కాంగ్రెస్‌కు ఓట్లు అడిగే అర్హత లేదు
ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి కొడంగల్‌లో కాంగ్రెస్‌ను ఓడించాలి బీఆర్‌ఎస్ ఎన్నికల ఇన్‌చార్జ్ గట్టు, మాజీ ఎమ్మెల్యే పట్నం
కొడంగల్: కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అడిగే అర్హత లేదని బీఆర్‌ఎస్ కొడంగల్ మున్సిపల్ ఎన్నికల ఇన్‌చార్జ్ గట్టు రాంచందర్‌రావ్ అన్నారు. బుధవారం పట్టణంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆశావహులతో మాట్లాడారు. అనంతరం రెండో వార్డులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఓట్లు ఎలా అడుగుతారని కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. ఇచ్చిన హామీ మేరకు ఎకరాకు రూ.15 వేలు రైతు బంధు ఇవ్వాలన్నారు. మహిళలకు రూ.2,500 ఇవ్వడం లేదన్నారు. వృద్ధులు, వితంతులు, దివ్యాంగులకు పింఛను మొత్తం పెంచలేదని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో గెలుపే లక్ష్యంగా సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని విమర్శించారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ జాడే లేదన్నారు. తులం బంగారం ఏమైందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆరు గ్యారంటీలు అమలు చేయడం లేదని ఆరోపించారు. ఓట్లు అడగడానికి వచ్చే కాంగ్రెస్ నేతలను పథకాలపై నిలదీయాలని ప్రజలకు సూచించారు. కొడంగల్‌లో కాంగ్రెస్ పార్టీని ఓడిస్తే ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తారని అన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పని చేసి తెలంగాణ వాదాన్ని గెలిపించాలన్నారు. మున్సిపాలిటీలోని ప్రతి ఇంటికీ వెళ్లి గతంలో బీఆర్‌ఎస్ చేసిన అభివృద్ధిని వివరించాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొడంగల్‌కు ఏమి చేశారో ప్రజలకు వివరించి చెప్పాలన్నారు. ముఖ్యమంత్రి మాటలు కొడంగల్ ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. కొడంగల్‌కు మంజూరు చేసిన మెడికల్ కళాశాలను, విద్యా సంస్థలను లగచర్లకు తరలించారని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని పాలించే సత్తా కేసీఆర్‌కు మాత్రమే ఉందన్నారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మధుయాదవ్, రెండో వార్డు బీఆర్‌ఎస్ అభ్యర్థి వాణీ యాదవ్, బీఆర్‌ఎస్ నాయకులు విష్ణువర్ధన్‌రెడ్డి, మహిపాల్, శేరి నారాయణరెడ్డి, బాకారం అరుణ్, మాటూరు భీములు, నరేష్‌గౌడ్, ఎరన్‌పల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


