ఉమ్మడి రంగారెడ్డిని పునర్నిర్మించాలి
● జిల్లా సాధన సమితి సభ్యుల డిమాండ్
● తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డికివినతిపత్రం అందజేత
తాండూరు టౌన్: రంగారెడ్డి జిల్లా పునర్నిర్మాణం జరగాలని ఉమ్మడి జిల్లా సాధన సమితి సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం తాండూరులో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సమితి జిల్లా అధ్యక్షుడు మాడిశెట్టి తిరుపతి మాట్లాడుతూ.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మూడు నియోజకవర్గాలను విడదీసి, పూర్తిగా గ్రామీణ నేపథ్యం కలిగిన వికారాబాద్ జిల్లాను ఏర్పాటు చేయడంతో అభివృద్ధి కుంటుపడిందన్నారు. 317 జీఓతో రంగారెడ్డి, మేడ్చల్, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి వికారాబాద్ జిల్లాకు సుమారు వెయ్యి మంది ఉద్యోగులు శాశ్వతంగా బదిలీ అయ్యారని, దీంతో ఇక్కడి నిరుద్యోగులు నష్టపోతున్నారని తెలిపారు. వీటితో పాటు అనేక అంశాల్లో జిల్లా నష్టపోతోందని, ప్రభుత్వం పునరాలోచించి పూర్వ రంగారెడ్డి జిల్లాను కొనసాగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి రమేశ్, ఉపాధ్యక్షుడు సాయిశ్రావణ్, శ్రీశైలం, రాజు, ప్రవీణ్ తదితరులు ఉన్నారు.


