసింది. సమస్యను గుర్తించిన కృష్ణాబాయి స్వామి రామదాసున్న ఆశ్రమానికి పరుగెత్తింది.అప్పుడాయన ఆమెతో, ‘ఇందులో విచారించవలసినది ఏముంది? పరిభ్రమించుటే మనసు పని. దానికిష్ట మొచ్చినచోట దాన్ని పోనిమ్ము. అదంతా స్వయంగా రాముడే అని భావించు. రాముడు అనంతుడు. సమస్తమైన ప్రాణులూ, వస్తువులూ రాముని నుండి వచ్చి, రామునిలో చరించి, రామునిలో లీనమవుతాయి. అందువల్ల మనస్సు ఎక్కడికి పోయినా, సర్వమూ రాముడే అని భావించు. నీవు ఎవ్వరికి సేవ చేసినా అది రాముని సేవయనీ, రాముని పూజయనీ భావించు. ఈ అభ్యాసం విశ్వరూపుడయిన రామునితో నీ ఏకత్వాన్ని అనుభవించటానికి తేలికగా వీలు కలుగచేస్తుంది’ అని బోధించారు.గురువుగారి సలహాను కృష్ణాబాయి ఆ క్షణం నుండే పాటించింది. దాని వల్ల సాధారణ మనిషియైన కృష్ణా బాయి విశ్వమాత కృష్ణాబాయిగా ఎదిగింది. ఆమె తన అనుభవాన్ని ఇలా చెప్పింది: ‘ఆ విధంగా నా త్రివిధ సాధన – నోటితో రామమంత్రాన్ని ఉచ్చరించటం; ప్రతి ప్రాణినీ, ప్రతి వస్తువునూ సాక్షాత్ రామునిగానే భావించటం; చేతులతో చేసిన పని అంతా రాముని పనిగానూ, రాముని సేవగానూ భావించటం – ఏక కాలంలో మొదలైంది. నా దృష్టిలో పప్పా (రామదాసు), రాముడు అభిన్నం. ఈ అభ్యాసంతో నా మనస్సు నిశ్చలమైనాకు తెలియకుండగనే నా హృదయం ప్రశాంత మయమైంది’ (పుటలు 10–11; విశ్వమాత కృష్ణాబాయి, ఆనందా శ్రమము, కేరళ). – రాచమడుగు శ్రీనివాసులు -
సంశయాత్ములు
జ్ఞానం, శ్రద్ధ లేని సంశయాత్ముడు నశించిపోతాడని భగవద్గీత చెబుతుంది. సంశయాలతో సతమతమయ్యేవారు ఏ పనిలోనూ విజయం సాధించలేరు. అదేపనిగా అనేక సందేహాలతో మనసు నింపుకున్నవారు మనోదౌర్బల్యం కలిగి కర్తవ్య హీనులవుతారు.భయం, నిరాశ, నిష్క్రి యత్వం, ప్రతికూల ఆలోచనలు పెరిగిపోతుంటే మనిషిలో ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. జీవితానందం సన్నగిల్లుతుంది. ఇటువంటి వారు ఎప్పుడూ ఏదో అపజయం, ఉపద్రవం జరగబోతోందేమోనన్న చెడు భావనలతో భయపడిపోతుంటారు. రేపు ఏం జరుగుతుందోనని నేటి ఆనంద క్షణాలను అనుభవించలేరు.ఏ పనైనా పూర్తి చేయలేమేమోననే సందేహంతోనే వీరు మొదలుపెడతారు. విద్యార్థులుగానీ, ఉద్యోగా ర్థులుగానీ తమ మీద తమకు స్థిర నమ్మకం లేకపోతే గెలుపు సాధించలేరు. ఏదైనా చేయగలము అనే విశ్వాసం ఉంటే సగం విజయం సాధించినట్లే! యుద్ధానికి వెళుతున్న సైన్యం విజయం తమదే అనే నమ్మకంతో వెళితే విజయం వరిస్తుంది.భగవద్గీత మానవులకు జీవన సమరంలో ఆత్మ విశ్వాసాన్ని కలుగజేసి ఆనందంగా జీవించటానికి మార్గం చూపిస్తుంది. హృదయ దౌర్బల్యం ప్రతివారికీ ఏదో ఒక సందర్భంలో కలుగక మానదు. శ్రీరాముడు, సీతాదేవి, ఆంజనేయుడు, అర్జునుడు ఏదో ఒక సందర్భంలో హృదయ దౌర్బల్యం అనుభవించినవారే. కానీ, దానినుండి బైట పడి ఘనులైన విధం మనకు పాఠం లాంటిది. – డా. చెంగల్వ రామలక్ష్మి -
పోపుల డబ్బా ఆర్థిక వ్యవస్థ
భారతీయ గ్రామీణ సమాజ చరిత్రలో ‘పోపుల డబ్బా’ అనేది కేవలం ఒక చిన్న డబ్బా కాదు. అది ఒక కుటుంబ ఆర్థిక క్రమశిక్షణకు, మహిళల దూరదృష్టికి, భవిష్యత్ భద్రతకు, స్వయం ఆధారిత జీవన విధానానికి ప్రతీక. ఇటీవలివరకూ గ్రామీణ ప్రాంతాలలో లక్షలాది కుటుంబాలు తమ దైనందిన జీవితంలో ఈ చిన్న డబ్బాను ఒక సూక్ష్మ బ్యాంకుగా ఉపయోగించేవి. ప్రజల జీవన అనుభవం, అవసరం, కష్టకాలాల నుంచి నేర్చుకున్న జ్ఞానం కలగలిపి ఏర్పడిన ఒక సహజమైన ఆర్థిక విధానం ఇది.గ్రామీణ కుటుంబాల్లో సంపాదన ప్రధానంగా వ్యవసాయం, కూలి, పశుపోషణ, చిన్న వ్యాపారాలు, చేతివృత్తులు వంటి రంగా లపై ఆధారపడి ఉంటుంది. ఈ ఆదాయం కూడా నెలనెలా స్థిరంగా కాకుండా కాలానుగుణంగా లభించేది. పంట అమ్మినప్పుడు మాత్రమే ఎక్కువ డబ్బు చేతికి వచ్చేది. మిగిలిన కాలంలో చాలా జాగ్రత్తగా ఖర్చు చేయాల్సి వచ్చేది. అందుకే గ్రామీణ మహిళలు ఇంటి ఖర్చులలో మిగిలిన చిల్లరను వృథా చేయకుండా పోపుల డబ్బాలో వేయడం అలవాటు చేసుకున్నారు. ఏడాది చివరికి అది కుటుంబానికి ఒక అత్యవసర నిధిగా మారేది.ఇంటికి వచ్చిన ప్రతి రూపాయి ఎలా ఖర్చు చేయాలి, ఏ అవసరానికి ఎంత కేటాయించాలి, ఎంత పొదుపు చేయాలి అనే విషయాల్లో మహిళలు అసాధారణమైన లెక్కలు వేసేవారు. కుటుంబంలో ఇతరులకు తెలియకుండా కాదు, కుటుంబ ప్రయోజనాల కోసమే ఈ పొదుపు నిర్వహించబడేది. అనారోగ్యం వచ్చినప్పుడు, పిల్లల పాఠశాల ఫీజు చెల్లించాల్సి వచ్చినప్పుడు, పంట విత్తనాలు కొనాల్సినప్పుడు, పండుగలు వచ్చినప్పుడు లేదా ఆకస్మిక ఖర్చులు ఎదురైనప్పుడు ముందుగా తెరవబడేది ఈ పోపుల డబ్బానే.నేటి భాషలో దీనిని ‘మైక్రో ఎమర్జెన్సీ ఫండ్’ అని పిలిచినా, మన గ్రామీణ సమాజం దానిని దశాబ్దాల క్రితమే ఆచరణలో పెట్టింది. సామాజిక కోణంలో పరిశీలిస్తే పోపుల డబ్బా మహిళల నాయకత్వాన్ని కూడా బలపరిచింది. కుటుంబంలో ఖర్చుపై నియంత్రణ, అవసరాల ప్రాధాన్యత నిర్ణయించడం, అనవసర వ్యయా లను తగ్గించడం, పిల్లల్లో పొదుపు అలవాటు పెంపొందించడం వంటి బాధ్యతలను మహిళలు సమర్థవంతంగా నిర్వహించేవారు. చిన్న పిల్లలకు కూడా మిగిలిన నాణేలను పోపుల డబ్బాలో వేయమని చెప్పడం ద్వారా చిన్నప్పటి నుంచే ఆర్థిక క్రమశిక్షణను నేర్పించేవారు. ఈ ప్రక్రియ వల్ల కుటుంబంలో ప్రతి రూపాయి విలువ తెలిసే సంస్కృతి ఏర్పడింది.నేటి ప్రవర్తనా ఆర్థిక శాస్త్రం చెప్పే ‘చిన్న అలవాట్లు పెద్ద ఆర్థిక విజయాలకు దారి తీస్తాయి’ అనే సిద్ధాంతాన్ని మన గ్రామీణ సమాజం ఎంతో కాలం క్రితమే జీవన విధానంగా స్వీకరించింది. పోపుల డబ్బా కేవలం గత తరాల జ్ఞాపకం కాదు; ఒక విలువైన సామాజిక సంపద. నేటి డిజిటల్ యుగంలో బ్యాంకింగ్ సేవలు విస్తరించినా, పోపుల డబ్బా వెనుక ఉన్న విలువలు – పొదుపు, మితవ్యయం, భవిష్యత్ ప్రణాళిక, కుటుంబ బాధ్యత, ఆర్థిక స్వయం సమృద్ధి– ఎప్పటికీ ప్రాసంగికమే. – డా. రక్కిరెడ్డి ఆదిరెడ్డి, పౌర సంబంధాల అధికారి, ఆర్ట్స్ కళాశాల, కేయూ -
ఉత్తర–దక్షిణ వారధి
ఎనిమిదేళ్ల వయసులోనే విజయవాడలో త్యాగరాజ ఆరాధనలో ఓ బాలుడు తొలి కచేరీ ఇచ్చాడు. కేటాయించింది ముప్పై నిమిషాలే అయినా, శ్రోతలు కాలగమనాన్నే మరిచిపోయేలా ఆ కచేరీ మూడు గంటలపాటు సాగిందని చెబుతారు. ఆ గానం విన్న హరికథా విద్వాంసుడు ముసునూరి సత్యనారాయణ మూర్తి భాగవతార్, ఆ ‘మురళీకృష్ణ’ అన్న అతడి పేరుకు ‘బాల’ను జోడించారు. అప్పటి నుంచి ఆయన బాలమురళీకృష్ణ అయ్యారు.1930 జూలై 6న తూర్పు గోదావరి జిల్లా శంకర గుప్తం అనే చిన్న గ్రామంలో జన్మించిన ఆ చిన్నారి, మున్ముందు భారతీయ శాస్త్రీయ సంగీతంలో శిఖరాగ్ర స్థాయికి చేరుకుంటారని ఎవరూ ఊహించి ఉండరు. కేవలం పదిహేనేళ్ల వయసులో 72 మేళకర్త రాగాలన్నింటినీ సంపూర్ణంగా ఆకళింపు చేసుకుని, ప్రతి రాగంలోనూ కృతులు రచించారు. ఆ కృతుల సంకలనమే ‘జనక రాగ కృతి మంజరి’. వర్ణాలు, కృతులు, థిల్లా నాలు, భావగీతాలతో కలిపి 400కు పైగా రచనలు చేసిన ఆయన, తెలుగుతో పాటు సంస్కృతం, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలీ, పంజాబీ భాష ల్లోనూ సమానమైన సౌందర్యంతో స్వరపరిచారు.కొత్త రాగాలు–తాళాలు‘సంప్రదాయం అంటే స్తబ్ధత కాదు, అది సజీవ ప్రవాహం’ అన్నదే బాలమురళి దృక్పథం. ప్రాచీన సంప్రదాయపు మూలాలను చెక్కుచెదరనివ్వకుండానే ఆయన కొత్త సరిహద్దులను తాకారు. మహతి, లవంగి, గణపతి, సర్వశ్రీ, సుముఖం, సిద్ధి, ఓంకారి వంటి సరికొత్త రాగాలను సృష్టించారు. వీటిలో కొన్ని కేవలం మూడు లేదా నాలుగు స్వరాలతోనే రూపొందినవి. అంతేకాదు, త్రిముఖి, పంచముఖి, సప్తముఖి, నవముఖి వంటి సరికొత్త తాళ పద్ధతులకు ఆయన ప్రాణం పోశారు.మూడు అష్టకాల విస్తృతి, అపార గాంభీర్యం, స్ఫటికంలాంటి స్పష్టమైన ఉచ్చారణ, గమకాల్లో అసాధారణ నైపుణ్యం ఆయనది. ప్రపంచవ్యాప్తంగా వేలాది కచేరీలు ఇచ్చిన ఆయన, పండిట్ భీమ్సేన్ జోషి, పండిట్ హరిప్రసాద్ చౌరాసియా, కిశోరీ అమోన్కర్ వంటి హిందు స్థానీ దిగ్గజాలతో జుగల్బందీలు నిర్వహించి, ఉత్తరాది–దక్షిణాది సంగీతాలకు వారధిగా నిలిచారు. గాత్రంతో పాటు వయోలిన్, వీణ, మృదంగం, కంజీరా, వయోలాలను అద్భుతంగా వాయించారు. ఆకాశవాణిలో ఏడు వేర్వేరు ప్రదర్శన విభాగాల్లో ‘టాప్ గ్రేడ్’’ సాధించిన ఏకైక సంగీతకారుడిగా చరిత్ర సృష్టించారు. రవీంద్రుని ‘గీతాంజలి’ని విదేశీ గాయక బృందంతో కలిసి ఆలపించడం, రవీంద్ర సంగీతాన్ని బెంగాలీలో రికార్డు చేయడం, జాజ్ ఫ్యూజన్ ప్రయో గాలు చేయడం, ఆయన సంగీత పరిధికి హద్దులే లేవని చాటిచెప్పాయి. వెండితెరపైనా బాలమురళి తనదైన ముద్ర వేశారు. 1967లో ‘భక్త ప్రహ్లాద’ చిత్రంలో నారదుడి పాత్రలో నటిస్తూ, ‘ఆది అనాదియు నీవే దేవా’ వంటి అమర గీతాలు ఆలపించారు.పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలు మూడింటినీ అందుకున్న అరుదైన కర్ణాటక సంగీత మహనీయుడు ఆయన. ఫ్రా¯Œ్స ప్రభుత్వపు ‘షెవాలియర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్’ వంటివి ఎన్నో అందుకున్న ఆయన 2016 నవంబర్ 22న చెన్నైలో కన్ను మూశారు. కానీ ఆయన స్వరం, కృతులు, రాగాలు సజీవంగా మారుమోగుతూనే ఉన్నాయి. – డా కొత్తపల్లి శ్రీనివాస వర్మ, సీనియర్ జర్నలిస్ట్ (జూలై 6న మంగళంపల్లి బాలమురళీకృష్ణ జయంతి) -
ఏం పండించాలో ప్రభుత్వమే చెప్పాలా?
ఇటీవల ఏడు సన్నరకాల వరి రకాలకు మాత్రమే తెలంగాణ ప్రభుత్వం క్వింటాలుకు రూ. 500 బోనస్ ప్రకటించింది. గతంలో 33 నోటిఫైడ్ రకాల వరికి ఈ ప్రోత్సాహకం ఉండగా, ఇప్పుడు బీపీటీ–5204, తెలంగాణ సోనా (ఆర్ఎన్ ఆర్–15048), కునారం సన్నాలు (కేఎన్ ఎం–1638), జైశ్రీరామ్, హెచ్ఎంటీ సోనా, డబ్ల్యూజీఎల్–44 (సిద్ధి), కేఎన్ ఎం–7715 అనే ఏడు రకాలకే పరిమితం చేశారు. ఇందుకు ప్రభుత్వం చెప్పే కారణం ఏమిటంటే... ఈ రకాలకే మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉంది. మిల్లింగ్ సులభంగా ఉంటుంది. ప్రభుత్వ సేకరణ ప్రక్రియ, వ్యయం కూడా తగ్గుతుంది. ఈ కారణాలు పరిపాలనా పరంగా సరైనవే కావచ్చు. కానీ ఈ నిర్ణయం వ్యవసాయ భవిష్యత్తుపై కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది.గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వం, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, అభివృద్ధి సంస్థలు రైతులకు పంటల వైవిధ్యం, రకాల వైవిధ్యం, తక్కువ నీరు వినియోగించే పంటలు, వాతావరణ మార్పులకు తట్టుకునే వ్యవసాయం గురించి చెబుతున్నాయి. సంప్రదాయ విత్తనాలను కాపాడాలని కూడా ప్రోత్సహిస్తున్నాయి. అయితే మరోవైపు కేవలం ఏడు సన్న వరి రకాలకే బోనస్ ఇవ్వడం ద్వారా రైతులకు భిన్నమైన సంకేతం వెళుతోంది. రూ. 500 బోనస్ చిన్న మొత్తం కాదు. ఏ రకం విత్తనం వేయాలనే నిర్ణయాన్ని ఇది ప్రభా వితం చేస్తుంది. క్రమంగా రైతులు ఇతర రకాలను వదిలి బోనస్ ఉన్న రకాలవైపు వెళ్లే అవకాశం ఉంది.రైతులు ఒక వరి రకాన్ని కేవలం మార్కెట్ ధర చూసి మాత్రమే ఎన్నుకోరు. నేల స్వభావం, నీటి లభ్యత, పంట కాలం, చీడపీడల నిరోధకత, గింజ నాణ్యత, గడ్డి దిగుబడి, ఇంటి అవసరాలు, స్థానిక వాతావరణ పరిస్థితులు– ఇలా అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఒక మండ లంలో బాగా పండే రకం, మరో మండలంలో అదే స్థాయిలో ఫలితం ఇవ్వకపోవచ్చు.తెలంగాణలో అత్యధిక విస్తీర్ణంలో సాగయ్యే రకం ఎంటీయూ–1010. మంచి దిగుబడి, స్థిరమైన పనితీరు, వివిధ నేలల్లో అనుకూలత, తక్కువ ప్రమాదం కారణంగా వేలాది మంది రైతులు ఈ రకాన్ని ఇష్టపడి సాగుచేస్తున్నారు. కానీ ఈ రకం బోనస్ జాబితాలో లేదు. మరోవైపు బీపీటీ–5204 వంటి రకం మంచి నాణ్యత కలిగిన బియ్యాన్ని ఇస్తుంది. కానీ ఎక్కువ కాలం, ఎక్కువ నీరు అవసరం. అగ్గితెగులు, దోమ పోటు వంటి చీడపీడలకు ఎక్కువగా గురవుతుంది.ప్రతి రకానికి దాని బలాలు, బలహీనతలు, ప్రాముఖ్యం ఉంటాయి. రాష్ట్రమంతా ఈ ఏడు రకాలపైనే ఆధారపడితే, విత్తనాలకు డిమాండ్ అకస్మాత్తుగా పెరిగి, కృత్రిమ కొరత ఏర్పడుతుంది. ఇది విత్తన ధరలను పెంచి, రైతులను ప్రైవేట్ విత్తన కంపెనీలపై మరింతగా ఆధారపడేలా చేస్తుంది. పరిమిత రకాల వల్ల మిల్లు యజమానులకు కొనుగోలు, మిల్లింగ్ ప్రక్రియ సులువు కావచ్చు; కానీ ప్రభుత్వ విధానాల వల్ల రైతులకూ, జీవ వైవిధ్యానికీ కలిగే ప్రయోజనాలు ఏమిటి?వైవిధ్యమే రైతుకు రక్షణవికారాబాద్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో రైతులతో చేసిన చర్చల్లో మరో వాస్తవం బయటపడింది. కొంతమంది రైతులు మార్కెట్ లేకపోవడంతో మంచి దిగుబడి ఇచ్చే రకాలను వదిలేశారు. మరికొందరు స్థానిక పరిస్థితులకు అనుకూలంగా ఉండే గోదావరి ఇసుకలు, సిద్ధ సన్నాలు, కుళ్లకర్వంటి సాంప్రదాయ రకాలను ఇప్పటికీ సాగు చేస్తున్నారు. అవి తక్కువ నీటితో పండుతాయి. ఇంటి వినియోగానికి అనుకూలం. కొన్ని రకాలు ఎండలను, మరికొన్ని అధిక వర్షా లను తట్టు కుంటాయి.ఇప్పుడు వాతావరణ మార్పులు మరింత తీవ్రమవుతున్నాయి. వర్షపాతం అనిశ్చితంగా మారుతోంది. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. చీడపీడల సమస్యలు కూడా పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వైవిధ్యమే రైతుకు రక్షణ. ఒకే రకాన్ని పెద్ద ఎత్తున సాగుచేస్తే ఒక చీడపీడ లేదా వ్యాధి వచ్చినప్పుడు భారీ నష్టం సంభవించే అవకాశం ఉంటుంది. కానీ వివిధ రకాలు సాగు చేస్తే ప్రమాదం తగ్గుతుంది. ఇదే వాతావరణ మార్పులకు తట్టుకునే వ్యవసాయానికి పునాది. సంప్రదాయ రకాలు మన వ్యవసాయ వారసత్వం. అవి కేవలం గతానికి చెందినవి కావు. భవిష్యత్తుకు కూడా అవసరమైన జన్యు సంపద. ఇవి కనుమరుగైతే తిరిగి రైతుల పొలాల్లోకి తీసుకురావడం చాలా కష్టం.ఇక్కడ అసలు ప్రశ్న ఏడు రకాలు మంచివా? కాదా? అనేది కాదు. రైతుల ఎంపికను ప్రభుత్వ ప్రోత్సాహకాల ద్వారా కుదించడం సరైన విధానమా? అనేదే అసలు ప్రశ్న. కొన్ని రకాలకే బోనస్ ఇవ్వడం కాకుండా, స్థానిక పరిస్థితులకు అనువైన రకాలను సాగు చేసే రైతులను ప్రోత్సహించవచ్చు. నీటి వనరులను వర్షాధార పంటల రక్షణకు సంధానించే వ్యవస్థలను ఏర్పాటు చేసుకునే రైతు సమూహాలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి. వాతావరణ మార్పులు పెరుగుతున్న ఈ కాలంలో... రైతులు ఎంచుకుంటున్న రకాలు, పంటలను మన విధానాలు తగ్గించకూడదు. మరింత విస్తరించేలా ఉండాలి.- భాగ్యలక్ష్మి, వ్యాసకర్త, వాటర్‌షెడ్ సపోర్ట్ సర్విసెస్ అండ్ యాక్టివిటీస్ నెట్వర్క్ (వాసన్) అసోసియేట్ డైరెక్టర్ -
'ప్రమాదపుటంచున' సోషలిస్ట్ క్యూబా
1823లో అమెరికా 5వ అధ్యక్షుడు మన్రో సిద్ధాంతం ప్రకారం లాటిన్ అమెరికా అంతా అమెరికాకు చెందుతుంది; పశ్చిమ భూగోళంలోకి యూరపు దేశాలు వలస రాకూడదు; తూర్పు భూగోళంలో అమెరికా జోక్యం చేసుకోదు. దక్షిణ అమెరికా దేశాలు అమెరికాకు చెందినవని (బ్యాక్ యార్డ్) అర్థం. ఇప్పుడు డోనాల్డ్ ట్రంప్ ఈ సిద్ధాంతాన్ని నిస్సిగ్గుగా అమలు చేయటానికి ప్రయత్నిస్తున్నారు.స్పానిష్–అమెరికన్ యుద్ధం ముగిసిన తర్వాత 1902 మే 20న క్యూబన్ రిపబ్లిక్ ఏర్పడింది. ఈ యుద్ధంలో స్పానిష్ వలస ప్రాంతా లైన క్యూబా, ప్యూర్టోరికో, గ్వామ్, ఫిలిప్పైన్స్లను అమెరికా స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత 1917 నుండి 1923 వరకూ అమె రికా మెరైన్లు క్యూబా ద్వీపాన్ని ఆక్రమించి సమ్మెలను అణిచివేస్తూ అమెరికా కార్పొరేట్ ప్రయోజనాల భుజం కాశారు. అమెరికా సైనిక ఆక్రమణ అధికారికంగా ముగిసినప్పటికీ, క్యూబాపై అజమాయిషీ కోసం ‘ప్లాట్’ సవరణను విధించింది. 1917లో పాలస్తీనా ఏర్పాటు చేసి 1948 వరకూ బ్రిటిష్‌వాళ్ళు కంట్రోల్ కోసం తీసుకొన్న మాండేట్ (అజమాయిషీ) లాంటిది ఇది. దీనితో వాషింగ్టన్కు సము చితమని భావించినప్పుడల్లా క్యూబా వ్యవహారాల్లో సైనిక జోక్యం చేసుకునే ‘అనియంత్రిత’ హక్కును పొందింది. కానీ సోషలిస్టు క్యూబా దీన్ని తిరస్కరించింది. ప్రపంచ మద్దతు అవసరం!క్యూబాపై గత 66 ఏళ్లుగా అమెరికా సాగించిన భయోత్పాతం, అలాగే ప్రస్తుతం తీవ్రతరమవుతున్న పాలన మార్పు ప్రయత్నాలన్నీ 1959 విప్లవానికి ముందు ఉన్న ప్లాట్ సవరణకూ, పుల్జెన్సియో బాటిస్టా ప్రభుత్వ నియంతృత్వంలోని సంబంధాలను పునరుద్ధరించటానికి ఉన్న అడ్డంకులను తొలగించటానికీ ఉద్దేశించినవి. సోష లిస్టు ప్రణాళిక ఆర్థిక విధానానికి బదులుగా... స్వేచ్ఛా విపణి పెట్టు బడిదారీ విధానం వైపు, సాంఘిక కోతల వైపు క్యూబా ప్రస్తుతం నడవబోతున్నది. ఫలితంగా క్యూబాలో ప్రభుత్వ ఆధీనంలోని నియంత్రిత ఆర్థిక వ్యవస్థ కూలిపోనుంది. ‘యుద్ధ ఆర్థిక వ్యవస్థ’ పేరిట ప్రవేశపెట్టనున్న ప్రభుత్వ పొదుపు చర్యలు, సాంఘిక కోతల ద్వారా ప్రజల కొనుగోలు శక్తి పడిపోయే ప్రమాదం ఉంది.సామ్రాజ్యవాద ఆంక్షలను క్యూబా ఎదుర్కోలేకపోయింది. చైనా, రష్యాల సహాయం అంతంతమాత్రంగా ఉంది. ట్రంప్ జన వరి నెలలో క్యూబాకు ఇంధన దిగుమతుల్ని నిషేధించాడు. ముడి చమురు ఎగుమతి దేశాలపై తీవ్ర ఆంక్షలుంటాయని హెచ్చరించారు. వెనెజులా, అమెరికా కబంధహస్తాల్లోకి వెళ్లిపోయింది. మెక్సికో వంటి దేశాలు సహాయాన్ని ఆపాయి. ఇంధన కొరతతో గంటలకొద్దీ క్యూబా అంధకారంలోకి వెళ్లాల్సిన పరిస్థితులేర్పడ్డాయి. క్యూబాలో 1959 విప్లవ సమానత్వ లక్ష్యాలు దూరం కాబోతు న్నాయి. ఒకప్పటి సోవియట్ యూనియన్ 1990వ దశకంలో కుప్ప కూలిన తర్వాత క్యూబాకు సంపూర్ణంగా ఆపన్నహస్తం అందించే వారే లేకపోయారు.క్యూబాకు వ్యతిరేకంగా అమెరికా చేస్తున్న ఆంక్షల దాడి... ప్రపంచ ఆధిపత్యానికి ఎదురయ్యే ప్రతీ సవాలునూ నాశనం చేయాలనే దాని ప్రయత్నానికి ఒక కేంద్రీకృత రూపం మాత్రమే. ఇటువంటి ప్రయత్నాలు ఇరాక్, అఫ్గా నిస్తాన్, లిబియా, సిరియాల విధ్వంసానికి, గాజాలో మారణ హోమానికి, ఇరాన్ పై యుద్ధానికి, వెనెజులా అధ్యక్షుడు మధురోను అపహరించి, ముడిచమురు స్వాధీనం చేసుకోవటానికి కారణ మయ్యాయి. మే 14న సి.ఐ.ఎ. డైరెక్టరు జాన్ రాట్ క్లిఫ్ హవానాకు వచ్చి పెట్టుబడిదారీ ఆర్థిక విధాన దిశగా సంస్కరించకపోతే క్యూబాను సర్వనాశనం చేస్తామని ఒత్తిడి ప్రకటించాడు. పెట్టుబడీ దారీ ఆర్థిక వ్యవస్థలకు ప్రత్యామ్నాయంగా వచ్చిన సోషలిస్టు విప్లవాలు మనుగడ సాధించాలంటే ప్రపంచ కార్మికుల సంఘీభావం, మద్దతు అవసరం.సోషలిస్టు ప్రణాళిక ఆర్థిక విధానానికి బదులుగా... స్వేచ్ఛా విపణి పెట్టుబడిదారీ విధానం వైపు, సాంఘిక కోతల వైపు క్యూబా ప్రస్తుతం నడవబోతున్నది. - బుడ్డిగ జమిందార్, వ్యాసకర్త, ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యవర్గ సభ్యులు -
ఆత్మహత్య వ్యక్తిగత వైఫల్యమా?
