మోగిన పుర నగారా
● టికెట్ల కోసం ఆశావహుల ప్రయత్నాలు
● కొడంగల్‌పై ఫోకస్ చేసిన నాయకులు
కొడంగల్: పురపాలక సంఘాలకు ఎన్నికల నగారా మోగడంతో అన్ని పార్టీల్లో రాజకీయ వేడి రాజుకుంది. అందరి చూపు సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ మున్సిపాలిటీపై పడింది. ఆయా వార్డు స్థానాల్లో పోటీ చేయడానికి ఆశావహులు ఆసక్తి చూపుతున్నారు. టికెట్ల కోసం అధిష్టాన పెద్దలను ప్రసన్నం చేసుకుంటున్నారు. మున్సిపల్ పరిధిలో 12 వార్డులు ఉన్నాయి. ఇందులో 11,668 మంది ఓటర్లు ఉన్నారు. అందులో పురుషులు 5,661 మంది, మహిళలు 6,007 మంది ఓటర్లు ఉన్నారు. కొడంగల్ మున్సిపాలిటీ 2018లో ఏర్పడింది. మొదటిసారి 2020లో ఎన్నికలు జరిగాయి. తొలి చైర్మన్‌గా జగదీశ్వర్‌రెడ్డి(జగ్గప్ప) ఎంపికయ్యారు. రెండోసారి మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేసింది. దీంతో ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న ఆశావహులు ఇప్పటికే ఇంటి పన్ను, నల్ల బిల్లులు చెల్లించారు. కొడంగల్‌లో ఉన్న 12 వార్డుల్లో పోటీ చేయడానికి అన్ని పార్టీల నుంచి అభ్యర్థులు ఆసక్తి చూపుతున్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీల్లో ఇప్పటికే కొంతమంది సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆయా పార్టీల నుంచి బీ ఫారాలు రాకపోతే స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయడానికి కొందరు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. రాజకీయ పార్టీలు వార్డుల వారీగా అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాయి.
రిజర్వేషన్లు ఇలా..
కొడంగల్ మున్సిపల్ చైర్మన్ స్థానం జనరల్‌కు కేటాయించారు. మున్సిపాలిటీలో ఉన్న 12 వార్డుల వారీగా రిజర్వేషన్ వివరాలు ఇలా ఉన్నాయి. 1వ వార్డు (బీసీ జనరల్), 2వ వార్డు (జనరల్ ఉమెన్), 3వ వార్డు (జనరల్ ఉమెన్), 4వ వార్డు (జనరల్), 5వ వార్డు (ఎస్సీ ఉమెన్), 6వ వార్డు (జనరల్), 7వ వార్డు (ఎస్సీ జనరల్), 8వ వార్డు (ఎస్టీ జనరల్), 9వ వార్డు (బీసీ మహిళ), 10 వార్డు (బీసీ జనరల్), 11వ వార్డు (జనరల్ మహిళ), 12వ వార్డు (జనరల్ మహిళ)కు కేటాయించారు.


