సీఎం సభకు స్థల పరిశీలన
● ఫిబ్రవరి 7న పరిగిలో భారీ బహిరంగ సభకు అవకాశం
● పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి
పరిగి: జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎరగనుందని ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఫిబ్రవరి 7న సీఎం రేవంత్‌రెడ్డి పరిగికి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో గురువారం స్థానిక నాయకులతో కలిసి సభా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఎం సభకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. పార్కింగ్ సమస్యలు లేకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో నిర్వహించనున్న సభ కోసం రూప్‌ఖాన్‌పేట్ సమీపంలో స్థలాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తంచేశారు. ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. కాంగ్రెస్ హయాంలోనే మున్సిపాలిటీలు అభివృద్ధి చెందాయని, అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందాయని స్పష్టంచేశారు. అఽధికారం చేపట్టిన ఏడాది కాలంలోనే ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత సీఎం రేవంత్‌రెడ్డికే దక్కుతుందని తెలిపారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అన్ని విషయాల్లోనూ ప్రజలను మోసం చేసిందని, పదేళ్లు అధికారంలో ఉండి ఆ పార్టీ చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. సభా స్థలాన్ని పరిశీలించిన వారిలో డీఎస్పీ శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.


