ఉపాధిహామీ నిర్వీర్యానికి కేంద్రం కుట్ర
● వీబీజీ రాంజీ చట్టాన్ని రద్దుచేయాలి
● మాజీ ఎంపీ విశ్వనాథ్
అనంతగిరి: కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తుందని కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి, మాజీ ఎంపీ విశ్వనాథ్ ఆరోపించారు. సోమవారం వికారాబాద్ మండలంలోని సిద్దులూర్ గ్రామంలో వీబీజీ రాంజీ వద్దు– ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ ముద్దు అంటూ.. పార్టీ మండల అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఉపాధి కూలీలతో కలసి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్త చట్టం ప్రజా వ్యతిరేకమన్నారు. దీంతో కూలీలు మళ్లీ వలస వెళ్లే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త చట్టాన్ని వెంటనే రద్దుచేసి, ఇంతకు ముందులాగే కొనసాగించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్, జాతీయ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సంతోష్‌కుమార్, సర్పంచ్ శ్రీనివాస్, ఆర్‌టీఏ సభ్యుడు జాఫర్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మైపాల్‌రెడ్డి, పీఏసీఎస్ మాజీ చైర్మన్ కిషన్‌నాయక్, ఏఎంసీ వైస్ చైర్మన్ మల్లేశం తదితరులు పాల్గొన్నారు.


