breaking news
Vikarabad District News
-
దళితుల భూములు లాక్కోవద్దు
మొయినాబాద్: జీవనోపాధి కోసం ప్రభుత్వం కేటాయించిన భూములను లాక్కోవద్దని డిమాండ్ చేస్తూ ఓ యువకుడు సెల్‌టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. ఈ సంఘటన మొయినాబాద్‌లో శుక్రవారం మధ్యాహ్నం తీవ్ర కలకలం రేపింది. వివరాలు ఇలా ఉన్నాయి.. మున్సిపల్ పరిధిలోని పెద్దమంగళారం సర్వేనంబర్ 218లో యాభై ఏళ్ల క్రితం 36 మంది దళిత కుటుంబాలకు అప్పటి ప్రభుత్వం కోళ్ల ఫారాలు ఏర్పాటు చేసుకునేందుకు 6.14 ఎకరాల భూమిని కేటాయించింది. ఈస్థలంలో కోళ్ల ఫారాలు నిర్మించుకున్న పలు దళిత కుటుంబాలు ఉపాధి పొందాయి. ఫారాలు శిథిలావస్థకు చేరడంతో కొంతకాలం క్రితం వీటిని తొలగించారు. అయితే సర్వే నంబర్ 218లో ఉన్న భూమిని ప్రభుత్వం ఇటీవల హెచ్ఎండీఏకు అప్పగించింది. ఇందులో దళితులకు కేటాయించిన స్థలాన్ని సైతం కలుపుకొని చదను చేస్తుండటంతో సదరు కుటుంబాలు ఆందోళన చేపట్టాయి. సెల్‌టవర్ ఎక్కి హల్చల్ ప్రభుత్వం తమకు కేటాయించిన భూమిని గుంజుకోవద్దంటూ పెద్దమంగళారానికి చెందిన భూ బాధితుడు ముడిమ్యాల రాములు మున్సిపల్ కేంద్రంలోని సెల్‌టవర్ ఎక్కాడు. వారం రోజులుగా తాము ఆందోళన చేస్తున్నా స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తంచేశాడు. భూములు గుంజుకుంటే టవర్ పైనుంచి దూకి చస్తానని హంగామా సృష్టించాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని, సమస్యను పరిష్కరిస్తామని నచ్చజెప్పడంతో కిందికి దిగాడు. తహసీల్దార్ గౌతమ్‌కుమార్ స్పందించి ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తామని చెప్పడంతో శాంతించిన యువకుడు కిందికి దిగాడు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేత పెద్దమంగళారంలో దళిత కుటుంబాలకు కోళ్ల ఫారాలకోసం కేటాయించిన భూములను తిరిగి తీసుకోవద్దంటూ శుక్రవారం తహసీల్దార్ గౌతమ్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. యాభై ఏళ్ల క్రితం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చిన సర్టిఫికెట్లను తహసీల్దార్‌కు చూపించారు. విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తహసీల్దార్ భూబాధితులకు తెలిపారు. వినతిపత్రం అందజేసినవారిలో ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ డప్పు రాజు, నాయకులు సంజీవరావు, భూబాధితులు ఉన్నారు. మొయినాబాద్‌లో సెల్ టవర్ ఎక్కిన యువకుడు సముదాయించి కిందికి దింపిన పోలీసులు తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేసిన భూ బాధితులు -
సీఐపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌లో ఫిర్యాదు
మంచాల: తమ భూమి విషయంలో జోక్యం చేసుకుని, బెదిరింపులకు పాల్పడుతున్న సీఐ మధుపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధిత కుటుంబం శుక్రవారం ఎస్సీ, ఎస్టీ కమిషన్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి.. మంచాలకు చెందిన గడ్డం సరోజ భర్త లక్ష్మయ్య గ్రామంలోని 44 సర్వే నంబర్లో ఉన్న 2.17 ఎకరాల భూమిని, 1978 నుంచి సాగు చేసుకుంటున్నారు. ఇందుకు సంబంధించి గతంలో ప్రభుత్వం వీరికి అసైన్డ్ పట్టా ఇచ్చింది. ఇదిలా ఉండగా పలువురు అగ్రవర్ణ కుటుంబాలకు చెందిన వారు తమ భూమిని ఆక్రమించారని, ఈ విషయమై సీఐ వారితో కుమ్మకై ్క తమను బెదిరిస్తున్నారని ఆరోపించారు. రెండు గ్రామాల్లో ఏకగ్రీవానికి చాన్స్! శంకర్పల్లి: మండలంలోని పర్వేద, కొత్తపల్లి గ్రామాల్లో సర్పంచుల పదవులు ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది. పర్వేదలో బీసీ జనరల్ రాగా సర్పంచ్ పదవికి మొత్తంగా ఐదు నామినేషన్లు దాఖలు చేశారు. శనివారం నాలుగు నామినేషన్లు ఉపసంహరించుకోనున్నట్లు సమాచారం. దీంతో సర్పంచ్ అభ్యర్థి ఎన్కతల సురేందర్‌గౌడ్ ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది. పది వార్డులు సైతం ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది. అదే విధంగా కొత్తపల్లిలో జనరల్ రాగా సర్పంచ్ పదవికి రెండు నామినేషన్లు దాఖలు చేశౠరు. అవుసలి ప్రభుచారి తన నామినేషన్ ఉపసంహరించుకోనుండడంతో అక్నాపురం బల్వంత్‌రెడ్డి మాత్రమే పోటీలో ఉండనున్నారు. ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన హత్య గాంధీఆస్పత్రి: 42 శాతం రిజర్వేషన్లపై అన్యా యం జరిగినందుకే సాయిఈశ్వర్చారి ఆత్మత్యాగానికి పాల్పడ్డాడని, ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన హత్య అని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాసగౌడ్ అభివర్ణించారు. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి వద్ద శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సాయిఈశ్వర్ మృతికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిలే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. సర్పంచ్ ఎన్నికలను తక్షణమే నిలిపివేయాలని, బీసీ రిజర్వేషన్ చట్టాన్ని పార్లమెంట్లో ఆమోదించాలన్నారు. కాంగ్రెస్, బీజేపీల్లో ఉన్న బీసీ నేతలు, నాయకులు తమ పదవులకు రాజీనామాలు చేయాలని, సాయిఈశ్వర్ మృతిపై పార్లమెంట్లో చర్చ జరగాలని, 42శాతం రిజర్వేషన్లపై కేంద్రం దిగిరావాలన్నారు. ఈనెల 6న రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని, బీసీలకు ద్రోహం చేస్తున్న కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన నాయకుల ఇళ్లను ముట్టడించాలని పిలుపు నిచ్చారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న బీసీ సంఘ కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేయడం ప్రజాస్వామ విరుద్ధమన్నారు. ఈశ్వరచారి మృతితోనైనా ప్రభుత్వం కళ్లు తెరవాలి కాచిగూడ: బీసీలకు ఇచ్చిన హామీలను అమ లు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైనందునే సాయి ఈశ్వర చారి ఆత్మహత్య చేసుకున్నాడని బీసీ జేఏసీ చైర్మన్, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని దీనికి కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఒక ప్రకటనలో హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీల పట్ల ఇలాగే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే రానున్న రోజుల్లో బీసీలు తిరగబడతారని ఆయన పేర్కొన్నారు. సాయి ఈశ్వర చారి మరణంతోనైనా ప్రభుత్వం కళ్లు తెరవాలని ఆయన అన్నారు. సాయి ఈశ్వరచారి మృతికి సంతాప సూచకంగా ఈ నెల 7న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శనలు చేపట్టాలని ఆయన బీసీలకు పిలుపునిచ్చారు. ఎయిర్‌పోర్టులో పరిస్థితులపై డీసీపీ సమీక్ష శంషాబాద్: ఇండిగో ఎయిర్‌లైన్స్ సంస్థ అంతర్గత కారణాలతో నాలుగు రోజులుగా ప్రయాణికులు పడుతున్న సమస్యలపై శుక్రవారం రాత్రి శంషాబాద్ డీసీపీ రాజేష్ ఎయిర్‌పోర్టులో పరిస్థితిని సమీక్షించారు. ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. పీక్ అవర్స్‌లో ప్రయాణికుల రద్దీ కారణంగా ఏర్పడుతున్న సమస్యలను ఎయిర్‌పోర్టులోని సంబంధిత ఏజెన్సీలను అడిగి తెలుసుకున్నారు. మరికొద్ది రోజుల్లో ఎయిర్‌లైన్స్ సంస్థ ఎదుర్కొంటున్న సమస్య పరిష్కారం కానుందని ఎయిర్‌లైన్స్‌కు చెందిన ప్రతినిధులు డీసీపీ రాజేష్‌కు ఈ సందర్భంగా వివరించారు. -
ఎన్నికల ప్రక్రియలో సమస్యలకు తావివ్వొద్దు
అదనపు కలెక్టర్ సుధీర్దోమ: స్థానిక ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి సమస్యలకు తావివ్వకుండా చూడాలని జిల్లా అదనపు కలెక్టర్ సుధీర్, ట్రైనీ కలెక్టర్ హర్ష అన్నారు. శుక్రవారం మండలంలోని బొంపల్లి గ్రామంలో కొనసాగుతున్న నామినేషన్ల ప్రక్రియ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించాలని, ఎక్కడ కూడా తప్పులు జరిగే అవకాశం లేకుండా చూసుకోవాలని పేర్కొన్నారు. నామినేషన్ల ప్రక్రియ మొదలు ఓటింగ్ వరకు జాగ్రత్తగా ఎన్నికల ప్రక్రియను కొనసాగించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ గ్యామా, అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
కరన్‌కోట్ ఉప సర్పంచ్‌గా తుపాకుల బసప్ప
తాండూరు రూరల్: మేజర్ గ్రామపంచాయతీ కరన్‌కోట్ ఉప సర్పంచ్‌గా తుపాకుల బసప్ప ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రిటర్నింగ్ అధికారి విజయ్‌భాస్కర్‌రెడ్డి సమక్షంలో శుక్రవారం పంచాయతీ కార్యాలయంలో ఉప సర్పంచ్‌ను ఎన్నుకున్నారు. గ్రామంలో సర్పంచ్‌తో పాటు 14 మంది వార్డు సభ్యులను యునానిమస్‌గా ఎన్నికయ్యారు. వీరిలో పదో వార్డుకు చెందిన బసప్ప పేరును మూడో వార్డు సభ్యుడు కోస్గి మహేందర్‌గౌడ్ ప్రతిపాదించగా అందరూ ఆమోదించారు. ఈపదవిని ఆశించిన నాలుగో వార్డు సభ్యుడు శ్రీనివాస్‌గౌడ్ ఎన్నికకు దూరంగా ఉన్నారు. సర్పంచ్ రాజ్‌కుమార్‌తో పాటు ఉప సర్పంచ్, వార్డు సభ్యులకు ఆర్ఓ ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. అనంతరం మాజీ ఎంపీపీ శరణు బసప్పతో పాటు నూతన కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్‌గౌడ్‌ను సముదాయించడంతో అంతా ప్రశాంతంగా ముసిగింది. సర్పంచ్, వార్డు సభ్యులకు ధ్రువీకరణ పత్రాలు -
అంతా గందరగోళం!
వికారాబాద్: అవగాహనా రాహిత్యమో.. అనాలోచిత నిర్ణయమో తెలియదుగాని ఎన్నికల ఏర్పాట్లలో గందరగోళ పరిస్థితి నెలకొంది. జిల్లా అధికారుల తీరు ఎన్నికల సిబ్బంది, ఉద్యోగులకు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. విధుల కేటాయింపులో అడుగడుగునా అవకతవకలే కనిపిస్తున్నాయి. ఓ చోట మృతి చెందిన ఉద్యోగికి విధులు కేటాయిస్తే.. మరోచోట ఉద్యోగ విరమణ పొందిన వారికి, బదిలీపై వెళ్లిన వారికి సైతం డ్యూటీ వేయడం అధికారుల పనితీరుకు అద్దం పడుతోంది. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ కలెక్టర్ ఓ క్షేత్రస్థాయి ఉద్యోగిపై సస్పెన్షన్ వేటు వేశారు. అయినా ఆయా శాఖల హెచ్ఓడీలు, ఇతర ఉన్నతాధికారుల్లో మాత్రం మార్పు రాలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాల్సిన హెచ్ఓడీలు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, పర్యవేక్షణాధికారులు హైదరాబాద్ నుంచే విధులకు హాజరవుతున్నారు. అరకొర నిధులు సాధారణంగా ఏ ఎన్నికల్లోనైనా ఖర్చులకు సంబంధించి ఎంత అవసరమనేది ఇండెంట్ చేసిఉన్నతాధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపుతారు. ఎలక్షన్ ప్రక్రియ ప్రారంభం కాగానే కలెక్టర్ ఖాతాలోకి నిధులు విడుదల చేస్తారు. వాటిని జనాభా, జీపీలు, వార్డుల ఆధారంగా ఆయా మండలాలకు కేటాయిస్తారు. కానీ ఈ సారి ఎన్నికల ప్రాసెస్ ప్రారంభమై వారం దాటినా నిధులు కేటాయించకపోవటంతో పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీఓలు, ఎంపీఈఓలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అప్పులు చేసి ఏర్పాట్లు చేయాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణకు రూ.3.5కోట్లు అవసరం అని అంచనా వేయగా గురువారం రూ.కోటి విడుదలైంది. ఈ మొత్తాన్ని మండలానికి రూ.5 లక్షల చొప్పున కేటాయించినట్లు సమాచారం. మిగతా నిధులు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. నామినేషన్లు వేసే సమయంలో ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో నిధులు సమకూరుతాయి. ఒక్కో విడతలో వెయ్యి మందికి పైగా సర్పంచ్ అభ్యర్థులు.. మూడు నుంచి నాలుగు వేల మందికి పైగా వార్డు స్థానాలకు అభ్యర్థులు నామినేషన్లు వేస్తారు. వారికి షూరిటీ ఇచ్చే వారందరూ ఇంటి, స్థలం, నల్లా పన్నులాంటివి క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆయా సామాజిక వర్గాల అభ్యర్థులను బట్టి రూ.1,000 నుంచి రూ.2,000 వరకు నామినేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తం ప్రభుత్వ ఖజానాలో జమ అవుతున్నా ఎన్నికల ఖర్చు నిమిత్తం నిధులు విడుదల చేయడంలో మీనమేషాలు లెక్కించడం విమర్శలకు తావిస్తోంది. పరిగి డివిజన్లో అనేక లోపాలుజిల్లాలో 594 జీపీలు, 5,058 వార్డులు ఉన్నాయి. మొదటి విడతలో తాండూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఎనిమిది మండలాల్లోని 262 గ్రామ పంచాయతీలు, 2,198 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇప్పటికే నామినేషన్ల దాఖలు, పరిశీలన, ఉప సంహరణ ప్రక్రియ ముగిసింది. ఈ నెల 11న పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో 262 జీపీలను 67 క్లస్టర్లుగా విభజించి 67 మందికి స్టేజ్ వన్ ఆర్‌ఓలుగా విధులు కేటాయించారు. మరో ఆరు మందిని రిజర్వ్‌లో ఉంచారు. మరో 67 మందిని ఏఆర్ఓలుగా నియమించారు. వీరిలో సైతం ఆరుగురిని రిజర్వ్‌లో ఉంచారు. ఒక్కో పంచాయతీకి ఒక్కరు చొప్పున స్టేజ్ టూ ఆర్ఓలను నియమించారు. 12 మందిని రిజర్వ్‌లో ఉంచారు. వీరందిరికీ విడతల వారీగా శిక్షణ ఇస్తున్నారు. అయితే శిక్షణకు హాజరయ్యే సిబ్బంది.. పోలింగ్ డ్యూటీల విషయంలో ఉన్నతాధికారులు బాధ్యతారహితంగా వ్యవహరించారనే విమర్శలు ఉన్నాయి. పరిగి డివిజన్లో అనేక లోపాలు వెలుగు చూశాయి. నాలుగేళ్ల క్రితం మృతి చెందిన ఓ మహిళా ఉద్యోగికి ఎన్నికల విధులు కేటాయిస్తూ ఆర్డర్ పాస్ చేశారు. వేరే జిల్లాకు బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయుడికి ఎలక్షన్ డ్యూటీ వేశారు. పదవీ విరమణ పొందగా మరో టీచర్‌కు కూడా విధులు కేటాయించారు. ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇచ్చే విషయంలో కూడా లోపాలు వెలుగు చూశాయి. ఒక్కో ఉద్యోగికి ఒకే రోజు రెండు మూడు చోట్ల హాజరు కావాలని ఆర్డర్ ఇచ్చారు. ఒక్కరికి ఒకే రోజు రెండు చోట్ల ఎన్నికల విధులు వేశారు. మరో వైపు ఒక్కో పాఠశాలలో ఆయా సబ్జెక్టులు బోధించే ఉపాధ్యాయుల్లో 50 శాతం వరకు ఎన్నికలకు విధులకు హాజరు ఆర్డర్లు ఇచ్చారు. ఇందులో మూడు విడతల్లో కూడా వేసిన వారికే మళ్లీ మళ్లీ డ్యూటీలు వేశారు. ఇలా కాకుండా ఒక్కో విడతలో ఒక్కొక్కరికి డ్యూటీ వేస్తే బోధనలో ఇబ్బందులు ఉండేవి కావని ఉపాధ్యాయులు అంటున్నారు. లోప భూయిష్టంగా ఎన్నికల విధుల కేటాయింపు -
క్రికెట్లో ‘అరుణతేజం’
● జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న కొండారెడ్డిపల్లి యువకుడు ● స్పాన్సర్షిప్ అందిస్తే సత్తాచాటుతానని ధీమా కేశంపేట: మండల పరిధిలోని కొండారెడ్డిపల్లి గ్రామానికి చెందిన కర్నెకోట అరుణ్‌తేజ్ ఆంధ్రప్రదేశ్ తరఫున జాతీయ స్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికయ్యాడు. ఈనెల 24 నుంచి 27 వరకు ఢిల్లీలో జరిగే అండర్– 19 జట్టుకు (ఆల్ రౌండర్) ఎంపికయ్యాడు. అరుణ్‌తేజ్ ప్రస్తుతం బెంగళూర్‌లో స్పోర్ట్స్ మేనేజ్మెంట్ చదువుతున్నాడు. గతంలో అండర్– 12, అండర్– 14, అండర్– 19 విభాగాల్లో నిర్వహించిన పలు టోర్నీల్లో తెలంగాణ తరఫున పాల్గొ న్నాడు. అనంతరం తెలంగాణ నుంచి మా ్యచ్లు ఆడే అవకాశాలు రాకపోవడంతో, నా లుగేళ్లుగా ఏపీ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఎపీలోని ఒంగోలుకు చెందిన రంజీ ప్లేయర్ షేక్ హఫీజ్ సారథ్యంలో ఏపీ తరఫున హైదరాబాద్‌లోని ఉప్పల్ శిక్షణను పొందుతున్నాడు. 2021నుంచి ఏపీ తరఫున ఆడుతున్నా డు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యలో తెలంగాణ సీఎం పేషీలో స్పాన్సర్ షిప్ కోసం చేసుకున్న దరఖాస్తును తిరస్కరించినట్లు అరుణ్ తెలిపా డు. స్పాన్సర్స్ ఎవరైనా చేయూతనిస్తే అంతర్జాతీయ క్రికెట్ టీంలో స్థానం సాధించి, దేశం తరఫున తలపడుతానని పేర్కొంటున్నారు. -
ఉందామా.. తప్పుకొందామా!
● గ్రామ పోరులో పోటీపైఅభ్యర్థుల డైలమా ● కొనసాగుతున్న బుజ్జగింపుల పర్వం ఆమనగల్లు: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులు పోటీలో ఉందామా.. తప్పుకొందామా అంటూ సందిగ్ధంలో పడ్డారు. రెండో విడత ఎన్నికల్లో భాగంగా ఆమనగల్లు, తలకొండపల్లి, కడ్తాల మండలాలలో సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు పెద్ద ఎత్తున ఆశావహులు నామినేషన్లు దాఖలు చేశారు. ఉపసంహరించుకోవడానికి ఈనెల 6వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు సమయం ఉంది. దీంతో సర్పంచ్ పదవిలో కూర్చుందామనుకునే వారు పోటీ చేస్తున్న మిగతా అభ్యర్థులను బుజ్జగిస్తున్నారు. కొంతమంది నాయానో బయానో ఇచ్చి ప్రత్యర్థులతో బేరసారాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో నామినేషన్ వేసిన అభ్యర్థులు పోటీలో ఉందామా.. తప్పుకొందామా అనే డైలమాలో పడ్డారు. నేడు ఉపసంహరణకు అవకాశం సర్పంచ్, వార్డు సభ్యులకు నామినేషన్ వేసిన అభ్యర్థులు శనివారం మధ్యాహ్నం 3 లోపు ఉపసంహరించుకోవడానికి అ వకాశం ఉంది. నామినేషన్ ఉపసంహరణకు ఎ న్నికల సంఘం ప్రత్యేక గైడ్‌లైన్స్ జారీ చేసింది. అ భ్యర్థి సంబంధిత రిటర్నింగ్ అధికారికి ప్రత్యేక ఫార్మాట్లో దరఖాస్తు అందించాలి. తానే స్వచ్ఛందంగా నామినేషన్ ఉపసంహరించుకుంటున్నానని ఎలాంటి బెదిరింపులు, ఒత్తిళ్లు, డబ్బు ప్రలోభాలు లేవని స్వీయ ధ్రువీకరణ ఇవ్వాలి. రిటర్నింగ్ అధికారి దానికి సంతృప్తి చెందినట్లయితే నామినేషన్ ఉపసంహరణ చెల్లుబాటు అవుతుంది. ఈ ప్రక్రియ అనంతరం పోటీలో ఉండే అభ్యర్థులు, వారికి కేటాయించిన గుర్తులను అధికారులు ప్రకటిస్తారు. -
రేపు నవోదయ మోడల్ టెస్ట్
తాండూరు టౌన్: తాండూరు పట్టణంలో ఆదివారం శ్రీరామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో విద్యార్థులకు నవోదయ మోడల్ టెస్ట్ నిర్వహించనున్నట్లు ఆ సమితి అధ్యక్షుడు బాలకృష్ణ, నిర్వాహకులు కృష్ణయ్య శుక్రవారం సంయుక్త ప్రకటనలో తెలిపారు. త్వరలో ప్రభుత్వం నిర్వహించనున్న నవోదయ పరీక్ష రాయబోతున్న విద్యార్థుల్లో భయాందోళనను పోగొట్టేందుకు ఈ ముందస్తు మోడల్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉదయం 11.30నుంచి మధ్యాహ్నం 1.30 గంట వరకు పట్టణంలోని భాష్యం జూనియర్ కళాశాలలో పరీక్ష ఉంటుందని తెలిపారు. ఇంగ్లిష్, తెలుగు మీడియంలో టెస్ట్ ఉంటుందన్నారు. ఆసక్తిగల విద్యార్థులు శనివారం రాత్రి 8 గంటల లోగా భాష్యం కళాశాలలో పేర్లు నమోదు చేసుకుని హాల్ టికెట్లు పొందాలన్నారు. ఇతర వివరాల కోసం సెల్ నంబర్ 91603 80805లో సంప్రదించాలన్నారు. ప్రభుత్వ తీరును ఎండగట్టండి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి బొంరాస్‌పేట: ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను అన్ని విధాలా మోసం చేసిందని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం మండలంలోని లింగన్‌పల్లి తదితర గ్రామాల్లో సర్పంచ్ అభ్యుర్థుల తరఫున ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హామీలు అమలు చేయకుండా మళ్లీ ప్రజలకు వద్దకు వస్తున్న కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని సూచించారు. ప్రభుత్వ తీరును ఎండగట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జాతీయస్థాయి కరాటే పోటీల్లో విద్యార్థుల ప్రతిభ పరిగి: జాతీయ స్థాయి కరాటే పోటీల్లో పరిగి విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. జడ్చర్లలో జరిగిన జాతీయ స్థాయి పోటీలో పరిగి పట్టణంలోని గ్లోబల్ స్కూల్ నాలుగో తరగతి విద్యార్థి ఆష్నా సాదియాబేగం, మూడో తరగతి విద్యార్థులు ఆఫ్మిన్రహామత్, జునైరా షేక్ ప్రథమ స్థానంలో నిలిచారు. శుక్రవారం విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు. విశ్రాంత ఉద్యోగులసంఘం జిల్లా కమిటీ ఎన్నిక అనంతగిరి: విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ముందుండి పోరాటం చేస్తామని ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మాణిక్‌ప్రభు అన్నారు. శుక్రవారం పట్టణంలోని సత్యసాయి జ్ఞాన కేంద్రం ఆవరణలో సంఘం జిల్లా ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా మాణిక్‌ప్రభు, జనరల్ సెక్రటరీగా జీవన్‌కుమార్, ఆర్థిక కార్యదర్శిగా అంబదాస్, అసోసియేటెడ్ ప్రెసిండెంట్‌గా చిన్నారెడ్డి, ఉపాధ్యక్షులుగా వెంకటసింగ్, మనోహర్‌రావు, విఠల్, కార్యదర్శులుగా యాదగిరి, రాము, సంయుక్త కార్యదర్శులుగా విఠోబా, మధుకర్, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా జనార్దన్, అంజిలయ్య, ప్రచార కార్యదర్శిగా బందెప్పగౌడ్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా నరసింహరెడ్డిను ఎన్నుకున్నారు. జిల్లా ఎన్నికల అధికారిగా గోపాల్‌రెడ్డి, బసవేశ్వర్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
పోరాటంతోనే హక్కుల సాధన
పరిగి: మెదక్ పట్టణంలో ఈ నెల 7నుంచి 9వ తేదీ వరకు జరగనున్న సీఐటీయూ రాష్ట్ర 5వ మహాసభలను జయప్రదం చేయాలని జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ కోరారు. శుక్రవారం పట్టణంలో ఇందుకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తోందని ఆరోపించారు. 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా మార్చి కార్మికులను యాజమాన్యం చేతు లో కట్టు బానిసలుగా మార్చే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. వీటిపై ఐక్యంగా పోరాటం చేయాల ని పిలుపునిచ్చారు. అప్పుడే న్యాయం జరుగుతుందని తెలిపారు. లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా.. కొడంగల్ రూరల్: మెదక్ పట్టణంలో ఈ నెల 7నుంచి 9వ తేదీ వరకు జరగనున్న సీఐటీయూ 5వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని జిల్లా కో శాధికారి బుస్స చంద్రయ్య కోరారు. శుక్రవారం పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద ఆటో డ్రైవర్ల యూనియన్ ఆధ్వర్యంలో వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాజీ లేని పోరాటాలతోనే కార్మిక హక్కులను సాధించుకోవచ్చని తెలిపారు. లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. జిల్లాలోని కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు,అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు, జీపీ,మున్సిపల్ వర్కర్లు, హమాలీ, మిషన్ భగీరథ, హాస్టల్ వర్కర్లు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో రాజు పవర్, యాసిన్, మహబూబ్, అంజి, ప్రవీణ్‌గౌడ్, శ్రీనివాస్, శివకుమార్ పాల్గొన్నారు. -
నాణ్యమైన విత్తనంతో మేలు
అనంతగిరి: రైతులు నాణ్యమైన విత్తనం నాటితే మంచి ఫలితాలు వస్తాయని రాష్ట్ర ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ సంచాలకులు యాస్మీన్ బాషా అన్నారు. శుక్రవారం వికారాబాద్ మండలం ఆలంపల్లి, నారాయణపూర్, పూలమద్ది గ్రామాల్లో రైతులు సాగు చేసిన తోటలు, పంటలను పరిశీలించారు. ఆలంపల్లిలో మేకల చంద్రశేఖర్ రెడ్డి సాగు చేసిన ఆయిల్ పామ్ తోటను సందర్శించారు. సస్యరక్షణ చర్యలు గురించి వివరించారు. అనంతరం నారాయణపూర్‌లో మోహన్ రెడ్డి సాగు చేసిన పసుపు, క్యారెట్, పందిరి పద్ధతిలో సాగు చేసిన పంటలను పరిశీలించారు. గ్రామంలోని ప్రైవేట్ కూరగాయల నర్సరీని సందర్శించి రైతులకు నాణ్యమైన నారు సరఫరా చేయాలని సూచించారు. అక్కడి నుంచి పూలమద్ది గ్రామానికి చేరుకొని రైతు బందేలి సాగు చేసిన బంతి పూలతోట, డ్రాగన్ ఫ్రూట్, చామగడ్డ పంటలతోపాటు నరసింహారెడ్డి పొలాన్ని సందర్శించారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ అధికారి సత్తార్, అధికారులు యము న, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికలు సజావుగా జరగాలి
కొడంగల్/పరిగి: గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా పారదర్శకంగా జరిగేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. శుక్రవారం కొడంగల్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో పోలింగ్, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల విధి విధానాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తపై అవగాహన కల్పించారు. పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలన్నారు. కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అనుమానాలకు తావులేకుండా ప్రతి విషయాన్ని పరిశీలించాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి గుర్తులు లేకుండా చూడాలని తెలిపారు. ఓటర్లకు ఇబ్బంది లేకుండా సదుపాయలు కల్పించాలన్నారు. ఓటరు స్లిప్పులను పరిశీలించి అర్హులు ఓటు హక్కును వినియోగించుకునేలా చూడాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ రాంబాబు, ఎంపీడీఓ ఉషశ్రీ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక శ్రద్ధ వహించాలి పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ ప్రతీక్‌జైన్ సూచించారు. శుక్రవారం పరిగి మండలం రంగంపల్లి క్లస్టర్లో నామినేషన్ల ప్రక్రియను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నామినేషన్ ప్రక్రియలో ఎలాంటి తప్పులు, పొరపాట్లు లేకుండా చూడాలన్నారు. అవసరానికి అనుగుణంగా సిబ్బందిని నియమించుకోవాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు జాగ్రత్తగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలులో వేగం పెంచండి దుద్యాల్: వరి ధాన్యం కొనుగోలులో వేగం పెంచాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో కొనసాగుతున్న వడ్లు సేకరణ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం రాసులను చూసి నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కువ రోజులు నిల్వ ఉంచకుండా ఎప్పటికప్పుడు రైస్ మిల్లులకు తరలించాలని ఆదేశించారు. రైతులను ఇబ్బందులకు గురి చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ధాన్యం సేకరణలో ఏమైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తేవాలని, వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ కిషన్ తదితరులు పాల్గొన్నారు. -
సొంతిల్లుగా ‘పంచాయతీ’!
బషీరాబాద్: ప్రభుత్వ నిధులతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఓ మాజీ సర్పంచ్ తన సొంత ఇల్లులా వాడుకుంటున్నారు. 2023 మార్చిలో రూ.20 లక్షల జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో ప్రారంభించిన జీపీ నిర్మాణం ఆరునెలల్లో పూర్తిచేశారు. ఇందుకు సంబంధించిన బిల్లు లు ఆలస్యం కావడంతో ఆ భవనాన్ని నిర్మించిన అప్పటి బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ వంశీకృష్ణ గౌడ్ కుటుంబం ఉపయోగించుకుంటోంది. ఈ ఘటన మండలం రెడ్డిఘణాపూర్లో ఆలస్యంగా వెలుగు చూసింది. గత ప్రభుత్వ హయాంలో ఉపాధి హామీ పథకం కింద మండలంలోని రెడ్డిఘణాపూర్, గొట్టి గఖుర్ధు, బాబునాయక్‌తండా, వాల్యానాయక్ తండా, పర్వత్‌పల్లి, కొత్లాపూర్ గ్రామాల్లో రూ.1.20 కోట్లు వెచ్చించి పంచాయతీ భవనాలు నిర్మించారు. తాను అప్పు చేసి భవనం నిర్మిస్తే ప్రభుత్వం బిల్లు లు చెల్లించలేదని 2024 నుంచి నేటి వరకు సదరు మాజీ సర్పంచ్ భవనాన్ని వాడుకుంటున్నారు. ఇదిలా ఉండగా సదరు గుత్తూదారుకు ప్రభుత్వం అక్టోబర్‌లోనే రూ.17 లక్షలు చెల్లించినట్లు పంచాయతీ రాజ్ అధికారులు చెబుతున్నారు. అయినా భవనాన్ని ప్రభుత్వానికి అప్పగించకుండా దర్జాగా వాడుకోవడం చర్చనీయాంశమైంది.ఇదే విషయా న్ని పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా వా రు పట్టించుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మరో ఐదు రోజుల్లో కొత్త సర్పంచ్ ఎన్నికై తే ఎక్కడ కూర్చుంటారని గ్రామస్తులు మండిపడుతున్నారు. ఇదే విషయమై సదరు కాంట్రాక్టర్‌ను వివరణ కోరగా తాను ఖాళీ చేయడానికి సిద్ధమని తెలిపారు. బిల్లులు ఆలస్యం కావడంతోనే పంచాయతీ భవనాన్ని వినియోగించుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. -
క్రైం కార్నర్..
చోరీకి పాల్పడిన మైనర్ల రిమాండ్ పరిగి: దొంగతనానికి పాల్పడిన ముగ్గురు మైనర్లను పరిగి న్యాయస్థానం రిమాండ్‌కు తరలించిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్ఐ మోహనకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. మండలానికి చెందిన నేనావత్ గోపాల్ గురువారం రాత్రి ముంబై వెళ్లేందుకు పరిగి బస్టాండ్‌కు వచ్చాడు. ఆలస్యం కావడంతో వికారాబాద్ వెళ్లేందుకు బస్సు సౌకర్యం లేకపోవడంతో మార్కెట్ యార్డులో పడుకోడానికి నడుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో అర్ధరాత్రి రెండు గంటలకు బైక్‌పై ముగ్గురు వచ్చి గోపాల్ని కొట్టి ఫోన్, కొంత నగదు దోచుకొని పరారయ్యారు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుల కోసం గాలింపు చేపట్టారు. గంజిరోడ్డులో పోలీసులను చూసి మైనర్లు పరిపోతుండగా వెంబడించి సాయిబాబా దేవాలయం పక్కన పట్టుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులను కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. విద్యార్థుల అరెస్టు అప్రజాస్వామికం సాక్షి,సిటీబ్యూరో: ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా.. మారేడుమిల్లి అడవుల్లో గత నెల 18న మావోయిస్టు పార్టీ నాయకులు హిడ్మ ఇతర సభ్యులను ఎన్కౌంటర్ చేసిన ప్రదేశంలో నిజ నిర్ధారణ చేయడానికి వెళ్తున్న ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాలకు చెందిన 14 మంది విద్యార్థుల బృందాన్ని శుక్రవారం ఏపీ పోలీసులు ఆరెస్టు చేయటాన్ని పీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్ష,కార్యదర్శులు ఆవుల నాగరాజు,కోట ఆనంద్ తీవ్రంగా ఖండించారు. విద్యార్థులను అక్రమంగా చింతూరు పోలీస్ స్టేషన్లో నిర్బంధించటం దారుమణమన్నారు. సామాజిక బాధ్యతతో రాజ్యాంగబద్ధంగా నిజనిర్ధారణకు వెళ్లిన విద్యార్థి నాయకులను వెంటనే బేషరతుగా విడుదల చేసి నిజనిర్ధారణ చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలన్నారు. ఎన్డీఏ ప్రభుత్వ కనుసన్నల్లో విప్లవకారులను అరెస్టు చేసే అవకాశం ఉన్నప్పటికీ, ఎన్ కౌంటర్ చేసిందని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో నిజనిర్ధారణకు వెళ్ళిన విద్యార్థులను అరెస్టు చేయడం ఆ ఆరోపణలకు బలం చేకూర్చతుందన్నారు. -
జీపీల అభివృద్ధికి సహకారం
తాండూరు: ఏకగ్రీవంగా ఎన్నికై న సర్పంచ్‌లు పల్లెలను ప్రగతి పథంలో నడిపించాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి సూచించారు. శుక్రవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలో ఏకగ్రీవంగా ఎన్నికై న 25 మంది సర్పంచ్‌లను, వార్డు సభ్యులను సన్మా నించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశానికి పల్లెలు పట్టుకొమ్మలు లాంటివని, గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం పురోగతి సాధిస్తుందని అన్నారు. పంచాయతీల అభివృద్ధికి తన వంతు సహకారం ఉంటుందన్నారు. 30 ఏళ్ల పంచాయతీ ఎన్నికల చరిత్రలో ఒకేసారి 25 జీపీలు ఏకగ్రీవం కావడం ఇదే తొలిసారని పేర్కొన్నారు. వీరంతా కాంగ్రెస్ పార్టీ బలపర్చిన వారు కావడం సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సమర్థవంగా ప్రజలకు అందేలా చూస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్, ఏకగ్రీవ సర్పంచ్‌లు రాజ్‌కుమార్, పటేల్ విజయ్‌కుమార్, పురుషోత్తంరెడ్డి, వెంకట్‌రెడ్డి, అనసూయ, పెద్దేముల్ మండలానికి చెందిన గౌరమ్మ, మంగమ్మ, పద్మమ్మ, విజయ్, బషీరాబాద్ మండలానికి చెందిన అనిత, నవనీత,అనితబాయి, భీమప్ప, పున్నిబాయి, యాలాల మండలానికి చెందిన నరేష్, మల్లేశం, లాలప్ప, పల్లె స్వప్న, గుర్రాల నాగమణి, నేనావత్ శాంతి బాయి, రామవత్ కిషన్, కమలబాయి, సంగెం సుధాలక్ష్మి, అంగోత్ మోహన్, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
గ్రామ పోరుపై ప్రత్యేక నిఘా
● అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసుల అప్రమత్తం ● ఏడు సమస్యాత్మకపోలింగ్ స్టేషన్ల గుర్తింపు కడ్తాల్: స్థానిక సంస్థల ఎన్నికలకు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. రాజకీయ పార్టీలు ప్రత్యేకంగా తమ గుర్తులతో గ్రామ పోరులో పోటీ చేయకున్నా మద్దతుదారులు, సానుభూతిపరులతో పల్లెల్లో పట్టు కోసం ఆరాట పడుతున్నాయి. ఈ క్రమంలో ఘర్షణలు, అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకునే అవకాశం లేకపోలేదు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశంతో గ్రామాల్లో పోలీసులు నిఘా పెంచారు. అలాగే ప్రలోభాలకు సైతం అడ్డుకుట్ట వేయడానికి చర్యలు చేపట్టారు. కడ్తాల్ మండలంలో శ్రీశైలం–హైదరాబాద్ జాతీయ రహదారిపై ముచ్చర్ల గేట్ కూడలి వద్ద ప్రత్యేకంగా పోలీస్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అక్రమంగా మద్యం, నగదు తరలకుండా నిఘా ఉంచారు. మండల పరిధిలో 24 గ్రామ పంచాయతీల్లో రెండో దఫా పంచాయతీ ఎన్నికలు ఈ నెల 14న జరగనున్నాయి. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా కడ్తాల్, మైసిగండి, ముద్వీన్, చరికొండ, చల్లంపల్లి, రావిచేడ్, సాలార్‌పూర్ గ్రామాలను గుర్తించారు. ఇప్పటికే ఎస్ఎస్టీ, ఎఫ్ఎస్టీ బృందాలను నియమించారు. ఎనిమిది మంది రౌడీషీటర్లు, 10 మంది సస్పెక్ట్స్, ట్రబుల్ మంగర్స్ 26 మొత్తం 44 మందిని తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు. ప్రజలు సహకరించాలి మొయినాబాద్‌రూరల్: శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని మొయినాబాద్ సీఐ పవన్‌కుమార్‌రెడ్డి అన్నారు. శుక్రవారం అమ్డాపూర్, శ్రీరామ్‌నగర్, కేతిరెడ్డిపల్లి గ్రామాల్లో కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నాయకులు, ప్రజలు కృషి చేయాలన్నారు. శాంతి భద్రతలు కాపాడేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో ఎస్ఐ నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు. శాంతియుత ఎన్నికలకు కవాతు చేవెళ్ల: పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించుకునేందుకు గ్రామాల్లో అన్ని వర్గాల ప్రజలు పూర్తి సహకారం అందించాలని చేవెళ్ల ఇన్స్పెక్టర్ ఉపేందర్ అన్నారు. శుక్రవారం మండలంలోని పలు గ్రామాల్లో పోలీస్ బలగాలతో కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరగాలని కోరారు. ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల సమయంలో అనుచిత కార్యకలాపాలు, బెదిరంపులు, గొడవలు సహించేది లేదన్నారు. శాంతిభద్రతలు కాపాడేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఐ వనం శిరీష, సిబ్బంది పాల్గొన్నారు. -
ఒకే నామినేషన్.. లాంఛనమే యునానిమస్
కుల్కచర్ల: మండలంలో రెండు గ్రామాల్లో సర్పంచులు ఏకగ్రీవం కానున్నాయి. మూడో విడత నామినేషన్ల ప్రక్రియలో భాగంగా తిర్మలాపూర్, బోట్యానాయక్ తండా గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థిత్వానికి ఒకే ఒక్క నామినేషన్ దాఖలైంది. శుక్రవారమే నామినేషన్‌కు చివరి రోజు కావడంతో ఏకగ్రీవం లాంఛమైంది. తిర్మలాపూర్‌లో వార్ల మాధవి, బోట్యానాయక్తండాలో సంతోష్ సర్పంచులు అవ్వనున్నారు. ఎన్నికలు అధికారులు ప్రకటించాల్సి ఉంది. తిర్మలాపూర్ తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి స్వగ్రామం కావడం గమనార్హం. రూప్‌సింగ్‌తండాలో.. పరిగి: మండలంలో ఒక గ్రామ పంచాయతీ ఏకగ్రీవమైంది. రూప్‌సింగ్‌తండాకు రమణిబాయి ఒక్కరే సర్పంచ్‌కి నామినేషన్ వేయడంతో ఆ స్థానం యునానిమస్ అయింది. మల్కాయాపేట, హిర్యనాయక్తండాలో అన్ని వార్డులు ఏకగ్రీవయ్యాయి. స్క్రూట్నీ అనంతరం అధికారింగా ప్రకటించనున్నారు. -
జిల్లాను క్లీన్ స్వీప్ చేస్తాం
తాండూరు రూరల్: పంచాయతీ ఎన్నికల్లో అన్ని సర్పంచ్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులే విజయం సాధిస్తారని డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్ అన్నారు. శుక్రవారం మండలంలోని జినుగుర్తి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఉత్తమ్‌చందు నివాసంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో తాండూరు నియోజకవర్గంలోని 24 గ్రామాలను ఏకగ్రీవం చేశామన్నారు. కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులను గెలిపిస్తే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. వికారాబాద్, పరిగి ప్రాంతాల్లో కూడా అన్ని సర్పంచ్ స్థానాలను ప్రజలు గెలిపించుకుంటారని తెలిపారు. జినుగుర్తి గ్రామంలో రఘు కిషోర్‌ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు మహిపాల్‌రెడ్డి శ్యామప్ప, అజ్మాత్, అసీం అలీ, మాణిక్యం, యశ్వంత్, రాజు, భాస్కర్, గడ్డమీది నాగమ్మ, కృష్ణారెడ్డి, కిష్టప్ప, సురేష్‌గౌడ్, మొగులప్ప, దేవిజ నాయక్, వెంకట్, భద్రుజాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
వలస ఓటర్లే టార్గెట్!
పంచాయతీ ఎన్నికల్లో వలస ఓటర్లే కీలకం కానున్నారు. జిల్లాకు చెందిన వేల మంది కూలీలు ఆయా నగరాల్లో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారిని ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. పోలింగ్ రోజు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందుకు అవరమైన బస్సు చార్జీలు, ఇతర ఖర్చులు భరించేందుకు సిద్ధమయ్యారు. అంతేకాకుండా తమకే ఓటు వేసేలా మాట కూడా తీసుకుంటున్నట్లు సమాచారం. ఓట్ల పండుగకు రావాలే ప్రసన్నం చేసుకునే పనిలో అభ్యర్థులు ఫోన్లు చేసి ఆప్యాయంగా పలకరిస్తున్న వైనం బంధుత్వాలను గుర్తు చేస్తున్న క్యాండెట్లు ఊరికి వచ్చి ఓటేసి పోవాలని అభ్యర్థన బస్ చార్జీలు, ఇతర ఖర్చులు తామే చూసుకుంటామని హామీ -
అరుదైన గుడ్ల గూబ
మోమిన్‌పేట: మండలంలోని ఓ స్టోన్ క్వారీలో అరుదైన జాతికి చెందిన గుడ్లగూబ ఐదు గుడ్లు పెట్టింది. వారం రోజుల క్రితం వన్యప్రాణుల ఫొటోగ్రాఫర్లు ఈ విషయాన్ని గుర్తించి, అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో క్వారీని సందర్శించిన ఫారెస్ట్ ఆఫీసర్లు నెల రోజుల పాటు క్వారీ పనులు నిలిపేయాలని కోరగా, ఇందుకు అంగీకరించిన యజమాని పనులకు బ్రేక్ వేయించారు. అంతరించి పోతున్న ఈ అరుదైన జాతి పక్షిని షెడ్యూల్– 1లో చేర్చారని అటవీశాఖ అధికారులు తెలిపారు. 25 రోజుల్లో ఇది కనీసం మూడు పిల్లలను పొదుగుతుందని తెలిపారు. -
కొత్త పంచాయతీ సర్పంచ్!
