జంప్ జిలానీలు
మున్సిపల్ ఎన్నికల వేళ పార్టీలు మారుతున్న నేతలు
తాండూరు టౌన్: మున్సిపల్ ఎన్నికల వేళ పలు పార్టీలకు చెందిన నాయకులు అటూ ఇటు మారుతున్నారు. తాము నమ్ముకున్న పార్టీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వలేదని కొందరు, వేరే పార్టీ తరఫున పోటీ చేస్తే గెలుస్తామనే నమ్మకంతో మరి కొందరు పార్టీలు మారుతున్నారు. మాజీ కౌన్సిలర్ భీంసింగ్ రాథోడ్ గురువారం కాంగ్రెస్ పార్టీ వీడి బీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్ టికెట్ ఆశించారు. ఇవ్వకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అప్పట్లో బీఆర్‌ఎస్ అధికారంలో ఉండటంతో ఆ పార్టీలో చేరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హస్తం గూటికి చేరారు. ఆ తర్వాత తిరిగి బీఆర్‌ఎస్‌లో చేరారు. అలాగే మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విఠల్‌నాయక్ అల్లుడు సురేష్ నాయక్ సైతం కాంగ్రెస్ వీడి బీఆర్‌ఎస్‌లో చేరారు. 13వ వార్డు నుంచి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.
కాంగ్రెస్‌లో చేరిక..
మున్సిపల్ పరిధిలోని 3వ వార్డుకు చెందిన అమ్జద్‌ఖాన్ బీఆర్‌ఎస్ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్‌లో చేర్చుకున్నారు. సదరు నాయకుడు బీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసేందుకు యత్నించగా, అతన్ని కాంగ్రెస్‌లో చేర్చుకున్నట్లు తెలిసింది. అలాగే 13, 17వ వార్డులకు చెందిన పలువురు బీఆర్‌ఎస్, బీజేపీ కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.
జంప్ జిలానీలు