దేశంలో ప్రతి విద్యార్థి ఆత్మహత్య అనంతరం దాదాపు ఒకే విధమైన చర్చ కొనసాగుతుంది. పరీక్షల్లో విఫలమయ్యాడా? చదువు ఒత్తిడిని తట్టుకోలేకపోయాడా? మానసిక సమస్యలతో బాధపడుతున్నాడా? అంటే సమస్యను పూర్తిగా వ్యక్తి చుట్టూనే కేంద్రీకరిస్తున్నాం. అయితే సుప్రీంకోర్టు నియమించిన జాతీయ టాస్క్ ఫోర్స్ (ఎన్టీఎఫ్) మధ్యంతర నివేదిక ఈ దృక్పథాన్ని సవాలు చేస్తోంది. విద్యార్థి ఆత్మహత్యలను కేవలం వ్యక్తిగత కార ణాల ఫలితంగా చూడటం వాస్తవాన్ని అసంపూర్ణంగా అర్థం చేసుకోవడమే నని ఇది స్పష్టం చేస్తోంది.ఐఐటీ ఢిల్లీ విద్యార్థుల ఆత్మహత్యలపై సుప్రీంకోర్టు 2025లో ఏర్పాటు చేసిన జాతీయ టాస్క్ ఫోర్స్(ఎన్టీఎఫ్) మధ్యంతర నివేదిక విద్యార్థుల ‘ఆత్మహత్యలు అసలు సమస్య కాదు; అవి విద్యార్థి సంక్షో భానికి కనిపించే చివరి సూచన మాత్రమే’ అని పేర్కొంది. ఈ నివేదికలో అత్యంత ఆందోళనకరమైన గణాంకాల్లో ఒకటి, సర్వేలో పాల్గొన్న ప్రతి ముగ్గురిలో ఒకరు తమను క్యాంపస్‌లో ‘బయటి వ్యక్తులు’గా భావిస్తున్నట్లు వెల్లడైంది. భాషా సమస్యలు, సామాజిక–ఆర్థిక అసమానతలు, కుల/వర్గ వివక్ష ఈ దూరాన్ని మరింత పెంచుతున్నాయి.మరోవైపు కేవలం 56 శాతం మంది మాత్రమే తమ విద్యాసంస్థ... సమస్యలను నిష్పక్షపాతంగా పరిష్క రిస్తుందని విశ్వసిస్తున్నారు. ఈ గణాంకాలు విద్యార్థి సంక్షోభం వ్యక్తిగతం మాత్రమే కాక, సంస్థాగత స్వభావం కూడా కలిగి ఉందని సూచిస్తున్నాయి. ఎన్టీఎఫ్ క్షేత్రస్థాయి అధ్యయనాలు కూడా ఇదే స్పష్టం చేశాయి. అందువల్ల ప్రతి విద్యార్థి ఆత్మహత్య అనంతరం ‘అతను ఎందుకు తట్టుకోలేకపోయాడు?’ అనే ప్రశ్నతో పాటు ‘అతను సంక్షోభంలో ఉన్న ప్పుడు వ్యవస్థ ఏ విధంగా స్పందించింది?’ అనే ప్రశ్నను కూడా పరిశీలించాలి.ఎన్టీఎఫ్ ప్రకారం... విద్యార్థి ఆత్మహత్యలను కేవలం వ్యక్తిగత మానసిక ఆరోగ్య సమస్యగా కాకుండా, విద్యాసంస్థల జవాబుదారీతనం, క్యాంపస్ సంస్కృతి, మద్దతు వ్యవస్థల నాణ్యతకు సంబంధించిన అంశంగా కూడా చూడాలి. విద్యార్థి మనసులో ‘నేను ఒంటరిని’ అనే భావన కన్నా ‘ఇక్కడ నాకో మద్దతు ఉంది’ అనే విశ్వాసాన్ని పెంపొందించగలిగితేనే ఈ విషాద ఘటనల సంఖ్య తగ్గే అవకాశం ఉంటుంది. ఆ విశ్వాసాన్ని నిల బెట్టడమే నేటి విద్యావ్యవస్థ మొదటి ధర్మం. – వంగవోలు రవి, ఉపాధ్యాయుడు -
మాకు చిన్నతనం నుంచి అబ్బిన అలవాటు..
కొద్ది రోజుల క్రితం అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో హాలండ్ – జపాన్ మధ్య ‘ఫుట్‌బాల్ మ్యాచ్’ జరిగింది. వందలాది జపానీయ అభిమానులు, జపాన్ నుంచి ప్రత్యేకంగా వెళ్ళి ఆ ఆటను చూచి, అనందించి, తిరిగి వెళ్ళారు. ఆట 2–2 స్కోరుతో ‘డ్రా’గా ముగిసింది. అసలు విశేషం ఆట ముగిసిన తరవాత జరిగింది.జపాన్ నుంచి వచ్చిన అభిమానులందరూ కలిసి, స్టేడియంలో వాళ్ళు కూర్చొన్న భాగాన్ని ఊడ్చి, తుడిచి, అద్దంలా శుభ్రం చేసి, పోగయిన చెత్తను సంచీలలో తీసుకువెళ్ళి కుప్పతొట్లలో పోసి వెళ్ళారు. ‘ఎక్కడికయినా వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు, అక్కడ మా వల్ల పోగయిన చెత్తను మేమే శుభ్రం చేసివెళ్ళటం మాకు చిన్నతనం నుంచి అబ్బిన అలవాటు’ అన్నారట.ఈ చర్యతో వాళ్ళు మనకు మన సనాతన సంప్రదాయం బోధించే రెండు ముఖ్య ధర్మాలను ఆచరించి చూపిన ట్టయింది. మొదటిది ‘ఆత్మవత్ సర్వభూతాని’ – అన్ని ప్రాణులూ మన లాంటివే అన్న ధర్మం. కనక, మన వలన ఇతరులకు కష్టం కలగకూడదు. రెండు, అశుభ్రమైన పరిసరాలలో ఏ పనీ సమర్థంగా, తృప్తికరంగా జరపలేం, కార్యసాధనకు ఏకాగ్రత అవసరం. ఏకాగ్రతకు శుచి శుభ్రతలు దోహదం చేస్తాయి. లౌకికమైన పనుల విషయంలోనూ, ఆధ్యాత్మిక సాధనల విషయాల్లోనూ అన్ని చోట్లా ఇది వర్తిస్తుంది.యోగ శాస్త్రం చెప్పే యమ, నియమాలలో ప్రప్రథమ నియమం ‘శౌచం’. ‘శౌచం దైవీ గుణం, దాన్ని ఆచరించు; అశౌచం ఆసురీ గుణం, దాన్ని ఆచరించకు’ అని భగవద్గీత బోధిస్తుంది. ముఖ్యంగా పూజా, ధ్యానాది సాధనలలో పరిసరశుద్ధీ, ద్రవ్యశుద్ద్ధీ, శరీరశుద్ధీ మొదలైనవి చిత్తశుద్ధికీ, చిత్త ఏకాగ్రతకూ తోడ్పడతాయి అని పెద్దలు పదే పదే సూచిస్తూ ఉంటారు. జపాను అభిమానులు క్రీడాంగణ శుభ్రత పట్ల చూపిన నిబద్ధతను, ఆస్తిక గణాలు విద్యాలయాలూ, వీధులూ ఇత్యాది బహిరంగ ప్రదేశాలలోనూ, పుణ్యక్షేత్రాలూ, తీర్థాల లాంటి పవిత్ర ప్రదేశాలలోనూ చూపగలిగితే ఫలితాలు మహత్తరంగా ఉంటాయి. – ఎం. మారుతి శాస్త్రి -
అగ్రస్థానం నుండి అప్రస్తుతానికి?
అమెరికా సంయుక్త రాష్ట్రాలు స్వాతంత్య్రం ప్రకటించుకొని 250 సంవత్సరాలు పూర్తవబోతున్నది. 1776 జూలై 4న 13 కాలనీలు స్వాతంత్య్రం ప్రకటించుకోవటంతో యూఎస్ఏ దేశానికి పునాదిపడింది. క్రమంగా స్పానిష్, మెక్సికన్లతో యుద్ధాలు, కొనుగోళ్లతో అది విస్తరించింది. 1941లో జపాన్ పెరల్ హార్బర్‌పై దాడితో రెండవ ప్రపంచ యుద్ధంలో క్రియాశీలకమైంది. 1945లో ప్రపంచ జీడీపీలో 50 శాతం వాటాతో బలమైన ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. 1969లో చంద్రుడిపై కాలుమోపి, 1970 దశకంలో అర్పా నెట్, తదుపరి ఇంటర్నెట్ ద్వారా 1980లలో సిలికాన్ వ్యాలీ గుండా ఐటీ రంగాన్ని శాసించింది. 1991లో సోవియట్ విచ్ఛిన్నంతో ప్రపంచంలో ఏకైక అగ్రరాజ్యంగా అవతరించింది.అగ్ర లక్షణాలుఒక దేశం అగ్రరాజ్యంగా లేదా ప్రపంచ శక్తిగా ఎదగాలంటే నాలుగు అంశాలు కీలకం. 1. మాతృదేశం నుండి సుదూర ప్రాంతా లలో శత్రువులను నిలువరించగలగాలి. 2. ప్రపంచ వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థలు, రవాణా మార్గాలను నియంత్రించగలగాలి. 3. ప్రపంచ స్థాయి వ్యవస్థలను సృష్టించి, ఆదర్శప్రాయమైన చట్టాలు, నిబంధన లను ఏర్పరచాలి. 4. ఆ దేశపు విలువలు, సంప్రదాయాలు, భాష లను ప్రపంచం అనుసరించాలి.ప్రపంచవ్యాప్తంగా 750కి పైగా సైనిక స్థావరాలతో యూఎస్ఏ ఏ ప్రాంతంలోని శత్రువునైనా నిలువరించగలుగు తుంది. ప్రపంచ జీడీపీలో 25 శాతం వాటా కలిగి, ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్వంటి సంస్థల ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసిస్తున్నది.హాలీవుడ్, పాప్/జాజ్ సంగీతం, ప్రజాస్వామ్య వ్యవస్థల ద్వారా ప్రపంచ సంస్కృతులను ప్రభావితం చేస్తున్నది. సాలీనా 700 బిలి యన్ డాలర్ల ప్రైవేట్ ఆర్ అండ్ డీ వ్యయం, 500 బిలియన్ డాలర్ల దాతృత్వ విరాళాల ద్వారా ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నది.తిరోగమన రాజ్యం2000 సంవత్సరంకల్లా యూఎస్ఏ తిరుగులేని ఏకైక అగ్ర రాజ్యంగా అభివృద్ధి చెందిందనటంలో సందేహం లేదు. కానీ 2025 కల్లా ఇంటా, బయటా అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నది. ‘అమె రికా నాయకత్వపు ప్రపంచం నుండి క్రమంగా అమెరికాతో కూడిన ప్రపంచ రాజకీయ వ్యవస్థ’ దిశగా ప్రపంచం ప్రయాణిస్తున్నట్లుగా జియో పొలిటికల్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అమెరి కాను ఒక తిరోగమన అగ్రరాజ్యంగా అభివర్ణిస్తున్నారు. చరిత్ర కారుడు ఆర్థర్ షెల్లింగర్ అభిప్రాయపడినట్లు ‘అమెరికా ఒక ప్రయోగం మాత్రమే, తయారీ పూర్తయిన ఉత్పత్తి కాదు’.అమెరికన్ ప్రభుత్వం క్రమంగా అప్పుల ఊబిలో చిక్కుకుంటు న్నది. ప్రభుత్వ అప్పు జీడీపీ కంటే 120 శాతం ఎక్కువగా ఉన్నది. ఇది 200 శాతానికి చేరితే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది.ప్రపంచ రిజర్వ్ కరెన్సీలో యూఎస్ వాటా 71 నుండి 59 శాతానికి పడిపోయింది. లావాదేవీలకు అమెరికన్ డాలర్‌కు ప్రత్యామ్నాయంగా చైనీస్ యువాన్ కుదురుకుంటున్నది. బ్రిక్స్ దేశాలు డాలర్ ఆధిపత్యానికే సవాలు విసురుతున్నాయి. చైనా, రష్యా, ఈయూ,ఇండియా ప్రత్యా మ్నాయ రాజకీయ శక్తులుగా బలపడుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫ్యూజన్ ఎనర్జీ, సెమీకండక్టర్లు, అంత రిక్ష పరిశోధనలలో చైనా గట్టి పోటీనిస్తున్నది. మాదకద్రవ్యాలు, గన్‌కల్చర్ అమెరికన్ సమాజాన్ని అతలాకుతలం చేస్తున్నాయి.కుప్పకూలకపోయినా...యూకే (ఇంగ్లండ్) తన రవి అస్తమించని సామ్రాజ్యంతో ప్రపంచాన్ని సుమారు వంద సంవత్సరాలు (1850–1950) పాలించిందనే చెప్పాలి. ప్రపంచ జీడీపీలో అప్పటి బ్రిటన్ వాటా 25శాతం. అప్రతిహతమయిన నౌకాబలం, ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన వలసలు, సముద్ర మార్గాల మీద ఆధిపత్యంతో బ్రిటన్ ప్రపంచాన్ని శాసించింది. బ్రిటన్‌తో పోలిస్తే అమెరికన్ ఆధిపత్యం భిన్నంగా ఉంటుంది. అమెరికా ఇతర దేశాలను ఆక్రమించి వలసలు స్థాపించలేదు. ఆధునిక నౌకా, వైమానిక సైనిక బలాలతో పాటుగా, టెక్నాలజీ రంగంలో ఆధిపత్యం, వరల్డ్ బ్యాంకు, ఐఎంఎఫ్‌లపై గుత్తాధిపత్యం, డాలర్ ద్వారా ప్రపంచ వాణిజ్యంపై ఉడుంపట్టు పట్టి, నాటో మిత్రదేశాల సహకారం దన్నుగా యూఎస్ఏ అగ్ర రాజ్యంగా ఏర్పడింది. యూఎస్ఏ, యూకే రెండూ మాతృ దేశాన్ని సురక్షితంగా ఉంచుకొని, శత్రువులను కొల్లగొట్టడమనే ప్రాథమిక సూత్రాన్ని అమలుపరచాయి. రెండువైపులా శత్రుదుర్భేద్యంగా విశా లమైన అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాలు ఉండటం, అపార మైన సహజవనరులు యూఎస్ఏకు భౌగోళికంగా కలిసి వచ్చాయి. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత, యూకే బలహీనపడటం యూఎస్ఏకు అనుకోని వరంగా పరిణమించింది.యుద్ధాలు, ఆక్రమణల వలన సామ్రాజ్యాలు కూలిపోవు. సామ్రాజ్యాలు అంతర్గతంగా బలహీనపడి విచ్ఛిన్నమవుతాయని చరిత్ర చెబుతున్నది. 1950 కల్లా బ్రిటిష్ సామ్రాజ్యం విచ్ఛిన్నమైంది. వలస సామ్రాజ్యాన్ని నిర్వహించటానికి అయ్యే ఖర్చు 1950లో యూకే జీడీపీలో 10 శాతం. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత యూకే ఆర్థికంగా బలహీనపడి వలస పాలన ఖర్చులను భరించే స్థితిలో లేక వలస ప్రాంతాలకు తప్పనిసరి పరిస్థితుల్లో స్వాతంత్య్రం ప్రకటించింది. 1991 కల్లా ఆర్థిక వ్యవస్థ విచ్ఛిన్న మవటంతో సోవియట్ యూనియన్ కూలి పోయింది. 1945లో యూకే, 1991లో సోవియట్ మాదిరిగా యూఎస్ఏ ఇప్పుడు అకస్మాత్తుగా కూలిపోయే అవకాశం లేదు. కానీ క్రమంగా బలహీన పడి అగ్రరాజ్య స్థాయిని కోల్పోయే సూచనలు పుష్కలం.ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి మానవ వనరులను యూఎస్ఏ ఆకర్షించింది. 1820–1860 కాలంలో వలస వచ్చిన ఐరిష్, జర్మన్లు మధ్య యూఎస్ఏ వ్యవసాయాభివృద్ధికి పునాది వేశారు. 1880–1924 మధ్యకాలంలో వచ్చిన యూదులు, ఇటాలి యన్లు తూర్పు, ఈశాన్య యూఎస్ఏలో పారిశ్రామిక విప్లవానికి ఆద్యులు. 1925–1965 మధ్యకాలంలో జర్మనీ, రష్యా, తూర్పు ఐరోపాల నుండి శరణార్థులుగా వచ్చిన శాస్త్రవేత్తలు యూఎస్ఏ అణ్వస్త్ర పరిజ్ఞానానికి, కంప్యూటర్ విప్లవానికి దోహదపడ్డారు. వీరిని యూఎస్ఏ ఆహ్వానించకపోతే సోవియట్ ఏకైక అణ్వస్త్ర దేశంగా ఏర్పడేది. 1965–2000 మధ్యకాలంలో భారత్, తైవాన్‌ల నుండి వచ్చిన టెక్ నిపుణులు సిలికాన్ వ్యాలీ విజయానికి కారణం. వీరు లేకపోతే జపాన్ ప్రపంచ సెమీకండక్టర్, ఐటీ శక్తిగా ఆవిర్భవించేది. ఇటీవలి వలసదారుల వ్యతిరేక ఉద్యమం కేవలం అమెరికన్ ఐడెంటిటీ రాజకీయాలలో భాగమే. జపాన్ నిపుణులైన వలసదారు లను ప్రోత్సహించక పోవటంతో ధనిక దేశమైనా ప్రపంచ రాజకీ యాలలో ప్రాధాన్యత సాధించలేక పోయింది. సోవియట్ వలస లను నిషేధించి కూలిపోయింది. యూఎస్ఏ ఆర్థిక, శాస్త్ర, సాంకేతిక వ్యవస్థలను నిర్వహించటానికి సాలీనా కనీసం 2 మిలియన్ల వలస నిపుణులను ఆహ్వానించాల్సి ఉంటుంది. లేకపోతే ఈ నైపుణ్య కార్మి కులను యూరోపియన్ యూనియన్, చైనా ఎగరేసుకుపోతాయి. రాబోయే అర్ధ శతాబ్దంలో ప్రపంచ అగ్రరాజ్యం ఎవరనేదిముందుతరం సాంకేతిక పరిజ్ఞానాలను ఎవరు గుప్పిట్లో పెట్టుకుంటా రనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. 2076 ప్రపంచాధిపత్యం రేసులో కూటములు, పొత్తులు కీలకం. ఈ రెండు అంశాలలో యూఎస్ఏకు దుశ్శకునాలు కన్పడుతున్నాయి. కెనడా, యూరోపియన్ యూనియన్, యూకేలతో మొదలుపెట్టి, భారత్ వరకు అందరు మిత్రులను దూరం చేసుకోవటం యూఎస్ఏకు దురదృష్టకరం. 2050 కల్లా ప్రపంచ జీడీపీలో వాటా 15 శాతానికి పడి పోయి, ప్రభుత్వ రుణం జీడీపీలో 200 శాతానికి చేరి వలసలు పూర్తిగా ఆపివేస్తే యూఎస్ఏ అగ్రరాజ్య స్థానం కోల్పోతుంది. ధనిక దేశంగా కొనసాగినా, 2075కల్లా ప్రస్తుత జపాన్, యూకేల వలే అప్రస్తుతపు, అసందర్భపు, అప్రాముఖ్యతపు శక్తిగా మిగిలిపోయే ప్రమాదం ఉన్నది.-వ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్); సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు-గురజాల శ్రీనివాసరావు -
సాయుధ పోరాటంలో తొలి అమరుడు
తెలంగాణ సాయుధ పోరాటం దొడ్డి కొమరయ్య ప్రాణత్యాగంతోనే మొదలయ్యిందనడం అతిశయోక్తి కాదు. అప్పటి గ్రామీణ తెలంగాణలో జీవితం అంటేనే వెట్టిచాకిరి. భూమి మీద హక్కు దొరలది, శ్రమ మాత్రం రైతులది. కడవెండిలో దేశ్‌ముఖ్ రాపాక రాంచంద్రా రెడ్డి, అతని తల్లి జానమ్మ ఆధిపత్యం ప్రజల జీవితాలను కట్టుబానిసత్వంలోకి నెట్టాయి. ఈ అన్యాయాలపై గళమెత్తినవాడు కొమురయ్య అన్న దొడ్డి మల్లయ్య. ఆ గళం చుట్టూ ప్రజలు కూడబలుక్కునేసరికి, అది ఉద్యమంగా మారింది.ఆంధ్రమహాసభ ప్రభావంతో కడవెండి గ్రామం ఒక చిన్న విప్లవ కేంద్రంగా మారింది. ‘భూమి, భుక్తి, వెట్టి విముక్తి’ అనే నినాదం మార్మోగింది. యువతరం చైతన్యవంతమైంది. దేశ్‌ముఖ్ వర్గం ఉద్య మాన్ని అణిచివేయడానికి అరెస్టులు, దాడులు ప్రారంభించింది. 1946 జూలై 4న జరిగిన ఘటన తెలంగాణ చరిత్రను శాశ్వతంగా మార్చింది. ఆ రోజు గడ్డం నర్సింహారెడ్డి నేతృత్వంలో గూండాల గుంపు గ్రామంపై దాడి చేసింది. కానీ భయపడకుండా ప్రజలు ఐక్యంగా ర్యాలీ చేశారు.ఆ ర్యాలీ ముందు వరుసలో నిలిచిన యువకుడు దొడ్డి కొమరయ్యకు దేశ్‌ముఖ్ తొత్తులు పేల్చిన తూటా తగిలింది. అక్కడే నేలకూలాడు. అతడి రక్తం తెలంగాణ రైతాంగ పోరాటానికి ఎరుపు రంగు పూసింది. ప్రజలు రోడ్లపైకి వచ్చారు. దొడ్డి కొమరయ్య పేరు ఒక నినాదంగా మారింది. అతని బలిదానం తెలంగాణ రైతాంగ ఉద్యమానికి దిశానిర్దేశం చేసింది. వేలాది గ్రామాలు నిరంకుశ పాలన నుంచి విముక్తమయ్యాయి. లక్షలాది ఎకరాలు... భూమిలేని పేదలకు పంచిపెట్టడానికి కారణ మయ్యింది. ప్రపంచ విప్లవాల చరిత్రలో తెలంగాణ పోరాటాన్ని అమరం చేసింది. అతను ఈ రోజు కూడా జీవిస్తున్నాడు, ప్రతి ప్రతిఘటనలో, ప్రతి నినాదంలో, ప్రతి సమానత్వ స్వప్నంలో! – మామిండ్ల రమేష్ రాజా, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి (జూలై 4న దొడ్డి కొమురయ్య వర్ధంతి) -
భారతీయతకు ప్రతీక స్వదేశీ క్రైస్తవం
భిన్న సంస్కృతులు, మతాలు, భాషలు, తత్వాలు కలిసిమెలిసి వికసించినదే భారతీయత. సముద్ర వాణిజ్య మార్గాల ద్వారా ప్రపంచంతో ఏర్పడిన సంబంధాలు భారతీయ సంస్కృతిని మరింత సుసంపన్నం చేశాయి. ఈ చారిత్రక నేపథ్యంలోనే భారతీయ క్రైస్తవ సంప్రదాయాన్ని అర్థం చేసుకోవాలి.క్రైస్తవ విశ్వాసం భారతదేశానికి వలస పాలనతో వచ్చిందనే అభిప్రాయం చారిత్రకంగా సత్యం కాదు. క్రైస్తవ సంప్రదాయం ప్రకార, అపొస్తలుడైన ‘తోమా’ క్రీ.శ. 52లో మలబార్ తీరానికి చేరుకుని సువార్త ప్రకటించగా, క్రీ.శ. 72లో మైలాపూర్‌లో హతసాక్షిగా మరణించాడు. ఇది దేశంలో క్రైస్తవ వార సత్వానికి దాదాపు రెండువేల ఏళ్ళ చరిత్రను సూచిస్తుంది. ఈ చారిత్రక వార సత్వాన్ని గుర్తు చేస్తూ, 2021లో వివిధ క్రైస్తవ సంప్రదాయాలకు చెందిన నాయకులు కలిసి జూలై 3ను భారతీయ క్రైస్తవ దినోత్సవంగా ప్రకటించారు. ఇది ఏ ఒక్క చర్చికి చెందిన మతపరమైన పండుగ కాదు; భారత్‌లో క్రైస్తవుల ఉనికి, సేవా వారసత్వం, భారతీయ సంస్కృతితో వారి అనుబంధాన్ని స్మరించుకునే జాతీయ సందర్భం. ఉత్తర భారతంలోని కొన్ని ప్రాంతాల్లో దీనిని ‘యేసు భక్తి దివస్’ అని కూడా వ్యవహరిస్తారు. భార తీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలోని ‘భక్తి’ తత్త్వాన్ని ప్రతిబింబించే పేరుగా ఇది ప్రాచు ర్యంలోకి వచ్చింది.భారతదేశ నిర్మాణంలో క్రైస్తవ సమాజం అందించిన సేవలు విశేషమైనవి. క్రైస్తవ విద్యా సంస్థలు లక్షలాది మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు విలువలు, క్రమశిక్షణ, సేవాభావాన్ని అందించాయి. అనేక ఆసు పత్రులు నిర్మించాయి. మహమ్మారులు తలెత్తినప్పుడు కుల మత భేదాలకు అతీతంగా ఆదుకొన్నాయి. సామాజిక సేవ క్రైస్తవ విశ్వాసంలో అంతర్భాగం. అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు, వికలాంగుల పునరావాస కేంద్రాలు, మహిళా సాధికారత, గ్రామీణాభివృద్ధి, గిరిజన సంక్షేమ కార్య క్రమాల ద్వారా అనేక సంస్థలు సమాజాభివృద్ధికి విశేషంగా దోహదపడ్డాయి.తెలుగు భాషాభివృద్ధిలో కూడా క్రైస్తవ పండితుల పాత్ర ప్రస్తావనీయ మైనది. నిఘంటువులు, వ్యాకరణ గ్రంథాలు, బైబిల్ అనువాదాలు, ముద్రణా సాంకేతికత ద్వారా తెలుగు గద్యాభివృద్ధికి వారు విశేష కృషి చేశారు. భారతదేశ బలం దాని వైవిధ్యంలో ఉంది. ఆ వైవిధ్యానికి భారతీయ క్రైస్తవ సంప్రదాయం కూడా రెండువేల సంవత్సరాలుగా తనదైన ముద్ర వేసింది. – డా. శామ్యూల్ జాన్ ఆదూరి (నేడు భారతీయ క్రైస్తవ దినోత్సవం) -
స్క్రీన్కు దూరం – లైఫ్‌కు దగ్గర!