● రెండేళ్ల క్రితం నూతన జీపీగా దీప్లానాయక్ తండా ● మొదటిసారి ఎన్నికలు ● ఎన్నిక కానున్న తొలి ప్రథమ పౌరుడు కుల్కచర్ల: దీప్లానాయక్ తండా ప్రజల సర్పంచ్ కల ఎట్టకేలకు నెరవేరనుంది. రెండేళ్ల క్రితం ఈ తండాను గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేశారు. మొదటి సారి ఎన్నికలు జరగనున్నాయి. తొలి సారిగా ప్రథమ పౌరుడిని ఎన్నుకోనున్నారు. ఆ సమయం రావడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉత్సాహంగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. పరిగి రెవెన్యూ డివిజన్ పరిధిలో మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా దీప్లానాయక్ తండాను ఎస్టీ మహిళకు కేటాయించారు. దీంతో పలువురు పోటీకి ఆసక్తి చూపుతున్నారు. సాల్వీడు గ్రామ పంచాయతీలో అనుబంధ గ్రామంగా ఉన్న ఈ తండాకు జూలై 15, 2024లో పంచాయతీ హోదా లభించింది. నాటి నుంచి ఇన్చార్జ్ అధికారుల పాలన సాగుతోంది. తండాలో 555 మంది జనాభా, 398 మంది ఓటర్లు ఉన్నారు. అందులో పురుషులు 203 మంది, మహిళలు 195మంది ఉన్నారు. ఎవరైనా మొదటి సర్పంచే నూతన జీపీ దీప్లానాయక్ తండాలో ఎన్నికల కోలాహలం నెలకొంది. ఉమ్మడి గ్రామ పంచాయతీగా ఉన్న సమయంలో ఇక్కడి నుంచి తండాకు చెందిన దీప్లానాయక్ 1985లో సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. అదనంతర ఎన్నికల్లో సాల్వీడు జీపీని ఎస్టీకి కేటాయించలేదు. దీంతో ఆ సామాజిక వర్గం నుంచి ఎవరూ సర్పంచ్‌గా ఎన్నిక కాలేదు. ప్రస్తుతం దీప్లానాయక్ తండా కొత్త గ్రామపంచాయతీగా మారడంతో తాండవాసులే సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. మొదటి సారి ఎన్నికలు కావడంతో యువత పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతోంది. ఇప్పటి వరకు సర్పంచ్ స్థానానికి ఇద్దరు అభ్యర్థులు, వార్డు స్థానానికి ఆరుగురు నామినేషన్లు వేశారు. నేటితో గడవు ముగియనుంది. ఒకరు లేదు ఇద్దరు సర్పంచ్ స్థానానికి నామినేషన్ వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
పాలకులకు ‘పట్టా’
షాద్‌నగర్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికై న సర్పంచ్, వార్డు సభ్యులకు గురువార ం ఆయా క్లస్టర్లలో ఎన్నికల రిటర్నింగ్ అధికారులు నియామక పత్రాలను అందజేశారు. ఫరూఖ్‌నగర్ మండలం అయ్యవారిపల్లి సర్పంచ్‌గా గోపాల్‌రెడ్డి, కొందుర్గు మండలం పాత ఆగిర్యాల సర్పంచ్‌గా యాదమ్మ, చెర్కుపల్లి సర్పంచ్‌గా యాద య్య, లక్ష్మీదేవిపల్లి సర్పంచ్‌గా మంచాల అనూష, నందిగామ మండలం కన్హా సర్పంచ్‌గా మధుసూధన్, కేశంపేట మండలం దేవునిగుడితండా సర్పంచ్‌గా సుజాత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కేశంపేట: మండల పరిధిలోని దేవునిగుడితండా సర్పంచ్‌తో పాటు ఎనిమిది మంది వార్డు మెంబర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రిటర్నింగ్ అధికారి డాక్టర్ నివేదిత గురువారం వీరికి నియామక పత్రాలు అందజేశారు. అనంతరం ఉప సర్పంచ్‌గా రవిని ఎన్నుకున్నారు. అలాగే, తూర్పుగడ్డతండాలో 07, పొల్కోనిగుట్టతండా 03, పాటిగడ్డ 02, చింతకుంటపల్లి, ఇప్పలపల్లి, లేమామిడి, ఎక్లాస్‌ఖాన్‌పేట, దత్తాయపల్లి గ్రామాల్లో ఒక్కో వార్డు చొప్పున ఏకగ్రీవమైనట్లు అధికారులు తెలిపారు. ఆర్ఓల సమక్షంలో ఉపసర్పంచ్‌ల ఎన్నికలు యాలాల: మండల పరిధిలో తొమ్మిది పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. వీరికి గురువారం రిటర్నింగ్ ఆఫీసర్ ధృవీకరణ పత్రాలను అందించారు. లక్ష్మీనారాయణపూర్, గంగాసాగర్, కిష్టాపూర్, బండమీది పల్లి, సంగాయగుట్ట తండా, సంగాయిపల్లి తండా, సంగెంకుర్దు, జక్కేపల్లి, పేర్కంపల్లితండాల్లో ఏకగ్రీవమైన సర్పంచ్‌లు, వార్డు సభ్యులకు ఆర్ఓలు ధృవీకరణ పత్రాలు అందించారు. ఆయా పంచాయతీల్లో ఆర్ఓల సమక్షంలో ఉప సర్పంచ్ అభ్యర్థుల ఎన్నిక నిర్వహించారు. ఏకగ్రీవ ప్రజాప్రతినిధులకు నియామక పత్రాలు -
సిత్రమైన పొత్తులు
● పంచాయతీల్లో సర్పంచ్ పీఠం కోసం ఏకమవుతున్న ప్రధాన పార్టీలు ● ఉపర్పంచ్ పదవి కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థికి మద్దతిస్తున్న బీజేపీ ● కడ్తాల మండలం సలార్పూర్ అభ్యర్థికి మూడు పార్టీల మద్దతు ఆమనగల్లు: పంచాయతీ ఎన్నికల్లో చిత్రవిచిత్ర పొత్తులు పొడుస్తున్నాయి. సర్పంచ్ పీఠం దక్కించుకునేందుకు బీఆర్ఎస్, బీజేపీలు ఒక్కటవగా.. మరో చోట అధికార కాంగ్రెస్ సైతం స్నేహ హస్తం అందించడం విశేషం. నోటిఫికేషన్‌కు ముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు పంచాయతీ పోరులో ఒంటరిగా బరిలో ఉంటామని ప్రకటించినా.. ఆమనగల్లు, మాడ్గుల, కడ్తాల మండలాల్లలో కమలం నేతలు కారు పార్టీతో పొత్తు పెట్టుకుని పంచాయతీ ఎన్నికల పోటీకి దిగారు. ఒక్కో అభ్యర్థికి రెండు పార్టీల మద్దతు ● మంగళపల్లిలో ఎస్టీ మహిళకు కేటాయించారు. ఇక్కడ బీఆర్ఎస్, బీజేపీ బలపరిచిన ఉమ్మడి అభ్యర్థిగా మౌనిక బరిలో దిగారు. మరో ఇద్దరు సర్పంచ్ పదవికి నామినేషన్ వేశారు. ● శెట్టిపల్లి సర్పంచ్ పదవికి జంగమ్మ బీఆర్ఎస్, బీజేపీలు బలపరిచిన ఉమ్మడి అభ్యర్థిగా పోటీలో నిలిచింది. ● మేడిగడ్డతండాలో బీఆర్ఎస్, బీజేపీ బలపరిచిన ఉమ్మడి అభ్యర్థిగా హేమిబాయ్ బరిలో ఉండగా.. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిగా రాజేశ్వరి పోటీ పడుతున్నారు. ● కడ్తాల ఎస్సీ రిజర్వ్ స్థానంలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిగా బావండ్లపల్లి ఆనంద్‌కు బీజేపీ నేతలు మద్దతు పలికారు. మద్దతుకు ప్రతిఫలంగా బీజేపీ పార్టీకి ఉపసర్పంచ్ పదవి ఇచ్చేందుకు ఒప్పందం కుదిరినట్లుగా తెలుస్తోంది. ● కడ్తాల మండలం చరికొండలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి మహేందర్‌కు బీజేపీ మద్దతు తెలుపుతూ ఉపసర్పంచ్ పదవి తమకు ఇవ్వాలని షరతు పెట్టినట్లు సమాచారం. ● మాడ్గుల మండలం కొల్కులపల్లిలో మాజీ సర్పంచ్ అనురాధకు కాంగ్రెస్ బలపరచగా బీజేపీ, బీఆర్ఎస్లు ధర్మారెడ్డిని పోటీలో ఉంచారు. ● కడ్తాల మండలం సలార్పూర్ పంచాయతీలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు సంయుక్తంగా పద్మ నామినేషన్ వేయగా.. బీఆర్ఎస్లోని మరోవర్గం నుంచి సర్పంచ్ పదవికి ప్రియ నామినేషన్ దాఖలు చేశారు. ఉమ్మడి అభ్యర్థి నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ జెండాలతో నేతలు కనిపించారు. పంచాయితీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ అనంతరం ఏ ఏ పార్టీలు కలుస్తాయో చూడాలి. -
నేను చనిపోతున్నా.. పాప జాగ్రత్త
● భార్యకు వీడియో పంపి ఫోన్ స్విచాఫ్ చేసిన భర్త ● ఆచూకీ దొరక్క కుటుంబ సభ్యుల ఆందోళన షాద్‌నగర్ రూరల్: ‘మనీలా నన్ను క్షమించు.. నాకు ఏ పనీ చేయాలనిపించడం లేదు. నేను చనిపోతున్నా.. నా చావుకు ఎవరూ కారణం కాదు.. పాపను జాగ్రత్తగా చూసుకో’అంటూ ఓ వ్యక్తి భార్యకు వీడియో పంపి ఫోన్ స్విచాఫ్ చేసుకున్నాడు.. అతడి ఆచూకీ లభించక కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ ఘటన గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పట్టణంలోని రాఘవేంద్రకాలనీకి చెందిన సుందరాచారి, మనీల దంపతులు. సుందరాచారి ఓ పరిశ్రమలో కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఎప్పటిలాగే పనికి వెళుతున్నానంటూ బుధవారం ఉదయం ఇంటి నుంచి వెళ్లాడు. అదే రోజు మధ్యాహ్నం తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు ఓ చెరువు వద్ద ఓ వీడియో రికార్డు చేసి మనీలకు పంపించాడు. పాపను జాగ్రత్తగా చూసుకో, అప్పులు ఇచ్చిన వాళ్లు నన్ను క్షమించాలి, నా భార్యాపిల్లలను ఇబ్బంది పెట్టొద్దు అని అందులో పేర్కొన్నాడు. వీడియోలో కనిపించిన ముళ్లపొదలతో నిండిన చెరువు ఎక్కడ ఉంది, ఆ తరువాత కనిపించిన రైల్వే ట్రాక్ ఎక్కడ ఉంది..? అనే విషయం తెలియకపోవడం, సుందరాచారి ఫోన్ స్విచాఫ్ రావడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ విషయమై సుందరాచారి భార్య మనీల పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
‘పంచాయతీ’ సందడి
షాబాద్: పల్లెల్లో స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి మొదలైంది. ఏ నలుగురు కలిసినా సర్పంచ్, వార్డు సభ్యుల పోటీపైనే చర్చ జరుగుతోంది. నేటితో మూడో విడత ఎన్నికల నామినేషన్ల పర్వం ముగియనుంది. దీంతో బరిలో నిలిచిన అభ్యర్థులు ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే గ్రామాల్లో వర్గాల వారీగా మంతనాలు జరుపుతూ ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. ఇంటింటికీ తిరుగుతూ సర్పంచ్‌గా గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. రిజర్వేషన్లు మినహాయిస్తే జనరల్ స్థానాల్లో పోటీ తీవ్రంగా ఉంది. ఇక్కడ అన్ని సామాజిక వర్గాలకు చెందిన యువత పోటీలో ఉండడంతో ఓటరు ఎవరికి అనుకూలంగా తీర్పు ఇస్తారో తెలియని పరిస్థితి. యువత ఆసక్తి ఎన్నికల బరిలో నిలిచేందుకు యువతరం ముందుకు వచ్చింది. గతంలో పెద్దలకు అవకాశం ఇస్తూ వెంటతిరిగిన యువకులు.. పంచాయతీల మార్పునకు అంటూ ప్రథమ పౌరుడి బరిలో నిలుస్తున్నారు. బంధుమిత్రులు, యువజన సంఘాల సభ్యుల మద్దతు కూడగట్టుకుంటూ సామాజిక మాధ్యమాల్లో సాధరణ ఎన్నికలను తలపిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఎన్నికల ప్రచారంతో పల్లెల్లో కోలాహలం బరిలో నిలిచిన యువతరం ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు -
నిబంధనలు తప్పనిసరి
శంకర్పల్లి: ఎన్నికల నియమాలను ప్రతిఒక్కరూ కచ్చితంగా పాటించాలని శంకర్పల్లి ఎంపీడీఓ వెంకయ్య అన్నారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో ఆయన అధికారులతో సమావేశమయ్యారు. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు గాను అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలన్నారు. సభలు, సమావేశాలు, ఊరేగింపుల కోసం అభ్యర్థులు సంబంధిత అధికారుల నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని సూచించారు.27 పంచాయతీలకు 75 మంది పోటీ తాండూరు రూరల్: పంచాయతీ ఎన్నికల్లో తొలివిడత నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ బుధవారంతో ముగిసింది. మండలంలో 33 పంచాయతీలకు 6 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 27 జీపీల్లో 75 మంది సర్పంచు అభ్యర్థులు పోటీలో ఉన్నారని ఎంపీడీఓ విశ్వప్రసాద్ తెలిపారు. 290 వార్డులకు 96 ఏకగ్రీవం కాగా.. 194 వార్డులకు 426 మంది బరిలో ఉన్నారు. పెద్దేముల్లో 100 మంది పెద్దేముల్ మండలంలో 38 గ్రామాలకు 5 ఏకగ్రీవమయ్యాయి. 33 పంచాయతీలకు 100 మంది సర్పంచు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 308 వార్డుల్లో 74 ఏకగ్రీవంకాగా.. 234కు 529 బరిలో ఉన్నారని ఎంపీడీఓ రతన్‌సింగ్ తెలిపారు. ఎన్నికల విధుల నుంచి మినహాయించండి అనంతగిరి: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల విధులకు గర్భిణులు, పాలిచ్చే తల్లులు, అంగవైకల్యం, అనారోగ్యంతో బాధపడేవారితో పాటు.. ఉద్యోగ, ఉపాద్యాయులు, కింది స్థాయి సిబ్బందికి మినహాయింపు ఇవ్వాలని టీఎస్‌యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు వెంకటరత్నం కోరారు. గురువారం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఎన్నికల విధులు సజావుగా నిర్వహించడానికి పోలింగ్ కేంద్రాల వద్ద సరైన సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి రాములు ఉన్నారు. -
పల్లె పోరు.. యువత జోరు
షాబాద్: పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు యువత ఆసక్తి చూపుతోంది. ఇప్పటికే రెండు విడతల నామినేషన్ల ప్రక్రియ పూర్తవగా.. శుక్రవారంతో మూడో విడత ముగియనుంది. ఇప్పటికే దాఖలు చేసిన నామినేషన్లలో ఉన్నత విద్యావంతులే అధికంగా ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా సర్పంచ్ పదవితో పాటు వార్డు సభ్యులుగా యువత 60 శాతానికి పైగా బరిలో ఉన్నట్లు తెలుస్తోంది. యువత క్రీడలు, ఉద్యో గాలు, వ్యాపారాలతో పాటు రాజకీయాల్లోనూ చైతన్యం ప్రదర్శిస్తున్నారు. ఉన్నత చదువులు చదివిన వారితో పాటు పలువురు ఉద్యోగాలను వదులుకుని సర్పంచ్ ఎన్నికల బరిలో దిగారు. గతంలో పెద్దలు పోటీచేస్తే ప్రచారంలో భాగస్వాములయ్యే యువత.. ప్రస్తుతం పెద్దల సహకారంతో ప్రత్యక్షంగా పోటీలో నిలుస్తున్నారు. గెలుపే లక్ష్యంగా ప్రచారం... పంచాయతీ ఎన్నికలలో యువత పోటీ చేయడమే కాకుండా గెలుపే లక్ష్యంగా తమదైన శైలిలో ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నారు. సాంకేతికతతో పోటీపడుతున్న ప్రపంచంలో సోషల్ మీడియాలో ఆకట్టుకునే విధంగా తమకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు. అభ్యర్థి పేరు, గ్రామం పోటీ చేస్తున్న పదవితో పాటు తదితర వివరాలతో పోస్టర్లు తయారు చేస్తున్నారు. అదేవిధంగా వీడియోలో రూపొందించి వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్, ఫేస్బుస్ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా ముమ్మరంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సర్పంచ్, వార్డు సభ్యులుగా 60 శాతానికి పైగా యూత్ -
మంచి ముహూర్తం ఎంచుకుని!
ఒకేసారి తరలివస్తున్న అభ్యర్థులు ● నామినేషన్ల ప్రక్రియకు ఎక్కువ సమయం ఇబ్రహీంపట్నం: పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారు ముహూర్తం చూసుకుని వస్తుండటంతో నామినేషన్లకు ప్రక్రియ అర్ధరాత్రి వరకూ కొనసాగుతోంది. రెండో రోజైన గురువారం మధ్యాహ్నం 3.30 గంటల తర్వాత మహూర్తం బాగుందని భావించిన పోటీదారులు సాయంత్రం 4గంటల తర్వాత క్లస్టర్ ఆఫీసుకు క్యూ కట్టారు. వీరికి టోకెన్లు ఇచ్చిన అధికారులు, లైన్లో కూర్చోబెట్టి రాత్రి 8గంటల వరకు నామినేషన్లు స్వీకరించినా.. ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. దీంతో ఎన్నికల అధికారులు సైతం ఇబ్బంది పడ్డారు. నామినేషన్ల స్వీకరణ చివరి రోజైన శుక్రవారం మరింత జాప్యం జరిగే అవకాశం ఉందని, అదనపు సిబ్బందిని కేటాయించాలని కోరారు. -
‘సీసీఐ’ ఆధునీకరణకు నిధులివ్వండి
కేంద్ర మంత్రి కుమారస్వామిని కోరిన ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తాండూరు రూరల్: మండలంలోని కరన్‌కోట్ గ్రామ శివారులో గల సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ)ఫ్యాక్టరీ ఆధునీకరణకు రూ.100 కోట్లు కేటాయించాలని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, కంపెనీ ఉద్యోగులు కోరారు. బుధవారం ఢిల్లీలో కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామిని కలిసి ఈ మేరకు విన్నవించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీసీఐ ఫ్యాక్టరీలో పలు పరికరాలు దెబ్బతిన్నాయని వాటిని కొనాల్సి ఉన్నందున నిధులు మంజూరు చేయాలని కోరారు. ఇందుకు మంత్రి సానుకులంగా స్పందించారని ఉద్యోగ ప్రతినిధులు తెలిపారు. జిల్లా ఎన్నికల పరిశీలకులు షేక్ యాస్మిన్ బాషా తాండూరు రూరల్: గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరుపుకోవాలని జిల్లా ఎన్నికల పరిశీలకులు షేక్ యాస్మిన్ బాషా తెలిపారు. బుధవారం మండలంలోని బెల్కటూర్, గౌతాపూర్ నామినేషన్ సెంటర్లను పరిశీలించారు. నామినేషన్ పత్రాలను భద్రపరచాలని ఆదేశించారు. ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికల విధుల్లో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రతీక్‌జైన్, సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, ఎంపీడీఓ విశ్వప్రసాద్, తహసీల్దార్ తారాసింగ్ తదితరులు పాల్గొన్నారు. కొడంగల్: నియోజకవర్గ సరిహద్దు కర్ణాటక రాష్ట్రం మోతక్‌పల్లి క్షేత్రంలో వెలిసిన శ్రీ బల భీమరాయుని రథోత్సవం నేడు జరగనుంది. ఈ ప్రాంత ప్రజల ఇలవేల్పు కావడంతో భారీగా తరలి వెళ్లనున్నారు. గురువారం రాత్రి రథోత్సవం, శుక్రవారం గజోత్సవం(పూలతేరు) నిర్వహిస్తారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ పూడూరు: సీఐటీయూ 5వ మహాసభలను జయప్రదం చేద్దామని ఆ యూనియన్ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ పిలుపునిచ్చారు. ఈ నెల 7, 8 తేదీల్లో మెదక్ పట్టణంలో మహాసభలు జరగనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు సిద్ధం కావాలన్నారు. లేబర్ కోడ్స్ రద్దు చేసేవరకు తమ పోరాటం ఆగదన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు వనజ, ఉమాదేవి, అండాలు, పుష్ప, పంచాయతీ, మధ్యాహ్న భోజన కార్మికులు అలీ, నర్సింలు, రాములు తదితరులు పాల్గొన్నారు. చేవెళ్ల: మున్సిపాలిటీ పరిధిలోని మల్కాపూర్‌లో బుధవారం ఇరుముడి పూజ ఘనంగా జరిగింది. శివాలయం వద్ద అంజనేయులు, మహేందర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పడిపూజను శబరిమల యాత్ర గురుస్వాములు ఉమాశంకర్‌రెడ్డి, సుబ్రహ్మణ్యం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి అభిషేకం, పూలు, పండ్లు సమర్పించి.. ఇరుముళ్ల పూజ చేశారు. అనంతరం అయ్యప్ప స్వాములు సన్నిధానం నుంచి గురుస్వాములు జైపాల్, శివకుమార్, సురేశ్, ఇంద్రసేనారెడ్డి, మైసూరారెడ్డితో పాటు 14 మంది స్వాములు ఇరుముళ్లు కట్టుకొని శబరిమల యాత్రకు బయలు దేరారు. భక్తులకు మల్కాపూర్ ఎంపీటీసీ మాజీ సభ్యుడు బక్కారెడ్డి రవీందర్‌రెడ్డి అన్నదానం నిర్వహించారు. -
పక్కాగా ఏర్పాట్లు
ఎన్నికలు సజావుగా జరిగేందుకు అందరూ సహకరించాలివికారాబాద్: ‘గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు.. ఇవి నేరుగా ప్రజలచే ఎన్నుకోబడే ఎన్నికలు.. ప్రజాస్వామ్య వ్యవస్థలో పంచాయతీ ఎన్నికలు ఎంతో కీలకం.. అందుకే ఎలాంటి అవకతవకలు.. ఇబ్బందులకు తావు లేకుండా శాంతియుత వాతావరణంలో ఎలక్షన్ నిర్వహించేందుకు కృషి చేస్తున్నాం.. ఇందుకు తగ్గ ఏర్పాట్లు చేయడంతో పాటు అవసరమైన వాతావరణం కల్పిస్తున్నాం.. ప్రజలు కూడా సహాయ సహకారాలు అందించాలి’ అని ఎస్పీ స్నేహ మెహ్ర అన్నారు. ఇటీవల జిల్లా ఎస్పీగా బాధ్యతలు తీసుకున్న ఆమె ‘సాక్షి’తో పలు అంశాలు పంచుకున్నారు. పంచాయతీ ఎన్నికల సంసిద్ధతలో భాగంగా లిక్కర్, బెల్టు షాపుల కట్టడి, రౌడీ షీటర్ల బైండోవర్లు, లైసెన్స్ గన్ల స్వాధీనం తదితర అంశాలపై స్పందించారు. జిల్లాలో ఆమె గుర్తించిన సమస్యలు.. వాటి పరిష్కారానికి తీసుకోబోయే చర్యలు ఆమె మాటల్లోనే.. ప్రశాంత ఎన్నికలకు ఏర్పాట్లు శాంతియుతంగా పోలింగ్ జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. సమావేశాలు, ర్యాలీలు ఉంటే ముందుగా అనుమతి తీసుకోవాలి. లేందటే కేసులు నమోదు చేస్తాం. జిల్లాకు వచ్చే అదనపు బలగాలు.. స్థానిక పోలీసులను సమన్వయం చేస్తూ భద్రతా ఏర్పాట్లు చూస్తున్నాం. ప్రతి రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో పోలీసులను ఉంచి భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నాం. మద్యం వాయిలేషన్కు సంబంధించి ఇప్పటి వరకు 104 కేసులు నమోదు చేసి 919 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నాం. ఇప్పటి వరకు 279 మందిని బైండోవర్ చేశాం. వీరిలో 44 మంది రౌడీషీటర్లు ఉన్నారు. ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. జిల్లాలో మొత్తం 242 లైసెన్స్డ్ తుపాకులు ఉండగా 123 స్వాధీనం చేసుకున్నాం. మిగతావి బ్యాంక్ సెక్యూరిటీ తదితర అత్యవసర సేవల్లో ఉన్నవారి వద్ద ఉన్నాయి. డబ్బు, మద్యం రవాణాలను తగ్గించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలో నాలుగు అంతర్రాష్ట్ర, ఎనిమిది అంతర్ జిల్లా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నాం. ఇవి 24 గంటల పాటు పని చేస్తాయి. మరో 20 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం. సివిల్ డిస్పూట్స్పై ప్రత్యేక దృష్టి భూముల ధరలు పెరగడంతోనే సివిల్ తాగాదాలు.. నేరాలకు దారి తీస్తున్నాయి. వికారాబాద్ గ్రామీణ జిల్లా అయినందున ఎక్కువగా రైతులే ఉన్నారు. సివిల్ డిస్పూట్స్ విషయంలో వారికి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నాం. ప్రజలు ఏదైనా సమస్య వస్తే ముందుగా సంబంధిత పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలి.. అక్కడ స్పందించకుంటే.. నేరుగా నన్ను కలవొచ్చు.. ప్రధానంగా ఎర్రమట్టి, ఇసుక, కలప అక్రమ రవాణ, ఓవర్‌లోడ్ తదితర వాటిపై దృష్టి పెడుతున్నాం. యువత డ్రగ్స్ కల్చర్‌కు అలవాటు పడకుండా అవగాహన కార్యక్రమాలు చేపడతాం. నేరాల నియంత్రణకు సీసీ టీవీలు ఏర్పాటు చేయిస్తాం.. ఉన్నా వాటిని సక్రమంగా వినియోగించేలా చూస్తాం. సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో వాటినిపై దృష్టి సారిస్తాం.. ప్రజలతో పాటు మా సిబ్బందిని అప్రమత్తం చేస్తాం. వ్యవస్థల మధ్య గ్యాప్ లేకుండా చర్యలు తీసుకుంటాం. నేరస్తులు, రిపిటెడ్ క్రైమ్, తదితర అంశాలపై సీరియస్‌గా వ్యవహరిస్తాం. సాధారణ ప్రజలతో ఫ్రెండ్లీగా ఉంటూనే క్రిమినల్స్ విషయంలో సీరియస్‌గా వ్యవహరిస్తామని ఎస్పీ స్నేహమెహ్ర తెలిపారు. ఈ ప్రాంతంలో పోక్సో కేసులు ఎక్కువగా నమోదువుతన్నట్టు గుర్తించాం.. ఈ కేసుల్లో నేరస్తులను కఠిన శిక్షలు పడేలా చూడటంతో పాటు బాలికలకు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటాం. వారికి గుడ్ టచ్ ఏదో..? బ్యాడ్ టచ్ ఏదో తెలియజేస్తాం. వారి కోసం పని చేసే అన్ని వ్యవస్థలు సక్రమంగా సాగేలా చర్యలు తీసుకుంటాం. భరోసా సెంటర్లు, మహిళా పోలీస్ స్టేషన్, పోలీస్ స్టేషన్లు, సీసీఎస్, సైబర్ క్రైమ్ వింగ్ తదితర వ్యవస్థలన్నీ సక్రమంగా పని చేసేలా చూస్తాం.. ట్రాఫిక్ సమస్య అనేది లా అండ్ ఆర్డర్‌తో పాటు సామాజిక సమస్య కూడా. దీన్ని రెండు కోణాల్లో చూడాలి. ఒకటి పార్కింగ్ చేయటానికి స్థలం లేనిచోట వచ్చిపోయే వాహనదారులకు ఇబ్బంది కలగనంత వరకు కొంత సానుకూల దృక్ఫథంతో వ్యవహరిస్తాం. ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న వాటిని హాట్ స్పాట్లగా గుర్తిస్తున్నాం.. హైవేలో ఎక్కువగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి.. నివారణకు ప్రత్యేక కార్యాచరణ మొదలు పెట్టాం. పొగమంచు నేపథ్యంలో ప్రజలు, వాహనదారులు జాగ్రత్తలు పాటించాలి. రోడ్లను ఆక్రమించడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. దీన్ని సీరియస్‌గా తీసుకుంటాం. అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేయాలి పోక్సో కేసులపై దృష్టి సారిస్తాం సివిల్ తగాదాలు, ఇల్లీగల్ వ్యవహారాలపై నిఘా పెడతాం సైబర్ నేరాలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తాం కిందిస్థాయి అధికారులు స్పందించకుంటే నేరుగా కలవొచ్చు ‘సాక్షి’తో ఎస్పీ స్నేహ మెహ్ర -
‘మొదటి విడత’ సర్పంచ్‌లు వీరే!
రెండో విడతలో ఇద్దరు బంట్వారం: రెండో విడతలో కోట్‌పల్లి మండలంలోని రెండు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. రెండు జీపీల్లో సర్పంచ్, వార్డు స్థానాలకు ఒక్కొక్కటి చొప్పున నామినేషన్లు వచ్చాయి. బుగ్గాపూర్ జనరల్‌కు రిజర్వు కాగా, బార్వాద్ తండా ఎస్టీ జనరల్‌కు కేటాయించారు. బుగ్గాపూర్ నుంచి మహేంద్ దొర, బార్వాద్ తాండా నుంచి నెనావత్ శంకర్ సర్పంచ్‌గా ఎన్నిక కావడం ఖాయమైంది. తాండూరు రూరల్: తాండూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఉప సంహరణ ప్రక్రియ బుధవారంతో ముగిసింది. సర్పంచ్, వార్డు స్థానాలకు ఒకే నామినేషన్ వచ్చిన పంచాయతీల వివరాలను అధికారులు వెళ్లడించారు. దీంతో ఆయా పంచాయతీలకు సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నిక దాదాపు ఖరారైంది. తాండూరు మండలంలో 33 జీలు ఉండగా ఐదు పంచాయతీలు ఏకగ్రీవమైనట్లు ఎంపీడీఓ విశ్వప్రసాద్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కరన్‌కోట్ జీపీ నుంచి రాజ్‌కుమార్, రాంపూర్మీది తండా నుంచి వెంకట్‌రెడ్డి, వీరారెడ్డిపల్లి నుంచి పురుషోత్తం రెడ్డి, బిజ్వార్ నుంచి అనసూయ, చిట్టిఘనాపూర్ నుంచి విజయ్‌కుమార్ సర్పంచ్ కావడం దాదాపు ఖరారైంది. పెద్దేముల్లో నాలుగు పెద్దేముల్ మండలంలో 38 గ్రామ పంచాయతీలు ఉండగా నాలుగు ఏకగ్రీవమైనట్లు ఎంపీడీఓ రతన్‌సింగ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రుద్రారం, చైతన్యనగర్, దుగ్గాపూర్, సిద్ధన్నమడుగు తండాలో సర్పంచ్ స్థానానికి ఒక్కొక్కటి చొప్పున నామినేషన్లు వచ్చినట్లు తెలిపారు. ఆరు జీపీలు ఏకగ్రీవం బొంరాస్‌పేట: మొదటి విడత నామినేషన్ల ఉపసంహరణ ప్రకియ ముగియడంతో మండలంలోని ఆరు పంచాయతీలు ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు. నాగిరెడ్డిపల్లి పంచాయతీ నుంచి నందిగామ అనిత, జానకంపల్లి నుంచి సానవోని చిన్నవెంకటయ్య, సాలిండాపూర్ జీపీ నుంచి రుక్కీబాయి, మదన్‌పల్లితండా నుంచి శంకర్‌నాయక్, టేకులగడ్డతండా నుంచి లక్ష్మీబాయి, కట్టుకాల్వతండా నంచి కిషన్‌నాయక్, పాలబాయితండా నుంచి సరోజినీబాయి సర్పంచ్‌గా ఎన్నిక కావడం ఖాయమైంది. పాంచ్ పటాకా బషీరాబాద్: మండలంలో ఐదు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. మంతన్‌గౌడ్, బాబునాయక్‌తండా, హంక్యానాయక్తండాల్లో సర్పంచ్, వార్డు స్థానాలకు ఒక్కొక్క నామినేషన్ చొప్పున దాఖలయ్యాయి. బుధవారం బాద్లాపూర్, నంద్యానాయక్ తండాల్లో పోటీ దారులు నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో ఈ రెండు పంచాయతీలు కూడా యూనానిమస్ జాబితాలో చేరారు. ఎరుకలి భీమప్ప(మంతన్‌గౌడ్), కంసాన్పల్లి నవనీత(బాద్లాపూర్), అనితారాథోడ్ (హంక్యానాయక్), జెర్పుల అనిత (బాబునాయక్ తండా), చౌహన్ చుమ్మీభాయి (నంద్యానాయక్ తండా) సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. బుధవారం వీరంతా తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. నాగసార్ సర్పంచ్‌గా అరుణ! దౌల్తాబాద్: మండలంలోని నాగసార్ గ్రామపంచాయతీ ఏకగ్రీవం అయ్యింది. ఇక్కడ సర్పంచ్ స్థానానికి ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లు వేయగా బుధవారం ఒకరు ఉపసంహరించుకున్నారు. దీంతో దాదాపురం అరుణ ఎన్నిక ఖాయమైంది. 8 వార్డులు కూడా ఏకగ్రీవం అయ్యాయి. ఎన్నిక లాంఛనమే దుద్యాల్: మండలంలోని సాగారం తండా గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా నరేశ్ రాథోడ్, ఆరుగురు వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పోటీలో ఉన్న రవినాయక్ తన నామినేషన్‌ను ఉపసంహరించుకోవడంతో నరేశ్ ఎన్నిక లాంఛనమైంది. బుధవారం నరేశ్‌ను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శేఖర్ సన్మానించారు. నెనావత్ శంకర్ (బార్వాద్ తండా)మహేందర్ దొర(బుగ్గాపూర్) ముగిసిన నామినేషన్ల ఉప సంహరణ ప్రక్రియ ఏకగ్రీవ పంచాయతీలను ప్రకటించిన అధికారులు యాలాల: స్థానిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల ఉపసంహరణ బుధవారంతో ముగియడంతో మరో నాలుగు పంచాయతీలు ఏకగ్రీవమయ్యారు. ఇప్పటికే ఆరు జీపీలు ఏకగ్రీవం కాగా, మరో నాలుగు చేరాయి. బండమీదిపల్లి నుంచి నరేష్, జక్కేపల్లి నుంచి లాలప్ప, దేవులాతండా నుంచి మోహన్, సంగాయిపల్లితండా నుంచి కమలాబాయి ఏకగ్రీవ సర్పంచ్‌లుగా ఎన్నిక కానున్నారు. దేవులాతండాలో మొత్తం నాలుగు వార్డులకు గాను రెండు ఏకగ్రీవం కాగా మరో రెండు వార్డుల అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోక పోవడంతో ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచ్ స్థానం మాత్రం ఏకగ్రీవమైంది. -
మెరుగైన వైద్యం మన బాధ్యత
కొడంగల్ రూరల్: రోగులకు మెరుగైన వైద్యం అందించడం మన బాధ్యత అని ఇందుకోసం సిబ్బంది కృషి చేయాలని డీఎంహెచ్ఓ స్వర్ణకుమారి సూచించారు. బుధవారం మండలంలోని అంగడిరాయిచూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఆస్పత్రి రికార్డులు, ల్యాబ్, ఫార్మసీని పరిశీలించారు. రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ రవీంద్రయాదవ్, పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ భూషరా ఫాతిమా, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పీహెచ్సీ సందర్శన దౌల్తాబాద్: మండల కేంద్రంలోని పీహెచ్‌సీని బుధవారం జిల్లా వైద్యాధికారి స్వర్ణకుమారి పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బంది రిజిస్టర్, మందుల నిల్వలు, డెలివీరీ కేసుల వివరాల గురించి వైద్యాధికారిని ప్రియదర్శిని అడిగి తెలుసుకున్నారు. సమస్యలపై ఆరా తీశారు. పీహెచ్‌సీని 24 గంటల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేయాలని స్థానికులు కోరగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని తెలిపారు. రోజుకు 80 నుంచి 100 మంది ఓపీ వస్తుంటారని వైద్యాధికారిణి తెలిపారు. ఆమె వెంబడి డిప్యూటీ డీఎంహెచ్ఓ రవీందర్‌యాదవ్, సిబ్బంది రఫీ, తదితరులు ఉన్నారు. అందుబాటులో ఉండాలి దుద్యాల్: ఆస్పత్రికి వచ్చే రోగులకు అందుబాటులో ఉండాలని డీఎంహెచ్ఓ సువర్ణకుమారి సూచించారు. బుధవారం మండలంలోని హకీంపేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రి పరిసరాలు, రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యులు డాక్టర్ వందన, సిబ్బంది పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ స్వర్ణకుమారి పలు పీహెచ్‌సీల సందర్శన -
అవినీతి జలగలు!
తాండూరు: తాండూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఇక్కడ కాసులు ఇవ్వనిదే ఏ ఫైలూ కదలడం లేదు. మూడేళ్ల వ్యవధిలో ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు ఏసీబీకి చిక్కి సస్పెన్షన్‌కు గురైనా అధికారుల తీరులో మార్పు రావడం లేదు. 2022 డిసెంబర్ నెలలో సబ్ రిజిస్ట్రార్‌గా విధులు నిర్వహించిన జమిరొద్దీన్ రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడి రెండేళ్లు ఉద్యోగానికి దూరమయ్యారు. ఈ వ్యవహారం ఇంకా కోర్టు పరిధిలో ఉంది. ఈ ఏడాది మార్చి నెలలో సబ్ రిజిస్ట్రార్ పుర్య పనితీరు సరిగ్గా లేదని ఉన్నతాధికారులు హైదరాబాద్ ప్రధాన కార్యాలయానికి అటాచ్ చేశారు. తర్వాత అదే కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న సాయికుమార్‌కు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. నాలుగు నెలల ఆయన నెల రోజుల పాటు సెలవుపై వెళ్లారు. ఈ క్రమంలో ఇన్చార్జ్గా వ్యవహరించిన పవన్, ఫసియొద్దీన్ పక్షం రోజుల్లో నిబంధనలకు విరుద్ధంగా దాదాపు 240 డాక్యుమెంట్లను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారు. ఉన్నతాధికారులు గుర్తించి వారిద్దరినీ సస్పెండ్ చేశారు. తాజాగా ఇన్చార్జ్ సబ్ రిజిస్ట్రార్ సాయికుమార్ 11 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్‌కు పథకం వేశారు. ఒక్కో డాక్యుమెంట్‌కు రూ.2 వేలు డిమాండ్ చేశారు. రూ.16,500 లంచం తీసుకుంటూ ఏసీబీ వలకు చిక్కారు. తరచూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికై నా ప్రభుత్వం, రాష్ట్ర స్థాయి అధికారులు తాండూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ప్రత్యేక దృష్టి సారించి అధికారుల అవినీతికి చెక్ పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. చేతివాటం ప్రదర్శిస్తున్న ఇన్చార్జ్ సబ్ రిజిస్ట్రార్లు మూడేళ్ల వ్యవధిలో ఏసీబీకి చిక్కిన ఇద్దరు అధికారులు తాజాగా రూ.16,500 లంచం తీసుకుంటూ పట్టుబడిన సాయికుమార్ -
నగల కోసం వృద్ధురాలి హత్య
● వీడిన కేసు మిస్టరీ ● వివరాలు వెల్లడించిన ఎస్పీ స్నేహమెహ్ర అనంతగిరి: నగల కోసం వృద్ధురాలిని హత్యచేసిన నిందితులను బుధవారం పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఎస్పీ స్నేహ మెహ్ర తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. పూడూరు మండలం చన్గోముల్కు చెందిన 80 ఏళ్ల వృద్ధురాలు బేగరి రాములమ్మ కనిపించడం లేదంటూ గత నెల 21న ఆమె కొడుకు నర్సింలు ఫిర్యాదు మేరకు, కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఇదిలా ఉండగా 24న గ్రామంలోని ఓ పాడుబడ్డ ఇంటిలో నుంచి దుర్వాసన రావడంతో వెళ్లి చూడగా గోనె సంచిలో మూటగట్టిన రాములమ్మ శవం కుళ్లిన స్థితిలో ఉంది. ఆమె మెడలో బంగారు గుండ్లు, చేతికి ఉన్న వెండి గాజులు కనిపించలేదు. కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ పుటేజీల ఆధారంగా అనుమానితుడైన బెల్కటూరి నరేష్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. మెహర్, భూతుల్(అక్కచెల్లెళ్లు) అనే ఇద్దరితో కలిసి వృద్ధురాలి బంగారు, వెండి ఆభరణాలు కాజేయాలని పథకం పన్నారు. 18న మధ్యాహ్నం 12.30గంటలకు మృతురాలు బేగరి రాములమ్మ ఎప్పటిలాగే సమీపంలోని మెహర్ ఇంటికి వచ్చింది. అపుడు మెహర్ నరేష్‌కు ఫోన్ చేయగా వాళ్ల ఇంటికి వచ్చాడు. అక్కడ ముగ్గురూ కలిసి వృద్ధురాలి గొంతునులిమి చంపి, బంగారు గుండ్ల దండ, ఆరు వెండి గాజులు, ముక్కు పుడక తీసుకున్నారు. అనంతరం శవాన్ని గోనె సంచిలో కుక్కి, పాడుబడ్డ ఇంట్లో శవాన్ని పడేశారు. నేరం అంగీకరించడంతో నిందితులను కోర్టులో హాజరు పర్చి, రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు. కేసును ఛేదించిన అడిషనల్ ఎస్పీ రాములునాయక్, పరిగి డీఎస్పీ శ్రీనివాస్, సీఐ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్ఐ భరత్‌రెడ్డి, ఇతర సిబ్బందిని ఆమె అభినందించారు. -
సీఎం వ్యాఖ్యలు అభ్యంతరకరం
మీర్‌పేట: రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో రేవంత్‌రెడ్డి హిందూ దేవుళ్లపై అభ్యంతరకర రీతిలో వ్యాఖ్యలు చేయడం శోచనీయమని బీజేపీ మీర్‌పేట కార్పొరేషన్–1, 2 అధ్యక్షులు పసునూరి భిక్షపతిచారి, ముఖేశ్ ముదిరాజ్ అన్నారు. సీఎం వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం మీర్‌పేట ప్రధాన రహదారిపై బీజేపీ నాయకులు ధర్నా చేపట్టి దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇటీవల జూబ్లీహిల్స్ ఉప ఉన్నికల్లోనూ ఓ వర్గంవారి ఓట్ల కోసం ముఖ్యమంత్రి దిగజారి మాట్లాడారని, రాష్ట్రంలోని హిందువులంతా ఏకమై కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. సీఎం అహంకారాన్ని తగ్గించుకుని వెంటనే హిందువులకు క్షమాపణలు చెప్పాలని, లేకపోతే ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ధర్నాలో పార్టీ జిల్లా కౌన్సిల్ సభ్యుడు సోమేశ్వర్, ప్రధాన కార్యదర్శి రవినాయక్, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు రాఘవేందర్‌ముదిరాజ్, నాయకులు మధు, భీంరాజ్, కృష్ణారెడ్డి, ప్రభాకర్, హైందవి, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. క్షమాపణ చెప్పాలని బీజేపీ నేతల డిమాండ్ -
ఎదురెదురుగా బైక్‌ల ఢీ
కొడంగల్ రూరల్: ఎదురెదురుగా వస్తున్న బైక్‌లు ఢీకొని ఓ యువకుడు మృతి చెందిన సంఘటన మున్సిపల్ పరిధిలోని 163 జాతీయ రహదారి బూల్కాపూర్ గేటు సమీపంలో చోటు చేసుకుంది. ఇదే ఘటనలో ఓ దంపతులకు సైతం తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దౌల్తాబాద్ మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన భార్యాభర్తలు కుర్వ దస్తప్ప, రాములమ్మ బుధవారం తమ బైక్‌పై కొడంగల్ పట్టణానికి వ్యక్తిగత పనుల నిమిత్తం వస్తున్నారు. ఈ క్రమంలో కోస్గి పట్టణానికి చెందిన మణికొండ చెన్నయ్య(24) కొడంగల్ పట్టణం నుంచి తన బైక్‌పై వెళ్తున్నాడు. మార్గమధ్యలో బూల్కాపూర్ గేటు సమీపంలో ఎదురుగా బైక్‌లు ఢీకొన్నాయి. దీంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అంబులెన్స్‌కు సమాచారం అందించగా క్షతగాత్రులను కొడంగల్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు చెన్నయ్య మృతిచెందాడని తెలిపారు. దస్తప్ప, రాములమ్మలకు ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. మృతుడు చెన్నయ్యకు ఎనిమిది నెలల క్రితం వివాహం జరిగింది. ఈ ఘటనపై ఫిర్యాదు అందలేదని ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. ● యువకుడి దుర్మరణం ● దంపతులకు తీవ్ర గాయాలు -
ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు
చన్గోముల్ ఎస్ఐ భరత్‌రెడ్డి పూడూరు: ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని చన్గోముల్ ఎస్ఐ భరత్‌రెడ్డి హెచ్చరించారు. బుధవారం నుంచి మండల పరిధిలోని 32 పంచాయతీల్లో మూడో విడత నామినేషన్ల ప్రక్రియ జరుగుతుందన్నారు. నామినేషన్ కేంద్రాల వద్ద గొడవలకు దిగినా, అభ్యర్థులను ఇబ్బందులకు గురి చేసినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. సోషల్ మీడియాల్లో రెచ్చగొట్టేలా విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తే శిక్షార్హులు అవుతారన్నారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించొద్దని విజ్ఞప్తి చేశారు. గృహిణి ఆత్మహత్య మీర్‌పేట: గృహిణి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. విజయవాడ నూజివీడుకు చెందిన ఎం.సురేష్, శబరి (27)లు భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. బతుకుదెరువు కోసం కొన్నేళ్ల క్రితం బడంగ్‌పేట సాయినగర్‌కు వచ్చి నివాసముంటున్నారు. శబరి గృహిణి కాగా, భర్త పహాడీషరీఫ్‌లోని స్కైరూట్ ఏరోస్పేస్ ఇన్ఫినిటీ క్యాంపస్‌లో పనిచేస్తున్నాడు. మంగళవారం భార్యాభర్తల మధ్య చిన్న తగాదా జరిగింది. దీంతో మనస్తాపం చెందిన ఆమె ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చర్చలు సఫలం.. ఏకగ్రీవం విఫలం తాండూరు రూరల్: ఏకగ్రీవం చేయాలని నిర్ణయించిన మండలంలోని చంద్రవంచ గ్రామస్తులకు భంగపాటు తప్పలేదు. గ్రామంలో 1,300 మంది జనాభా, 903 ఓటర్లు, 8 వార్డులున్నాయి. ప్రస్తుతం సర్పంచ్ పదవి జనరల్‌కి వచ్చింది. దీంతో గ్రామ పెద్దలు కూర్చొని ఏకగ్రీవం చేయాలని తీర్మానించారు. ఆలయ నిర్మాణానికి ముందుకు వచ్చిన వ్యక్తిని ఎన్నుకోవాలని నిర్ణయించారు. బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులకు ఉప సర్పంచ్‌తో పాటు వార్డులను కేటాయించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పటేల్ సుదర్శన్‌రెడ్డి సర్పంచ్‌గా ఏకగ్రీవం చేయాలని అనుకున్నారు. 29వ తేదీన ఆయన సర్పంచ్‌గా నామినేషన్ వేశారు. అంతకు ముందే సుదర్శన్‌రెడ్డి అన్న మాణిక్‌రెడ్డి కొడుకు విజయ్‌కుమార్‌రెడ్డి 27వ తేదీన నామినేషన్ దాఖలు చేశారు. అయితే విజయ్‌కుమార్‌రెడ్డి నామినేషన్ విత్‌డ్రా చేసుకుంటే తన బాబాయ్ సుదర్శన్‌రెడ్డి ఏకగ్రీవం అవుతారని గ్రామస్తులు భావించారు. కానీ దానికి ఆయన ఒప్పుకోలేదు. కుటుంబ సభ్యులు, బంధువులు ఎంత చెప్పినా వినలేదు. దీంతో చేసేదేమి లేక ఎన్నికలు జరగనున్నాయి. రాజకీయం కుటుంబాన్ని చీల్చిందని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. 42 వార్డు మెంబర్లు ఏకగ్రీవం ధారూరు: మండల వ్యాప్తంగా 42 వార్డు మెంబర్లు ఏకగ్రీవం అయ్యారు. బుధవారం 10 గ్రామ పంచాయతీల్లో ఒక్కోక్కరే నామినేషన్ వేసినట్లు అధికారులు తెలిపారు. ఇందులో అల్లాపూర్ జీపీలో ఐదుగురు, అవుసుపల్లి, నాగ్సాన్పల్లి జీపీల్లో ఎనిమిది మంది చొప్పున, హరిదాస్‌పల్లి జీపీలో నలుగురు, కొండాపూర్‌ఖుర్దు, రాజాపూర్ జీపీల్లో ఒకరు చొప్పున, కుమ్మర్‌పల్లి, మోమిన్కాలన్ జీపీల్లో ఇద్దరు, మోమిన్‌ఖుర్దు జీపీలో ముగ్గురు, పీసీఎంతండాలో 7 మంది వార్డుమెంబర్లు ఒక్కరే నామినేషన్ వేయడంతో ఏకగ్రీవం అయ్యాయి. కుల ధ్రువీకరణ పత్రం లేక ధారూరు జీపీలోని 12వ వార్డు ఎస్టీ జనరల్‌కు రాగా రాథోడ్ పాండు, రాథోడ్ రమేశ్ నామినేషన్లు వేశారు. రాథోడ్ పాండు దరఖాస్తు ఫారానికి కులం సర్టిఫికేట్ జతచేయలేదు. స్క్రూట్నీలో బయటపడగా రిటర్నింగ్ ఆఫీసర్ పాండుకు అరగంట టైం ఇచ్చి సర్టిఫికేట్ సమర్పించాలని సూచించారు. సకాలంలో అతను పత్రం తీసుకు రాకపోవడంతో తిరస్కరించారు. దీంతో రాథోడ్ రమేశ్ నామినేషన్ మిగిలింది. ఇక అతను ఏకగ్రీవంగా ఎన్నిక అయినట్లే. సైబర్ నేరాలతో మోసపోవద్దు అనంతగిరి: సైబర్ నేరాలతో మోసపోవద్దని వికారాబాద్ డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, డీటీసీ డీఎస్పీ శ్రీనివాస్ యువతకు సూచించారు. ఈ మేరకు బుధవారం విశ్వభారతి డిగ్రీ కళాశాలలో ఫ్రాడ్కా ఫుల్ స్టాప్ కార్యక్రమం నిర్వహించారు. సెల్ఫోన్లలో అనవసరమైన లింకులు ఓపెన్ చేయవద్దని సూచించారు. సైబర్ నేరాలపై వెంటనే 1930కు కాల్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ భీంకుమార్ , కళాశాల ప్రిన్సిపల్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
అనారోగ్యంతో పీఏసీఎస్ డైరెక్టర్ మృతి
ధారూరు: అనారోగ్యంతో ధారూరు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం డైరెక్టర్ పి.రవీందర్ బుధవారం మృతి చెందారు. కొంతకాలంగా ఆయన తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేరకు పీఏసీఎస్ చైర్మన్ సత్యనారాయణరెడ్డి, సోసైటీ సీఈఓ నర్సింహులు, జిల్లా దిశ కమిటీ సభ్యుడు వడ్ల నందు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఆయన మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ప్రజాసేవలో పట్లూరి ఫ్యామిలీ ● అరవై ఏళ్లుగా రాజకీయక్షేత్రంలో ఆ కుటుంబం ● ప్రస్తుత బరిలో మూడోతరం అభ్యర్థిని కేశంపేట: మండలంలోని కొత్తపేటలో ఓ కుటుంబం దాదాపు అరవై ఏళ్లుగా ప్రజలకు రాజకీయ సేవలందిస్తోంది. స్థానిక సంస్థలు ఏర్పాటైన నాటి నుంచి 2006 వరకు పట్లూరి కుటుంబం ప్రజాసేవలో భాగమైంది. గ్రామ మొదటి సర్పంచ్‌గా పట్లూరి శివలింగప్ప ప్రస్థానం ప్రారంభించి పాలనలో తమదైన ముద్ర వేయడంతో ఏళ్లుగా గ్రామస్తులు వారికే పట్టం కట్టారు. 2006 వరకు శివలింగప్ప వారసులు సర్పంచ్‌గా బాధ్యతలు నిర్వహించగా.. ఆ తరువాత రిజర్వేషన్ మారింది. దీంతో ఆ కుటుంబం మద్దతుతో 2006–2011 వరకు గ్రామ సర్పంచ్‌గా వేరే వారు పనిచేశారు. 2011లో మళ్లీ జనరల్ స్థానంలో పోటీ చేసి ఆ కుటుంబ సభ్యుడైన పట్లూరి జగదీశ్వర్ 2016 వరకు గ్రామ సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టారు. తరువాత గ్రామంలోని సమీకరణాల కారణంగా ఐదేళ్లు ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం పట్లూరి జగదీశ్వర్ సతీమణి హైమావతి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. గ్రామస్తుల తీర్పుపై మండలవాసులు ఉత్కంఠగా ఉన్నారు. -
కరన్‘కోటపై’ కాంగ్రెస్ పాగా
● బరినుంచి తప్పుకున్న బీఆర్ఎస్ మద్దతుదారులు ● ‘రాజకుమారుడే’ సర్పంచ్ తాండూరు రూరల్: కరన్‌కోట్ మేజర్ గ్రామ పంచాయతీ ఎట్టకేలకు ఏకగ్రీవమైంది. బీఆర్ఎస్ మద్దతుదారుడు వీణాహేమంత్ చివరి రోజున నామినేషన్‌కు నిరాకరించడంతో, చివరి నిమిషంలో బోయ అశోక్‌కుమార్, ప్రభాకర్‌గౌడ్‌తో నామినేషన్ వేయించారు. బుధవారం వీరు కూడా బరి నుంచి తప్పుకోవడంతో కాంగ్రెస్ మద్దతుదారుడు రాజ్‌కుమార్ యునానిమస్ సర్పంచ్‌గా ఎన్నికై నట్లు ఎంపీడీఓ విశ్వప్రసాద్ తెలిపారు. ఈ మొత్తం ఎపిసోడ్లో స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి చక్రం తిప్పారు. జిల్లాకు చెందిన అధికార పార్టీ పెద్దల సూచనలతో అశోక్, ప్రభాకర్ నామినేషన్లను విత్ డ్రా చేసుకున్నారు. అనంతరం పలువురు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. కరన్‌కోట్‌లో ప్రజాస్వామ్యం కూనీ అయ్యిందన్నారు. అశోక్‌కుమార్‌పై ఒత్తిడి తెచ్చి పోటీ నుంచి తప్పించారని మండిపడ్డారు. పంచాయతీ చరిత్రలో రెండోసారి కరన్‌కోట్ ఏకగీవ్రమైందని స్థానికులు తెలిపారు. గతంలో రాజప్ప యునానిమస్‌గా ఎన్నిక కాగా, ప్రస్తుతం రాజ్‌కుమార్‌ను పదవి వరించిందన్నారు. -
ఆ కుటుంబమంతా ప్రజాప్రతినిధులే
● సింగిల్‌విండో డైరెక్టర్, సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీగా బాధ్యతల నిర్వహణ ● నేడు సర్పంచ్ బరిలోకి.. కడ్తాల్: మండల పరిధిలోని ఎక్వాయిపల్లి గ్రామానికి చెందిన పాలకూర్ల బుగ్గయ్యగౌడ్తో పాటు, ఆయన సతీమణి ఉమావతి, బుగ్గయ్యగౌడ్ సోదరుడు వీరయ్యగౌడ్లు ప్రజా ప్రతినిధులుగా గ్రామానికి, ఉమ్మడి ఆమనగల్లు మండలానికి అనేక రకాలుగా సేవలందించారు. బుగ్గయ్యగౌడ్ 1987లో సింగిల్‌విండో డైరెక్టర్‌గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. అనంతరం 1988లో సర్పంచ్‌గా పనిచేశారు. అనంతరం 1990లో ఆమనగల్లు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్‌గా ఆమనగల్లు, తలకొండపల్లి, మాడ్గుల్ మండలాల రైతాంగానికి సేవలందించారు. అనంతరం 1995లో ఎంపీటీసీగా గెలుపొందారు. దీంతో ఆమనగల్లు ఎంపీపీగా బాధ్యతలు చేపట్టడంతో పాటు, ఉమ్మడి పాలమూరు జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షుడిగా, అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సెల్ కన్వీనర్‌గా సేవలందించారు. బుగ్గయ్యగౌడ్ సతీమణి ఉమావతి కూడా ఎక్వాయిపల్లి ఎంపీటీసీగా 2019లో గెలుపొంది 2024 వరకు గ్రామాభివృద్ధికి సేవలందించారు. బుగ్గయ్యగౌడ్ సోదరుడు వీరయ్యగౌడ్ కూడా 1995లో ఎక్వాయిపల్లి సర్పంచ్‌గా సేవలందించారు. ప్రస్తుతం సర్పంచ్ ఎన్నికల్లో బుగ్గయ్యగౌడ్ పెద్ద కుమారుడు పాలకూర్ల కరుణాకర్‌గౌడ్ ఎక్వాయిపల్లి సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. చిన్న కుమారుడు రవికాంత్‌గౌడ్ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా సేవలందిస్తున్నారు. -
హస్తంలో కారు చిచ్చు!
