ఎన్నికలు సజావుగా జరగాలి
అనంతగిరి: మున్సిపల్ ఎన్నికలపై నోడల్ ఆఫీసర్లకు పూర్తి అవగాహన ఉండాలని మున్సిపల్ ఎన్నికల జిల్లా సాధారణ పరిశీలకులు జీ రవి అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో కలెక్టర్ ప్రతీక్ జైన్‌తో కలిసి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల నిబంధనలు విధిగా పాటించాలని, నిబద్దతతో పనిచేయాలని సిబ్బందికి సూచించారు. వికారాబాద్, కొడంగల్, పరిగి, తాండూరు మున్సిపాలిటీల్లో ఎన్నికలు సజావుగా, ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం ఇవ్వొద్దన్నారు. అనంతరం కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల కోడ్ పకడ్బందీ అమలయ్యేలా చూడాలన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా పని చేయాలని ఆదేశించారు. అనంతరం పోలింగ్ సిబ్బందికి మొదటి విడత ర్యాండమైజేషన్ నిర్వహించారు. ఈ ప్రక్రియను కలెక్టర్, అబ్జర్వర్ పరిశీలించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సుధీర్, డీపీఓ జయసుధ, డీఈఓ రేణుకాదేవి, సీపీఓ వెంకటేశ్వర్లు, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ మాధవరెడ్డి, ఆర్‌టీఏ వెంకట్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్ ఎన్నికల జిల్లా సాధారణ పరిశీలకులు రవి
పాల్గొన్న కలెక్టర్ ప్రతీక్‌జైన్
మొదటి విడత ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి


