పర్యావరణ పరిరక్షణకు కృషి చేద్దాం
కొడంగల్ రూరల్: అభివృద్ధి, పర్యావరణం అనేవి నాణేనికి బొమ్మ–బొరుసు వంటివని, వీటి పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పర్యావరణ వేత్త ప్రొఫెసర్ కే పురుషోత్తంరెడ్డి సూచించారు. సోమవారం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వృక్ష, జంతుశాస్త్ర విభాగాలు, ఏకో క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ డాక్టర్ బీ శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు పలు సూచనలు అందించారు. అడవులు, భౌగోళిక వనరుల అసమతుల్య వినియోగంతో జీవ వైవిద్య వినాశనం, వాతావరణ మార్పులు, ఓజోన్ పొర క్షీణత, ఎడారీకరణ, రేడియో ధార్మిక ప్రభావాలు వంటి ఎన్నో దుష్ప్రభావాలు కలుగుతాయని అన్నారు. ఇందుకుగాను సమతుల్యతతో కూడిన అభివృద్ధి ఒక్కటే దీనికి పరిష్కారమని తెలిపారు. చిత్తడి నేలలు పర్యావరణ పరంగా ఎంతో విలువైనవని అన్నారు. ఎన్నో జీవరాశులకు ఆశ్రయమిస్తాయని, వాటిని పరిరక్షించేందుకు కృషి చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ ప్రాముఖ్యతను గుర్తించి ఐక్యరాజ్య సమితి సూచించిన సుస్థిర అభివృద్ధి లక్ష్య సాధనకు కృషి చేయాలన్నారు. అనంతరం కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ రఫియా ఖానం, ఐక్యూ ఏసీ కోఆర్డినేటర్ టీ రాంబాబు, జంతుశాస్త్ర అధ్యాపకులు రమేష్, హరిప్రియ విద్యార్థులు పాల్గొన్నారు.
పర్యావరణ వేత్త, ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి


