సమ్మెను జయప్రదం చేయండి
తాండూరు రూరల్: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 12న తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ కోరారు. బుధవారం తాండూరు ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీఓకు కార్మికులతో కలిసి సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రమ శక్తి నీతి 2025 పేరుతో మోదీ ప్రభుత్వం కార్మిక విధానాన్ని ప్రకటించిందన్నారు. కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో లేబర్ కోడ్‌లను తీసుకొచ్చారని మండిపడ్డారు. కేంద్ర కార్మిక సంఘాలను సంప్రదించకుండా అప్రజాస్వామికంగా, దొడ్డిదారిన తెచ్చిన కొత్త చట్టాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా మని తెలిపారు. లేబర్ కోడ్‌లు కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఉన్నాయన్నారు. కార్యక్రమంలో జీపీ కార్మికుల సంఘం మండల అధ్యక్షుడు వెంకట్‌రాములు, ప్రధాన కార్యదర్శి నర్సింలు, ఉపాధ్యాక్షులు జిలానీ, నాయకులు బాలప్ప, దస్తప్ప, శాంతమ్మ, మాణిక్యమ్మ తదితరులు పాల్గొన్నారు.


