సన్నాల సాగుతో అధిక లాభాలు
● నానో యూరియా వాడకంపై అవగాహన కల్పించాలి
● ఇన్‌చార్జ్ అడిషనల్ కలెక్టర్ రాజేశ్వరి
అనంతగిరి: అధిక దిగుబడి తోపాటు లాభసాటి పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని ఇన్‌చార్జ్ అడిషనల్ కలెక్టర్ రాజేశ్వరి అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధిక సాంద్రత పంటల సాగు, నానో యూరియా, డీఏపీ వాడకంపై రైతులకు అవగాహన కల్పించారు. తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అధిక లాభాలు వచ్చే పంటల సాగును ప్రోత్సహించాలన్నారు. సన్న రకం వరి సాగు చేస్తే ప్రభుత్వ క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తోందని తెలిపారు. రైతులు శాస్త్రవేత్తల సూచనలు పాటించాలన్నారు. అనంతరం జిల్లా వ్యవసాయాధికారి రాజరత్నం మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు రూపొందించిన కొత్త వంగడాలు సాగయ్యేలా చూస్తామన్నారు. రైతులకు వివిధ కంపెనీలు నాణ్యమైన విత్తనాలు అందించకపోవడంతో నష్టపోతున్నారని తెలిపారు. ఆలస్యంగా నాట్లు వేస్తే దిగుబడి తగ్గుతుందన్నారు. సమావేశంలో పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ మోహన్‌కృష్ణ, వ్యవసాయ శాస్త్రవేత్తలు రాజేశ్వర్‌రెడ్డి, రాజా మధు శేఖర్, ఏడీఏలు సందీప్, శంకర్ రాథోడ్, లక్ష్మీకుమారి, వెంకటేశం, కొమరయ్య తదితరులు పాల్గొన్నారు.