బషీరాబాద్: కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అయిన బషీరాబాద్‌లో పంచాయతీ ఎన్నికలు వర్గ పోరుకు దారి తీశాయి. మండల కేంద్రం మేజర్ పంచాయతీ కావడంతో సర్పంచ్ పీఠం కోసం అధికార పార్టీ నేతలు వెంకటేష్ మహరాజ్, అజయ్‌ప్రసాద్ కుటుంబం నుంచి అనూప్ప్రసాద్ పోటీలో నిలిచారు. అయితే ప్రధాన పోటీదారు అనుకున్న ప్రతిపక్ష బీఆర్ఎస్ మద్దతుదారు అబ్దుల్ రజాక్ చివరి నిమిషంలో తన నామినేషన్ ఉపసంహరించుకోవడంతో చర్చనీయాంశమైంది. దీంతో బషీరాబాద్ మండల కేంద్రంలో పంచాయతీ ఎన్నిక ఆసక్తికరంగా మారింది. బడా నాయకుల పోటీ మేజర్ గ్రామ పంచాయతీ. మొదట్లో ఇక్కడ సర్పంచ్‌గా పనిచేసిన నాయకులు తాండూరు నుంచి ఎమ్మెల్యేగా, మంత్రులు కూడా అయ్యారు. దీంతో ఈ పంచాయతీకి పోటీ చేయడానికి బడా నేతలు పోటీ పడుతుంటారు. ఈ క్రమంలో ఈసారి బీసీ జనరల్ కావడంతో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన మహరాజుల కుటుంబం నుంచి వెంకటేష్ మహరాజ్, సొసైటీ వైస్ చైర్మన్ అజయ్‌ప్రసాద్ ఇంటి నుంచి అనూప్ ప్రసాద్ ఇద్దరు బరిలో నిలిచారు. బీఆర్ఎస్ మద్దతుతో వేసిన ఆ పార్టీ మైనార్టీ నాయకుడు అబ్దుల్ రజాక్ తన నామినేషన్‌ను బుధవారం ఉపసంహరించుకున్నారు. ఎండీ మహ్మద్ అనే వ్యక్తి ఎంఐఎం మద్దతుతో బరిలోకి దిగారు. అయితే ప్రధాన పోటీ మాత్రం హస్తం పార్టీ నేతల మధ్యే నెలకొంది. చర్చలు విఫలం అంతకు ముందు అనూప్ ప్రసాద్ నామినేషన్ ఉపసంహరించాలని వెంకటేష్ మహరాజు కుటుంబ సభ్యులు, వారి అనుచరులు తాండూరులోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. అజయ్ ప్రసాద్, ఆయన అనుచరులతో జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. ఇద్దరు బలమైన నేతలు కావడంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రెండుగా చీలిపోయారు. ఈ అనూహ్య పరిణామం ఎమ్మెల్యేకు తలనొప్పిగా మారింది. ప్రచారానికి ఎమ్మెల్యే దూరం! కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు నాయకులు బషీరాబాద్ సర్పంచ్‌గా పోటీ చేస్తుండడంతో ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి ప్రచారానికి దూరంగా ఉండాలని భావిస్తున్నారు. పార్టీకి నాయకులతో పాటు కార్యకర్తలు కూడా రెండు వర్గాలుగా చీలిపోవడంతో ఎవరికి మద్దతువ్వకుండా తటస్థంగా ఉండాలని నిర్ణయించారు. మండలంలోని మిగతా గ్రామాల్లో ఈ నెల 5 నుంచి ప్రచారం చేస్తారని ఎమెల్యే క్యాంపు కార్యాలయం తెలిపింది. బషీరాబాద్‌లో రెండుగా చీలిన పార్టీ శ్రేణులు ఇద్దరు హస్తం పార్టీ నేతల మధ్య పోటీ బరి నుంచి తప్పుకొన్న బీఆర్ఎస్ మద్దతుదారు -
దివ్యాంగుల హక్కుల రక్షణకు కృషి
అనంతగిరి: దివ్యాంగులు ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకొని అన్ని రంగాల్లో ముందడుగు వేయాలని జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ కాంక్షించారు. బుధవారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని జిల్లా మహిళా సమాఖ్య సమావేశపు గదిలో నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా అదనపు కలెక్టర్ హాజరై మాట్లాడారు. ఏ ప్రభుత్వమైనా సమాజాభివృద్ధిలో అందరికీ సమాన హక్కులు కల్పించి పరిరక్షించే విధంగా కృషి చేస్తుందన్నారు. అందులో భాగంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం నిర్వహిస్తున్నామన్నారు. రాజ్యాంగ పరంగా ఇచ్చిన హక్కులను సద్వినియోగం చేసుకొని ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం దివ్యాంగులకు హక్కులను కలిపించడంతో పాటు సమాజంలో వారి ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. క్రీడాపోటీల్లో గెలుపొందన దివ్యాంగులకు ప్రశంసాపత్రాలతో పాటు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ అధికారి కృష్ణవేణి, మెప్మా ఇన్చార్జి రవికుమార్, శిశు సంక్షేమ శాఖ సిబ్బంది, దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు. ప్రతిభకు వైకల్యం అడ్డు కాదు దౌల్తాబాద్: అవయవలోపం, వైకల్యం శరీరానికేకానీ వ్యక్తిగత వికాసానికి అడ్డంకి కాదని ఎంఈఓ వెంకట్‌స్వామి అన్నారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని పీఎంశ్రీ పాఠశాలలో ఆట, పాటల పోటీలు నిర్వహించారు. అవయవలోపం ఉన్నవారు ఉన్నత స్థానాలను చేరుకున్నప్పుడే వారికి సమాజంలో గౌరవ ప్రతిష్టలు ఉంటాయన్నారు. గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో హెచ్ఎం వెంకటయ్య, ఉపాధ్యాయులు సాయిలు, శానమ్మ, ప్రభాకర్, చంద్రశేఖర్, ఆనంద్, మొహన్ తదితరులు పాల్గొన్నారు. కేక్ కట్ చేసి సంబురాలు మర్పల్లి: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత, ప్రాథమిక పాఠశాలల్లో బుధవారం దివ్యాంగుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఎంఈఓ అంజిలయ్య ముఖ్య అథితిగా పాల్గొని విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేసి దివ్యాంగులకు తినిపించారు. అనంతరం సహపంక్తి భోజనం ఏర్పాటు చేసి వడ్డించారు. కార్యక్రమంలో ఐఈఆర్పీ ఉమాదేవి, స్పెషల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయుడు లక్ష్మణ్, ఉపాధ్యాయులు, దివ్యాంగులు పాల్గొన్నారు. మనోధైర్యంతో ఉండాలి నవాబుపేట: దివ్యాంగులు మనోధైర్యంతో ముందు కు సాగాలని ఎంఈఓ అబ్దుల్ రెహమాన్ అన్నారు. బుధవారం ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని భవిత కేంద్రంలో దివ్యాంగ పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించారు. అందులో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మల్లేశం, కవిత, ఐఈఆర్పీ మురళి, వీరమణి, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ -
వైభవంగా స్వామివారి కల్యాణోత్సవం
ఆమనగల్లు: తలకొండపల్లి మండలం రాంపూర్ గ్రామంలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో బుధవారం స్వామివారి కల్యాణోత్సవం అత్యంత వైభభవంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయాన్ని పచ్చని తోరణాలు, రంగురంగుల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. ఆలయ ప్రధాన అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో స్వామివారి ఉత్సవ విగ్రహాలను కల్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చారు. అనంతరం ఆలయ చైర్మన్ జిల్లెల పవన్‌కుమార్‌రెడ్డి, ఈఓ స్నేహలతల ఆధ్వర్యంలో స్వామివారి కల్యణ క్రతువును వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్పర్సన్ గీత, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సింహ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు యాదీలాల్, పార్టీ మండల అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, మాజీ సర్పంచ్ శ్యాంసుందర్‌రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు లక్ష్మయ్య, స్వామిగౌడ్, వెంకటయ్య, యాదయ్య, జంగయ్య తదితరులు తదితరులు పాల్గొన్నారు. -
అన్నా తమ్మీ
హలో..షాద్‌నగర్/షాబాద్: పంచాయతీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు అన్ని అస్త్రాలు సంధిస్తున్నారు. వార్డులన్నీ జల్లెడ పడుతున్నారు. కనిపించినవారినల్లా ఆత్మీయంగా పలుకరిస్తున్నారు. ఏకంగా వరుసలు కలిపేస్తూ ఓట్ల గాలం వేస్తున్నారు. కచ్చితంగా తమకు పడే ఓట్లు ఎన్ని.. మిగతా వారు ఎవరు చెబితే వింటారు అన్నదానిపై వాకబు చేస్తున్నారు. ఏ ఒక్క ఓటునూ వదలకూడదని ఓటర్ల జాబితా ముందేసుకుని మరీ ఎక్కడ ఉన్నారో వెతికేస్తున్నారు. చిరునామా, ఫోన్ నంబర్ తెలుసుకునే పనిలో పడ్డారు. గ్రామీణ ప్రాంతాలను వదలి ఉద్యోగాలు, ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాల్లో ఉంటున్న వారికి ఫోన్లు చేసి.. వరుసలు కలిపేసి.. మాటలతో మస్కా కొడుతున్నారు. ఇంతకాలం తాము ఎక్కడ ఉన్నామో.. ఏమైపోయామో కూడా పట్టించుకోని వారు ఒక్కసారిగా ఫోన్లు చేసి ఆప్యాయంగా పలుకరిస్తుండడంతో ఆశ్చర్చపోవడం ఓటర్ల వంతవుతోంది. ఇదీ వలస ప్రతి గ్రామ నుంచి వందల సంఖ్యలో జనం వివిధ పనుల నిమిత్తం వలస పోయారు. ముఖ్యంగా తండావాసులు ముంబైలాంటి ప్రాంతాలకు వెళ్లి కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. ఇక వివిధ ఉద్యోగాల నేపథ్యంలో చాలా మంది హైదరాబాద్‌తోపాటు వివిధ ప్రాంతాలకు ఉపాధి వెతుక్కుంటూ వెళ్లారు. మరోవైపు చాలా మంది తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించుకునేందుకు నగరాలకు వెళ్లారు. ఒక్కో పల్లె నుంచి కనీసం 30 శాతం మంది ఇలా వేరే ప్రాంతాలకు జీవనాన్ని వెతుక్కుంటూ వెళ్లిన వారే. వీళ్ల ఓట్లు మాత్రం ఇప్పటికీ గ్రామాల్లోనే ఉన్నాయి. ఒక్కో గ్రామంలో అభ్యర్థుల గెలుపు, ఓటములను శాసించగలిగే స్థాయిలో బయట ఓట్లు ఉండడంతో చాలామంది అభ్యర్థులు వీటిపై ఫోకస్ పెట్టారు. ఎట్లున్నరు.. అంతా బాగున్నరా.. పంచాయతీ ఎన్నికలల్ల నిలబడ్డ మీ ఆశీస్సులు ఉండాలె వచ్చి ఓటేసి మీవోన్ని గెలిపియ్యాలె వలస ఓట్లకు అభ్యర్థుల గాలం ఫోన్‌చేసి ఆత్మీయ పలకరింపులు హలో.. అన్నా.. నేనే.. గుర్తుపట్టినవా.. బాగున్నావె.. ఎన్ని రోజులైందే కలవక.. వారం రోజుల సంది నిన్ను యాదిజేస్తున్నా.. నా తానున్న నంబర్ కలుస్తలే.. మనోళ్ల దగ్గర అడిగి ఈ నంబర్ తీసుకున్న.. పిల్లలు, మీరంతా మంచిగున్నరా.. ఏంలేదన్నా.. నేను మనూళ్ల సర్పంచ్‌గా నిలబడిన.. నువ్వు, వదిన వచ్చి ఓటెయ్యాలె.. జర యాది మర్చిపోవద్దే.. ఏం తమ్మీ ఎట్లున్నవ్.. మంచిగున్నవా.. అసలు గీమధ్య ఊరి దిక్కే రాకుండా అయినవ్.. ఎప్పుడొస్తావ్.. నీ ఓటు గీడనే ఉన్నది తెలుసు కదా.. ఓటేసేందుకు వస్తున్నావ్ కదా.. తప్పకుండా రావాలె తమ్మీ.. మీ అన్నను గెలిపియ్యాలె.. అక్కా బాగున్నవా.. బావగిన్న మంచిగుండా.. పిల్లలు ఏం సదువుతుండ్రు.. మీ ఈ తమ్ముడు సర్పంచ్‌గా పోటీ చేస్తున్నడు.. మీ ఆశీస్సులుండాలె.. తప్పకుండా అందరూ ఓట్ల రోజు ఊరికి రావాలె.. నీ తమ్ముడిని గెలిపించుకోవాలె.. ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లకు వరుసబెట్టి ఫోన్లు కొడుతున్నారు. ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నిత్యం ఇదో పనిగా పెట్టుకున్నారు. కొందరైతే మరో అడుగు ముందుకేసి నేరుగా వాళ్లు ఉన్నచోటికే వెళ్లి కలిసి కచ్చితంగా గ్రామానికి వచ్చి ఓటు వేయాలని కోరుతూ రవాణా ఖర్చులకోసమంటూ చేతిలో ఎంతోకొంత పైసలు పెట్టి వెళ్తున్నారు. రాష్ట్రాలు దాటి వెళ్లిన వారికి ఆన్లైన్ చెల్లింపులు సైతం చేస్తున్నారు. గ్రామాల్లో ఉన్న పెద్ద మనుషుల ద్వారా చెప్పించడం, నేతల ద్వారా మాట్లాడించడం వంటివి కూడా చేస్తున్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులంతా వరుసగా ఫోన్లు చేస్తుండడంతో ఎవరికి ఓటు వేయాలో అర్థం కాక ఓటర్లు అయోమయంలో పడుతున్నారు. మరి ఎంతమంది గ్రామాలకు వస్తారో.. ఎందరు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారో వేచి చూడాలి. -
గీతతో వ్యక్తిత్వ వికాసం
అనంతగిరి: భగవద్గీత సర్వ మానవాళికి శిరోధార్యమని, ఆచరణాత్మక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన మానవ ధర్మ శాస్త్రమని కాళోజి పురస్కార గ్రహీత గంటా మనోహర్ రెడ్డి అన్నారు. కమలానగర్‌లోని శ్రీమహాలక్ష్మి ఆలయంలో సోమవారం రాత్రి పద్య పదభారతి ఆధ్వర్యంలో నిర్వహించిన గీతా జయంతి కార్యక్రమానికి ఆయన ప్రధాన వక్తగా ప్రసంగించారు. భారతీయ జీవన విధానం సనాతన ధర్మం పై ఆధారపడి కొనసాగిందన్నారు హృదయాంతరంగ ప్రేరణ రామాయణం అని, మేధో మదన భరితం మహాభారతం అని, భగవద్గీత ఉన్నచోట భయానికి, సంశయానికి, అనవసరమైన ఆవేశానికి తావుండదన్నారు. అన్ని సమస్యలకు ఏకై క పరిష్కారం భగవద్గీత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ గౌరవ అధ్యక్షుడు బందప్పగౌడ్, మాజీ కౌన్సిలర్ అనంతరెడ్డి, పద్య పదభారతి ఉపాధ్యక్షుడు విశ్వనాథం, ప్రధాన కార్యదర్శి డాక్టర్ మున్నూరు రాజు, సహకార్యదర్శి సుధాకర్ గౌడ్, కోశాధికారి రెడ్యా రాథోడ్, కార్యవర్గ సభ్యులు శ్రీనివాసాచారి, దివాకర శాస్త్రి, నవీన్, ఉదయరావు, సతీశ్‌గౌడ్, రమేశ్, సుభాష్ రెడ్డి, శ్రీలత రెడ్డి, విజయలక్ష్మి, విజయభాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. కాళోజి పురస్కార గ్రహీత మనోహర్ రెడ్డి -
పకడ్బందీగా నామినేషన్ల ప్రక్రియ
నవాబుపేట: గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని ఎన్నికల సాధారణ పరిశీలకులు షేక్ యాస్మిన్ బాషా పేర్కొన్నారు. మంగళవారం మండల పరిధిలోని నవాబుపేట, ఎక్ మామిడి గ్రామాల్లో నామినేషన్ల ప్రక్రియను పరిశీలించారు. సర్పంచ్, వార్డు స్థానాల నోటిఫికేషన్ వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. నామినేషన్ సెంటర్ల వద్ద హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి అవసరమైన వారికి సహకరించాలన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి తప్పకుండా అమలయ్యేలా చూడాలన్నారు. నిర్ణీత గడువు లోపు నామినేషన్లు స్వీకరించేందుకు టోకెన్లు జారీ చేయాలన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఖర్చుల వివరాలపై అవగాహన కల్పించాలన్నారు. వ్యయ పరిమితిని పక్కాగా లెక్కించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి జయసుధ, డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీఓ వాసుచంద్ర, డిప్యూటీ కలెక్టర్ పూజ, తహసీల్దార్ బుచ్చయ్య, ఎంపీడీఓలు నవీన్‌కుమార్, అనురాధ తదితరులు పాల్గొన్నారు.ఎన్నికల పరిశీలకులు షేక్ యాస్మిన్ బాషా -
కాంక్రీట్ మిల్లర్ లేబర్ సంక్షేమానికి కృషి
చేవెళ్ల: కాంక్రీట్ మిల్లర్ లేబర్ అసోసియేషన్ సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వాకిటి నాగరాజు, ప్రధాన కార్యదర్శి బి.గోపాల్ అన్నారు. మండలకేద్రంలో మంగళవారం కాంక్రీట్ మిల్లర్ లేబర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మిల్లర్ మేసీ్త్రలకు చేయూత కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటీవల అకాల మరణం చెందిన పవన్‌కుమార్ కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. సంఘం మిల్లర్ లేబర్‌కు అండగా ఉంటుందని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని తెలిపారు. ట్రాఫిక్ సీఐ సతీష్ మాట్లాడుతూ.. ప్రతి కార్మికుడికి లేబర్‌కార్డు తప్పనిసరిగా ఉండాలన్నారు. రోడ్డుపైకి వచ్చే కార్మికులు లైసెన్స్‌లు పొంది ఉండాలని, ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచించారు. కార్యక్రమంలో సంఘం సౌత్‌జోన్ ప్రధాన కార్యదర్శి శ్రీరాములు, స్టేట్ జాయింట్ సెక్రెటరీ భరత్‌కుమార్, ఏఐటీయుసీ జిల్లా నాయకులు కె. రామస్వామి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
అల్లర్లు సృష్టిస్తే రూ.లక్ష జరిమానా
తహసీల్దార్ గాయత్రి దౌల్తాబాద్: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మహిపాల్, బీఆర్ఎస్ నాయకులు బాల్‌రాజు, అశోక్‌ను మంగళవారం పోలీసులు తహసీల్దార్ ఎదుట బరైండోవర్ చేశారు. గ్రామాల్లో శాంతిభధ్రతలకు విఘాతం కలిగించేవారిని ఉపేక్షించేదిలేదని తహసీల్దార్ గాయత్రి హెచ్చరించారు. ప్రచారంలో అల్లర్లు, గొడవలు సృష్టించినా అరెస్టుతో పాటు రూ.లక్ష జరిమానా విధిస్తామని తెలిపారు. విద్యుదాఘాతంతో ఎద్దు మృతి దౌల్తాబాద్: విద్యుదాఘాతంతో ఎద్దు మృత్యువాత పడింది. ఈ ఘటన మంగళవారం మండల పరిధిలోని బాలంపేటలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గొల్ల చిన్న ఆశప్ప ఎద్దు గ్రామంలోని మల్లేశ్ పొలంలో మేత మేస్తోంది. ఈ క్రమంలో ట్రాన్స్ఫార్మర్ దగ్గర మేస్తుండగా 11 కేవీ విద్యుత్ లైన్ వైరు తగలడంతో విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఎద్దు విలువ సుమారు రూ.60 వేలు ఉంటుందని ప్రభుత్వమే తనను ఆదుకోవాలని కోరాడు. షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం తాండూరు టౌన్: ఫ్రిడ్జి షార్ట్ సర్క్యూట్ కావడంతో ఓ ఇల్లు దగ్ధమైన సంఘటన తాండూరులో చోటుచేసుకుంది. పట్టణంలోని 36వ వార్డులో చంద్రశేఖర్, స్వరూప అనే వృద్ధ దంపతులు నివాసం ఉంటున్నారు. మంగళవారం తెల్లవారుజామున ఒక్కసారిగా ఇళ్లంతా మంటలు వ్యాపించాయి. పూర్తిగా పొగ కమ్మేయడంతో నిద్రలో ఉన్న దంపతులు లేచి, విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఫ్రిడ్జి షార్ట్ సర్క్యూట్‌తో ఇంట్లోని ఫర్నిచర్, బట్టలకు మంటలు అంటుకున్నాయి. గమనించిన స్థానికులు నీళ్ల పైపు సహాయంతో మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. కొద్ది సేపట్లోనే మంటలను ఆర్పేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇళ్లంతా కాలిపోయిందని, వస్తువులు, బట్టలు పూర్తిగా దగ్ధమయ్యాయని దంపతులు వాపోయారు. పోగొట్టుకున్న 125 ఫోన్ల అందజేత నాగోలు: ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత మూడు నెలల్లో మిస్సైన 125 సెల్ఫోన్లను పోలీసులు గుర్తించి మంగళవారం బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎల్బీనగర్ ఏసీపీ కృష్ణయ్య మాట్లాడుతూ.. బస్సు స్టాప్‌లు, బస్సు ఎక్కుతున్న సమయంలో ప్రయాణం వారాంతపు సంతలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఫోన్లు చోరీకి గురైన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని మొబైల్ బ్యాంక్ యాప్‌లు, ఫోన్ పే, గూగూల్ పే, పేటీఎం నెంబర్ బ్లాక్ చేసుకోవాలని సూచించారు. ఫోన్ల రికవరీ చేయడంతో కీలక పాత్ర పోషించిన ఎల్బీనగర్ సీఐ కే. వినోద్‌కుమార్, డీఐ నాగార్జునరెడ్డి, డీఎస్సై నరేందర్, క్రైమ్ సిబ్బందిని ఏసీపీ అభినందించారు. ఇబ్రహీంపట్నం: ఖానాపూర్ రెవెన్యూ పరిధిలోని గురునానక్ విద్యాసంస్థ వద్ద ప్రభుత్వ భూమిలో (గ్యాప్ ఏరియా)లో అక్రమంగా నిర్మిస్తున్న కట్టడాలను రెవెన్యూ అధికారులు మంగళవారం తెల్లవారుజామున కూల్చివేశారు. ఇబ్రహీంపట్నం తహసీల్దార్ సునీతారెడ్డి ఆదేశానుసారం ఆర్ఐ సువర్ణ, సర్వేయర్ సాయి కృష్ణారెడ్డి, గ్రామపాలన అధికారులు శ్రీనివాస్, రాజు, మణికుమార్, వీఆర్ఏ మహేశ్‌తోపాటు రెవెన్యూ సిబ్బంది జేసీబీ సాయంతో అక్రమ నిర్మాణాలను తొలగించారు. ప్రభుత్వ భూమిలో, గ్యాప్ ఏరియాల్లో ఎవరైనా అక్రమంగా నిర్మాణాలు చేపడితే సహించేదిలేదని తహసీల్దార్ హెచ్చరించారు. -
ధారూరు జీపీలో రాస్నం ఓటర్లు!
● ఆందోళన వ్యక్తంచేస్తున్న స్థానికులు ● ఈసీ, కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని వెల్లడి ధారూరు: ధారూరు గ్రామ పంచాయతీలో దశాబ్దాల కాలంగా దొంగ ఓట్లు రాజ్యమేలుతున్నాయని స్థానికులు మండిపడ్డారు. ఈ విషయమై అన్ని ఆధారాలతో ఎన్నికల సంఘంతో పాటు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.. ధారూరు జీపీలోని రెండో వార్డులో యాలాల మండలం రాస్నం గ్రామానికి చెందిన 21 మంది పేర్లు నమోదై ఉన్నాయి. పదేళ్లుగా ఇవి ఇలాగే కొనసాగుతున్నాయి. వీరిని ఎవరు చేర్చారో అర్థంకాక రాజకీయ పార్టీల నేతలు తల పట్టుకుంటున్నారు. గతంలో జరిగిన గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ధారూరుకు వచ్చిన వీరు యథేచ్ఛగా ఓటు వేసి వెళ్లారని పలువురు కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. వీరి వేసిన ఓట్లు వార్డు సభ్యుడితో పాటు సర్పంచ్ అభ్యర్థుల గెలుపోటములను తారుమారు చేశాయన్నారు. ఈ విషయమై తహసీల్దార్ సాజిదాబేగంను వివరణ కోరగా విషయం తన దృష్టికి కూడా వచ్చిందని తెలిపారు. రాత పూర్వకంగా ఫిర్యాదు వస్తే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. -
లోటుపాట్లు లేకుండా చూడండి
● ఎన్నికల నిర్వహణను సమర్థంగా పూర్తి చేయాలి ● జెడ్పీ సీఈవో కృష్ణారెడ్డిఇబ్రహీంపట్నం: పంచాయతీ ఎన్నికల నిర్వహణను సమర్థవంతంగా పూర్తి చేయాలని, ఎలాంటి లోటుపాట్లు లేకుండా అప్రమత్తంగా ఉండాలని జెడ్పీ సీఈవో కృష్ణారెడ్డి సూచించారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని మంగళవారం సందర్శించి బ్యాలెట్ బాక్స్‌లు, ఎన్నికల సామగ్రిని పరిశీలించారు. అనంతరం ఎన్నికల రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు సజావుగా సాగేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలన్నారు. ఏవైనా లోటుపాట్లు ఉంటే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తేవాలన్నారు. మూడో విడత ఎన్నికలకు బుధవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభంకానున్న నేపథ్యంలో ఆయా క్లస్టర్స్ వద్ద ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూసుకోవాలన్నారు. అనంతరం ఆర్ఓలకు ఎన్నికల సామగ్రిని అందజేశారు. కార్యక్రమంలో మండల స్పెషలాఫీసర్ నవీన్‌కుమార్‌రెడ్డి, ఎంపీడీఓ వెంకటమ్మ, ఎంపీఓ ఉషాకిరణ్, సూపరింటెండెంట్ యెల్లంకి జంగయ్యగౌడ్, ఎస్ఐ చందర్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
ఏకగ్రీవ పంచాయతీలకు రూ.20లక్షలు
కుల్కచర్ల: గ్రామాన్ని అభివృద్ధి చేసే అభ్యర్థిని ఏకగ్రీవం చేసుకోవాలని డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి, ఏఎంసీ చైర్మన్ ఆంజనేయులు, బ్లాక్‌బీ అధ్యక్షుడు భరత్‌కుమార్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని బోట్యానాయక్ తండా పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా సంతోష్‌నాయక్, వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ప్రకటించారు. కాగా ఇక్కడ నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభంకానుంది. అనంతరం పార్టీ నేతలను కలిశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి పరిగి ఎమ్మేల్యే రామ్మోహన్‌రెడ్డి తన సొంత నిధుల నుంచి రూ.20లక్షలు ఏకగ్రీవ గ్రామపంచాయతీలకు ఇవ్వనున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి గోపాల్ నాయక్, సంతోశ్ నాయక్, రమేశ్, తదితరులు పాల్గొన్నారు.డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి -
ఫ్యూచర్లో పనికొస్తుందని!
యాచారం: గ్రామ ప్రథమ పౌరుడిగా పేరొందిన సర్పంచ్ పోస్టుకు తీవ్ర పోటీ నెలకొంది. గతంలో ఉన్నత పదువులు అనుభవించినా సరే.. ప్రస్తుతం రిజర్వేషన్ కలిసొచ్చిన వారు తిరిగి సర్పంచ్ పీఠంపై కూర్చునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఖర్చుకు వెనకాడకుండా పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. రాజకీయ పార్టీల మద్దతు లేకపోయిన సరే స్వతంత్ర అభ్యర్థిగానైనా పోటీలో ఉండేందుకు సిద్ధమవుతున్నారు. యాచారం, మంచాల, కందుకూరు, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, కడ్తాల్, మహేశ్వరం తదితర మండలాల్లో ఫ్యూచర్ సిటీ ఏర్పాటు కానుండటంతో భవిష్యత్తులో సర్పంచ్ పోస్టు కీలకమవుతుందనే ఉద్దేశంతో పోటీకి సై అంటున్నారు. మిగిలిన గ్రామాల్లోనూ.. పెద్ద పదవులు చేసిన సీనియర్ నాయకులు సైతం సర్పంచ్ పోటీకి మొగ్గు చూపుతున్నారు. ఎంపీపీగా బాధ్యతలు నిర్వర్తించి.. యాచారం గ్రామానికి చెందిన కొప్పు సుకన్య మొన్నటి వరకు యాచారం మండల పరిషత్ అధ్యక్షురాలిగా(బీజేపీ నుంచి) ఐదేళ్లు పదవిలో కొనసాగారు. తాజా రిజర్వేషన్లల్లో యాచారం జీపీ ఎస్సీ మహిళకు కేటాయించడంతో తిరిగి సర్పంచ్‌గా పోటీకి ఆసక్తి చూపుతున్నారు. బుధవారం నామినేషన్ వేసేందుకు రెడీ అవుతున్నారు. పీఏసీఎస్ చైర్మన్‌గా ఉంటూనే.. గునుగల్‌కు చెందిన తోటిరెడ్డి రాజేందర్‌రెడ్డి యాచారం పీఏసీఎస్ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. గునుగల్ పంచాయతీ జనరల్ రిజర్వేషన్ రావడంతో బీఆర్ఎస్ మద్దతుదారుడిగా బరిలో ఉండేందుకు డిసైడయ్యారు. బుధవారం నామినేషన్ దాఖలు చేస్తానన్నట్లు తెలిపారు. వైస్ చైర్మన్ సైతం.. మంతన్‌గౌరెల్లికి చెందిన కారింగ్ యాదయ్యగౌడ్ యాచారం పీఏసీఎస్ వైస్ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో రిజర్వేషన్ కలిసివచ్చిందని, పోటీకి సై అంటున్నారు. ఉన్నత పదవులు చేపట్టినా.. మళ్లీ సర్పంచ్‌పై కన్ను రిజర్వేషన్లు కలిసి రావడంతో పోటీకి సిద్ధమవుతున్న నేతలు ఫ్యూచర్‌సిటీ గ్రామాల్లో ప్రథమ పౌరుడి పదవికి భలే క్రేజ్ -
అంతర్జాతీయ సైన్స్ వేడుకకు దాదాపూర్ ఉపాధ్యాయుడు
దోమ: అంతర్జాతీయ సైన్స్ వేడుకలకు దాదాపూర్ జీవశాస్త్ర ఉపాధ్యాయుడు శాంతుకుమార్ ఎంపికయ్యారు. అంతర్జాతీయ వేడుకకు రెండోసారి ఎంపికవ్వడంతో ఆయన్ను ఉపాధ్యాయులు అభినందించారు. బోధన అనుభవం, వినూత్న బోధన పద్ధతుల ఉపయోగం, ప్రయోగాల నిర్వహణ, పాఠశాలలో జరిగే వివిధ కార్యక్రమాలు, విద్యార్థుల విజ్ఞాన ప్రదర్శనతో పాటు తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ నెల 6వ తేదీ నుంచి 9వ తేదీ వరకు చండీగఢ్‌లో నిర్వహించనున్న అంతర్జాతీయ సైన్స్ వేడుకలకు ఆయన్ను ఎంపిక చేశారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అనంతగిరి: తెలంగాణ తొలిదశ ఉద్యమసారథి మర్రి చెన్నారెడ్డి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన వేసిన ముద్ర చెరగనిదని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మంగళవారం చెన్నారెడ్డి వర్ధంతి సందర్భంగా వికారాబాద్‌లో ఆయన విగ్రహానికి పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు అభిమానులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, ఎస్ఏపీ కళాశాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ప్రాథమిక ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మురళీధర్‌గౌడ్ పరిగి: ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులను స్కూల్ అసిస్టెంట్ స్థాయికంటే ఎక్కువ స్థాయిలో ఎన్నికల విధుల్లో నియమించాలని ప్రాథమిక ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మురళీధర్‌గౌడ్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు తాను నిరంతరం కృషి చేస్తున్నానన్నారు. ప్రాథమిక పాఠశాలల్లో ఎఫ్ఎల్ఎస్ కార్యక్రమాన్ని పరిశీలించడానికి పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులచే టీంలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఆనంద్‌కుమార్, రాష్ట్ర నాయకులు ఉస్మాన్ అలీ, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ అనంతగిరి: సీఐటీయూ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ అన్నారు. ఈ నెల 7 నుంచి 9వ తేదీ వరకు మెదక్ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న సభలకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను మంగళవారం సీఐటీయూ సంఘం నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. కార్మికుల సమస్యల పరిష్కారంలో సీఐటీయూ ముందుంటుందన్నారు. జిల్లా నుంచి పెద్ద ఎత్తున కార్మికులు హాజరై సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా కోశాధికారి చంద్రయ్య, ఉపాధ్యక్షురాలు నర్సమ్మ, మైపాల్, సుదర్శన్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. -
అవకతవకలకు పాల్పడితే చర్యలు
పరిగి: కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు పంపాలని అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ సూచించారు. మంగళవారం ఆయన మండల పరిధిలోని సుల్తాన్పూర్, గడిసింగాపూర్, రంగంపల్లి గ్రామాల్లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సెంటర్లలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాలన్నారు. అవకతవకలకు పాల్పడే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులు పండించిన ప్రతీ గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా నిత్యం గన్నీ బస్తాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రతి రోజు లారీలు అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులకు సూచించారు. రైతులు ధాన్యం విక్రయించిన వారం గడువులోపు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని చెప్పారు. దళారులను నమ్మి రైతులు మోసపోద్దని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలన్నారు. అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ -
బరిలో మిగిలేదెవరో!
