అక్రమంగా టేకు కలప రవాణా!
● అనుమానంతో అడ్డగించిన స్థానికులు
● లారీతో ఉడాయించిన డ్రైవర్
ధారూరు: అక్రమంగా కలప తరలిస్తున్నారన్న అనుమానంతో స్థానికులు లారీని అడ్డగించగా.. గమనించిన డ్రైవర్.. అతివేగంగా వాహనంతో ఉడాయించాడు. ఈ సంఘటన ధారూరు మండల కేంద్రంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. ధారూరు నుంచి హైదరాబాద్ వైపు కలప లోడుతో వెళ్తున్న ఓ లారీ.. స్థానిక పెట్రోల్ బంక్ వద్ద ఆగింది. లారీలో టేకు కలప ఉండి, నంబరు సరిగా లేక పోవడాన్ని గమనించిన స్థానికులు కొందరు.. డ్రైవర్‌ను వివరాలు అడిగారు. పత్రాలు చూపించమని కోరారు. దీంతో యజమాని యాదయ్య పర్మిట్ చూపించగా.. అందులో ధారూరు ఫారెస్టు రేంజ్‌కు బదులు.. తాండూరు ఫారెస్టు ఆఫీసు అని ఉంది. ఇది నకిలీ పత్రాలని, అసలు పత్రాలు చూపించాలని లారీలో కలపను చూసేందుకు యత్నించారు. దీనిని గమనించిన డ్రైవర్.. లారీతో అతి వేగంగా వికారాబాద్‌వైపు దూసుకుపోయాడు.
సమాచారం ఇచ్చాం
కలప లారీ గురించి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చామని ఎంఐఎం పార్టీ మండల అధ్యక్షుడు మోయిజ్‌ఖురేషి తెలిపారు. ఇన్‌చార్జి రేంజర్‌కు ఫోన్‌లో సమాచారం ఇవ్వగా.. లారీని ఆపేది ఉండేదని చెప్పినట్లు తెలిపారు. నకిలీ పత్రాలతో టేకును తరలించిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదే విషయమై ఇన్‌చార్జి ఎఫ్‌ఆర్‌ఓ శ్యాంకుమార్‌ను వివరణ కోరగా.. స్థానికులు పట్టుకున్న లారీని అప్పగిస్తే, కేసు నమోదు చేసేవారమని పేర్కొన్నారు.


