చోరీ కేసులో పురోగతి
యాలాల: మండల పరిధిలోని కమాల్‌పూర్ శివారులో ఈ నెల 21న బైక్‌పై వెళుతున్న మహిళను పోలీసులమని బెదిరించి నాలుగు తులాల బంగారం చోరీ చేసిన ఘటనలో యాలాల పోలీసులు పురోగతి సాధించారు. ఈ ఘటనలో రెండు ముఠాలకు చెందిన ఏడుగురు నిందితులు ఉన్నట్లు గుర్తించారు. వీరు ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రం కలబురిగి గ్రామీణ పోలీసుల అదుపులో ఉండగా, వారు తెలంగాణ పోలీసులకు సహకరించకపోవడంతో చోరీ సొత్తు రికవరీ, కేసు దర్యాప్తులో ఇబ్బందిగా మారింది.
సీసీ పుటేజీతో దొరికిన ఆచూకీ.!
ఈ నెల 21న సాయంత్రం మండల పరిధిలోని రాస్నం గ్రామానికి చెందిన కోటం వెంకటలక్ష్మి తన అన్న గోపాల్‌రెడ్డితో కలిసి బైక్‌పై తాండూరు నుంచి రాస్నం వైపు ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో విశ్వనాథ్‌పూర్ సమీపంలో వారి బైక్‌ను అడ్డగించిన ఇద్దరు దుండగులు తాము పోలీసులమని, కొద్ది దూరంలో బంగారం కోసం మహిళ హత్య జరిగిందని చెప్పి మహిళ నుంచి నాలుగు తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. బాధితులు డయల్ 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా ఎస్‌ఐ విఠల్‌రెడ్డి తన సిబ్బందితో తాండూరు మార్గంలో సీసీ పుటేజీలను పరిశీలించారు. ఈ చోరీ ఘటనలో రెండు బైకులు, ఒక కారులో మొత్తం ఏడుగురు నిందితులు ఉన్నట్లు గుర్తించారు. వీరు తాండూరు నుంచి చించోలి మీదుగా కలబురిగి వెళ్లినట్లు గుర్తించి కర్ణాటక పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడి పోలీసులు దొంగలను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
కర్ణాటక పోలీసులతో చర్చలు
ఈ చోరీ కేసులో నిందితులు యాలాలతో పాటు మహబూబ్‌నగర్ జిల్లాలో బంగారం చోరీ చేసినట్లు గుర్తించారు. ఇవి పర్లీ, కల్యాణి గ్యాంగ్ సభ్యులే చేసినట్లు నిర్ధారించారు. కాగా కలబురిగి గ్రామీణ పోలీసులు రెండు గ్రూపులకు చెందిన ఏడుగురు దొంగలను అదుపులోకి తీసుకున్నారు. చోరీ సొత్తు రికవరీతో పాటు దొంగలను తెలంగాణ పోలీసుల కస్టడీకి ఇవ్వకుండా ఇబ్బంది ఇబ్బంది పెడుతున్నా రని దర్యాప్తు అధికారి పేర్కొంటున్నారు. వారిని తీసుకువచ్చేందుకు యాలాల పోలీసులు కలబురిగి గ్రామీణ పోలీసులతో చర్చలు జరుపుతున్నారు.
మహిళను బెదిరించి..బంగారం చోరీ చేసింది పర్లీ, కల్యాణి గ్యాంగ్ సభ్యులే
కలబురిగి జిల్లాలో దొంగల ఆచూకీ.. కర్ణాటక పోలీసుల అదుపులో ముఠా
రెండు రోజులుగా కలబురిగిలో యాలాల పోలీసులు


