రైతు సంక్షేమమే లక్ష్యమవ్వాలి
● ఆత్మ కమిటీకి ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి సూచన
● చైర్మన్‌గా శంకర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం
బషీరాబాద్: అన్నదాతల సంక్షేమమే ఆత్మ కమిటీ ఏకై క లక్ష్యం కావాలని తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి సూచించారు. శుక్రవారం బషీరాబాద్‌లో ఆత్మకమిటీ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. యాంత్రిక సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సబ్సిడీలు ఇస్తోందని తెలిపారు. వాటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అంతకుముందు చైర్మన్‌గా శంకర్‌రెడ్డితో డీఏఓ రాజరత్నం ప్రమాణం చేయించారు. రైతును రాజు చేయాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు. ఇందులో భాగంగానే ఆత్మ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శంకర్‌రెడ్డి రైతులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో వ్యవసాయానికి పెద్ద ఎత్తున సబ్సిడీ పరికరాలు అందించామని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో సబ్సిడీ పరికరాల ఊసే లేదన్నారు. ప్రస్తుత ఒక్క సీజన్‌లోనే జిల్లాలో 227 మంది రైతులకు రూ.53 లక్షలతో సబ్సిడీ యంత్రాలు అందిస్తున్నామని చెప్పారు.
పైలెట్ రోహిత్‌రెడ్డిపై ఫైర్
మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిరెడ్డి ఎమ్మెల్యేపై చేసిన విమర్శలకు తీవ్రంగా స్పందించారు. కన్నతల్లిలాంటి కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచి సొంత లాభం కోసం పార్టీ మారిన వారు విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. ఐదేళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉన్న రోహిత్‌రెడ్డి తాండూరుకు చేసిందేమీ లేదన్నారు. తాను ఎమ్మెల్యే అయిన రెండేళ్లలో ఈ ప్రాంత అభివృద్ధికి వందల కోట్ల నిధులు తెలిచ్చనట్లు చెప్పారు. అంతకుముందు డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్, డీసీసీబీ ఉపాధ్యక్షుడు రవిగౌడ్, సొసైటీ వైస్ చైర్మన్ అజయ్‌ప్రసాద్, ఏఎంసీ చైర్మన్ మాధవ్‌రెడ్డి మాట్లాడారు. అనంతరం ఆత్మకమిటీ చైర్మన్ శంకర్‌రెడ్డిని, సభ్యులను ఎమ్మెల్యే, నాయకులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ వెంకట్‌రామ్‌రెడ్డి, యాలాల సొసైటీ చైర్మన్ సురేందర్‌రెడ్డి, నాయకులు సత్యనారాయణ, నారాయణరెడ్డి, ఉత్తంచంద్, శ్రీధర్ ముదిరాజ్, శాంతిబాయి, శ్రీనివాస్‌రెడ్డి, మాణిక్ రెడ్డి, నర్సిరెడ్డి, రామ్‌నాయక్, సుధాకర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, లక్ష్మణ్, తలారి సురేష్ తదితరులు పాల్గొన్నారు.