షాద్‌నగర్: డిసెంబర్ 3.. సరిగ్గా 3 గంటల సమయం.. అప్పటిదాకా ఆలోచించుకోవాల్సిన తరుణం.. బరిలో ఉంటారా.. తప్పుకొంటారా.. తొలి విడత పంచాయతీ ఎన్నికల ఉపసంహరణకు బుధవారం మూడు గంటలలోపు గడువు ముగియనుంది. పోటీలో తమకు అడ్డుగా ఉన్న వారిని తప్పించే ఆఖరి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అందరిలో ఉత్కంఠ షాద్‌నగర్ పరిధిలోని కొత్తూరు, నందిగామ, ఫరూఖ్‌నగర్, కేశంపేట, కొందుర్గు, జిల్లేడు చౌదరిగూడ, రాజేంద్రనగర్ పరిధిలోని శంషాబాద్ మండలాల్లో తొలివిడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, అప్పీళ్ల పర్వం ముగిసింది. బరిలో నిలిచే అభ్యర్థులెవరో.. తప్పుకొనేదెవరో బుధవారంతో తేలిపోనుంది. సర్పంచ్, వార్డులకు ఎవరు బరిలో నిలుస్తారోనని అందరిలో ఉత్కంఠ నెలకొంది. పెరుగుతున్న ఒత్తిడి రెబల్స్‌గా బరిలో దిగిన వారిని నామినేషన్లు ఉపసంహరించుకోవాలని ఆయా పార్టీల నేతలు ఒత్తిడి చేస్తున్నారు. తాయిలాలు ఇచ్చి పోటీ నుంచి తప్పించేందుకు చివరి ప్రయత్నాలు సాగిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో ప్రత్యర్థులను తప్పించి ఏకగ్రీవం చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తెలుగు అక్షర క్రమంలో గుర్తుల కేటాయింపు మధ్యాహ్నం 3 గంటల తర్వాత బరిలో నిలిచిన అభ్యర్థులను అధికారులు ప్రకటించనున్నారు. వెంటనే వారికి గుర్తులను కేటాయిస్తారు. రాజకీయ పార్టీల గుర్తులు లేకుండా ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో అభ్యర్థుల పేర్లలో తెలుగు అక్షర క్రమంలో గుర్తులు కేటాయింపు ఉండనుంది. నామినేషన్ పత్రాల్లో పేర్లు ఎలా రాసారో అలాగే తెలుగు అక్షరాల క్రమాన్ని గుర్తిస్తారు. కొందరు తమ ఇంటి పేరును ముందుగా, మరికొందరు చివరగా రాస్తారు. ఏ పేరు ముందు ఉంటుందో దాని తెలుగు అక్షరం ఆధారంగా గుర్తులు కేటాయిస్తారు. నిలిచేదెవరో.. తప్పుకొనేదెవరో కీలక ఘట్టానికి చేరిన తొలి విడత ఎన్నికలు నేటితో ముగియనున్న నామినేషన్లల ఉపసంహరణ తేలిపోనున్న ఫైనల్ అభ్యర్థుల జాబితాగ్రామ పంచాయతీలు 174 , వార్డులు 1,530 సర్పంచ్ కోసం దాఖలైన నామినేషన్లు – 846 వార్డు కోసం దాఖలైన నామినేషన్లు – 4,123 -
కొత్త అకౌంట్ నుంచే లావాదేవీలు
అనంతగిరి: ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు షేక్ యాస్మిన్ బాష అన్నారు. మంగళవారం ఆమె వికారాబాద్ మండల పరిధిలోని సిద్దులూర్‌లో నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. సర్పంచ్, వార్డు స్థానాల ఎన్నికకు జారీ చేసిన నోటిఫికేషన్ వివరాలు క్షుణ్ణంగా పరిశీలించారు. పొరపాట్లకు తావులేకుండా ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించాలని సూచించారు. నామినేషన్ సెంటర్ వద్ద హెల్ప్ డెస్క్‌ను పరిశీలించారు. గడువు లోపు నామినేషన్లు స్వీకరించేందుకు టోకెన్లు జారీ చేయాలని అధికారులకు సూచించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఖర్చుల వివరాలపై అవగాహన కల్పించాలన్నారు. వ్యయ పరిమితిని పక్కాగా లెక్కించేలా తగు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కొత్త బ్యాంకు అకౌంట్ ద్వారానే ఎన్నికల లావాదేవీలు నిర్వహించాల్సి ఉంటుందని వివరించారు. అనంతరం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్‌రూంను పరిశీలించారు. ఆమె వెంట జిల్లా పంచాయతీ అధికారి జయసుధ, డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీఓ వాసుచంద్ర, డిప్యూటీ కలెక్టర్ పూజ, ఎంపీడీఓ వినయ్ కుమార్, సీఐ భీంకుమార్ క్లస్టర్ పంచాయతీ సెక్రటరీ ప్రసన్న కుమార్ అధికారులు, తదితరులు ఉన్నారు. జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు షేక్ యాస్మిన్ బాష -
డీసీసీ అధ్యక్షుడికి నియామకపత్రం
తాండూరు: కాంగ్రెస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ధారాసింగ్ జాదవ్ మంగళవారం నియామకపత్రం అందుకున్నారు. మంగళవారం గాంధీ భవన్లో పీసీసీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. సమావేశం ముగిసిన అనంతరం ఏఐసీసీ తెలంగాణ ఇన్చార్జి మీనాక్షినాటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ ఆయనకు నియామక పత్రం అందజేశారు. తనపై నమ్మకంతో జిల్లా అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చిన అగ్రనేతలకు ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా పనిచేస్తానన్నారు. అనంతగిరి: వికారాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం మంగళవారం బాధ్యతలు చేపట్టింది. మార్కెట్ కమిటీ చైర్మన్‌గా చాపల శ్రీనివాస్ ముదిరాజుతో పాటు వైస్‌చైర్మన్‌గా మల్లేశం, సభ్యులుగా పాపిరెడ్డి, రమేశ్, రాజు, అర్చన, భీమయ్య, విజేందర్‌రెడ్డి, పాండురంగారెడ్డి, నాగిరెడ్డి, రంగారెడ్డి, ప్రభాకర్, నర్సింలు, సురేందర్‌లు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం వారు అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్‌కుమార్‌ను వికారాబాద్‌లోని ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. రైతుల సంక్షేమానికి కృషి చేస్తానన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, ఆర్టీఏ సభ్యుడు ఎర్రవల్లి జాఫర్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మైపాల్‌రెడ్డి, ముత్తాహర్షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. -
ఒక్కటే నామినేషన్.. వారే సర్పంచ్
మోమిన్‌పేట: మండల పరిధిలోని మూడు గ్రామ పంచాయితీల సర్పంచ్, వార్డు సభ్యులు ఎకగ్రీవంగా ఎన్నికయ్యారు. 29 పంచాయితీల్లో నామినేషన్ల చివరి రోజు మంగళవారం మూడు పంచాయితీలకు ఒకే నామినేషన్ దాఖలయ్యాయి. చీమల్‌ధరి జనరల్ (మహిళ)కు రిజర్వు కాగా ఎల్లకొండ కల్పనా రెడ్డి, చిన్న కోల్కుంద బీసీ(మహిళ)కు రిజర్వు కాగా బాషెట్టి విశాల, అంరాధి కుర్దు జనరల్ రిజర్వు కాగా పురుషోత్తంరెడ్డి సర్పంచ్, వార్డు సభ్యులకు ఒక్కొక్కరు మాత్రమే నామినేషన్ వేయడంతో ఎకగ్రీవం లాంఛనమైంది. అవుసుపల్లి, పీసీఎం తండా, నాగ్సాన్పల్లిలో.. ధారూరు: మండల పరిధిలోని మూడు పంచాయతీల్లో సర్పంచులు ఏకగ్రీవం కానున్నట్లు తెలిసింది. నామినేషన్ల చివరి రోజు వరకు అవుసుపల్లి నుంచి మహేష్‌యాదవ్, పీసీఎంతండా జీపీలో బాలునాయక్, నాగ్సాన్పల్లి పంచాయతీకి పాశం సత్యనారాయణ ఒక్కొక్కరే నామినేషన్లు వేశారు. కొండాపూర్‌ఖుర్దు జీపీ ముందుగా ఏకగ్రీవం రూ.6.50 లక్షలకు కాగా ఆర్మీ రిటైర్డ్ ఉద్యోగి ఒకరు రూ.15లక్షలు ఇస్తానని ముందుకు రావడంతో ఏకగ్రీవం కాస్తా పోటీకి సిద్దమైనట్లు తెలిసింది. మహేష్‌యాదవ్, అవుసుపల్లి ఎల్లకొండ కల్పనారెడ్డి, చీమల్‌ధరి బాలునాయక్, పీసీఎం తండా బాషెట్టి విశాల, చిన్న కోల్కుంద సత్యనారాయణ, నాగ్సాన్పల్లిపురుషోత్తంరెడ్డి, అంరాధి కుర్దురెండు మండలాల్లో ఆరు పంచాయతీలు యునానిమస్ -
ఏకగ్రీవాలకు నై!
పోటీకి సై..పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. రెండు విడతల నామినేషన్లు పూర్తవడంతో ఎన్నికల వేడి రాజుకుంది. బరిలో ఉన్నవారిని తప్పించేందుకు శరవేగంగా పావులు కదుపుతున్నారు. విత్‌డ్రా అయితే పరువుపోతుందని ఒకరు.. తప్పుకొంటే భవిష్యత్‌లో మంచి పొజిషన్లో ఉంటావంటూ బుజ్జగింపులు కొనసాగుతున్నాయి. వికారాబాద్: పంచాయతీ ఎన్నికల్లో తొలి రెండు విడత ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఘట్టం పూర్తయింది. మొదటి విడతలో ఎనిమిది మండలాల పరిధిలో 262 పంచాయతీలకు ఎన్నికలు జరగనుండగా సర్పంచ్ స్థానాలకు 1,384 నామినేషన్లు దాఖలయ్యాయి. 2,198 వార్డు స్థానాలకు 4,379 మంది అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు. ఇప్పటికే 18 పంచాయతీలు ఏకగ్రీవం అవగా నేటి ఉపసంహరణలతో సంఖ్య పెరిగే అవకాశం ఉండనుందని పలువురు చర్చించుకుంటున్నారు. సాధ్యమైనంతగా పంచాయతీలను ఏకగ్రీవం చేసుకోవాలని అధికార పార్టీ పెద్దలు సూచించడంతో ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ పరిధిలో ఏకగ్రీవం చేసేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఆశావహులు ఎక్కువగా ఉండడంతో వారు పోటీకే సై అంటున్నారు. నేడు రెండో విడత స్క్రూటినీ రెండో విడతలో 175 పంచాయతీలకు మంగళవారంతో నామినేషన్ల గడువుగా ముగియగా బుధవారం వీటిని పరిశీలించనున్నారు. 6వ తేదీ వరకు ఉపసంహరణ గడువు ఉంది. అదే రోజు తుదిజాబితా ప్రకటించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు సైతం నేటితో ముగియనుండటంతో అభ్యర్థులు ఇక పూర్తిస్థాయిలో ప్రచారానికి తెరలేవనుంది. మహిళా రిజర్వేషన్లు ఉన్న చోట ఆశావహులు తమ సతులను పోటీకి దించుతున్నారు. జనరల్ స్థానాల్లో పోటీ అనివార్యం 2019లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించగా పాలక వర్గాల పదవీ కాలం ముగిసి రెండేళ్లు కావస్తోంది. ఈ నేపథ్యంలో రెండేళ్లుగా ఎదురుచూస్తున్న ఆశావహుల సంఖ్య పెరిగింది. వార్డులకు పోటీ తక్కువగానే కనిపిస్తుంది. మొదటి విడత జీపీల్లో ఒకటి నిష్పత్తి రెండు నామినేషన్లు అంటే ఒక వార్డు స్థానానికి సగటున ఇద్దరు నామినేషన్ దాఖలు చేశారు. సర్పంచ్ పదవులకు పోటీ ఎక్కువగా కనిపిస్తోంది. ఒక సర్పంచ్ స్థానానికి ఇద్దరు నుంచి ఐదుగరు చొప్పున పోటీలో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లా హస్తగతమవడంతో ఆ ప్రభావం ఈ ఎన్నికలపై స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు జరిగిన ఏకగ్రీవాల్లో మెజార్టీ అధికార పార్టీ మద్దతుదారులే కావడం గమనార్హం. జిల్లాలో అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకుల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామనగా కోర్టు తీర్పుతో కొంత గందరగోళ పరిస్థితి తలెత్తినపట్పికీ పార్టీలు దాని నుంచి తేరుకుని పోటీకి సై అంటున్నాయి. వంద శాతం ఎస్టీ రిజర్వుడు తండాలు, చిన్న పంచాయతీల్లోనే ప్రజలు ఏకగ్రీవ చర్చలు జరుపుతున్నా.. జనరల్ స్థానాలలో మాత్రం పోటీ అనివార్యంగా కనిపిస్తోంది. ముగిసిన రెండు విడతల నామినేషన్లు నేటి నుంచి మూడోవిడత యునానిమస్ చేసేందుకు ఎమ్మెల్యేల యత్నం ససేమిరా అంటున్న ఆశావహులు జనరల్ స్థానాల్లో పోటీ తీవ్రం మొదటి విడతలో తాండూరు సెగ్మెంట్లోని నాలుగు మండలాలు, కొడంగల్‌లోని నాలుగు మండలాల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. సాధ్యమైనంతవరకు పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు అధికంగా చేయాలని ఆపార్టీ ఎమ్మెల్యేలకు దిశానిర్ధేశం చేయడంతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. మొదటి విడత ఎన్నికలు జరుగుతున్న సెగ్మెంట్లతో పాటు వికారాబాద్, పరిగి ఎమ్మెల్యేలు సైతం పార్టీ సానుభూతిపరులను సర్పంచులుగా ఏకగ్రీవం చేసేందుకు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. నియోజకవర్గ, మండల కేంద్రానికి ముఖ్య నాయకులను, గ్రామ పెద్దలను పిలిచి చర్చలు జరుపుతున్నారు. క్షేత్ర స్థాయిలో మాత్రం పరిస్థితులు వారి ఆలోచనలకు భిన్నంగా కనిపిస్తున్నాయి. పోటీ అనివార్యమైతే తమ పార్టీ సానుభూతిపరులను గెలిపించుకునేందుకు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ప్రయత్నాలు ప్రారంభించారు. జనరల్, బీసీ స్థానాలలో ఏకగ్రీవ ప్రయత్నాలు ఫలించిన దాఖలాలు కనిపించడం లేదు. చాలా ఏళ్ల తరువాత తమ కేటగిరీకి రిజర్వేషన్ వచ్చిందని, పోటీకి చేస్తామంటున్న తమకు ఏకగ్రీవాల పేరుతో అడ్డుకోవద్దని ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలను ఆశావహులు వేడుకుంటున్నారు. కొన్ని గ్రామాలలో అధికారపార్టీ నుంచే ఇద్దరు నుంచి ఐదుగురు వరకు నామినేషన్లు వేస్తున్నారు. వారికి సర్ధిచెప్పేందుకు ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్నారు. ఎవరిని వద్దనాలో.. ఎవరికి మద్దతివ్వాలో తేల్చుకోలేక సతమతమవుతున్నారు. బీఆర్ఎస్ పార్టీకి జిల్లాలో ఒక్క ఎమ్మెల్యే కూడా లేకపోవడం ఎన్నికల్లో ఆ లోటు కనిపిస్తుంది. -
అవగాహనతోనే సైబర్ నేరాలకు చెక్
అనంతగిరి: సైబర్ నేరాలపై ప్రతీ ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ మెహ్రా అన్నారు. మంగళవారం ఆమె వికారాబాద్‌లోని తన కార్యాలయ ఆవరణలో ఫ్రాడ్ కా పుల్‌స్టాప్ కార్యక్రమానికి సంబంధించిన వాల్‌పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ స్నేహ మెహ్రా మాట్లాడుతూ.. ప్రజలకు అవగాహన కల్పించేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో ఫ్రాడ్ కా పుల్సా్ట్ప్ పేరిట 42 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మంగళవారం నుంచి జనవరి 12 వరకు ప్రతీ వారం ఒక ప్రత్యేక థీమ్‌తో అవగాహన కార్యక్రమాలు చేపపడతామన్నారు. అవగాహనతోనే సైబర్ నేరాలు తగ్గించడం సాధ్యమన్నారు. ఎవరైనా సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని, ఎన్సీఆర్పీ పోర్టల్‌లో ఫిర్యాదు చేస్తే సంబంధిత పోలీస్ స్టేషన్ తక్షణ చర్యలు తీసుకుంటుందన్నారు. కార్యక్రమంలో భాగంగా కళాశాల విద్యార్థులకు ఆన్లైన్ జూమ్ మీటింగ్ ద్వారా సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. అనంతరం సైబర్ నేరాలతో మోసపోవద్దని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ రాములునాయక్, డీసీఆర్బీ డీఎస్పీ జానయ్య, కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సమస్యాత్మక కేంద్రాలపై స్పెషల్ ఫోకస్ నవాబుపేట: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక గ్రామాలు, కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా తెలిపారు. మంగళవారం ఆమె నవాబుపేట పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్ రికార్డులు, ఆవరణ తదితరాలు పరిశీలించారు. అనంతరం ఎక్‌మామిడిలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని ఆదేశించారు. విధుల్లో పాల్గొనే ప్రతీ పోలీస్ అధికారి, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. తమకు కేటాయించిన పోలింగ్ లొకేషన్ల యొక్క భౌగోళిక పరిస్థితులు, గత ఎన్నికల చరిత్ర, అక్కడ ఉన్న సున్నితమైన అంశాల గురించి ప్రతి ఒక్కరూ పూర్తి అవగాహన కలిగి ఉండాలని స్పష్టం చేశారు. రెవెన్యూ ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ, టీమ్ వర్క్‌తో పని చేయాలని, ఎక్కడా చిన్న పొరపాటు జరగకుండా విధి నిర్వహణలో బాధ్యతగా ఉండాలని సిబ్బందిని ఆదేశించారు. ఆమె వెంట మోమిన్‌పేట సర్కిల్ సీఐ వెంకట్, ఎస్ఐ పుండ్లిక్, సిబ్బంది తదితరులు ఉన్నారు. మోమిన్‌పేట: పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని ఎస్పీ స్నేహ మిశ్రా అన్నారు. మంగళవారం ఆమె మోమిన్‌పేట ఠాణా, ఎంపీడీఓ, కార్యాలయాలను సందర్శించారు. పంచాయతీ కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు. వార్డు సభ్యుడిగా నామినేషన్ వేసేందుకు వచ్చిన అభ్యర్థి అడివయ్యను అడిగి సెంటర్లో వసతులపై ఆరాతీశారు. ఎంపీడీఓ సృజన సాహిత్యతో బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు, బందోబస్తు తదితర అంశాలపై మాట్లాడారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని ఓ కంట కనిపెట్టాలని సూచించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రతీ పోలీస్ అధికారి, సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. ఆమె వెంట సీఐ వెంకట్, ఎస్ఐ అరవింద్ తదితరులు ఉన్నారు. ఎస్పీ స్నేహ మెహ్రా -
బుజ్జగించి.. తప్పించి
పంచాయతీ ఎన్నికల్లో మొదటి ఘట్టమైన తొలివిడత నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. రెండో విడత ప్రారంభమైంది. ఇక మిగిలింది తిరస్కరణ. బుజ్జగింపుల పర్వంతో పోరు రసవత్తరంగా..తీరు ఆకస్తికరంగా మారింది. కొడంగల్/బషీరాబాద్: పల్లెపోరుకు రసవత్తర పోటీ నెలకొంది. పథమ పౌరుడి కుర్చీ కోసం అభ్యర్థులు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. బషీరాబాద్ మండలంలోని 39 పంచాయతీలకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు బలపర్చిన వారితో పాటు, ఆశావహులు 208 మంది సర్పంచులకు, 312 వార్డులకు 616 నామినేషన్లు వేశారు. అయితే స్క్రూట్నిలో సరైన పత్రాలు లేని సర్పంచుకు 13, వార్డుల 10 పత్రాలను క్లస్టర్ రిటర్నింగ్ అధికారులు తిరస్కరించగా.. 195 సర్పంచ్, 606 వార్డు నామినేషన్లు మిగిలాయి. కాగా.. సోమవారం 10 మంది అభ్యర్థులు సబ్ కలెక్టర్‌కు అప్పీల్ చేసుకోగా.. అక్కడ కూడా వారికి నిరాశే ఎదురయింది. కాగా మంతన్గౌడ్లోని 6వ వార్డులో అభ్యర్థి వయసు 21 ఏళ్లలోపు ఉండటంతో నామినేషన్‌ను తిరస్కరించారు. కొర్విచెడ్ 4వ వార్డులో ఒక్కరు కూడా నామినేషన్ వేయలేదు. ఈ రెండు వార్డులకు మరోసారి నోటిపికేషన్ ఇచ్చి ఎన్నికలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. చెక్‘పవర్’ కోసం.. రిజర్వేషన్లు అనుకూలంగా రాని ఆశావహులు.. వార్డు సభ్యులుగా బరిలోకి దిగుతున్నారు. ఉపసర్పంచ్‌కి హామీ ఇస్తేనే తమ మద్దతు ఉంటుందని ముందస్తుగా ఒప్పందం చేసుకుంటున్నారు. బషీరాబాద్ మండలంలో ఏకగ్రీవం అయిన మూడు జీపీల్లో.. ఉప సర్పంచులను సైతం ముందే తేల్చేశారు. ఉప సర్పంచ్‌కు ఉండే చెక్‘పవర్’తో చక్రం తిప్పొచ్చని లీడర్లు పోటీ పడుతున్నారు. ఏకగ్రీవం.. బేరసారాలు నామినేషన్ల స్క్రూట్ని సోమవారం ముగియడంతో పోటీగా నిలిచిన అభ్యర్థులతో నాయకులు రాయబారాలు, బేరసారాలు నడుపుతున్నారు. ముఖ్యంగా చిన్న గ్రామాల్లో ఏకగ్రీవం కోసం. అధికార పార్టీలో మండల స్థాయి నాయకులు.. పత్రాల ఉపసంహరణ కోసం వారికి నామినేటెడ్ డైరెక్టర్ల పదవులు ఆశచూపుతున్నారు. ఆర్థికంగా బలంగా ఉన్న అభ్యర్థులు తెరవెనుక కొనుగోళ్లు ముమ్మరం చేస్తున్నారు. రేపు నామినేషన్ల ఉపసంహరణఉండడంతో.. పోటీదారులను మచ్చిక చేసుకొని బరినుంచి తప్పించడానికి బలమైన అభ్యర్థులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మండలంలోని పలు పంచాయతీలు ఏకగ్రీవం బాటలో చర్చలు సాగుతున్నాయి. మాట వింటేసరి.. సర్పంచు అభ్యర్థులకు తల నొప్పి మొదలైంది. బరిలోనుంచి తప్పుకోవాలని, గ్రామాన్ని ఏకగ్రీవం చేయాలన్న బుజ్జగింపులు ఊరూరా కొనసాగుతున్నాయి. మాట వినని వారికి బెదిరింపులు తప్పడం లేదు. ఆర్థికంగా.. అంగబలం ఉన్నవారు.. సర్పంచు పోటీదారులపై ఒత్తిడి తెస్తున్నారు. పోటీ నుంచి తప్పుకోవాలని, తాము చెప్పిన వారికి మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. మాట వినకపోతే హుకుం జారీ చేస్తున్నారు. దీంతో పోటీదారులు సతమతం అవుతున్నారు. ఇదీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది. ఈ అంశంలో అధికార కాంగ్రెస్‌తో పాటు.. బీఆర్ఎస్ నాయకులు పోటీపడుతున్నారు. కాగా.. కొడంగల్ మండలంలో సర్పంచు స్థానాలకు 123, వార్డు మెంబర్ స్థానాలకు 448 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో ఆశావహులతో పాటు.. పలు రాజకీయ పార్టీల సీనియర్ నాయకులు ఉన్నారు. ఇందులో రేపు మధ్యాహ్నం 3 గంటల వరకు బరిలోనుంచి ఎంత మంది తప్పుకుంటారో.. మిగిలేది ఎందరో తేలనుంది. రసవత్తరంగా పల్లెపోరు చెక్‘పవర్’ కోసం బరిలోకి బడానేతలు ఏకగ్రీవం కోసం బేరసారాలు సర్పంచులకు 195,వార్డులకు 606 నామినేషన్లు 23 పత్రాల తిరస్కరణ,పది అప్పీళ్లు కొట్టివేత -
ఇద్దరు పిల్లలతో తల్లి అదృశ్యం
● మీర్‌పేట పీఎస్ పరిధిలో ఘటన ● మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు మీర్‌పేట: భర్తతో గొడవపడిన భార్య ఇద్దరు కుమార్తెలతో ఇంటి నుంచి బయటకు వెళ్లి, కనిపించకుండాపోయిన ఘటన మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ సత్యనారాయణరెడ్డి కథనం ప్రకారం. బిహార్ రాష్ట్రానికి చెందిన మహబూబ్‌పాషా, ప్రీతికుమారి(23) భార్యాభర్తలు. బతుదుదెరువు కోసం నగరానికి వచ్చి మూడేళ్లుగా బడంగ్‌పేట న్యూబృందావన్ నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు ఇద్దరు కుమార్తెలు నబా (3), సూఫీ (2)లు ఉన్నారు. నవంబరు 26న భార్యభర్తల మధ్య గొడవ జరగడంతో మనస్తాపం చెందిన ప్రీతి తన ఇద్దరు కుమార్తెలను తీసుకుని ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాలేదు. స్థానికంగా ఉండే బంధువులకు, బిహార్‌లోని స్వగ్రామానికి ఫోన్ చేసి కుటుంబ సభ్యులను వాకబు చేసినా ఫలితం లేకపోవడంతో మహబూబ్‌పాషా సోమవారం మీర్‌పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. -
రెండు జీపీలు ఏకగ్రీవం
● పేర్కంపల్లి సర్పంచ్‌గా శాంతిబాయి ● రాంపూర్మీదితండాలోవెంకట్రెడ్డికి పదవి ● యునానిమస్ దిశగా మరిన్ని జీపీలుయాలాల: మండలంలోని పేర్కంపల్లితండా సర్పంచ్‌గా శాంతిబాయి ఏకగ్రీవమయ్యారు. ఇటీవల వేసిన నామినేషన్లలో భాగంగా తండా నుంచి ఒకే దరఖాస్తు అందడంతో ఆమె ఎన్నిక లాంఛనమే కానుంది. స్క్రూటినీ అనంతరం ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించనున్నారు. మరో మూడు పంచాయతీలు.. మండలంలోని మరో మూడు జీపీలు యునానిమస్ దిశగా సాగుతున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ ఈనెల 3న ఉండటంతో ఆయా గ్రామాల్లోని నాయకులు, యువకులు ఏకగ్రీవం వైపు చర్చలు సాగిస్తున్నారు. జక్కేపల్లి, ముకుందాపూర్, బండమీదిపల్లి ఈజాబితాలో చేరే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఆయా గ్రామాల్లో నామినేషన్లు వేసిన వారు ఉపసంహరణ చేసుకునేలా గ్రామపెద్దల సమక్షంలో ఒప్పందాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. యునానిమస్కు మొగ్గు చూపుతున్న జీపీలు తాండూరు రూరల్: తాండూరు మండలంలో మరో గ్రామ పంచాయతీ ఏకగ్రీవమైంది. రాంపూర్‌మీదితండా పంచాయతీకి జనరల్ రిజర్వేషన్ వచ్చింది. సర్పంచ్ పదవి కోసం పి.వెంకట్‌రెడ్డి, లక్ష్మణ్, పట్లోళ్ల సావిత్రమ్మ, మోహన్‌నాయక్, రాంచందర్ నామినేషన్లు వేశారు. ఇదిలా ఉండగా సోమవారం పంచాయతీ పరిధిలోని ప్రజలు, నాయకులు ఏకగ్రీవానికి చర్చలు జరిపారు. అభ్యర్థులు, స్థానికులు పట్లోళ్ల వెంకట్‌రెడ్డిని బలపర్చడంతో, మిగిలిన నలుగురు నామినేషన్లను విత్‌డ్రా చేసుకున్నారు. ఇదిలా ఉండగా గ్రామంలోని ఎనిమిది వార్డులను సైతం ఏకగ్రీవం చేసుకున్నట్లు ఎంపీడీఓ విశ్వప్రసాద్ తెలిపారు. -
అశోక్‌కే నా మద్దతు..
● స్పష్టం చేసిన మాజీ సర్పంచ్ ● కొలిక్కి వచ్చిన కరన్‌కోట్ ‘పంచాయితి’ తాండూరు రూరల్: రెండు రోజులుగా ఉత్కంఠ నెలకొన్న కరన్‌కోట్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిత్వంపై స్పష్టత వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి బోయ అశోక్‌కుమార్‌కు తన మద్దతు ఉంటుందని మాజీ ఉప సర్పంచ్ హేమంత్‌కుమార్ స్పష్టం చేశారు. సోమవారం తాండూరు పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యువతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నామినేషన్ వేయలేదని చెప్పారు. అశోక్ గెలుపు కోసం గ్రామంలో విస్తృతంగా ప్రచారం చేస్తానన్నారు. మా హయాంలో జరిగిన అభివృద్ధి గురించి ప్రజలకు వివరిస్తానని పేర్కొన్నారు. 600 ఉన్న రేషన్ కార్డులను 2 వేలు చేశామమని, 300 ఏళ్లక్రితం నాటి సంగమేశ్వర ఆలయాన్ని అభివృద్ధి చేశామని తెలిపారు. గ్రామంలో ప్రతి వార్డుల్లో సీసీరోడ్లు, మురుగు కాల్వలు, స్మశాన వాటికలకు ప్రహరీలు నిర్మించామని వివరించారు. ఇందులో సుధాకర్‌గౌడ్ స్వామి, రవిందర్‌రెడ్డి, అఫ్రోజ్‌లు ఉన్నారు. -
షార్ట్ సర్క్యూట్‌తో పత్తి దగ్ధం
కొందుర్గు: విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో పత్తి దగ్ధమైన ఘటన జిల్లేడ్ చౌదరిగూడ మండలం పెద్దఎల్కిచర్లలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన జనార్దన్‌రెడ్డి ఇదే ఊరికి చెందిన బుగ్గేశ్వర్, నారాయణలకు సంబంధించిన 12 ఎకరాల వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకొని పత్తి సాగు చేశాడు. సుమారు70 క్వింటాళ్ల పత్తిని తీయించి, పొలం సమీపంలో ఉన్న అజ్జు ఫామ్‌హౌస్‌లో నిల్వచేశాడు. సోమవారం ఉదయం ఫామ్‌హౌస్ నుంచి దట్టమైన పొగలు రావడంతో వెళ్లి చూడగా పత్తికి మంటలు అంటుకున్నాయి. చుట్టు పక్కల వారి సాయంతో మంటలను ఆర్పేశారు. ఈ సంఘటనలో దాదాపు 20 క్వింటాళ్ల పత్తి కాలిబూడిదైంది. దీంతో తనకు రూ.1.60 లక్షల నష్టం వచ్చిందని బాధితుడు వాపోయాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ విజయ్‌కుమార్ తెలిపారు. -
‘లగచర్ల’ ముద్దాయి సురేశ్ బైండోవర్
దుద్యాల్: మండల పరిధిలోని లగచర్ల గ్రామానికి చెందిన బోగమోని సురేశ్‌ను సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో బైండోవర్ చేశారు. లగచర్ల ఘటనలో ఏ–2 ముద్దాయిగా ఉన్న సురేశ్‌ను పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో బైండోవర్ చేసినట్లు పోలీసులు తెలిపారు. గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని తహసీల్దార్ కిషన్, పోలీసులు హెచ్చరించారు. ఎన్నికల ప్రచారంలో గొడవలు సృష్టించినా, అల్లర్లకు పాల్పడినా అరెస్టు చేయడంతో పాటు రూ.లక్షల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. కళాశాల రికార్డుల పరిశీలన అనంతగిరి: వికారాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సోమవారం అకాడమిక్ ఆడిట్ కమిటీ బృందం సందర్శించింది. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించారు. కళాశాల అభివృద్ధికోసం సిబ్బందికి సూచనలు చేశారు. కమిటీలో డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, డాక్టర్ ఇంతియాజుద్దీన్లు ఉన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొ. పీవీ గీతాలక్ష్మి పట్నాయక్, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. లారీ కింద పడి యువకుడి దుర్మరణం శంకర్పల్లి: లారీ కింద పడిన ఓ యువకుడు దుర్మరణం పాలైన సంఘటన సోమవారం రాత్రి మోకిల పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. మోకిల సీఐ వీరబాబు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రానికి చెందిన శుభం హల్సే(22) ప్రైవేటు ఉద్యోగి. తన తల్లిదండ్రులతో కలిసి నగరంలోని దూల్పేట్లో నివాసం ఉంటున్నాడు. సోమవారం విధులు ముగించుకొని బైక్‌పై కొల్లూర్ వైపు వెళ్తుండగా.. ఇంద్రారెడ్డినగర్ వద్ద పక్కపక్కనే వెళ్తున్న రెండు బైకులు ఢీ కొన్నాయి. శుభం హల్సే అక్కడే కింద పడిపోగా.. వెనక నుంచి వచ్చిన లారీ అతని పైనుంచి వెళ్లింది. దీంతో యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు. ఫిలింనగర్ సెక్షన్ లైన్మెన్పై వేటు సాక్షి, సిటీబ్యూరో: విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గాను బంజారాహిల్స్ డివిజన్ ఫిలింనగర్ సెక్షన్ లైన్మెన్ కె.భాస్కర్‌పై డిస్కం వేటు వేసింది. బస్తీబాట కార్యక్రమంలో భాగంగా నవంబర్ 28న డైరెక్టర్ సహా సీజీఎం ఇతర అధికారులు దుర్గభవానీ నగర్లో పర్యటించారు. అంతకు ఒక రోజు ముందే ఆయనకు ఈమేరకు సమాచారం అందించారు. ఉన్నతాధికారుల ఆదేశాలను భేఖాతార్ చేయడంతో పాటు పైఅధికారికి కనీస సమాచారం ఇవ్వకుండా విధులకు గైర్హాజరయ్యారు. క్రమశిక్షణా చర్యల్లో భాగంగా ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ మేరకు బంజారాహిల్స్ డీఈ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. నిందితుడిపై కేసు నమోదు.. నాగోలు: ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన సంఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం వెలుగులోకి వచ్చింది. ఎల్బీనగర్ పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బీహార్‌కు చెందిన శ్రావణ్‌కుమార్ నగరానికి వలస వచ్చి ఎన్టీఆర్నగర్లో నివాసం ఉంటూ కూరగాయల మార్కెట్లో పనిచేస్తున్నాడు.అతడి ఇంటి సమీపంలో అదే రాష్ట్రానికి చెందిన కుటుంబం నివాసం ఉంటోంది. వారి కుమార్తె (14)కు మాయమాటలు చెప్పి శ్రావణ్‌కుమార్ అమైపె లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీనిని గుర్తించిన స్థానికులు బాలిక తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఎల్బీనగర్ పోలీసులు నిందితుడు అదుపులోకి తీసుకున్నారు. -
ఇండస్ స్కూల్ వద్ద ఎమ్మెల్యేల ఆందోళన
శంకర్పల్లి: రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండల పరిధిలోని ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని బీఆర్ఎస్ ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ఆరోపించారు. అనుమతులు లేకుండా సీజ్ చేసిన ప్రైవేటు బస్సుల్లో విద్యార్థులను తిప్పుతున్నారని, అదే విధంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమీప బంధువు బస్సులకు సంబంధించి రూ.3 కోట్ల మేర బకాయిలు చెల్లించాలని కోరుతూ సోమవారం స్కూల్ వద్ద తమ అనుచరులతో ఆందోళన చేపట్టారు. అనంతరం స్కూల్ డైరెక్టర్ కిరణ్ కుమార్‌రెడ్డి ఎమ్మెల్యేలను లోపలికి అనుమతించి, వారితో మాట్లాడారు. ఈ సంభాషణ అంతా వాడివేడిగా జరుగుతున్నా క్రమంలో.. స్కూల్ యాజమాన్యం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఫోన్లో సంప్రదించి, ఎమ్మెల్యేలతో మాట్లాడించారు. నగరానికి వచ్చిన తర్వాత కూర్చుని మాట్లాడుకుందామని కేటీఆర్ సూచించడంతో ఎమ్మెల్యేలు వెనుదిరిగారు. బయటకు వచ్చిన అనంతరం లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ఇండస్ స్కూల్ యాజమాన్యం ఫిట్నెస్ లేని బస్సుల్లో విద్యార్థులను తరలిస్తోందని ఆరోపించారు. స్కూల్ యాజమాన్యం ఎమ్మెల్యేలతోనే ఈ విధంగా ప్రవర్తిస్తే, సామాన్య ప్రజలకు ఇంకేలా ఉంటుందని అందోళన వ్యక్తం చేశారు. కేటీఆర్ సూచనతో వెనుదిరిగిన నేతలు -
ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి అదృశ్యం
పహాడీషరీఫ్: ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి ప్రాంతానికి చెందిన దుర్గా భవానికి, ఏడాదిన్నర క్రితం పినిశెట్టి రాజేశ్‌కుమార్(35)తో వివాహం జరిగింది. వీరు జల్పల్లిలోని శ్రీరాం కాలనీలో నివాసం ఉంటున్నారు. చిట్‌ఫండ్ వ్యాపారం చేసే రాజేశ్‌కుమార్‌కు డబ్బులు ఇచ్చే వారు సకాలంలో ఇవ్వకపోవడంతో, చిట్టీ ఎత్తిన వారికి సమయానికి నగదు ఇవ్వలేక ఒత్తిడికి గురవుతున్నాడు. ఇతని భార్య పురుడు పోసుకునేందుకు పుట్టింటికి వెళ్లగా, బావమరిది దూసనపూడి వెంకటేశ్ కొంతకాలంగా బావతో కలిసి ఉంటున్నాడు. ఇదిలా ఉండగా నవంబర్ 29న శ్రీశైలం వెళ్లి వస్తానని బావమరిదికి చెప్పి వెళ్లిన అతడు ఎంతకీ తిరిగి రాలేదు. ఒత్తిడి భరించలేకే ఎక్కడికో వెళ్లిపోయి ఉంటాడని భావించిన వెంకటేశ్ సోమవారం పహాడీషరీఫ్ పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు స్టేషన్లో లేదా, 87126 62367 నంబర్‌కు ఫోన్ చేయాలని పోలీసులు సూచించారు. సిమెంట్ ట్యాంకర్ బోల్తా శంకర్పల్లి: సిమెంటు లోడ్‌తో వెళ్తున్న ట్యాంకర్(లారీ) బోల్తా పడిన సంఘటన శంక్‌పల్లి మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరు నుంచి సిమెంటు లోడుతో వస్తున్న ట్యాంకర్ శంకర్పల్లి మీదుగా బాచుపల్లి వెళ్తోంది. ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఎల్వర్తి మూలమలుపు వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. ట్యాంకర్ రోడ్డుకు అడ్డంగా పడటంతో, వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సోమవారం పోలీసులు క్రేన్ సాయంతో పక్కకు తొలగించారు. కుటుంబ సమస్యలతో మహిళ ఆత్మహత్య కొందుర్గు: కుటుంబ సమస్యలతో బాధపడుతున్న ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని ముట్పూర్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ రవీందర్‌నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. మేడిపల్లి పార్వతమ్మ(55)కు శోభారాణి, మంజుల ఇద్దరు కూతుళ్లు. పిల్లల చిన్నతనంలోనే పార్వతమ్మ భర్త కిష్టయ్య మృతిచెందాడు. దీంతో అన్నీ తానై కష్టపడి ఇద్దరినీ పెంపి, పోషించి వివాహాలు చేసింది. ఇదిలా ఉండగా చిన్న కూతురు మంజుల తన భర్తతో ఏర్పడిన విభేదాలతో ఇటీవలే విడాకులు తీసుకుంది. దీంతో పార్వతమ్మ తీవ్ర మనోవేదనకు గురైంది. ఈనెల 28న చిన్న కూతురు మంజుల చెక్కలోనిగూడలోని బంధువుల ఇంటికి వెళ్లింది. ఒంటరిగా ఉన్న పార్వతమ్మ పెద్ద కూతురు శోభారాణికి ఫోన్ చేసి, మంజుల గురించి బాధపడింది. అనంతరం మూడు రోజుల తర్వాత పార్వతమ్మ ఇంట్లో నుంచి దుర్వాసన రావడం, ఆమె ఫోన్ స్విచాఫ్ ఉండటంతో స్థానికులు శోభారాణికి ఫోన్ చేసి సమాచారం అందించారు. కూతుళ్లు వచ్చి చూడగాఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయింది. పెద్దకూతురు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. పోస్టుమార్టం అనంతరం బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
గొడవలు చేస్తే కేసులు పెడతాం
సీఐ ప్రవీణ్‌కుమార్ రెడ్డి ● 71 మంది పాత నేరస్తుల బైండోవర్ తాండూరు రూరల్: స్థానిక ఎన్నికల సమయంలో గొడవలు చేస్తే కేసులు నమోదు చేస్తామని సీఐ ప్రవీణ్‌కుమార్ రెడ్డి హెచ్చరించారు. సోమవారం కరన్‌కోట్ ఠాణా సీఐ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. ఎక్కడైనా గొడవలు జరిగితే 100కు కాల్ చేయాలని చెప్పారు. రూరల్ పోలీస్ సర్కిల్లో నాలుగు మండలాలు పెద్దేముల్, యాలాల, తాండూరు, బషీరాబాద్ ఠాణాలు కలిపి 71 మంది పాత నేరస్తులు, హత్య కేసుల్లో నిందితులను తహసీల్దార్ల వద్ద బైండోవర్ చేశామని తెలిపారు. 26 సమస్యాత్మకమైన గ్రామాలు తాండూరు మండలంలో సంగెంకలాన్, కరన్‌కోట్, మల్కాపూర్, చెంగోల్, సిరిగిరిపేట్, అల్లాపూర్, జినుగుర్తి గ్రామాలు. యాలాలలో అగ్గనూర్, జుంటుపల్లి, దెవనూర్, రాస్నం, కోకట్ గ్రామాలు. పెద్దేముల్లో మంబాపూర్, హన్మపూర్, ఇందూర్, జనగాం, తట్టెపల్లి, పెద్దేముల్, నాగులపల్లి. బషీరాబాద్‌లో దామర్‌చెడ్, నవల్గా, ఎక్మాయి, మైల్వార్, పర్వత్‌పల్లి సమస్యాత్మకమైన గ్రామాలుగా గుర్తించామని సీఐ పేర్కొన్నారు. కఠిన చర్యలు యాలాల: స్థానిక సంస్థల ఎన్నికల్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఎస్ఐ విఠల్‌రెడ్డి హెచ్చరించారు. సోషల్ మీడియాపై ఎప్పటికప్పుడు నిఘా ఉంటుందని చెప్పారు. అనవసర పోస్టులు చేస్తే.. గ్రూపు అడ్మిన్లు బాధ్యత వహించాల్సి ఉంటుందని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
హత్య కేసులో నిందితులపై పీడీ యాక్టు నమోదు
మలక్‌పేట: పట్టపగలు దారుణహత్యకు పాల్పడిన కేసులో ఆరుగురు నిందితులపై ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) యాక్టు ప్రయోగించినట్లు సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ చైతన్యకుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా నిందితులపై పీడీ యాక్టు నమోదు చేయాలని నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ ఉత్తర్వులు జారీ చేశారన్నారు. గత జులై 25న మలక్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని, శాలివాహననగర్ పార్కు వెస్ట్‌సైడ్ గేట్ వద్ద సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు, గిరిజన నాయకుడు కేతావత్ చందు రాథోడ్ హత్యకు గురయ్యాడు. ఈ హత్య కేసులో నిందితులైన ఉప్పల్ భగాయత్‌కు చెందిన దొంతి రాజేష్ అలియాస్ రాజన్న, సరూర్‌నగర్‌కు చెందిన కుంబ ఏడుకొండలు, జగ్గయ్యపేటకు నివాసి ఆత్మకూరి శ్రీను, అడ్డగూడూరుకు చెందిన కందుకూరి ప్రశాంత్, నెల్లూరు జిల్లాకు చెందిన అర్జున్ జ్ఞానప్రకాశ్, రాంబాబులపై పీడీ యాక్టు నమోదు చేశామన్నారు. -
పెళ్లికి ఒప్పుకోవడం లేదని..
