నేడు ధారూరుకు పీసీసీఎఫ్ సువర్ణ రాక
ధారూరు: రాష్ట్ర అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ డాక్టర్ సువర్ణ ఆదివారం మండల కేంద్రమైన ధారూరుకు రానున్నారు. ఇక్కడి స్మృతివనంలో కొత్తగా నిర్మించిన ఫారెస్టు రేంజర్ భవనాన్ని ప్రారంభిస్తారు. ఇందుకోసం అన్ని ఏర్పాటు పూర్తి చేసినట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు.
● దుస్తులు ఉతికేందుకు వెళ్లి.. బావిలో పడి దుర్మరణం
● పోలేపల్లిలో ఘటన.. కేసు నమోదు
దుద్యాల్: దుస్తులు ఉతికేందుకు బావి వద్దకు వెళ్లిన ఓ నవవధువు అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఈ ఘటన దుద్యాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ శ్రీశైలం, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. పోలేపల్లికి చెందిన బాయిగడ్డ నరేందర్‌కు గత అక్టోబర్‌లో మాధురి(25)తో వివాహం జరిగింది. ఎప్పటిలాగే వారి పొలంలోని బావి వద్ద దుస్తులు ఉతికేందుకు వెళ్లిన మాధురికి ఫిట్స్ రావడంతో బావిలో పడిపోయింది. ఈసమయంలో ఎవరూ లేకపోవడంతో గట్టున ఉన్న దుస్తులను చూసి బావిలో వెతకగా అప్పటికే మృతిచెందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొడంగల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా, మాధురి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఆమె తల్లి జానకి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ శ్రీశైలం తెలిపారు.
ఇద్దరి అరెస్టు
తాండూరు టౌన్: ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ కల్తీ కోవా తయారు చేసి విక్రయిస్తున్న ఇద్దరిని జిల్లా టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం రాత్రి పట్టుకున్నారు. టాస్క్‌ఫోర్స్ సీఐ అన్వర్‌పాషా తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరు పట్టణంలో కల్తీ కోవా విక్రయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం రావడంతో ఓ వ్యక్తి ఇంట్లో సోదాలు చేశారు. కల్తీ కోవా ఉండటంతో స్వాధీనం చేసుకున్నారు. పట్టణానికి చెందిన ప్రకాష్ విష్ణు అనే వ్యక్తి హైదరాబాద్ చాంద్రాయణగుట్ట ప్రాంతానికి చెందిన మహ్మద్ సల్మాన్ వద్ద కల్తీ కోవా తెచ్చి పలు స్వీటు షాపులకు విక్రయిస్తుంటాడు. ప్రకాష్ విష్ణు ఇంటిపై దాడి చేయగా 120 కిలోల కల్తీ కోవా దొరికిందన్నారు. హైదరాబాద్‌లో మహ్మద్ సల్మాన్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఇద్దరిని అరెస్టు చేసి పట్టణ పోలీసులకు అప్పగించామన్నారు.
డీఆర్‌డీఓ శ్రీనివాస్
బంట్వారం: మండలంలో 2024 – 25 ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన ఉపాధి హామీ పథకం పనులపై శనివారం బంట్వారం ఈజీఎస్ కార్యాలయంలో ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్‌డీఓ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఉపాధి పనుల్లో అవకతవకలకు పాల్పడి సహించేది లేదన్నారు. మండలంలో రూ.11 కోట్లతో వివిధ పనులు చేపట్టినట్లు తెలిపారు. పది రోజుల పాటు 12 గ్రామ పంచాయతీల్లో సోషల్ ఆడిట్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. రూ.3 కోట్లతో సీసీ రోడ్లు వేసినట్లు చెప్పారు. మరో రూ.8 కోట్లతో ఇతర పనులు చేపట్టామన్నారు. ఆయా గ్రామాల్లో జరిగిన అవకతవకలను గుర్తించి రూ.1.4 లక్షలు రికవరీకి సిఫారసు చేసినట్లు తెలిపారు. పలువురు ఎఫ్‌ఏలకు పెనాల్టీ విధించినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఏపీడీ సరళ, అంబుడ్స్‌మెన్ రాములు, ఎంపీడీఓ రాములు, బంట్వారం సర్పంచ్ మల్లేశం, ఏవీఎం భార్గవి, ఎస్‌ఆర్‌పీ రాజు, ఏపీఎం సుధాకర్, ఈసీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


