అన్ని వర్గాలకు సామాజిక న్యాయం
తాండూరు: మున్సిపాలిటీ ఎన్నికల అభ్యర్థుల ఎంపికలో అన్ని వర్గాల వారికి కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం చేసిందని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి అన్నారు. పురపోరు బరిలో నిలిచిన 36 మంది అభ్యర్థులకు పార్టీ జిల్లా అధ్యక్షుడు ధారాసింగ్ జాదవ్‌తో కలసి బుధవారం బీ ఫారాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పార్టీ కోసం కష్టపడిన వారికి ప్రాధాన్యత కల్పించామన్నారు. వార్డుల రిజర్వేషన్ల ప్రకారం అన్ని వర్గాల వారికి న్యాయం చేశామని పేర్కొన్నారు. బీసీలకు 15, మైనార్టీలకు 9, ముదిరాజ్ సామాజిక వర్గానికి 5, కుర్వసామాజిక వర్గానికి 1, గౌడ 1, బ్రాహ్మణులకు 1, ఆర్యవైశ్యులకు1, వీరశైవులకు 4, ఎస్టీ 1, ఎస్సీలకు 3, ఉప్పరి 1, మున్నూర్ కాపులకు 3, రెడ్డిలకు 1 చొప్పున పోటీ చేసేందుకు అవకాశం కల్పించామని వివరించారు. ప్రతిపక్ష పార్టీ నాయకులు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని, వారిని పట్టించుకోకుండా గెలుపు దిశగా ప్రచారంలో దూసుకుపోవాలని అభ్యర్థులకు సూచించారు.
సమన్వయంతో..
బీఆర్‌ఎస్ పార్టీ చేయని అభివృద్ధి, రెండేళ్లలో కాంగ్రెస్ చేసిన పనులను ప్రజలకు వివరించాలని ఎమ్మెల్యే చెప్పారు. ప్రభుత్వ పథకాలను, అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అభ్యర్థులు, నాయకులదేనని స్పష్టం చేశారు. పార్టీ ఇన్‌చార్జిలతో అభ్యర్థులు సమన్వయంతో ప్రచారం కొనసాగించాలన్నారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు హబీబ్‌లాల, ఎన్నికల పరిశీలకులు రాంశెట్టి, కోఆర్డినేటర్ ఇఫ్తాకార్, అశోక్ కుమార్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
మున్సిపాలిటీలో మెజార్టీ స్థానాలు దక్కించుకుంటాం
ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి
ప్రతిపక్ష నాయకుల మాటలను
పట్టించుకోవద్దు
అభ్యర్థులకు దిశానిర్దేశం


