జాతీయస్థాయి అథ్లెటిక్స్‌లో సంతోషి ప్రతిభ
తాండూరు టౌన్: ఏడవ జాతీయ స్థాయి మాస్టర్ అథ్లెటిక్స్‌లో తాండూరు పట్టణవాసి మంకాల్ సంతోషి కుమారి సత్తా చాటారు. గత నెల 30 నుంచి ఈ నెల 2వ తేదీ వరకు రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో జరిగిన నేషనల్ మాస్టర్ అథ్లెటిక్స్‌లో ఆమె అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. 50 నుంచి 54 ఏళ్ల వయసు మహిళల విభాగంలో ఆమె ట్రిపుల్ జంప్‌లో 6.74 మీటర్లు దూకి వెండి పతకం, 100 మీటర్ల పరుగు పందెంలో కాంస్యం, లాంగ్‌జంప్‌లో 3.19 మీటర్లు దూకి కాంస్య పతకం సాధించారు. ఏకంగా మూడు మెడల్స్ సాధించి సత్తా చాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యమని, అంతకు మించిన సంపద లేదన్నారు. నేటి ఉరుకుల పరుగుల ప్రపంచంలో అందరూ సరైన ఫిట్‌నెస్‌తో ఉండాలని సూచించారు. క్రీడల పట్ల తనకు చిన్నప్పటి నుంచి ఉన్న ఇష్టంతో 50 ఏళ్లు పైబడినా పోటీల్లో పాల్గొంటున్నానన్నారు. భవిష్యత్‌లో సైతం పోటీల్లో పాల్గొని మరిన్ని మెడల్స్ సాధిస్తానని ఆమె అన్నారు.