● ఆత్మహత్యకు పాల్పడిన ప్రేమికులు ● మృతులిద్దరూ బిహార్ రాష్ట్రానికి చెందిన వారే కొత్తూరు: తమ ప్రేమను అంగీకరించని పెద్దలు, పెళ్లికి సైతం నిరాకరిస్తారనే కారణంతో మనస్తాపానికి గురైన ఓ ప్రేమజంట ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన కొత్తూరు పట్టణంలో సోమవారం చోటు చేసుకుంది. సీఐ నర్సయ్య తెలిపిన వివరాల మేరకు.. బిహార్ రాష్ట్రానికి చెందిన నవనీత్‌దత్త తన ఇద్దరు కూతుళ్లు అనామిక(21), అనీషదత్తతో కలిసి నాలుగేళ్ల క్రితం కొత్తూరుకు వలస వచ్చాడు. నవనీత్‌దత్త ఐఓసీఎల్ ప్లాంట్‌లో డ్రైవర్‌గా, ఇద్దరు కూతుళ్లు పట్టణ సమీపంలోని ఓ బేకరీ పరిశ్రమలో పనిచేస్తున్నారు. కాగా, అనామికకు ఇదే పరిశ్రమలో పనిచేస్తున్న బిహార్‌కు చెందిన ధనుంజయ్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. మూడు రోజులుగా అనామిక పనికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటోంది. ఈ నేపథ్యంలో నవనీత్ సోమవారం మధ్యాహ్నం భోజనం కోసం ఇంటికి చేరుకోగా, లోపలి నుంచి తలుపులు పెట్టి ఉండడంతో కిటికీలో నుంచి వెళ్లి చూడగా, అనామిక కింద పడి మృతిచెంది ఉండగా, ధనుంజయ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనామిక పనికి వెళ్లకపోవడంతో ధనుంజయ్ ఆమెకు ఫోన్ చేసి ఇంటికి వచ్చాడు. అప్పటికే అనామిక ఫ్యాన్‌కు ఉరేసుకోవడంతో, ఆమెను కిందికి దింపి, అదే ఫ్యాన్‌కు తాను ఉరేసుకున్నట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. మృతురాలి ఇంట్లో ఉన్న సీసీ కెమెరా పుటేజీలను పరిశీలించాల్సి ఉంది. సంఘటన స్థలాన్ని శంషాబాద్ ఏసీపీ శ్రీకాంత్‌గౌడ్ పరిశీలించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం షాద్‌నగర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ వివరించారు. -
లెక్క..కీలకం
పంచాయతీ ఎన్నికల వ్యయ పరిమితి ఖరారుపల్లె పోరులో నోట్ల కట్టల ప్రవాహానికి అడ్డుకట్ట వేయడానికి ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుంది. ఇందుకు వ్యయ పరిమితిని విధించడంతో పాటు గ్రామాల్లో ప్రత్యేక యంత్రాంగంతో కూడిన నిఘా ఏర్పాటు చేసింది.వికారాబాద్: రోజురోజుకూ పెరుగుతున్న ఎన్నికల వ్యయాన్ని నియంత్రించడానికి ఎన్నికల సంఘం కఠినంగా వ్యవహరిస్తోంది. అభ్యర్థులు ఎంత ఖర్చు చేయాలనే విషయంలోనూ స్పష్టమైన పరిమితులు రూపొందించింది. అయితే ఎన్నికల కమిషన్ పేర్కొన్న నిబంధనలకు ప్రస్తుతం గ్రామాల్లో సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్న అభ్యర్థుల ఖర్చుకు ఏ మాత్రం పొంతన ఉండటం లేదు. ఈసీ పరిమితికి మించి అభ్యర్థులు పది నుంచి ఇరవై రెట్లు ఎక్కువ వెచ్చిస్తున్నారు. ధన ప్రవాహ కట్టడికి జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని యంత్రాంగం ప్రత్యేక నిఘా పెడుతోంది. ఎన్నికల ఖర్చుకు సంబంధించిన నిబంధనలు నవంబర్ 27 నుంచి అమలులోకి వచ్చాయి. ఇప్పటికే జిల్లాలో చెక్ పోస్టులను ఏర్పాటు చేసిన పోలీసులు పకడ్బందీగా వాహనాల తనిఖీ చేస్తున్నారు. రోజువారీగా లెక్కలు పోటీ చేసే ప్రతి అభ్యర్థి నామినేషన్ల నుంచి ఎన్నికలయ్యే వరకు ప్రచార కార్యక్రమాల నిమిత్తం ఎంత ఖర్చు చేయాలనే విషయంలో స్పష్టమైన నిబంధనలున్నాయి. ఏయే అవసరాలకు ఎంత ఖర్చు చేయాలనే విషయాలను కూడా స్పష్టీకరించింది. గతంలో ఎన్నికల ఖర్చును మూడు రోజులకు లేదా పోలింగ్ పూర్తయిన తరువాత కౌంటింగ్ వరకు చూపించే వీలు ఉండేది. ప్రస్తుత ఎన్నికల్లో మాత్రం అభ్యర్థి తాను చేస్తున్న ఖర్చును రోజువారీగా అధికారులకు చూపించాలి. అంతే కాకుండా వివరాలను ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధానాధికారి వెబ్సైట్లో సైతం నమోదు చేయాలని షరతు ఉంది. అదే విధంగా నేర చరిత్ర కలిగిన అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేస్తే వాటికి సంబంధించిన వివరాలను కూడా నమోదు చేయాలని అధికారులు పేర్కొంటున్నారు. నిత్యం దావత్‌లు ఎన్నికల కమిషన్ నిబంధనలతో అభ్యర్థులు జాగ్రత్తగా ఉండాలని ఆయా పార్టీలు ముందుగానే తమ మద్దతుదారులకు హెచ్చరికలు జారీ చేశాయి. ఎన్నికల్లో ధన వ్యయాన్ని తక్కువ చేయాలనే ఉద్దేశంతో కమిషన్ నిబంధనలు విధిస్తున్నప్పటికీ అభ్యర్థులు మాత్రం లోలోపల ఖర్చుకు వెనుకాడడం లేదు. జిల్లాలో మొత్తం 594 జీపీలు, 5,058 వార్డులకు ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో తొలి విడతలో 262, రెండో విడతలో 175, మూడో విడతలో 157 జీపీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మొదటి విడతలో నామినేషన్ల పర్వం ముగిసి ప్రచార పర్వానికి తెరలేసింది. ప్రతి నిత్యం వాహనాల ఏర్పాటు, భోజనాలు, మందు, విందు ఖర్చుల పేరిట భారీగానే వెచ్చిస్తున్నారు. ఎంతలేదన్నా ఆయా జీపీల్లో నిత్యం రూ.లక్షల్లో ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. జనాభా ప్రాతిపదికన ప్రచారానికి ఖర్చు క్షుణ్ణంగా పరిశీలించనున్న అధికారులు మేజర్ జీపీలో సర్పంచ్‌కి రూ.2.5 లక్షలు చిన్న గ్రామంలో రూ.1.5 లక్షలు పరిమితి దాటితే వేటే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అభ్యర్థి నేరచరిత్రకు సంబంధించిన వివరాలను నామినేషన్‌తో పాటు పొందుపరచాలి. ఐదు వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామాల్లో(మేజర్ పంచాయతీ) పోటీ చేసే సర్పంచ్ అభ్యర్థులు రూ.2.5 లక్షల వరకు ఖర్చు చేసుకునే వీలుంది. మేజర్ పంచాయతీలలో వార్డు సభ్యులుగా పోటీ చేసే అభ్యర్థులు రూ.50 వేల వరకు ఖర్చు చేయవచ్చు. ఇక ఐదు వేల లోపు జనాభా ఉన్న గ్రామాల్లో(మైనర్ పంచాయతీలు) పోటీ చేసే సర్పంచ్ అభ్యర్థులు రూ.1.5 లక్షల వరకు ఖర్చు చేసే వెసులుబాటు ఈసీ కల్పించింది. చిన్న పంచాయతీలలో వార్డు సభ్యుడిగా పోటీ చేస్తే రూ.30 వేల వరకు ఖర్చు చేయవచ్చు. ఉప సర్పంచ్ అభ్యర్థులకు సైతం వార్డు సభ్యుడికి ఉండే నిబంధనలే వర్తిస్తాయి. ఖర్చులు పరిమితి దాటితే వేటు తప్పదు. -
‘రేడియల్’ రహదారి పనులు షురూ
కందుకూరు: ఫ్యూచర్ సిటీలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 330 అడుగుల రేడియల్ రహదారి పనులు ప్రారంభమయ్యాయి. ఓఆర్ఆర్ 13 ఎగ్జిట్ నుంచి ఫ్యూచర్ సిటీ ప్రాంతం పరిధిలోని మీర్ఖాన్పేట మీదుగా ఆమన్‌గల్లు మండలం ఆకుతోటపల్లి వరకు దాదాపు 42 కిలోమీటర్ల మేర 330 అడుగుల విస్తీర్ణంతో రహదారిని నిర్మించడానికి ప్రభుత్వం సంకల్పించింది. అందులో భాగంగా ఓఆర్ఆర్ ఎగ్జిట్ 13 నుంచి మీర్ఖాన్పేట రెవెన్యూ స్కిల్స్ యూనివర్సిటీ మీదుగా గతంలో నిర్మించిన 200 అడుగుల రహదారి వరకు సుమారు 19.2 కిలోమీటర్ల మేర ఏపీ ఎంపీ సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ సంస్థ కాంట్రాక్ట్ దక్కించుకుంది. అక్కడి నుంచి ఆకుతోటపల్లి వరకు 22 కిలోమీటర్ల మేర నిర్మించాల్సిన రహదారి కాంట్రాక్టును ఎల్అండ్టీ సంస్థ దక్కించుకుంది. రెండు రోజుల క్రితం నుంచి మీర్ఖాన్పేట 200 అడుగుల రహదారి నుంచి ఉత్తరం వైపు స్కిల్స్ యూనివర్సిటీ మీదుగా ఓఆర్ఆర్ ఎగ్జిట్ వైపు రహదారి నిర్మాణ పనులను రిత్విక్ సంస్థ ప్రారంభించింది. సోమవారం దక్షిణం వైపు కాంట్రాక్ట్ దక్కించుకున్న ఎల్అండ్టీ సంస్థ పనులు మొదలు పెట్టింది. జేసీబీ యంత్రాలతో ప్రస్తుతం రెండు వైపులా భూమి చదును చేసే పనులు చేపట్టారు. టీజీఐఐసీ గతంలో సేకరించిన భూముల నుంచే ప్రస్తుతం పనులు ప్రారంభించారు. ఫ్యూచర్ సిటీలో ఓవైపు గ్లోబల్ సమ్మిట్ పనులు, స్కిల్స్ యూనివర్సిటీ, ఎఫ్‌సీడీఏ కార్యాలయం నిర్మాణ పనులు కొనసాగుతుండగా, ప్రస్తుతం రేడియల్ రహదారి నిర్మాణం పనులు షురూ కావడంతో అన్ని వైపుల నుంచి ప్రభుత్వం నిర్ధేశించిన పనులు వేగాన్ని పుంజుకున్నట్లయింది. -
అంబులెన్స్ సేవలు ప్రారంభం
అనంతగిరి: వికారాబాద్ పట్టణానికి చెందిన సందీప్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద, మధ్య తరగతి ప్రజల సౌకర్యార్థం(ఇంధనం ఖర్చు మాత్రమే చెల్లించి) ఏర్పాటు చేసిన అంబులెన్స్ వాహనాన్ని సోమవారం అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్‌కుమార్ ప్రారంభించారు. ఈ మేరకు ఆయన క్యాంపు కార్యాలయంలో రిబ్బన్ కట్ చేసి వాహన సేవలు షురూ చేశారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు సతీష్‌రెడ్డి, సంతోష్‌గౌడ్, ట్రస్ట్ నిర్వాహకులు సందీప్ తదితరులు పాల్గొన్నారు. అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ అనంతగిరి: ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన దరఖాస్తులను ప్రాధాన్యత క్రమంలో సత్వరమే పరిష్కరించాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ సూచించారు. ఈ మేరకు సోమవారం ప్రజావాణిలో భాగంగా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 16 అర్జీలు వచ్చాయి. కార్యక్రమంలో డీఆర్ఓ మంగ్లీలాల్, ఆర్డీఓ వాసుచంద్ర, డీఆర్డీఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తాండూరు రూరల్: పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తాండూరు మండలంలో కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తలుగా ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి కుమారుడు అవినాష్‌రెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ రవిగౌడ్‌లను ఎమ్మెల్యే సోమవారం నియమించారు. వీరు గ్రామాల్లోకి వెళ్లి కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు, ముగ్గురు సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్ దాఖలు వారితో మాట్లాడి సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అనంతగిరి: రుణాలు పొందిన వీధి విక్రయదారులు తమ ఈఎంఐలను విధిగా చెల్లించేలా అవగాహన కల్పించాలని వికారాబాద్ మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్ అన్నారు. ఈ మేరకు సోమవారం మున్సిపల్ కార్యాలయం సమావేశ మందిరంలో టౌన్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఇందులో వీధి విక్రయదారుల నిమిత్తం తొలి, ద్వితీయ, తృతీయ విడత రుణాలు, బ్యాంకులచే రిటర్న్ అయిన అప్లికేషన్స్, మహిళ సంఘాల రుణాలు, ఎన్పీఏ సంబంధిత అంశాలు తదితర వాటిపై సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. మహిళ సంఘాల సభ్యులు తీసుకున్న రుణాలు కూడా నిర్ణయించిన విధంగా చెల్లించాలన్నారు. సమావేశంలో డీఎంసీ వెంకటేశ్, సంబంధిత బ్యాంకు మేనేజర్లు, సిబ్బంది, ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు. తుర్కయంజాల్: మున్సిపాలిటీ ఇన్చార్జి కమిషనర్‌గా ఇబ్రహీంపట్నం కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్న సత్యనారాయణ రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు అందుబాటులో ఉంటూ, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. మున్సిపల్ పరిధిలోని కాలనీల్లో పారిశుద్ధ్య నిర్వహణకు పెద్దపీట వేస్తామని పేర్కొన్నారు. ఇక్కడ కమిషనర్‌గా పనిచేసిన కె. అమరేందర్ రెడ్డి నవంబర్ 30న ఉద్యోగ విరమణ చేసిన విషయం తెలిసిందే. -
వైభవంగా గీతా జయంతి
వికారాబాద్‌లో సామూహిక గీతా పారాయణం చేస్తున్న గీతా వాహిని బృందంఅనంతగిరి: వికారాబాద్ పట్టణంలోని శివాజీనగర్ కాలనీలో గణేశ్ కట్ట వద్ద గీతా వాహిని ఆధ్వర్యంలో సోమవారం గీతా జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా గీతాయజ్ఞం, సామూహిక సంపూర్ణ భగవద్గీత పారాయణం నిర్వహించారు. ఈ సందర్భంగా గీతా వాహిని అధ్యక్షురాలు శ్రీదేవి మాట్లాడుతూ.. ఎనిమిది ఏళ్లుగా గీతా పారాయణంతోపాటు గీతా ప్రచారం చేస్తున్నామన్నారు. భగవద్గీతను పట్టణంలోని ఆయావాడలు, పలు ప్రాంతాల్లో ప్రచారం చేస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు సదానంద్‌రెడ్డి, బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర కార్యదర్శి నవీన్‌కుమార్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మంజులరమేశ్‌కుమార్, నాయకులు రమేశ్‌గౌడ్, స్వాతి, పావని, లక్ష్మి, దమయంతి, దేవీనాయక్, రాజ్యలక్ష్మి, గీతా వాహిని సభ్యులు తదితరులు పాల్గొన్నారు. భగవద్గీత పుస్తకాలు పంపిణీ కొడంగల్: పట్టణంలోని నేతాజీ పాఠశాలలో సోమవారం ధూప, దీప, నైవేద్య అర్చక సంఘం జిల్లా అధ్యక్షుడు లోకుర్తి జయతీర్థాచారీ ఆధ్వర్యంలో భగవద్గీత పుస్తకాలను విద్యార్థులకు పంపిణీ చేశారు. గీతా జయంతి సందర్భంగా తెలుగులో ఉన్న 100 భగవద్గీత పుస్తకాలను అందజేశారు. విద్యార్థులు ప్రతి రోజు గీతా పారాయణం చేయాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఎయిడ్స్‌పై అప్రమత్తత ముఖ్యం
తాండూరు టౌన్: హెచ్ఐవీ, ఎయిడ్స్ వ్యాప్తి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ సూచించారు. సోమవారం ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, దిశ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హెచ్ఐవీ, ఎయిడ్స్ వ్యాప్తిని అరికట్టేందుకు వైద్య ఆరోగ్య శాఖ అవగాహన కార్యక్రమాలు చేపడుతోందన్నారు. ఎయిడ్స్ వ్యాధి నివారణకు చికిత్సే లేదని, నివారణ ఒక్కటే మార్గమన్నారు. హెచ్ఐవీ సోకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనంతరం డీఎంహెచ్ఓ డాక్టర్ స్వర్ణకుమారి, హెచ్ఐవీ, ఎయిడ్స్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ రవీంద్రయాదవ్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో హెచ్ఐవీ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నామన్నారు. అలాగే ఐదు ఇంటిగ్రేటెడ్ కౌన్సెలింగ్ అండ్ టెస్టింగ్ సెంటర్స్ ఉన్నాయని, రెండు హెచ్ఐవీ, ఎయిడ్స్ చికిత్స కేంద్రాలు కూడా ఉన్నాయన్నారు. హెచ్ఐవీ సోకిన ఇద్దరు మహిళలకు సురక్షితంగా ప్రసవం చేశామన్నారు. జిల్లాలో 3,800 మంది హెచ్ఐవీకి చికిత్స పొందుతున్నారని, గతేడాదితో పోలిస్తే ఈఏడాది కేసుల సంఖ్య తగ్గిందన్నారు. కార్యక్రమంలో ఐఎంఏ పట్టణాధ్యక్షుడు డాక్టర్ జయప్రసాద్, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వినయ్ కుమార్, ఏఆర్టీ సెంటర్ వైద్యాధికారి డాక్టర్ సమీవుల్లా, శ్రీనివాసులు, దిశా స్వచ్ఛంద సంస్థ కో ఆర్డినేటర్ డానియల్, ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ -
పకడ్బందీగా ఎన్నికల నిర్వహణ
అనంతగిరి: రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని సోమవారం హైదరాబాద్ నుంచి ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల పరిశీలకులు, పోలీస్ అధికారులతో ఎన్నికల నిర్వహణపై వీడియో సమావేశం నిర్వహించారు. జిల్లా నుంచి కలెక్టర్, ఎస్పీ, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ.. మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ విజయవంతంగా నిర్వహించామని, పరిశీలన కూడా చేస్తున్నామన్నారు. ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించేందుకు జిల్లాస్థాయి మండల స్థాయిల్లో అధికారులతో కమిటీలు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తామన్నారు. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ సదుపాయం ఉందన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద వెబ్ కాస్టింగ్ నిర్వహించనున్నట్లు చెప్పారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్పీ స్నేహమెహ్ర, ట్రైనీ కలెక్టర్ హర్షచౌదరి, వ్యయ పరిశీలకుడు రమేశ్‌కుమార్, అదనపు కలెక్టర్ సుధీర్, డీపీఓ జయసుధ తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించాలి
కుల్కచర్ల: స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో గెలుపొందేలా కార్యకర్తలు కృషి చేయాలని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సూచించారు. సోమవారం మండలంలోని ముజాహిద్పూర్కు చెందిన బీఆర్ఎస్, బీజేపీల నుంచి నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలుచేస్తూ పేద ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తుందన్నారు. నిబద్ధతతో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఇతర పార్టీల కార్యకర్తలు స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు, నాయకులు చంద్రభూపాల్, బాలకృష్ణ, అంబు, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి -
నామినేషన్లో తప్పులు దొర్లొద్దు
మోమిన్‌పేట: నామినేషన్ల స్వీకరణలో ఎలాంటి తప్పిదాలు చోటు చేసుకోకూడదని జిల్లా కలెక్టర్ ప్రతీక్‌జైన్ సూచించారు. సోమవారం మండల పరిధిలోని వెల్చాల్ క్లస్టరులో పంచాయతీ ఎన్నికల నామినేషన్ స్వీకరణను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి కేంద్రంలో హెల్ప్‌డెస్క్‌లు తప్పనిసరిగా ఉండాలన్నారు. అవసరమైన వారికి సహకారాలు అందించాలన్నారు. నామినేషన్ వేసే అభ్యర్థితో పాటు బలపరిచే వ్యక్తిని మాత్రమే లోనికి అనుమతించాలన్నారు. సర్పంచ్, వార్డు స్థానాల ఎన్నికల కోసం జారీ చేసిన నోటిఫికేషన్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వహించాలని, ఎట్టి పరిస్థితుల్లో సొంత నిర్ణయాలను అమలు చేయకూడదన్నారు. విధుల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పకుండా అమలయ్యేలా చూడాలని, నిర్ణీత గడువు లో పల నామినేషన్లు స్వీకరించేందుకు టోకెన్లు జారీ చేయాలని అధికారులకు సూచించారు. అభ్యర్థులు కొత్త బ్యాంకు అకౌంట్ తెరిచి ఎన్నికల లావాదేవీలు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టరు హర్ష్ చౌదరి, తహసీల్దార్ రవీందర్, ఎంపీడీఓ సృజన సాహిత్య, ఎంపీఓ యాదగిరి తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ తనిఖీ నవాబుపేట: నామినేషన్ల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. సోమవారం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో కొనసాగుతున్న నామినేషన్ ప్రక్రియను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిర్ణీత గడువు లోపు నామినేషన్లు స్వీకరించేందుకు టోకెన్లు జారీ చేయాలని చెప్పారు. నోటిఫికేషన్ పరిశీలన అనంతగిరి: వికారాబాద్ మండలం పులుమద్ది గ్రామ పంచాయతీలో నిర్వహిస్తున్న నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సోమవారం తనిఖీ చేశారు. సర్పంచ్, వార్డు స్థానాల ఎన్నిక కోసం జారీ చేసిన నోటిఫికేషన్ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఎలాంటి తప్పిదాలు, పొరపాట్లకు తావులేకుండా ఎన్నికల ప్రక్రియను నిర్వహించాలని సూచించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ హర్ష్ చౌదరి, తహసీల్దార్ లక్ష్మీనారాయణ, ఎంపీడీఓ వినయ్‌కుమార్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ప్రతీక్ జైన్ -
ట్యాంకును కూల్చివేయండి
కుల్కచర్ల: మండల పరిధిలోని ముజాహిద్‌పూర్‌లో ప్రమాదకరంగా ఉన్న ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకును వెంటనే కూల్చివేయాలని మిషన్ భగీరథ ఇంట్రా చీఫ్ ఇంజనీర్ లలిత, ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ రవికుమార్ సూచించారు. సోమవారం గ్రామంలో పర్యటించిన అధికారులు ట్యాంకుతో ఎలాంటి ప్రమాదం జరగకముందే, తగిన జాగ్రత్తలు తీసుకుని కూల్చివేయాలన్నారు. నీటి సరఫరా కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రమాదకరంగా మారిన ట్యాంకులు ఎక్కడ ఉన్నా ఇంజనీర్ల దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ డీఈ సుబ్రహ్మణ్యం, పంచాయతీ కార్యదర్శి సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం: శేరిగూడ గ్రామంలోని ఉప్పరిగూడ ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రాన్ని నాబార్డ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీజీఎం డా. అజయ్ కే సూద్ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా పీఏసీఎస్ నిర్వహణ, లావాదేవీలు, పనితీరు ఎలా ఉందో పరిశీలించారు. పీఏసీఎస్ చైర్మన్ పాడురంగారెడ్డి, సీఈవో గణేశ్ ఆయనకు ఆయా విషయాలను వివరించారు. కార్యక్రమంలో టీఎస్సీఏబీ ఎండీ వైకే రావు, జీఎం ప్రభాకర్‌రెడ్డి, డీజీఎం కిరణ్‌కుమార్, సంబంధిత అధికారి శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. -
పీహెచ్‌సీని పరిశీలించిన డీఎంహెచ్ఓ
ధారూరు: స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం జిల్లా వైద్యాధికారి స్వర్ణకుమారి సందర్శించారు. ఆస్పత్రిలో నిల్వ ఉన్న మందులు, ట్యాబెట్లు, ఇతర వస్తువులను పరిశీలించారు. సిబ్బందిని పిలిపి సమస్యలపై ఆరా తీశారు. ఆస్పత్రిలో రోగులకు 24 గంటల పాటు వైద్య సేవలు అందించే సౌకర్యం లేదని, దానికి ప్రతిపాదనలు సైతం పెట్టలేదని ఆమె తెలిపారు. ఆవరణ మొత్తం పిచ్చిమొక్కలు, గడ్డితో నిండిపోయి పాములకు ఆవాసంగా మారిందని డీఎంహెచ్ఓ దృష్టికి తీసుకురాగా పరిశీలించారు. రాత్రి వేళల్లో ప్రమాదాలు జరిగితే తాండూరు, వికారాబాద్ ఆస్పత్రులకు వెళుతున్నామని, స్థానికంగా వైద్య సౌకర్యం కల్పించాలని రోగులు విన్నవించారు. ఆసుపత్రికి సంబంధించిన విషయాలను ఎంపీహెచ్ఈఓను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రోగుల రిజిస్టర్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో డాక్టర్ శాంతి, ఎంపీహెచ్ఈఓ విజయేందర్ తదితరులు పాల్గొన్నారు. -
బీఆర్ఎస్లో స్వచ్ఛందంగా చేరికలు
మర్పల్లి: మండల పరిధిలోని కోట్‌మర్పల్లి గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు శ్రీనివాస్‌రెడ్డి తన అనుచరులతో కలిసి ఆదివారం గులాబీ గూటికి చేరారు. ఈ మేరకు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్‌లోని ఆయన స్వగృహంలో శ్రీనివాస్‌రెడ్డి, అనుచరులకు కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, నాయకులు రఘుపతి రెడ్డి, రమేశ్‌గౌడ్, నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. పనితీరు నచ్చకే ... కుల్కచర్ల: ప్రభుత్వ పనితీరు నచ్చక బీఆర్ఎస్లోకి స్వచ్ఛందంగా చేరికలు ప్రారంభమయ్యామని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. ఆదివారం చౌడాపూర్ మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు గులాబీ గూటికి చేరారు. వారికి ఆయన పార్టీ కండువా వేసి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. హామీల అమలులో ప్రభుత్వం విఫలమయిందని ఆరోపించారు. సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు అధిక స్థానాల్లో గెలుపొందడం ఖాయమని దీమా వ్యక్తం చేశారు. పార్టీలో చేరిన వారిలో కాంగ్రెస్ చౌడాపూర్ మండల అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, కుల్కచర్ల మండల అధ్యక్షుడు శేరిరాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్, బీజేపీ నుంచి వలసలు -
వంతెన కిందకు దూసుకెళ్లిన కారు
అనంతగిరి: అదుపు తప్పిన ఓ కారు వికారాబాద్ బ్రిడ్జి పై నుంచి కింద పడింది. ఈ సంఘటన ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులు కారులో ఎన్నెపల్లి నుంచి వికారాబాద్ వైపు వస్తుండగా.. వంతెన మూల మలుపు వద్ద వారు పయనిస్తున్న కారు.. అదుపు తప్పి కిందకు దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయా లు కాలేదు. కారు పూర్తిగా ధ్వంసం అయింది. కాగా.. పొగమంచుతో మలుపు దగ్గరకు వచ్చే వరకు కనబడలేదని బాధితులు తెలిపారు. భార్యను చంపిన భర్త పోలీసుల అదుపులో నిందితుడు తాండూరు రూరల్: కోపోద్రిక్తుడైన భర్త.. భా ర్యను హత్య చేశాడు. ఈ సంఘటన పెద్దేముల్ తండాలో చోటు చేసుకుంది. ఎస్ఐ శంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన మూడవత్ రవి, అనిత(35) దంపతులు. వ్యవసాయం చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. కొంత కాలంగా రవి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో ఆదివారం ఇరువురి మధ్య గొడవ జరిగింది. దీంతో సదరు వ్యక్తి ఆవేశంతో ఆమైపె దాడి చేశాడు. తల, ముఖంపై పారతో కొట్టి హతమార్చాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాండూరు పట్టణంలోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. డీఎస్పీ నర్సింగ్ యాదయ్య, రూరల్ సీఐ ప్రవీణ్‌కుమార్ రెడ్డి, ఎస్ఐ శంకర్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వికారాబాద్ క్లూస్‌టీం ద్వారా వివరాలు సేకరించారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. మృతురాలి సోదరుడు కేతావత్ కృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. అనితకు ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నాడు. దౌల్తాబాద్‌లో రెండు సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం దౌల్తాబాద్: మండల పరిధిలో రెండు గ్రామ పంచాయతీలు దాదాపు ఏకగ్రీవం అయినట్లే. మండలంలోని తిమ్మాయిపల్లి, బండివాడ పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకుగాను ఒక్కో నామినేషన్ దాఖలైనట్లు అధికారులు తెలిపారు. బండివాడలో నూర్యనాయక్, తిమ్మాయిపల్లి పంచాయతీకి శాణమ్మ మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కానున్నాయి. ఉద్యోగం ఇప్పిస్తానని మోసం వెంగళరావునగర్: ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బులు తీసుకుని మోసం చేసిన సంఘటన మధురానగర్ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జె.సందీప్ అనే యువకుడు గత కొంతకాలంగా ఎల్లారెడ్డిగూడలో ఉంటూ ఉద్యో గ ప్రయత్నాలు చేస్తున్నాడు. గత మార్చి నెలలో తన స్నేహితుడి ద్వారా ఓంకార్ రూపేష్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. తనకు ఐటీ కంపెనీల్లో పరిచయాలు ఉన్నాయని, ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పా డు. అతడి మాటలు నమ్మిన సందీప్ రూ.1.60 లక్షలు ఇచ్చాడు. నెలలు గడుస్తున్నప్పటికీ ఉద్యోగం రాకపోవడంతో అనుమానం వచ్చిన సందీప్ డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరాడు. దీంతో ఓం కార్ రూపేష్ తప్పించుకుని తిరుగుతున్నాడు. బాధితుడి సందీప్ ఫిర్యాదు మేరకు మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఇద్దరు వ్యక్తులు అదృశ్యం
మరో ఘటనలో.. కోడిపందేల స్థావరంపై దాడి మేడిపల్లి: కోడిపందేల స్థావరాలపై మేడిపల్లి పోలీసులు దాడిచేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన ఆదివారం మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. చెంగిచెర్ల మేకల మండి ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం కొందరు వ్యక్తులు కోడిపందేలు నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో మేడిపల్లి సీఐ గోవింద రెడ్డి ఆదేశాల మేరకు పోలీసులు దాడిచేసి 15మందిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారినుంచి రెండు పందెం కోళ్లు, రెండు కోడి కత్తులు, రూ.18వేల నగదు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
హామీల అమలులో ప్రభుత్వం విఫలం
● బీఆర్ఎస్ పాలన కోరుకుంటున్న ప్రజలు ● మాజీ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి పరిగి: హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని, దీంతో అధికార పార్టీపై ప్రజలు విశ్వాసం కోల్పోయారని మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ పాలనే ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. ఆదివారం పట్టణ కేంద్రంలోని ఆయన నివాసంలో పూడూరు మండలం నుంచి 160 మంది, చౌడాపూర్, గండీడ్ మండలాలకు చెందిన కాంగ్రెస్, బీఎస్పీ పార్టీల నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి ఆయన గులాబీ కండువాలు కప్పి, ఆహ్వానించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే మాట్లాడారు. పంచాయతీ ఎన్నికల్లో అత్యధికంగా సర్పంచ్‌లను గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని, పనిచేసిన వారికి తగిన ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. -
కరన్‌కోట్ ఫైట్.. వెరీ హాట్
తాండూరు రూరల్: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మేజర్ పంచాయతీ కరన్‌కోట్ గ్రామం. పది వేల మంది జనాభా, 7 వేలకు పైగా ఓటర్లు ఉన్నారు. గ్రామ శివారులో సీసీఐ ఫ్యాక్టరీతో పాటు పదుల సంఖ్యలో నాపరాతి గనులున్నాయి. పంచాయతీకి పుష్కలంగా నిధులు వస్తాయి. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిగా మాజీ సర్పంచ్ వీణ భర్త, మాజీ ఉపసర్పంచ్ హేమంత్‌కుమార్, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిగా రాజ్‌కుమార్ నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. హేమంత్ కుమార్ 14 వార్డులకు సంబంధించి వార్డు సభ్యులు, ప్రతిపాదకులు అంతా సిద్ధం చేసుకుని చివరి నిమిషంలో అస్త్ర సన్యానం చేశాడు. ఆయన పోటీ నుంచి తప్పుకోవడంతో గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. కరన్‌కోట్ చరిత్రలో ఇలాంటి సంఘటన ఎప్పుడు జరగలేదని గ్రామస్తులు చెబుతున్నారు. తప్పించింది ఎవరు..? హేమంత్ కుమార్‌ను తప్పించిన నేత ఎవరనేది అంతుచిక్కడం లేదు. ఆదివారం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయన ఇంటికి వెళ్లినా నోరు విప్పలేదు. ఏకగ్రీవం కాకుండా ఉందేందుకు బీఆర్ఎస్ యువ నాయకులు బోయ అశోక్, ప్రభాకర్‌గౌడ్ నామినేషన్ వేశారు. వారిని సైతం పోటీ నుంచి తప్పించేందుకు అధికార పార్టీ నాయకులు యత్నిస్తున్నట్లు సమాచారం. వీరు విత్‌డ్రా చేస్తే రాజ్‌కుమార్ సర్పంచ్‌గా ఏకగ్రీవం లాంఛనమే కానుంది. అయితే రాజ్‌కుమార్ గతంలో సర్పంచ్‌గా పోటీ చేసి ఓడిపోవడంతో ఆయనకు ప్రజల్లో సానుభూతి ఉందనే చర్చ వినిపిస్తోంది. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిచివరి నిమిషంలో పోటీకి విముఖత బరి నుంచి తప్పించింది ఎవరని చర్చలు పార్టీ శ్రేణులు ఇంటికి వెళ్లినానోరు విప్పని మాజీ ఉపసర్పంచ్హేమంత్కుమార్ మరో ఇద్దరు యువకులతోనామినేషన్ వేయించిన గులాబీ నేతలు వారిని సైతం విత్‌డ్రా చేయించేందుకు అధికార పార్టీ నేతల యత్నం -
ఆదివారం అంతంతే..
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వికారాబాద్ నియోజకవర్గంలో రెండో విడతనామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఆదివారం ప్రారంభమైంది. తొలిరోజు పత్రాల సమర్పననెమ్మదించింది. ఆయా మండలాలు,పరిధి గ్రామాల్లో సర్పంచ్, వార్డు స్థానాలకు అభ్యర్థుల నుంచి నామపత్రాలను ఎన్నికల అధికారులు స్వీకరించారు. ధారూర్: మండల పరిధిలో 34 గ్రామ పంచాయతీలు, వార్డులు 286 ఉండగా.. సర్పంచు 35, వార్డులకు 17 దరఖాస్తులు అందాయని ఎంపీడీఓ నర్సింహులు తెలిపారు. సర్పంచ్ నామినేషన్లు ఇలా ఉన్నాయి. నాగసమందర్ 4, గురుచోట్ల 1, పీసీఎంతండా1, నాగారం 1, దోర్నాల 1, మోమిన్‌కలాన్ 1, అంతారం 5, మోమిన్‌కుర్దు 1, రాజాపూర్ 2, తరిగోపుల 1, ధారూరు 3, ధారూరు స్టేషన్ 2, రాంపూర్‌తండా 1, కేరెల్లి 3, ఎబ్బనూర్ 1, మున్నూరుసోమారం 4, కుక్కింద 1, నర్సాపూర్ 1, రుద్రారం 1 నామినేషన్లు దాఖలయ్యాయి. 33 జీపీలకు 38 పత్రాలు నవాబుపేట: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మండలంలోని 33 గ్రామాలకు 38 సర్పంచ్, 276 వార్డులకు 50 నామినేషన్లు వచ్చాయని ఎంపీడీఓ అనురాధ తెలిపారు. మర్పల్లిలో.. మర్పల్లి: మండలంలోని 29 గ్రామ పంచాయతీలు ఉండగా.. సర్పంచులకు 26, 264 వార్డులకు 37 నామినేషన్లు వచ్చాయని ఎన్నికల రిటర్నింగ్ అధికారి సీటీ జయరాంమ్ తెలిపారు. బంట్వారంలో.. బంట్వారం: పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం మొదటి రోజు ఆదివారం అంతంత మాత్రంగానే కనిపించింది. మండలంలోని 12 పంచాయతీలకు 8, 106 వార్డులకు 12 నామినేషన్లు, అదే విధ ంగా కోట్‌పల్లి మండలంలోని 18 పంచాయతీలకు 21, 150 వార్డులకు 8 నామపత్రాలు అందాయని ఎంపీడీఓలు రాములు, హేమంత్ తెలిపారు. మోమిన్‌పేటలో.. మోమిన్‌పేట: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రెండో విడత నామినేషన్ల ప్రక్రియ ఆదివారంమందకొడిగా సాగింది. మండలంలో 29 గ్రామ పంచాయతీలు, 263 వార్డులు ఉన్నాయి. 29సర్పంచ్, 49 వార్డు సభ్యులకు నామపత్రాలు దాఖలయ్యాయి. మండలంలో 8 క్లస్టర్లలో అభ్యర్థుల నుంచి పత్రాలు స్వీకరిస్తున్నారు. మందకొడిగా రెండో దశ నామినేషన్లు -
నేతలకు ఉపసంహరణ పరీక్ష
దౌల్తాబాద్: తొలివిడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ శనివారంతో ముగిసింది. ఒకే పార్టీకి చెందిన అభ్యర్థులు ఇద్దరికి మించి నామినేషన్లు దాఖలు చేసిన చోట్ల వారిని ఉపసంహరించుకునేలా చేయడం నేతలకు పరీక్షగా మారింది. ఆయా స్థానాల్లో పార్టీ బలపరిచన అభ్యర్థుల నుంచి ముఖ్యనేతలపై ఒత్తిడి తీవ్రమైంది. అధికారపార్టీలో ఈ పోటీ తీవ్రంగా ఉంది. దీంతో పార్టీ ముఖ్యనేతలకు తలనొప్పిగా మారింది. ఎవరిని ఎంపిక చేయాలో ఎవరిని బుజ్జగించాలో తెలియని పరిస్థితి నెలకొంది. అత్యధిక పంచాయతీ స్థానాలు దక్కించుకోవాలనే వ్యూహరచనలో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలు సమర్థులు, అంగబలం, అర్ధబలం ఉన్న అభ్యర్థుల అన్వేషణలో పడ్డాయి. ఇదిలా ఉండగా కొన్ని గ్రామాల్లో ప్రధాన పార్టీలకు సైతం వార్డు స్థానాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరక్క పరేషాన్లో పడ్డారు. -
ఒప్పించి.. పత్రాలు రాయించి
● ఫలించిన గ్రామ పెద్దల మంతనాలు ● ఏకగ్రీవం దిశగావాల్యా నాయక్ తండా! దుద్యాల్: పంచాయతీ ఎన్నికల్లో మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ శనివారంతో పూర్తయింది. ఏకగ్రీవం చేసుకుంటే పంచాయతీకి ప్రభుత్వం ప్రత్యేకంగా రూ.10 లక్షల నజరాన ప్రకటించడంతో.. అందరి దృష్టి దానిపైనే పడింది. దీంతో సాధ్యమయ్యే గ్రామాల్లో.. అక్కడి పెద్దలు.. పోటీలో ఉన్న అభ్యర్థులతో చర్చలు జరుపుతున్నారు. అందులో భాగంగా మండల పరిధి వాల్యానాయక్ తండాలో ఆదివారం అదే పంచాయితీ జరిగింది. బరిలో ఉన్న నలుగురితో గ్రామ పెద్దలు మాట్లాడారు. అధికార పార్టీ అభ్యర్థిని ఏకగ్రీవం చేసి, మిగతా వారు నామినేషన్లను ఉపసంహరించుకునే విధంగా ఒప్పంద పత్రాలు రాయించుకున్నారు. మాట నిలబెట్టుకుంటారా? నూతనంగా ఏర్పడిన గ్రామం వాల్యానాయక్ తండా. అభివృద్ధి చెందాలంటే అధికంగా నిధులు అవసరం ఉంటుందని భావించిన తండా పెద్ద మనుషులు.. సర్పంచ్ అభ్యర్థులుగా పోటీలో ఉన్న దేవిబాయి, బుజ్జిబాయి, లలితబాయి, జ్యోతిబాయిలతో ఏకగ్రీవం అంశంపై చర్చించారు. కాంగ్రెస్ అభ్యర్థి దేవిబాయిని ఏకగ్రీవం చేసుకుందామని మిగతా ముగ్గురిని ఒప్పించారు. బుజ్జిబాయి, లలితబాయి, జ్యోతిబాయిలు ఈ నెల 3న నామినేషన్లను విరమించుకోవాలని సూచించారు. దీంతో వారు అంగీకారం తెలిపారు. ఇందుకు సంబంధిత ఒప్పంద పత్రాలను ముగ్గురు నుంచి తీసుకున్నారు. కాగా.. పెద్దల మాట ప్రకారం ఏకగ్రీవం చేస్తారో? లేదో రెండు రోజులు వేచి చూడాలి. ఈ తండాకు అనుబంధంగా సోమ్ల నాయక్ తండా, కస్ననాయక్ తండా, రక్త మైసమ్మ తండా, రెడ్యా నాయక్ తండాలు ఉన్నాయి. సుమారు 700 వరకు జనాభ ఉండగా.. 450 ఓట్లు ఉన్నాయి. -
ప్రతి‘నోటా’మాట!
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నోటా గుర్తును తొలిసారిగా ప్రవేశపెడుతూ ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. పైన ఉన్న అభ్యర్థులు ఎవరూ నచ్చకపోతే.. నోటాకు ఓటు వేసే అవకాశం కల్పించింది. దీంతో ఆ గుర్తుపై ప్రజల్లో చర్చ, అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. దుద్యాల్: శాసనసభ, పార్లమెంటు ఎన్నికలకే పరిమితమైన నోటాను తొలిసారిగా పంచాయతీ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ ప్రవేశ పెట్టింది. స్థానిక ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యుడిగా పోటీ చేసే అభ్యర్థి నచ్చకపోతే నోటాకు ఓటు వేసే అవకాశం ఓటర్లకు కల్పించింది. అయితే తొలి సారిగా అమలు చేస్తున్న దీనిపై గ్రామీణ ప్రాంత ప్రజలకు మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. సాధారణ ఎన్నికలతో పోలిస్తే.. స్థానిక పోరు గ్రామాల అభివృద్ధికి కీలకం. బరిలో నిలిచిన ప్రతి అభ్యర్థికి ప్రతి ఓటు ముఖ్యమే. ఒకటి, రెండు ఓట్ల తేడాతో అభ్యర్థులు ఓటమిని చవిచూసిన సందర్భాలు అనేకం. అయితే ఈ సారి బ్యాలెట్ పేపర్లో ఎన్నికల కమిషన్ నోటాకు అవకాశం ఇవ్వడంతో అభ్యర్థుల్లో ఇప్పటి నుంచే వణుకు మొదలైంది. అవగాహన అవసరం స్థానిక ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. బ్యాలెట్ పత్రాలు, పోలింగ్ సామగ్రి రెడీగా ఉంచారు. జిల్లాలోని మండల కేంద్రాలకుతరలించారు. కాగా.. బ్యాలెట్ పత్రంపై నోటా గుర్తును సైతం ముద్రించడంతో.. దీనిపై పల్లెల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది. ఇటీవలే సాధారణ ఎన్నికల్లో ఈవీఎంలలో నోటా గుర్తుపై ప్రజలకు వివరించారు. గ్రామాల్లో ఎక్కువగా నిరక్షరాశ్యులు ఉండే అవకాశం ఉండటంతో వారికి దీనిపై అవగాహన ఉండదు. కావున నోటా గుర్తుపై అవగాహన అనివార్యం. తారుమారు నోటా గుర్తు వలన ఓటర్లు ఇబ్బందిపడే అవకాశాలున్నాయి. అది ఒక అభ్యర్థి గుర్తుగానే భావించి, అవగాహన లేమితో కొందరు దానికి ఓటేసే అవకాశం లేకపోలేదు. ఒకవేళ అదే జరిగితే.. ఆది నోటా లెక్కలోకి వెళ్తుంది. ప్రస్తుత ఎన్నికల్లో గ్రామాలను బట్టి 300 నుంచి 10 వేల వరకు ఓటర్లు ఉన్న పంచాయతీలు ఉంటాయి. వెయ్యి మంది ఓటర్లు గల జీపీలు 60 శాతానికి పైగా ఉన్నాయి. వార్డుల్లో 50 నుంచి 200లకు పైగా ఓటర్లు ఉంటారు.సర్పంచ్, వార్డు సభ్యుల ఫలితాలు ఒకటి, రెండెంకెల ఓట్ల తేడాతో ఎన్నికయ్యే సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నోటా గురించి.. ఓటర్లకు అవగాహన కల్పించక పోతే.. ఫలితాలు తారుమారు అయ్యే ప్రమాదం ఉంటుందని పోటీదారులు భయాందోళన చెందుతున్నారు. స్థానిక పోరులో నోటాకు చోటు బ్యాలెట్ పేపర్‌పై గుర్తింపు గ్రామాల్లో విస్తృతంగా చర్చ ఓటర్లకు అవగాహన కల్పిస్తే మేలు -
‘లక్ష’ణంగా.. ఏకగ్రీవం దిశగా!
ధారూరు: పంచాయతీలను ఏకగ్రీవం చేసుకునేందుకు ప్రజలు, నాయకులు మొగ్గు చూపుతున్నారు. శనివారం మండల పరిధిలోని అవుసుపల్లిలో గ్రామస్తులు నిర్వహించుకున్న సమావేశంలో సర్పంచ్ రూ.35 లక్షలు, వార్డు మెంబర్లు రూ.50 వేల చొప్పున హనుమాన్ ఆలయ నిర్మాణానికి అందజేయాలని తీర్మానించుకున్నట్లు సమాచారం. గత లోకల్ బాడీ ఎన్నికల్లోనూ ఈ గ్రామం ఎన్నికలు లేకుండానే ఏకగ్రీవంగా పాలకవర్గాన్ని నియమించుకున్నారు. కొండాపూర్ ఖుర్దు పంచాయతీలో సర్పంచ్‌కు రూ.6.50 లక్షలకు ఏకగ్రీమైనట్లు తెలుస్తోంది. నర్సాపూర్ పంచాయతీ సర్పంచ్ రూ.4లక్షలకు ఏకగ్రీవం అవ్వగా రూ.2.50 లక్షలు ఆలయానికి, రూ.1.50 లక్షలు ఇతర ఖర్చులకు వినియోగించనున్నట్లు తెలిసింది. గడ్డమీది గంగారంలోనూ ఏకగ్రీవమైనట్లు తెలిసింది. వీటితో పాటు రాజాపూర్, హరిదాస్‌పల్లి, మోమిన్‌ఖుర్దు, పీసీఎం తండా, గురుదోట్ల, అంపల్లి పంచాతీలు ఏకగ్రీవం వైపు యత్నిస్తున్నాయి. ధారూరుతో పాటు నాగారం, మోమిన్‌కలాన్, నాగసమందర్, కుక్కింద, మున్నూరుసోమారం, కొండాపూర్‌కలాన్, గట్టెపల్లి, రాంపూర్‌తండా, దోర్నాల్, స్టేషన్‌ధారూరు గ్రామ పంచాయతీల్లో పోటీ తీవ్రంగా మారనుంది. ఆదివారం నుంచి మంగళవారం వరకు నామినేషన్ల ఘట్టం ముగియగానే ఎంతమంది బరిలో ఉంటారు, ఎంతమంది తప్పుకుంటారు, ఎంతమంది ఏకగ్రీవం వైపు మొగ్గుచూపుతారనేది తేలనుందని కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. ఆలయ పునఃనిర్మాణానికి ముందుకు.. తాండూరు రూరల్: తాండూరు మండలంలో రెండు పంచాయతీలు ఏకగ్రీవమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జనరల్ రిజర్వేషన్ వచ్చిన వీరారెడ్డిపల్లిలో పురుషోత్తంరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి నామినేషన్లు వేశారు. గ్రామంలో చేపట్టిన ఆంజనేయస్వామి ఆలయ పునర్ నిర్మాణానికి పురుషోత్తంరెడ్డి రూ.11 లక్షలు అందజేసేందుకు ముందుకు వచ్చినట్లు తెలిసింది. దీంతో ఆయనను ఏకవగ్రీవంగా ఎన్నుకునేందుకు స్థానికులు నిర్ణయించినట్లు సమాచారం. చంద్రవంచలో రూ.15 లక్షలు.. చంద్రవంచలో ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణానికి ముందుకు వచ్చిన వారిని సర్పంచ్‌గా ఏకగ్రీవం చేసేందుకు ప్రజలు నిర్ణయించారు. ఈజీపీ జనరల్‌కు రిజర్వ్ కావడంతో సుదర్శన్‌రెడ్డి, విజయ్‌కుమార్‌రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. ఆలయ నిర్మాణానికి రూ.15 లక్షలు అందజేసేందుకు సుదర్శన్‌రెడ్డి ముందుకు వచ్చిన నేపథ్యంలో విజయ్‌కుమార్‌రెడ్డిని విత్ డ్రా చేయించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. -
పెద్దేముల్లో కాంగ్రెస్‌కు షాక్
తాండూరు రూరల్: పెద్దేముల్ మండల కేంద్రంలో అధికార కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి ముఖ్య అనుచరుడు డీవై నర్సింలు శనివారం తన మద్దతుదారులతో కలిసి బీఆర్ఎస్లో చేరారు. మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి సమక్షంలో గులాబీ కండువా వేసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం కాంగ్రెస్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, పెద్దేముల్లో బీఆర్ఎస్ జెండాను ఎగురవేస్తామని ధీమా వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కొహిర్ శ్రీనివాస్, కార్యకర్తలు పాల్గొన్నారు.గులాబీ గూటికి డీవై నర్సింలు -
పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించండి
కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి తిరుపతిరెడ్డి కొడంగల్: గ్రామాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని పార్టీ కొడంగల్ నియోజకవర్గ ఇన్చార్జి తిరుపతిరెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని ఆయన నివాసంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనను కలిశారు. ఈ సందర్భంగా తిరుపతిరెడ్డి మాట్లాడుతూ.. ఒకే పార్టీ నుంచి ఇద్దరు అంతకు మించి ఎక్కువ మంది పోటీ చేస్తే ఇతర పార్టీల మద్దతుదారులు గెలిచే అవకాశం ఉందన్నారు. ఇలా జరగకుండా పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు వెళ్లాలన్నారు. పర్సాపూర్ సర్పంచ్ అభ్యర్థి కన్నం రాధ తన మద్దతుదారులతో వెళ్లి తిరుపతిరెడ్డిని కలిశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నందారం ప్రశాంత్, పర్సాపూర్ మాజీ సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి, తట్టెపల్లి రాములు, శ్రీశైలం, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. -
‘త్రియుండ్’ శిఖరాన.. సాహస విద్యార్థులు
కొడంగల్ రూరల్: హిమాచల్ ప్రదేశ్ ధర్మశాలలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ఇనిస్టిట్యూట్‌లో ఈ నెల 18 నుంచి 27 వరకు నిర్వహించిన జాతీయ సాహస శిక్షణ శిబిరంలో కొడంగల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల బీఏ విద్యార్థి వి.సికిందర్ పాల్గొన్నారని ప్రిన్స్‌పాల్ బి.శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. శనివారం ఆయన.. విద్యార్థి సాహస, విన్యాసాల చిత్రాలను ప్రదర్శిస్తూ.. మాట్లాడారు. ఈ శిబిరంలో పాలమూరు విశ్వవిద్యాలయం నుంచి 10 మంది పాల్గొన్నారని, ఇందులో ఇక్కడి నుంచి సికిందర్ ఒక్కడే ఉన్నారని తెలిపారు. వీరందరూ ఎత్తయిన కొండలపై ట్రెక్కింగ్, రాక్ క్లైంబింగ్, జుమార్ క్లైంబింగ్, రాపెల్లింగ్, వాటర్ స్ప్రోర్ట్స్, యోగా, శారీరక పోటీల్లో పాల్గొన్నారని, వీటిల్లో సికిందర్ ప్రతిభ చాటారని హర్షం వ్యక్తం చేశారు. సముద్ర మట్టానికి 2,875 మీటర్ల ఎత్తులో గల త్రియుండ్ పర్వ శిఖరాన్ని అధిరోహించారన్నారు. కాగా.. వివిధ ప్రాంతాల వారితో కలిసి పనిచేయడంతో భాష, సంస్కృతి, కట్టుబాట్లు తదితర విషయాలు తెలుసుకున్నానని విద్యార్థి పేర్కొన్నట్లు ఆయన తెలిపారు. -
ట్రాక్టర్, బైక్ ఎదురెదురుగా ఢీ
కానిస్టేబుల్‌కు గాయాలు దుద్యాల్: ఎదురెదురుగా ట్రాక్టర్, బైక్ ఢీకొనడంతో ఓ కానిస్టేబుల్ గాయపడ్డాడు. ఈ ఘటన దుద్యాల్ గేట్ వద్ద శనివారం చోటు చేసుకుంది. నారాయణపేట్ జిల్లా సర్జాఖాన్పేట్కు చెందిన శ్రీరామకృష్ణ నగరంలోని యూసుఫ్‌గూడ పోలీస్ స్పెషల్ బెటాలియన్ విభాగంలో విధులు నిర్వహిస్తున్నాడు. ఆయన తన స్వగ్రామానికి బైక్ వచ్చి తిరిగి వెళ్తున్న క్రమంలో దుద్యాల్ గేట్ దగ్గర ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్‌కు దవడ భాగంలో గాయాలయ్యాయి. కొడంగల్ ప్రభుత్వాస్పత్రిలో ప్రథ మ చికిత్స చేసి కోస్గిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్, బైక్‌ను స్టేషన్‌కు తరలించారు. సవాల్‌గా సర్పంచ్ ఎన్నికలు పోటాపోటీగా పార్టీలు మారుతున్న నాయకులు చేవెళ్ల: సర్పంచ్ ఎన్నికలు నేతలకు సవాల్‌గా మారుతున్నాయి. పార్టీలకు అతీతంగా ఎన్నికలు నిర్వహిస్తున్నా పార్టీలే తెరవెనుక ఉండి నడిపిస్తాయి. దీంతో ఇన్నాళ్లుగా పార్టీ నమ్ముకుని ఉన్నవారు కొందరికి అవకాశాలు రాక.. మరికొందరు తమ వ్యతిరేక వర్గం వారిని బలపరుస్తున్నారనే తదితర కారణాలతో పార్టీలు మారుతున్నారు. అభ్యర్థుల గెలుపును ప్రధాన పార్టీల నాయకులు భుజానెత్తుకుని పోటాపోటీగా ప్రచారాలు చేయిస్తున్నారు. మండల పరిధిలోని ముడిమ్యాలలో ఈ పరంపర ఎక్కువగా కొనసాగుతోంది. తాజాగా ఎంపీటీసీ మాజీ సభ్యుడు బూర్ల సాయినాథ్ కాంగ్రెస్‌ను వీడి మాజీ మంత్రి సబితారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. దీంతో శనివారం మాజీ ఉపసర్పంచ్ షేక్ ఆరీఫ్ కారు దిగి ఎమ్మెల్యే కాలె యాదయ్య సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి, పి.ప్రభాకర్, శ్రీనివాస్‌రెడ్డి, కుమార్ తదితరులు ఉన్నారు. నాగిరెడ్డిగూడలో ఫ్లాగ్ మార్చ్ మొయినాబాద్‌రూరల్: ఎన్నికల సమయంలో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రజలను భయబ్రాంతులకు గురి చేయకుండా అభ్యర్థులు, నాయకులు పోలింగ్‌ను సక్రమంగా నిర్వహించేందుకు కృషి చేయాలని మొయినాబాద్ సీఐ పవన్‌కుమార్‌రెడ్డి అన్నారు. శనివారం రాత్రి మండల పరిధిలోని నాగిరెడ్డిగూడలో పోలీస్ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు నాయకుల భయబ్రాంతులకు గురికాకుండా ఎన్నికల్లో స్వేచ్ఛగా ఓటు వేసేందుకు శాంతియుతంగా ముందుకు వెళ్లాలని సూచించారు. ప్రజాప్రతినిధులే దేశానికి ఆదర్శం అని అందుకు నిజమైన నాయకుడిని ఎన్నుకునేందుకు తమకు ఇష్టానుసారంగా ఓటు వేయాలని తెలిపారు. ఎటువంటి ప్రలోభాలకు లోనుకావొద్దని సూచించారు. పట్టుబడిన మద్యం కొందుర్గు: స్థానిక ఎన్నికల్లో భాగంగా వాహనాల తనిఖీ చేస్తుండగా ఓ కారులో మద్యం బాటిళ్లు తరలిస్తుండగా పట్టుకున్నట్లు జిల్లేడ్ చౌదరిగూడ ఎస్సై విజయ్ కుమార్ తెలిపారు. లాల్‌పహాడ్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా స్విఫ్ట్ కారులో రూ.5,525 విలువైన 34 కింగ్ ఫిషర్ బీర్లు లభ్యమైనట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు మద్యం బాటిళ్లు సీజ్ చేసి కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. -
ఏకగ్రీవం.. ఏం లాభం!
