ప్రభుత్వ కళాశాలలో మెరుగైన వసతులు
దోమ: ప్రభుత్వ కళాశాలలో మెరుగైన వసతులతో పాటు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని కళాశాల ప్రిన్సిపాల్ రూపలక్ష్మి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల తల్లితండ్రులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం జూనియర్ కళాశాలల అభివృద్ధికి పాటుపడుతోందన్నారు. 2025–26వ సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం నూతన విధి విధానాలను తీసుకువచ్చిందన్నారు. ఎఫ్‌ఆర్‌ఎస్ విధానంతో విద్యార్థులు, అధ్యాపకుల హాజరు నమోదుతో పాటు మౌలిక వసతుల కల్పనకు నిధులను మంజూరు చేసిందన్నారు. కళాశాలలో ల్యాబ్ ఏర్పాటు, క్రీడా పరికరాలు, పరిసరాల పరిశుభ్రత, స్వీపర్స్, స్కావెంజర్ల ఏర్పాటుకు ప్రత్యేక చర్యలు తీసుకుందన్నారు. హెచ్‌ఈఎల్‌పీ ఆర్గనైజర్ సహకారంతో ప్రతీ శనివారం యోగ, ధ్యానంతో పాటు స్కిల్ డెవలప్‌పెంట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎంసెట్, నీట్, జేఈఈ, క్లాట్, లాసెట్ వంటి పరీక్షల ప్రిపరేషన్‌కు ప్రముఖ విద్యా సంస్థలు ఫిజిక్స్‌వాలి, ఖాన్ అకాడమీ వారిచే రెగ్యులర్ తరగతులతో పాటు ప్రత్యేక తరగతులను డిజిటల్ రూపంలో అందిస్తున్నామన్నారు. ప్రతీ విద్యార్థి మెరుగైన ఫలితాలు సాధించేందుకు తల్లిదండ్రుల సహకారం సైతం అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు రాధ, శ్రీవిద్య, రాములు, లక్ష్మయ్య, సునీత, మధుసూదన్, శ్రీధర్‌కుమార్, సువర్ణ, శ్రీకాంత్, సానియాసూల్తాన, చంద్రశేఖర్‌రెడ్డి, బందయ్య, నాన్ టీచింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
కళాశాల ప్రిన్సిపాల్ రూపలక్ష్మి