2026 మార్చి 25న అమెరికాలోని లాస్ ఏంజిల్స్ కోర్టు ఇచ్చిన తీర్పు చర్చనీ యాంశమైంది. ఇన్స్టాగ్రామ్ మాతృసంస్థ మెటా, యూట్యూబ్ మాతృసంస్థ గూగుల్ ఒక యువతి మానసిక ఆరోగ్యానికి హాని కలిగించాయని జ్యూరీ నిర్ధారించింది. బాధితురాలికి 6 మిలియన్ డాలర్ల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది.ఈ సందర్భంగా న్యాయ నిపుణులు సోషల్ మీడియా యాప్స్ బయటకు వినోదం, సమాచారం, స్నేహాలు అందిస్తున్నట్టే కనిపించినా లోపల మాత్రం పిల్లల మానసిక ఆరోగ్యాన్ని మెల్లగా దెబ్బతీస్తున్నాయని వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే మొదటిసారి సోషల్ మీడియా వేదికలను ‘లోప భూయిష్టమైన ఉత్పత్తులు’గా గుర్తిస్తూ వచ్చిన తీర్పు కావడం దీనికి మరింత ప్రాధాన్యం తెచ్చింది.ఈ కేసులో వాది అయిన కెలీ అనే యువతి చిన్న వయస్సులోనే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వాడటం ప్రారంభించింది. ఇతరులతో తన రూపాన్ని పోల్చుకోవడం, బ్యూటీ ఫిల్టర్స్ వాడటం, లైక్స్, కామెంట్స్ కోసం ఎదురుచూడటం ఆమె మానసిక స్థితిని ప్రభావితం చేశాయి. చివరకు ఆమె డిప్రెషన్, ఆందోళన, బాడీ డిస్మోర్ఫియా వంటి సమస్యలకు గురైంది. ‘నా జీవితంలోని అమూల్యమైన సంవత్సరాలు స్క్రీన్ వెనుక మాయ మయ్యాయి’ అన్న ఆమె మాటలు ఎందరినో ఆలోచనలో పడేశాయి.భారతదేశంలో 75 కోట్లకు పైగా ఇంటర్నెట్ వినియోగదారులు ఉండగా, 40 కోట్లకు పైగా సోషల్ మీడియా వేదికలను వాడుతున్నారు. ముఖ్యంగా 13 నుండి 24 ఏళ్ల మధ్య యువత రోజుకు అనేక గంటలు యాప్స్‌లో గడుపు తున్నారు. ఇందువల్ల నిద్రలేమి, ఆందోళన, సైబర్ బుల్లీయింగ్, బాడీ షేమింగ్ వంటి సమస్యలు పెరుగుతున్నాయని మానసిక ఆరోగ్య నిపుణులు హెచ్చరి స్తున్నారు. పాఠాలపై శ్రద్ధ తగ్గడం, కుటుంబ సంబంధాలు దూరమవడం, అవుట్డోర్ ఆటలపై ఆసక్తి తగ్గడం వంటి ప్రభావాలు స్పష్టంగా కనిపిస్తు న్నాయి. భారతదేశపు ‘ఎకనామిక్ సర్వే 2025–26’ నివేదిక పిల్లల్లో పెరుగు తున్న డిజిటల్ వ్యసనాన్ని ప్రస్తావిస్తూ, సోషల్ మీడియా వినియోగానికి తప్పనిసరి వయసు నిర్ధారణ ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. భారత ప్రభుత్వం కూడా ఆస్ట్రేలియా తరహాలో 18 ఏళ్ల లోపు వారికి వయస్సు ఆధారిత నియంత్రణలు పెట్టాలనీ, రాత్రి పూట సోషల్ మీడియా లాగిన్ అవ్వకుండా టైమ్–లిమిట్స్ పెట్టాలనీ యోచిస్తోంది.లాభాల కోసం రూపొందించిన అడిక్టివ్ టెక్నాలజీ ఇప్పుడు పిల్లల బాల్యాన్నీ, యువత మానసిక ఆరోగ్యాన్నీ ప్రభావితం చేస్తోందనే విషయం స్పష్టమవుతోంది. ఈ విధమైన సాంకేతికతను తిరస్కరించడం సాధ్యం కాక పోయినా, బాధ్యతాయుత వినియోగం అత్యవసరం. భవిష్యత్ భారతాన్ని నిర్మించే యువతను పుస్తకాలు, క్రీడలు, సృజనాత్మకత, మానవ సంబంధాల వైపు మళ్లించాల్సిన సమయం వచ్చింది. – ఏటూరి సోమశేఖర్ శర్మ, విశ్రాంత జిల్లా విద్యాశాఖాధికారి -
కోరికల తరంగాలు..
నదిలో ఇసుకలాంటివి కోరికలు. ఎంత తవ్వినా నదిలో ఇసుక తరిగిపోదు. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో కొత్తగా ఇసుక మేటలు వేస్తూనే ఉంటుంది. అలాగే మనసులో కోరికలు తీరేవి తీరుతూంటే కొత్తవి పొటమరిస్తూంటాయి. అందుకనే మనసు కోరికల పుట్ట అని అన్నారు.ఈ కోరికలన్నీ తీరిన తర్వాత పరమార్థం విషయంలో ఆలోచిస్తాననే వాళ్ళున్నారు. అది జరిగే పనేనా? ‘తరంగ ప్రశమా దూర్ధ్వం స్నాస్యామీతి విమూఢతా’ సముద్రంలో తరంగాలన్నీ తగ్గి పోయిన తర్వాత స్నానం చేస్తాను అని అనటం మూఢత్వం కాక మరేమిటి?ఒక గురువుగారు తన శిష్యుణ్ణి సంసార తాపత్రయం నుంచి బయటపడేద్దామనే సత్సంకల్పంతో ఉపదేశం చేద్దామని పిలిచాడు. సంసారి అయిన ఆయన శిష్యుడు, గురువుకు దయకలిగి తనను ఉద్ధరించాలనుకొని ఉపదేశం చేస్తానన్నాడని సంతోషించటానికి బదులుగా ఈ బరువు ఇప్పటి నుంచీ ఎందుకు అను కున్నాడు. ‘అయ్యా! వచ్చే సంవత్సరం మా అమ్మాయి పెళ్ళి చేస్తాను. ఇప్పటినుంచి ఆ పెళ్ళి పనుల్లో సతమతమవు తున్నాను. మీరు ఉపదేశం చేసే మంత్రం అనుష్ఠానం చేసేందుకు సమయం దొరకదు కనుక పెళ్ళయిన తర్వాత ఉపదేశం తీసుకుంటాను. దయ జూపండి’ అన్నాడు. ‘సరే!’ అన్నారు గురువుగారు. ఇలాగే అప్పుడు ఇప్పడు అంటూ ఎన్నో సాకులు చెబుతూ చాలా సంవత్సరాలు గడిపాడు. ఎనభై సంవత్సరాల వయస్సు మీద పడింది.ఒకసారి గురువు తీర్థయాత్రలకు బయలుదేరారు. ఆయనతోపాటు ఈ 80 ఏళ్ళ శిష్యుడు కూడా బయలు దేరాడు. ఆ రోజు కార్తీక పూర్ణిమ. ఇద్దరూ సముద్రానికి వెళ్ళారు. ముందు ఈ సంసారి శిష్యుడు సముద్ర స్నానం చేశాడు. గురువుగారు మాత్రం గట్టునే ఉన్నారు. ‘అయ్యా! ఎందుకు ఆలస్యం. మీరు కూడా స్నానం చేయండి వెళదాం’ అన్నాడు. ‘అలాగేనోయ్! ఈ తరంగాలు తగ్గిపోయిన తర్వాత చేయవచ్చులే అని ఆగాను’ అన్నారు గురువు.‘అయ్యా! మీరన్నది ఎప్పటికైనా జరిగేపనేనా? సముద్రంతో పాటే తరంగాలు పుట్టాయి గదా! అవెప్పుడు తగ్గుతాయి?’ అన్నాడు. ‘ఏమోయీ! నీ సంసార తాపత్రయాలు కూడా తరంగాల్లాగానే ఒకదాని వెనుక మరొకటి వస్తూన్నాయి. మరి నీవు నా ఉపదేశం ఎప్పుడు తీసుకుంటావు నాయనా?’ అని సూటిగా అడిగేసరికి తన తప్పు తెలుసుకొని కాళ్ళ మీద పడ్డాడు ఆ సంసారి శిష్యుడు. - శ్రీ గణపతి సచ్చిదానందస్వామి -
ఎవరు దేశ పౌరులు?
పాస్‌పోర్ట్ ఉన్నంత మాత్రాన దేశ పౌరసత్వం ఉన్నట్టు కాదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అది కేవలం ప్రయాణానికి సంబంధించిన పత్రమని చెప్పింది. ఇది దేశ ప్రజల్లో అలజడి, ఆందోళనలను రేపింది. దేశ పౌరుడిగా నిరూపించుకోవాలంటే, మరింకేమి పత్రాలు కావాలని ప్రజలు అడుగుతున్నారు.మన రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 5–11, ఎవరు దేశ పౌరులో నిర్వచించాయి. రాజ్యాంగం అమలు నాటికి ఎవరు భారత పౌరులో, దేశ విభజన వలన ప్రభావితమైనవారికి కొన్ని షరతులకు లోబడి ఈ దేశ పౌరసత్వం పొందే అర్హతను నిర్వచించింది. భారత పార్ల మెంటుకు దేశ పౌరసత్వంపై చట్టం చేయడానికి ఆర్టికల్ 11 అధికార మిచ్చింది. ఆర్టికల్ 5 ప్రకారం, భారత్‌లో జన్మించినవారు లేక దేశంలో వారి తల్లిదండ్రులు జన్మించినా ఈ దేశ పౌరులే అని తెలిపింది.ఎవరు దేశ పౌరసత్వానికి అర్హులు అన్నది పౌరసత్వ చట్టం– 1955 నిర్దేశించింది. పౌరసత్వ చట్టంలోని 3, 4, 5, 6 సెక్షన్లు పౌర సత్వం ఏ విధంగా లభిస్తుందో నిర్వచించాయి. సెక్షన్ 3 ప్రకారం 1950 జనవరి 26 తరవాత, 1987 మధ్యన భారతదేశంలో జన్మించిన ప్రతి వ్యక్తికీ; 1987 జూలై 1 తరువాత భారతదేశంలో జన్మించి నవారి తల్లితండ్రులిద్దరూ భారతీయ పౌరులు అయితే లేక తల్లితండ్రుల్లో ఒకరు భారతీయ పౌరులు, మరొకరు అక్రమంగా భారత దేశానికి వలస రాకుంటే వారికీ భారత పౌరసత్వం లభిస్తుంది. సెక్షన్ 4 ప్రకారం, భారతదేశంలో జన్మించకున్నా, తల్లి, తండ్రి ఈ దేశ పౌరులైతే వారికీ పౌరసత్వం లభిస్తుంది. కొన్ని ప్రత్యేక పరిస్థి తుల్లో, పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి, న్యాచుర లైజేషన్ ద్వారా కూడా సెక్షన్ 5, 6 ప్రకారం పౌరసత్వం లభిస్తుంది.పాస్‌పోర్ట్‌కు ఎవరు అర్హులు? పాస్‌పోర్ట్ చట్టం–1967లో పాస్‌పోర్ట్ పొందడానికి ఎవరు అర్హులో పేర్కొనలేదు. అయితే, ఈ చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం, పాస్‌పోర్ట్ అధికారి, పాస్‌పోర్ట్ కోసం పెట్టుకున్న దరఖాస్తును కొన్ని సందర్భాలలో తప్పనిసరిగా తిరస్కరించాలి. దానిలో మొట్టమొద టిగా పేర్కొన్న కారణం, దరఖాస్తుదారు భారత పౌరుడు కాక పోవడం. అంటే చట్ట ప్రకారం భారత పౌరుడు కానివారికి భారత దేశ పాస్‌పోర్ట్ పొందే అర్హత లేదు.మరెందుకు భారత ప్రభుత్వం పాస్‌పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదని చెప్తూ బాంబే హైకోర్టు తీర్పును ఉటంకిస్తున్నది? ‘మోతిమియా రహిమియా వర్సెస్ భారత ప్రభుత్వం’ కేసులో తాము భారతదేశంలోనే జన్మించామనీ, దానికి రుజువుగా పాస్‌పోర్ట్‌ను కోర్టులో సాక్ష్యంగా చూపి తమను భారత దేశం నుంచి పంపకుండా ఆదేశాలివ్వాలనీ కోరారు. బాంబే హైకోర్టు వారి వాదనను తోసిపుచ్చుతూ, ‘కేవలం వారిచ్చిన సమాచారంపై ఆధారపడి పాస్‌పోర్ట్‌ను ప్రభుత్వం ఇచ్చింది. కానీ వారుగానీ, వారి తల్లితండ్రులుగానీ ఈ దేశంలోనే జన్మించారని ఎలాంటి ఆధారం చూపలేదు’ అని పేర్కొంది.చట్టం ప్రకారం పాస్‌పోర్ట్ అధికారి, తప్పనిసరిగా దరఖాస్తు దారులు భారత పౌరులని నిర్ధారించుకున్న తరవాతనే పాస్‌పోర్ట్ ఇవ్వడానికి ఆమోదించాలి. పైన చెప్పినట్టుగా, ఎవరు భారత పౌరులో రాజ్యాంగం, పౌరసత్వ చట్టం–1955లో పొందుపరచ బడింది. ఒకవేళ, ఎవరైనా తప్పుడు సమాచారంతో పాస్‌పోర్ట్ పొందినా, సెక్షన్ 10 ప్రకారం దాన్ని రద్దు చేసే అధికారం ప్రభుత్వా నికి ఉంది. కాబట్టి, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఇచ్చిన బాంబే హైకోర్టు తీర్పును కేంద్ర ప్రభుత్వం ఉటంకించి పాస్‌పోర్ట్ దేశ పౌర సత్వానికి రుజువు కాదని చెప్పడం రాజ్యాంగాన్నీ, చట్టాన్నీ వక్రీకరించడమే.అంటే, కేవలం దరఖాస్తుదారులు ఇచ్చిన సమాచారం ప్రకారం పాస్‌పోర్టులు ఆమోదిస్తూ, దేశ భద్రతను పణంగా పెడుతు న్నారని భావించాలా? అమెరికాలోనూ, ప్రపంచవ్యాప్తంగానూ... పాస్‌పోర్ట్ దేశ పౌరసత్వాన్ని నిర్ధారించే పత్రం. కాబట్టి, ప్రజలను ఈ విధంగా ప్రభుత్వమే తికమకపెట్టడం దారుణం. గతంలో, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, పాన్ కార్డ్ వంటివి కూడా పౌరసత్వాన్ని నిర్ధారించే పత్రాలు కావని న్యాయస్థానాలు చెప్పాయి. మరి ఏ పత్రం దేశ పౌర సత్వానికి రుజువో కూడా చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. – కె.ఎస్. హరీశ్ కుమార్, ఏజీఎం (లా) రిటైర్డ్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా -
యువతకు స్ఫూర్తిప్రదాత
డాక్టర్ బి.సి.రాయ్‌గా సుపరిచితులైన బిధాన్ చంద్రరాయ్ 1882 జూలై 1న నేటి బిహార్‌లోని బాంకీపూర్‌లో జన్మించారు. వైద్యవిద్య అభ్యసించారు. 1925లో రాజకీయాలలో ప్రవేశించారు. బెంగాల్‌లోని బారక్పూర్ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్ధిగా పోటిచేసి ‘గ్రాండ్ ఓల్డ్ మాన్ ఆఫ్ బెంగాల్’గా పేరొందిన సురేంద్రనాథ్ బెనర్జీని ఓడించారు. 1928లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐ.ఎం.ఎ.) ఏర్పాటులోనూ, 1939లో దేశంలో వైద్య విద్య నియంత్రణకు, అభివృద్ధికి పాటుపడే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎం.సి.ఐ.) ఏర్పాటు చేయడంలోనూ కీలకపాత్ర పోషించారు.మహత్మాగాంధీకి అనుంగు మిత్రునిగా, వ్యక్తిగత వైద్యునిగా వ్యవహరించారు. 1942లో పుణేలో గాంధీజీ క్విట్ ఇండియా ఉద్యమంలో నిరాహార దీక్షకు దిగారు. ఆరోగ్యం క్షీణించడంతో రాయ్ మందులు ఇచ్చారు. ఆ మందులు ఇండియాలో తయారైనవి కావని గాంధీజీ వాటిని నిరాకరించారు. అంతేకాక... ‘నేను, నువ్వు ఇచ్చిన మందులు ఎందుకు తీసుకోవాలి? ఈ దేశంలోని 40 కోట్ల ప్రజలకు నువ్వు ఉచితంగా వైద్యం చేస్తావా?’ అని ప్రశ్నించారు. అందుకు డాక్టర్ రాయ్ ‘లేదు, అందరికీ ఉచితంగా వైద్యం చేయలేను. కానీ నేను వచ్చింది... మోహన్‌దాస్ కరమ్ చంద్ గాంధీకి వైద్యం చేయడానికి కాదు, ఈ దేశంలోని 40 కోట్ల మంది ప్రజలకు సారథ్యం వహిస్తున్న వ్యక్తి’కి అన్నారు. గాంధీజీ మాట్లాడకుండా మందులు తీసుకున్నారు.స్వాతంత్య్రానంతరం కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుల ఒత్తిడి మేర 1948 జనవరి 23న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు రాయ్. ఆ రోజుల్లో దేశవిభజన కారణంగా బెంగాల్ అతలాకుతలమవుతోంది. రాయ్ ప్రణాళికబద్ధంగా పశ్చిమ బెంగాల్‌ను అభివృద్ధి పథం వైపు పరుగులు పెట్టించారు. తన 80వ ఏట 1962 జూలై 1న తన పుట్టినరోజే తుదిశ్వాస విడిచేవరకు ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. ముఖ్యమంత్రిగా ఎంత బిజీగా ఉన్నా, ప్రతిరోజూ క్రమం తప్పకుండా రోగులను చూడటం మాత్రం మానుకోలేదు. భారత ప్రభుత్వం బి.సి. రాయ్ సేవలను గుర్తించి, 1961లో దేశ అత్యున్నత పురస్కారం ‘భారత రత్న’తో గౌరవించింది. రాయ్ అవివా హితులు. తన ఇంటిని తల్లి అఘొర్ కామినీదేవి పేరుతో హాస్పిటల్‌కు విరాళంగా ఇచ్చారు. తన ఆస్తులతో ప్రజాప్రయోజనార్థం ఒక ట్రస్టును ఏర్పాటు చేశారు. ఆయన నేటి వైద్యులకు, రాజకీయ నాయకులకే కాదు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి ప్రదాత. – డా. టి. సేవకుమార్, ఐ.ఎం.ఎ. నేషనల్ కౌన్సిల్ సభ్యులు (రేపు డా. బి.సి. రాయ్ జయంతి, వర్ధంతి – జాతీయ వైద్యుల దినోత్సవం) -
అన్నదాతలకు అభయహస్తం
సమాజానికి వెన్నెముక అయిన రైతులకు అధిక ప్రాధాన్యతిస్తూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేసింది. ‘రైతు భరోసా’తో రైతుల్లో పూర్తి విశ్వాసం కలిగిస్తోంది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అన్నదాతలకు అభయం హస్తం అందిస్తోంది. ఇప్పటికే రెండుసార్లు ‘రైతు భరోసా’ అందించిన ప్రభుత్వం మరోసారి 2026 జూన్ 30న ఖరీఫ్ సీజన్‌కుగానూ ఇచ్చేందుకు సిద్ధమైంది.రైతు సంక్షేమమే ధ్యేయంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల ముందు వరంగల్ వేదికగా ‘రైతు డిక్లరేషన్’లో ప్రకటించిన విధంగా రైతు భరోసా, రైతు రుణమాఫీ, సన్నా లకు బోనస్, రైతు బీమా, రైతు కూలీలకు ‘ఇందిరమ్మ భరోసా’ వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తూ తమది రైతు పక్షపాత ప్రభుత్వమని నిరూపించుకుంది.ప్రభుత్వం ఏటా ఎకరాకు రూ. 12 వేలు రైతు భరోసాగా అందిస్తోంది. 2025 జూ¯Œ లోనూ, 2026 మార్చిలోనూ 70 లక్షల మందికి అందించింది. మూడోసారి జూన్‌లో ఒకే విడతలో ఈ సాయం అందించనున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఏకకాలంలో రూ. 2 లక్షల రుణమాఫీ చేసింది. దీంతో 25 లక్షల రైతు కుటుంబాలకు రూ. 21 వేల కోట్ల మేలు చేకూరింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా సన్న వరికి బోనస్ అందించడంతో రాష్ట్రంలో సన్నాల సాగు 60 శాతం పెరిగింది. దేశంలోనే తొలిసారిగా రైతు కూలీలను గుర్తించి వారిలో విశ్వాసం కలిగించేలా ‘ఇందిరమ్మ రైతు భరోసా’ అందిస్తోంది. రైతు కుటుంబాలందరికీ ప్రభుత్వం పూర్తి భరోసా ఇస్తూ వేల కోట్ల రూపాయలతో రైతు బీమా కల్పిస్తోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకా రాలు లభించకపోయినా రాష్ట్ర ప్రభుత్వం భారీగా పంటలను కొనుగోలు చేస్తోంది.నిధులు దుర్వినియోగం కాకుండా...అన్నదాతలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటే భరించలేని బీఆర్ఎస్ పార్టీ అక్కసుతో అవాస్తవాలను ప్రచారం చేస్తోంది. గతంలో వారి ప్రభుత్వం ‘రైతు బంధు’ పేరిట ఎకరాకు రూ. 10 వేలు మాత్రమే ఇస్తే... కాంగ్రెస్ సర్కార్ మరో రెండువేలు అధికంగా ఇస్తోంది. గత ప్రభుత్వ అవకతవకలు పునరావృతం కాకుండా ఉండాలనే లక్ష్యంతో ప్రస్తుత సర్కారు వ్యవసాయ యోగ్యమైన భూములకే రైతు భరోసా అందించాలని నిర్ణయించింది. అందుకే ప్రజా నిధులు దుర్వినియోగం కావడం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయానికి ఏమాత్రం ఉపయోగపడని భూములకు రైతుబంధు పథకం కింద రూ. 22 వేల కోట్లకుపైగా చెల్లించి ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసింది.రైతులకే కాకుండా రైతు కూలీలకు కూడా సమన్యాయం జరి గేలా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భూమిలేని రైతు కూలీలకు ప్రభుత్వ నిర్ణయం శాపంగా మారకూడదని, వారిని కూడా ఆదుకోవాలనే లక్ష్యంతో ‘వరంగల్ డిక్లరేషన్’లో ప్రకటించినట్టు దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పథకం కింద ఏటా రూ. 12 వేలు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించడంతో వ్యవసాయ యజ్ఞంలో పాల్గొనేవారందరికీ న్యాయం చేసినట్టయ్యింది.శుభప్రదమైన ఏరువాక పౌర్ణమి మరుసటి రోజు జూన్ 30న ప్రభుత్వం నిర్వహించనున్న రైతు భరోసా పంపిణీ మరోసారి అన్న దాతల పట్ల కాంగ్రెస్ పార్టీ నిబద్ధతకు నిదర్శనంగా నిలవనుంది. రైతు సంతోషమే రాష్ట్ర సుభిక్షతకు పునాది అనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది.- బి. మహేశ్ కుమార్ గౌడ్, వ్యాసకర్త ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షులు -
విశ్రాంత స్వాంతుడు..
