ఆదివారం శ్రీ 25 శ్రీ జనవరి శ్రీ 2026
న్యూస్‌రీల్
దోపిడీలు, దొంగతనాలు, బ్యాంక్ రాబరీ వంటి ప్రధాన కేసుల్లో పోలీసులు చేతులెత్తేయగా సీసీఎస్ తన మార్క్ పనితనం చూపుతోంది. ఎలాంటి ఆధారాలు లేని.. మొండి కేసులను సైతం కొలిక్కి తెచ్చి నిందితులను కటకటాలపాలు చేస్తోంది.. ఎన్నో కేసుల్లో పురోగతి సాధించి చోరీ సొత్తు రికవరీ చేస్తోంది.
పోలీస్ స్టేషన్లలో కొలిక్కి రాని అనేక కేసులు
మెజార్టీ ఫైల్స్ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల చెంతకు
సిబ్బంది కొరత.. సౌకర్యాలు లేకున్నా పురోగతి
అనేక ఘటనల్లో నిందితులకు శిక్ష
చోరీ సొత్తు రికవరీ
వికారాబాద్: రోజురోజుకూ నేరాల సంఖ్య పెరిగిపోతోంది. వాటి ఛేదనలో ఆయా పోలీస్ స్టేషన్ల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. దొంగతనాలు, రాబరీలు, హత్యలు, అటెన్షన్ డైవర్షన్ కేసులు, చీటింగ్ తదితర నేరాలు పెరుగుతున్నాయి. చాలా వరకు నమోదుతో సరిపెడుతున్నారు. కొన్ని కేసుల్లో మాత్రమే పురోగతి కనిపిస్తోంది. ముఖ్యమైన కేసుల్లో ఎఫ్‌ఐఆర్‌లతో సరిపెడుతున్నారు. చాలా వాటిని సీసీఎస్‌కు అప్పగిస్తున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్, నిఘా వ్యవస్థల వైఫల్యమే నేరాల పెరుగుదలకు కారణమని తెలుస్తోంది. సివిల్ తగాదాల్లో పోలీసులు ప్రమేయం ఎక్కువ అవుతోందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. చన్గొముల్, వికారాబాద్, నవాబుపేట, మోమిన్‌పేట, తాండూరు, ధారూరు, పరిగి, మర్పల్లి తదితర పోలీస్ స్టేషన్ల పరిధిలో సివిల్ తగాదాల్లో పోలీసుల జోక్యం పెరిగిందనే విమర్శలు ఉన్నాయి. రేషన్ బియ్యం స్మగ్లింగ్, ఇసుక దందా, కలప అక్రమ రవాణాను కూడా కట్టడి చేయలేకపోతున్నారనే అపవాదును మూటగట్టుకుంటున్నారు.
క్రైమ్ బ్రాంచ్ రంగ ప్రవేశంతో..
చాలా పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనా కొలిక్కి రావడం లేదు. దీంతో అధికారులు వాటిని క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు అప్పగిస్తున్నారు. సిబ్బంది కొరత, సదుపాయాలు లేకున్నా సీసీఎస్ పోలీసులు వాటిని ఛేదిస్తున్నారు. నిందితులతో ఊచలు లెక్కెట్టిస్తున్నారు. ఉదాహరణకు కొన్ని..
అనంతపురం జిల్లా గుంతకల్‌కు చెందిన శికారి గ్యాంగ్ దొంగతనాలు చేయడంతో ఆరితేరింది. ఈ ముఠా జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. పరిగి, వికారాబాద్, కుల్కచర్లలో వీరిపై పలు కేసులు నమోదయ్యాయి. కానీ ఫలితం లేక ఆ కేసును సీసీఎస్‌కు అప్పగించారు. 15 రోజుల్లో కేసు పరిష్కరించి నిందితులను జైలుకు పంపారు.
