‘కోట్‌పల్లి’ పనులు పూర్తి చేస్తాం
తాండూరు రూరల్: ధారూరు, పెద్దేముల్ మండలాల సరిహద్దులోని కోట్‌పల్లి ప్రాజెక్టు మరమ్మతు పనులు మే నెల నాటికి పూర్తి చేస్తామని ఉమ్మడి హైదరాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల ఇరిగేషన్ శాఖ చీఫ్ ఇంజనీర్ సత్యనారాయణరెడ్డి తెలిపారు. శుక్రవారం తాండూరు పట్టణ శివారులోని కాగ్నా వాగులో రూ.2 కోట్లతో నిర్మిస్తున్న చెక్‌డ్యాం పనులను పరిశీలించారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కోట్‌పల్లి ప్రాజెక్టు మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ.70 కోట్లు మంజూరు చేసిందన్నారు. 24 కిలో మీటర్లు కాల్వల పనులు చేపట్టనున్నట్లు వివరించారు. ఈ కాల్వల ద్వారా ధారూరు, పెద్దేముల్, కోట్‌పల్లి మండలాల్లోని 12 వేల ఎకరాలను సాగు నీరు అందుతోందన్నారు. ప్రస్తుతం క్రాప్ హాలిడే ప్రకటించి పనులు చేస్తున్నట్లు చెప్పారు.
‘నారాయణపేట్’ ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరు
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని నారాయణపేట్ ఎత్తిపోతల పథకం ద్వారా కొడంగల్, మక్తల్, నారాయణపేట నియోజకవర్గాల్లోని లక్ష ఎకరాలకు సాగు నీరు అందిస్తామని తెలిపారు. ప్రభుత్వం ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం రూ.4,800 కోట్లు మంజూరు చేసిందన్నారు. 4,200 ఎకరాల భూమిని సేకరించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పనులు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. వారం రోజుల్లో ఎత్తిపోతల పథకానికి సంబంధించి ప్రాథమిక పనులను ప్రారంభిస్తామని ఆయన తెలిపారు.
ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ సత్యనారాయణరెడ్డి