దీపం ఉన్నచోట వెలుగు ఉన్నట్లుగా, ఒక పువ్వు ఉన్న ప్రదేశం మనసును ఆహ్లాదపరచే సుగంధంతో నిండి ఉన్నట్లుగా, సూర్యుడు ఉంటే అది పగలై ఉన్నట్లుగా, చిత్తము, చేతన జాగ్రదావస్థలో ఉంటే సమస్త ప్రపంచము ఉత్తేజితమై ఉంటుంది. రత్నము తన నైజగుణంగా ఏ ప్రయత్నమూ లేకుండానే ఎలా ప్రకాశిస్తుందో, ప్రపంచంలో ప్రకృతి సిద్ధములు, మానవ నిర్మితములు అయినట్టి వివిధ వస్తు సముదాయములు అన్నీ ఏ ప్రయత్నమూ లేకుండానే ఎలా దృష్టి గోచరములు అవుతాయో, ఆ విధముగానే కేవలం అణుమాత్రమైన పరమాత్మునిలో జగములన్నియు నిండి ఉండి సంచరిస్తూ ఉంటాయి.మనిషి అనుభవించే సుఖానికైనా, దుఃఖానికైనా ఆ మనిషి మనసులోని ఆలోచనలే కారణం. ఆ ఆలోచనలను తగిన విధంగా కట్టడి చేసి అదుపులో పెట్టుకోకుంటే కొండంతగా ధనమున్నా, కోట్లకు పడగలెత్తిన మిత్రులు ఎంత మంది ఉన్నా, ఎన్ని తీర్థయాత్రలు చేసి ఎందరు దేవుళ్ళకు మొక్కుకున్నా, ఎన్ని ఉపవాసాలు చేసి శరీరాన్ని కష్ట పెట్టుకున్నా, మనశ్శాంతి మాత్రం కరవైనదిగానే మిగులుతుంది.కం. సంతోషము సుఖతరమగు, /సంతోషము నిత్యమోక్షసంప్రాప్తి యగున్, సంతుష్టుండెందును వి / శ్రాంతస్వాంతుండు, రామ సౌజన్యనిధీ!మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం అన్ని సుఖాలకు మూలం. ప్రయత్నం చేసి మనసుని దుఃఖం వైపునకు మరలకుండా చేయడాన్ని సాధించాలి. అనవసరమైన దిగులుని దరిచేరనీయకుండా చూసుకుంటూ, మనసును ఆనందంగా ఉంచుకోవడం వలన సుఖశాంతులు దక్కుతాయి. విశ్రాంత స్వాంతుడు మోక్షప్రాప్తికి దగ్గరివాడౌ తాడు– అని మడికి సింగన రచించిన ‘వాసిష్ఠ రామాయణము’, ప్రథమాశ్వాసములోని పై పద్యంలో చెప్పబడిన మాటలు వెలలేనివి. మానసిక ప్రశాంతతను కోరుకునే మనుషులకు అవి బహుదా ఆచరణీయములైనట్టివి. – భట్టు వెంకటరావు -
మహోన్నత శిఖరాలు
వారికి వారే సాటి. వారిద్దరినీ క్రీస్తు ప్రధాన శిష్యులుగా చెప్పుకోవడం పరిపాటి. ఇద్దరూ ఇద్దరే! సౌవార్తిక సేవలో మహోన్నత శిఖరాలు! క్రీస్తు తన వారసులుగా ఎన్నుకున్న ప్రధాన వ్యక్తులు. ఒకరు క్రీస్తు మొదటి శిష్యుడు పేతురు. మరొకరు క్రీస్తుకు ప్రత్యేక శిష్యుడు పౌలు! ఇద్దరూ జైలు జీవితం అనుభవించారు. సంఘానికీ, వ్యక్తులు మారడానికీ పత్రికలు రాశారు.పేతురు సముద్ర తీర వాసి, ఒక జాలరి. పౌలు రోమన్ సామ్రాజ్య ఉద్యోగి, ఒక సైనికుడు. పేతురు ‘నన్ను వెంబడించు’ అని పిలువబడి సిలువ వరకు వెళ్ళాడు. పౌలు ‘నా నామం కోసం శ్రమపడాలి’ అని పిలువబడితల ఇచ్చాడు. ఒకరు క్రీస్తుచే యాదృచ్ఛికంగా ఆహ్వానితుడైనవాడు. మరొకరు క్రీస్తుచే అదృశ్యకంగా కొట్టబడి ప్రశ్నింప బడినవాడు. ఒకరు ఇజ్రాయేలీయ దేశ స్వస్థలీయుడు. మరొకరు ఇరాన్ దేశం నుంచి వచ్చి స్థిరపడినవాడు.ఒకరు నిరక్షర కుక్షి. మరొకరు విద్యా బుద్ధులు బాగా నేర్చినవాడు. ఒకరు పన్నెండు మంది శిష్యుల్లో జ్యేష్ఠుడు. మరొకరు సువార్త అందించ పంపబడ్డ అపోస్తులుడు. ఒకరు క్రీస్తుతోపాటు సుఖ దుఃఖాల్లో కలిసి తిరిగాడు. మరొకరు క్రీస్తును చూడలేదు. ఆయన గురించి విన్నాడు. ఒకరు క్రీస్తు స్థాపించిన సంఘానికి మూల రాయిలాంటి వాడు. మరొకరు ఆ మూలరాతిని కరిగించి సారం అందించిన వాడు. పేతురు రాసిన పత్రికలు రెండు. పౌలు రాసిన పత్రికలు పదమూడు. ఇద్దరూ యేసు కోసం ప్రాణం పెట్టి, హతసాక్షులుగా రోమ్‌లో చనిపోయినవారే. ఇద్దరూ క్రీస్తు సువార్తా ప్రకటనకు మూలస్తంభాల్లా నిలిచినవారే! – డా. దేవదాసు బెర్నార్డ్ రాజు (జూన్ 29న పునీత పేతురు – పౌల్ మహోత్సవం) -
ప్రజాస్వామ్యం నుంచి అనుచర గణానికి!
ప్రశ్నించే పౌరులు... అనుసరించే జనసమూహంగా మారుతున్న నేటి సామాజిక పరిణామం ఆందోళనకరం. నేటి భారత రాజకీయ పరిస్థితిని అర్థం చేసుకోవాలంటే కేవలం ఎన్నికల ఫలితాలను చూడటం సరిపోదు. అసలు మార్పు అధికార కేంద్రీకరణలో మాత్రమే లేదు; సమాజపు ఆలోచనా నిర్మాణంలో ఉంది. ఒకప్పుడు అధికారాన్ని ప్రశ్నించే ప్రజాస్వామిక సంస్కృతి కొంతవరకు కనిపించేది. ఇప్పుడు మాత్రం ‘ఏం అడగాలి?’, ‘ఏం అడగకూడదు?’ అన్న అప్రకటిత నియమాలే సమాజాన్ని నియంత్రిస్తున్నాయి. ఇది అత్యంత ప్రమాదకర సంకేతం.దేశంలో నిరుద్యోగం, ధరల పెరుగుదల, రైతు సంక్షోభం, విద్య–వైద్య రంగాల అసమానతలు, కుల హింస వంటి అనేక సమస్యలు ముదురుతున్నప్పటికీ, ప్రజా చర్చల కేంద్రంలో అవి కనిపించడం తగ్గుతోంది. వాటి స్థానంలో యోగా దినోత్సవాలు, భారీ సాంస్కృతిక ప్రదర్శనలు, జాతీయ గర్వ నినాదాలు ముందుకు వస్తున్నాయి. యోగ సాధనపై ఎలాంటి అభ్యంతరం ఉండనవసరం లేదు. కానీ ప్రశ్న యోగాపై కాదు. యోగాను ఎవరు, ఎలా, ఏ రాజకీయ సందర్భంలో వినియోగిస్తున్నారు అన్నదే ముఖ్యం. ప్రజా సమస్యలపై చర్చ తగ్గిపోతూ, ప్రతీకల చుట్టూ సమాజం తిరుగు తుంటే దానిని విమర్శనాత్మకంగా పరిశీలించాల్సిందే.ఈ పరిస్థితి యాదృచ్ఛికంగా రాలేదు. దీని వెనుక దీర్ఘకాలిక భావజాల విస్తరణ ఉంది. పాలక వర్గాలు తమ భావజాల సంబంధాలను విద్య, మీడియా, మత–సాంస్కృతిక వేదికలు, ప్రచార యంత్రాంగం ద్వారా విస్తృతం చేశాయి. ఫలితంగా రాజకీయ ఆధిపత్యం క్రమంగా భావజాల ఆధిపత్యంగా మారింది. అధికా రాన్ని నిలబెట్టేది కేవలం రాజ్య యంత్రాంగం కాదు; సమాజంలో ‘ఇదే సహజం’, ‘ఇదే దేశహితం’ అనే అంగీకార వాతావరణాన్ని నిర్మించడమే.భయం నుంచి పుట్టే అనుచరత్వం ఒకటì , నమ్మకం నుంచి పుట్టే అనుచరత్వం మరొకటి. ఇప్పుడు రెండూ కలిసి పనిచేస్తున్నాయి. రాజ్యం అణచివేత భయాన్ని సృష్టిస్తే, భావజాల యంత్రాంగం నమ్మకాన్ని తయారుచేస్తోంది. ఈ రెండు శక్తులూ కలిసి పౌరుడిని అనుచరుడిగా మారుస్తున్నాయి.ఇక్కడే పౌర సమాజం, ప్రజాస్వామ్యవాదులు, సామ్యవాద శక్తులు, దళిత, బీసీ, ఎస్టీ ఉద్యమాల వైఫల్యం స్పష్టమవుతోంది. ఒకప్పుడు సామాజిక న్యాయం, కుల ఆధిపత్యం, వర్గ అసమాన తలు, హక్కుల రాజకీయాలపై ప్రత్యామ్నాయ చర్చను నిర్మించిన ఈ శక్తులు ఇప్పుడు విభజితంగా, రక్షణాత్మకంగా కనిపిస్తున్నాయి. వీరి వైఫల్యం కేవలం సంస్థాగత బలహీనత కాదు, ప్రత్యామ్నాయ భావజాలాన్ని సమాజంలో విస్తరించడంలో వచ్చిన పరాజయం.నేటి ప్రధాన సవాలు కేవలం ప్రభుత్వ మార్పు కాదు. భావ జాల ఆధిపత్యాన్ని సవాలు చేసే ప్రత్యామ్నాయ సామాజిక–రాజ కీయ చైతన్యాన్ని నిర్మించడం. పౌర సమాజం, ప్రజాస్వామ్య వాదులు, దళిత–బీసీ–ఎస్టీ శక్తులు, వామపక్ష ఉద్యమాలు తమ వైఫ ల్యాన్ని నిజాయితీగా సమీక్షించి కొత్త ప్రజా చైతన్యాన్ని నిర్మించా ల్సిన అవసరం ఉంది. ప్రశ్న చనిపోయిన చోట ప్రజాస్వామ్యం కూడా క్రమంగా చనిపోతుంది. – పాపని నాగరాజు, సామాజిక కార్యకర్త -
అసాధారణ మూర్తి
మరణించడానికి కొన్ని నెలల ముందు, పీవీ నరసింహారావు హైదరాబాదు వచ్చారు. మాజీ ప్రధాని హోదాలో రాజ్ భవన్ గెస్టు హౌస్‌లో బస చేశారు. గతంలో ప్రధానిగా ఆయన అక్కడ దిగినప్పుడు కనబడే హడావిడి ఎలా ఉండేదో ఒక విలే ఖరిగా నాకు తెలుసు.నేనూ, ఆకాశవాణిలో నా సీనియర్ కొలీగ్ ఆర్వీవీ కృష్ణారావు, గవర్నర్ రికార్డింగ్ నిమిత్తం వెళ్లి, ఆ పని పూర్తిచేసుకున్న తరవాత, రాజ్ భవన్ గెస్ట్ హౌస్ మీదుగా తిరిగి వెడుతూ అటువైపు తొంగి చూశాము. సెక్యూ రిటీ మినహా రాజకీయుల హడావిడి కనిపించకపోవడంతో లోపలకు వెళ్ళాము. ‘పీవీ గారిని చూడటం వీలుపడుతుందా’ అని భద్రతాధికారిని అడిగాము. ‘లోపలకు వెళ్ళండి’ అన్నట్టు సైగ చేశాడు. ఆశ్చర్యపోతూ లోపలకు అడుగు పెట్టాము.అంతే... మా ఆశ్చర్యం రెట్టింపయింది. పీవీ ఒక్కరే కూర్చుని టీవీలో ఫుట్‌బాల్ మాచ్ చూస్తూ కనిపించారు. డిస్టర్బ్ చేశామేమో అన్న ఫీలింగుతోనే, మమ్మల్ని పరిచయం చేసుకున్నాము. లుంగీ మీద ఒక ముతక బనీను మాత్రమే వేసుకుని ఉన్న పీవీగారు నా వైపు చూస్తూ, ‘మీ అన్నయ్య పర్వతాలరావు ఎలా వున్నాడయ్యా!’ అని అడిగేసరికి నాకు మతి పోయినంత పనయింది. ఎప్పుడో దశాబ్దాల క్రితం, పీవీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, రాష్ట్ర సమాచార శాఖలో పని చేస్తున్న మా పెద్దన్నయ్య భండారు పర్వతాలరావు ఆయనకు పీఆర్వోగా కొద్దికాలం పనిచేశారు. పీవీ ముఖ్యమంత్రిగా ఉన్నదే అతి కొద్దికాలం.అప్పటి విషయాలను గుర్తుపెట్టు కోవాల్సిన అవసరం ఆయనకు లేదు. అయినా ఆప్యాయంగా గుర్తు పెట్టుకుని మరీ అడిగారు. అదీ పీవీ గొప్పతనం. ఆ తరవాత కూడా ఆయన ఏదో మాట్లాడుతున్నారు కానీ మాకు ‘కలయో వైష్ణవ మాయయో’ అన్నట్టుగా ఉంది. మేము కలసి కూర్చుంది, కొన్నేళ్ళ క్రితం వరకు దేశాన్ని వొంటి చేత్తో పాలించిన వ్యక్తితో అన్న స్పృహ ఉండటం వల్ల, కొంత ఇబ్బంది పడుతూ కూర్చున్నాము. కాసేపటి తరవాత, కొణిజేటి రోశయ్య వచ్చారు. ఆయన్ని చూడగానే పీవీ మొహంలో ఒక రిలీఫ్ కనిపించింది. కాసేపు ఉండి మేము వచ్చేశాము.అంతకుముందు పీవీని మరోసారి ఢిల్లీలో కలిశాను. రేడియో మాస్కోలో పనిచేయడానికి మాస్కో వెడుతూ అప్పుడు కేంద్రమంత్రిగా అత్యంత ఉచ్ఛస్థానంలో ఉన్న పీవీని కలుద్దామని వెళ్లాను. బంగ్లా అంతటా నిశ్శబ్దం. ఎవరో అటుగా వస్తే, ‘పీవీ గారిని కలవడానికి వీలుంటుందా’ అని హిందీలో అడిగాను. ఓ గది చూపించి వెళ్ళిపోయాడు. నెమ్మదిగా తలుపు తోసి చూస్తే ఎదురుగా పీవీ. ఎవ్వరూ లేరు. పరిచయం చేసుకుని మాస్కో వెడుతున్నట్టు చెప్పాను. నా మొహంలో భావాలు పసికట్టినట్టున్నారు. ‘పనులు చేసి పెడుతూ ఉంటే కదా పదిమంది వచ్చేది’ అన్నారు.‘మాస్కో ఎందుకయ్యా వేరే దేశంలో మీ రేడియో ఉద్యో గాలు లేవా? బాగా చలిదేశం. పెళ్ళాం పిల్లలతో ఎలా వుంటావు’ అని అడిగారు. చాలా ముక్తసరిగా మాట్లాడేవారని పేరున్న పీవీ, నేను వూహించని విధంగా చనువుగా ఆ రెండు ముక్కలు మాట్లాడ్డం నా అదృష్టం అనే భావిస్తాను. ఆయన మాజీ ప్రధానమంత్రిగా పాల్గొన్న ఒక సదస్సు హైదరాబాదులోని జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థలో జరిగింది. మధ్యాన్నం భోజన విరామ సమయంలో విలేఖరులు ఒక్కొక్కరుగా కలుస్తున్నారు. ఆలిండియా రేడియో ప్రాంతీయ విభాగంలో పనిచేసే ఆర్వీవీ కృష్ణారావు, నేనూ కాస్త వెనగ్గా నిలబడి ఉన్నాం. చివరికి ఆయనే మమ్మల్ని దగ్గరకు పిలిచారు.‘ఏమయ్యా కృష్ణారావూ. ఢిల్లీలో పద్మనాభరావుకి కూడా చెప్పాను. ఏవయ్యా నా టేపులు?’ పీవీ ముఖ్యమంత్రిగా ఉన్న ప్పుడు తెలుగులో అనేక రేడియో ప్రసంగాలు చేశారు. వాటిని గురించి చేసిన వాకబు ఇది. కృష్ణారావు ఏదో చెప్పారు. ఆయన నా వైపు తిరిగారు. ‘మీ అన్నయ్య పుట్టపర్తిలో ఉంటున్నాడట కదా! ఏం చేస్తున్నాడు?’ ‘నరసింహావతారం గురించి పుస్తకాలు రాస్తున్నాడు.’‘అలా అయితే నేనడిగానని చెప్పు. మనిషి శారీరకంగా సింహం కంటే బలహీనుడు. ఆ అవతారంలో సింహం తలా, మనిషి శరీరం ఏమిటో రాయమని చెప్పు.’ నమస్కారం పెట్టి మేము వచ్చేశాము. - భండారు శ్రీనివాసరావు, వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ప్రజాస్వామ్య స్ఫూర్తి
రాజకీయ అస్థిరత కారణంగా నేతలు పదవులు కోల్పోవడం, ప్రభుత్వాలు పడిపోవడం ప్రజా స్వామ్య వ్యవస్థలో సహజమైన పరిణామం. అయితే దేశంలో ఏర్ప డిన ఆర్థిక అస్థిరత కారణంగా ప్రజా దరణ కలిగిన నాయకులు ప్రధాని పదవి నుండి వైదొలగడం బ్రిటన్‌లో తరచుగా చోటు చేసుకుంటున్న పరిణామం కావడం గమనార్హం.తాజాగా ప్రధాని కీర్ స్టార్మర్ రెండేళ్ళ పదవీకాలం ముగి యకుండానే పదవి నుంచి తప్పుకొన్నారు. సొంత లేబర్ పార్టీ ఎంపీల విశ్వాసం కోల్పోవడంతో స్టార్మర్‌కు రాజీనామా చేయడం మినహా గత్యంతరం లేకపోయింది. దీంతో గత ఏడేళ్ళలో ఆరవ ప్రధాని రాబోతున్నారు. బ్రిటన్‌లో నాయ కత్వ మార్పు తరచుగా ఎందుకు జరుగుతోంది? రెండవ ప్రపంచ యుద్ధం ముగిసినప్పటి నుంచి గత 81 ఏళ్లలో 65 ఏళ్ల పాటు 18 మంది ప్రధాన మంత్రులు అధికారంలో ఉండగా, చివరి 16 ఏళ్లలో ఏడుగురు ప్రధాన మంత్రులు మారడం విశేషం. ఇందులో భారత సంతతికి చెందిన రుషి సునాక్ ఎన్నికలలో ఓడిపోగా, బ్రెక్సిట్ ప్రజాభిప్రాయ సేక రణలో ఓటమి కారణంగా డేవిడ్ కామెరూన్ వైదొలిగారు.గెలిచినా ఓడిపోయి...ప్రధాని పదవి నుంచి తప్పుకున్న కీర్ స్టార్మర్ రెండేళ్ళ క్రితమే చరిత్రాత్మక మెజారిటీతో ఎన్నికయ్యారు. అంతర్జా తీయ సమాజంలో ఆయనకు మంచి గౌరవం ఉంది. అయితే మే నెలలో జరిగిన స్థానిక ఎన్నికలలో లేబర్ పార్టీకి ఘోర మైన ఫలితాలు వచ్చాయి. ప్రతిష్ఠాత్మకమైన స్థానిక ఎన్నిక లలో సొంత పార్టీని విజయ తీరాలకు చేర్చలేకపోవడం అనే వైఫల్యం కంటే... కొన్ని పాలనా విధానాల వైఫల్యాల కారణంగానే పదవినుండి తప్పుకోవాలని స్టార్మర్‌పై సొంత పార్టీ ఎంపీల నుండి తీవ్ర ఒత్తిడి వచ్చిందనుకోవాలి.దశాబ్ద కాలంగా బ్రిటన్‌లో ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. నిత్యావసర వస్తువుల ధరలు అనూహ్యంగా పెరిగి పోతున్నాయి. అందుకు అనుగుణంగా ప్రజల ఆదాయం పెర గడం లేదు. జాతీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు ఒక శాతం మించడం లేదు. బ్రిటన్ ప్రభుత్వ ఋణ భారం జీడీపీలో 95 శాతం దాటింది. అప్పులు దాదాపు 2.8 లక్షల కోట్ల పౌండ్లకు చేరింది. దీనితో ప్రభుత్వానికి వచ్చే రాబడిలో అభివృద్ధి పనులకు ఖర్చు చేయడం కష్టమౌతోంది.ఈ రెండేళ్ళ స్వల్ప కాలంలో స్టార్మర్ పలు విజయాలు నమోదు చేసిన మాట నిజం. ప్రభుత్వ దుబారాను తగ్గించారు. ప్రభుత్వ రంగంలోని కార్మికులు, ఉద్యోగులు సమ్మెలకు దిగి ఉత్పత్తిని దెబ్బతీయకుండా, వారి డిమాండ్లలో కొన్నింటిని నెరవేరుస్తూ, దేశంలో ఆర్థిక సంక్షోభం తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. రష్యాతో యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్‌కు మద్దతు ప్రకటించి, ఆ దేశం నుంచి విలువైన ఖనిజాల దిగుమతికి మార్గం సుగమం చేశారు. భారత్‌కు స్నేహ హస్తం చాచి ఇరుదేశాల నడుమ చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) అమలు కోసం కృషి చేశారు.ఎన్ని సుగుణాలున్నా... రాజకీయాలలో బంధుప్రీతికి, ఆశ్రిత పక్షపాతానికి తావు ఉండరాదు. కానీ స్టార్మర్ తన స్నేహితుడైన పీడర్ మాండెల్సన్‌ను యూఎస్ రాయబారిగా నియమించడం సొంత పార్టీ నేతలకు కంటగింపుగా మారింది. అదే సమయంలో దేశ ఆర్థికాభివృద్ధి పడిపోవడం, మౌలిక సదుపాయాల విస్తరణ మందగించడం, గృహ నిర్మాణం చతికిల పడటం స్టార్మర్ మెడకు చుట్టుకున్నాయి.ప్రధాని పదవికి స్టార్మర్ రాజీనామా తర్వాత ఆ పదవిని చేపట్టే గ్రేటర్ మాంచెస్టర్ మాజీ మేయర్ ఆండీ బర్న్‌హామ్ నేతృత్వంలో బ్రిటన్ తన పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందా లేదా అన్న విషయాన్ని పక్కన పెడితే... బ్రిటన్‌లో రెండు ప్రధాన రాజకీయ పార్టీలలో నాయకుల కంటే పార్టీయే సుప్రీమ్ అనే పంథా కొనసాగడమే ఇక్కడ చర్చనీయాంశం. రాజకీయ నాయకులు తమపై విమర్శలు వచ్చినపుడు హుందాగా ఆ పదవుల నుండి దిగిపోవడం ముదావహం. వారు మెజారిటీ ప్రజల మనోభీష్టాన్నీ, దేశ ప్రయోజనాలనూ దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవడం గొప్ప విషయం. - డా. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వ్యాసకర్త ఏపీ శాసన మండలి సభ్యులు, కేంద్ర మాజీ మంత్రి -
ప్రేమ నిర్వచనం..
