కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
అనంతగిరి: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కోడ్‌ను తప్పనిసరిగా పాటించాలని ఎస్పీ స్నేహ మెహ్ర గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేందుకు సహకరించాలని కోరారు. డబ్బు, మద్యం, బహుమతుల ద్వారా ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు చూస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదన్నారు. రూ.50 వేలకు మించి నగదు తరలించాలంటే తప్పనిసరిగా ఆధారాలు చూపాల్సి ఉంటుందన్నారు. సోషల్ మీడియా వేదికగా తప్పుడు వార్తలు, రెచ్చగొట్టే సందేశాలు, ద్వేషపూరిత వ్యాఖ్యలు ప్రచారం చేస్తే చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో అల్లర్లు సృష్టించే అవకాశం ఉన్నవారిని, నేర చరిత్ర కలిగిన వ్యక్తులను, రౌడీ షీటర్లను ముందుగానే గుర్తించి తహసీల్దార్ల ఎదుట బైండోవర్ చేయాలని ఆదేశించారు.
అక్రమ రవాణాపై ఉక్కుపాదం
బషీరాబాద్: ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మొపుతామని ఎస్పీ స్నేహమెహ్ర హెచ్చరించారు. ప్రభుత్వ వనరులను దోచుకోవాలని చూస్తే సహించేది లేదని తెలిపారు. బుధవారం రాత్రి జిల్లా టాస్క్‌ఫోర్స్ పోలీసులు బషీరాబాద్ మండలం మంతట్టిలో కాగ్నానది నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్‌లను సీజ్ చేశారని తెలిపారు. డ్రైవర్లతో పాటు, ట్రాక్టర్ల యజమానులపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. సీజ్ చేసిన ట్రాక్టర్లకు గురువారం తహసీల్దార్ షాహెదాబేగం భారీ జరిమానా విధించారు.
ఎస్పీ స్నేహ మెహ్ర


