అర్ధరాత్రి హైడ్రామా
తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి ఆరోపణలు రుజువు చేయాలని సవాల్
తాండూరు టౌన్: మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు మా అభ్యర్థిని బుధవారం రాత్రి కిడ్నాప్ చేసి భయాందోళనకు గురిచేశారని బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆరోపించారు. తాండూరు పట్టణంలోని 3వ వార్డులో బీఆర్‌ఎస్ తరుఫున కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమైన అమ్జద్‌ఖాన్‌ను కాంగ్రెస్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కిడ్నాప్ చేయించి 24 గంటల పాటు తన క్యాంపు కార్యాలయంలో బంధించారన్నారు. బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరాలని, లేకుంటే నీ వ్యాపారాలను నాశనం చేస్తామని భయపెట్టినట్లు తెలిపారు. అంతేకాకుండా అమ్జద్‌ఖాన్ మెడలో బలవంతంగా కాంగ్రెస్ కండువా కప్పి, రూ.40 లక్షలు ఇచ్చారని ఆరోపించారు. కిడ్నాప్ నుంచి మొదట బయట పడాలనే ఉద్దేశంతో నగదు అక్కడే వదిలి కండువా మాత్రం కప్పుకుని ఆయన బయట పడ్డారన్నారు. గురువారం రాత్రి నేరుగా తన వద్దకు వచ్చి కిడ్నాప్ విషయాన్ని చెప్పాడని వివరించారు. తిరిగి గులాబీ కండువా కప్పుకుని, శుక్రవారం అదే 3వ వార్డు నుంచి బీఆర్‌ఎస్ తరఫున నామినేషన్ దాఖలు చేశాడని రోహిత్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని, ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. బీఆర్‌ఎస్ అభ్యర్థులకు ప్రజలు పట్టం కట్టడం ఖాయమన్నారు.


