శాంతిభద్రతల్లో రాజీ పడొద్దు
● సైబర్ క్రైమ్‌పై అవగాహనసదస్సులు నిర్వహించాలి
● ఎస్పీ స్నేహ మెహ్ర
అనంతగిరి: శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడొద్దని ఎస్పీ స్నేహ మెహ్ర పోలీస్ అధికారులు, సిబ్బందికి సూచించారు. శనివారం వికారాబాద్‌లోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలన్నారు. హత్యలు, దొంగతనాలు వంటి తీవ్రమైన నేరాల్లో దర్యాప్తును వేగవంతం చేసి పక్కా ఆధారాలతో కోర్టులో చార్జ్ షీట్లు దాఖలు చేయాలని స్పష్టం చేశారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చిన వారితో మర్యాదగా మాట్లాడాలన్నారు. రాత్రి పెట్రోలింగ్‌ను పెంచాలన్నారు. గ్రామాలు, ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలని సూచించారు. సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో అవగాహన సదస్సులు నిర్వహించి ప్రజలను చైతన్య పరచాలన్నారు. అపరిచితులు పంపే లింకులు, కాల్స్ పట్ల అప్రమత్తం చేయాలని ఆదేశించారు. గంజాయి, అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని తెలిపారు. త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందుస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యల చేపట్టాలన్నారు. విధి నిర్వహణలో ప్రతి అధికారి క్రమశిక్షణ, బాధ్యతాయుతంగా పనిచేస్తూ వికారాబాద్‌ను నేరరహిత జిల్లాగా మార్చడానికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రాములునాయక్, డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
ఉన్నత శిఖరాలు అధిరోహించాలి
నేటి పోటీ ప్రపంచంలో బాలికలు అన్ని రంగాల్లో రాణించాలని ఎస్పీ స్నేహ మెహ్ర అన్నారు. శనివారం జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని కొత్తగడి బాలికల రెసిడెన్షియల్ స్కూల్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యతోనే ఏదైనా సాధ్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ రాములనాయక్, డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, మహిళ పీఎస్ సీఐ సరోజ పాల్గొన్నారు.