వికారాబాద్‌లోని మణప్పురం బ్యాంక్‌లో కుదవ పెట్టిన సుమురు రూ.3 కోట్ల విలువైన రెండు కిలోల బంగారం మాయమైంది. పోలీసుల విచారణలో బ్యాంక్ మేనేజరే బంగారంతో ఉడాయించినట్లు తేలింది. నిందితుడు కర్ణాటకలోని బెల్గావ్‌లో దాక్కోగా సీసీఎస్ పోలీసులు అరెస్టు చేసి సొత్తు రికవరీ చేశారు.
హర్యాణాకు చెందిన మేవాత్ గ్యాంగ్ జిల్లాలో వరుసగా పశువులను దొంగిలిస్తూ రైతులకు కంటిమీద కునుకులేకుండా చేసింది. సీసీఎస్ పోలీసుల రంగప్రవేశంతో గ్యాంగ్ ఆటకు తెర పడింది.
ఉత్తరప్రదేశ్ కక్రాలకు చెందిన మోస్ట్ వాంటెడ్ దొంగల ముఠ పరిగిలో బ్యాంక్ దోపిడీకి యత్నించింది. గన్‌తో హల్‌చల్ చేసి పోలీసుల నుంచి తప్పించుకొని పారిపోయారు. ఈ కేసును కూడా సీసీఎస్ పోలీసులే ఛేదించారు.
తాజాగా ముగ్గురు మహిళా దొంగల ముఠా నకిలీ బంగారాన్ని ఎరగా వేసి మహిళల నుంచి తొమ్మిది తులాల బంగారం, 50 తులాల వెండితో ఉడాయించింది. వికారాబాద్, నారాయణ్‌పేట జిల్లాల్లో ఈ ముఠాపై కేసులు నమోదు కాగా సీసీఎస్ పోలీసులకు అప్పగించారు. కేవలం వారం రోజుల్లో నిందితులను అరెస్టు చేసి సొత్తు రికవరీ చేశారు.
గతేడాది సోలాపూర్‌కు చెందిన దొంగల ముఠా పరిగి, నవాబుపేట, మోమిన్‌పేట ప్రాంతాల్లో అటెన్షన్ డైవర్షన్ నేరాలకు పాల్పడగా సీసీఎస్ పోలీసులు నిందితుల స్వగ్రామానికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు.
ఇటీవలి కాలంలో పలు ఆలయాల్లో వరుస దొంగతనాల కేసును కూడా సీసీఎస్ పోలీసులే కొలిక్కి తెచ్చారు. మొత్తం 23 కేసులు నమోదు కాగా ఇందులో మన జిల్లా పరిధిలో 13, ఇతర జిల్లాల పరిధిలో 10 కేసులు ఉన్నాయి. దొంగలను అరెస్టు చేశారు.
ఇటీవల పరిగి, కుల్కచర్ల, పూడూరు ప్రాంతాల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన కొందరు గొర్రెల దొంగతనాలకు పాల్పడ్డారు. స్పల్ప కాలంలోనే ఏడు కేసులు నమోదయ్యాయి. పోలీసులు చేతులెత్తేయగా సీసీఎస్ పోలీసులు వారిని అరెస్టు చేసి గొర్రెలు వాటిని తరలించిన వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
ఇటీవల ఓ దొంగ వరుసగా ద్విచక్ర వాహనాల(బుల్లెట్)ను దొంగిలించాడు. నిందితుడిని అరెస్టు చేసి 13 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
ధారూరు మండలంలో జరిగిన పోక్సో కేసులో నిందితుడు తప్పించుకు తిరగ్గా రెండు రోజుల్లో సీసీఎస్ పోలీసులు నిందితున్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఇటీవల వరుస సెల్‌ఫోన్ దొంగతనాల కేసున పోలీసు ఉన్నతాధికారులు సీసీఎస్‌కు అప్పగించగా 78 ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అప్పగించారు. ఇలా అనేక కేసుల్లో సీసీఎస్ పోలీసులు పురోగతి సాధించి ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఆదివారం శ్రీ 25 శ్రీ జనవరి శ్రీ 2026