● యునానిమస్ చేస్తే ప్రోత్సాహకాలు అంటూ గత ప్రభుత్వం ప్రకటనలు ● ప్రస్తుతం ఊసెత్తని కాంగ్రెస్ ప్రభుత్వంకాంగ్రెస్ ప్రభుత్వం గత పాలనలో పంచాయతీలను ఏకగ్రీవం చేసుకుంటే గ్రామాభివృద్ధికి రూ.7లక్షల నజరానా అందించగా.. 2019లో బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.10లక్షలు, ఎమ్మెల్యే నిధుల నుంచి మరో రూ.5లక్షలు అందజేస్తామని ప్రకటించింది. ప్రస్తుత ప్రభుత్వం నుంచి ఏకగ్రీవాలపై ఎలాంటి ప్రకటన రాలేదు. దౌల్తాబాద్/షాబాద్: పంచాయతీ ఎన్నికల కోలాహలం ప్రారంభమైంది. డిసెంబర్ 11న జరిగే మొదటి విడత ఎన్నికలకు సంబంధించి సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్లు ప్రక్రియ శనివారం పూర్తయింది. గ్రామ పంచాయతీ పాలకవర్గాలకు ఎన్నికలు జరపకుండా ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. గ్రామ పంచాయతీ పాలనలో అవినీతికి తావుండదు. సర్పంచ్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ప్రభుత్వం నగదు ప్రోత్సహాకాలు అందజేయడం ఆనవాయితీగా వస్తుంది. గత ప్రభుత్వాలు ఏకగ్రీవమైన పంచాయతీలకు నిధులు విడుదల చేయలేదు. దీంతో ఈ సారి ఎన్నికల్లో ఏకగ్రీవాలపై స్థానిక నాయకులు అసక్తి చూపడంలేదు. రూ.15 లక్షలకు పెంచినా అందించలేదు గ్రామాల్లో రాజకీయ కక్షలు పెరగకుండా ఉండాలంటే గ్రామస్తులు కూర్చుని ఏకగ్రీవ పద్ధతిలో సర్పంచ్, వార్డు సభ్యులు, ఉపసర్పంచ్‌ను ఎన్నుకునే ఆనవాయితీ ఉమ్మడి రాష్ట్రంలో విస్తృతం చేశారు. ఏకగ్రీవంగా ప్రజాప్రతినిధులను ఎంపిక చేసిన పంచాయతీలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తే గ్రామాల అభివృద్ధి చెందుతాయని చాలా చోట్ల ఏకగ్రీవాలు జరిగాయి. 2019లో పంచాయతీ ఎన్నికల సందర్భంగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏకగ్రీవ ప్రోత్సహక పథకాన్ని రూ.15లక్షలకు పెంచింది. అప్పట్లో చాలా పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. కానీ నిధుల కొరతతో ఏ ఒక్క పంచాయతీకి నజరానా అందించలేదు. ఈ సారి మూడు విడతల్లో ఎన్నికలను జరపనుండగా తొలివిడత సంగ్రామం మొదలైనా ప్రభుత్వం నుంచి ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సహక విషయంపై స్పష్టత లేదు. స్పష్టత రాలేదు ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహకాలను అందించే విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ప్రభుత్వం మార్గదర్శకాలను జారీచేస్తే ఈ అంశాన్ని అన్ని గ్రామాల ప్రజలకు తెలియజేస్తాం. – అపర్ణ, ఎంపీడీఓ, షాబాద్ -
కరన్‌కోట్‌లో కంగుతిన్న కారు
తాండూరు రూరల్: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే పెద్ద పంచాయతీ అయిన కరన్‌కోట్‌లో బీఆర్ఎస్కు ఎదురుదెబ్బ తగిలింది. ఈగ్రామం ప్రస్తుత ఎన్నికల్లో జనరల్‌కు రిజర్వ్ అయింది. ఇక్కడ కాంగ్రెస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి రాజ్‌కుమార్ శనివారం తన ప్యానెల్‌కు చెందిన 14 మంది వార్డు సభ్యులతో కలిసి నామినేషన్ వేశారు. బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి హేమంత్‌కుమార్ శనివారం నామినేషన్ వేయాల్సి ఉంది. గతంలో తన సతీమణిని సర్పంచ్‌గా గెలిపించుకోవడంతో పాటు మాజీ ఉప సర్పంచ్‌గా పని చేసిన అనుభవం ఉన్న, బలమైన నాయకుడు కావడంతో పోటీ రసవత్తరంగా ఉంటుందని అంతా భావించారు. ఏం జరిగిందో ఏమో కానీ చివరి నిమిషంలో నామివేషన్ వేసేందుకు హేమంత్‌కుమార్ ససేమిరా అన్నారు. ఊహించని ఈ పరిణామంతో బీఆర్ఎస్ శ్రేణులు, మద్దతుదారులు కంగుతిన్నారు. మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి నచ్చజెప్పినా వినకపోవడంతో హడావుడిగా అశోక్‌కుమార్‌తో పాటు మరో ఇద్దరితో నామినేషన్ వేయించారు. ఇదిలా ఉండగా అధికార పార్టీకి చెందిన కొంతమంది నేతలు బెదిరించడంతోనే హేమంత్ వెనక్కి తగ్గాడని బీఆర్ఎస్ నాయకులు బోయ అశోక్‌కుమార్, సుధకర్గౌడ్, స్వామి తదితరులు ఆరోపించారు. ఇదిలా ఉండగా కరన్‌కోట్‌లో సీసీఐ ఫ్యాక్టరీతో పాటు పదుల సంఖ్యలో నాపరాతి గనులు ఉన్నాయి. దీంతో పంచాయతీకి మంచి ఆదాయం ఉంటుంది. ఇక్కడ 10 వేల మందికిపైగా జనాభా, 7,354 మంది ఓటర్లు ఉన్నారు. నామినేషన్‌కు నిరాకరించినహేమంత్కుమార్ మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి నచ్చజెప్పినా వినని వైనం కాంగ్రెస్ నేతలు బెదిరించారని గులాబీ శ్రేణుల ఆరోపణ -
పార్టీకి నష్టం కలిగిస్తే కఠిన నిర్ణయాలు
● విధేయులకు భవిష్యత్‌లో పదవులు ● ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి తాండూరు రూరల్: కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగిస్తే కఠిన నిర్ణయాలు తప్పవని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి పార్టీ శ్రేణులను హెచ్చరించారు. శనివారం ఆయన మండల పరిధిలోని మల్కాపూర్‌లో కాంగ్రెస్ శ్రేణులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మండల పరిధిలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల గెలుపనకు పనిచేయాలన్నారు. కాంగ్రెస్ నుంచి ఒక్కో గ్రామంలో ఇద్దరు నుంచి ముగ్గురు నామినేషన్ వేస్తే ఎలా.. విత్‌డ్రా చేసుకునేందుకు సమయం ఉందని కూర్చుని మాట్లాడుదాం అన్నారు. పార్టీకి విధేయులుగా ఉన్నవారికి భవిష్యత్‌లో పదవులు ఉంటాయని చెప్పారు. భవిష్యత్‌లో ఎంపీటీసీ సభ్యుడిగా పోటీ చేసే అవకాశం ఉంటుందని చెప్పా రు. ఈ కార్యక్రమంలో నాయకులు డీసీసీబీ వైస్ చైర్మన్ రవిగౌడ్, డాక్టర్ సంపత్ కుమార్, పటేల్ జనార్ధన్‌రెడ్డి, రవిసింథే, పండరి, విజయలక్ష్మి, గోపాల్‌రెడ్డి పటేల్, రఘునాథ్‌రెడ్డి పాల్గొన్నారు. -
ఆడిట్‌తో నాణ్యతా ప్రమాణాలు అంచనా
చేవెళ్ల: ఉన్నత విద్యా సంస్థల నాణ్య, ప్రమాణాలను అంచనా వేయడంలో అకడమిక్ ఆడిట్లు కీలకపాత్ర పోసిస్తాయని అకడమిక్ నిపుణులు శేరిలింగంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ.కవిత, హయత్‌నగర్ డిగ్రీ కళాశాల సీనియర్ ఫ్యాకల్టీ డాక్టర్ వి.ఇందిర అన్నారు. శనివారం చేవెళ్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్ కాంచనలత ఆధ్వర్యంలో 2022–23, 2023–24కు సంబంధించి అకడమిక్ ఆడిట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల విద్యా వ్యవస్థను సమీక్షించి పలు నాణ్యతా ప్రమాణాలపై పరిశీలించిన అధికారులు మాట్లాడుతూ.. కళాశాలలోని వసతులు, సంస్థ సాధిస్తున్న పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఆడిట్‌తో భోధనా విధానాలు, సహపాఠ్య కార్యకలాపాలపై సమగ్ర విశ్లేషణ చేసే అవకాశాన్ని కల్పిస్తుందని చెప్పారు. వీటి నుంచి లభించే సూచనలు సంస్థ అభివృద్ధి, విద్యార్థుల విజయానికి నిర్మాణాత్మక, మార్గదర్శకత్వంగా నిలుస్తాయని తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కాంచనలత మాట్లాడుతూ.. అకడమిక్ ఆడిట్‌తో లోటుపాట్లను గుర్తించి కళాశాల విద్యా ప్రమాణాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉంటుందన్నారు. ఆడిట్ అధికారులు సూచించిన ప్రతీ సిపార్సును వ్యవస్తీకృతంగా అమలు సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.రమేశ్‌బాబు, అకడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్.విజయలక్ష్మి, పాల్గొన్నారు. డాక్టర్ కవిత, డాక్టర్ ఇందిర -
కాంగ్రెస్‌తోనే గ్రామాల అభివృద్ధి
● సీఎం రేవంత్‌రెడ్డికి మద్దతుగా నిలవాలి ● గజ్జల రవీంద్రనర్సింహారెడ్డి దుద్యాల్: కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధిని చూసి, ప్రజలు ప్రభుత్వం వెంట నడుస్తున్నారని ఆ పార్టీ జిల్లా నాయకుడు గజ్జల నర్సింహారెడ్డి అన్నారు. మండలంలోని హకీంపేట్ సర్పంచ్ అభ్యర్థిగా తన భార్య రవీంద్రతో శనివారం నామినేషన్ వేయించారు. మద్దతుదారులు, గ్రామస్తులతో కలిసి ర్యాలీగా నామినేషన్ సెంటర్‌కు వెళ్లారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఏర్పాటైన రెండేళ్ల కాలంలోనే గ్రామానికి రూ.6 కోట్ల నిధులు ఇచ్చారన్నారు. హకీంపేట్‌లో వందల కోట్లతో పారిశ్రామిక వాడ, ఎడ్యుకేషన్ హబ్‌ను ఏర్పాటు చేస్తున్న ముఖ్యమంత్రి ఈప్రాంత సమగ్రాభివృద్ధికి కృషిచేస్తున్నారన్నారు. తన సొంత డబ్బులతో గ్రామంలో ఆలయం నిర్మిస్తున్నానని స్పష్టంచేశారు. గ్రామాభివృద్ధికి అవసరమైనన్ని నిధులు తీసుకువస్తానని ధీమా వ్యక్తంచేశారు. అన్ని గ్రామాల ప్రజలు కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులను గెలిపించాలని కోరారు. హకీంపేట్ పంచాయతీ త్వరలోనే రాష్ట్రానికి రోల్ మోడల్‌గా రూపుదిద్దుకుంటుందని వెల్లడించారు. పారిశ్రామిక వాడకు భూములు ఇచ్చిన రైతులకు అన్ని సౌకర్యాలు అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో విద్యాలయాలు, రోడ్లు, కంపెనీలు ఏర్పాటు చేస్తున్నారన్నారు. త్వరలోనే హకీంపేట్ రెవెన్యూ డివిజన్‌గా ఏర్పడుతుందని తెలిపారు. కొడంగల్ నియోజకవర్గంలోని ఓటర్లందరూ రేవంత్‌రెడ్డికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు సంజీవరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, నరెందర్‌రెడ్డి, బిచ్చిరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, శ్రీనివాస్, సాయిలు, అశోక్, వెంకటేశ్, అంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
సర్పంచ్ లాంఛనమే!
బషీరాబాద్: మండలంలోని మూడు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. మంతన్‌గౌడ్, హంక్యానాయక్ తండా, బాబునాయక్ తండాల్లో సర్పంచ్ స్థానానికి, అన్ని వార్డులకు ఒక్కొక్కరే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఆ స్థానాలు యునానిమస్ అయ్యాయి. స్క్రూట్నీ అనంతరం అధికారికంగా ప్రకటిస్తారు. భీమప్ప కుటుంబంలో ముగ్గురికి పదవులు మంతన్‌గౌడ్ గ్రామం ఎస్టీ రిజర్వ్డ్ కావడంతో ఎరుకలి సామాజిక వర్గానికి చెందిన ఒకే కుటుంబం ఉంది. భీమప్ప ఒక్కరే సర్పంచ్ స్థానానికి నామినేషన్ వేశారు. రెండు వార్డు స్థానాలు కూడా ఎస్టీ రిజర్వ్డ్ కావడంతో భీమప్ప కొడుకు ఎరుకలి మహేష్, కోడలు ఎరుకలి సుజాతకు నామినేషన్ వేశారు. వారు గెలుపు లాంఛనమైంది. దీంతో ఒకే కుటుంబంలో ముగ్గురికి పదవులు వరించాయి. నజరానాతో.. ఏకగ్రీవ పంచాయతీల అభివృద్ధికి రూ.10లక్షలు, పెద్ద జీపీలకు రూ.20లక్షలు కేటాయిస్తామని తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో హంక్యానాయక్ తండా, బాబు నాయక్‌తండా ప్రజలు గ్రామసభలు ఏర్పాటు చేసుకొని యునానిమస్ చేసుకోవాలని నిర్ణయించారు. హంక్యానాయక్ తండా నుంచి సర్పంచ్ స్థానాలకు అనిత రాథోడ్ తోపాటు 6 వార్డు స్థానాలకు ఒక్కరు చొప్పున మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు. బాబునాయక్ తండా నుంచి సర్పంచ్ స్థానానికి జెర్పుల అనిత తోపాటు 8 మంది వార్డు స్థానాలకు ఒక్కరు చొప్పున మాత్రమే నామినేషన్లు వేయించారు. దీంతో అన్ని స్థానాలు ఏకగ్రావమయ్యాయి. జెర్పుల అనిత (బాబునాయక్‌తండా)అనిత రాథోడ్ (హంక్యానాయక్తండా)ఎరుకలి భీమప్ప, మహేష్, సుజాత(మంతన్‌గౌడ్) జిల్లాలో 18 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం స్క్రూట్నీ అనంతరం అధికారిక ప్రకటన నామినేషన్ల ఉప సంహరణ నాటికి మరికొన్ని పెరిగే అవకాశంజిల్లాలో 18 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఆయా జీపీల్లో ఒక్కరు చొప్పున సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేయడంతో గెలుపు లాంఛనమైంది. స్క్రూట్నీ అనంతరం అధికారికంగా ప్రకటించనున్నారు. బషీరాబాద్ మండలంలో 3, యాలాల మండలంలో 5, దుద్యాల్, తాండూరు మండలాల్లో ఒకటి చొప్పన, పెద్దేముల్ మండలంలో 2, బొంరాస్ పేట మండలం నుంచి ఆరు పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. నామినేషన్ల ఉప సంహరణ నాటికి మరికొన్ని పంచాయతీలు ఏకగ్రీవమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దుద్యాల్: మండలంలోని సంగాయిపల్లి పంచాయతీ ఏకగ్రీవం అయ్యింది. గ్రామానికి చెందిన అన్ని పార్టీల నాయకులు రెండు రోజులుగా చర్చలు జరిపారు. వెంకట్‌రెడ్డిని సర్పంచ్ అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎనిమిది వార్డు స్థానాలకు కూడా ఒక్కరు చొప్పన నామినేషన్ దాఖలు చేశారు. దీంతో వారి ఎన్నిక లాంఛనమైంది. -
పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే
హుడాకాంప్లెక్స్: వైకల్యమనేది శరీరానికే గానీ మనసుకు కాదని, సాధించాలనే తపన ఉండాలే గానీ ఏదైనా సాధ్యమే అని జిల్లా సంక్షేమాధికారి శ్రీలత అన్నారు. సరూర్‌నగర్ స్టేడియంలో శనివారం మహిళా, శిశు సంక్షేమ, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి క్రీడాపోటీలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీలత జ్యోతి ప్రజ్వలన చేసి, జెండా ఊపి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దివ్యాంగులు తమ ప్రతిభాపాటవాలు చూపడానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని అన్నారు. సుమారు 600 మంది దివ్యాంగులు ఈ పోటీల్లో పాల్గొనడం వారి మానసిక స్థైర్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. పరుగు పందెం, షాట్‌పుట్, జావెలిన్‌త్రో, క్యారమ్స్, చెస్ తదితర అంశాల్లో చిన్నారులు, పెద్దల కేటగిరీలుగా పోటీలు నిర్వహించారు. ప్రతిభ కనబర్చినవారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థల నుంచి వచ్చిన దివ్యాంగులు, వసతి గృహాల విద్యార్థులు, ఐసీడీఎస్ శాఖలోని సీడీపీఓలు, సూపర్వైజర్లు, డీఆర్డీఏ సిబ్బంది పాల్గొన్నారు. -
విద్యార్థులు మానసిక
● మారుతున్న కాలానికి అనుగుణంగా సంసిద్ధం కావాలి ● వ్యక్తిత్వ వికాస నిపుణుడు రవిపాల్రెడ్డిఒత్తిడికి లోనుకావొద్దు తాండూరు: పదో తరగతి విద్యార్థులు పరీక్షల సమయంలో మానసిక ఒత్తిడికి లోనుకారాదని వ్యక్తిత్వ వికాస నిపుణుడు, సిగ్మా ఐఏఎస్ అకాడమీ డైరక్టర్ బండ రవిపాల్‌రెడ్డి సూచించారు. శనివారం తాండూరు పట్టణంలోని తులసీ గార్డెన్లో సేవా భారతి, నిష్ట ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు భవిషత్ కార్యాచరణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టెన్త్ పాసైన తర్వాత ఏ కోర్సులో చేరాలనే దానిపై విద్యార్థులు ఉక్కిరి బిక్కిరి కాకుండా సరైన నిర్ణయం తీసుకోవాలన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యా ప్రమాణాలలో మార్పులు వస్తున్నాయని పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా విద్యార్థులు సంసిద్ధం కావాలని సూచించారు. రోజూ దిన పత్రికలు చదవడం అలవాటు చేసుకోవాలని తెలిపారు. పరీక్షల సమయంలో చదవడంతోపాటు రాయడం కూడా చేయాలన్నారు. పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలన్నారు. వ్యక్తిత్వ వికాసం వల్ల విజ్ఞానం పెరుగుతోందని చెప్పారు. యువత వ్యసనాలకు దూరంగా ఉండి భవిష్యత్‌కు బంగారు బాట వేసుకోవాలన్నారు. అనంతరం సింగ్రీ అకాడమీ డైరక్టర్ శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ.. జీవితంలో విజయం సాధించాలంటూ ధైర్యం, పట్టుదల, నిరంతర సాధన అవసరం అన్నారు. నీట్, ఐఏఎస్ లాంటి పోటీ పరీక్షలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కొట్రికే విజయలక్ష్మి, నాయకులు బాలకృష్ణ, గాజుల బస్వరాజ్, అనురాధ, రమేష్, కేవీఎం వెంకట్, వెంకట్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, సుబ్బారావు, ప్రభు శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
● యాలాల మండలంలో..
యాలాల: మండలంలోని మూడు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. ఆయా జీపీల్లో సర్పంచ్, వార్డు స్థానాలకు ఒక్కొక్కరు చొప్పున నామినేషన్లు వేశారు. దీంతో వారు ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. సంగెంకుర్దు పంచాయతీ జనరల్‌కు రిజర్వేషన్ ఖరారు కాగా, ఆ గ్రామానికి చెందిన సంగం సుధాలక్ష్మి సర్పంచ్ స్థానానికి నామినేషన్ వేశారు. లక్ష్మీనారాయణపూర్ జీపీ జనరల్ మహిళకు కేటాయించడంతో గుర్రాల నాగమణి ఒక్కరే సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. కిష్టాపూర్ పంచాయతీ ఎస్సీ మహిళకు రిజర్వ్ కావడంతో ఆ గ్రామానికి చెందిన స్వప్న ఒక్కరే సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. గంగాసాగర్‌లో జనరల్‌కు రిజర్వ్ కావడంతో గ్రామానికి చెందిన మల్లేశం, సంగాయగుట్టతండా ఎస్టీ జనరల్‌కి రిజర్వ్ కావడంతో కిషన్ నాయక్ ఒక్కరే నామినేషన్ వేయడంతో వారి ఎన్నిక లాంఛనప్రాయమే. సుధాలక్ష్మి (సంగెంకుర్దు) నాగమణి (లక్ష్మీనారాయణపూర్) -
కేసీఆర్ దీక్ష ఫలితమే ప్రత్యేక తెలంగాణ
వికారాబాద్: కేసీఆర్ దీక్ష ఫలితమే ప్రత్యేక తెలంగాణ అని.. చావు నోట్లో తలపెట్టి రాష్ట్రం సాధించిన ఘనత ఆయనకే దక్కుతుందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. శనివారం వికారాబాద్ పట్టణంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో దీక్షా దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా తెలంగాణ తల్లి, కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. తెలంగాణ అమరులకు నివాళి అర్పించారు. అనంతరం ఉద్యమకారులకు సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీమాంధ్ర పాలనలో అణచివేతకు, వివక్షకు గురైన తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు కేసీఆర్ ఉద్యమ సారథి అయ్యారని గుర్తుచేశారు. ఆయన నడుం బిగించి సకల జనులను కదిలించారన్నారు. అప్పటి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ప్రత్యేక రాష్ట్రం సాధించి పెట్టారని పేర్కొన్నారు. తెచ్చుకున్న తెలంగాణలో అన్ని వర్గాలకు సమన్యాయం చేసేలా పాలన అందించారని తెలిపారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని విమర్శించారు. ఇందుకు లగచర్ల ఘటనే నిదర్శనమన్నారు. రేవంత్‌రెడ్డి ఫెయిల్యూర్ సీఎం అని అన్నారు. బీఆర్ఎస్ రైతులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ సారథ్యంలోనే బంగారు తెలంగాణ సాధ్యమైందన్నారు. పాలనలో ఆయనకు ఎవరూ సాటిరారన్నారు. మిషన్ భగీరథ, కాళేశ్వరం, మిషన్ కాకతీయ వంటి ఎన్నో అద్భుత పథకాలు తెచ్చి ప్రజల మన్ననలు పొందారని కొనియాడారు. కేసీఆర్ దీక్షకు పునుకోకపోతే తెలంగాణ వచ్చేదా..? అని కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించారు. నాడు ఆంధ్రా పాలకులకు తొత్తులుగా ఉన్న వ్యక్తులకు కేసీఆర్ గురించి మాట్లాడే హక్కే లేదన్నారు. రాష్ట్రం వచ్చాక కేసీఆర్ రైతు బాంధవుడిగా మారారని అన్నారు. రైతు బీమా, రైతుబంధు లాంటి ఎన్నో పథకాలు తెచ్చి అండగా నిలిచారని పేర్కొన్నారు. అనంతరం జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ విజయ్‌కుమార్, విద్యా మౌలిక వనరుల కల్పన సంస్థ రాష్ట్ర మాజీ చైర్మన్ నగేందర్గౌడ్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్‌పటేల్ మాట్లాడారు. కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ ఉద్యమం ఎగిసిపడిందన్నారు. తెలంగాణ అమరులకు ప్రతిఒక్కరూ రుణపడి ఉండాలన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు వచ్చాయన్నారు. చిన్న జిల్లాల ఏర్పాటుతో పాలన ప్రజలకు అందుబాటులోకి వచ్చిందన్నారు. చావు నోట్లో తలపెట్టి రాష్ట్రం తెచ్చిండు తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిన ఘనత ఆయనదే గెలిచిన ఏడాదిలోపే రేవంత్ రాష్ట్రాన్ని ఆగం చేసిండు దీక్షా దివస్ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ -
రేపు సామూహిక భగవద్గీత పారాయణం
అనంతగిరి: గీతా జయంతిని పురస్కరించుకొని సోమవారం వికారాబాద్ పట్టణం శివాజీ నగర్ గణేశ్ కట్ట వద్ద సంపూర్ణ భగవద్గీత పారాయణం, గీతాయజ్ఞం నిర్వహించనున్నట్లు గీతావాహిణి అధ్యక్షురాలు టీ శ్రీదేవి సదానందరెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9.30నుంచి మధ్యాహ్న 12.30గంటల వరకు కార్యక్రమం ఉంటుందన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె కోరారు. సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ తాండూరు రూరల్: సర్పంచ్, వార్డు స్థానాలకు అభ్యర్థులు వేసే నామినేషన్లను క్షుణ్ణంగా పరిశీలించి, తిరస్కరణకు గురికాకుండా చూడాలని తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ ఆర్ఓలకు సూచించారు. శనివారం మండలంలోని గౌతాపూర్ నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు అన్ని పత్రాలు సమర్పించాలన్నారు. ఏదైనా తిరస్కరణకు గురైతే ఆర్టీఓకు అప్పీలు చేసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. కందుకూరు: ఫ్యూచర్‌సిటీలో డిసెంబర్ 8, 9 తేదీల్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న గ్లోబల్ సమ్మిట్‌కు సంబంధించిన ఏర్పాట్లను సంబంధిత శాఖలకు చెందిన అధికారులు వేగంగా చేపట్టారు. గ్లోబల్ సమ్మిట్‌కు వచ్చే మార్గంలో శ్రీశైలం–హైదరాబాద్ రహదారిపై పెద్దమ్మ దేవాలయం నుంచి కొత్తూర్ గేట్ ఫ్యూచర్‌సిటీ రహదారి వరకు నేషనల్ హైవే అధికారులు తారు వేసే పనులు చేపట్టారు. ఫ్యూచర్‌సిటీ మార్గంలో ఇప్పటికే గ్రీనరీ ఉండగా అదనంగా మొక్కలు నాటే పనులను హెచ్ఎండీఏ అధికారులు చేపట్టారు. మున్సిపల్ అధికారులు తుక్కుగూడ ఓఆర్ఆర్ నుంచి వచ్చే మార్గంలో ఇరువైపులా కుండీల్లో నాటిన మొక్కలను ఏర్పాటు చేయిస్తున్నారు. ఆయా శాఖల అధికారులు తమ పనుల్లో బిజీబిజీ అయ్యారు. మరోవైపు నిత్యం ఎవరో ఒక అధికారి గ్లోబల్ సమ్మిట్ ప్రాంతాన్ని సందర్శిస్తుండటంతో పోలీసు అధికారులు అప్రమత్తమయ్యారు. ఇబ్రహీంపట్నం: తెలంగాణ మత్స్యకారులు, మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఇబ్రహీంపట్నంకు చెందిన చెనమోని శంకర్ ఎన్నికయ్యారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగిన ఆ సంఘం 4వ రాష్ట్ర మహాసభల్లో ఈ మేరకు శంకర్‌ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా శనివారం శంకర్ మాట్లాడుతూ.. తనపై ఎంతో నమ్మకంతో ఈ పదవి అప్పగించిన వారి ఆశలను వమ్ము చేయకుండా, మత్స్యకారుల, కార్మికుల సమస్యల పరిష్కరానికి అహర్నిశలు కృషిచేస్తానని తెలిపారు. మొయినాబాద్: ఇందిరమ్మ కాలంలో దళితులకు ఇచ్చిన భూములను ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గుంజుకోవడానికి కుట్రలు చేస్తోందని దళిత కుటుంబాలు ఆందోళనకు దిగాయి. మున్సిపల్ పరిధిలోని పెద్దమంగళారంలో సర్వేనంబర్ 218/1లో 6 ఎకరాల భూమిని కోళ్ల ఫారాల నిర్మించుకోవడానికి యాబై ఏళ్ల క్రితం ఇందిరా గాంధీ హయాంలో గ్రామానికి చెందిన 36 మంది దళిత కుటుంబాలకు కేటాయించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం సదరు సర్వేనంబర్‌లోని మొత్తం ప్రభుత్వ భూమిని హెచ్ఎండీఏకు అప్పగించింది. దళితులకు కేటాయించిన భూములు సైతం అందులోనే కలిపి చదును చేస్తుండడంతో శనివారం దళితులు అక్కడికి చేరుకుని ఆందోళన చేశారు. తమకు కేటాయించిన భూమిని తమకే ఇవ్వాలని.. ఇతరులకు కేటాయించొద్దని పట్టు బట్టారు. దీనిపై కలెక్టర్‌ను కలిసి తమ ఆవేదన చెప్పుకొంటామన్నారు. ఎట్టి పరిస్థితుత్లో భూములు వదులుకోమని తేల్చి చెప్పారు. భూములు గుంజుకోవాలని చూస్తే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. -
అన్నా డబ్బులున్నయా.. వడ్డీ ఎంతైనా ఓకే!
రంగారెడ్డి జిల్లా: ‘అన్నా.. సర్పంచ్ రిజర్వేషన్ కలిసొచ్చింది.. ఏమైనా డబ్బులున్నయా.. రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు చూడు అత్యవసరమన్నా.. నేను గెలిస్తే నీవు గెలిచినట్లే’ అని పంచాయతీ పోటీదారులు అప్పుల కోసం ఆరాటపడుతున్నారు. ఇందుకోసం వ్యవసాయ భూమి, లేదా ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసేందుకు ముందుకు వస్తున్నారు. వచ్చే నెల 11, 14, 17 తేదీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ నిర్ణయించిన నేపథ్యంలో నగదు సమకూర్చుకునే పనిలో బిజీగా ఉన్నారు. జిల్లాలోని 526, 4,668 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం సర్పంచ్‌లుగా పోటీ చేస్తున్న వారిలో చాలా వరకు స్థానికంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారే. రెండేళ్లుగా బిజినెస్ లేకపోవడంతో కొంత డీలా పడ్డారు. ఈక్రమంలో పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన పంచాయతీ ఎన్నికలు రానే వచ్చాయి.పదవులకు భలే డిమాండ్మహానగరం చుట్టూ విస్తరించి ఉన్న పలు మండలాల్లోని గ్రామాల్లో సర్పంచ్ పదవులకు భలే డిమాండ్ ఉంది. వెంచర్ల ఏర్పాటు, ఇళ్ల నిర్మాణం, పరిశ్రమల కోసం పంచాయతీల అనుమతులు ఎంతో కీలకం. ఈ నేపథ్యంలో సర్పంచ్‌లుగా గెలిచిన వారికి ఎంతో కొంత ఆదాయానికి అవకాశం ఉంటుంది. దీంతో ఎన్ని డబ్బులైనా ఖర్చు చేసి, సర్పంచ్‌గా గెలవాల్సిందేనని ఆశావహులు పట్టుదలతో ఉన్నారు. వెయ్యి మంది నుంచి 2,500 మంది ఓటర్లకు పైగా ఉన్న గ్రామాల్లో సర్పంచ్‌గా పోటీ చేసేందుకు కనీసం రూ.50 లక్షల నుంచి కోటి వరకు ఖర్చవుతుందని తెలుస్తోంది. పోటీ చేసే వ్యక్తికి మంచి పేరున్నా.. ఎన్ని సేవా కార్యక్రమాలు చేసినా ఎన్నికల సమయంలో పెద్ద మొత్తం డబ్బు ఖర్చు చేయనిదే గెలిచే పరిస్థితి ఉండదు. అందుకే పోటీదారులంతా అప్పుల కోసం వడ్డీ వ్యాపారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఐదు రూపాయల వడ్డీ అయినా సరే అప్పు తీసుకునేందుకు వెనకాడటం లేదు. ఇదే అదనుగా భావిస్తున్న వడ్డీ వ్యాపారులు ముందు జాగ్రత్తగా భూములు, ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయించుకుని అప్పులు ఇస్తున్నారు. ఇబ్రహీంపట్నం, కందుకూరు డివిజన్ల పరిధిలోని యాచారం, మంచాల, ఇబ్రహీంపట్నం, కందుకూరు, ఆమనగల్లు, కడ్తాల్, మాడ్గుల, తలకొండపల్లి మండలాల్లో ఈవ్యాపారం జోరుగా సాగుతోంది.రూ.2 వేల కోట్లకు పైనే ఖర్చుజిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే ఆశావహులు రూ.2 వేల కోట్లకు పైగానే ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. చిన్న గ్రామంలో నాలుగు పార్టీల మద్దతుదారులు పోటీ చేస్తే రూ.2 కోట్ల వరకు ఖర్చయ్యే అవకాశం ఉంటుంది. అదే 2,500లకు పైగా ఓటర్లు ఉన్న గ్రామ పంచాయతీల్లో నలుగురైదుగురు బరిలో ఉంటే రూ.5 కోట్లకు పైగానే ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ స్థానాల్లో ఈమొత్తం కొంత తగ్గే అవకాశం ఉన్నా, జనరల్, బీసీ స్థానాల్లో అంతకు మించి పెరుగుతుంది. ఫ్యూచర్ సిటీ పరిధిలోని గ్రామాల్లో పంచాయతీ సమరం మరింత వేడిగా సాగే చాన్స్ ఉంది. -
గ్రామ పోరు.. జ్ఞాపకాలు అదురు
పల్లెల్లో ప్రస్తుతం ఎన్నికల హడావుడి మొదలైంది. స్వాతంత్య్రం తొలినాళ్లలో ఏర్పాటు చేసిన పంచాయతీ సమితి వ్యవస్థను ప్రధాని హాదాలో జవహర్లాల్ నెహ్రూ షాద్‌నగర్ ప్రాంతంలో ప్రారంభించారు. అనంతరం 61 ఏళ్ల కిందట పంచాయతీ వ్యవస్థ రూపుదాల్చుకోవడంతో గ్రామాల్లో సమర్థ పాలనకు అంకురార్పణ ఏర్పడింది. తాజాగా స్థానిక సంస్థల పోరు నేపథ్యంలో ఆ ప్రస్తానాన్ని ఓసారి నెమరేసుకుందాం. షాద్‌నగర్: భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూకు షాద్‌నగర్ ప్రాంతానికి వీడదీయలేని బంధం ఉంది. తొలి పంచాయతీ సమితిని ఇక్కడే ఏర్పాటు చేశారు. స్వాతంత్య్రం అనంతరం పంచాయతీరాజ్ సంస్థల ఏర్పాటు కోసం 1957లో ప్రభుత్వం బల్వంత్రాయ్ మెహతా కమిటీని నియమించింది. పరిపాలన వికేంద్రీకరణతోనే దేశంలో పాలన సమర్థవంతంగా సాగుతుందని కమిటీ భావించింది. అందుకు మూడంచెల విధానాన్ని (గ్రామ పంచాయతీ, పంచాయతీ సమితి, జిల్లా పరిషత్) సిఫారసు చేసింది. 1958లో ఈ విధానాన్ని జాతీయ అభివృద్ధి మండలి ఆమోదించింది. మూడంచెల విధానాన్ని దేశంలో తొలిసారిగా రాజస్థాన్ రాష్ట్రంలోని నాగౌర్ జిల్లాలో 1959 అక్టోబర్ 2న అమలు చేశారు. అదే ఏడాది నవంబర్ 1న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ వ్యవస్థను అప్పటి మహబూబ్‌నగర్ జిల్లా ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలో ఉన్న షాద్‌నగర్‌లో తొలిసారిగా ప్రధాని నెహ్రూ లాంఛనంగా ప్రారంభించారు. తెలుగులోకి పీవీ అనువాదం పంచాయతీ సమితిని నెహ్రూ ప్రారంభించేందుకు ఇందిరాగాంధీ, పీవీ నర్సింహారావులతో కలిసి వచ్చారు. హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు వారికి స్వాగతం పలికారు. నెహ్రూ హిందీలో చేసిన ప్రసంగాన్ని పీవీ తెలుగులో అనువాదం చేశారు. అంబేడ్కర్ కాలనీలో అప్పట్లో ఏర్పాటు చేసిన వేదికపై ఆయన ప్రసంగించారు. బ్లాక్ ఆఫీస్‌గా ఏర్పాటు చేసిన ఇప్పటి మండల పరిషత్‌లో పార్కు మధ్యలో నీటిని చిమ్మే తారమ కొలను, ఎదురుగా సాంస్కృతిక ప్రదర్శనల నిమిత్తం కళాక్షేత్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుత మండల పరిషత్ కార్యాలయమే అప్పటి పంచాయతీ సమితి కార్యాలయం. తొలి పంచాయతీ సమితి అధ్యక్షుడిగా కొత్తూరు మండలం అప్పారెడ్డిగూడ గ్రామానికి చెందిన రాందేవ్‌రెడ్డి ఎన్నికయ్యారు. నాటి నుండి 1984 వరకు పంచాయతీ సమితి ఆదర్శవంతంగా కొనసాగింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ మండలాల వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పంచాయతీ సమితులు రద్దయ్యాయి. తాలూకాగా ఉన్న షాద్‌నగర్‌ను నాలుగు మండలాలుగా విభజించారు. ఫరూఖ్‌నగర్, కొత్తూరు, కేశంపేట, కొందుర్గు ఏర్పాటయ్యాయి. పరిపాలన సౌలభ్యం కోసం గత ప్రభుత్వం నందిగామ, చౌదరిగూడ మండలాలను కొత్తగా ఏర్పాటు చేసింది. నెహ్రూ ప్రారంభించిన మూడంచెల విధానం షాద్‌నగర్‌లో మొదటి పంచాయతీ సమితి ఏర్పాటు 1978 నుంచి సర్పంచులకు ప్రత్యక్ష ఎన్నిక మొదట్లో పరోక్ష పద్ధతి ఉమ్మడి ఆంఽధ్రప్రదేశ్‌లో 1964లో సమగ్ర గ్రామ పంచాయతీ చట్టాన్ని రూపొందించారు. దీని ప్రకారం 500 జనాభా ఉన్న గ్రామాలను ఒక పంచాయతీగా ఏర్పాటు చేశారు. జనాభాను బట్టి 5 నుంచి 17 వరకు వార్డు సభ్యులుండవచ్చని పేర్కొన్నారు. 1964లో సర్పంచ్ ఎన్నికలు పరోక్ష పద్ధతిలో జరిగాయి. వార్డు సభ్యులను ఓటర్లు ఎన్నుకుంటే, వారు సర్పంచులను ఎన్నుకునే వారు, ఎన్నికై న సర్పంచులు కలిసి పంచాయతీ సమితి ప్రెసిడెంట్‌ను ఎన్నుకునేవారు. సమితి ప్రెసిడెంట్లు జిల్లా పరిషత్ అధ్యక్షుడిని, ఉపాధ్యక్షుడిని ఎన్నుకునేవారు. 1976 వరకు ఇదే పద్ధతి కొనసాగింది. 1978లో నర్సింహ కమిటీ సర్పంచులను ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకోవాలని సూచించింది. దీంతో అప్పటి నుంచి సర్పంచ్‌లకు నేరుగా ఎన్నుకుంటున్నారు. -
కుల ధ్రువీకరణ పత్రాల కోసం నిరీక్షణ
కొందుర్గు: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కుల ధ్రువీకరణ పత్రాల కోసం అనేక అవస్థలు పడుతున్నారు. శుక్రవారం పత్రాల కోసం దరఖాస్తు చేయడానికి మీ సేవల్లో క్యూ కడుతున్నారు. కాగా మీ సేవల్లో సర్వర్ పనిచేయకపోవడంతో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ విషయమై తహసీల్దార్ అజాం అలీని వివరణ కోరగా సర్వర్ పనిచేయకపోవడమనే సమస్య రాష్ట్ర వ్యాప్తంగా ఉందన్నారు. రాత్రివేళల్లో పనిచేయవచ్చని తెలిపారు. ఇంకా ఒకరోజు సమయం ఉందని, ఒకవేళ పనిచేయకపోతే మాన్యువల్ సర్టిఫికెట్ ఇస్తామని పేర్కొన్నారు. -
ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి
పరిగి: సీనియర్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని టీఎస్ యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాములు అన్నారు. శుక్రవారం మండలంలోని ఆయా పాఠశాలల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే పీఆర్సీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. విశ్రాంత ఉద్యోగులకు ఏళ్లు గడుస్తున్నా బకాయిలు ఇవ్వడం లేదన్నారు. దీంతో వారు దిగులు చెందుతున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్‌లో ఉన్న వేతనాలు, బిల్లులను విడుదల చేయాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న స్కావెంజర్ల డబ్బులు సకాలంలో అందక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. యూటీఎఫ్ నిత్యం ఉపాధ్యాయులు, విద్యా సమస్యలపై పోరాటం చేస్తుందన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి సమస్యలను పరిష్కరించామని తెలిపారు. కార్యక్రమంలో సంఘం మండల అధ్యక్షుడు దశరథ్, నాయకులు మోయిజ్‌ఖాన్, వెంకటయ్య, బుచ్చయ్య, యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు. యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాములు -
ఆరబెట్టిన ధాన్యానికి సూచిక ఏర్పాటు
దుద్యాల్: మండలంలోని చిలుముల్ మైల్వార్ నుంచి గౌరారం వెళ్లే ప్రధాన రోడ్డుపై రైతులు ఆరబెట్టిన ధాన్యం రాశులకు పోలీసులు సూచికలు ఏర్పాటు చేశారు. రాత్రివేళలో కవర్లు కప్పడంతో వాహనదారులకు రోడ్డుపైన ఉన్న ధాన్యం కుప్పలు కనబడడం లేదు. దీంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయని ఇటీవల సాక్షి దినపత్రికలో ‘రోడ్డుపై ధాన్యం.. ప్రమాదాలకు ఆహ్వానం’ అనే శీర్షికతో కథనం ప్రచూరితమైంది. దీంతో స్పందించిన పోలీసులు శుక్రవారం రాత్రి అటుగా వెళ్తున్న వాహనదారులకు అవగాహన కల్పించారు. ప్రమాదాలు చోటు చేసుకుండా రేడియం నియంత్రికలు ఏర్పాటు చేశారు. ఎస్ఐ శ్రీశైలం మాట్లాడుతూ రోడ్లపై ధాన్యాన్ని త్వరగా తొలగించాలని రైతులకు సూచించారు. ఆయన వెంటన హెడ్ కానిస్టేబుల్ యాదయ్య ఉన్నారు. -
నామినేషన్ సజావుగా నిర్వహించాలి
తాండూరు రూరల్: పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ ప్రక్రియ సజావుగా నిర్వహించాలని జిల్లా ట్రైనీ కలెక్టర్(ఎన్నికల పరిశీలకుడు) చంద్రకిరణ్ అన్నారు. శుక్రవారం మండలంలోని గౌతపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో నామినేషన్ల ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి క్లస్టర్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలన్నారు. సర్పంచు, వార్డు సభ్యులకు పోటీ చేసే అభ్యర్థులకు నామినేషన్ పత్రాల్లో ఏమైన ప్రశ్నలు ఉంటే నివృత్తి చేయాలని ఆదేశించారు. శనివారంతో నామినేషన్ ముగుస్తుండటంతో ఆర్ఓ, అసిస్టెంట్ ఆర్ఓలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆయన వెంట ఎంపీడీఓ విశ్వప్రసాద్, పంచాయతీ కార్యదర్శులు వీరప్ప, ఫక్రోజీ తదితరులు ఉన్నారు. ట్రైనీ కలెక్టర్ చంద్ర కిరణ్ -
దివ్యాంగుల ప్రేరణకు క్రీడాపోటీలు
అనంతగిరి: మహిళాశిశు దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం వికారాబాద్‌లోని బ్లాక్ గ్రౌండ్లో జిల్లాలోని దివ్యాంగులకు క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా సంక్షేమ అధికారిణి కృష్ణవేణి మాట్లాడుతూ.. సమాజంలో దివ్యాంగులు సాధారణ పౌరులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తూ స్ఫూర్తి ప్రదాతలుగా నిలుస్తారన్నారు. దివ్యాంగుల తల్లిదండ్రుల కన్నా టీచర్లు, గార్డియన్లు తోడుగా నిలిచి వారికి సకాలంలో సరైన ప్రోత్సాహాన్ని అందించాలన్నారు. ఇలాంటి వేడుకలు నిర్వహించడం ద్వారా దివ్యాంగులు ఎవరిపైనా ఆధారపడకుండా మనోస్థైర్యం పెరుగుతుందన్నారు. జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొన్న వారందరూ రాష్ట్ర స్థాయిలో కూడా అద్భుతమైన విజయాలను సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. బాల రక్షా భవన్ కోఆర్డినేటర్ కాంతారావు, సంబంధిత శాఖల సిబ్బంది పీఈటీలు, జిల్లాకు చెందిన దివ్యాంగుల సంఘాల నాయకులు, దివ్యాంగులు పాల్గొన్నారు. -
ఎంత మందికి మద్దతు ఇస్తున్నారో చెప్పండి!
