చెరువులో పడి వృద్ధురాలి మృతి
ఆమనగల్లు: ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓ వృద్ధురాలు మృతి చెందిన సంఘటన తలకొండపల్లి మండలం వెల్జాల గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక సహదేవి సముద్రం చెరువులో వెల్లాలకు చెందిన వడ్డె బాలమ్మ(60) చేపల కోసం శుక్రవారం వెళ్లింది. చీకటి పడినప్పటికీ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చెరువు సమీపంలో, గ్రామంలో వెతికినా ఆచూకీ లభించలేదు. కాగా సహదేవి సముద్రంలో శనివారం మధ్యాహ్నం మృతదేహం స్థానికులకు కనిపించగా వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని బయటకు తీయగా బాలమ్మగా గుర్తించారు. ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ శ్రీకాంత్ తెలిపారు.


