దోపిడీదారుల లబ్ధికే భూసేకరణ | - | Sakshi
Sakshi News home page

దోపిడీదారుల లబ్ధికే భూసేకరణ

Jan 28 2026 10:02 AM | Updated on Jan 28 2026 10:02 AM

దోపిడీదారుల లబ్ధికే భూసేకరణ

దోపిడీదారుల లబ్ధికే భూసేకరణ

రైతులను బెదిరించి

లాక్కుంటున్న సర్కారు

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ

యాచారం: జిల్లాలో రూ.కోట్ల విలువైన వేలాది ఎకరాల భూములను ప్రభుత్వం సేకరించి దోపిడీదారులకు కట్టబెడుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ఆరోపించారు. మండలంలోని నందివనపర్తి ఓంకారేశ్వరాలయ భూములను మంగళవారం ఆయన పరిశీలించి కౌలు రైతులతో చర్చించారు. ఈ సందర్భంగా జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఏర్పాటైనా రంగారెడ్డి జిల్లా భూములపై గద్దల్లా వాలిపోతున్నారని విమర్శించారు. ఏళ్లుగా సాగులో ఉన్న ప్రభుత్వ, అసైన్డ్‌, పట్టా భూములకు నోటిఫికేషన్లు ప్రకటిస్తూ రైతులను బెదిరింపులకు గురి చేసి తక్కువ ధరలకే సేకరిస్తున్నారని దుయ్యబట్టారు. మార్కెట్‌లో ఎకరా భూమి రూ.కోట్లలో పలుకుతుంటే కేవలం రూ.35 లక్షల్లోపే చెల్లించి బలవంతంగా లాక్కుంటున్నారని మండిపడ్డారు. క్షేత్రస్థాయిలో సర్వే చేస్తే అన్నదాతలు అడ్డుకుంటారనే భయంతో రాత్రిపూట డ్రోన్లతో వివరాలు సేకరిస్తున్నారని చెప్పారు. కర్షకులు ఐక్యంగా ఉండి పోరాడాలని పిలుపునిచ్చారు. లేదంటే గజం భూమి కూడా మిగిలే పరిస్థితి లేదన్నారు.

30న యాచారంలో ధర్నా

నందివనపర్తి ఓంకారేశ్వరాలయానికి చెందిన 1,400 ఎకరాల భూములను ఏళ్లుగా సాగు చేసుకుంటున్న నందివనపర్తి, నస్దిక్‌సింగారం, తాడిపర్తి, కుర్మిద్ద గ్రామాల కౌలు రైతులకు హక్కులు కల్పించాలని డిమాండ్‌ చేశారు. తాతల కాలం నుంచి సాగు చేసుకుంటూ 37ఏ సర్టిఫికెట్లు పొందినప్పటికీ, 38ఈ సర్టిఫికెట్లు ఇచ్చి పట్టాదారు, పాసుపుస్తకాలు ఇవ్వకుండా అధికారులు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. పట్టాదారు, పాసుపుస్తకాల కోసం ఈ నెల 30న స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట తలపెట్టిన ధర్నాకు కౌలు రైతులు తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి పి.యాదయ్య, మండల కార్యదర్శి నర్సింహ, వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు పి.అంజయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కె.జగన్‌, నస్దిక్‌సింగారం గ్రామ సర్పంచ్‌ బోడ కృష్ణ, కౌలు రైతులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement