నిబంధనలు పాటిద్దాం
● ప్రమాదాలను అరికడదాం
● ‘అలైవ్ అరైవ్’లో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, ఎస్పీ స్నేహ మెహ్ర
తాండూరు టౌన్: రోడ్డు నిబంధనలు పాటిస్తూ ప్రమాదాలను అరికడదామని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పిలుపు నిచ్చారు. శుక్రవారం తాండూరు పట్టణంలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో అలైవ్ అరైవ్ కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ స్నేహ మెహ్ర, డీఎస్పీ నర్సింగ్ యాదయ్య పాల్గొన్నారు. ముందుగా ఇందిరాచౌక్ నుంచి ఆర్యవైశ్య కళ్యాణ మంటపం వరకు పలు కళాశాలల విద్యార్థులు, ఆటో, జీపు, లారీ డ్రైవర్లతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అతి వేగంగా, నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాలకు గురికారాదన్నారు. అనంతరం ఎస్పీ స్నేహ మెహ్రా మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించడం వల్ల అతని కుటుంబం మొత్తం రోడ్డున పడుతుందన్నారు. 2026లో రోడ్డు ప్రమాదాలను కనిష్ట స్థాయికి తగ్గించడమే జిల్లా పోలీసు శాఖ లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఈ లక్ష్య సాధనలో వాహనదారులు సహకరించాలని కోరారు. అనంతరం రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తామని అందరిచే ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తాండూరు అధ్యక్షుడు డాక్టర్ జయప్రసాద్, డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్‌రెడ్డి, డీసీసీబీ మాజీ వైస్ చైర్మన్ రవిగౌడ్, పట్టణ, రూరల్ సీఐలు సంతోష్ కుమార్, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
బాల కార్మికులకు విముక్తి
అనంతగిరి: జిల్లాలో ఆపరేషన్ స్మైల్ –12 కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని ఎస్పీ స్నేహ మెహ్ర తెలిపారు. ఇప్పటి వరకు 106 మంది పిల్లలను రక్షించడం జరిగిందన్నారు. ఇందులో 90 మంది బాలురు, 16 మంది బాలికలు ఉన్నారని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కుటుంబాలకు చెందిన పిల్లలను గుర్తించడం జరిగిందన్నారు. బిహార్ నుంచి 5 మంది చిన్నారులు, రాజస్థాన్ నుంచి ఇద్దరు, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, కర్ణాటక నుంచి ఒక్కొక్కరు చొప్పున బాల కార్మికులు ఉన్నారని తెలిపారు. వీరిని తల్లిదండ్రులు లేదా సంరక్షణాలయాల్లో చేర్చడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. పిల్లలను పనిలో పెట్టుకున్న వారిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. బాలల హక్కులకు భంగం వాటిల్లే డయల్ 100 లేదా చైల్డ్ హెల్ప్ లైన్ 1098 కు సమాచారం ఇవ్వాలని ఎస్పీ కోరారు.


