ఇచ్చిన మాట నిలబెట్టుకోండి
యాచారం: ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం భూ రికార్డులు తమ పేరిట నమోదయ్యేలా చూడాలని ఫార్మాసిటీ భూ బాధితులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం నగరంలోని ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి నివాసంలో నక్కర్తమేడిపల్లి, తాడిపర్తి, కుర్మిద్ద, నానక్‌నగర్ గ్రామాలకు చెందిన ఫార్మాసిటీ భూ బాధితులు ఆయనను కలిశారు. ఐదేళ్లుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నామని, కోర్టులు ఆదేశాలిచ్చిన అధికారులు తమ పేర్లపై భూ రికార్డులు నమోదు చేయడం లేదని తెలిపారు. తమ పేర్లపై భూ రికార్డులు లేక రైతు భరోసా, బ్యాంకు రుణాలు, అత్యవసర సమయాల్లో అమ్ముకుందామన్నా అవకాశం లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఫ్యూచర్‌సిటీ మీ బంగారు భవిష్యత్తు కోసమేనని, ఇందుకోసం సహకరించాలని కోరారు. త్వరలో సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పలు గ్రామాల ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే మల్‌రెడ్డికి భూ బాధితుల విజ్ఞప్తి


