ఒక్కో చెరువుకు రూ.3 కోట్లు
● సుందరీకరణ పనులకు
నిధులు మంజూరు
● మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి
మీర్‌పేట/పహాడీషరీఫ్: నియోజకవర్గంలోని నాలుగు ప్రధాన చెరువుల సుందరీకరణ కోసం రూ.మూడు కోట్ల చొప్పున హెచ్‌ఎండీఏ నిధులు మంజూరైనట్లు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మీర్‌పేటలోని క్యాంపు కార్యాలయంలో చెరువుల సుందరీకరణ, ఎస్‌ఎన్‌డీపీ నాలాల అభివృద్ధిపై జీహెచ్‌ఎంసీ, ఇరిగేషన్, హెచ్‌ఎండీఏ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మీర్‌పేటలోని చందన చెరువు, పెద్దచెరువు, జల్‌పల్లి చెరువు, రావిర్యాల చెరువుల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించామన్నారు. ముఖ్యంగా చెరువుల్లో మురుగునీరు చేరుతున్న చోట నాలాలు నిర్మించి మళ్లించాలని, ఆ తరువాత సుందరీకరణ పనులు చేపట్టాలని సూచించారు. పనుల్లో నాణ్యతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. జల్‌పల్లి పెద్ద చెరువు కట్టపై మైసమ్మ ఆలయం వద్ద వినాయక ప్రతిమల నిమజ్జనానికి సంబంధించి ప్రత్యేక పాయింట్ ఏర్పాటు చేయాలన్నారు. బతుకమ్మ ఘాట్‌ను కూడా మహిళా భక్తులకు అసౌకర్యం లేకుండా చూడాలన్నారు. అలాగే రెండో దశలో ఎస్‌ఎన్‌డీపీ నాలాల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ముంపు ప్రాంతాలైన లెనిన్‌నగర్, మిథులానగర్‌లో ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వెంటనే అసంపూర్తిగా ఉన్న ఎస్‌ఎన్‌డీపీ పనులను ప్రారంభించి పూర్తి చేయాలని సూచించారు. వాదే ముస్తఫా ప్రజలు చెరువును ఆనుకొని ఉన్న శ్మశాన వాటికకు రాకపోకలు సాగించేలా మార్గం ఉంచాలని ఎంపీటీసీ మాజీ సభ్యుడు షేక్ అఫ్జల్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. దీనికి ఆమె సానుకూలంగా స్పందించారు. సమావేశంలో ఇరిగేషన్ ఏఈ వంశీ, వర్క్ ఇన్‌స్పెక్టర్ జనార్దన్, మాజీ కౌన్సిలర్ పల్లపు శంకర్, నాయకులు అర్జున్, పటేల్, ఆరీఫ్ తదితరులు పాల్గొన్నారు.


