బాల్యవివాహాల నిర్మూలన అందరి బాధ్యత
షాద్‌నగర్‌రూరల్: బాల్యవివాహాలను నిర్మూలించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని ఐసీడీఎస్ సూపర్‌వైజర్ సంధ్యారాణి అన్నారు. బుధవారం ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని బూర్గుల జెడ్పీహెచ్‌ఎస్‌లో ఐసీడీఎస్ సూపర్‌వైజర్ సంధ్యారాణి ఆధ్వర్యంలో బేటీ బచావో–బేటీ పడావో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు బాల్య వివాహాలపై అవగాహన కల్పించి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగతా వ్యాసరచన పోటీలను నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. అనంతరం సంఽధ్యారాణి మాట్లాడుతూ.. బాల్య వివాహాలను చేయడం చట్టరీత్యా నేరమన్నారు. 18 ఏళ్ల లోపు బాలికలకు, 21 సంవత్సరాల లోపు బాలుడికి పెళ్లి చేసుకుంటే శిక్ష ఉంటుందన్నారు. బాల్య వివాహాలను జరిపించినా, ప్రోత్సహించినా చట్టపరంగా చర్యలుంటాయన్నారు. పిల్లలకు చిన్న వయసుల్లో వివాహాలు చేయకుండా వారికి ఉన్నత విద్యను అందించేందుకు తల్లితండ్రులు చొరవ తీసుకోవాలన్నారు. బాల్య వివాహాలు జరిపిస్తున్నట్లు తెలిస్తే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని అన్నారు. పాఠశాల హెచ్‌ఎం రవికుమార్, అంగన్‌వాడీ టీచర్లు శ్రీలత, రమాదేవి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.
ఐసీడీఎస్ సూపర్‌వైజర్ సంధ్యారాణి


