జిల్లా వైద్యాధికారి స్వర్ణకుమారి
పూడూరు: ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు నమ్మకం కలిగేలా చూడాల్సిన బాధ్యత వైద్యులపై ఉందని డీఎంహెచ్‌ఓ స్వర్ణకుమారి అన్నారు. బుధవారం మండలంలోని చన్గోముల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు రిజిస్టర్‌ను పరిశీలించారు. సమయపాలన పాటించాలని సూచించారు. పాము, తెలు, కుక్క కాటు మందులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా అవగాహన కల్పించాలని ఏఎన్‌ఎంకు సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ మహమూద్ ఫారూకీ, ఆస్పత్రి సిబ్బంది రవికుమార్, దాసు తదితరులు పాల్గొన్నారు.
ఖైదీలకు వైద్యం
అభినందనీయం
జైలు సూపరింటెండెంట్ రాజ్‌కుమార్
పరిగి: ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యం ముద్దాయిలు, ఖైదీలు, సిబ్బందికి ఉచిత వైద్యం అందించడం అభినందనీయమని జైలు సూపరింటెండెంట్ రాజ్‌కుమార్ అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యక్రమంలో భాగంగా బుధవారం పరిగి సబ్‌జైలులో శ్రీ సాయి డెంటల్ ఆస్పత్రి, కళాశాల వికారాబాద్ వారి సహకారంతో ఖైదీలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖైదీల ఆరోగ్య పరిరక్షణకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో హాస్పిటల్ పీఆర్‌ఓ రవీందర్‌గౌడ్, వైద్యులు వివేక్, విశ్వప్రియ, కేజీయా, గాయత్రిదేవి తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా అనిల్‌యాదవ్
అనంతగిరి: వికారాబాద్ మున్సిపల్ బీజేపీ ఫ్లోర్‌లీడర్‌గా 33వ వార్డు కౌన్సిలర్ అనిల్ యాదవ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై మున్సిపల్‌లో ప్రస్తావిస్తూ వాటి పరిష్కారానికై పాటు పడుతానన్నారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన పార్టీ జిల్లా కన్వీనర్ కరణం ప్రహ్లాదరావు, ముఖ్య నాయకులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
ఆకులమైలారం మాజీ సర్పంచ్ మృతి
కందుకూరు: మండల పరిధిలోని ఆకులమైలారం మాజీ సర్పంచ్ దేవరశెట్టి నందీశ్వర్(60) అనారోగ్యంతో మృతి చెందాడు. ఆయన 1995 నుంచి 2001 వరకు, 2006 నుంచి 2011 వరకు రెండు పర్యాయాలు సర్పంచ్‌గా సేవలందించారు. ఆయనకు భార్యతో పాటు కుమారై ఉన్నారు. కొంత కాలంగా చిక్సిత పొందుతున్న ఆయన బుధవారం ఉదయం మరణించారు. స్థానిక ఎమ్మెల్యే సబితారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేఎల్‌ఆర్‌తో పాటు వివిధ పార్టీల నాయకులు ఎస్.సురేందర్‌రెడ్డి, ఏనుగు జంగారెడ్డి, బొక్క జంగారెడ్డి, ఎస్.కృష్ణనాయక్, ఈశ్వర్‌గౌడ్, గోపాల్‌రెడ్డి, చిర్ర సాయిలు, మంద సాయిలు, ఆనంద్ తదితరులు ఆయన భౌతికకాయానికి నివాళులర్పించి కుటుంబీకులకు సానూభూతి తెలిపారు.


