బంగారం కోసమే మహిళ హత్య
● సీసీ పుటేజీలతో
కేసు ఛేదించిన పోలీసులు
● ఇద్దరు నిందితులకు రిమాండ్
● వెల్లడించిన డీఎస్పీ నర్సింగ్ యాదయ్య
తాండూరు టౌన్: ఒంటిపై ఉన్న బంగారం, వెండి ఆభరణాల కోసం ఓ మహిళను దారుణంగా హత్య చేసిన కేసులో ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య తెలిపారు. మంగళవారం పట్టణంలోని ఆయన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఈనెల 24వ తేదీన యాలాల మండలం పగిడిపల్లి గ్రామానికి చెందిన లొంకల బందెమ్మ(54), పెద్దేముల్ మండలం రేగొండి గ్రామ శివారులో దారుణ హత్యకు గురైంది. తాండూరు రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్, పెద్దేముల్ ఎస్‌ఐ శంకర్, సిబ్బంది దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీంకు, డాగ్ స్క్వాడ్‌కు ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. దీంతో తాండూరు పట్టణంలోని లేబర్ అడ్డా సమీపంలోని సీసీ ఫుటేజీలను పరిశీలించగా మృతురాలు బందెమ్మ ఇద్దరు వ్యక్తులతో కలిసి వెళ్లినట్లు గుర్తించామన్నారు. ఈమేరకు పెద్దేముల్ మండలం బండమీదిపల్లి గ్రామానికి చెందిన మాల నర్సింలు, కర్ణాటకకు చెందిన కిషోర్ షిండే అనే అడ్డా కూలీలను పట్టుకుని విచారించగా బంగారం, వెండి ఆభరణాల కోసమే అంతమొందించినట్లు అంగీకరించారు. బందెమ్మను నమ్మించి బస్సులో రేగొండి శివారుకు తీసుకెళ్లారు. నర్సింలు పదునైన కత్తితో ఆమె మెడను కోశాడు. అనంతరం బండరాయితో మొదారు. మృతురాలి నుంచి 30 తులాల వెండి కాళ్ల కడియాలు, రెండు గ్రాముల బంగారు గుండ్లు, ముక్కు పుడక తీసుకుని పరారయ్యారు. వీటిని శంకర్‌పల్లిలోని ఓ బంగారం దుకాణంలో రూ.49 వేలకు నర్సింలు విక్రయించాడు. ఈమేరకు నిందితులపై కేసు నమోదు చేసి, బంగారం, వెండిని రికవరీ చేశామన్నారు. నిందితుల్లో ఒకడైన నర్సింలు 2021లో యాలాల మండలం రాస్నం గ్రామానికి చెందిన లక్ష్మి అనే మహిళను ఇదే తరహాలో హత్య చేసిన కేసులో నిందితుడిగా ఉన్నాడు. నిందితులను తక్కువ సమయంలోనే పట్టుకున్న పెద్దేముల్ ఎస్‌ఐ శంకర్‌తో పాటు సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.
బంగారం కోసమే మహిళ హత్య


