మొదలైన మున్సిపల్ నామినేషన్ల ప్రక్రియ
● వికారాబాద్‌లో 12
● తాండూరులో 11
● పరిగిలో 2
● కొడంగల్‌లో నిల్
తాండూరు: బీఆర్‌ఎస్ తరఫున చైర్మన్ అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్న నర్సింహులు
అనంతగిరి: జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో బుధవారం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. తొలిరోజు 25 నామినేషన్లు దాఖలయ్యాయి. వికారాబాద్‌లో 12, తాండూరులో 11, పరిగిలో 2 రెండు చొప్పున నామినేషన్లు వేశారు. కొడంగల్‌లో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 1, 9, 18, 24, 27, 28, 29 వార్డులకు ఒకటి చొప్పున, 11, 23 వార్డులకు రెండు చొప్పున నామినేషన్లు వచ్చినట్లు మున్పిపల్ కమిషనర్ విక్రం సింహారెడ్డి తెలిపారు.
పరిగిలో..
పరిగి: పరిగి మున్సిపల్ పరిధిలోని రెండు వార్డులకు ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. 7వ వార్డుకు పద్మ, 15వ వార్డుకు శ్రీను నామినేషన్ పత్రాలను ఆయా వార్డుల రిటర్నింగ్ అధికారులకు అందజేశారు. పరిగి పట్టణ పరిధిలో 18 వార్డులు ఉండగా నామినేషన్ల స్వీకరణకు ఆరు కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఒక్కో కౌంటర్లలో మూడు వార్డులకు సంబంధించిన నామినేషన్లను స్వీకరిస్తున్నారు. ఆరుగురు ఆర్‌ఓలు, ఆరుగురు ఏఆర్‌ఓలు విధులు నిర్వహిస్తున్నారు.
తాండూరులో..
తాండూరు: తాండూరులో మొదటి రోజు 11 నామినేషన్లు నమోదయ్యాయి. కాంగ్రెస్ పార్టీ తరఫున 5 మంది, బీఆర్‌ఎస్ పార్టీ తరఫున 5 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. 10వ వార్డు నుంచి బీఆర్‌ఎస్ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా పట్లోళ్ల నర్సింహులు నామినేషన్ వేశారు. 1వ వార్డుకు ధనసిరి నాగలక్ష్మి, 15వ వార్డుకు బొబ్బిలి శోభారాణి, 23వ వార్డుకు పరిమళ, 30వ వార్డు నుంచి మహ్మద్ సాబియా ఫాతిమా బీఆర్‌ఎస్ తరఫున నామినేషన్లు వేశారు. 8వ వార్డుకు తలారి సాయప్ప, 14వ వార్డు నుంచి మ్యాతరి సురేషన్, 16వ వార్డు నుంచి నారా శ్రీలత, 24వ వార్డు నుంచి పోలీస్ బాలకృష్ణారెడ్డి కాంగ్రెస్ తరఫున నామినేషన్లు దాఖలు చేశారు. 28వ వార్డు నుంచి నాగారం మల్లేశం బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. నామినేషన్ల ప్రక్రియ నేపథ్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య తెలిపారు.


