ఓవర్ లోడ్!
ప్రభుత్వ ఆదాయానికి గండి
వికారాబాద్: ఆర్టీసీ బస్సు.. టిప్పర్ ప్రమాదంలో 19 మంది మృత్యువాత పడిన ఘటన జరిగి రెండు నెలలు కాక ముందు మళ్లీ ఓవర్ లోడ్‌తో వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. ఘోర ప్రమాదానికి టిప్పర్ ఓవర్ లోడే కారణమని నివేదికలు తేల్చినా అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రమాదం జరిగిన తర్వాత నెల రోజుల పాటు లారీలు, టిప్పర్లపై ప్రత్యేక నిఘా ఉంచి ఓవర్‌లోడ్‌కు అడ్డుకట్ట వేశారు. తర్వాత షరా మామూలే అన్న చందంగా తయారైంది. ఓవర్ లోడ్ వాహనాల కారణంగా ప్రజలు ప్రాణాలు గాల్లో కలుస్తుండగా మరో పక్క ప్రభుత్వ ఖజానాకు రూ.కోట్లలో గండి పడుతోంది. సామర్థ్యానికి రెండింతల లోడ్ వేస్తుండటంతో రోడ్లు సైతం వేసిన కొద్ది రోజులకే పాడవుతున్నాయి. కట్టడి చేయాల్సిన అధికారులు మైనింగ్ మాఫియా ఇచ్చే మామూళ్లకు తలొగ్గి చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో హడావుడి చేసి ఆ తర్వాత మిన్నకుండి పోతున్నారు. మైనింగ్ ప్రదేశంలో ఓవర్‌లోడ్‌ను కట్టడి చేయాల్సిన మైనింగ్ ఏడీ, వాహనాలు రోడ్డెక్కాక కంట్రోల్ చేయాల్సిన ఆర్టీఏ అధికారులు, పోలీసులు సైతం పట్టించుకోవడం లేదు. పోలీస్ స్టేషన్ ముందు నుంచే రోజూ వందల సంఖ్యలో టిప్పర్లు, లారీలు అధిక లోడ్‌తో తిరుగుతున్నా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇసుక వ్యాపారులు, మైనింగ్ మాఫియా ఇచ్చే డబ్బులకు ఆశపడి వారికి అండగా నిలుస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
డీటీఓ, మైనంగ్ ఏడీలపై కలెక్టర్ ఆగ్రహం
ఓవర్ లోడ్ వ్యవహారం కలెక్టర్ దృష్టికి రావడంతో ఆయన సీరియస్‌గా తీసుకున్నారు. రెండు రోజుల క్రితం జరిగిన సమావేశంలో మైనింగ్ ఏడీ, జిల్లా రవాణా శాఖ అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనింగ్, ఇసుక వ్యాపారులు పేట్రేగి పోతుంటే ఏం చేస్తున్నారని.. ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకూడదని ఆదేశించారు. వెంటనే కట్టడి చేయాలని కలెక్టర్, ఎస్పీ స్పష్టమైనా ఆదేశాలు ఇచ్చారు. ఓవర్ లోడ్, ఫిట్‌నెస్ లేని వాహనాలను రోడ్లపై తిరుగుతుంటే ఎందుకు పట్టించుకోవడం లేదని డీటీఓ వెంకట్‌రెడ్డిని కలెక్టర్ ప్రశ్నించారు. గతంతో కూడా ఇదే విషయంపై హెచ్చరించారు. తీరు మారక పోవడంతో మూడు రోజుల క్రితం షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఓ పక్క ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నా.. ప్రజలు, ప్రయాణికులు, వాహనదారుల నుంచి తీవ్ర విమర్శలు వెళ్లువెత్తుతున్నా వారి తీరు మారడంలేదు. పరిగి, చన్గోముల్, తాండూరు, యాలాల, నవాబుపేట, మోమిన్‌పేట పోలీసులు, రెవెన్యూ అధికారులను సైతం మైనింగ్ మాఫియా మ్యానేజ్ చేస్తుందనే ఆరోపణలు ఉన్నాయి.
సామర్థ్యానికి మించి ఎర్రమట్టి, ఇసుక రవాణా
అధికారులను శాసిస్తున్న మైనింగ్ మాఫియా
సంబంధిత శాఖలపై కలెక్టర్ ఆగ్రహం
డీటీఓకు షోకాజ్ నోటీసు
అయినా మారని తీరు
ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి
చాలా కాలంగా ఓవర్ లోడ్ వ్యవహారం పెద్ద చర్చకు దారి తీస్తోంది. ఇటీవల జరిగిన బస్సు ప్రమాద ఘటనలో టిప్పర్ ఓవర్ లోడ్ కారణంగానే మృతుల సంఖ్య పెరిగిందనే వాదన తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ల్యాట్రేట్, ఇసుక, నాపరాయి, సుద్ద, గ్రానైట్ తదితర ఉత్పత్తులను రవాణా చేసే ఓనర్లలో చర్చ మొదలయ్యింది. నెల రోజుల పాటు వాహన సామర్థ్యం మేరకు ముడి సరుకు రవాణా చేశారు. ఆ తర్వాత పాత పద్ధతి మొదలు పెట్టారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా ఓవర్ లోడ్‌తోనే మైనింగ్ రవాణా చేస్తున్నారు. 30 టన్నుల సామర్థ్యం ఉన్న లారీలు, టిప్పర్లలో 50 నుంచి 60 టన్నుల వరకు తరలిస్తున్నారు. రోజుకు సగటున రెండు నుంచి మూడు వేల టన్నుల ఐరన్ ఖనిజాన్ని తరలిస్తున్నారు. టన్నుకు రూ.279.50 చొప్పున ప్రభుత్వ ఖజానాలో జమ చేయాల్సి ఉంటుంది. ఇందులో డీఎంఎఫ్టీ నిధుల కింద జిల్లాకు టన్నుకు రూ.36 చొప్పున జమ చేస్తారు. అయితే ఓవర్ లోడ్ కారణంగా ప్రభుత్వానికి రావాల్సిన రాయల్టీ 50 శాతమే సమకూరుతోంది. మిగతా సగం మైనింగ్ యజమానుల జేబుల్లోకే వెళుతుంది. వారిచ్చే లంచాలకు తలొగ్గి కట్టడి చేయకుండా వదిలేస్తున్నారు. ఎప్పుడో ఒకసారి ఒకటి అర కేసులు, ఫైన్ వేసి చేతులు దులుపుకొంటున్నారు.


