వెరీ ‘గుడ్డు’
● స్పెషల్ టెండర్ల ద్వారా అంగన్‌వాడీ, వసతి గృహాలకు కోడిగుడ్డు సరఫరా
● పారదర్శకత పెంచేందుకుప్రత్యేక ముద్రలు
● ప్రతీ పదిరోజులకు రంగు మార్పు
అంగన్‌వాడీలకు, వసతిగృహాలకు సరఫరా చేసే కోడిగుడ్లలో అక్రమాలు అరికట్టేందుకు, నాణ్యత పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. గుడ్లపై ప్రత్యేక వర్ణంలో ముద్రలు వేసి సరఫరా చేస్తోంది.
దౌల్తాబాద్: ప్రభుత్వ పథకాలలో నాణ్యత, పారదర్శకతకు రాష్ట ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. అంగన్‌వాడీ కేంద్రాలు, వసతిగృహాల్లో అందించే పౌష్టికాహార సరఫరాలో లోపాలకు తావివ్వకుండా టెండర్ల విధానం తీసుకువచ్చింది. గతంలో కోడిగుడ్లు చిన్నవిగా ఉన్నాయని.. మురిగిన గుడ్లు సరఫరా చేసశారని ఆరోపణలు వచ్చాయి. దీంతో విద్యార్థులకు తాజా గుడ్లు అందించేందుకు కొత్త టెండర్ విధానాన్ని తీసుకొచ్చారు. గుడ్లపై ముద్రలు ప్రవేశపెట్టారు. ప్రస్తుతం మండలంలో అన్ని గ్రామాల్లోని కేంద్రాల్లో ముద్ర ఉన్న గుడ్లను అందిస్తున్నారు.
అధికారుల పర్యవేక్షణలోనే టెండర్లు
గతంలో జిల్లా స్థాయిలో శాఖల వారీగా కోడిగుడ్ల సరఫరాకు టెండర్లు నిర్వహించేవారు. గతంలో గుడ్ల నాణ్యతపై విమర్శలు వచ్చాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానాకి శ్రీకారం చుట్టింది. జిల్లా అధికారుల పర్యవేక్షణలోనే టెండర్లు ఖరారు చేస్తున్నారు. నాణ్యత, సరఫరా విషయంలో ప్రభుత్వం కఠిన నిబంధనలు రూపొందించింది.
నిబంధనలు
● ఒక్కో గుడ్డు బరువు 45–52 గ్రాములు ఉండడంతో పాటు 30 కోడిగుడ్ల ట్రే బరువు 1,350 గ్రాములు ఉండాలి.
● ప్రతీ నెలా మూడు విడతలుగా నాణ్యమైన గుడ్లను అందించాలి.
● ప్రతి గుడ్డుపై 8మి.మీ చుట్టు కొలతలతో జిల్లా వివరాలు ఉండాలి.
● పదిరోజులకు ఒకసారి గుడ్డుకు వేసే రంగు ముద్ర మారుతుంది. దీంతో కోడిగుడ్ల సరఫరాలో పారదర్శకత ఏర్పడుతుంది.