పూజలు–పునస్కారాలు, నోములు–వ్రతాలు, గుళ్ళు–గోపురాలు అన్నీ మనలో సంకుచిత స్వార్థాన్ని నిర్మూలించటానికీ, విశ్వప్రేమను విష్ణుప్రేమగా గ్రహించటానికీ నిర్దేశింపబడ్డాయి. ప్రేమే దైవమని మహర్షులు నొక్కి వక్కాణిస్తారు. ప్రేమ, ద్వేషం అంటూ రెండు ఉండటంవల్ల దేన్ని ఎంచుకొంటే మనకు శ్రేయస్సు కల్గుతుందో వివరించటానికి పెద్దలు నానా తంటాలు పడ్డారు. కేరళకు చెందిన స్వామి రామదాసు చేసిన చక్కటి విశ్లేషణను చూడండి:ప్రేమ హృదయాన్ని వికసింపజేస్తుంది – ద్వేషం దానిని ముకుళింపజేస్తుంది. ప్రేమ కంటే మధురం లేదు – ద్వేషం కంటే చేదు లేదు. ప్రేమ సహజం – ద్వేషం కృత్రిమం. ప్రేమ నిర్మాణం – ద్వేషం వినాశకము, విధ్వంసము. ప్రేమ మనోహరం– ద్వేషం అసహ్యకరం. ప్రేమ ఆహ్లాదకర ప్రకృతి దృశ్యం – ద్వేషం శుష్కమైన మరుభూమి.ప్రేమ లయబద్ధం – ద్వేషం చిందర వందర. ప్రేమ ప్రకాశం – ద్వేషం అంధకారం. ప్రేమ ఆనందం – ద్వేషం దుఃఖం. ప్రేమ జీవనం – ద్వేషం మరణం. ప్రేమ పవిత్రం – ద్వేషం అపవిత్రం. ప్రేమ జత చేస్తుంది – ద్వేషం విడదీస్తుంది. ప్రేమ సురూపం – ద్వేషం కురూపం. ప్రేమ ఆరోగ్యం – ద్వేషం అనారోగ్యం. ప్రేమ మధుర సంగీతం – ద్వేషం కర్కశ ధ్వని. ప్రేమ జ్ఞానం– ద్వేషం అజ్ఞానం. ప్రేమ చురుకుదనం – ద్వేషం మందత్వం. ప్రేమ స్వర్గం– ద్వేషం నరకం. ప్రేమే దైవం – ద్వేషమే దయ్యం – మాయ. (భగవదన్వేషణము– స్వామి రామదాసు; పుటలు 188, 189) ఇంత స్పష్టమైన విశ్లేషణను చదివిన తర్వాత ఎవరైనా ప్రేమను పెంపొందించుకోవటానికే కృషి చేస్తారు. చేయాలి. మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తిద్దాం. దైవాశీస్సులు ఉండి తీరుతాయి. – రాచమడుగు శ్రీనివాసులు -
నిశ్శబ్దపు చీకటిలో ఆశాకిరణం
జూన్ నెల చివరి వారాన్ని ‘బధిరాంధ అవగాహనా వారం’గా అంతర్జాతీయ బధిరాంధ దినోత్సవం (జూన్ 27) సందర్భంగా జరుపుకోవడం 2025 నుంచి ప్రారంభమైంది. రచయిత్రి, సామా జిక కార్యకర్త హెలెన్ కెల్లర్ జయంతిని పురస్కరించుకుని ఐక్యరాజ్యసమితి వీటిని ప్రకటించింది. బధిరాంధత్వం అంటే కళ్లతో పాటు చెవులు కూడా పనిచేయకపోవడం. గాఢాంధకారం, భయంకరమైన నిశ్శబ్దం...ఈ రెంటి కలయిక వల్ల అత్యంత సంక్లిష్టమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సమస్య ఉన్నవారు బాహ్య ప్రపంచంతో సంభాషించడానికి ప్రధానంగా చేతిపై చేతితో రాసే సంకేత భాష (టాకై్టల్ సైన్ లాంగ్వేజ్), బ్రెయిలీ లిపి, ఇంటర్ప్రెటర్లపై ఆధారపడ తారు. ప్రపంచ జనాభాలో 0.2% – 2% ప్రజలు ఏదో ఒక స్థాయి బధిరాంధత్వంతో జీవిస్తున్నారు. ఒక్క భారతదేశంలోనే దాదాపు 5 లక్షల మందికి పైగా ఈ సమస్యతో పోరాడుతున్నారు.ప్రభుత్వాలు బధిరాంధత్వాన్ని చట్టపరంగా ఒక ప్రత్యేక వైకల్యంగా గుర్తించాలి. అంధులకు, బధిరులకు విడివిడిగా ఇచ్చే సేవలను కలిపి వీరికి అంటగట్టడం సరైన విధానం కాదు. రోజువారీ పనులకు అవసరమైన ప్రత్యేక శిక్షణ పొందిన ఇంటర్ప్రెటర్–గైడ్ల సేవలను ఉచితంగా ప్రభు త్వాలు అందించాలి. అలాగే, పాఠశాలల్లో సమ్మిళిత విద్యను ప్రోత్సహించ డానికి ప్రత్యేక టీచింగ్ అసిస్టెంట్లను నియమించి, పాఠ్యాంశాలను వీరికి అనుకూలంగా మార్చాలి. ఆధునిక సాంకేతికత తోడ్పాటుతో టాకై్టల్ పరిక రాలు, రిఫ్రెషబుల్ బ్రెయిలీ డిస్ప్లేలు, వైబ్రేషన్ ద్వారా అలర్ట్ చేసే స్మార్ట్ పరికరాలను అందుబాటులోకి తేవాలి.హబెన్ గిర్మా, హార్వర్డ్ లా స్కూల్ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మొదటి బధిరాంధ మహిళ. వైబ్రేషన్–బ్రెయిలీ డిస్ప్లే కలిగిన డిజిటల్ టెక్నాలజీ సహాయంతో సంభాషిస్తూ న్యాయవాదిగా పనిచేస్తున్నారు. చిన్న తనంలోనే చూపు, వినికిడి కోల్పోయిన ప్రదీప్ సిన్హా, అసిస్టివ్ టెక్నాలజీ సహాయంతో కంప్యూటర్ ఆధారిత నైపుణ్యాలను నేర్చు కుని కార్పొరేట్రంగంలో ఉపాధి పొందుతుండగా, మహారాష్ట్రకు చెందిన శ్రద్ధా శిఖరే ఆభర ణాల తయారీలో రాణిస్తూ సొంతంగా ఆర్థిక స్వాలంబన సాధించారు. తగిన సదుపాయాలు కల్పిస్తే, బధిరాంధులు అత్యున్నత శిఖరాలను అధిరోహించగలరనే నిజాన్ని స్పష్టం చేస్తున్నాయి. – శ్రీనివాస్ మాధవ్, సామాజిక కార్యకర్త (నేడు ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ డెఫ్బ్లైండ్నెస్’) -
రైతన్నకు మార్గం చూపే అభియాన్
నేల ఆరోగ్యాన్ని పరిరక్షించడం, వ్యవసాయ భూమిని కాపాడటం, రైతుల మధ్య శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం లక్ష్యంగా చేపట్టిన దేశవ్యాప్త ప్రచారాన్ని ‘ఖేత్ బచావో అభియాన్’గా పిలుస్తున్నారు. ‘నేలను కాపాడండి, వ్యవసాయాన్ని కాపాడండి, రైతులను కాపాడండి’ అనే ప్రధాన సందేశంతో 2026 జూన్ 1 నుండి జూన్ 30 వరకు ఈ ప్రచారం సాగుతోంది.ఎరువులను నిరంతరం వాడటం, అది కూడా అసమతుల్యంగా ఉపయోగించడం వల్ల అనేక ప్రాంతాలలో పోషకాల కొరత ఏర్పడి, నేల నాణ్యత క్షీణిస్తోంది. మేలు చేసే సూక్ష్మజీవులు నశించి పోతు న్నాయి. వానపాములకు నష్టం వాటిల్లుతోంది. నీటి నిల్వ సామర్థ్యం పడిపోతోంది. భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. ఆరోగ్య సమస్యలు తలెత్తున్నాయి. రైతులు వీటిని దృష్టిలో పెట్టుకుని సాగు చేయాల్సి ఉంది. అందుకు కేంద్రం భారీ ఎత్తున ఈ విషయా లపై అవగాహన కల్పించేందుకు రంగంలోకి దిగింది. ఖేత్ బచావో అభియాన్ ప్రధానాంశాలు:1. మట్టి పరీక్ష – మట్టి ఆరోగ్య కార్డులకు ప్రోత్సాహం: రైతులను క్రమం తప్పకుండా మట్టి పరీక్షలు చేయించుకోవడానికీ, పోషక అవసరాలను శాస్త్రీయంగా నిర్ధారించడానికీ మట్టి ఆరోగ్య కార్డులను ఉపయోగించేలా ఈ ప్రచారం ప్రోత్సహిస్తుంది. ఇది సమతుల్య ఎరువుల వాడకాన్ని సాధ్యం చేస్తుంది. అనవసర ఖర్చు లను తగ్గిస్తుంది. పంట ఉత్పాదకతను మెరుగుపరుస్తుంది. దీర్ఘకాలి కంగా నేల సారాన్ని కాపాడుతుంది.2. సమతుల్య పోషక నిర్వహణ: అధిక రసాయన ఎరువులపై ఆధారపడకుండా, వాస్తవ నేల అవస రాలకు అనుగుణంగా ఎరువులను ఉపయోగించేలా రైతులను ప్రోత్స హిస్తున్నారు. సమతుల్య పోషక నిర్వహణ నేల నాణ్యతను మెరుగు పరుస్తుంది. సుస్థిర వ్యవసాయ ఉత్పత్తిని నిర్ధారిస్తుంది.3. సహజ – సుస్థిర వ్యవసాయానికి ప్రోత్సాహం: ఈ ప్రచారం కృత్రిమ రసాయ నాలపై ఆధారపడటాన్ని తగ్గించి, పర్యావరణ సుస్థిరతను మెరుగు పరిచే సహజ వ్యవసాయ పద్ధతులకు మద్దతు ఇస్తుంది.4. నీటి సంరక్షణ: నీటి కొరత – భూగర్భ జలాల క్షీణతపై పెరుగుతున్న ఆందోళనలను పరిష్కరించడానికి సమర్థవంతమైన నీటి నిర్వహణ పద్ధతులను ప్రోత్సహిస్తున్నారు.5. శాస్త్రీయ వ్యవ సాయ పద్ధతులు: ఆధునిక విత్తే పద్ధతులు, విత్తన శుద్ధి, పంట ప్రణాళిక, సాంకేతికత ఆధారిత వ్యవసాయ పద్ధతులను పాటించ డానికి అవసరమైన సమాచారాన్ని అందిస్తున్నారు.6. పచ్చిరొట్ట ఎరువు–నేల సారం: నేలలోని సేంద్రియ పదార్థాన్ని మెరుగుపరచ డానికీ, నేల సారాన్ని సహజంగా పెంచడానికీ పచ్చిరొట్ట ఎరువుల వాడకాన్ని ప్రోత్సహిస్తున్నారు.7. పంట మార్పిడి ఆవశ్యకత: వరి వంటి కొన్ని పంటలకే పరిమితం కాకుండా వ్యవసాయాన్ని ఏక రూప పంట విధానం నుంచి బహుళ పంటల సాగు వైపునకు మళ్లించి... సిఫారసు చేసిన పంటల సరళిని, అంతర పంటలను, సమగ్ర వ్యవసాయాన్ని చేపట్టే విధంగా రైతాంగాన్ని ప్రోత్సహించడం మరో అంశం. దీని వల్ల వ్యవసాయం లాభసాటిగా ఉండటమే కాకుండా సుస్థిర అభివృద్ధి జరుగుతుంది.8. సమగ్ర సస్య రక్షణ: రైతులు తాము పండించే పలు పంట లలో ఆశించే పురుగులు, తెగుళ్ళు, కలుపు వంటి వాటి నుండి పంటను కాపాడుకోవడానికి ఎక్కువగా పెస్టిసైడ్స్ (పురుగు మందులు) వాడుతున్నారు. చాలా ఏళ్ళుగా పంటలలో పురుగు మందు లను విచ్చలవిడిగా, అధిక మోతాదుల్లో, అనేకసార్లు వాడటం వలన అనేక దుష్ప్రభావాలు చూస్తున్నాము. అందుకే పంటలో ఉన్న అసలు సమస్యను వీలైనంత తొందరగా గుర్తించి ఆ సమస్యకు తగ్గట్టుగా రసాయనాలు వాడాలి. ఉదా: పురుగుకు పురుగు మందు, తెగుళ్ళకు తెగులు మందులు, నల్లికి నల్లి మందులు వాడాలి.చీడపీడలు, కలుపు కనిపించిన వెంటనే రసాయన మందులను వాడాల్సిన అవసరం లేదు. వీటి ఉధృతి ఒక స్థాయి దాటినప్పుడు మాత్రమే రసాయనాలు పిచికారీ చేసుకోవాలి. ఉత్పాదకతను ప్రతి కూలంగా ప్రభావితం చేసి, ఆర్థిక నష్టాలను పెంచే నకిలీ ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల నుండి రైతులను రక్షించాలి. – డా. కె. తేజేశ్వరరావు, డా. బి. సహదేవ రెడ్డిప్రధాన శాస్త్రవేత్తలు, ఆచార్య ఎన్ .జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం -
అతడు సామాజిక న్యాయ పతాక!
శూద్ర, అతి శూద్ర కులాల అస్తిత్వమే భారతదేశ అస్తిత్వమనీ, ఆ వర్గాల విముక్తే దేశ విముక్తి అనీ, వారి హక్కులే పౌరసమాజం హక్కులనీ కొల్హాపూర్ సంస్థానాధీశుడు సాహు మహారాజ్ తేల్చి చెప్పారు. ఆయనే దేశంలో తొలి సారిగా కింది కులాలకు రిజర్వేషన్లను ఇచ్చి బహుజన రిజర్వేషన్ల పితామహు డిగా చరిత్రలో నిలిచిపోయారు.మహాత్మా జ్యోతిబాఫూలే ఆలోచనలకు ఆచరణాత్మక ప్రయోగశాలగా కోల్హాపూర్ సంస్థానాన్ని ఆయన తీర్చిదిద్దారు. బుద్ధుడు, కబీర్, జ్యోతిబాఫూలేల ఆలోచనలు ఆయన్ని బాగా ప్రభావితం చేశాయి. డా‘‘ బాబాసాహెబ్ అంబేడ్కర్ చదువుకు సాయం చేయడంతోపాటు ఆయన స్థాపించిన ‘మూక్ నాయక్’ పత్రికకు కూడా వెన్నుదన్నుగా నిలిచారు. అంబేడ్కర్ ఆలోచనలతో దేశంలో దళిత బహుజన సూర్యోదయం జరుగుతుందని 106 ఏళ్ల క్రితమే 1920 మార్చి 22న జాగిర్థారీ మాగాణంలో జరిగిన ‘దక్కన్ అçస్పృశ్య సమాజ సమ్మేళన సభ’లో సాహూజీ ప్రకటించారు. 1918లోనే వెట్టిపని చేసే తలారీ వ్యవస్థను రద్దుచేసి రాజదర్బా రుల్లో దళితులకు ఉద్యోగాలిచ్చే ఉత్తర్వులిచ్చారు. మహర్లకు ఇనాంగా ఇచ్చిన భూములకు వారి పేరుననే పట్టాలు ఇచ్చారు.మరాఠాల బావిలో మంచినీళ్లు తోడుకున్నందుకు దళితుడు గంగారాం కాంబ్లేపై దొంగతనం నేరం ఆరోపించి నడివీధిలో కొరడా దెబ్బలు కొట్టి అవమానించిన విషయం సాహూజీ దృష్టికిరాగానే... దళితుణ్ణి కొట్టిన వ్యక్తిని పిలిపించి అతనివీపు ఎర్రబడేటట్లు కొరడాలతో కొట్టించారు. గంగారాం కాంబ్లే ఆత్మగౌరవాన్ని కాపాడటమే కాకుండా ఆర్థికంగా అతను నిల దొక్కుకునేందుకు హోటల్ పెట్టేందుకు సాయంచేశారు. ఆ హోటల్‌కు తానే స్వయంగా వెళ్లి టీ తాగివచ్చారు. కులాధిపత్య గోడలు బద్దలు కొడుతూ కులాంతర వివాహాలను ప్రోత్సహించారు. ‘వితంతు వివాహచట్టం’ తెచ్చారు.దేశానికి స్వాతంత్య్రం వచ్చి 8 దశాబ్దాలు కావస్తున్నా సగం దేశానికి చట్ట బద్ధ రిజర్వేషన్లు లేవని ఎగుస్తున్న ఉద్యమాలకు ఆయన ఆలోచనలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. సగానికిపైగా ఉన్న బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు లేకపోవటం వల్లనే వారి ప్రాతినిధ్యం పార్లమెంటు, అసెంబ్లీలలో అతితక్కు వగా ఉంది. రాజ్యాంగ సవరణచేసి బీసీలకు జనాభా ప్రాతిపదికన చట్టసభల్లో రిజర్వేషన్లు ఇవ్వాలన్న ఉద్యమాలు రగులుకుంటున్న సందర్భంలో సాహూజీని స్మరించుకుంటూ భారత పాలకులు బీసీల చట్టబద్ధ రిజర్వేషన్లకోసం రాజ్యాంగ సవరణ చేయాలి. 1902 జూలై 26న దేశ చరిత్రలో మొదటిసారిగా వెనుకబడిన వర్గాలకు 50% రిజర్వేషన్లు ఆయన కల్పించారు. బీసీ విప్లవానికి పాటుపడేవారు సాహూజీ స్ఫూర్తితో ముందుకు అడుగులు వేయాలి. – జూలూరు గౌరీశంకర్, బహుజన ఉద్యమకవి (జూన్ 26న ఛత్రపతి సాహు మహారాజ్ జయంతి) -
సత్యం కోసం మహా త్యాగం..
‘ముహర్రం’ ఇస్లామిక్ క్యాలెండర్లో మొదటి నెల. త్యాగానికి, సత్యానికి, అచంచలమైన ధైర్యానికి ప్రతీక. ఈ నెలలో అత్యంత ప్రాముఖ్యమైనది పదవ రోజైన ‘ఆషురా’. ఆరోజు ముస్లింలు ఉపవాసం పాటిస్తారు. శతాబ్దాల క్రితం, కర్బలా మైదానంలో ప్రవక్త(స) వారి మనుమడైన హజ్రత్ ఇమామ్ హుసైన్ (రజి) ఆయన 72 మంది అనుచరులు అధర్మానికి, నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడి అమరులయ్యారు.యజీద్ అనే పాలకుడి అన్యాయాన్ని అంగీకరించకుండా, ఇస్లామీయ మానవీయ విలువలను, శాంతిని కాపాడటం కోసం ఇమామ్ హుసైన్ తన ప్రాణాలను పణంగా పెట్టారు. ఆకలి దప్పులతో అలమటించినాసరే, ధర్మం వైపే నిలబడి వీరమరణం పొందిన ఆయన ఉదంతం ప్రపంచ చరిత్రలోనే అత్యంత స్ఫూర్తిదాయకమైన ఘట్టంగా నిలిచిపోయింది. అందుకే ముహర్రం అంటే పండుగ కాదు, అది సత్యం కోసం జరిగిన మహా త్యాగానికి ప్రతిరూపం.ఈ కర్బలా యుద్ధం కేవలం రెండు శక్తుల మధ్య జరిగిన పోరాటం కాదు; అది న్యాయానికి – అన్యాయానికి, సత్యానికి – అసత్యానికి మధ్య జరిగిన చారిత్రాత్మక సంగ్రామం. తన కళ్లెదుటే పురిటిపాపల నుండి వృద్ధుల వరకు దాహంతో విలవిల్లాడుతూ ప్రాణాలు వదులుతున్నా, ఇమామ్ హుసైన్ అధర్మానికి తలవంచలేదు. ఆయన చూపిన ఈ ధీరత్వం శతాబ్దాలు దాటినా నేటికీ ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది గుండెల్లో స్ఫూర్తి రగిలిస్తూనే ఉంది.అందుకే ఈ రోజున ముస్లింలే కాకుండా, మానవత్వాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరూ ఆ మహనీయుని త్యాగాన్ని స్మరించుకుంటారు. సత్యం కోసం ప్రాణాలనైనా అర్పించవచ్చు కానీ, అన్యాయంతో చేతులు కలపకూడదు. అనే గొప్ప జీవన సందేశాన్ని ముహర్రం మానవాళికి అందిస్తోంది. – ఎం.డి. ఉస్మాన్ ఖాన్ -
ఒక సామాజిక ఆవేదన..
మనిషి చరిత్రలో ఇంత సౌకర్యవంతమైన కాలం మరొకటి లేదు. ఆకలి వేస్తే స్విగ్గీ ఉంది. మందులు కావాలంటే బ్లింకిట్ ఉంది. ప్రయాణానికి ఉబెర్ ఉంది. సందేహాలకు ఏఐ ఉంది. వినోదానికి అంతులేని రీల్స్ ఉన్నాయి. ప్రపంచం మొత్తం ఒక చేతిలో ఇమిడి పోయింది. కానీ ఒక్క ప్రశ్న మాత్రం మిగిలిపోయింది – ఇంత కనెక్ట్ అయిన ప్రపంచంలో మనుషులు ఎందుకు మరింత ఒంటరిగా మారుతున్నారు?ఒకప్పుడు దుకాణానికి వెళితే పొరుగు వారితో మాట్లాడేవాళ్లం. వీధి చివర టీ దుకాణం ఒక చిన్న సామాజిక వేదికగా ఉండేది. ప్రయా ణాల్లో కొత్త పరిచయాలు ఏర్పడేవి. ఇప్పుడు ఆ అవసరాలన్నీ యాప్‌ల ద్వారా తీరిపోతున్నాయి. తక్కువగా నడుస్తున్నాం. తక్కువగా కలుస్తున్నాం. తక్కువగా మాట్లాడు తున్నాం. ఎక్కువగా స్క్రోల్ చేస్తున్నాం. ఇది సేవల ఆర్థిక వ్యవస్థ విజయం. కానీ సంబంధాల ఆర్థిక వ్యవస్థ వైఫల్యం.ప్రపంచ ఆరోగ్య సంస్థ–2025 నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఆరుగురిలో ఒకరు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. 2014–19 మధ్య ఒంటరితనం కారణంగా సంవత్సరానికి 8.7 లక్షల మరణాలు సంభవించాయి. భారతీయులు సగటున రోజుకు ఐదు గంటలకు పైగా స్మార్ట్‌ఫోన్‌లో గడుపుతున్నారు. అందులో ఎక్కువ భాగం సోషల్ మీడియా, వీడియోలు, గేమింగ్‌కే. ప్రతి రీల్, ప్రతి లైక్, ప్రతి నోటిఫికేషన్... ప్రతి కొన్ని సెకన్లకు మెదడుకు ఒక చిన్న డోపమైన్ రివార్డ్. ఇది అలవాటు అవుతుంది. తర్వాత అవసరం అవుతుంది. చివరకు వ్యసనం అవుతుంది.మాదకద్రవ్యాల సమస్య గురించి మాట్లాడినప్పుడు సాధారణంగా స్మగ్లింగ్, నేరాలు, అరెస్టుల గురించి చర్చిస్తాం. కానీ యువత డ్రగ్స్ వైపు ఎందుకు వెళ్తున్నారనే ప్రశ్నను విస్మరిస్తాం. డ్రగ్స్ సమస్యకు అసలు మూలం చాలాసార్లు డ్రగ్స్ కాదు – ఒంటరితనం, నిరాశ, అనుబంధాల కొరత. అందుకే డ్రగ్స్‌పై యుద్ధం గెలవాలంటే, ఒంటరితనంపై పోరాటం ప్రారంభించాల్సిందే. ఇందులో భాగంగా యువత కోసం 24 గంటల హెల్ప్ లైన్లు, సహచరమద్దతు వేదికలు అందుబాటులోకి రావాలి. ఒంటరితనానికి మందు మందుల దుకాణంలో దొరకదు. అది ఒక స్నేహితుడి ఫోన్ కాల్లో ఉంటుంది.ఒక కుటుంబ సంభాషణలో ఉంటుంది. ఒక ఉపాధ్యాయుడి ప్రోత్సాహంలో ఉంటుంది. మనం యంత్రాలను కలిపాం. డేటాను కలిపాం. ప్రపంచాన్ని కలిపాం. కానీ మనిషిని మనిషికి కలపడం మర్చిపోయాం. ఇప్పుడు చెయ్యాల్సింది అదే! – వంగవోలు రవి, ఉపాధ్యాయుడు, ఒంగోలు(రేపు అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం) -
మూసీపై ఆ రెండు వంతెనల వ్యథ..
