మాజీ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డిపై కేసు నమోదు
కుల్కచర్ల: ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసిన ఘటనలో పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి, బీఆర్‌ఎస్ చౌడాపూర్ మండల అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డితో పాటు మరో ఆరుగురిపై కేసు నమోదైంది. మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేసిన విషయంలో నిరసన వ్యక్తంచేస్తూ చౌడాపూర్‌లో ఆదివారం ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. కాగా, ఎన్నికల కోడ్ నేపథ్యంలో అనుమతులు లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఆందోళనలు చేపట్టరాదని కుల్కచర్ల ఎస్‌ఐ రమేశ్ తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
తాళం వేసిన ఇంట్లో చోరీ
తాండూరు టౌన్: తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఈ సంఘటన సోమవారం మధ్యాహ్నం పట్టణంలో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. సాయిపూర్ ప్రాంతానికి చెందిన సిద్రామేశ్వర్ అనే వ్యక్తి ఇంట్లో మధ్యాహ్నం తాళం పగలగొట్టి అర్ధ తులం బంగారం, 20 తులాల వెండి, రూ.30 వేల నగదు ఎత్తుకెళ్లారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపారు.
పెట్రోల్ బంక్ ఉద్యోగిపై కత్తితో దాడి
కవాడిగూడ: పెట్రోల్ బంక్ ఉద్యోగిపై కత్తితో దాడి చేయడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. దోమలగూడ ఇన్‌స్పెక్టర్ అంజద్ అలీ తెలిపిన మేరకు.. లోయర్ ట్యాంక్ బండ్‌లో ఉన్న భారత్ పెట్రోలియం బంక్ వద్దకు ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో బోలక్‌పూర్‌కు చెందిన బాసిత్(23), గౌస్(24), మౌలాలికి చెందిన తాహెర్ (25) కలిసి ఓ ద్విచక్ర వాహనంపై పెట్రోల్ కోసం వచ్చారు. విధి నిర్వహణలో ఉన్న వికిషన్ (23)..బంక్ మూసే సమయం అయిందని.. పెట్రోల్ పోయడం వీలుకాదని చెప్పారు. దీంతో అగ్రహానికి గురైన వారు వాగ్వాదానికి దిగారు. బాసిత్ అనే వ్యక్తి కత్తితో రవికిషన్‌ను పొడిచి పరారయ్యారు. స్థానికులు రవికిషన్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. దోమలగూడ పోలీసులు ముగ్గురు నిందుతులను అరెస్టు చేశారు.
చిన్నారిపై వీధి కుక్కల దాడి
మణికొండ: ఇంటిముందు సరదాగా ఆడుకుంటున్న ఓ రెండేళ్ల చిన్నారిని వీధికుక్కలు వెంటపడి కరవడంతో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు తెలిపిన మేరకు.. నార్సింగి సర్కిల్ పరిధిలోని జన్వాడ గ్రామంలోని ఎస్సీ బస్తీలో సోమవారం ఇంటి ముందు బాలుడు ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో అక్కడ ఉన్న నాలుగు వీధి కుక్కలు బాలుడి వెంటపడ్డాయి. బాలుడు భయపడి పరుగులు తీయగా వెంటపడి కరిచేశాయి. చిన్నారి హాహాకారాలు విన్న స్థానికులు వెంటనే వచ్చి కుక్కలను తరిమేశారు. అప్పటికే బాలుడి పెదవి, చెవి భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే బాలుడిని ఆసుపత్రికి తరలించగా కొలుకుంటున్నాడని..ప్రాణాపాయం తప్పిందని గ్రామ స్తులు తెలిపారు. ఇదిలా ఉండగా వీదికుక్కల సమస్యపై అనేక సార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవటం లేదని, ఇకనైనా వాటిని అరికట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
అందరూ ఉన్నా అనాథలా..
● భార్యతో మనస్పర్థలు
● విదేశాల్లో స్థిరపడ్డ ముగ్గురు పిల్లలు
● రైల్వేస్టేషన్‌లో విశ్రాంత ఉద్యోగి మృతి
సికింద్రాబాద్: ఆయన ప్రభుత్వ ఉద్యోగం చేసి పదవీ విరమణ చేశారు.. పిల్లలు విదేశాల్లో స్థిరపడ్డారు.. అయితే భార్యతో ఆయనకు మనస్పర్థలు..దీంతో ఆమెకు దూరంగా ఉంటూ రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫామ్‌లే కేంద్రంగా చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో సఫిల్‌గూడ రైల్వేస్టేషన్‌లో మృతిచెందాడు. సికింద్రాబాద్ జీఆర్‌పీ పోలీసులు తెలిపిన మేరకు.. నల్గొండ జిల్లా అమ్మనబ్రోలుకు చెందిన మహ్మద్ ఇబ్రహీం (66) నల్గొండ జిల్లా కోర్టులో పనిచేసి పదవీ విరమణ చేశారు. భార్యతో విభేదాల కారణంతో పదేళ్లుగా ఆమెకు దూరంగా ఉంటున్నాడు. ఇబ్రహీం దంపతులకు ఇరువురు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఈ ముగ్గురూ ఉన్నత ఉద్యోగాలు చేస్తూ కెనెడాలో స్థిరపడ్డారు. పిల్లలు, భార్యకు దూరంగా ఉంటున్న ఆయన సికింద్రాబాద్ ప్రాంతంలోని ఉంటున్న చెల్లెలు ఇంటికి వచ్చి వెళుతుండేవాడు. వీలైన చోట సేదతీరుతూ..అప్పుడప్పుడూ రైల్వే స్టేషన్లలో నిద్రపోయేవాడు.ఈ క్రమంలో సఫిల్‌గూడ రైల్వేస్టేషన్‌లో సోమవారం నిద్రకు ఉపక్రమించిన ఇబ్రహీం మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు.
కొందుర్గు: జిల్లేడ్ చౌదరిగూడ మండలంలోని గుర్రంపల్లిలో జాతర ముగిసింది. శుక్రవారం గంధం అలంకరణ, శనివారం దూపదీపాలంకరణ, ఆదివారం కందూరులు, సోమవారం భజనా కార్యక్రమాలతో ఉత్సవాలు ముగిశాయి. షాద్‌నగర్ ఏసీపీ లక్ష్మీనారాయణ, సీఐ శ్రీనివాసు ఆధ్వర్యంలో పోలీసులు ఉత్సవాల వద్ద బందోబస్తు నిర్వహించారు.


