వేడుకకు వెళ్లొస్తుండగా విషాదం
● పాదచారుడిపైకి దూసుకెళ్లిన బైక్
● ఇద్దరి యువకుల దుర్మరణం
పరిగి: జాతీయ రహదారిపై ముగ్గురు ఒకే బైక్‌పై వెళ్తూ ఓ పాదచారుడిని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందిన సంఘటన మండలంలో గడిసింగాపూర్ గ్రామ శివారులో శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఎస్‌ఐ మోహనకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని గడిసింగాపూర్ గ్రామానికి చెందిన బ్యాగరి శివ(21), ప్రవీణ్‌కుమార్(21) స్నేహితులు. తమ తోటి మిత్రుడి పుట్టిన రోజు సందర్భంగా నస్కల్ గ్రామానికి శుక్రవారం ఇద్దరు వెళ్లారు. వేడుక ముగించుకొని అక్కడే ఉన్న తమ స్నేహితురాలైన రంగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన నర్మదను బైక్‌పై ఎక్కించుకుని ముగ్గురు తిరిగి గడిసింగాపూర్‌కు అర్ధరాత్రి బయలు దేరారు. ఈ క్రమంలో చౌడాపూర్ మండలం పుర్సంపల్లి గ్రామానికి చెందిన భీమయ్య గడిసింగాపూర్ శివారు ఫాంహౌస్‌లో పని చేస్తున్న కూతురు, అల్లుడు వద్దకు వచ్చాడు. అర్ధరాత్రి గ్రామానికి నడుచుకుంటూ బయలు దేరాడు. ఆ సమయంలో వెనుక నుంచి వచ్చిన బైక్ బలంగా భీమయ్యను ఢీకొంది. దీంతో బైక్ నడుపుతున్న శివ తలకు తీవ్ర గాయాలై అక్కడిక్కడే మృతి చెందాడు. ప్రవీణ్‌కుమార్, నర్మద, భీమయ్యకు గాయాలు కాగా పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా భీమయ్యను వికారాబాద్‌కు, ప్రవీణ్‌కుమార్‌ను ఉస్మానియా, నర్మదను గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఉస్మానియాలో చికిత్స పొందుతూ ప్రవీణ్‌కుమార్ ఉదయం మృతి చెందాడు. గడిసింగాపూర్‌లో ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. శివకు ఇటీవల మూడు నెలల క్రితం గ్రామానికి చెందిన యువతితో వివాహం జరిగింది. భీమయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.
వేడుకకు వెళ్లొస్తుండగా విషాదం