హైదరాబాదులో మూసీ నదిపై చాలా వంతెనలున్నాయి. అందులో రెండు వంతె నలు నగరానికి రెండు ముఖాలను చూపి స్తాయి. ఒకటి చారిత్రక ప్రాధాన్యం గల చాదర్‌ఘాట్ వంతెన, రెండోది ఆధునిక డిజైన్‌తో కూడిన నాగోల్ వంతెన. మొద టిది నగరం నడిబొడ్డున ఉక్కిరిబిక్కిరి అవుతోంది. రెండోది నగర శివారులో వరదను దాటించలేకపోతోంది. ఈ రెండు వంతెనల పరిస్థితి తెలిస్తే హైదరాబాద్ వరద సమస్యకు అసలు కారణం బోధపడుతుంది.నిజాం కాలంలో పాతబస్తీకీ, రెసిడెన్సీకీ మధ్య వారధిగా చాదర్ ఘాట్ వంతెన నిర్మించారు. అప్పట్లో ఎడ్లబండ్లు, గుర్రపు బగ్గీల కోసం కట్టిన ఈ వంతెన నేడు లక్షలాది వాహనాల భారాన్ని మోస్తోంది. కోఠి, సుల్తాన్ బజార్, బేగంబజార్ వ్యాపార కేంద్రాలకు ఇది జీవనాడి. ఇటీవలి కాలంలో పిల్లర్ల బలోపేతానికి చేపట్టిన పనులవల్ల, పిల్లర్ల మధ్య ఖాళీ కుంచించుకుపోయింది. వర్షాకాలంలో నీటితో పాటు వచ్చే వ్యర్థాలు ఈ ఇరుకు సందుల్లో చిక్కుకుపోతున్నాయి. వంతెన కిందే అవరోధం ఏర్పడి, నీరు వెనక్కి పొంగి కోఠి మార్కెట్‌ను ముంచెత్తుతోంది.క్షేత్రస్థాయి పరిశీలనల ప్రకారం, గత కొన్ని దశాబ్దాలలో చాదర్‌ఘాట్ వద్ద పురాతన కాలం నుండి సహజంగా ఉన్న నది వెడల్పు చాలావరకు తగ్గినట్లు కనిపిస్తుంది. నది గర్భంలో విస్తృతంగా పార్కింగ్, మెకానిక్ షెడ్లు వెలిశాయి. వర్షం రాగానే అవే మొదట మునుగుతున్నాయి. ఆ వాహనాలు, సామగ్రి నీటి ప్రవాహా నికి అడ్డుపడి వరద తీవ్రతను అనేక రెట్లు పెంచుతున్నాయి..చాదర్‌ఘాట్ వంతెన గత కాలపు దూరదృష్టికి నిదర్శనం. నాగోల్ వంతెన ఆధునిక ఇంజినీరింగ్‌కు కొలమానం. కానీ రెండూ వరదల్లో మునుగుతున్నా యంటే తప్పు వంతెనలది కాదు, నది సహజ స్వభా వాన్ని అర్థం చేసుకోని మనది!ఇక నాగోల్ వంతెన ఔటర్ రింగ్ రోడ్లో భాగంగా ఎల్బీ నగర్–ఉప్పల్ ట్రాఫిక్‌ను తగ్గించేందుకు నిర్మించారు. ఆధునిక డిజైన్, వెడల్పాటి రోడ్డు, ఎత్తైన పిల్లర్లు– పైకి అన్నీ బాగానే కనిపి స్తాయి. కానీ సమస్య వంతెనలో లేదు, కట్టిన ప్రదేశ స్వభావంలో ఉంది. నాగోల్ వంతెన మూసీ నది పెద్ద మియాండర్ (వంపు తిరిగే) ప్రాంతంలో ఉంది. వరద సమయంలో నీరు నేరుగా పారదు. మియాండర్ వద్ద నీటి వేగం తగ్గి ఒడ్డును బలంగా కోస్తుంది. ఫలితంగా 2020 అక్టోబర్ వరదల్లో నాగోల్ వంతెన వద్ద నీటిమట్టం వంతెన స్థాయికి చేరి పక్కనే ఉన్న బండ్లగూడ, నాగోల్ కాలనీలు ముంపునకు గురయ్యాయి. నాగోల్ వంతెనకు ఇరువైపులా కాల క్రమేణా నిర్మాణాలు వెలిశాయి. దీనితో వరద మైదానం విస్తీర్ణం తగ్గింది. 2023లో నాగోల్ ప్రాంతంలోని కొన్ని అపార్ట్మెంట్ల సెల్లార్లు మునిగి వాహనాలు పాడయ్యాయి. భారీ వర్షం వస్తే నీళ్లు పోవడానికి తగినంత స్థలం లేకుండా పోయింది.ఏం చెయ్యాలి?హైడ్రాలిక్ అధ్యయనాలు చెబుతున్నదేమిటంటే, భారీ వర్షాల సమయంలో మూసీలోకి చేరే నీటి పరిమాణం అధికంగా ఉంటుంది. కానీ ఆక్రమణల వల్ల చాదర్‌ఘాట్, నాగోల్ వంటి కీలక పాయింట్ల వద్ద నది మోయగలిగే సామర్థ్యం తగ్గిపోయింది. ‘మూసీ రివర్‌ఫ్రంట్ రీజువెనేషన్’ పథకంలో భాగంగా ఇక్కడ రియల్ టైమ్ వాటర్ లెవల్ సెన్సార్ ఏర్పాటు చేసి స్థానిక వ్యాపార సంఘాలతో అనుసంధానిస్తే వరద సమయంలో వ్యాపారులు నష్టపోకుండా కాపాడుకోగలుగుతారు. నాగోల్ వద్ద వంతెనకు ఎగువన, దిగువన నది సహజ ప్రవాహానికి ఆటంకం కలగకుండా వరద మైదానాన్ని శాస్త్రీయంగా పునరుద్ధరించే ప్రణాళికను అమలు చేయాలి.అలాగే నదీ తీరంలో కొత్తగా నిర్మించే భవనాలకు ‘స్టిల్ట్ ఫ్లోర్’ విధానాన్ని తప్పనిసరి చేసి, సెల్లార్ల నిర్మాణాన్ని పరిమితం చేసే దిశగా విధానపరమైన నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. చాదర్‌ఘాట్ నుంచి నాగోల్ వరకు డ్రోన్ సర్వేతో త్రీడీ మ్యాపింగ్ చేపట్టి ఎక్కడ వరద ముప్పుందో, ఎక్కడ నీటి ప్రవాహం నిరోధించ బడుతోందో ముందుగానే గుర్తిస్తే వర్షాకాలంలోపు నివారణ చర్యలు తీసుకోవచ్చు.- డా. రామకృష్ణ మనిమద్దె, వ్యాసకర్త ఎర్త్ సైంటిస్ట్ – నదీ వ్యవస్థల పరిశోధకులు -
వ్యవసాయ రుణాలు రైతులకు కాదా?
‘భారత రైతులు అప్పుల్లోనే పుడతారు, అప్పుతోనే జీవిస్తారు, అప్పుతోనే చని పోతారు, అప్పునే వారసత్వంగా వదిలి పెడతారు’ అని బ్రిటిష్ అధికారి సర్ మాల్కం డార్లింగ్ 1925లో రాశారు. అది వలస పాలన మీద నిందగా ఉద్దేశించింది. వంద సంవత్సరాల తర్వాత, జాతీయీకృత బ్యాంకులు, ప్రాధాన్య రంగ రుణాలు, కిసాన్ క్రెడిట్ కార్డులు, స్వయం సహాయక బృందాలు, రూ.2.5 లక్షల కోట్లకు పైగా రుణమాఫీలు జరిగిన తర్వాత కూడా– 2013 పార్లమెంట్ రికార్డులు చూస్తే, 52 శాతం వ్యవసాయ కుటుంబాలు ఇంకా అప్పుల్లో ఉన్నాయి. మాల్కం డార్లింగ్ మాటలు ఇప్పుడు స్వతంత్ర భారతదేశం మీద నిందగా మారాయి.ఎన్ఎస్ఎస్ఓ 2018 ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లో 92.9 శాతం వ్యవసాయ కుటుంబాలు అప్పుల్లో ఉన్నాయి. తెలంగాణలో 89.1 శాతం. ఇవి బ్యాంక్ శాఖలు, స్వయం సహాయక సంఘాలు అత్యధి కంగా ఉన్న రాష్ట్రాలు. ఈ నివేదిక ప్రకారం ఏపీ రైతు సగటు అప్పు రూ.1,23,400 కాగా, సంవత్సర ఆదాయం రూ. 1,25,760. ఇదే తెలంగాణలో ఆదాయం రూ. 1,12,836, అప్పు రూ. 1,52,000. ఈ అప్పు–ఆదాయ నిష్పత్తులు చూస్తే ఎక్కువ రుణాలు ఎప్పటికీ పరిష్కారం కావని అర్థమవుతుంది.వ్యవస్థలో ఆరు లోపాలు1. ఏపీ, తెలంగాణలో సాగు భూమిలో 30–40 శాతం కౌలు రైతులు సాగు చేస్తున్నారు. వారికి భూమి పట్టా లేదు కాబట్టి కిసాన్ క్రెడిట్ కార్డు రాదు. ప్రభుత్వం రూ.20,000 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్న వడ్డీ రాయితీ పథకం పట్టా ఉన్నవారికే వర్తిస్తుంది. దున్నే రైతుకు రుణం రాదు; దున్నని భూయజమానికి వస్తుంది.2. 1975లో చిన్న రైతుల కోసం ప్రత్యేకంగా స్థాపించిన ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు 1991 తర్వాత వ్యాపార బ్యాంకుల్లా మారిపోయాయి. 3. వ్యవసాయ రుణాలు 2000ల దశకంలో గణాంకాల్లో పెరిగాయి– కానీ రైతుకు అనుభవంలోకి రాలేదు. కారణం ఏమిటంటే, ‘వ్యవసాయ రుణం’ అనే నిర్వచనాన్ని విస్తరించారు. అగ్రి–ప్రాసెసింగ్ కంపెనీలకు, గ్రామీణ మౌలిక సదుపాయాలసంస్థలకు ఇచ్చిన రుణాలు కూడా వ్యవసాయ రుణాల లెక్కలోకి వచ్చాయి. 4. రూ.2 లక్షల వరకు వ్యవసాయ రుణానికి ఎలాంటి హామీ అడగకూడదని ఆర్బీఐ నిబంధన చెప్తోంది. కానీ బ్యాంకులు సర్వే నంబర్ లేకుండా వడ్డీ రాయితీ క్లెయిమ్ చేయలేవు కాబట్టి ఈ నిబంధనను ఉల్లంఘిస్తున్నాయి. 5. హిందూ రుణచట్టంలో ‘దమ్దుపత్’ అనే పురాతన సూత్రం ఉంది– ఒకే సమయంలో వసూలు చేయగలిగే వడ్డీ అసలు మొత్తాన్ని మించకూడదు. ఇది కర్ణాటక మనీలెండర్స్ యాక్ట్ సహా అనేక రాష్ట్రాల రుణ చట్టాల్లో పొందుపరచబడింది. ఆర్బీఐ కూడా ఈ విషయమై స్పష్టమైన ఆదేశం జారీచేసింది. అయినా ఉల్లంఘించబడుతోంది. పంట రుణం బాకీ పడినప్పుడు – కరవు తర్వాత, ధర పతనమైన తర్వాత, వర్షాలు విఫలమైన తర్వాత ఇది సాధా రణంగా జరుగుతుంది. ఖాతాపై సాధారణ వడ్డీతో పాటు పెనాల్టీ వడ్డీ కూడా పడుతుంది. ప్రతి మూడు నెలలకు కాంపౌండ్ అవుతుంది. ఖాతా నాన్–పర్ఫార్మింగ్ అసెట్‌గా వర్గీకరించబడిన తర్వాత కూడా వడ్డీ పెరుగుతూనే ఉంటుంది. రెండు మూడు సంవత్సరాల బాకీ తర్వాత, రూ.50,000 స్వల్పకాలిక పంట రుణంపై పేరుకు పోయిన వడ్డీ అసలును దాటిపోతుంది. ఆ సమయంలో బ్యాంకు ఆర్బీఐ ఆదేశాన్ని నేరుగా ఉల్లంఘిస్తోంది. రైతుకు ఈ నిబంధన తెలియదు. బ్యాంకు అసలు, పేరుకుపోయిన మొత్తం వడ్డీ రెండూ చెల్లించమని సెటిల్మెంట్ చర్చలు జరుపుతుంది. అనధికారికరంగంలో ఉల్లంఘన మరింత ప్రత్యక్షంగా ఉంటుంది. 36–60 శాతం వడ్డీకి అప్పిచ్చే మనీలెండర్ రెండు మూడేళ్లలో అప్పునురెట్టింపు చేస్తాడు– ఎలాంటి నియంత్రణ లేకుండా.6. బ్యాంకుల రుణంలో 18 శాతం వ్యవసాయానికి ఇవ్వాలని చట్టం. కానీ – (అ) ‘వ్యవసాయ రుణం’ నిర్వచనంలో కార్పొరేట్ ఫుడ్ కంపెనీలను చేర్చారు; (ఆ) పీఎస్ఎల్సీ సర్టిఫికెట్లు కొనుగోలు చేయడం ద్వారా బ్యాంకులు ఒక్క రైతుకూ రుణం ఇవ్వకుండా లక్ష్యాలు చేరుకుంటున్నాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో ఈ సర్టిఫికెట్ల మార్కెట్ రూ.9 లక్షల కోట్లు (మొత్తం వ్యవసాయ రుణ వితరణ కంటే ఎక్కువ); (ఇ) లక్ష్యం తప్పిన బ్యాంకులు నాబార్డ్ ఆర్ఐడీఎఫ్ ఫండ్‌లో డబ్బు వేస్తాయి. ఆ డబ్బు రాష్ట్ర మౌలిక సదుపా యాలకు వెళ్తుంది, రైతులకు కాదు.మూడు సంస్కరణలు1. వడ్డీ రాయితీ సాగు చేసేవారికి చేరాలి, పట్టా ఉన్నవారికి కాదు: సాగు చేయనివాళ్లకు సాగుకోసం ఇచ్చే వడ్డీ రాయితీ చట్ట పర మైన నేరంగా పరిగణించాలి. పంట బీమా (పీఎంఎఫ్‌బీవై) నమోదు, పీఎం–కిసాన్ రిజిస్ట్రేషన్, జాయింట్ లయబిలిటీ గ్రూపులు (జేఎల్‌జీ) లేదా రైతు ఉత్పత్తిదారు సంఘాలు (ఎఫ్‌పీఓ) సభ్యత్వం – ఇవన్నీ సాగు ఆధారాలు. జేఎల్జీలు, ఎఫ్పీఓలు ధ్రువీకరణ, రుణ వితరణ వేదికలుగా పని చేయాలి.2. రుణమాఫీ బదులు రుణ మార్పిడి: రుణమాఫీలు సంస్థాగత రుణాలనే రద్దు చేయగలవు– అదే అత్యంత నష్టపడిన రైతులు తీసుకున్న మనీలెండర్లు, ఇన్ పుట్ డీలర్ రుణాలను తాకలేవు. రుణ మార్పిడి నిర్మాణం ఇందుకు మెరుగైన పరిష్కారం. గ్రామసభ ద్వారా రూ.25,000 కంటే ఎక్కువ అన్ని అనధికారిక రుణాలను సర్వే చేయాలి. ప్రభుత్వ హామీతో ఒక డెట్ కన్వర్షన్ ఫండ్... మనీలెండర్ నుండి రుణాన్ని అదే మొత్తానికి కొనుగోలు చేయాలి. రైతు అప్పు 7 శాతం వడ్డీతో అధికారిక రుణంగా మారుతుంది,పంట కాలానికి అనుగుణంగా వాయిదాలు ఉంటాయి. పంట నష్టం జరిగితే వాయిదా పడుతుంది, డిఫాల్ట్ అవ్వదు. కేరళ ప్రభుత్వం ఇటువంటి ప్రయత్నం ఇప్పటికే చేసింది.3. చిన్న–సన్నకారు రైతుల 10 శాతం ఉప–లక్ష్యాన్ని పీఎస్ఎల్సీ సర్టిఫికెట్ కొనుగోలు ద్వారా చేరుకోకుండా నిరోధించాలి. ప్రత్యక్ష రుణ వితరణే ఆమోదయోగ్యం కావాలి. ‘వ్యవసాయ రుణం’ నిర్వచనం నుండి అగ్రి–బిజినెస్ కంపెనీలను తొలగించాలి. మాల్కం డార్లింగ్ వ్యాఖ్యకు ప్రాసంగికత పోయిదా? ప్రాధాన్య రంగ రుణం కార్పొరేట్‌కు వెళ్ళింది. రూ.2.5 లక్షల కోట్ల రుణ మాఫీలు కౌలు రైతును తాకలేదు. హామీ లేని రుణం హక్కు కాగితంపైనే ఉంది. వడ్డీ పరిమితి చట్టం ఉంది, అమలు లేదు. ఈ ప్రతి లోపాన్నీ సరిచేయవచ్చు. కొత్త విధానం అవసరం లేదు, ఉన్న నిబంధనలను అమలు చేయగలిగే సంకల్పం చాలు.-వ్యాసకర్త వ్యవసాయ శాస్త్రవేత్త,‘సుస్థిర వ్యవసాయ కేంద్రం’ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్-డా‘‘ జి.వి.రామాంజనేయులు -
ఆధ్యాత్మిక జ్వాల..
క్రీస్తు కంటే ముందు పుట్టి, ఈ నేలపై క్రీస్తు మార్గం సరాళం చేయడానికి శ్రమించినవాడు యోహాను. ఆనాటి ప్రజల్ని దేవునివైపు తిప్పుతూ, వస్తాడు నా దేవుడంటూ ప్రజలకు నీళ్ళతో బాప్తిస్మం ఇస్తూ, ఓ చైతన్య జ్వాలలా అరణ్య ప్రాంతాల్లో దైవ స్వరం వినిపించిన సంచార స్వరాల ప్రయోక్త, మహా భక్త బాప్తిస్మ యోహాను.‘స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు’– ఈ మాటలు మరియతో ఎలిజబెత్ అన్నది. అప్పటికి ఆమె ఆరు నెలల గర్భవతి. అన్నది ఎలిజబెత్. విన్నది మరియ. అక్కడ ఉన్నది వీరిద్దరే. కానీ ఆ మాటల్ని మరియతో పాటు ఇంకా మరో ఇద్దరు విన్నారు. ఒకరు ఎలిజబెత్తమ్మ గర్భంలోని బాప్తిస్మ యోహాను, మరొకరు మరియ గర్భంలోని యేసు.యేసు గురించి గర్భస్థ శిశువుగా విన్నాడు కాబట్టే, ఆయన ఔన్నత్యాన్ని ఘంటాపథంగా లోకానికి చాటగలుగు తున్నాడు యోహాను! లోకంలో జరిగే మంచీ చేడుల్ని చూచినవి చూచినట్టుగా ప్రజలకి వివరిస్తూ, రాచరికంలోని వైనా ఘాటుగా విమర్శించేస్తున్నాడు. ప్రజలంతా ఆయన్ను ఓ అడవిలో అన్నగా గుర్తిస్తే, రాచరికం మాత్రం ఓ తిరుగు బాటుదారునిగా గుర్తించింది.ఫిలిప్పు భార్య హేరోదియ. ఆమె తన భర్త ఫిలిప్పును వదిలేసి, అతని తమ్ముడు హేరోదు అంతిపస్ని పెళ్లి చేసుకుంది. అంతిపసు ప్రస్తుతం ఆ గలిలయ రాజు. ఓసారి తన ప్రసంగంలో ‘నీ సహోదరుని భార్యను చేర్చుకొనుట న్యాయము కాదు’ అని రాజును బహిరంగంగా ఖండించాడు. అగ్గిమీద గుగ్గిలమైంది రాజు కాడు, హేరోదియ.హేరోదియకు ఓ కూతురు. పేరు సలోమి. ఆరితేరిన నర్తకి. ఓ రోజు ఆడింది పాడింది, ఆ రాజును మెప్పించింది. ఏమి కావాలో కోరుకోమన్నాడు రాజు. తల్లిచేసిన దుర్బోధలచే సలోమి యోహాను శిరస్సు కోరుకొంది. సరే అన్నాడు రాజు. మరుక్షణంలోనే పళ్ళెరాన యోహాను శిరస్సు! కానీ మరణంనుంచే గలిలయలో కొత్త విప్లవం ఆవిర్భవించింది. యోహాను స్ఫూర్తి ఖండఖండాలకు పాకింది. – డా‘‘ దేవదాసు బెర్నార్డ్ రాజు (జూన్ 24న బాప్తిస్మ యోహాను జన్మదినం) -
ఎంతలో ఎంత మార్పు!
1977 మార్చిలో ప్రప్రథమంగా కేంద్రంలో ఏర్పాటైన కాంగ్రెసేతర ప్రభుత్వ (జనతా పార్టీ) సంబరం మూన్నాళ్ళ ముచ్చటగా ముగిసింది. కారణం, పార్టీ నాయకుల అంతర్గత కుమ్ములాట. తనకు దక్కవలసిన ప్రధాని పీఠం, మొరార్జీ దేశాయికి దక్కడంతో, ఉపప్రధాని చౌధరీ చరణ్ సింగ్ జీర్ణించుకోలేక పోయారు. ఈ తరుణంలో జనతా ప్రభుత్వాన్ని కూలదోయటానికి పక్కా వ్యూహం పన్నారు ఇందిరాగాంధీ. సరిపడా ఎంపీలతో జనతా నుండి బయ టకు వస్తే, ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్‌కు చెందిన 154 మంది ఎంపీలు ఆయనకు మద్దతు ఇస్తార ని చరణ్ సింగ్‌కు సంజయ్ గాంధీ ద్వారా ఆఫర్ పంపారామె. 1979 జూలై 1న మంత్రి పదవికి రాజీనామా చేసి పార్టీ నుండి బయటకు వచ్చారు చరణ్ సింగ్. ఆమె ఆశించినట్టే మొరార్జీ ప్రభుత్వం పడిపోయింది.రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి 1979 జూలై 28న చరణ్ సింగ్‌తో రాష్ట్రపతి భవన్లో ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. 23 రోజులు గడిచాక కాంగ్రెస్ ఎంపీలు చరణ్ సింగ్ ప్రభుత్వానికి ఇచ్చిన మద్దతును వెనక్కి తీసుకున్నారు. పార్లమెంటులో బల పరీక్షకు వెళ్ళకుండానే, ఆగష్టు 20 నాడు పదవికి రాజీనామా చేసి పార్లమెంటును రద్దు చేయాల్సిందిగా రాష్ట్రపతిని కోరారు కిసాన్ నేత చరణ్ సింగ్.ఆగస్టు 22న లోక్‌సభ రద్దు కావడంతో 1980 జనవరిలో మధ్యంతర ఎన్నికల కోసం ఎన్నికల కమిషన్ గెజిట్ నోటిపికేషన్ విడుదల చేసింది. సంజయ్ గాం«ధీ తన సన్నిహితులకు, యువతకు అత్యధిక టిక్కెట్లు ఇచ్చి లోక్‌సభ ఎన్నికల బరిలోకి దింపారు. కాంగ్రెస్ 353 సీట్లతో అఖండ విజయం సాధించింది. ఎమర్జెన్సీ రోజుల్లో రాజ్యాంగేతర శక్తిగా అధికారం చలాయించిన సంజయ్... అమేథీ నియోజకవర్గం నుండి గెలిచి అఫీషియల్ సూపర్ పవర్ సెంటర్‌గా ఎదిగారు.1980 జూన్ 23న ఉదయం 8 గంటలు. డిల్లీ సఫ్దర్‌జంగ్ ఎయిర్‌పోర్టు గగన వీధుల్లో టూ సీటర్ పిట్స్ – 2ఏ విమానం పచార్లు చేస్తూ దగ్గరే ఉన్న చెట్టుకు ఢీకొని మంటలతో నేలకూలింది. చెట్టు కొమ్మల్లో ఇరుక్కున్న రెండు శవాలు గుర్తుపట్టలేనివిధంగా కాలిపోయాయి. అవి ఆ విమానంలోని ఫ్లైట్ ఇన్స్ట్రక్టర్ సుభాష్ సక్సేనా(50), ట్రైనీ పైలట్ సంజయ్ గాంధీ (33)వి అని తేలాయి. సంజయ్ గురించి కుష్వంత్ సింగ్ ‘99: అన్ఫర్గెటబుల్ ఫిక్షన్, నాన్– ఫిక్షన్, పొయిట్రీ అండ్ హ్యూమర్’ పుస్తకంలో ఇలా అన్నారు: ‘నాకు సంజయ్ అంటే ఇష్టం. కానీ అతను జీవించి ఉంటే, ఈ దేశంలో క్రమశిక్షణ ఉండేది, అభివృద్ధి కూడా వేగంగా జరిగేది. ప్రజాస్వామ్యం మాత్రం ఉండేది కాదు.’ – జిల్లా గోవర్ధన్ ‘ రిటైర్డ్ పీఎఫ్ కమిషనర్, ముంబై -
అక్కడికే ఎక్కువమంది!
