ఆలయ అభివృద్ధికి కలిసి సాగుతాం
కుల్కచర్ల: పాంబండ ఆలయ అభివృద్ధికి అందరితో కలిసి ముందుకుసాగుతామని ఆలయ ఈఓ బాలనర్సయ్య తెలిపారు. సోమవారం మండలంలోని బండవెల్కిచర్లలో వెలసిన పాంబండ రామలింగేశ్వర ఆలయంలో టెంకాయల విక్రయానికి వేలం నిర్వహించారు. ఏడాదికి గాను (జాతర కాలం మినహా) టెంకాయలు విక్రయించే హక్కును బండవెల్కిచర్ల గ్రామానికి చెందిన కోనేరు వెంకట్రాములు రూ.12,01,000కు వేలం దక్కించుకున్నారు. అనంతరం బ్రహ్మోత్సవాల సమయంలో టెంకాయల విక్రయ వేలం హక్కులను మహబూబ్‌నగర్ జిల్లా కాకర్లపాడు గ్రామానికి చెందిన వెంకటయ్య రూ.7,05,000కు దక్కించుకున్నారు. ఏడాదిపాటు తలనీలాలు సేకరించే హక్కులను మహబూబ్‌నగర్‌కు చెందిన రామన్ గౌడ్ రూ.3,03,000కు పొందారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మడుగు శ్రీనివాస్, ఆలయ మాజీ చైర్మన్ కోట్ల మైపాల్ రెడ్డి, ఉప సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి, ఆలయ అర్చకులు దశరథం, పాండు, వేలం పర్యవేక్షకులు ప్రణీత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