తాండూరు టౌన్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా జనరల్ స్థానాల్లో పోటీ చేసే బీసీ అభ్యర్థులకు.. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మద్దతు ఇవ్వనున్నారో లెక్క తేల్చాలని ఆ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు కందుకూరి రాజ్‌కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. అలాగే ఎంత శాతం బీసీ అభ్యర్థులను జనరల్ స్థానాల్లో నిలుపుతున్నారో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు చెప్పాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్సిస్తామని చెప్పిన కాంగ్రెస్.. వైఖరిని స్వాగతిస్తున్నామన్నారు. అయితే ప్రస్తుతం కోర్టు తీర్పుతో అది సాధ్యం కాకపోవడం వలన పార్టీ పరంగా అయినా బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని కోరారు. రాష్ట్రంలో బీసీ వాదం బలంగా ఉన్నందున, బీసీలు పెద్ద సంఖ్యలో జనరల్ స్థానాల్లో పోటీ చేయాలని పిలుపునిచ్చారు. వారి తరఫున విస్తృత ప్రచారం చేస్తామన్నారు. కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు కుల్కచర్ల: స్థానిక ఎన్నికల నేపథ్యంలో వాహనదారులు, ప్రజలు ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని ఎస్ఐ రమేష్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ.50 వేలకు పైగా నగదు, బంగారం లేదా ఇతర వస్తువులు వెంట తీసుకెళ్లరాదని, తప్పనిసరిగా తీసుకెళ్లవలసి వస్తే.. వాటికి సంబంధించిన పత్రాలు కలిగి ఉండాలని స్పష్టం చేశారు. ఎలాంటి ర్యాలీలు చేపట్టరాదని పేర్కొన్నారు. చెకుముకి పోటీల్లో విద్యార్థుల సత్తా పరిగి: చెకుముకి జిల్లా స్థాయి సైన్స్ పోటీల్లో పరిగి నంబర్ 1 ఉన్నత పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో కొడంగల్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన పోటీల్లో శివ, రహమాన్, విశాల్‌లు ద్వితీయ బహుమతిని గెలుచుకున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం విద్యార్థులకు ఉపాధ్యాయుడు వెంకటయ్య అభినందించారు. విద్యార్థులకు స్పోర్ట్స్ మీట్ అనంతగిరి: జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జి ల్లా పరిధిలోని 27 పీఎంశ్రీ స్కూళ్ల ద్వారా స్పో ర్ట్స్ మీట్‌ను శుక్రవారం వికారాబాద్‌లోని సె యింట్ జూడ్స్ హై స్కూల్లో ప్రారంభమైంది. ఇందులో 27 పాఠశాలల నుంచి 867 మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు. ఫుట్ బా ల్, ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, అథ్లెటిక్స్ నిర్వ హించారు. డీఈఓ రేణుకాదేవి, పీడీలు, ఉపా ధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కొనసాగుతున్న పూజలు తాండూరు రూరల్: మండల పరిధిలోని అంతారం గ్రామంలో ఆంజనేయస్వామి దేవాలయంలో శుక్రవారం గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో నూతనంగా ఆలయాన్ని పునర్నిర్మించారు. ఈ సందర్భంగా హోమం, దేవతమూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. -
ప్రారంభించి.. పాతరేసి!
బషీరాబాద్: పత్రి గింజను కొంటామన్న ప్రభుత్వ పెద్దల మాటలు నీటి మీద రాతలుగా మారాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి పట్టించుకోకపోవడంతో అన్నదాతలు కలవరపాటు గురవుతున్నారు. మండలంలోని కాశీంపూర్ వరి కొనుగోలు కేంద్రంలో ధాన్యం భారీగా చేరుతుంది. ఈ సెంటర్ ప్రారంభించి 12 రోజులు గడిచినా ఐకేపీ సిబ్బంది తూకాలు ప్రారంభించక పోవడంతో వడ్ల రాశులు పేరుకుపోయాయి. దీంతో రైతులు చలికి వణుకుతూ రాత్రింబవళ్లు కాపల కాస్తున్నారు. మండలంలోని మంతట్టి, రెడ్డిఘణాపూర్, కాశీంపూర్, బాద్లాపూర్, కుప్పన్‌కోట్, గొట్టిగ తదితర గ్రామాల్లో గత 15 రోజులుగా వరి కోతలు ప్రారంభించారు. విక్రయం కోసం రైతులు ధాన్యం బస్తాలు కేంద్రం దగ్గర నిల్వ చేశారు. చలికి వడ్లు మరింత తేమ పెరగడంతో పగటి పూట ఎండకు ఆరబెట్టి రాత్రికి టార్పలిన్లు కప్పుతున్నారు. తూకాలు వేయమని ఐకేపీ సిబ్బందికి అడిగితే రేపు, మాపు అంటూ కాలయాపన చేస్తున్నారని అన్నదాతలు మండిపడుతున్నారు. కన్నెత్తి చూడని అధికారులు గ్రామ శివారులోని ఓ పొలంలో ఈ నెల 16న కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. ఈ కేంద్రాన్ని కాశీంపూర్ ఐకేపీ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. అయితే కేంద్రం ప్రారంభించిన నాటి నుంచి ఐకేపీ అధికారులు కన్నెత్తి కూడా చూడలేదని రైతులు చెబుతున్నారు. గ్రామ సంఘం నాయకులు లారీలు లేవు, అధికారులు ఏం చెప్పలేదని సాకులు చెబుతూ కాలం వెల్లదీస్తున్నారు. దీంతో కేంద్రంలో 500 బస్తాల ధాన్యం పేరుకుపోయింది. 12 రోజులైనా తూకాలు వేయని ఐకేపీ కాశీంపూర్ కొనుగోలు కేంద్రంలో ధాన్యం రాశులు చలిలో సెంటర్ల వద్ద రైతుల పడిగాపులు పట్టించుకోని అధికారులు లేబర్ లేక ఇబ్బంది ధాన్యం తూకాలు వేసిన వెంటనే మిల్లులకు రవాణా చేయడానికి ఇంకా లారీలు రాలేవు. పనిచేసే లేబర్ కూడా లేరు. రైతులు నాలుగైదు రోజుల నుంచే ధాన్యం తీసుకువస్తున్నారు. రెండు రోజుల్లో తూకాలు ప్రారంభిస్తాం. రైతులకు ఇబ్బంది రానివ్వకుండా కృషి చేస్తాం. – పద్మరావు, ఏపీఎం, బషీరాబాద్ అమ్ముకోవడం కష్టమైంది ఐదు రోజుల కిందట 140 బస్తాల ధాన్యం అమ్మడానికి తీసుకు వచ్చాను. తూకాలు వేయాలని అధికారులకు అడిగితే రేపు మాపు అంటున్నారు. చాలా మంది రైతులం రాత్రికి చలిలో ధాన్యం దగ్గర పడుకుంటున్నాం. పంట పండించడం కంటే అమ్ముకోవడం కష్టమైంది. – ఈరప్ప, రైతు, మంతట్టి -
వ్యూహాలకు పదును!
ఉనికి కోసం ప్రతిపక్షాల ఆరాటంవికారాబాద్: పంచాయతీ ఎన్నికల్లో పట్టు సాధించేందుకు అన్ని రాజకీయ పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో కార్యాచరణ మొదలు పెట్టాయి. అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే పల్లె పోరులో సైతం సత్తా చాటాలని అధికార హస్తం పార్టీ పట్టుదలతో ఉంది. మెజార్టీ జీపీలను తన ఖాతాలో వేసుకోవాలని భావిస్తోంది. పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకరావాలని అధిష్టానం ఆదేశించింది. దీంతో ఎమ్మెల్యేలు వారివారి నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ ఎన్నికలు ఎమ్మెల్యేలకు పరీక్ష లాంటిదని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిన విషయం తెలిసిందే. జిల్లాలో ఎక్కువ మంది సర్పంచులు, వార్డు సభ్యులను గెలిపించుకోవాలనే పట్టుదలతో ఎమ్మెల్యేలు ఉన్నట్లు సమాచారం. క్షేత్రస్థాయిలో మరింత బలపడేందుకు.. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు సెగ్మెంట్లో కేవలం ఆరు వేల ఓట్లతో ఆ పార్టీ అభ్యర్థి మనోహర్‌రెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వికారాబాద్‌లో 10వేల ఓట్లతో స్పీకర్ ప్రసాద్‌కుమార్ గెలుపొందగా.. పరిగిలో రామ్మోహన్‌రెడ్డి 25 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇక సీఎం రేవంత్‌రెడ్డి 32 వేల భారీ మెజార్టీతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయావకాశాలపై ఆ పార్టీ సహజంగానే భారీ అంచనాలు పెట్టుకుంది. అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే వ్యూహాలను పదును పెట్టి పంచాయతీ ఎన్నికల్లో పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తోంది. మెజారిటీ సర్పంచ్ స్థానాలను తమ పార్టీ మద్దతుదారులను గెలిపించుకునేందుకు కసరత్తు చేస్తోంది. ఒక్కో పంచాయతీలో ఒక అభ్యర్థే సర్పంచ్ బరిలో ఉండేలా ఎమ్మెల్యేలకు బాధ్యతలను అప్పగించింది. పార్టీ గుర్తులపై కాకుండా జరుగుతున్న ఎన్నికలు కావడంతో ప్రజల్లో పలుకుబడి, మంచి పేరున్న వ్యక్తులనే బరిలో దింపాలని అధిష్టానం ఆదేశించినట్లు సమాచారం. సర్పంచులుగా పోటీ చేసేందుకు ఒకే పార్టీ నుంచి పలువురు ఆశావహులు ఉంటే వారికి త్వరలో జరగనున్న సహకార, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అవకాశం కల్పించే విధంగా నచ్చజెప్పేందుకు సన్నద్ధమవుతున్నారు. మండల స్థాయిలో ముఖ్య నేతల ఆధ్వర్యంలో సర్పంచ్, వార్డు అభ్యర్థుల ఎంపికపై ఓ నిర్ణయానికి రానున్నట్లు సమాచారం. ఇదే సమయంలో పార్టీ ద్వారా అమలు చేస్తు న్న సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించే ప్రయ త్నం చేస్తున్నారు. ప్రధానంగా ఇందిరమ్మ ఇళ్లు, రూ.500 గ్యాస్, ఆర్టీసీ ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల వరకు పేదలకు ఉచిత కరెంటు, సన్నబి య్యం తదితర సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఏకగ్రీవాలపై కాంగ్రెస్ ఫోకస్ ఏకగ్రీవ పంచాయతీలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఆ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వ తరఫున రూ.10 లక్షలు నజరానా ఇవ్వనుంది. ఈ మొత్తంతోపాటు ఎమ్మెల్యే నిధుల నుంచి మరో రూ.10 లక్షలు కేటాయించేందుకు సిద్ధమైంది. ఈ ప్రయత్నాలు ఎంతమేర ఫలిస్తాయో వేచి చూడాల్సి ఉంది. ‘హస్త’గతం కోసం అధికార పక్షం ఆరాటం అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని పరాజయాన్ని మూటగట్టుకున్న ప్రతిపక్ష పార్టీలు ఓటమి నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి. జిల్లాలోని నాలుగు స్థానాల్లో కూడా బీఆర్ఎస్ అభ్యర్థులు పరాజయం పాలయ్యారు. ఎక్కువ మంది సర్పంచులను గెలిపించుకోవడం ద్వా రా మిగతా ఎన్నికల్లో సత్తా చాటవచ్చని బీఆర్ఎస్ భావిస్తోంది. ఆ దిశగా ముందుకు సాగుతోంది. ప్రస్తుతం పూర్తిస్థాయిలో రంగంలోకి దిగలేదనే చెప్పాలి. భారతీయ జనతా పార్టీ, సీపీఐ, సీపీఎం పార్టీలు సైతం తమ అభ్యర్థులను బరిలో దించాలని భావిస్తున్నాయి. -
స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోండి
అనంతగిరి: పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని ఎస్పీ స్నేహ మెహ్ర సూచించారు. శుక్రవారం వికారాబాద్‌లోని తన కార్యాలయం నుంచి జిల్లాలోని పోలీస్ అధికారులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నందున పక్కాగా భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా 582 గ్రామాల్లో 4,956 పోలింగ్ స్టేషన్లలో ఎన్నికలు జరుగుతాయని వివరించారు. కోడ్ ఉల్లంఘనలకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు మద్యం, డబ్బు రవాణా జరిగే ఆస్కా రం ఉన్నందున తనిఖీలను ముమ్మరం చేయాలన్నారు. ఎస్ఎస్టీ, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ లొకేషన్లను గుర్తించి అదనపు బలగాలను మోహరించాలని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే పాత నేరస్తులు, రౌడీ షీటర్లను ముందుగానే బైండోవర్ చేయాలన్నారు.గన్ లైసెన్స్ కలిగిన వ్యక్తుల నుంచి వెంటనే ఆయుధాలను డిపాజిట్ చేసుకోవాలన్నారు. ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ రాములు నాయక్, డీటీసీ డీఎస్పీలు శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి, ఎన్ యాదయ్య, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
కాంగ్రెస్‌కు గుణపాఠం తప్పదు
తాండూరు రూరల్: అఽధికార కాంగ్రెస్ పార్టీపై పల్లెల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని కరన్‌కోట్, మల్కాపూర్, సంగెంకలాన్, గౌతాపూర్ గ్రామాల్లో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులకు మద్దతుగా తిరిగారు. కార్యకర్తలకు దిశ నిర్దేశం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తాండూరు మండలం బీఆర్ఎస్కు కంచుకోట అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు 420 హామీలు ఇచ్చి ప్రభుత్వం ఏర్పాటయ్యాక మోసం చేసిందన్నారు. పింఛను మొత్తం రూ.4 వేలకు పెంచుతామని మాయమాటలు చెప్పిందన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతున్నారు. సంగెంకలాన్ గ్రామంలో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి కామిని మీనాక్షిని గెలిపించాలని గ్రామస్తులకు కోరారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు వీరేందర్‌రెడ్డి, నాయకులు రత్నాకర్, రాజేందర్‌రెడ్డి, సాయిపూర్ నర్సింలు, శ్రీనివాస్‌చారి, సునీల్, రాజప్పగౌడ్, శకుంతల తదితరులు పాల్గొన్నారు. -
రేపటి నుంచి రెండో విడత నామినేషన్ల ప్రక్రియ
అనంతగిరి: పంచాయతీ ఎన్నికల రెండో విడత నామినేషన్ల ప్రక్రియ ఆదివారం ప్రారంభమవుతుందని ఎంపీడీఓ వినయ్‌కుమార్ తెలిపారు. శుక్రవారం కార్యాలయ ఆవరణలో ఆర్ఓ, ఏఆర్ఓలు, పంచాయతీ కార్యదర్శులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల నియమావళి ప్రకారం నామినేషన్ ప్రక్రియ చేపట్టాలన్నారు. ఏమైనా సందేహాలు ఉంటే వెంటనే తమ దృష్టికి తేవాలన్నారు. అనంతరం మాస్టర్ ట్రైనర్లు నియమావళిపై, దర ఖాస్తుల ప్రక్రియపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంపీఓ దయానంద్, ఎంఈఓ బాబు సింగ్, సూపరింటెండెంట్ శాంత పాల్గొన్నారు. -
కొడంగల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆడిట్
కొడంగల్ రూరల్: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం 2022 – 23, – 24 విద్యా సంవత్సరాలకు సంబంధించి అకడమిక్ ఆడిట్ నిర్వహించారు. ప్రిన్సిపాల్ డా. శ్రీనివాస్‌రెడ్డి, అకడమిక్ అడ్వయిజర్లుగా తాండూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా. వసంతకుమారి, చేవెళ్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎం రమేష్ ఆ ప్రక్రియ చేపట్టారు. కళాశాలలో వసతులపై వసంతకుమారి సంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. అకడమిక్ ఆడిట్ విద్యా సంస్థల్లోని నాణ్యతను, ప్రమాణాలను సమగ్రంగా మూల్యాంకనం చేయడానికి ఉపయోగపడుతుందని అన్నారు. బోధనా పద్ధతులు, పాఠ్య ప్రణాళిక అమలు, పరిశోధన, పరిపాలనా పనులు, తగు సూచనలు ఇవ్వడానికి ఎంతగానో తోడ్పడుతుందని పేర్కొన్నారు. అనంతరం కొడంగల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సి పాల్ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. అకాడమిక్ ఆడిట్‌తో కళాశాలకు ఎంతో మేలు కలుగుతుందని, లోటు పాట్లను తెలుసుకోవడంతోపాటు ప్రమాణాల పెంపునకు దోహదం చేస్తుందన్నారు. అడ్వయిజర్ల సూచనలు పాటిస్తూ కళాశాల అభివృద్ధికి కృషిచేస్తానని తెలిపారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ రఫియా ఖానమ్, అకడమిక్ కో ఆర్డినేటర్ టి.రాంబాబు, అధ్యాపక, అద్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. జ్యోతిబాపూలే మార్గంలో నడుద్దాం తాండూరు టౌన్: రాజకీయ, సామాజిక, ఆర్థిక, విద్యాభివృద్ధి కోసం మహాత్మా జ్యోతిబాపూలే ఎంచుకున్న మార్గంలోనే నడుద్దామని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు కందుకూరి రాజ్‌కుమార్ అన్నారు. శుక్రవారం పూలే వర్ధంతిని పురస్కరించుకుని పట్టణంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. కుల వ్యవస్థ నిర్మూలన, బాలి కా విద్య, సమానత్వం కోసం పూలే చేసిన పోరా టం అనిర్వచనీయమన్నారు. అణగారిని బడు గు బలహీన వర్గాల ప్రజలు అన్ని రంగాల్లోనూ రాణించాలనే ఆయన బలీయమైన కోరిక ఎందరికో స్ఫూర్తి దాయకమన్నారు. నేటి యువత ఆయన పోరాటాన్ని అనుసరిస్తూ సమసమాజ స్థాపనకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు వెంకటేష్, బస్వరాజ్, పరమేష్, రాజు, శ్రీనివాస్, ఆనంద్, బాల్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు. ఆ ఆంక్షలు వెనక్కి తీసుకోవాలి తాండూరు టౌన్: అయ్యప్ప మాల ధరించిన పోలీసులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీజేపీ, హిందూ సంఘాలు పేర్కొన్నాయి. శుక్రవారం ఈ మేరకు బీజేపీ, విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్, హిందూ వాహిని, అయ్యప్ప దేవాలయ కమిటీ సభ్యులు డీఎస్పీ నర్సింగ్ యాదయ్యను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అయ్యప్ప మాల వేసిన పోలీసులపై ఆ శాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడాన్ని ఖండిస్తున్నామన్నారు. హిందువుల ఆరాధ్య దైవం అయ్యప్ప మాలఽ వేయడం నేరం కాదన్నారు. హిందూ మతంపై కక్ష గట్టి మాల వేసిన పోలీసులపై చర్యలకు పూనుకోవడం సబబు కాదన్నారు. పోలీసు ఉన్నతాధికారులు ఇట్టి విషయాన్ని పరిశీలించి ఆంక్షలను ఎత్తేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు మల్లేశం, అయ్యప్ప గుడి కమిటీ స్వాములు మనోజ్, శ్రావణ్, సంతోష్ గౌడ్, వెంకటేష్, వీహెచ్‌పీ, బజరంగ్దళ్, హిందూ వాహిని, విశాల్ హిందూ సంఘాల సభ్యులు శ్రీనివాస్, రామకృష్ణ, వినోద్, భద్రేశ్వర్, చంద్రశేఖర్, శ్రీహరి, కిరణ్, కృష్ణ, ప్రకాష్, ప్రహ్లాద్, సంగమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
గుర్తులు వచ్చేశాయ్!
సర్పంచ్ అభ్యర్థుల గుర్తులుబషీరాబాద్: పార్టీ రహితంగా జరిగే పంచాయ తీ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ గుర్తులు కేటాయించింది. సర్పంచ్‌గా పోటీ చేసే అభ్యర్థుల కు అనుబంధం ఒకటిలో 30 గుర్తులు కేటాయించారు. అనుబంధం 2లో వార్డు సభ్యులకు 20 రకాల గుర్తులు పొందుపరిచారు. అయితే బ్యాలెట్ పేపర్లో చివరి గుర్తుగా నోటా(పై వేవి కావు) అనే సింబల్‌ను ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు జిల్లాలో మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ రేపటితో ముగియనుంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితా డిసెంబర్ 3న విడదల చేయడంతో పాటు పోటీదారులకు గుర్తులు కేటాయిస్తారు. డిసెంబర్ 11న మొద టి విడతలో 262 పంచాయతీలకు, 2,198 వార్డుల కు పోలింగ్ జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు చకచకా చేస్తున్నారు. వార్డుసభ్యుల గుర్తులు వార్డు సభ్యులను ఎన్నుకునేందుకు బ్యాలెట్ పత్రంలో గౌను, గ్యాస్ పొయ్యి, స్టూల్, గ్యాస్ సిలిండర్, బీరువా, ఈల, కుండ, డిష్ యాంటీ నా, గరాటా, మూకుడు, ఐస్ క్రీం,గాజు గ్లాసు, పోస్టుడబ్బా, కవ ర్, హాకీ కర్ర బంతి, నెక్ టై, కటింగ్ ప్లేయర్, పెట్టె, విద్యుత్ స్తంభం, కేటిల్ గుర్తులను కేటాయించారు. ఈ గుర్తుల బ్యాలెట్ పత్రాల ముద్రణకు జిల్లా ఎన్నికల అధికారి టెండర్లు పిలువనున్నారు. సర్పంచ్ అభ్యర్థి గుర్తులివే.. ఉంగరం, కత్తెర, బ్యాట్, ఫుట్ బాల్, లేడీ పర్సు, టీవీ, రిమోట్, టూత్ పేస్ట్, స్పానర్, చెత్త డబ్బా, నల్ల బోర్డు, బెండకాయ, కొబ్బ రి తోట, వజ్రం, బకెట్, డోర్ హ్యాండిల్, టీ జల్లెడ, చేతి కర్ర, మంచం, పలక, టేబుల్, బ్యాటరీ లైట్, బ్రష్, బ్యాట్స్మాన్, మనిషి మరియు తెరచాపతో కూడిన పడవ, బిస్కట్, వేణువు, చెయిన్, చెప్పులు, గాలి బుడగ, స్టంప్స్ గుర్తులు ఉన్నాయి. -
‘లక్నాపూర్’ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం
పరిగి: లక్నాపూర్ ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే టీ రామ్మోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లక్నాపూర్ ప్రాజెక్టుకు భారీ సంఖ్యలో పర్యాటకులు వచ్చేలా అభివృద్ధి చేస్తామన్నారు. అన్ని రకాల సదుపాయాలు సమకూరుస్తామని తెలిపారు. ప్రాజెక్టులో అదనపు బోట్ల కోసం రూ.96 లక్షలు మంజూరైనట్లు పేర్కొన్నారు. త్వరలో గెస్ట్ హౌస్‌లు కూడా నిర్మిస్తామన్నారు. పరిగి మున్సిపల్ పరిధిలోని నస్కల్ గ్రామంలో టాటా సంస్థ ఆధ్వర్యంలో ఇండస్ట్రీయల్ అడ్వన్స్ ట్రైనింగ్ సెంటర్‌ను రూ.60 కోట్లతో ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. త్వరలో మంత్రి శంకుస్థాపన చేస్తారని తెలిపారు. ఈ శిక్షణ కేంద్రం ద్వారా ఈ ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. అన్ని రకాల కోర్సులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఏకగ్రీవ పంచాయతీలకు రూ.20 కేటాయిస్తామన్నారు. కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు లాల్‌కృష్ణ, పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎర్రగడ్డపల్లి కృష్ణ, కుల్కచర్ల మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు ముదిరాజ్, పీఏసీఎస్ చైర్మన్ మొగులయ్య, పరిగి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అయూబ్, ఏబ్లాక్ అధ్యక్షుడు పార్థసారథి పంతులు, నాయకులు శ్రీనివాస్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
నిర్వహించాలి
ఎన్నికలు సజావుగా తాండూరు: గ్రామ పంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేలా అధికారులు ప్రత్యేకశ్రద్ధ వహించాలని కలెక్టర్ ప్రతీక్‌జైన్ అన్నారు. శుక్రవారం పెద్దేముల్ మండలం మన్సన్పల్లి,మంబాపూర్ కందనెల్లి గ్రామాల్లోని నామినేషన్ కేంద్రాలను తనిఖీ చేశారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నామినేషన్ పత్రాల్లో తప్పులు దొర్లకుండా చూడాలన్నారు. అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించుకోవాలని సూచించారు. ఎన్నికల ఖర్చు వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని ఆదేశించారు. నిబంధనల మేరకు అభ్యర్థులు ఖర్చు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రతన్‌సింగ్, అధికారులు, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పొరపాట్లకు అవకాశం ఇవ్వొద్దు యాలాల: స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా చేపడుతున్న నామినేషన్ల స్వీకరణ కార్యక్రమంలో ఇబ్బందులు లేకుండా ఆర్ఓలు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రతీక్‌జైన్ అన్నారు. గురువారం మండలంలోని కోకట్ క్లస్టర్ పరిధిలో ఉన్న నామినేషన్ కేంద్రాన్ని తనిఖీ చేశారు. అభ్యర్థులకు ధ్రువపత్రాలు, ఎన్నికల సమయంలో ఖర్చుపెట్టే వివరాల నమోదు, సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ నిబంధనలు ఎప్పటికప్పుడు తెలియజేయాలన్నారు. గ్రామ పంచాయతీకి పోటీ చేసే అభ్యర్థులకు బ్యాంకు ఖాతాలు తప్పక ఉండాలన్నారు. నామినేషన్ ఫారాలు నింపే సమయంలో అభ్యర్థులు తప్పులు లేకుండా నింపేలా సూచనలు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సాయి శ్రీనిజ, ఆర్ఓలు ఉన్నారు. -
నాపరాతి పరిశ్రమకు సహకారం
తాండూరు: నాపరాతి పరిశ్రమ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరు స్టోన్ మర్చంట్, క్వారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోషియేషన్ల నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. తాండూరు నాపరాతి నిక్షేపాలకు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికత జోడించి నాపరాయిని మెరుగు పర్చాలన్నారు. తాండూరు పట్టణంలో లారీల పార్కింగ్‌కు స్థలం లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అందుకోసం స్థలం కేటాయించడం జరిగిందన్నారు. టీజీ ఐఐసీ ద్వారా ఆటోనగర్‌ను అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. తాండూరు స్టోన్ మర్చంట్ వెల్ఫేర్ అసోషియేషన్ అధ్యక్షుడిగా నయిం, ఉపాధ్యక్షులుగా సత్తార్, విజయరామారావు, ప్రధాన కార్యదర్శిగా కుంచం మురళీధర్, సంయుక్త కార్యదర్శులుగా సయ్యద్ హబీబ్‌లాల, బ్రిజ్ మోహన్ బూబ్, ట్రెజరర్‌గా సంజీవ్‌కుమార్ తోపాటు కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. క్వారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోషియేషన్ అధ్యక్షుడిగా అబ్దుల్ రవూఫ్, ఉపాధ్యక్షులుగా ఓం ప్రకాష్ సోమాని, మహ్మద్ అన్వర్ అహ్మద్, ప్రధాన కార్యదర్శిగా సయ్యద్ జుబేర్ పాష, సంయుక్త కార్యదర్శులుగా శరణుబసప్ప, హర్షవర్దన్‌రెడ్డి, ట్రెజరర్‌గా మహ్మద్ జైనుద్దిన్ తోపాటు కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో గనుల శాఖ ఏడీ సత్యనారాయణ, డీసీసీ అధ్యక్షులు ధారాసింగ్ జాదవ్, నాయకులు డాక్టర్ సంపత్‌కుమార్, అజయ్‌ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
24 రోజులుగా టోకెన్లు లేవు
● గట్టెపల్లిలో నిలిచిన ధాన్యం విక్రయాలు ● ఆందోళన వ్యక్తం చేస్తున్న అన్నదాతలు ధారూరు: పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో 24 రోజుల నుంచి ఒక్క బస్తా వడ్లు కొనడం లేదని మండలంలోని గట్టెపల్లి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు గురువారం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. తేమశాతం 17 వరకు రావాలని ఎండబెట్టి రాత్రి వేళల్లో పాలిథిన్ కవర్లు కప్పి కాపాడుకుంటున్నామన్నారు. ఇంతవరకు టోకెన్లు ఇవ్వకపోవడంతో కొనుగోలు కేంద్రానికి ధాన్యం సంచులు తీసుకు రాలేకపోయామన్నారు. ఏఈఓకు ఫోన్ చేస్తే స్పందించరని, ఎక్కడైన కనబడి తే ఇస్తాంలే అంటూ వెళుతున్నారని వాపోయారు. ప్రస్తుతం ఏ పొలం వద్ద చూసినా నిల్వ చేసిన వడ్లు దర్శనమిస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం టోకెన్ల జారీ వరి కొనుగోలు కేంద్రం చేసినప్పటి నుంచి వడ్లు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని హరిదాస్‌పల్లి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం సీఈఓ రవికుమార్ పేర్కొన్నారు. రైతులకు కావాల్సిన గన్ని బ్యాగులు సైతం సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. టోకెన్ల పుస్తకం రాకపోవడంతో జాప్యం జరిగిందని, ప్రస్తుతం టోకెన్లు జారీ చేస్తున్నామని ఏఈఓ సంతోష్ వివరణ ఇచ్చారు. -
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి
యాలాల: చేపల వేటకు వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. ఈ సంఘటన యాలాల మండల కేంద్రంలో గురువారం వెలుగు చూసింది. ఎస్ఐ విఠల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. యాలాల గ్రామానికి చెందిన గుదిగే బాలకిష్టయ్య(39) బుధవారం సాయంత్రం ఇంట్లోంచి వరి కల్లం వద్దకు వెళుతున్నట్లు చెప్పి వెళ్లాడు. మరుసటి రోజు ఇంటికి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు చుట్టు పక్కల వెతికారు. ఎక్కడ ఆచూకీ లభ్యం కాలేదు. ఈ క్రమంలో గ్రామ శివారులోని పర్దె కుంట గట్టుపై బాలకిష్టయ్యకు సంబంధించిన బట్టలు, సెల్‌ఫోన్‌ను గుర్తించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందడంతో పర్దెకుంటలో ఎస్ఐ విఠల్‌రెడ్డి చెరువులోకి దిగి గాలింపు చేపట్టగా మృతదేహాం లభ్యమైంది. మృతుడికి భార్యతో పాటు కొడుకు, కూతురు ఉన్నారు. మృతుడి భార్య రాజేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
నగర విస్తరణ.. నేతల అచేతన!
హైదరాబాద్ మహా నగర ఖ్యాతిని విస్తరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్డు ఆనుకొని ఉన్న పురపాలక సంఘాలను జీహెచ్ఎంసీలోకి విలీనం చేసింది. నగర పౌరులుగా మారామన్న ఆనందం ఓవైపు అయితే, పన్నుల భారంతో అవస్థలు పడతామని ప్రజలు భావిస్తున్నారు. మరోవైపు స్థానిక నాయకులు రాజకీయ నిరుద్యోగులుగా మారుతామని నిరాశలో కూరుకుపోతున్నారు. ఇబ్రహీంపట్నం రూరల్: ఆదిబట్ల మున్సిపాలిటీ ఒకప్పుడు కుగ్రామం. కనీసం ఆ ఊరికి బస్సు సౌకర్యం కూడా ఉండేది కాదు. ప్రస్తుతం ఆదిబట్ల అంటే హైదరాబాద్ అభివృద్ధికి నిదర్శనం. మినీ గచ్చిబౌలిగా పేరు గాంచింది. ఐటీ సంస్థలు, రియల్ ఎస్టేట్ రంగాలకు నిలయంగా ఉంది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పుణ్యమా అంటూ ఆదిబట్లకు ప్రాధాన్యం పెరిగింది. ఆయన హయాంలోనే ప్రతిష్టాత్మకమైన టాటా సంస్థను ఇక్కడికి తీసుకురావడంతో అభివృద్ధి పరుగులు పెట్టింది. అప్పటి ఆదిత్యనగర్ కాస్త కాలక్రమంలో ఆదిబట్లగా పేరు ప్రఖ్యాతలు పొందింది. 2018లో మున్సిపాలిటీగా ఏర్పాటు ఆదిత్యనగర్ కాస్త స్థానిక నేతల చొరవతో ప్రత్యేక గెజిట్ తీసుకొచ్చి ఆదిబట్లగా పేరు మార్చారు. 2018లో రాష్ట్ర ప్రభుత్వం ఆదిబట్లను మున్సిపాలిటీగా ఏర్పాటు చేసింది. అప్పటి వరకు ఇబ్రహీంపట్నం మండలంలో భాగమైన ఆదిబట్ల పురపాలక సంఘంగా రూపాంతరం చెందింది. రాందాస్‌పల్లి, బొంగ్లూర్, కొంగరకలాన్, మంగళ్‌పల్లి, ఎంపీపటేల్‌గూడ, ఆదిబట్లలను కలుపుతూ 15 వార్డులుగా విభజించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 15,453 మంది జనాభా ఉంది. ప్రస్తుతం 20 వేలు దాటింది. 2020 జనవరి నెలలో పురపాలక సంఘానికి ఎన్నికలు నిర్వహించారు. మొదట చైర్‌పర్సన్‌గా కొత్త ఆర్తిక, వైస్ చైర్‌పర్సన్‌గా కోరె కళమ్మ పని చేశారు. తదనంతరం 2024 ఏప్రిల్ 6న జరిగిన ఉప ఎన్నికల్లో చైర్మన్‌గా మర్రి నిరంజన్‌రెడ్డి, వైస్ చైర్మన్ కమాండ్ల యాదగిరి ఎన్నికయ్యారు. ఇక రాజకీయ నిరుద్యోగమే ఔటర్ రింగ్ రోడ్డుకు అనుకొని ఉన్న 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో వీలినం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆదిబట్లలో నాయకులు రాజకీయ నిరుద్యోగులుగా మారనున్నారు. మహా నగరంలో కలిస్తే కార్పొరేటర్‌గా పోటీ చేసేందుకే అవకాశం ఉంటుంది. అది కూడా ఎక్కువ ఓటర్లకు కలిపి ఒక వార్డును ఏర్పాటు చేస్తారు. దీంతో రాజకీయ ఆశావహులకు భంగపాటు తప్పదు. ఇప్పటివరకు ఆదిబట్ల నుంచే అత్యధికంగా పని చేసిన ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఇబ్రహీంపట్నం మండలానికి ఎంపీపీలు, జెడ్పీటీసీలుగా పాశం లక్ష్మీపతిగౌడ్, మర్రి నిరంజన్‌రెడ్డి, భూపతిగళ్ల మహిపాల్, డొంకని పద్మ, పొట్టి అయిలయ్య పని చేశారు. 15 వార్డుల నుంచి అన్ని రాజకీయ పార్టీలకు ప్రాతినిథ్యం వహించే అవకాశం ఉండేది. కానీ జీహెచ్ఎంసీలో వీలినం కావడంతో ఇబ్బందులు తప్పదు. జీహెచ్ఎంసీలో ఔటర్ పరిధిలోనిమున్సిపాలిటీల విలీనం స్థానికంగా పెరగనున్న రాజకీయ నిరుద్యోగులు పూర్తిగా అభివృద్ధి కాకముందే కలపడంపై మిశ్రమ స్పందన పన్నుల భారం మోపొద్దని ప్రజల విజ్ఞప్తులు మరింత అభివృద్ధి ఆదిబట్ల మున్సిపాలిటీ అస్తిత్వం దెబ్బతీయకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. తగిన ప్రాధాన్యం ఇచ్చే విధంగా కృషి చేస్తాం. జీహెచ్ఎంసీలో విలీనంతో మరింత అభివృద్ధి చెందుతుంది. కొంత పన్నుల రూపంలో ప్రజలపై భారం పడుతుంది. – నిరంజన్‌రెడ్డి, మాజీ చైర్మన్, ఆదిబట్ల ప్రజలపై భారం వేయొద్దు ప్రజలపై భారం వేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఇంటి అద్దెలు, నల్లా బిల్లు లు, వివిధ రకాల పెంచితే సహించేది లేదు. పూర్తిగా అభివృద్ధి కాకముందే విలీనం చేయడం తగదు. ఇంకో దఫా మున్సిపాలిటీ ఉంటేనే బాగుండేది. – జంగయ్య, బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఆదిబట్ల -
చోటా నేతల్లో నైరాశ్యం
పహాడీషరీఫ్: ఓఆర్ఆర్ లోపలి యూఎల్బీలను(అర్బన్ లోకల్ బాడీస్) జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలపడంతో జల్పల్లి మున్సిపాలిటీలోని ద్వితీయ శ్రేణి నాయకుల్లో నైరాశ్యం ఏర్పడింది. ఆర్థికంగా బలంగా ఉన్న నాయకులు జీహెచ్ఎంసీలో కార్పొరేటర్ అయ్యేందుకు ఇదే సరైన అదునుగా భావిస్తున్నారు. వాస్తవానికి జల్పల్లి మున్సిపాలిటీ పాలక మండలి గడువు ఈ ఏడాది జనవరి 25వ తేదీతో ముగిసింది. అప్పటి నుంచి మాజీ కౌన్సిలర్లతో పాటు కొత్తగా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఇన్నాళ్ల పాటు నాయకులు క్షేత్రస్థాయిలో తమ వంతు ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. తగ్గనున్న నాయకత్వం మున్సిపల్లో 1,12 లక్షల జనాభా, 85 వేల ఓటర్లు, 28 వార్డులు ఉన్నాయి. ఈ క్రమంలో ప్రధానమైన మూడు పార్టీలను పరిగణనలోకి తీసుకున్నా దాదాపు 100 మంది వరకు యాక్టివ్ లీడర్లు ప్రజలకు అందుబాటులో ఉంటూ వచ్చారు. కానీ మున్సిపాలిటీని జీహెచ్ంసీలో విలీనం చేస్తే సగటున 30 వేల ఓటర్లకు ఒక డివిజన్ చొప్పున, మూడు డివిజన్లు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. వెరసి 10–15 మంది నాయకులే ప్రధానం కానున్నారు. ఈ డివిజన్లలో కార్పొరేటర్‌గా పోటీ చేయాలంటే కోట్ల రూపాయలు వెచ్చించేంత పోటీ ఉండనున్న నేపథ్యంలో మాజీ కౌన్సిలర్లు సైతం పోటీకి దూరంగా ఉండే పరిస్థితి నెలకొంది. పెరగనున్న పన్నుల భారం పెద్ద ఎత్తున సమస్యలతో కూడిన జల్పల్లి లాంటి మున్సిపాలిటీని జీహెచ్ఎంసీలో విలీనం చేయడం ద్వారా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ముఖ్యంగా పారిశుద్ధ్య సమస్యను అధిగమించడానికి కార్మికులను విధుల్లోకి తీసుకోవడంతో పాటు అవసరమైన మేరకు యంత్రాలను కూడా సమకూర్చనున్నారు. రోడ్లు, డ్రైనేజీ లాంటి సమస్యలకు పరిష్కారం లభించనుంది. మరోవైపు ఇక్కడి ప్రజలపై జీహెచ్ఎంసీ నిబంధనల మేరకు పెద్ద ఎత్తున పన్నుల భారం కూడా పడే అవకాశం లేకపోలేదు. -
వీధి కుక్కల వీరంగం
● దాడి చేయడంతో నలుగురికి తీవ్ర గాయాలు ● మున్సిపల్ అధికారులపై స్థానికుల ఆగ్రహం తాండూరు టౌన్: పట్టణం పరిధిలోని మల్‌రెడ్డిపల్లిలో వీధి కుక్కలు గురువారం స్వైర విహారం చేశాయి. ఉదయాన్నే వీఽధిలో వెళ్తున్న వారిపై దాడి చేసి గాయపరిచాయి. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. కుక్కల నియంత్రణలో మున్సిపల్ అధికారులు విఫలమైనట్లు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్రెడ్డిపల్లికి చెందిన దొడ్ల శ్రీనివాస్ తెల్లవారుజామున పాలు పితికి తీసుకుని వస్తుండగా వీధి శునకాలు మూకుమ్మడిగా దాడి చేశాయి. ఈదాడిలో ఆయన ఎడమ అరచేయికి తీవ్ర గాయాలమైంది. వీధి గుండా నడుచుకుంటూ వెళ్తున్న భీమప్ప, వెంకటమ్మ, జగదేవిలను సైతం దాడి చేసి గాయ పరిచాయి. రాత్రి, పగలు అనే తేడా లేకుండా కుక్కలు ప్రజలపై దాడి చేస్తున్నాయని స్థానికులు తెలిపారు. వీధి శునకాల నియంత్రణలో భాగంగా వందల సంఖ్యలో స్టెరిలైజేషన్ చేశామని మున్సిపల్ అధికారులు గొప్పలు చెప్పుకోవడమే తప్పా క్షేత్ర స్థాయిలో అలాంటిదేమీ లేదని పట్టణవాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే మున్సిపల్ అధికారులు వీధి కుక్కల నియంత్రణ చేపట్టకపోతే కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తామని పలువురు హెచ్చరించారు. -
ప్రాణం తీసిన అజాగ్రత్త
నవాబుపేట: మద్యం మత్తులో అజాగ్రత్త, అతి వేగంగా వచ్చిన కారు డ్రైవర్ ఓ బైక్‌ను ఢీ కొట్టిన సంఘటన మండల పరిధిలోని మైతాప్ఖాన్గూడలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బైకిస్టు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని దేవరంపల్లి గ్రామానికి చెందిన పట్లోళ్ల మహేందర్‌రెడ్డి తన బైక్‌పై గురువారం రాత్రి మైతాప్ఖాన్గూడకు వెళ్తున్నాడు. అదే సమయంలో చక్రంపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కారులో మైతాప్‌ఖాన్‌గూడ నుంచి దేవరంపల్లి వైపు వెళుతున్నాడు. మద్యం మత్తులో ఉన్న కారు డ్రైవర్ మార్గమధ్యలో అతి వేగంగా వచ్చి బైక్‌ను ఢీకొట్టాడు. దీంతో తీవ్ర గాయాలైన మహేందర్‌రెడ్డి అక్కడిక్కడే మృతి చెందాడు. బైక్‌ను ఢీకొట్టిన కారు అనంతరం వెనకాల వస్తున్న డీసీఎంను సైతం ఢీకొంది. తోటి ప్రయాణికులు కారు డ్రైవర్ని పట్టుకోవడానికి ప్రయత్నించగా అతను పారిపోయాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మృతుడి కుటుంబ సభ్యులకు తెలిపినట్లు ఎస్ఐ పుండ్లిక్ చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య భాగ్యమ్మ, మూడేళ్ల కొడుకు ఉన్నారు. ● బైక్‌ను ఢీకొట్టిన కారు ● అక్కడికక్కడే వ్యక్తి దుర్మరణం -
హే బాలాజీ.. ఏమిటీ దుస్థితి
● చెప్పులతో లోపలికి ప్రవేశిస్తున్న షూటింగ్ సిబ్బంది ● పట్టించుకోని దేవాదాయ అధికారులు పహాడీషరీఫ్: మామిడిపల్లిలోని ప్రాచీనమైన బాలా జీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో దేవాదాయ, ధర్మాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా అపవిత్రంగా మారుతోంది. దాతల సహకారంతో నూతన సొబగులతో తీర్చిదిద్దబడుతున్న ఈ ఆలయాన్ని అధికారులు మాత్రం కేవలం కాసుల కోణంలోనే చూస్తున్నారు. ఆలయ పరిసరాలలో కొన్నాళ్లుగా సినిమా, సీరియల్, పాటలు, వివాహాది ఫొటోషూట్లు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. ఒక్కో దానికి ఒక్కో ధరను నిర్ణయించి దేవాదాయ శాఖ అకౌంట్లోనే డబ్బులు జమ చేస్తున్నారు. ఆదాయం సమకూరడం వరకు బాగానే ఉంది. కానీ ఆయా షూటింగ్‌లకు వచ్చే నటులు ఆలయం వద్ద కనీస ప్రమాణాలు పాటించడం లేదు. ఆలయ ప్రధాన ద్వారానికి ఇరువైపులా వ్రతాలు చేసే ప్రాంగణం(సాలాహారం)లో దేవతామూర్తుల చిత్రపటాలను ఏర్పాటు చేసినప్పటికీ, అందులోకి షూటింగ్ నటులు ఎంచక్కా బూట్లు, చెప్పులతో కూర్చొంటున్నారు. కొన్ని షూటింగ్‌లైతే ఆలయంలోకి భక్తులు వెళ్లేందుకు వీలు లేకుండా ప్రధాన ద్వారం ముందే చేస్తున్నారు. ఇక ఆలయ ముందు భాగంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తదితర విగ్రహాలు కలిగిన పార్కులో గతంలో బయటే చెప్పులు వదిలి వెళుతుండగా, కనీసం సూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో ప్రస్తుతం అందరు చెప్పులతోనే అందులోకి ప్రవేశిస్తున్నారు. ఇక వివాహం కోసం ఫొటోషూట్లకు వచ్చే జంటలు ఆలయ పవిత్రతను మరింత దెబ్బతీస్తున్నాయి. ఆలయ ప్రాకారంపై ఇష్టమైన రీతిలో స్టిల్స్ ఇస్తూ ఫొటోలు దిగుతున్నారు. ఆలయ పార్కు, శ్రీకృష్ణుడి గోశాల వైపు గ్రిల్స్ విరిగిపోతున్నా కూడా అధికారులకు పట్టడం లేదు. మొత్తం మీద మానసిక ప్రశాంతత కోసం భగవంతుడి సన్నిధిలో గడిపేందుకు వస్తే ఏకాగ్రతకు భంగం కలగుతుందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
పేలిపోయిన వాషింగ్ మిషన్
అమీర్‌పేట: అమీర్‌పేట ధరం కరం రోడ్డులోని ఓ ఇంట్లో ఎల్జీ వాషింగ్ మిషన్ పేలిపోయింది.పెద్ద శబ్దం రావడంతో ఇంట్లోని వారు తీవ్ర భయాందోళకు గురై బయటకు పరుగులు తీశారు. ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కేకే ఎన్క్లేవ్ ఫ్లాట్ నెం.503లో గురువారం మధ్యాహ్నం ఫ్రంట్ డోర్ వాషింగ్ మిషిన్ నడుస్తుండగా ఒక్కసారిగా పెద్ద శబ్దంతో వాషింగ్ మిషన్ పేలిపోయింది. ఈ సమయంలో ఇంట్లోని వారు తీవ్ర భయాందోళనకు గురై పరుగులు తీశారు. తేరుకుని బాల్కానీలోనిలోకి వచ్చి చూడగా వాషింగ్ మిషన్ ఎక్కడికక్కడ విరిగి పోయి విడిబాగాలు చెల్లాచెదురుగా పడ్డాయి. లోపలి పేలుడు ధాటికి లోపల అత్యంత బరువుగా ఉన్న బ్యాటరీ సీలింగ్ తగిలి కింద పడిపోయింది.పెద్ద ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డామని మహిళ వాపోయింది. షార్ట్‌సర్క్యూట్ జరిగి కరెంటు వైర్లు కాలిపోతే ఇంట్లో అంతటా మంటలు వ్యాపించి కాలిబూడిదయ్యేదని తెలిపారు. ప్రమాదం ఎలా జరిగిందన్నది తెలియరాలేదని,బాధితులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఘనంగా శ్రీనివాస కల్యాణం
కొడంగల్: పట్టణంలో శ్రీనివాస కల్యాణాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. పట్టణ పురోహితులు కిట్టు స్వామి, లక్ష్మీనారాయణ జోషిల ఆధ్వర్యంలో అభిషేకం, కల్యాణోత్సవం, హోమం తదితర పూజా కార్యక్రమాలు చేశారు. పట్టణానికి చెందిన కటుకం వెంకటేశ్, మమత దంపతుల ఆధ్వర్యంలో పూజలు జరిపించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ముద్దప్ప దేశ్‌ముఖ్, పీఏసీఎస్ చైర్మన్ శివకుమార్ గుప్తా, లయన్స్‌క్లబ్ అధ్యక్షుడు మురహరి వశిష్ట, బాధ్యత సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. వైభవంగా అయ్యప్పస్వామి శోభాయాత్రతాండూరు: అయ్యప్పస్వామి దేవాలయ వార్షికోత్సవాలు గురువారం అత్యంత వైభవంగా జరిగాయి. ఉదయం స్వామివారి విగ్రహానికి పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ విగ్రహాన్ని రథంపై ప్రతిష్ఠించి పట్టణ వీధుల గుండా శోభాయాత్ర చేపట్టారు. వందలాది మంది భక్తుల సమక్షంలో ప్రత్యేక పూజలు చేశారు. మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి శోభాయాత్రలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి పల్లకీ సేవ భావిగి భద్రేశ్వర దేవాలయం వరకు కొనసాగింది. ఆలయంలో అయప్ప స్వాములకు పట్టణానికి చెందిన భక్తులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ స్వప్నపరిమళ్, నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. బెల్టు షాపులపై కొరడా! ● ఒకేరోజు మూడు గ్రామాల్లో దాడులు ● ముగ్గురిపై కేసు నమోదు తాండూరు రూరల్: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు బెల్టు షాపులపై కొరడా ఝుళిపించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గురువారం మూడు గ్రామాల్లో బెల్టు షాపులపై కరన్‌కోట్ పోలీసులు దాడులు నిర్వహించారు. చెన్‌గేస్‌పూర్, గోపన్‌పల్లి, ఎల్మకన్నె గ్రామాల్లో కిరాణ దుకాణంలో తనిఖీలు చేశారు. అనుమతి లేకుండా మద్యం విక్రయిస్తుండగా పట్టుకున్నారు. షాపుల్లో ఉన్న 20 లీటర్ల లిక్కర్ బీర్లను స్వాధీనం చేసుకున్నారు. కుర్వ భాగ్యమ్మ, గౌడి సుజాత, కుర్వ మల్లప్పలపై కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. గ్రామాల్లో బెల్టుషాపులు నిర్వహిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. ఎన్నికల సమయంలో కేసులు నమోదు అయితే భవిష్యత్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటారని హెచ్చరించారు. సమతుల ఆహారంతోనే ఆరోగ్యం పీహెచ్సీ డాక్టర్ శాంతి ధారూరు: ప్రతిఒక్కరూ సమతుల ఆహారం తీసుకుంటేనే ఆరోగ్యంగా ఉంటారని ధారూరు పీహెచ్సీ వైద్యురాలు శాంతి పేర్కొన్నారు. వ్యాధుల బారిన పడినప్పుడు వైద్యుల సలహా మేరకు నడుచుకోవాలని సూచించారు. గురువారం టీబీ ముక్త్ కార్యక్రమంలో భాగంగా స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వ్యాధిగ్రస్తులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, మనం తినే ఆహార అలవాట్ల ద్వారా పలు రకాల వ్యాధులు వస్తున్నాయన్నారు. పౌష్టికాహారంతో వాటిని నియంత్రించుకోవచ్చని చెప్పారు. -
ఎన్నికలు సజావుగా నిర్వహించాలి
● జిల్లా ఎన్నికల పరిశీలకులు షేక్ హాస్మిన్ బాషా ● నామినేషన్ కేంద్రాల పరిశీలన బొంరాస్‌పేట: గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేలా ప్రత్యేక శ్రద్ధతో పని చేయాలని జిల్లా ఎన్నికల పరిశీలకులు షేక్ హాస్మిన్ బాషా, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు సూచించారు. గురువారం ఎన్నికల వ్యయ పరిశీలకుడు మనోహార్ రాజుతో కలిసి వారు మండల కేంద్రంతో పాటు తుంకిమెట్ల, దుప్చర్ల, మహాంతిపూర్, జానకంపల్లి, బోట్లవానితండా, నాగిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీలకు సంబంధించి నామినేషన్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నామినేషన్ల ప్రక్రియలో ఎలాంటి తప్పులు, పొరపాట్లు లేకుండా చూడాలన్నారు. నామినేషన్ల దాఖలు చేసే క్రమంలో కావాల్సిన ధ్రువప్రతాలను సమర్పణను అభ్యర్థులకు తెలియజేయాలని సూచించారు. నామినేషన్ల ఫారాలను స్పష్టంగా చూసి వాటిలో ఏవైనా తప్పులు ఉంటే వాటిని సరిచేసుకునే విధంగా సహకరించాలన్నారు. అభ్యర్థుల ఖర్చుల వివరాలు ఎప్పటికప్పుడు తీసుకోవాలన్నారు. అభ్యర్థుల వ్యయ వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో సమర్పించాలన్నారు. ఖర్చులను వివరాలను సమర్పించాలని లేనిపోతే గెలుపు రద్దు అవుతుందనే విషయాలను గుర్తు చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అఽధికారి జయసుధ, తహసీల్దార్ పద్మావతి, ఎంపీడీఓ వెంకన్న గౌడ్, రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
‘టీఈ పోల్’తో ఎన్నికల సమాచారం
● ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలి ● కలెక్టర్ ప్రతీక్ జైన్ అనంతగిరి: టీఈపోల్ మొబైల్ యాప్ ద్వారా ఓటర్లు పోలింగ్ సమాచారం పొందవచ్చనని కలెక్టర్ ప్రతీక్ జైన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ యాప్ ద్వారా ఓటరు స్లిప్పులు పొదవచ్చని, పోలింగ్ స్టేషన్ల వివరాలు తెలుసుకోవచ్చని, ఎన్నికలకు సంబంధించి ఏవైనా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. మీడియా పాయింట్ ప్రారంభం కలెక్టరేట్లో గురువారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎన్నికల సాధారణ పరిశీలకులు షేక్ యాస్మిన్ బాషా తోకలిసి మీడియా పాయింట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మీడియా సెంటర్‌ను ఏర్పాటుచేసినట్లు తెలిపారు. అనంతరం షేక్ యాస్మిన్ బాషా మాట్లాడుతూ.. ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని మీడియా పాయింట్ ద్వారా తెలుసుకోవచ్చని తెలిపారు. అనంతరం హెల్ప్ లైన్ సెంటర్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో ఎన్నికల వ్యయ పరిశీలకులు మనోహర రాజు, జిల్లా పంచాయతీ అధికారి జయసుధ, డీపీఆర్ చెన్నమ్మ, ఉద్యాన వన శాఖ అధికారి సత్తార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాబుమోసెస్ తదితరులు పాల్గొన్నారు. -
పీసీసీ చీఫ్‌ను కలిసిన డీసీసీ అధ్యక్షుడు
బీజేపీ జిల్లా కో కన్వీనర్ శ్రీధర్‌రెడ్డి ధారూర్: జిల్లాలో బాల్య వివాహాల విముక్తి కోసం సాధన సంస్థ ఆధ్వర్యంలో ఽగురువారం ధారూర్, స్టేషన్ ధారూర్, నాగసముందర్, రాంపూర్, గడ్డమీది గంగారం, అవుసుపల్లి, కొండాపూర్ కలాన్, గట్టెపల్లి, దోర్నాల, రుద్రా రం గ్రామాల్లో విద్యార్థులు, యువకులు ర్యాలీ తీశారు. బాల్య వివాహాలు చేయడం నేర మన్నారు. కార్యక్రమంలో సంస్థ కోఆర్డినేటర్ నర్సింలు, సభ్యులు శ్వేత, గౌరీ, అసీమాబేగం, తౌఫిక్, రోజా, శివలక్ష్మి, కన్యాకుమారి, మమ త, రమేష్, పవన్ పాల్గొన్నారు. అనంతగిరి: అనంతగిరిగుట్ట ఆలయం వద్ద టెంకాయల విక్రయానికి, వాహనాల పార్కింగ్ కోసం వేలం నిర్వహించనున్నట్లు ఆయల ఈ వో నరేందర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.వచ్చే ఏడాది జనవరి నుంచి డిసెంబర్ వరకు (కార్తీక మాసం నెల రోజులు మినహ) టెంకాయలు విక్రయించుకోవచ్చని తెలిపారు. డిసెంబర్ 4వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు ఆలయ ప్రాంగణంలో వేలం ఉంటుందన్నారు. ఆసక్తిగల వారు రూ.2 లక్షలు డిపాజిట్ చేసి వేలంలో పాల్గొనాలని సూచించారు. దుద్యాల: మండలంలో పారిశ్రామిక వాడ కోసం భూసేకరణ గడువును మరో ఏడాది పొడిగించారు. ఈ మేరకు కలెక్టర్ ప్రతీక్‌జైన్ నోటిఫికేషన్ జారీ చేసినట్లు గురువారం తహసీల్దార్ కిషన్ తెలిపారు. గత నోటిఫికేషన్ ఈ నెల 29వ తేదీతో ముగుస్తుండటంతో మరో ఏడాది పొడిగించినట్లు తెలిపారు. 1,174 ఎకరాలకు నోటిఫికేషన్ ఇవ్వగా 934 ఎకరాలు సేకరించారు. మిగిలిన భూమికి సంబంధించిన అంశం కోర్టు పరిధిలో ఉండటంతో మరికొంత సమయం పట్టేందుకు అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మరో ఏడాది పాటు గడువు పొడిగించినట్లు తహసీల్దార్ తెలిపారు. -
ఎంపీని కలిసిన నాయకులు
చేవెళ్ల: ఇటీవల గుండె ఆపరేషన్ చేయించుకొని విశ్రాంతి తీసుకుంటున్న చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని పట్టణ బీజేపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. గురువారం నగరంలోని ఎంపీ నివాసానికి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, నాయకులు ఆయనను కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నాయకులతో ఆయన కాసేపు మాట్లాడారు. తన ఆరోగ్యం బాగానే ఉందని, విశ్రాంతి అనంతరం చేవెళ్ల పార్లమెంట్‌లోని ప్రజలను కలిసేందుకు వస్తానని చెప్పారు. నియోజకవర్గంలో పరిస్థితిలు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అంతా కలిసిమెలసిపనిచేయాలని ఎంపీ సూచించారు. అన్ని స్థానాల్లో పోటీ చేయాలని, వార్డుసభ్యుల నుంచి బీజేపీ అభ్యర్థులు ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ అధ్యక్షుడు అనంత్‌రెడ్డి, యువ నాయకుడు డాక్టర్ మల్గారి వైభవ్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, జయశంకర్‌గౌడ్, కృష్ణరెడ్డి, వెంకటేశ్, సత్యనారాయణ, క్రిష్ణ, శ్రీనివాస్, అశోక్, గణేశ్, భీమ్‌రెడ్డి, రఘు, జయసింహరెడ్డి, అభిషేక్‌రెడ్డి తదితరులు ఉన్నారు. -
ఏకగ్రీవ పంచాయతీలకు..