భారతదేశం నుండి బయల్దేరే, లేదా భారతదేశంలో ఆగే విమాన ప్రయాణికుల సంఖ్యను బట్టి... గల్ఫ్ దేశాలకూ, భారత్‌కూ మధ్యే అత్యధికంగా రాకపోకలు సాగుతున్నాయి. వలసలు, వ్యాపారాలు ఇందుకు ప్రధాన కారణం కాగా, పర్యాటక రంగం తర్వాతి స్థానంలో ఉంది. -
కోర్టు కార్యకలాపాలు – ప్రాంతీయ భాషలు
ఇటీవల ఒకరు గౌరవ తెలంగాణ హైకోర్ట్‌లో తెలుగులో వాదనలు వినిపించబోతే, ద్విసభ్య ధర్మాసనం తెలుగులో వాదనలు వినిపించ రాదని ఆక్షేపించింది. రాజ్యాంగంలోని 348 (1)(ఏ) అధికరణం ప్రకారం, సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో కార్యకలాపాలు ఆంగ్ల భాషలోనే జరగాలి. అయితే, 348(2)వ అధికరణం ప్రకారం – కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతితో హైకోర్టులో హిందీ లేదా వేరే ఇతర భాషల్లో కార్యకలాపాలు జరపవచ్చు. ఆదేశాలు, తీర్పులు మాత్రం ఆంగ్లంలోనే ఉండాలి. ఇతర భాషలో తీర్పు ఉంటే, దాని ఆంగ్లాను వాదం కూడా జత చేయాలి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బిహార్, రాజస్థాన్ రాష్ట్రాలు హైకోర్టులో హిందీలో కార్య కాలాపాలు నిర్వర్తించడానికి కేంద్ర ప్రభుత్వ అనుమతి పొందాయి.తమిళనాడు, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వరుసగా తమిళం, గుజరాతీ, హిందీ, బెంగాలీ, కన్నడ భాషలను తమ తమ హైకోర్టుల్లో ఉపయోగించ డానికి కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరాయి. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయం కోరగా, 2012లో సుప్రీంకోర్టు ఆ సిఫారసులను అంగీకరించలేదు. 2016లో తమిళనాడు ప్రభుత్వం, 2012 నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరుతూ తిరిగి అదే సిఫారసు చేసింది. సుప్రీంకోర్టు తిరిగి ఆ అభ్యర్థనను అంగీకరించలేదు. హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు న్యాయమూర్తులుగా నియమితులవుతారు కాబట్టి వారు ప్రాంతీయ భాషలను అర్థంచేసుకోలేరు కాబట్టి ప్రాంతీయ భాష లలో వాదనలను వినిపించవద్దనేది సుప్రీం అభిప్రాయం.అయితే, ఇదే పరిస్థితి, పార్లమెంటులో కూడా ఉంటుంది. దేశ నలుమూలల నుంచి ఎన్నికైన ప్రజా ప్రతినిధులుంటారు. 2025 వరకు, కేవలం, ఇంగ్లీష్, హిందీ భాషలలో మాట్లాడటానికే అను మతి ఉండేది. కానీ, సాంకేతికతను ఉపయోగించి, 2025 నుంచి, 22 అధికార భాషలలో నుండి ఏ భాషలోనైనా పార్లమెంటు సభ్యులు మాట్లాడవచ్చు. పార్లమెంటుకు వర్తించే ఇదే సూత్రం, అదే సాంకేతి కతను ఉపయోగించి హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో కూడా ప్రాంతీయ భాషలో వాదనలకు అనుమతించవచ్చు.దిగువ కోర్టుల విషయానికి వస్తే, ఏ ప్రాంతీయ భాషనైనా కోర్టు భాషగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించవచ్చు. దిగువ కోర్టుల్లో సాక్ష్యాన్ని ప్రాంతీయ భాషలోనే నమోదు చేయాలి. 1984లోనే అప్పటి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తెలుగులోనే దిగువ కోర్టు వ్యవహారాలను నడపా లని ఆదేశించింది. 2013లో మొదటిసారిగా అప్పటి శ్రీకాకుళం జుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ నాలుగు తీర్పులను తెలుగులో వెలువరించారు. కానీ ఆ తరువాత, దిగువ కోర్టులు తెలుగులో తీర్పులను రాయడంపై శ్రద్ధ వహించడం లేదు.అప్పటి రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ 2017లో చేసిన సూచ నతో, చొరవతో తీర్పులు ప్రాంతీయ భాషల్లో లభ్యమయ్యేలా సుప్రీంకోర్టు చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. 2019లో మొదటిసారిగా, 114 తీర్పుల ప్రాంతీయ భాషల అనువాదాలను సుప్రీంకోర్టు తమ వెబ్సైట్ ద్వారా అందుబాటులోకి తెచ్చింది.ఇక హైకోర్టుల విషయానికి వస్తే, అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవం సందర్భంగా 2023 ఫిబ్రవరి 21న కేరళ హైకోర్టు రెండు తీర్పులను మలయాళంలో వెలువరించింది. అదే సంవత్సరం జూన్‌లో తెలంగాణ ౖహె కోర్టు మొట్టమొదటిసారిగా ఓ వివాదాన్ని పరిష్కరిస్తూ తెలుగులో తీర్పు వెలువరించింది. ఇప్పుడు అన్ని తీర్పులకు తెలుగు అనువాదాలు కోర్టు వెబ్సైటులో లభిస్తున్నాయి. అయితే అవి అంతగా అర్థవంతంగా ఉండటంలేదు. న్యాయ స్థానాల్లో భాషా పండితులను నియమించడం ద్వారా అనర్థం నివా రించవచ్చు. ప్రస్తుతం, న్యాయవిద్య కేవలం ఆంగ్ల మాధ్యమంలోనే లభ్యమవుతోంది. తెలుగులో నాణ్యమైన తీర్పులు రావాలంటే, తెలుగు భాషలో కూడా న్యాయవిద్యను ప్రవేశ పెట్టాలి. – కె.ఎస్. హరీష్ కుమార్, విశ్రాంత అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (లా), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా -
హైటెక్ – హైరిస్క్
1990ల చివరలో ప్రారంభమైన ఐటీ విప్లవం హైదరాబాద్ రూపురేఖలను పూర్తిగా మార్చేసింది. గచ్చిబౌలి, మాదాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్ రామ్‌గూడా వంటి ప్రాంతాలు ప్రపంచస్థాయి వ్యాపార కేంద్రాలుగా ఎదిగాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, డెలాయిట్, యాక్సెంచర్ వంటి సంస్థలు వేలాది ఉద్యోగ అవకాశాలను సృష్టించాయి.దేశం నలుమూలల నుంచి యువత ఇక్కడికి వచ్చారు. అధిక వేతనాలు, వేగవంతమైన జీవనశైలి, ఆర్థిక స్వేచ్ఛ నగర సంస్కృతిని కొత్త దిశలో నడిపించాయి. పబ్‌లు, లాంజ్ బార్లు, వీకెండ్ పార్టీలు, ఫామ్‌హౌజ్ ఈవెంట్లు వేగంగా విస్తరించాయి. నైట్ లైఫ్ ఉండటం తప్పు కాదు. ప్రపంచంలోని ప్రతి ఆధునిక నగరంలో అది ఉంటుంది. కానీ వినోదం నియంత్రణ కోల్పోయినప్పుడు, స్వేచ్ఛ బాధ్యతను విస్మరించినప్పుడు, రాత్రి జీవితం చట్టాన్ని సవాలు చేయడం మొదలైనప్పుడు సమస్యలు మొదలవుతాయి.ప్రస్తుతం హైదరాబాదులో వందల సంఖ్యలో పబ్‌లు, నైట్ క్లబ్బులు పని చేస్తున్నాయి. వీటి చుట్టూ కోట్లాది రూపా యల వినోద ఆర్థిక వ్యవస్థ ఏర్పడింది. సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ రీల్స్, సెల బ్రిటీ సంస్కృతి యువతలో ఒక భ్రమను సృష్టిస్తున్నాయి. మద్యం సేవించడం, పార్టీలకు హాజరుకావడం వంటివి ఆధునికతకు చిహ్నంగా యువత భావిస్తోంది. ఇదే వాతావరణాన్ని డ్రగ్స్ మాఫియా అవకాశంగా మార్చుకుంటోంది. ఒకప్పుడు గంజాయికి పరిమి తమైన మాదకద్రవ్యాల నెట్వర్క్ ఇప్పుడు ఎమ్డీఎమ్ఏ, ఎల్ఎస్డీ, కోకైన్ వంటి సింథటిక్ డ్రగ్స్ వరకు విస్తరించింది. డార్క్‌వెబ్, క్రిప్టోకరెన్సీల సహా యంతో జరిగే అక్రమ వ్యాపారం యువతను లక్ష్యంగా చేసుకుంటోంది. హైదరాబాద్ ఎందుకు డ్రగ్స్ మాఫియాకు ఆకర్షణీయంగా మారింది? అధిక ఆదాయం కలిగిన యువ జనాభా, అంతర్జాతీయ కనెక్టివిటీ, నైౖట్లైఫ్, ఫామ్ హౌజ్ సంస్కృతి... ఇవన్నీ కారణాలే.అభివృద్ధి అంటే ఐటీ టవర్లు, ఫ్లైఓవర్లు, మెట్రో రైళ్లు, స్కైస్క్రాపర్లు మాత్రమే కాదు. మహిళలు రాత్రి వేళ భయపడకుండా ప్రయాణించగలగడం, యువత ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం, చట్టం పట్ల గౌరవం ఉండటం కూడా అభివృద్ధి సూచికలే. స్వేచ్ఛ–అనాగరికత మధ్య గీత చెదిరి పోకుండా కాపాడుకోవడం సమాజం బాధ్యత. ఈ పరిస్థితిని ఎదుర్కోవాలంటే ప్రభుత్వం, పోలీసులు, కుటుంబాలు, విద్యాసంస్థలు, మీడియా సమన్వయంతో పనిచేయాలి. చివరికి ప్రశ్న ఒక్కటే– మన యువతను, నగర భవి ష్యత్తును కాపాడగలమా? సమాధానం కాలం కాదు, మన చర్యలే చెబుతాయి. – డా‘‘ బి. హర్షిణి ‘ సైకియాట్రిస్ట్ -
వరం ఎలా కోరాలి?
ఆ దేవుడే ఎదురై, ‘వరమిస్తాను, కోరుకో!’ అంటే ఎలాంటి వరం, ఎలా కోరుకోవాలో చాలామందికి తెలియదు. అతితెలివి వరాలడిగి ఆత్మనాశం కొనితెచ్చుకొన్న అసురులెందరో ఉన్నారు. ధర్మమైన వరం అడిగి, శుభపరంపరను సాధించిన ధర్మరాజులు అరుదు.వనవాసంలో యక్షుడడిగిన యక్షప్రశ్నలన్నిటికీ ధర్మరాజు చక్కగా సమాధానాలిచ్చిన సందర్భంలో, ఆ యక్షుడు మెచ్చి, ‘ధర్మజా! ఇక్కడ చనిపోయి పడి ఉన్న నీ నలుగురు తమ్ముళ్ళలో ఒక్కరిని బ్రతికిస్తాను. ఎవరు కావాలో కోరుకో’ అని అడిగాడు. ‘నా తల్లి సంతానంలో నేను బ్రతికి ఉన్నాను. నా సవతి తల్లి మాద్రిసంతానమైన నకులుడిని సజీవుడిని చేయటం ధర్మంగా ఉంటుంది’ అని కోరాడు ధర్మరాజు. యుధిష్ఠిరుడి ధర్మబుద్ధికి అబ్బురపడి, యక్షుడు ఆయన నలుగురు సోదరులనూ బ్రతికించాడు. ‘ధర్మజా! నేను యక్షుడిని కాదు. నిన్ను పరీక్షించేందుకు వచ్చిన ధర్మదేవతను. వరం అడగటంలో నీ ధర్మబుద్ధిని మెచ్చాను. నీ కోసం మరో వరం కూడా ఏదయినా కోరుకో’ అన్నాడు. ‘అయ్యా, మాతో పాటు అరణ్యంలో నివసిస్తున్న ఒక బ్రాహ్మణుడు అగ్నిని మథించుకొనేందుకు వాడే అరణి కొయ్యను, లేడి ఎత్తుకు పోవటం చేత మేం అయిదుగురమూ దానిని వెతుకుతూ వచ్చాం. దయతో దానిని ప్రసాదించు, చాలు’ అన్నాడు ధర్మజుడు.‘అదెంతపని? మిమ్మల్ని పరీక్షించేందుకు లేడి రూపంలో వచ్చి, ఆ అరణిని తెచ్చింది నేనే!’ అని, ధర్మదేవుడు అరణిని ధర్మజుడికి అందించాడు. ‘ఇప్పటికీ నీ కోసం నువ్వు వరం కోరుకోలేదు కనుక నేనే, అయాచితంగా, మీకొక వరమిస్తున్నాను. మీ పన్నేండేళ్ళ అరణ్యవాసం నేడో, రేపో ముగియబోతున్నది. అజ్ఞాతవాసం అనే అతి క్లిష్టమైన కాలం ఆరంభం కాబోతున్నది.మీరు మీకు అనువైన మారువేషాలు ధరించి, ఎవ్వరూ మిమ్మల్ని గుర్తించకుండా మీ అజ్ఞాతవాసాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇది నా వరం. ఇది కాక, నువ్వు కోరేదేమైనా ఉంటే అడుగు. అనుగ్రహిస్తాను!’ అన్నాడు ధర్మదేవత. ‘దేవా! ఇంతకంటె ఏం కావాలి? అయినా అడిగావు కనక, నా బుద్ధి ఎల్ల వేళలా ధర్మాన్నే అనుసరించి ఉండేట్టు అనుగ్రహించు’ అన్నాడు ధర్మజుడు. ధర్మనిష్ఠుడైన వాడికిక లోటేమిటి? ఎప్పుడు ఏ దేవతను ఏది కోరినా లభిస్తుంది! – ఎం. మారుతి శాస్త్రి -
దక్షిణాసియాలో కనబడని సంక్షోభం
దక్షిణాసియా ప్రస్తుతం ఒక విరుద్ధమైన కూడలిలో నిలిచి ఉంది. సాంకేతికత, వ్యవస్థాపకత కారణంగా ఈ ప్రాంత ఆర్థిక వ్యవస్థలు అద్భుతమైన వేగంతో దూసుకు పోతుండగా, మరోవైపు ఒక నిశ్శబ్ద జీవ క్రియ సంక్షోభం ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తోంది. భారతదేశం, పాకిస్తాన్, బంగ్లా దేశ్ టైప్ 2 డయాబెటిస్ (మధుమేహం), గుండె జబ్బులకు ప్రపంచ కేంద్రాలుగా మారాయి. ఆందోళనకరమైన విషయం ఏంటంటే, పాశ్చాత్య దేశాల ప్రజలతో పోలిస్తే దాదాపు పదేళ్లు ముందే – అంటే 30 ఏళ్ల చివర్లో, 40 ఏళ్ల ప్రారంభంలోనే – ఇక్కడి ప్రజలు గుండెపోట్లు, తీవ్రమైన జీవక్రియ రుగ్మతల బారిన పడుతున్నారు.శతాబ్దాల నాటి పొదుపు వాస్తవికతఇది కేవలం జీవనశైలి లేదా సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల మాత్రమే జరుగుతున్నది కాదు. దీని వెనుక ‘దక్షిణాసియా థిన్–ఫ్యాట్ ఫినోటైప్’ అనే ప్రత్యేకమైన జీవశాస్త్ర సత్యం దాగుంది. ఇక్కడి ప్రజలు బయటికి చూసేందుకు సన్నగా కనిపించినప్పటికీ, వారి లోపల ముఖ్యమైన అవయవాల చుట్టూ ప్రమాదకరమైన స్థాయిలో అంతర్గత కొవ్వు (విసెరల్ ఫ్యాట్) పేరుకుపోయిఉంటుంది. ఈ వైరుధ్యాన్ని అర్థం చేసుకోవడం, దీనికి పరిష్కారం కనుగొనడం దక్షిణాసియా దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వానికీ, కుటుంబ సంక్షేమానికీ అత్యంత అవసరం.శతాబ్దాలుగా పదే పదే వచ్చిన కరవులు, ఆహార కొరత ఇక్కడి ప్రజల జన్యురూపాన్ని ప్రభావితం చేశాయి. ప్రకృతి ఎంపిక ప్రకారం, శరీరంలో శక్తిని అత్యంత సమర్థవంతంగా నిల్వ చేసు కోగల వ్యక్తులకే మనుగడ సాధ్యమైంది. ఈ మనుగడ యంత్రాంగాన్నే ఇప్పుడు ‘థ్రిఫ్టీ జీన్’ (పొదుపు జన్యువు) సిద్ధాంతం అని పిలుస్తున్నారు. కేలరీలు సమృద్ధిగా లభిస్తున్న, శారీరక శ్రమ లేని ఆఫీస్ ఉద్యోగాలు, మోటారు వాహనాలు, విపరీతంగా ప్రాసెస్ చేసిన ఆహారాలున్న నేటి యుగంలో, ఒకప్పుడు ప్రాణాలు కాపాడిన ఈ జన్యు లక్షణమే ఇప్పుడు శాపంగా మారింది. దీని ఫలితంగా శరీరంలో దీర్ఘకాలిక తక్కువ స్థాయి వాపు, ఇన్సులిన్ నిరోధకత, అవయవాల చుట్టూ వేగంగా కొవ్వు పేరుకు పోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. లక్షలాది కుటుంబాలలో, ఒకే ఒక్క దీర్ఘకాలిక అనారోగ్యం – ముఖ్యంగా అదికుటుంబ పెద్దకు వచ్చినప్పుడు – వారిని తీర్చలేని వైద్య అప్పుల్లోకీ, తరతరాల పేదరికంలోకీ నెట్టేస్తుంది. ప్రధానంగా పాశ్చాత్య జనాభాను బట్టి రూపొందించిన సాంప్ర దాయ బి.ఎమ్.ఐ. (బాడీ మాస్ ఇండెక్స్) బరువు చార్టులు తరచుగా దక్షిణాసియా ప్రజలకు ఒక తప్పుడు భద్రతా భావాన్ని (భ్రమను) కల్పిస్తాయి. దీనివల్ల, చాలామంది అంతర్గతంగా ఆరోగ్య ప్రమాదా లను ఎదుర్కొంటున్నప్పటికీ, వారి బరువు ‘సాధారణంగానే’ఉంటుంది. ‘ప్రామాణిక’ కొలతలు పట్టించే తప్పుదోవపాశ్చాత్యులలో అధిక బరువు పరిమితి 25.0 బీఎంఐగా ఉంటే, ప్రపంచ ఆరోగ్య సంస్థ దక్షిణాసియా ప్రజలకు దీనిని 23.0 గానే నిర్ణయించింది; ఎందుకంటే మనకు తక్కువ బరువు ఉన్నప్పటికీ శరీరంలో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది. అలాగే, పాశ్చా త్యులలో 50 ఏళ్ల తర్వాత మధుమేహం వచ్చే ముప్పు ఎక్కువగాఉంటే, దక్షిణాసియా వాసులలో 30 ఏళ్ల నుండే ఈ ప్రమాదంపొంచి ఉంది. పాశ్చాత్యులలో సాధారణంగా చర్మం కింద కొవ్వు చేరితే, దక్షిణాసియా ప్రజలలో కీలక అవయవాల చుట్టూ పేరుకు పోతుంది. ఇది శరీరంలో ఇన్సులిన్ నిరోధకతను ప్రేరేపించి మధుమేహం వంటి సమస్యలకు దారితీస్తుంది. ఖరీదైన జిమ్‌లు, సుదీర్ఘమైన వర్కవుట్ సెషన్ లతో కూడిన పాశ్చాత్య తరహా ఫిట్నెస్ సంస్కృతి ఇక్కడి రద్దీ నగరాలు, ట్రాఫిక్, కాలుష్యం కారణంగా ఆచరణలో సాధ్యం కాకపోవచ్చు. అదృష్టవ శాత్తూ, సైన్స్ మనకు ఒక ఆచరణాత్మకమైన, ప్రభావవంతమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తోంది: అదే ‘ఎక్సర్సైజ్ స్నాకింగ్’ (చిన్న చిన్న విరామాలలో వ్యాయామం చేయడం).‘డయాబెటోలాజియా’ వంటి జర్నల్స్‌లో ప్రచురితమైన పరిశో ధనల ప్రకారం – ముఖ్యంగా భోజనం చేసిన 20–30 నిమిషాల తర్వాత 8–12 నిమిషాల పాటు వేగంగా నడవడం, మెట్లు ఎక్కడం లేదా ఒకే చోట నిలబడి మార్చ్ చేయడం వంటి చిన్నపాటి శారీరక శ్రమలు భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయులు ప్రమాదకరంగా పెరగకుండా గణనీయంగా తగ్గిస్తాయి. సహజంగానే తక్కువకండర ద్రవ్యరాశి (మన శరీరంలోని సహజ ‘గ్లూకోజ్ సింక్’) ఉండే దక్షిణాసియా శరీర తత్వానికి, ఈ చిన్న, స్థిరమైన పనులు ఎంతో శక్తిమంతంగా పనిచేస్తాయి. ఆచరణాత్మక పరిష్కారాలు30 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ సింపుల్ పరీక్షల ద్వారా తమ వార్షిక ‘మెటబాలిక్ బేస్‌లైన్’ (జీవక్రియ స్థితి)ని తెలుసుకోవాలి: హెబీఏ1సీ (3 నెలల సగటు రక్తంలో చక్కెర శాతం), ఫాస్టింగ్ గ్లూకోజ్, బీపీ, మూత్రపిండాల పనితీరు (క్రియాటినిన్), కాలేయ ఎంజైములు, థైరాయిడ్ ఆరోగ్యం కోసం టీఎస్‌హెచ్ పరీక్షలు చేయించుకోవాలి. స్థానిక ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ ఇవ్వడం ద్వారా ఈ స్క్రీనింగ్ పరీక్షలను గ్రామాల్లో సైతం అందుబాటులోకి తేవచ్చు.భారీగా కార్బోహైడ్రేట్లు ఉండే భోజనాలకు దూరంగాఉండండి. పప్పులు, శనగలు, పెరుగు, గుడ్లు, మొలకెత్తిన గింజలు వంటి మనకు అలవాటైన ఆహారాలతో ప్రోటీన్ పరిమాణాన్నిపెంచండి. సబ్జా గింజలు, ఇసబ్గోల్ను రోజూ మీ ఆహారంలో చేర్చుకోండి. ఈ సాంప్రదాయ పదార్థాలు రక్తంలో చక్కెర స్థాయు లను స్థిరీకరించడానికీ, ప్రేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికీ అద్భుతంగా పనిచేస్తాయి. ప్రధాన భోజనంలో ప్రోటీన్, కార్బో హైడ్రేట్ల నిష్పత్తి సుమారుగా 1:1 ఉంచడంవల్ల శరీరంలో వాపు గణనీయంగా తగ్గుతుంది. పాశ్చాత్య నమూనాలను గుడ్డిగా అనుస రించకుండా మన ప్రత్యేక జీవశాస్త్రాన్ని అర్థం చేసుకోవడం ద్వారా, మన శరీరాలకూ, మన వాస్తవికతలకూ సరిపోయే పరిష్కారాలను మనం కనుగొనవచ్చు.-వ్యాసకర్త ఇండో–అమెరికన్ బయోకెమిస్ట్రీ శాస్త్రవేత్త; ‘రెడ్డి సెంటర్ ఫర్ క్రిటికల్ అండ్ ఇంటిగ్రేటెడ్ థింకింగ్’ డైరెక్టర్-మేడా పరమేశ్వర రెడ్డి -
ఇరాన్లో తగ్గి క్యూబాలో నెగ్గేనా?
