సర్కారు బడిలో చోరీ
● తలుపులు, బీరువా ధ్వంసం
● ట్యాబ్, ప్రైజ్‌ల అపహరణ
● కుల్కచర్ల పీఎస్‌లో కేసు నమోదు
కుల్కచర్ల: మండల పరిధిలోని పీరంపల్లి ప్రాథమిక పాఠశాలలో చోరీ జరిగింది. శనివారం ఉదయం ఉపాధ్యాయులు, విద్యార్థులు వచ్చేసరికే స్కూల్ తలుపులు తెరిచి ఉన్నాయి. లోనికి వెళ్లి చూడగా, బీరువా ధ్వంసం చేసి ఉంది. అందులో దాచిన ట్యాబ్‌తో పాటు 26న విద్యార్థులకు బహూకరించాల్సిన 13 ప్రైజ్‌లు, చిన్నచిన్న వస్తువులు చోరీకి గురయ్యాయి. గతంలో కూడా దొంగతనం జరిగిందని, అప్పట్లో ట్యాబ్ ఎత్తుకెళ్లారని హెచ్‌ఎం అలివేలు తెలిపారు. ఉపాధ్యాయులు సొంత డబ్బులు వేసుకుని మరో ట్యాబ్ తీసుకురాగా అది కూడా చోరీకి గురైందన్నారు. వీటి విలువ సుమారు రూ.50 వేల వరకు ఉంటుందన్నారు. ఈమేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని కుల్కచర్ల ఎస్‌ఐ రమేశ్ తెలిపారు.