కాంగ్రెస్ గూటికి.. బీఆర్ఎస్ నాయకుల చేరిక తాండూరు రూరల్: నాయకులు, కార్యకర్తలు గ్రూపులుగా విడిపోతే పార్టీ పరంగా నష్టపోతామని ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని అంతారం తండాలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ బలపర్చిన ఒక్కరే సర్పంచ్ అభ్యర్థిగా ఉండాలన్నారు. గ్రూపులుగా విడిపోయి ఎవరికి వారు అభ్యర్థులను బరిలో ఉంచరాదని సూచించారు. అనంతరం పెద్దేముల్లో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. మీరే సర్పంచ్ అభ్యర్థులను ఎంపిక చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకుడు ఎల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. విడిపోతే నష్టపోతాంరూ.20 లక్షల నజరానా తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి అధికార పార్టీ సర్పంచులు ఉంటేనే అభివృద్ధి సాధ్యం బషీరాబాద్‌లో పార్టీ ముఖ్యనాయకులతో భేటీ -
ప్రజలతో మర్యాదగా మెలగండి
● దోపిడీలు, దొంగతనాలపై ప్రత్యేక నిఘా ఉంచాలి ● ఎస్పీ స్నేహమెహ్రపూడూరు: పోలీసులు ప్రజల పట్ల మర్యాదగా మెలగడంతోపాటు బాధితులకు సత్వర న్యాయం అందేలా చూడాలని ఎస్పీ స్నేహమెహ్ర సూచించారు. గురువారం మండలంలోని చన్గోముల్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలు, రికార్డులను పరిశీలించారు. పెండింగ్ కేసులపై ఆరా తీశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రజలు చేసే ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించి నిందితులకు శిక్ష పడేలా చూడాలని ఆదేశించారు. మహిళలు, బాలికల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. దోపిడీ, దొంగతనాలు ఇతర నేరాలపై నిఘా ఉంచాలన్నారు. పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఎక్కడా ఎలాంటి గొడవలు జరగకుండా చూడాలని తెలిపారు. సిబ్బంది తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, క్రమశిక్షణ, నిబద్ధతతో పని చేయాలన్నారు. పోలీస్‌స్టేషన్‌లో సమస్యలు ఉంటే తమ దృష్టికి తెస్తే పరిష్కరిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్ఐ భరత్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. యోగా అలవాటు చేసుకోవాలి అనంతగిరి: వికారాబాద్ పట్టణంలో గురువారం మల్టీజోన్ –2 పరిధిలోని ఏఆర్ ఎస్ఐలకు ఆర్ఎస్ఐలుగా పదోన్నతి కల్పించేందుకు నిర్వహించిన శారీరక సామార్థ్య కార్యక్రమాన్ని ఎస్పీ స్నేహమెహ్ర పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ యోగా, మెడిటేషన్, వ్యాయమాలు అలవాటు చేసుకుని శారీరకంగా, మానసికంగా ధృడంగా ఉండాలన్నారు. విధులను సమర్థవంతంగా, నిబద్ధతతో నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రాములు నాయక్, ఏఆర్ డీఎస్పీ వీరేష్, ఆర్ఐలు, ఆర్ఎస్ఐలు పాల్గొన్నారు. -
పొరపాట్లకు అవకాశం ఇవ్వొద్దు
● ఎలక్షన్ సజావుగా నిర్వహించాలి ● ఎన్నికల సాధారణ పరిశీలకులుషేక్ యాస్మిన్ బాషా ● పాల్గొన్న కలెక్టర్, ఎస్పీ అనంతగిరి: గ్రామ పంచాయతీ ఎన్నికలను ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా నిర్వహించాలని ఎన్నికల సాధారణ పరిశీలకులు షేక్ యాస్మిన్ బాషా సూచించారు. గురువారం కలెక్టరేట్లో కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ స్నేహామెహ్రాతో కలిసి నోడల్ ఆఫీసర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మొదటి విడత పోలింగ్ డిసెంబర్ 11న, రెండో విడత డిసెంబర్ 14న, మూడో విడత 17న జరగనున్నట్లు వివరించారు. ఇందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఆర్వోలు, ఏఆర్ఓలు, పీఓ, ఏపీఓలకు జోనల్ అధికారులు, సూక్ష్మ పరిశీలకులకు మరోసారి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. బ్యాలెట్ పేపర్ల ముద్రణ, మెటీరియల్ మేనేజ్ మెంట్, ఎన్నికల సిబ్బంది, జోనల్ అధికారుల నియామకం, కోడ్ అమలుపై నిత్యం నివేదికలు పంపేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాజకీయ ప్రకటనలకు సంబంధించి మీడియా సర్టిఫికేషన్, మానిటరింగ్ కమిటీ, సోషల్ మీడియా ద్వారా నిర్వర్తించే విధులు సంబంధిత అధికారి చూడాలన్నారు. ఎన్నికల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో 912 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు, 922 అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామన్నారు. క్లస్టర్ వారీగా బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. సమావేశంలో వ్యయ పరిశీలకులు మనోహర రాజు, తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, డీఆర్ఓ మంగీలాల్, ఆర్డీఓ వాసుచంద్ర, జిల్లా పంచాయతీ అధికారి జయసుధ, నోడల్ అధికారులు పాల్గొన్నారు. -
ఎన్నికలు పకడ్బందీగా నిర్వహిస్తాం
అనంతగిరి: జిల్లాలో పంచాయతీ ఎన్నికలను అధికారుల సమన్వయంతో పకడ్బందీగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని, అదనపు డీజీపీ మహేశ్ భగవత్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులు, అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో జిల్లా నుంచి కలెక్టర్ ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం జిల్లాలో 2వ సాధారణ పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహిస్తామన్నారు. మొదటి విడతలో తాండూరు, బషీరాబాద్, యాలాల్, పెద్దేముల్, కొడంగల్, దౌల్తాబాద్, బొంరాస్‌పేట, దుద్యాల్ మండలాల్లోని 262 సర్పంచ్, 2,198 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. రెండో విడతలో వికారాబాద్, ధారూరు, మోమిన్‌పేట, నవాబుపేట, బంట్వారం, మర్పల్లి, కోట్‌పల్లి మండలాల్లోని 175 సర్పంచ్, 1,520 వార్డు సభ్యుల స్థానాలకు, మూడో విడతలో పరిగి, పూడూరు, కుల్కచర్ల, చౌడాపూర్, దోమ మండలాల్లోని 157 సర్పంచ్, 1,340 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ఫ్లయింగ్, స్టాటిస్టిక్, వీడియో సర్వేలెన్స్ బృందాలు, ఎంసీఎంసీ, మీడియా సెల్, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో ఎస్పీ స్నేహామెహ్రా, అదనపు కలెక్టర్లు లింగ్యానాయక్, సుధీర్, ట్రైనీ కలెక్టర్ హర్ష్ చౌదరి, అడిషనల్ ఎస్పీ రామునాయక్, జిల్లా పంచాయతీ అధికారి జయసుధ, ఆర్డీఓ వాసుచంద్ర పాల్గొన్నారు. -
సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా
● తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్యబషీరాబాద్: మండలంలోని సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా పెడుతున్నట్లు తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య అన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో ఎక్కడ కూడా శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. బుధవారం తాండూరు రూరల్ సీఐ ప్రవీణ్‌రెడ్డితో కలిసి బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. గతంలో ఎక్కడెక్కడ రాజకీయ గొవడలు జరిగాయో ఆ గ్రామాల వివరాల రికార్డులను పరిశీలించారు. సర్పంచ్ ఎన్నికల్లో కోడ్‌ను పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. కర్ణాటక సరిహద్దు మండలం కావడంతో సరిహద్దు గ్రామాల చెక్‌పోస్టుల దగ్గర తనిఖీలు చేయాలని సూచించారు. ఇసుక అక్రమ రవాణా జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ వనరులను కొల్లగొడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మొదటిసారి పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన డీఎస్పీకి పోలీసులు స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఎస్ఐ నుమాన్‌అలీ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
ఇక డిజిటల్ బోధన
పరిగి: రాష్ట్ర ప్రభుత్వం సర్కార్ పాఠశాలలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. డిజిటల్ తరగతులకు ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించేందుకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పనకు ప్రభుత్వం నిర్ణయించింది. రెండు దశల్లో ఇంటర్నెట్ కనెక్షన్లు పూర్తి చేసేందుకు ప్రతిపాదనలను విద్యాశాఖ రూపొందించింది. కంప్యూటర్ ఉన్న పాఠశాలలకు మొదటి ప్రాధాన్యం ఇస్తున్నారు. జిల్లాలో బీఎస్ఎన్ఎల్ కనెక్షన్లను ఆయా పాఠశాలకు ఇవ్వడంపై దృష్టి సారిస్తోంది. దశల వారీగా పాఠశాలలను ఎంపిక చేసి ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తారు. మరోవైపు బీఎస్ఎన్ఎల్ కనెక్షన్ ఆలస్యమైతే ప్రైవేట్ ఇంటర్నెట్ సౌకర్యానికి అవకాశం కల్పించింది. పాఠశాలల గ్రాంటు నుంచి కనెక్షన్లు తీసుకోవాలనే ఆదేశాలపై ప్రధానోపాధ్యాయులు ఆసక్తి చూడపం లేదు. దీంతో ఇంటర్నెట్ సౌకర్యం లేక ఇంటరాక్టివ్ ప్యానెల్ బోర్డులపై డిజిటల్ బోధనకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఇంటర్నెట్ సేవలు నిల్ పరిగి నియోజకవర్గంలో పరిగి, దోమ, కుల్కచర్ల, చౌడాపూర్, పూడూర్ మండలాలున్నాయి. నియోజవర్గంలో మొత్తం 291 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా అందులో నాలుగు కేజీబీవీ, మూడు మోడల్ స్కూళ్లు ఉన్నాయి. అందులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు 44, ప్రాథమిక 222, ప్రాథమికోన్నత 23లు ఉన్నాయి. పరిగి మండలంలో మొత్తం 61 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా ఏ ఒక్క బడికి కూడా ఇంటర్నెట్ సౌకర్యం లేదు. దోమ మండలంలో మొత్తం70 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా ఇంటర్నెట్ సౌకర్యం లేదు. కుల్కచర్లలో 64, చౌడాపూర్‌లో 44, పూడూరులో 50 ప్రభుత్వ పాఠశాలలు సాంకేతిక వెసులుబాటు లేదు. దీంతో డిజిటల్ బోధనకు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడంతో విద్యార్థులకు బోధన, ఆన్లైన్ రిపోర్టు తదితర పనులు పాఠశాల నుంచే నిర్వహించేందుకు వీలుంటుందని ఉపాధ్యాయులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తీరనున్న ఇబ్బందులు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నెట్ కనెక్షన్లు లేక ఏఐ తరగతులు, యూడైస్ ప్లస్‌లో వివరాల నమోదు, విద్యార్థుల ముఖ గుర్తింపు హాజరు, డిజిటల్ బోధనకు ఇబ్బందులు తప్పడం లేదు. విద్యాశాఖ పాఠశాలల్లో వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నారు. విద్యార్థులు విషయాల వారీగా టాపిక్, నిపుణుల పాఠాలు వీక్షించే పాఠశాలల్లో ఉపాధ్యాయులు ప్రోత్సహిస్తున్నారు. ఇంటర్నెట్ సౌకర్యం లేక పోవడంతో పాఠశాలల్లో ఇంటరాక్టివ్ ప్యానెల్ బోర్డులు ఉన్నా ఆన్లైన్ తరగతులు జరగడం లేవు. కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయుల మొబైల్ ఫోన్లోని నెట్ ఆధారంగా పాఠాలు చెబుతున్నారు. ఏఐ బోధన జరుగుతున్న ఇంటర్నెట్ సౌకర్యం లేక సక్రమంగా అమలు కావడం లేదని పలువురు వాపోతున్నారు. ప్రభుత్వ ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తుండటంతో పాఠశాలల్లోని సమస్యలు పరిష్కారం అవుతాయని ఉపాధ్యాయులు అంటున్నారు. నివేదిక పంపించాం మండలంలో ఒక్క ప్రభు త్వ పాఠశాలలో సైతం ఇంటర్నెట్ సౌకర్యం లేదు. కొన్నింటిలో డిజిటల్ బోధన ఉపాధ్యాయుల మొబైల్ ఫోన్ నుంచే నిర్వహిస్తున్నారు. ప్రభుత్వానికి ఇంటర్నెట్ లేని బడుల వివరాలను అందించాం. త్వరితగతిన సాంకేతిక సౌకర్యం కల్పించాలి. – గోపాల్, ఎంఈఓ, పరిగి సర్కార్ బడులకు ఇంటర్నెట్ సౌకర్యం దశలవారీగా అన్ని పాఠశాలలకు ఏర్పాటు కంప్యూటర్లు ఉన్న స్కూళ్లకు మొదటి ప్రాధాన్యం వివరాలను సేకరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం హర్షం వ్యక్తం చేస్తున్న ఉపాధ్యాయులు, విద్యార్థులు -
జిల్లా అస్తిత్వాన్ని దెబ్బతీసే కుట్ర
సాక్షి, రంగారెడ్డిజిల్లా: జిల్లాలోని విలువైన భూములు, జిల్లా ఆదాయంపై కాంగ్రెస్ సర్కార్ కన్నేసిందని.. జిల్లా అిస్తిత్వాన్ని దెబ్బతీసేందుకు నడుం బిగించిందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో బుధవారం దీక్షా దివస్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను, మేడ్చల్ జిల్లా మొత్తాన్ని ఏకపక్షంగా జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని కేబినెట్ నిర్ణయించడం ప్రజా వ్యతిరేక చర్య అని విమర్శించారు. ఆర్థికంగా పరిపుష్టమై ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న శివారు ప్రాంతాలకు ప్రభుత్వ నిర్ణయం ఆశనిపాతంలా మారిందన్నారు. ఈ నిర్ణయంతో పేద, మధ్య తరగతి ప్రజలపై ఆర్థికంగా పెను భారం తప్పని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంటి పన్నులు, నల్లా బిల్లులు, ఇతర చార్జీలు అడ్డగోలుగా పెరుగుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి నిర్మాణం, నల్లా కనెక్షన్, వీధి దీపాలు, డ్రైనేజీలు, రోడ్లు ఇలా ప్రతీ పనికి హైదరాబాద్ వైపు చూడాల్సి వస్తుందని చెప్పారు. నగర అభివృద్ధిని మూలన పడేసిన రేవంత్ సర్కార్ శివారు ప్రాంతాలను సైతం అధోగతిపాలు చేయడానికే ఈ విలీన ప్రక్రియ చేపట్టారని తీవ్రంగా విమర్శించారు. వ్యవసాయం మీద మక్కువ ఉన్న కేసీఆర్ సాగుకు ఊతమిస్తే.. రియల్ ఎస్టేట్ మీద మక్కువతో రేవంత్ రెడ్డి భూముల అమ్మకం మీద దృష్టి సారించారని ఎద్దేవా చేశారు. రాజకీయాలకు అతీతంగా జిల్లా ప్రజలంతా ఏకమై జిల్లాను కాపాడుకుందామని పిలుపునిచ్చారు. దీక్షాదివస్‌కు తరలిరండి పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ఈనెల 29న ఉదయం 10 గంటలకు శంషాబాద్‌లోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో నిర్వహించే దీక్షాదివస్ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా కార్యకర్తలు, అభిమానులు, ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షతో తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని, కేసీఆర్ పాలనలో జిల్లా నంబర్ వన్‌గా ఎదిగితే రేవంత్ సర్కార్ హోల్‌సేల్‌గా అమ్మేందుకు దిగిందని మండిపడ్డారు. షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మాట్లాడుతూ.. సర్పంచ్ ఎన్నికల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చీరలు పంచుతోందని, బతుకమ్మ, రంజాన్, క్రిస్మస్ పండగలకు రెండు సార్లు ఎగ్గొటిందన్నారు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులే విజయం సాధిస్తారని ధీమా వ్యక్తంచేశారు. భువనగిరి పార్లమెంట్ ఇన్చార్జి క్యామ మల్లేష్ మాట్లాడుతూ.. జిల్లా అిస్తిత్వాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ కంకణబద్దులై కదిలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు నర్సింహ, గ్రంథాలయ సంస్థ జిల్లా మాజీ చైర్మన్ వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి -
అక్రమ రవాణాకు పాల్పడితే చర్యలు
అనంతగిరి: అసాంఘిక కార్యకలాపాలు, అక్రమ రవాణాకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర హెచ్చరించారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా టాస్క్‌ఫోర్స్ ఆధ్వర్యంలో అక్రమ రవాణాదారులపై ఉక్కుపాదం మోపుతాయన్నారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా సహజ వనరులను తరలిస్తున్న వారిపై నిఘా పెంచి వివిధ పీఎస్‌ల పరిధిలో ఏక కాలంలో మెరుపుదాడులు నిర్వహించాయన్నారు. జిల్లాలో గత నాలుగు రోజుల్లో 6 ఇసుక ట్రాక్టర్లు, 3 ఎర్రమట్టి టిప్పర్లు, ఒక ఎర్రరాయి లారీ, జేసీబీలను సీజ్ చేసి, బాధ్యులపై కేసులు నమోదు చేశామని ప్రకటించారు. బషీరాబాద్ పీఎస్ పరిధిలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 5 ట్రాక్టర్లను, వికారాబాద్ పీఎస్ పరిధిలోని అక్రమంగా ఎర్రమట్టిని తరలిస్తున్న రెండు టిప్పర్లు, ఒక జేసీబీని స్వాధీనం చేసుకున్నామన్నారు. తాండూరు పీఎస్ పరిధిలో ఒక ట్రాక్టర్, యాలాల పీఎస్ పరిధిలో ఎర్రరాయిని తరలిస్తున్న లారీని పట్టుకున్నామని తెలిపారు. ఈ దాడులు నిరంతరం కొనసాగుతాయన్నారు. అసాంఘిక కార్యకలాపాలు, అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. -
లేబర్ కోడ్లు రద్దు చేయాలి
సీఐటీయూ జిల్లా కార్యదర్శి సుధాకర్ అనంతగిరి: కేంద్రం తీసుకొచ్చిన నాలుగు కార్మిక కోడ్లు, రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి సుధాకర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం కేంద్రం తీసుకువచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా అలిండియా కమిటీ పిలుపులో భాగంగా వికారాబాద్ నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినదాలు చేశారు. కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి సుదర్శన్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు మైపాల్, నాయకులు బుగ్గప్ప, రామకృష్ణ, చంద్రయ్య, ఆయా సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు. -
సంగ్రామం షురూ!
వికారాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మూడు దఫాలుగా జరగనున్న ఈ ఎన్నికలకు మొదటి విడత నోటిఫికేషన్ వెలువడనుంది. రిటర్నింగ్ అధికారుల ప్రకటన అనంతరం గురువారం నుంచే నామినేషన్లు స్వీకరించనున్నారు. ఇప్పటికే జీపీల వారీగా అధికారులను సైతం నియమించారు. తొలి విడత ఎన్నికలు వచ్చే నెల 11వ తేదీన జరగనున్నాయి. ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ ప్రతీక్‌జైన్, డీపీఓ జయసుధ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా సంబంధిత అధికారులు నామినేషన్ల స్వీకరణ నుంచి పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించేవరకు అప్రమత్తంగా ఉండాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అందులకు అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది పరుగులు పెడుతున్నారు. మొదట 262 పంచాయతీలు జిల్లాలో మొత్తం 594 గ్రామ పంచాయతీలున్నా యి. వీటిలో తొలిదశలో 262 పంచాయతీలకు ఎన్ని కలు జరుగుతాయి. ఈ గ్రామ పంచాయతీల పరిధిలో 2,198 వార్డులు ఉండగా వీటికి కూడా ఎన్నికలు నిర్వహించనున్నారు. తాండూరు రెవిన్యూ డివిజన్ పరిధిలోని ఎనిమిది మండలాల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. తాండూరు మండలంలోని 33, బషీరాబాద్ 39, యాలాల 39, పెద్దేముల్ 38, కొడంగల్ 25, దౌల్తాబాద్ 33, బొంరాస్‌పేట్ 35, దుద్యా ల్ మండల పరిధిలోని 20 పంచాయతీలకు తొలి విడతలో ఎన్నికలు జరుగుతాయి. మొదటి విడత పోలింగ్ జిల్లా పరిధిలోని ఎనిమిది మండలాల్లో జరగనుండగా ఇందులో 2,94,560 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ప్రారంభోత్సవాలకు బ్రేక్ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరు చేయడానికి వీలులేదు. ఓటర్లను ప్రలోభపెట్టే ఎలాంటి పథకాలు, కార్యక్రమాలు నిర్వహించరాదు. నిధులు మంజూరైన పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు మరో నెల రోజుల పాటు బ్రేక్ పడనుంది. ఇప్పటికే నిధులు మంజూరై కొనసాగుతున్న పనులకు మాత్రం ఎలాంటి ఆటంకం ఉండదు. సంక్షేమ పథకాల అమలులో కూడా కొత్త లబ్ధిదారుల ఎంపిక మాత్రం జరగదు. అదే విధంగా పాత లబ్ధిదారులకు మాత్రం యథాతథంగా సంక్షేమ ఫలాలు అందనున్నాయని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వడంతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చింది. దీంతో మరో నెలరోజుల పాటు అభివృద్ధి పనులకు ఆటంకం కలగనుంది. తొలి విడత ఎన్నికలకు నేటి నుంచి నామినేషన్లు డిసెంబర్ 11న పోలింగ్ మండలాల వారీగా బ్యాలెట్ పత్రాలు, బాక్సుల సరఫరా ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు గ్రామాల్లో ఎన్నో రోజులుగా లూగిసలాడుతూ వస్తున్న సర్పంచ్ ఎన్నికలకు ముహూర్తం ఖరారైంది. అందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. మొదటి విడతలో జరిగే ఎన్నికల నామినేషన్లను నేటి నుంచే స్వీకరించనున్నారు. జిల్లాలో మొదటి విడత వివరాలు గ్రామ పంచాయతీలు 262వార్డుల సంఖ్య 2,198ఓటర్ల సంఖ్య 2,94,560నేటి నుంచి నామినేషన్లు తొలి విడత ఎన్నికలు జరిగే పంచాయతీల్లో నామినేషన్లు గురువారం నుంచి స్వీకరించనున్నారు. ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రిటర్నింగ్ అధికారులు నామపత్రాలు స్వీకరిస్తారు. 30న నామినేషన్లను పరిశీలించటంతోపాటు అదే రోజు సాయంత్రం అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. వచ్చే నెల 3వ తేదీన నామినేషన్ల ఉపసంహరణలకు అవకాశం ఇస్తారు. అనంతరం పోటీలో ఉండే అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. 9వ తేదీ సాయంత్రం వరకు ప్రచారం గడువు ఉండగా 11వ తేదీ పోలింగ్ నిర్వహించి అనంతరం అదే రోజు ఓట్ల లెక్కింపు పూర్తి చేసి ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు. ఆ వెంటనే ఉప సర్పంచ్‌ని సైతం ఎన్నుకోనున్నారు. -
పల్లెపోరు షురూ
పల్లెల్లో పంచాయతీ పోరు సందడి నెలకొంది. ఆశావహులు.. మద్దతు కూడగట్టుకునేందుకు పరుగులు తీస్తున్నారు. రానున్న పరిషత్ ఎన్నికలను ప్రామాణికంగా తీసుకున్న రాజకీయ పార్టీలు.. బలమున్న వారినే బరిలోకి దించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. బషీరాబాద్: పంచాయతీ పోరుకు నగారా మోగడంతో గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొంది. సర్పంచ్ బరిలో నిలిచే ఆశావహులు గ్రామాల్లో చోటా, మోటా లీడర్ల మద్దతు కూడగట్టుకునే పనిలో పడ్డారు. తనకు మద్దతు తెలిపితే.. ఎన్నికల్లోఎంతైన ఖర్చు పెట్టడానికి పోటీదారులు సై అంటున్నారు. ఆయా పార్టీల గ్రామస్థాయి నాయకులను మచ్చిక చేసుకునేందుకు తొలిరోజే దావతులు మొదలు పెట్టారు. మొదటి విడత ఎన్నికలకు నేటి నుంచి నామినేషన్ దాఖలు మొదలు కానుండడంతో.. చలికాలంలో ఎన్నికల వేడి రాజుకుంది. పెద్దలతో మంతనాలు తాండూరు నియోజకవర్గంలోని బషీరాబాద్, యాలాల, తాండూరు, పెద్దేముల్, కోట్‌పల్లి మండలాలలో 155 గ్రామ పంచాయతీలకు డిసెంబర్ 11న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా పంచాయతీల్లో సర్పంచి పదవికి పోటీపడుతున్న ఆశావహులు.. నాయకుల ప్రసన్నం కోసం పరుగులు తీస్తున్నారు. సొంతూరులో పోటీ చేయడానికి వచ్చిన రిజర్వేషన్.. మళ్లీ రాదని భావిస్తున్న వారు.. అందరినీ కూడగట్టుకునే ప్రయత్నాలు తీవ్రం చేశారు. పోటీకి తమ సామాజికవర్గం నుంచి ఎవరూ అడ్డు రాకుండా సముదాయిస్తూ.. వారిని అండగా నిలవాలని అభ్యర్థిస్తున్నారు. బుధవారం ఆయా గ్రామాల్లో గ్రామ పెద్దలతో మంతనాలు జరిపారు. గెలుపు గుర్రాల కోసం ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్లు రిజర్వేషన్ల ప్రకారం ఆయా సామాజిక వర్గాల్లో ఆర్థికంగా బలమైన గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తున్నాయి. వచ్చే పరిషత్ ఎన్నికల్లో విజయం సాధించాలంటే ప్రస్తుతం సర్పంచులను గెలిపించుకోవాలని భావిస్తున్నాయి. దీంతో ఈ ఎన్నికలకు ప్రాధాన్యత సంతరించుకుంది. అధికార కాంగ్రెస్ పార్టీ పంచాయతీ ఎన్నికలను సీరియస్‌గా తీసుకుంది. సీఎం సొంత జిల్లా కావడంతో మెజార్టీ పంచాయతీలను గెలిపించుకోవాలని ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి ఆయా మండలాల ముఖ్య నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇందులో బలమున్న ఉన్న వారిని బరిలోకి దించాలని యోచిస్తున్నారు. ముఖ్యంగా మేజర్ పంచాయతీలపై ప్రత్యేక దృష్టి సారించారు. బీఆర్ఎస్ కూడా అదే విధంగా వ్యూహరచనలు చేస్తోంది. మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి బుధవారం బషీరాబాద్‌లో ముఖ్య నేతలను కలిశారు. గ్రామాల్లో ఎక్కడ చూసిన ఎన్నికల ముచ్చట్లే వినిపిస్తున్నాయి. రచ్చకట్టల దగ్గర, హోటళ్లల్లో ఏ ఇద్దరు కలిసినా ఎన్నికల చర్చే జరుగుతుంది. రిర్వేషన్లు రావడంతో గెలుపుపై అంచనాలు వేసుకుంటున్నారు. పదవుల యోగం స్వాతంత్య్రం వచ్చిన ఏడు దశాబ్దాల తర్వాత తొలిసారి గిరిజన తండాల్లో పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఏళ్లతరబడి రాజకీయ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న గిరిజనులకు.. పదవుల యోగం పట్టనుంది. పనుల కోసం హైదరాబాద్, ముంబాయి తదితర ప్రాంతాలకు వెళ్లిన గిరిజనులు, వడ్డెరులు సొంతూర్లకు వస్తున్నారు.తండాల్లో పోటీకి సై అంటున్నారు. ఏకగ్రీవంపై దృష్టి అధికారంలో ఉన్న కాంగ్రెస్.. మెజార్టీ జీపీలను ఏకగ్రీవం చేసుకునేందుకు ప్రణాళిక చేస్తోంది. కొన్ని గ్రామాల్లో బీఆర్ఎస్కు ఆర్థికంగా బలమైన నాయకులు లేకపోవడంతో, వాటిని ‘హస్త’గతం చేసుకోవాలని చూస్తోంది. ప్రతిపక్ష బీఆర్ఎస్.. ప్రతి పంచాయతీలో తమ మద్దతుదారులను బరిలో దింపడానికి అభ్యర్థులను అన్వేషిస్తోంది. వారి బాటలోనే బీజేపీ పయనిస్తోంది. నియోజకవర్గంలో జీపీలు, వార్డుల వివరాలు గ్రామాల్లో స్థానిక సందడి చలిలో వేడిపుట్టిస్తున్న సర్పంచ్ ఎన్నికలు మద్దతు కోసం ఆశావహుల హడావుడి బలమైన అభ్యర్థి కోసం పార్టీల అన్వేషణ నేటి నుంచి మొదటి విడత నామినేషన్లు -
చదువుతో పాటు ఆటల్లో రాణించాలి
పరిగి: విద్యార్థులు చిన్నతనం నుంచే క్రీడలపై శ్రద్ధ చూపాలని, చదువుతో పాటు ఆటల్లో రాణించాలని టోర్నీ నిర్వాహకులు అన్నారు. స్కూల్ గేమ్స్ ఆఫ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పట్టణ కేంద్రంలోని మినీ స్టేడియంలో నిర్వహించిన అండర్ 17 జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్లో వికారాబాద్ జట్టు వితేగా నిలిచింది. టోర్నీలో ఆరు జోన్లు పరిగి, వికారాబాద్, తాండూరు, కొడంగల్, పెద్దెముల్, మోమిన్‌పేట్ జట్లు పాల్గొన్నాయి. పరిగి, వికారాబాద్ జట్లు ఫైనల్‌కు చేరుకోగా.. వికారాబాద్‌పై పరిగి ఘనవిజయం సాధించింది. అనంతరం విజేత జట్టుకు బహుమతులు అందజేశారు. -
జేసీబీని ఢీకొట్టిన పెళ్లి కారు
● బెలూన్లు ఓపెన్ కావడంతో నూతన వధూవరులకు తప్పిన ప్రమాదం ● నలుగురికి స్వల్పగాయాలు చేవెళ్ల: నూతన వధూవరులతో వెళ్తున్న పెళ్లి కారు రోడ్డుపై ఆగి ఉన్న జేసీబీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నూతన దంపతులతో పాటు మరో ఇద్దరు స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఈ ఘటన చేవెళ్ల ఠాణా పరిధిలోని దేవునిఎర్రల్లి స్టేజీ వద్ద బుధవారం చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని రావుపల్లికి చెందిన జ్యోతి, వెంకటేశ్‌ల కూతురు అనూష(లక్ష్మీప్రియ)కు మొయినాబాద్ మండలపరిధిలోని నాగిరెడ్డిగూడకు చెందిన శివకుమార్‌తో చేవెళ్లలోని ఓ ఫంక్షన్ హాల్లో ఉదయం వివాహమైంది. సాయంత్రం 6.30 గంటలకు వధువు ఇంటికి కారులో బయలుదేరారు. మార్గమధ్యలోని దేవునిఎర్రవల్లి బస్‌స్టేజీ వద్ద ఓ బొలెరో వాహనం పాడవడంతో దాన్ని బాగు చేసేందుకు జేసీబీని తీసుకువచ్చి పెట్టారు. చీకట్లో వాహనాలు కనిపించకపోవడంతో పెళ్లి కారు వేగంగా జేసీబీని వేగంగా ఢీకొట్టింది. కారులో బెలూన్ల్లు ఓపెన్ కావడంతో స్వల్పగాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రులను చేవెళ్లలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వాహనాలను తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రూ.పది లక్షలు పట్టుబడితే ఇన్కమ్ ట్యాక్స్‌కు..
రాజేంద్రనగర్ డీసీపీ యోగేశ్‌గౌతమ్ షాబాద్: పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు కార్డన్ సెర్చ్, నాకాబందీ, వాహనాల తనిఖీలు చేపడుతున్నామని రాజేంద్రనగర్ డీసీపీ యోగేశ్ గౌతమ్ అన్నారు. బుధవారం ఆయన షాబాద్ ఠాణా పరిధిలో ఐదు ప్రాంతాల్లో నాకాబందీ చేపట్టారు. ఈ సందర్భంగా డీసీపీ యోగేశ్ గౌతమ్ మాట్లాడుతూ.. ఎన్నికలలను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్య లు తీసుకుంటున్నామన్నారు. నిబంధలన ప్రకారం రూ.పది లక్షలకు పైగా నగదు పట్టుబడితే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు అప్పగిస్తామన్నారు. రూ.50వేల నుంచి రూ.పది లక్షల లోపు నగదు పట్టుబడితే కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కమిటీకి అందజేస్తామన్నారు. ఎన్నికల తర్వాత సరైన ఆధారాలు తీసుకువచ్చి డబ్బు తీసుకువెళ్లొచ్చన్నారు. ఈ తనిఖీల్లో రూ.లక్ష నగదు, నంబర్ ప్లేట్ లేని ఆరు వ ఆహనాలు, రిజిస్ట్రేషన్ పత్రాలు లేని 26 వాహనాలను సీజ్ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఏసీపీ కిషన్, షాబాద్ సీఐ కాంతారెడ్డి, ఎస్ఐలు రమేశ్, సతీశ్‌కుమార్ తదితరులున్నారు.


