హెపటైటిస్– బి టీకా తప్పనిసరి
పూడూరు: వ్యాధినిరోధక శక్తిని పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ హెపటైటిస్– బి వాక్సిన్ (హెచ్‌బీవీ)ను తప్పనిసరిగా తీసుకోవాలని డాక్టర్ దేవిక సూచించారు. సోమవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కామెర్ల వ్యాధి నుంచి బయటపడేందుకు ప్రభుత్వం ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఈ టీకా అందిస్తుందని తెలిపారు. తొలుత ఆస్పత్రి సిబ్బందికి వేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్ కిజర్‌పాషా, నాయకులు వెంకట్‌రెడ్డి, శ్యాంసుందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జాగ్రత్తగా ఉండాలి
కుల్కచర్ల: హెపటైటిస్– బీ వైరస్ పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని మండల వైద్యాధికారి కిరణ్ కుమార్ అన్నారు. సోమవారం నేషనల్ వైరస్ హైపటైటిస్– బి కంట్రోల్ కార్యక్రమంలో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో అక్కడి వైద్య సిబ్బందికి హెపటైటిస్– బి వ్యాక్సిన్ మూడు డోసులకు గాను మొదటి డోస్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కలుషిత రక్తమార్పిడి, సూదుల వాడకం తదితర వాటి వలన ఈ వ్యాధి వ్యాపిస్తుందని తెలిపారు. ఆకలి లేకపోవడం, బలహీనత, వాంతులు, ముదురుగా మలవిసర్జన, పసుపు చర్మం వంటి లక్షణాలు ఉంటాయని పేర్కొన్నారు. ఎవరికై నా ఇలాంటి లక్షణాలు ఉంటే.. వెంటనే ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యురాలు మాధురి, అరుణ, హెల్త్ అసిస్టెంట్ వెంకట్, అంజూ, టీబీ కోఆర్డినేటర్ రాజు, శ్రీను వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