మెరుపు దాడిలో వెనిజులా అధ్యక్షుడిని బంధించిన తరువాత యూఎస్ అధ్యక్షుడి తరువాతి లక్ష్యం క్యూబా అని అందరూ భావించారు. అనుకోని పరిస్థితులలో ఇరాన్ యుద్ధం క్యూబాను వెనక్కు నెట్టే సింది. ఇరాన్ ఎదురు దెబ్బల నేపథ్యంలో యూఎస్ పక్కా ప్రణాళికతో క్యూబా పథకాన్ని రచిస్తున్నట్లుగా విశదమవుతు న్నది. మే నెల చివరలో యూఎస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ నిమిట్జ్‌ను కరేబియన్ సముద్రంలోకి పంపించటంతో యుద్ధమేఘాలు కమ్ముకోవటం ప్రారంభమైంది. క్యూబా మాజీ అధ్యక్షుడు రావుల్ కాస్ట్రోపై యూఎస్ జస్టిస్ డిపార్ట్మెంట్ హత్యానేర అభియోగాలను మోపటం క్యూబాపై దాడికి యూఎస్ పావులు కదుపుతున్నట్లుగా అర్థమవుతున్నది. క్షేత్ర స్థాయిలో క్యూబా కూడా దాడికి సన్నద్ధమవుతున్న వార్త లొస్తున్నాయి. ‘ప్రజలందరి యుద్ధం’ డాక్ట్రిన్‌ను క్యూబా పాటించ బోతున్నది. ఈ సిద్ధాంతం ప్రకారం అమెరికా దాడిని క్యూబా సైన్యమే కాకుండా, క్యూబా పౌరులందరూ ప్రతిఘటిస్తారు. కమ్యూ నిస్టు పార్టీ వ్యవస్థ, విప్లవ చరిత్ర కలిగిన క్యూబాను దారికి తేవడం యూఎస్‌కు తేలిక కాదు. కానీ ఇరాన్ వైఫల్యాల నుండి ప్రజలదృష్టిని మరలించటానికి ట్రంప్‌కు క్యూబాపై విజయం కీలకం.గుప్పిట్లో ఉంచుకునే ప్రయత్నంకరేబియన్ సముద్రంలో అమెరికాకు కేవలం 90 మైళ్ల దూరంలో ఉన్న క్యూబా దీవి వ్యూహాత్మకంగా భౌగోళిక ఉనికిని కలిగి ఉన్నది. క్యూబాలో విదేశీ శక్తులు తిష్టవేస్తే ఫ్లోరిడా జలసంధిని దిగ్బంధించి యూఎస్‌ను కట్టడి చేయవచ్చు. అందుకే 200 ఏళ్ళ క్రితమే మన్రో డాక్ట్రిన్‌లో భాగంగా ఉత్తర, దక్షిణ అమెరికా ఖండా లను యూఎస్ తన వ్యూహాత్మక ప్రాంతాలుగా ప్రకటించింది. 1898లో స్పెయిన్‌ను యూఎస్ ఓడించటంతో క్యూబాకు వలస పాలన నుండి విముక్తి లభించింది. కానీ 1901 ప్లాట్ సవరణ చట్టం ద్వారా క్యూబాను యూఎస్ తన నియంత్రణలో ఉంచుకొన్నది. 1934లో ఈ చట్టాన్ని రద్దు పరచినప్పటికీ క్యూబా ఆర్థిక వ్యవస్థను తన గుప్పిట్లో పెట్టుకున్నది. యూఎస్ పెత్తనాన్ని ఎదిరించి ఫిడెల్ కాస్ట్రో 1959లో కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఏర్పరచి క్యూబాలోని యూఎస్ వ్యాపారాలను, ఆస్తులను జాతీయీకరణం చేశాడు. 1960లో క్యూబాపై అమెరికా ఆంక్షలు విధించింది. 1961లో యూఎస్‌లోని క్యూబా ప్రవాసుల ద్వారా ఫిడెల్ కాస్ట్రో ప్రభుత్వాన్ని పడగొట్టడానికి సీఐఏ ప్రయత్నించి విఫలమైంది. దీనిని ‘బే ఆఫ్ పిగ్స్ తిరుగుబాటు’గా పిలుస్తారు. యూఎస్‌ను ఎదు ర్కోవటానికి కాస్ట్రో సోవియట్ రష్యా పంచన చేరాడు. 1962లో సోవియట్ యూనియన్ క్యూబాలో అణుక్షిపణులను మోహరించ టంతో అగ్ర రాజ్యాలు అణుయుద్ధపు అంచులకు చేరాయి. 1991లో సోవియట్ రష్యా విచ్ఛిన్నమవటంతో క్యూబాకు దిక్కుతోచలేదు. కాస్ట్రో ఒకవైపు ఉక్కు పిడికిలితో క్యూబాను పాలిస్తూనే కమ్యూనిజంను లాటిన్ అమెరికా అంతటా వ్యాప్తి చేయటానికి ప్రయత్నించాడు. అంగోలా, ఇథియోపియాలలో కూడా క్యూబన్ గెరిల్లా సైనికులు సేవలందించారు.సంబంధాలు కొంత మెరుగైనా...రావుల్ కాస్ట్రో 2008లో క్యూబా పగ్గాలు చేపట్టాక యూఎస్‌తో కొంత సుహృద్భావ వైఖరిని ప్రదర్శించాడు. ఒబామా హయాంలో యూఎస్–క్యూబా సంబంధాలు కొంత గాడిన పడ్డాయి. 2015లో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాల పునరుద్ధరణ జరిగింది. 2016లో క్యూబా పర్యటనలో భాగంగా క్యూబాను టెర్రరిజంను ప్రోత్సహించే దేశాల లిస్టు నుండి తొలగించారు. ఇది మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. ట్రంప్ 2017లో అధికారంలోకి రావటంతోనే మళ్లీ ఘర్షణ వాతావరణం పునఃస్థాపితమైంది. బైడెన్ కూడా క్యూబాపై ఆంక్షలను చాలావరకు కొనసాగించాడు. వెనిజులాపై దాడి తరువాత తన తదుపరి లక్ష్యం క్యూబా అని ట్రంప్ బహిరంగంగానే ప్రకటించాడు. ఆరు దశాబ్దాలుగా కొనసాగు తున్న ఆర్థిక–వాణిజ్య ఆంక్షలు చాలవన్నట్లు ఈ ఏడాది జనవరిలో ట్రంప్ చమురు దిగ్బంధనాన్ని (ఆయిల్ ఎంబార్గో) ప్రకటించాడు. క్యూబాకు చమురు సరఫరా కాకుండా యూఎస్ నౌకాబలం అడ్డు కుంటున్నది. ముఖ్యంగా వెనిజులా నుండి చమురు దిగుమతులు పూర్తిగా ఆగిపోయాయి. క్యూబా తన శక్తి అవసరాలకు 60 శాతం దిగుమతులపై ఆధారపడుతున్నది. దీనితో క్యూబాలో శక్తి సంక్షోభం ఏర్పడింది. ప్రతిరోజు 20–22 గంటల కరెంటు కోతలు సాధారణ మైనాయి. రవాణా స్తంభించింది. నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చెత్త రవాణాకు కూడా వాహనాలకు ఇంధనం లేక పోవటంతో హవానాతో సహా పలు పట్టణాలలో వీధులలో చెత్త పేరుకుపోయింది. ఆసుపత్రులలో కరెంటు కొరతతో పలు వైద్య సేవలు స్తంభించాయి. పాఠశాలలు, యూనివర్సిటీలు మూత పడ్డాయి. కోవిడ్ తరువాత కోలుకుంటున్న పర్యాటక రంగం కుదేల యింది. అమెరికా పథకం ప్రకారమే క్యూబా సమాజాన్ని ఒత్తిడి లోనికి నెట్టి వేసింది. క్యూబాతో వాణిజ్యం చేసే దేశాలు, సంస్థలపై ద్వితీయ శ్రేణి ఆంక్షలకూ సిద్ధమైంది. ఈ సంక్షోభం నుండి క్యూబా సమాజంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంతర్యుద్ధం, తిరుగుబాటు కోసం యూఎస్ వేచి చూస్తుండవచ్చు.మూడు శక్తులు ‘ఒక్కటైతే’?నాణ్యమైన విద్య, వైద్యాన్ని చౌకగా అందించటంలో విజయం సాధించిన క్యూబా ఈ ఆర్థిక యుద్ధాన్ని ఎదుర్కోవటం కష్టమే. రష్యా, చైనా ఆర్థికంగా, సైనికపరంగా ప్రత్యక్షంగా క్యూబాకు దన్నుగా ఉండటం సందేహాస్పదమే. చైనా సౌర విద్యుత్ పలకల సరఫరా ద్వారా క్యూబా విద్యుత్ గ్రిడ్‌ను స్థిరీకరించటానికి ప్రయత్ని స్తున్నది. దీర్ఘకాలంలో మాత్రమే క్యూబా ఈ రంగంలో విజయం సాధించగలుగుతుంది. కానీ క్యూబాకు అంత సమయం లేదు. మెక్సికో లాంటి పొరుగు దేశాలు ఆహారం, మందులు, మానవతా సహాయం చేస్తున్నా, అవి యూఎస్‌ను ఎదిరించి క్యూబాకు సహాయ పడే సాహసం చేయలేవు. రష్యా ప్రస్తుత దృష్టి ఉక్రెయిన్‌పై, నాటోపై ఉన్నది. చైనా దృష్టి తైవాన్‌పై ఉన్నది. తైవాన్, ఉక్రెయిన్ విషయంలో అమెరికా మెతక వైఖరికి సిద్ధపడితే, ప్రతిగా రష్యా, చైనా మధ్య ప్రాచ్యం, కరేబియన్ ప్రాంతాల నుండి తమ దృష్టిని పూర్తిగా మరల్చ టానికి సిద్ధపడవచ్చును. దీనినే ‘గ్రేట్ పవర్స్ బార్గెయిన్’ అని పిలుస్తారు.బహుశా రష్యా, చైనాలతో లోపాయికారీ అంగీకారంతో క్యూబాపై ట్రంప్ పూర్తి స్థాయిలో దాడి చేయవచ్చు. కానీ క్యూబా గెరిల్లా పోరాట సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయకూడదు. పెద్ద మొత్తంలో రక్తపాతం సంభవిస్తుంది. క్యూబా నుండి పెద్ద మొత్తంలో యూఎస్‌కు వలసలు జరగవచ్చు. యూఎస్ ఈ రెండు పరిణా మాలను ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలి. యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో క్యూబన్ సంతతికి చెందినవాడు. ఈ పరిణామాలపై పూర్తి అవగాహన ఉండి ఉంటుంది. క్యూబాలో ప్రజాస్వామ్య ప్రభుత్వానికి రావుల్ కాస్ట్రో అంగీకరిస్తే సమస్యకు శాంతియుత పరిష్కారం లభించినట్లవుతుంది.-వ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు-గురజాల శ్రీనివాసరావు -
నవ భారతంలో నరేంద్ర శకం
నరేంద్ర మోదీ అనుకోకుండా రాబర్ట్ ఫ్రాస్ట్ సిద్ధాంతాన్ని నమ్మినట్టున్నారు: అందరూ వెళ్లే దారిని కాకుండా అతి తక్కువ మంది పయనించే మార్గాన్నిఎంచుకున్నారు. బహుశా అదే నేటి మార్పులకు దారితీసి ఉంటుంది.జవహర్లాల్ నెహ్రూ, నరేంద్ర మోదీ ద్వారా భారత ప్రధానమంత్రిత్వం రెండు విభిన్న శకాలను ఆవిష్కరించింది. ప్రతి శకానికీ తనదైన పరిమితులు, అవకాశాలు, ఆశయాలున్నాయి. నెహ్రూ ఒక దుర్బల, సరికొత్త సార్వభౌమాధికార సముపార్జిత దేశానికి నాయకత్వం వహించారు. మోదీ వంతు వచ్చేసరికి ప్రపంచ సంక్షోభాలను ఎదుర్కొంటూ, సువిశాల, డిజిటల్ నెట్వర్క్ అను సంధానిత, అత్యంత పోటీతత్వ ప్రజాస్వామ్యానికి నేతృత్వం వహించాల్సి వచ్చింది. దిగువ నుంచి ఎగువకు!నెహ్రూ పాలనా విధానానికి ఎగువ నుంచి దిగువకు సంస్థల రూపకల్పన, ప్రభుత్వ నిర్దేశిత ఆర్థిక వ్యవస్థ కేంద్రస్థానంలో ఉన్నాయి. దేశ విభజన తర్వాత చెల్లాచెదురైన దేశాన్ని కూడదీసుకునే క్రమంలో ఇది సముచిత విధానమే అయినప్పటికీ, ఇది కేంద్రీకృత నియంత్రణకు దారితీసింది. తద్వారా పౌరులను దేశ ప్రగతిలో భాగ స్వాములుగా కాకుండా, లబ్ధిదారులుగా మాత్రమే పరిగణించింది.మోదీ విధానం ఆ తర్కాన్ని ఆమూలాగ్రం మారుస్తూ– ఆత్మ గౌరవం, అవిశ్రాంత పనితీరు మేళవింపుతో పాలనను ప్రజా ఉద్య మంగా రూపుదిద్దింది. ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్’ సూత్రాన్ని అనుసరించింది. ఆ మేరకు బ్యాంకు ఖాతాలు, ప్రత్యక్ష లబ్ధి బదిలీ (డీబీటీ), గ్యాస్ కనెక్షన్లు,గృహ నిర్మాణం, మరుగుదొడ్లు, ‘ఎక్స్‌ప్రెస్‌వే’ల నిర్మాణం, సంక్షేమ పథకాల డిజిటలీకరణ వంటి ‘దిగువ నుంచి ఎగువకు’ పద్ధతిలో సత్ఫలితాల సాధనతోపాటు విశ్వాసాన్ని కూడా పెంచుకుంది.ఈ రెండు శకాల నడుమ గల పరిమాణమే ఇక్కడ ప్రధాన వ్యత్యాసం. దేశ జనాభా దాదాపు 34 కోట్లుగా ఉండి, రాజకీయ పార్టీల మధ్య నామమాత్రపు పోటీ ఉన్న తరుణంలో నెహ్రూ పదవీ బాధ్యతలు చేపట్టారు. జనాభా 131 కోట్లు దాటి, వేలాది నమోదిత పార్టీల మనుగడతోపాటు సార్వత్రిక ఎన్నికల బ్యాలెట్ పత్రాల్లోవందలాది పార్టీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన రాజకీయ వ్యవస్థలో మోదీ ప్రధాని అయ్యారు. భారత తొలి సార్వత్రిక ఎన్నిక లలో ఓటర్ల సంఖ్య సుమారు 17 కోట్లు మాత్రమే కాగా, 2014 నాటికి 83 కోట్లు దాటి, 2024కల్లా మరింత పెరిగింది.పునాది–విస్తరణనెహ్రూ నమూనా ప్రాథమిక పరిశ్రమలను, శాస్త్రవిజ్ఞాన సంస్థ లను ఆర్థికంగా పెంచిపోషించింది. అయితే, ‘హిందూ వృద్ధి రేటు’గా ప్రాచుర్యంలోకి వచ్చిన 3–4 శాతం స్థాయికే అది పరి మితమైంది. కానీ మోదీ నేతృత్వంలోని భారత దేశం కోవిడ్–19, ద్రవ్యోల్బణ ఉధృతి, సరఫరా వ్యవస్థల్లో ఒడిదుడుకులు, భౌగో ళిక–రాజకీయ సంఘర్షణల పీడిత దశాబ్దంలోనూ 6.5–7 శాతం సగటు వృద్ధితో ప్రపంచ ప్రగతికి చోదకశక్తిగా రూపొందింది. 2014–24 మధ్య జాతీయ రహదారులు 54,000 కిలోమీటర్లకు పైగా విస్తరించాయి. దీంతో రవాణా వ్యవస్థ ఒక సమస్య స్థాయి నుంచి పోటీతత్వ సాధనంగా మారింది. మౌలిక సదుపాయాల విస్తరణ, డిజిటల్ మార్గాలైన యూపీఐ చెల్లింపులు, ఆధార్ ఆధారిత సేవా ప్రదానం వంటివి విధాన ప్రకటనకూ–పౌరులపై దాని ప్రభావానికీ మధ్య అంతరాన్ని తగ్గించాయి.ఐఐటీలు, ఎయిమ్స్ వంటి సంస్థాగత మూల స్తంభాలతో నెహ్రూ ఒక బలమైన పునాది వేశారు. ఇవి దేశ విజ్ఞానార్థిక వ్యవస్థకు బీజావాపనం వేశాయి. మోదీ పాలన సామూహిక విస్తరణకు ప్రాధాన్యమిస్తూ ఐఐటీల సంఖ్యను 23కు, ఐఐఎంలను 21కి, ఎయి మ్స్లను 23కు పెంచింది. ప్రతిష్ఠాపనతో విస్తరణను ముడిపెట్టే ఈ ద్వంద్వ విధానం, ఆకాంక్షలనే విధానోపకరణంగా పరిగణించే రాజ కీయ దృక్కోణానికి ప్రతీకగా నిలిచింది.మోదీ హయాంలో మంత్రిమండలి కూర్పు ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రాతినిధ్యాన్ని అసాధారణ స్థాయికి చేరుస్తూ సామాజికంగా ఆ వర్గాలను ముందుకు తెచ్చింది. మహిళా ప్రాతినిధ్యం 1950ల నాటి ఏకాంక స్థాయి నుంచి ‘నారీ శక్తి వందన్ అధినియమ్’ ద్వారా మూడింట ఒక వంతు రిజర్వేషన్‌కు శాసనబద్ధ మార్గాన్ని ఏర్పరచింది. అంటే, నామమాత్రపు సార్వజనీనత నుంచి నిర్మాణాత్మక హామీల దిశగా మార్పును ఇది సూచిస్తుంది.నెహ్రూ అనుసరించిన అలీన విధానం సూత్రబద్ధమైనదే అయినా, రెండు ధ్రువాల ప్రపంచంలో తరచూ ఒంటరిగా ఉండి పోయింది. ఇది భౌతిక ప్రతిష్ఠకన్నా నైతిక నేతృత్వంపైనే ఎక్కువగా ఆధారపడింది. కాగా, మోదీ విధానం బహుళ అనుసంధాన లావా దేవీల స్వభావంతో కూడినది. అమెరికా, రష్యా, యూరప్, గల్ఫ్ సహా వర్ధమాన దేశాలతోనూ ఏకకాలంలో సంబంధాలు నెరపుతూ భారత విపణి, సాంకేతిక పరిజ్ఞాన డిమాండ్ సహా ప్రవాస భారతీయుల ప్రభావాన్ని కూడా ఇది బేరసారాల ఉపకరణంగా మారుస్తుంది.తొలిసారి భారత్, పాకిస్తాన్ యుద్ధం నుంచి 1962లో చైనాతో యుద్ధం దాకా ‘శాంతియుతమైనది’గా గుర్తుచేసుకునే నెహ్రూ పాలన అనేక సంఘర్షణలకు సాక్షిగా నిలిచింది. మోడీ సిద్ధాంతాన్ని పరికిస్తే – అనిశ్చిత పొరుగు ప్రాంతాల్లో భారత్ తన పూర్తిస్థాయిసంప్రదాయ యుద్ధ నివారణ, నిరోధక శక్తిసామర్థ్యాలను వ్యూహా త్మక ప్రతిస్పందన, సునిశిత సరిహద్దు నిర్వహణలతో జోడించింది. ఇక్కడ ప్రమాదమే లేదని కాదు, దేశీయంగా ఆధునికీకరణ కొనసాగు తున్న తరుణంలో భద్రతా వాతావరణ స్థిరత్వాన్ని ఇది సూచిస్తుంది.కాలానికి తగిన నాయకుడుస్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో పీఎల్–480 పథకం కింద ‘ఓడ నుంచి విస్తరిలోకి’ అనే దిగుమతి పరాధీనత ఉండేది. ఇప్పు డది సమసిపోయి, దాదాపు 80 కోట్ల మంది పేదలకు ఉచిత ధాన్యం సరఫరా చేసే ‘పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజన’ అమలు స్థాయికి భారత్ దూసుకెళ్లింది. మరోవైపు జాతీయంగా ఒక ప్రధాన వ్యవ సాయ ఉత్పత్తిదారుగానూ, అంతర్జాతీయంగా ఎగుమతిదారుగానూ ఎదుగుతోంది. పదవీ కాలాన్ని కొలబద్దగా పరిగణించినా, మోదీ హయాం ఓ కీలక మలుపు. ఇది ఇందిరాగాంధీ సుదీర్ఘ నిరంతరాయ పదవీ కాలాన్ని అధిగమించి, నెహ్రూ అనుసరించిన నిరంతర సేవా ప్రమా ణానికి చేరువవుతూ వచ్చింది. రాష్ట్ర, జాతీయ స్థాయి పదవులకు ఎన్నికైన ప్రభుత్వాధినేతగా దేశంలోనే అత్యంత సుదీర్ఘ సంచిత పదవీ కాలపు రికార్డును మోదీ పాలన ఇప్పటికే బద్దలు కొట్టింది. అయితే, ఈ ప్రాధాన్యం రోజుల సంఖ్యకు అతీతంగా దాని సంచిత ప్రభావంలో కనిపిస్తుంది.వేర్వేరు కాలాల్లో విభిన్న నాయకత్వ అవసరం ఏర్పడింది. తదనుగుణంగా తొలినాళ్ల నాయకత్వం చట్రాన్ని రూపొందిస్తే, మలినాళ్ల నేతృత్వం దాని ఆధారంగా ఉపరితల నిర్మాణానికి ఉపక్రమించి రహదారులను విస్తరించి, దేశాన్ని డిజిటలీకరణతో అనుసంధానించి, ఆ ప్రగతి ప్రకాశాన్ని ప్రపంచం నలుమూలలా ప్రసరించేలా చేసింది. సార్వజనీనత, సేవా ప్రదానం, మౌలిక సదుపాయాల కల్పన, బేరసారాల సామర్థ్యం తదితర ప్రమాణాల ప్రాతిపదికన చూస్తే – మోదీ నిస్సందేహంగా అత్యంత ప్రభావశీల ప్రధానమంత్రిగా నిలుస్తారు. కోట్లాది భారతీయుల దృక్కోణంలో మోదీ ఈ దేశానికి అత్యంతావశ్యక సమర్థ నేతగా నిలిచారు. - సుహేల్ సేథ్వ్యాపారవేత్త, కాలమిస్ట్; ‘కౌన్సెలేజ్ ఇండియా’ కన్సల్టెన్సీ వ్యవస్థాపకుడు–మేనేజింగ్ పార్ట్నర్ -
అపచారం... దైవద్రోహం
‘ధర్మో రక్షతి రక్షిత:’ అనే వేదోక్తి ప్రకారం, మనం ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని సర్వకాలాలా కాపాడుతుంది. అయితే, గత రెండు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాల భూములు, పవిత్ర ప్రసాదాలు, వైదిక సంప్రదాయాల నిర్వ హణపై జరుగుతున్న పరిణామాలు, వివాదాలు కోట్లమంది హైందవ భక్తుల మనోభావాలను గాయపరుస్తున్నాయి. రాష్ట్రంలో దేవదాయ శాఖ పరిధిలో దాదాపు 4 లక్షల ఎకరాల ఆలయ భూములు విస్తరించి ఉన్నాయి. దురదృష్టవశాత్తూ ఒక లక్ష ఎకరాల నుండి మాత్రమే దేవునికి నియమిత ఆదాయం లభిస్తోంది. మిగిలిన భూముల్లో సుమారు 87,000 ఎకరాలు ఆక్రమణల పాల య్యాయని గణాంకాలు చెబుతున్నాయి. ఇలాంటి గడ్డుకాలంలో, కూటమి ప్రభుత్వం పారదర్శకమైన బహిరంగ వేలం నిర్వహించ కుండా, విలువైన దేవాలయ భూములను 33 ఏళ్ల సుదీర్ఘ కాలానికి నామమాత్రపు అద్దెకు ప్రైవేటు సంస్థలకు, తమ తాబేదారులకు లీజుకు ఇవ్వడానికి ప్రయత్నిస్తోంది. ఇది దైవద్రోహం కాదా? గత 2014–19 టీడీపీ హయాంలోనూ సదావర్తి సత్రం భూములను ఇదే రీతిన అప్పగించే ప్రయత్నం చేయగా, అప్పట్లో న్యాయస్థానం జోక్యంతో అది ఆగింది.సంస్కృతికి ద్రోహం – గోసంరక్షణ వైఫల్యంహైందవ ధర్మంలో గోమాత అత్యంత పవిత్రమైనది. కానీ ప్రస్తుత పాలనలో గోసంరక్షణ పూర్తిగా అటకెక్కింది. రాష్ట్రవ్యాప్తంగా అక్రమ గోవధ శాలలు విచ్చలవిడిగా పెరిగిపోవడం కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం. 2025 నవంబరులో విజయవాడలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో గోపూజలు నిర్వహించి దీనిపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. అయినా దున్నపోతుపై వర్షం కురిసిన చందాన ప్రభుత్వం వ్యవహరిస్తోంది.మరోవైపు, తిరుమల తిరుపతి దేవస్థానం గోశాలలో వంద లాది ఆవులు రోగాల బారిన పడి మృత్యువాత పడటం కలకలం రేపింది. టీటీడీ ఈవో 43 ఆవులు చనిపోయాయని చెబితే, చైర్మన్ 22 అని, ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అసలు ‘చావులే లేవు’ అని ప్రకటించడం భక్తులను పక్కదారి పట్టించడమే. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో శ్రీవారి కైంకర్యాలకు, అభిషేకాలకు స్థానిక గోశాలల నుండి రోజుకు 1,700 లీటర్ల స్వచ్ఛమైన పాలు తిరుమలకు వెళ్లేవి. ప్రస్తుత పాలనలో కనీసం 500 లీటర్ల పాలు కూడా రావడం లేదన్నది సత్యం.2024 ద్వితీయార్ధంలో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు కలిసిన నెయ్యి వాడారంటూ, చంద్రబాబు ప్రభుత్వం చేసిన ఆరోపణలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువు లను దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఎలాంటి పూర్తిస్థాయి దర్యాప్తు, స్వతంత్ర సంస్థల నివేదికలు రాకముందే, కేవలం రాజకీయ లబ్ధి కోసం శ్రీవారి ప్రసాదంపై అపవిత్రమైన అసత్య ప్రచారాలు చేశారు.లబ్ధి కోసం నీచ రాజకీయాలుమరింత హేయమైన అంశం ఏంటంటే – గ్రామీణ ప్రాంతా లలో పురాతన దేవాలయాల పునరుద్ధరణ, ధర్మ ప్రచారం, భజన మందిరాల స్థాపన అనే ఉన్నత ఆశయంతో జగన్ ప్రభుత్వం ‘శ్రీవాణి’ పథకాన్ని ప్రారంభించింది. కానీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీటీడీ నూతన చైర్మన్ బి.ఆర్. నాయుడు ఈ పథకాన్ని ఒక ‘క్లాసికల్ ఫ్రాడ్’ (పెద్ద స్కామ్) అని అభివర్ణిస్తూ, దీనిని రద్దు చేస్తామని ప్రకటించారు. ఆశ్చర్యకరంగా, ఆ మాటలు కేవలం రాజకీయ వేదికలకే పరిమితమయ్యాయి.ప్రస్తుతం అదే శ్రీవాణి పథకాన్ని రద్దు చేయకపోగా, మరింత విస్తరిస్తున్నారు. రద్దు చేస్తామన్న పథకాన్ని కొనసాగించడం వెనుక ఉద్దేశం, పారదర్శక తను పక్కనబెట్టి దళారీ వ్యవస్థకు పెద్దపీట వేయడమే. శ్రీవాణి టికెట్లు, వీఐపీ బ్రేక్ దర్శనాలు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల జారీలో జరుగుతున్న అక్రమాలకు అంతులేకుండా పోయింది. సామాన్య భక్తునికి సమాన హక్కులతో కూడిన దైవ దర్శనం కల్పించాల్సిన బాధ్యతను ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది.శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ ఆచార్య రాణి సదాశివమూర్తిని నిబంధనలకు విరుద్ధంగా పదవి నుండి తొల గించడానికి పాలకమండలి తీర్మానం చేయడం హేయమైన అంశం. గత ప్రభుత్వ హయాంలో మంజూరైన 700 ‘వేద పారాయణదార్ల’ (శ్రీవారి వేద పారాయణ పథకం) పోస్టుల భర్తీలో స్థానిక వేదపండితులను కాదని, నిబంధనలకు విరుద్ధంగా ఇతర రాష్ట్రాల వారికి ప్రాధాన్యత ఇస్తున్నారు.భద్రతా లోపాలు – ఆలయాల కూల్చివేతలుఅలాగే, తిరుమలలోని పరకామణి (కానుకల లెక్కింపు) విభా గంలో గతంలో రోబోటిక్ టెక్నాలజీని ప్రవేశపెట్టి దొంగతనాలను అరికట్టగా, ఇప్పుడు పాత విషయాలను రాజకీయం చేస్తూ ఆలయ ప్రతిష్ఠను దిగజారుస్తున్నారు. ఇటీవల జరిగిన చెన్నై పరకామణి అక్రమంపైగానీ, తిరుమల పరకామణి చోరీపైగానీ... ఇటు తితిదే, అటు ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. మరోవైపు, తెలుగుసంస్కృతికి వెన్నెముకలైన హరికథ, కూచిపూడి వంటి సాంప్రదాయ కళారూపాల విభాగాలను మూసివేయడం తితిదే విద్యా వ్యవస్థకే తీరని కళంకం.గత రెండేళ్ల కాలంలో వివిధ ప్రముఖ ఆలయాలలో జరిగిన ప్రమాదాలు భక్తుల భద్రతపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని స్పష్టం చేస్తు న్నాయి: తిరుపతిలో వైకుంఠ ఏకాదశి పర్వదినం నాడు జరిగిన ఘోరమైన తొక్కిసలాటలో 6 గురు భక్తులు మృతి చెందారు, పదుల సంఖ్యలో గాయపడ్డారు. ముఖ్యమంత్రివర్యులు గతంలో గోదావరి పుష్కరాల తొక్కిసలాటలో కనీసం మొసలి కన్నీరైనా కార్చారు. కానీ ఇక్కడ, భక్తుల అత్యుత్సాహమే దానికి కారణమని చర్చ లేవదీశారు. అసలు బాధ్యులపై చర్యలు చేపట్టకపోవడం ఘోరమైన తప్పిదం.సింహాచలం అప్పన్న కొండపై రక్షణ గోడ కూలి ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టి నంత ఆవేదన కూడా కలగలేదు. శ్రీకూర్మం ఆలయంలో విష్ణు అవ తారంగా భావించే పవిత్ర నక్షత్ర తాబేళ్లు చనిపోతే, కనీసం పోస్ట్ మార్టం కూడా లేకుండా దహనం చేశారు. కాశీబుగ్గలో 9 మంది భక్తులు మరణిస్తే ప్రభుత్వం ఏమాత్రం చలించలేదు. వీటికి తోడు, కడపలో కాశీ నాయన జ్యోతి క్షేత్రం గోశాలను, అన్నదాన సత్రాలను అటవీ శాఖ బుల్డోజర్లతో కూల్చివేయడం, నెల్లూరు, నరసరావు పేటలో రోడ్డు విస్తరణ పేరుతో ఆలయ నిర్మాణాలను తొలగించడం ఎంతటి అమానుషం!జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పీఠాధిపతుల సదస్సును వైభవంగా నిర్వహించి, వారిచ్చిన సూచనలతో తిరుమలపై అన్య మతస్థులు హిందూమతం స్వీకరించటానికి ఓ వేదిక ఏర్పాటు చేయాలని సంకల్పించారు. ప్రభుత్వాలు మారవచ్చు, పాలకులు మారవచ్చు... కానీ శాశ్వతమైన ధర్మసూత్రం ఎప్పటికీ చెరిగిపోదు. భగవంతుని ఆస్తులను, భక్తుల నమ్మకాన్ని సంపూర్ణంగా కాపాడ టమే నిజమైన రాజధర్మం. కానీ ఆలయాల పవిత్రతను, భక్తుల విశ్వాసాన్ని వ్యాపార వస్తువులుగా మార్చి, భగవంతుని సంపదను ధార్మిక కార్యాలకు ఉపయోగించకుండా, స్వార్థ రాజకీయాలకు వనరుగా మార్చిన ఘనత చంద్రబాబుది. అయితే మోసం అనే దట్టమైన చీకటి మేఘాలు ఎంతగా కమ్మేసినా, సత్యం అనే సూర్య కాంతి చివరికి వాటిని ఛేదించుకుని వెలుగులోకి రావడం ఖాయం.-వ్యాసకర్త టీటీడీ పూర్వ అధ్యక్షులు-భూమన కరుణాకర రెడ్డి


