ఏడోసారి పట్టణ పోరు | - | Sakshi
Sakshi News home page

ఏడోసారి పట్టణ పోరు

Feb 1 2026 10:43 AM | Updated on Feb 1 2026 10:43 AM

ఏడోసారి పట్టణ పోరు

ఏడోసారి పట్టణ పోరు

వికారాబాద్‌ చైర్మన్‌ పీఠం

ఎస్సీ మహిళకు రిజర్వ్‌

గెలుపు కోసం ఆయా అభ్యర్థుల ప్రయత్నాలు

అనంతగిరి: వికారాబాద్‌ మున్సిపాలిటీకి ఏడోసారి ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రస్తుతం చైర్మన్‌ పీఠం ఎస్సీ మహిళకు రిజర్వ్‌ అయింది. ఇప్పటివరకు ఆరుసార్లు ఎన్నికలు జరగ్గా రెండుసార్లు ఎస్సీ జనరల్‌కు కేటాయించారు. తదనంతరం ఒక్కోసారి బీసీ మహిళ, జనరల్‌ మహిళ, జనరల్‌, జనరల్‌ మహిళకు రిజర్వ్‌ చేశారు. ఈసారి ఎస్సీ మహిళకు ప్రాతినిధ్యం దొరికింది. వికారాబాద్‌ పట్టణం రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు 70 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో ఇక్కడ పట్టణవాసుల తాకిడి అధికంగా ఉంటుంది. దీంతో ఆయా పార్టీలకు చెందిన అభ్యర్థులు గెలుపు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

1987లో మున్సిపాలిటీగా ఏర్పాటు

వికారాబాద్‌ను 1987లో మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు. అంతకంటే ముందు నగర పంచాయతీగా ఉండేది. అప్పట్లో మున్సిపాలిటీకి సరిపడా జనాభా లేకపోవడంతో చుట్టుపక్కల ఉన్న అనంతగిరిపల్లి, ఎన్నెపల్లి, కొత్తగడి వంటి గ్రామాలను విలీనం చేశారు. సుమారు 16 వార్డులను ఏర్పాటు చేశారు. మరుసటి ఏడాదే వికారాబాద్‌ మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహించారు. చైర్మన్‌ పదవి ఎస్సీ జనరల్‌కు రిజర్వ్‌ చేయడంతో మొదటి ఎన్నికల్లో ఆలంపల్లికి చెందిన దేవదాస్‌ తొలి చైర్మన్‌ అయ్యారు.

ప్రస్తుతం 34 వార్డులు

పురపాలిక సంఘంగా ఏర్పడ్డ వికారాబాద్‌ ప్రస్తుతం గ్రేడ్‌–1 మున్సిపాలిటీగా ఎదిగింది. మొదట్లో 16 వార్డులు ఉన్నా ఆ తరువాత 24 వార్డులకు పెరిగింది. అనంతరం జరిగిన పరిణామాలతో 28 వార్డులు చేశారు. గత ఎన్నికలప్పుడు పట్టణానికి చుట్టూ ఉన్న ఆరు గ్రామ పంచాయతీలను విలీనం చేయడంతో మున్సిపాలిటీలో మొత్తం 34 వార్డులున్నాయి. ప్రస్తుతం జనాభా లక్షకు పైగా ఉంటుంది. మొత్తంగా 58,013 మంది ఓటర్లు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement