రైతుల భూములు పోనివ్వం
అవినీతి పగుళ్లు! జిల్లాలో రెండేళ్ల క్రితం నిర్మించిన పలు వంతెనలు దెబ్బతిన్నాయి. దీంతోప్రజాధనం వృథా అయ్యింది.
● ఇండస్ట్రీయల్ పార్క్‌కు భూములివ్వం
● తేల్చి చెప్పిన రాపోల్ రైతులు
● రోడ్డుపై బైఠాయించి నిరసన
పరిగి: ఇండస్ట్రీయల్ కారిడార్‌కు భూములు ఇచ్చేది లేదని రాపోల్ గ్రామ రైతులు తేల్చి చెప్పారు. బుధవారం గ్రామపరిధిలోని పరిగి–షాద్‌నగర్ ప్రధాన రహదారిపై కట్టెలు వేసి నిప్పంటించి నిరసన తెలిపారు. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిగి మండలం రాపో ల్, కాళ్లాపూర్ గ్రామాల పరిధిలో 1,197 ఎకరాల భూ సేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో రెండు గ్రామాల రైతులు ఆందోళన బాట పట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. రైతులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం బలవంతంగా భూములు లాక్కొని రోడ్డున పడేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మా బాధలు స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డికి పట్టడం లేదన్నారు. రెండు గ్రామాల ప్రజలు పూర్తిగా వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ వస్తే కష్టాలు తీరుతాయని భావించామని.. కానీ ప్రభుత్వ చర్యలు రైతులను భూస్థాపితం చేసేలా ఉన్నాయన్నారు. ధర్నా కారణంగా పరిగి – షాద్‌నగర్ మార్గంలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రైతులతో మాట్లాడారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తేనే ఆందోళన విరమిస్తామని రైతులు చెప్పారు. దీంతో పోలీసులు రైతుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తహసీల్దార్ వెంకటేశ్వరి రైతులతో చర్చలు జరిపారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.
రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రియల్ ఎసే్‌ట్ బ్రోకర్లుగా వ్యవహరిస్తోందని కాళ్లాపూర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ చైర్మన్ విశారదన్ మహరాజ్ ఆరోపించారు. బుధవారం మండలంలోని రాపోల్, కాళ్లాపూర్ గ్రామాల్లో రైతులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలో పాల్గొని సంఘీభావం తెలిపారు. రైతులు కోల్పోయే భూములను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా భూ సేకరణకు నోటిఫికేషన్ ఇవ్వడమేంటని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని మార్చుకోవాలని సూచించారు. రైతులకు న్యాయం చేయాలని చూస్తే సహించేది లేదన్నారు.


