రూ.400 కోట్లతో పనులు
● కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ తిరుపతిరెడ్డి
● రోడ్డు విస్తరణ బాధితులకు చెక్కుల అందజేత
కొడంగల్: కొడంగల్ మున్సిపల్ పరిధిలో రూ.400 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్లు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ తిరుపతిరెడ్డి తెలిపారు. పట్టణంలో రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోయిన వారికి శనివారం కడా కార్యాలయంలో పరిహారం చెక్కులు అందజేశారు. 108 మందికి సుమారు రూ.3 కోట్ల విలువ చేసే చెక్కు లు ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రాంత అభివృద్ధికి సీఎం రేవంత్‌రెడ్డి పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేస్తున్నారని పేర్కొన్నారు. కొడంగల్ మున్సిపల్ పరిధిలో తాగునీటి సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం, వర్షపు నీటి పారుదల వ్యవస్థ, ఘన వ్యర్థాల నిర్వహణకు నిధులు మంజూరు చేసినట్లు వివరించారు. పట్టణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. నియోజకవర్గంలో విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం రూ.10వేల కోట్లతో పనులు ప్రారంభించినట్లు తెలిపారు. అనంతరం రైతులకు రాయితీపై వ్యవసాయ పరికరాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ రాజేశ్వరీ, కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేష్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ అంబయ్య గౌడ్, జిల్లా వ్యవసాయాధికారి రాజరత్నం, మాజీ ఎంపీపీ ముద్దప్ప దేశ్‌ముఖ్, మున్సిపల్ కమిషనర్ బలరాం నాయక్, నాయకులు, అధికారులు శివకుమార్ గుప్తా, మహ్మద్ యూసూఫ్, కృష్ణంరాజు, దాము, నయీం తదితరులు పాల్గొన్నారు.


