బైక్‌ను ఢీకొట్టిన గుర్తు తెలియని వాహనం
యువకుడి పరిస్థితి విషమం
పూడూరు: బైక్‌ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన శుక్రవారం రాత్రి చన్గోముల్ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ భరత్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని అంగడిచిట్టంపల్లికి చెందిన ప్రశాంత్‌గౌడ్(26) మన్నెగూడ నుంచి స్వగ్రామానికి ప్రయాణిస్తున్నాడు. ఈ క్రమంలో కండ్లపల్లి రెవెన్యూ పరిధిలోని నీలగిరి కేఫ్ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో రోడ్డుపై పడిపోయాడు. ఈ క్రమంలో మరో వాహనం ఢీకొట్టడంతో తల, కాలికి బలమైన గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని పోలీసులు వికారాబాద్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉందన్నారు. బాధితుడి తండ్రి అంజయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఆలయ భూముల పరిరక్షణకు కృషి
దేవాదాయ శాఖ అధికారి ప్రణీత్‌కుమార్, ఈఓ బాలనర్సయ్య
దోమ: ఆలయ భూముల పరిరక్షణకు ప్రత్యేక కృషి చేస్తు న్నామని దేవాదాయ శాఖ అధికారి ప్రణీత్‌కుమార్, ఈఓ బాలనర్సయ్య అన్నారు. శనివారం మండల పరిధిలోని గంజిపల్లిలో సర్వే నంబర్ 2లో 3.18 ఎకరాల భూమి హనుమాన్ దేవాలయం పేరిట ఉంది. ఈ భూ మిలో టి.బాలసింగ్, సుందర్‌బాయి, నరేందర్‌సింగ్, చందర్‌సింగ్, అజయ్‌సింగ్, రత్నబాయి, మోహన్‌సింగ్ అనే వ్యక్తులు కబ్జాలో ఉండగా. గ్రామానికి చెందిన అలిగిరి వెంకటేశ్ సర్వేకు పెట్టారు. ఈ మేరకు దేవాదాయ శాఖ అధికారి ప్రణీత్‌కుమార్, ఈఓ బాలనర్స య్య, నవాబుపేట ఈఓ శాంతకుమార్, పోలేపల్లి ఈఓ రాజేందర్‌రెడ్డితో కలసి సర్వేయర్ కిరణ్‌కుమార్ సర్వే చేసి హద్దులను ఏర్పాటు చేశారు. ఆలయ భూముల ఆక్రమనకు యత్నిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. సర్పంచ్ మంజుల, ఉప సర్పంచ్ మల్లేశ్, మాజీ సర్పంచ్ కల్పన, గ్రామస్తులు వెంకటేశ్, లాలు, సత్తి పాల్గొన్నారు.
రెచ్చిపోయిన వీధి కుక్కలు
యాచారం: మండల పరిధిలోని గడ్డమల్లయ్యగూడలో శనివారం వీధి కుక్కల దాడిలో నలుగురు గాయపడ్డారు. వివరాలు.. గ్రామానికి చెందిన ఎ.మణికుమార్, మంగమ్మ, సునీల్, కృష్ణవేణి తమ వ్యక్తిగత పనుల నిమిత్తం బయట ఉండగా వీధి కుక్కలు వారిపై దాడి చేసి గాయపరిచాయి. మరో ఘటనలో యాచారం గ్రామానికి చెందిన మస్కు యాదయ్య, కొండాపురం యాదయ్యకు చెందిర రెండు మేకలపై దాడి చేసి చంపివేసాయి.


