బరిలో యంగ్ లేడీ లాయర్
తాండూరు టౌన్: మున్సిపల్ ఎన్నికల బరిలో ఓ యంగ్ లేడీ లాయర్ పోటీ చేస్తున్నారు. 24 ఏళ్ల కల్వ సిరిచందన న్యాయశాస్త్రంలో(ఎల్‌ఎల్‌ఎం) పట్టా సాధించి లాయర్‌గా ప్రాక్టీస్ చేస్తున్నారు. యువత రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశంతో ఎన్నికల్లో కౌన్సిలర్‌గా పోటీలో దిగారు. పట్టణానికి చెందిన దివంగత న్యాయవాది కల్వ విశ్వనాథ్ కూతురైన ఆమె కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 36వ వార్డు నుంచి బరిలో నిలిచారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజాసేవ కోసం నిజాయతీ, విలువలతో ముందుకెళ్లినపుడు ప్రజాస్వామ్యం మరింత బలపడుతుందన్నారు. యువత, విద్యావంతులు, సామర్థ్యం కలిగిన వ్యక్తులు సమాజానికి ఎంతో అవసరమన్నారు. చట్టాన్ని, పౌరుల హక్కులను, నేటి రేపటి సవాళ్లను అర్థం చేసుకునే వ్యక్తులు కావాలన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీకి ఓటేసి తనని గెలిపించాలని అభ్యర్థించారు.


